టాటా గ్రూప్ గౌరవ్ చైర్మన్ రతన్ టాటా అస్తమించారు. 86 ఏళ్ల వయసులో ఆయన లోకాన్ని వీడారు. జేఆర్‌డీ టాటా 1991 మార్చిలో టాటా గ్రూప్ పగ్గాలను రతన్ టాటాకు అప్పగించారు. ఆయన నాయకత్వంలో కంపెనీ మరింత పెద్దదైంది. అయితే టాటా గ్రూప్ బాధ్యతలను రతన్ టాటా తీసుకోవాలని జేఆర్‌డీ టాటా ఎలా కోరారో తెలుసా?
టాటా గ్రూప్‌నకు అధినేతగా వ్యవహరించిన ఆయన అసలు టాటా గ్రూప్ పగ్గాలను ఎప్పుడు, ఎలాంటి పరిస్థితిలో చేపట్టారో ఒకసారి ఓ షోలో రతన్ టాటా వివరించారు. గుండె సంబంధిత వ్యాధితో ఆసుపత్రిలో చేరిన తర్వాత జేఆర్‌డీ టాటా తనకు కంపెనీ బాధ్యతలను అప్పగించాలని నిర్ణయించుకున్నారని వెల్లడించారు.
“మేము ఒక ఫంక్షన్ కోసం జంషెడ్‌పూర్‌లో ఉన్నాం. నేను వేరే పని మీద స్టుట్‌గార్ట్‌కు వెళ్లవలసి వచ్చింది. నేను తిరిగి వచ్చినప్పుడు ఆయనకు(జేఆర్‌డీ టాటా) గుండె సమస్య వచ్చిందని, బ్రీచ్ కాండీ హాస్పిటల్‌లో ఉన్నారని విన్నాను. ఆయన ఒక వారంపాటు అక్కడే ఉన్నారు. నేను రోజూ వెళ్లి చూసొచ్చేవాడిని. ఆయన ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత రెండు రోజులకు ఆఫీస్‌కి వెళ్లి కలిశాను” అంటూ రతన్ టాటా చెప్పుకొచ్చారు.
ఇదీ చదవండి: టాటా ప్రతీకారం అలా తీరింది..!
"ఆయన్ను(జేఆర్‌డీ టాటా) ఎప్పుడు కలిసినా 'సరే, ఇంకేంటి?' అని అడిగేవారు. జే (జేఆర్‌డీ టాటా) నేను నిన్ను రోజూ చూస్తున్నాను. కొత్తగా ఏముంటుంది? అని నేను చెప్పావాడిని. 'సరే, నేను నీకు కొత్త విషయం చెప్పాలనుకుంటున్నాను. కూర్చో. జంషెడ్‌పూర్‌లో నాకు జరిగిన సంఘటన (అనారోగ్యం) తర్వాత నేను తప్పుకోవాలనుకుంటున్నాను. (టాటా గ్రూప్ చైర్మన్‌గా) నా స్థానం నువ్వే తీసుకోవాలి' అన్నారు. అదే ప్రతిపాదనను బోర్డుకి తీసుకెళ్లారు(కొన్ని రోజుల తర్వాత)” అని టాటా గుర్తుచేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment