ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ జాక్ పాట్ కొట్టేసింది. బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్ పోర్ట్ కార్పొరేషన్ (బీఎంటీసీ) టాటా మోటార్స్ నుండి 921 ఎలక్ట్రిక్ బస్సులను లీజుకు తీసుకుంటున్నట్లు ప్రకటించింది. ఒప్పందం ప్రకారం.. టాటా మోటార్స్ 12 ఏళ్ల పాటు ఎలక్ట్రిక్ కార్ల తయారీ,వాటి నిర్వహణ చూసుకోనుంది.
కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ పరిధిలో కార్యకలాపాలు నిర్వహించే కన్వర్జెన్స్ ఎనర్జీ సర్వీసెస్ లిమిటెడ్ (సీఈఎస్ఎల్)..బీఎంటీసీ కోసం ఎలక్ట్రిక్ బస్సుల తయారీ, వాటి నిర్వహణకోసం ఆటోమొబైల్ సంస్థల నుంచి బిడ్లను ఆహ్వానించగా..ఆ టెండర్‌ను టాటా దక్కించుకుంది. ఈ సందర్భంగా స్వచ్ఛమైన, సుస్థిరమైన పట్టణ ప్రజా చైతన్యానికి బెంగళూరు పెరుగుతున్న అవసరానికి ఈ ఆర్డర్ అత్యంత కీలకమైందని బీఎంటీసీ మేనేజింగ్ డైరెక్టర్ జి.సత్యవతి తెలిపారు. 'గ్రాండ్ ఛాలెంజ్ ఆఫ్ సీఈఎస్ఎల్' కింద ఎలక్ట్రిక్ బస్సుల కోసం బీఎంటీసీ ఆర్డర్ ఇచ్చిందని సీఈఎస్ఎల్ సీఈవో మహువా ఆచార్య పేర్కొన్నారు.
అదే సమయంలో, టాటా మోటార్స్ ఎలక్ట్రిక్ బస్సుల కోసం అనేక రాష్ట్ర రవాణా సంస్థ నుండి ఆర్డర్లను అందుకుంది. గత 30 రోజుల్లో ఢిల్లీ ట్రాన్స్ పోర్ట్ కార్పొరేషన్ నుంచి 1,500 ఎలక్ట్రిక్ బస్సులు, పశ్చిమ బెంగాల్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ నుంచి 1,180 ఎలక్ట్రిక్ బస్సులకు టాటా మోటార్స్ ఆర్డర్ దక్కించుకుంది.
Comments
Please login to add a commentAdd a comment