JRD Tata
-
టేకోవర్ స్టోరీ: రతన్.. ఇక టాటా గ్రూప్ పగ్గాలు తీసుకుంటావా?
టాటా గ్రూప్ గౌరవ్ చైర్మన్ రతన్ టాటా అస్తమించారు. 86 ఏళ్ల వయసులో ఆయన లోకాన్ని వీడారు. జేఆర్డీ టాటా 1991 మార్చిలో టాటా గ్రూప్ పగ్గాలను రతన్ టాటాకు అప్పగించారు. ఆయన నాయకత్వంలో కంపెనీ మరింత పెద్దదైంది. అయితే టాటా గ్రూప్ బాధ్యతలను రతన్ టాటా తీసుకోవాలని జేఆర్డీ టాటా ఎలా కోరారో తెలుసా?టాటా గ్రూప్‌నకు అధినేతగా వ్యవహరించిన ఆయన అసలు టాటా గ్రూప్ పగ్గాలను ఎప్పుడు, ఎలాంటి పరిస్థితిలో చేపట్టారో ఒకసారి ఓ షోలో రతన్ టాటా వివరించారు. గుండె సంబంధిత వ్యాధితో ఆసుపత్రిలో చేరిన తర్వాత జేఆర్డీ టాటా తనకు కంపెనీ బాధ్యతలను అప్పగించాలని నిర్ణయించుకున్నారని వెల్లడించారు.“మేము ఒక ఫంక్షన్ కోసం జంషెడ్‌పూర్‌లో ఉన్నాం. నేను వేరే పని మీద స్టుట్‌గార్ట్‌కు వెళ్లవలసి వచ్చింది. నేను తిరిగి వచ్చినప్పుడు ఆయనకు(జేఆర్డీ టాటా) గుండె సమస్య వచ్చిందని, బ్రీచ్ కాండీ హాస్పిటల్లో ఉన్నారని విన్నాను. ఆయన ఒక వారంపాటు అక్కడే ఉన్నారు. నేను రోజూ వెళ్లి చూసొచ్చేవాడిని. ఆయన ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత రెండు రోజులకు ఆఫీస్‌కి వెళ్లి కలిశాను” అంటూ రతన్ టాటా చెప్పుకొచ్చారు.ఇదీ చదవండి: టాటా ప్రతీకారం అలా తీరింది..!"ఆయన్ను(జేఆర్డీ టాటా) ఎప్పుడు కలిసినా 'సరే, ఇంకేంటి?' అని అడిగేవారు. జే (జేఆర్డీ టాటా) నేను నిన్ను రోజూ చూస్తున్నాను. కొత్తగా ఏముంటుంది? అని నేను చెప్పావాడిని. 'సరే, నేను నీకు కొత్త విషయం చెప్పాలనుకుంటున్నాను. కూర్చో. జంషెడ్‌పూర్‌లో నాకు జరిగిన సంఘటన (అనారోగ్యం) తర్వాత నేను తప్పుకోవాలనుకుంటున్నాను. (టాటా గ్రూప్ చైర్మన్‌గా) నా స్థానం నువ్వే తీసుకోవాలి' అన్నారు. అదే ప్రతిపాదనను బోర్డుకి తీసుకెళ్లారు(కొన్ని రోజుల తర్వాత)” అని టాటా గుర్తుచేసుకున్నారు. -
పారిశ్రామిక దిగ్గజం.. ఉద్యోగుల జీవితాల్లో వెలుగు నింపిన వ్యక్తి
భారతీయ దిగ్గజ సంస్థ 'టాటా గ్రూప్' నేడు ఈ స్థాయిలో ఉందంటే దాని వెనుక ఎంతోమంది కృషి ఉంది. ఇందులో ప్రధానంగా చెప్పుకోదగ్గ వ్యక్తి 'జేఆర్డీ టాటా' (జహంగీర్ రతన్జీ దాదాభోయ్ టాటా). 1904 జులై 29న జన్మించిన ఈయన సుమారు 53 సంవత్సరాలు టాటా గ్రూప్ సంస్థకు ఛైర్మన్‌గా ఉన్నారు. కేవలం 34 ఏళ్ల వయసులోనే కంపెనీ చైర్మన్ బాధ్యతలు స్వీకరించారు.జేఆర్డీ టాటా ఛైర్మన్‌గా ఉన్న కాలంలోనే టీసీఎస్, టాటా మోటార్స్, టాటా సాల్ట్, టాటా గ్లోబల్ బెవరేజెస్, టైటాన్ వంటి విజయవంతమైన వెంచర్లతో సహా 14 కొత్త కంపెనీలను ప్రారంభించారు. అంతే కాకుండా 1956లో ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (IAS) తరహాలో టాటా అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (TAS)ని స్థాపించారు.జేఆర్డీ టాటా సంస్థలో పనిచేసే ఉద్యోగులు, వారి కుటుంబాల సంక్షేమం కోసం విరివిగా విరాళాలు అందించారు. రోజుకు ఎనిమిది గంటలు మాత్రమే పని అనే భావన ప్రవేశపెట్టిన ఘనత జేఆర్డీ టాటా సొంతం. అంతే కాకుండా ఉద్యోగుల కోసం ఉచిత వైద్య సేవలు, ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్ కూడా ప్రారంభించారు. ప్రమాదాల సమయంలో కార్మికులకు నష్టపరిహారం అందించే విధానం కూడా ఈయనే మొదలుపెట్టారు.1936లో టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ (TISS) స్థాపించారు. ఆ తరువాత 1945లో టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ (TIFR), నేషనల్ సెంటర్ ఫర్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ కూడా స్థాపించారు. 1968లో టాటా కంప్యూటర్ సెంటర్‌గా టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) స్థాపించారు. నేడు ఈ కంపెనీ భారతదేశంలో అతిపెద్ద ఐటీ కంపెనీగా అవతరించింది. ఆ తరువాత 1987లో టైటాన్‌ను స్థాపించారు.15 సంవత్సరాల వయసులోనే ఫైలట్ కావాలని, విమానయాన రంగంలో వృత్తిని కొనసాగించాలని నిశ్చయించుకున్న జేఆర్డీ టాటా 24 ఏళ్ల వయసులో ఫ్లయింగ్ లైసెన్స్ పొందారు. దీంతో ఈయన భారతదేశంలో మొట్టమొదటి ఫ్లయింగ్ లైసెన్స్ పొందిన వ్యక్తిగా నిలిచారు. ఆ తరువాత టాటా ఎయిర్ సర్వీస్ ప్రారంభించారు. దీన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. అయితే చివరికి ఈ సంస్థ మళ్ళీ ఎయిర్ ఇండియాగా టాటా గ్రూపులోకే వచ్చింది.టాటా గ్రూప్ అభివృద్ధికి మాత్రమే కాకుండా.. ఉద్యోగుల జీవితాల్లో కూడా మార్పులు తీసుకువచ్చిన జేఆర్డీ టాటా 1993 నవంబర్ 29న జెనీవాలోని ఒక ఆసుపత్రిలో మరణించారు. పారిశ్రామిక రంగంలో ఈయన చేసిన కృషికి భారత ప్రభుత్వం భారతరత్న ప్రధానం చేసింది. దీంతో భారతదేశ అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్నను పొందిన ఏకైక పారిశ్రామికవేత్తగా జేఆర్డీ టాటా చరిత్ర సృష్టించారు. -
రతన్ టాటా తొలి రెజ్యూమ్, ఎలా సిద్ధం చేశారంటే..
155 ఏళ్ల టాటా గ్రూప్ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లిన రతన్ టాటా ప్రపంచంలోనే విజయవంతమైన వ్యాపారవేత్తగా గుర్తింపు పొందారు. చాలామంది మాదిరిగానే రతన్ టాటా కూడా ఉద్యోగిగా తన కెరీర్‌ను ప్రారంభించారని చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. ఆయన సారధ్యంలో టాటా గ్రూప్ ట్రిలియన్ డాలర్ల వ్యాపార సంస్థగా ఎదిగింది. రతన్ టాటా తొలినాళ్లలో ఉద్యోగం కోసం రెజ్యూమ్‌ను ఎలా సిద్ధం చేశారు? ఉద్యోగం ఎలా దక్కించుకున్నారు? ఈ ఆసక్తికర విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. రతన్ టాటా మొదటి రెజ్యూమ్ అమెరికా నుంచి భారతదేశానికి తిరిగి వచ్చిన రతన్ టాటాకు ఐబీఎంలో ఉద్యోగం వచ్చింది. అయితే అతని గురువు, బంధువు అయిన జేఆర్డీ టాటాకు ఇది సంతృప్తి కలిగించలేదు. నాటి రోజులను రతన్ టాటా ఒక ఇంటర్వ్యూలో గుర్తుచేసుకున్నారు, ‘అతను(జేఆర్డీ టాటా) ఒక రోజు నాకు ఫోన్ చేశారు. మీరు భారతదేశంలో ఉంటూ, ఐబీఎంలోనే ఎందుకు ఉద్యోగం చేయడం?’ అని అడిగారు. దీంతో టాటా గ్రూప్‌లో ఉద్యోగం చేసేందుకు రతన్ టాటా తన రెజ్యూమ్‌ను జేఆర్డీ టాటాకు అందజేయాల్సి వచ్చింది. అయితే ఆ సమయంలో అతని వద్ద రెజ్యూమ్ లేదు. వెంటనే రతన్ టాటా తాను పనిచేస్తున్న ఐబీఎం కార్యాలయంలోని ఎలక్ట్రిక్ టైప్‌రైటర్ సాయంతో తన రెజ్యూమ్‌ను రూపొందించారు. తాను ఐబీఎం ఆఫీస్‌లో ఉన్నానని, తనను జేఆర్డీ టాటా రెజ్యూమ్ అడిగారనే విషయం తనకు గుర్తుందని ఆయన మీడియాకు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. తాను పనిచేస్తున్న ఆఫీసులో ఎలక్ట్రిక్ టైప్ రైటర్లు ఉండటంతో ఒక రోజు సాయంత్రం ఆ టైప్ రైటర్ సాయంతో రెజ్యూమ్ టైప్ చేసి అతనికి ఇచ్చానని తెలిపారు. 1962లో మొదటి ఉద్యోగం రెజ్యూమెను అందించిన తర్వాత రతన్ టాటాకు 1962లో టాటా ఇండస్ట్రీస్‌లో ఉద్యోగం వచ్చింది. దాదాపు మూడు దశాబ్దాల ఉద్యోగ జీవితం తర్వాత, 1991లో జేఆర్డీ టాటా మరణానంతరం రతన్ టాటా టాటా గ్రూప్ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. భారతదేశంలోని ప్రముఖ బిలియనీర్లలో రతన్ టాటా ఒకరు. రతన్ టాటా కార్నెల్ విశ్వవిద్యాలయం నుండి ఆర్కిటెక్చర్, స్ట్రక్చరల్ ఇంజినీరింగ్‌లో పట్టభద్రుడయ్యారు. నాటిరోజుల్లో అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లో స్థిరపడాలని రతన్‌టాటా భావించారు. అయితే తమ అమ్మమ్మ ఆరోగ్యం క్షీణించడంతో రతన్ టాటా భారతదేశానికి తిరిగి రావాల్సి వచ్చింది. ఇది కూడా చదవండి: తేలు విషం ఖరీదు ఎంతో తెలుసా? -
నెహ్రూ ఐడియా & జెఆర్‌డీ టాటా విజన్‌తో పుట్టిన కంపెనీ ఇదే!
బ్యూటీమీద ఎక్కువ దృష్టిపెట్టేవారికి 'లాక్మే' (Lakme) బ్రాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అన్ని రకాల సౌందర్య సాధనాలు, అలంకరణలను సంబంధించిన వస్తువులు ఇక్కడ లభిస్తాయి. నేడు కాస్మొటిక్ రంగంలో దూసుకెళ్తున్న ఈ కంపెనీ నిర్మించడం వెనుక భారతదేశ మొదటి ప్రధాని 'జవహర్ లాల్ నెహ్రూ' ఉన్నట్లు చాలామందికి తెలియకపోవచ్చు. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. జెఆర్‌డీ టాటాతో చర్చ.. భారతదేశానికి స్వాతంత్య్రం రాక ముందు నుంచే మహిళలు సౌందర్య సాధనాలు ఉపయోగించేవారు. దీనిని దృష్టిలో ఉంచుకుని మేడ్ ఇన్ ఇండియా కంపెనీ అవసరమని భావించిన నెహ్రూ ప్రముఖ పారిశ్రామిక వేత్త జెఆర్‌డీ టాటాతో చర్చించారు. దీనికి ఏకీభవించిన టాటా 1952లో లాక్మేను టాటా ఆయిల్ మిల్స్ అనుబంధ సంస్థగా స్థాపించారు. లాక్మే అనేది భారతదేశంలో మొట్టమొదటి స్వదేశీ కాస్మొటిక్ కంపెనీ. మహిళలు విదేశీ వస్తువులను అధికంగా వినియోగిస్తున్న కారణంగా జవహర్ లాల్ నెహ్రూ దీని ఏర్పాటుకి కారకుడయ్యాడు. దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతీయకుండా ఉండాలంటే స్వదేశీ కంపెనీ అవసరమని భావించి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇదీ చదవండి: ఇక ఆ జియో రీఛార్జ్ ప్లాన్ లేదు.. కొత్త ప్లాన్ ఏంటంటే? లాక్మే అంటే ఫ్రెంచ్ భాషలో.. నిజానికి జెఆర్‌డీ టాటా ఈ కంపెనీ ప్రారంభించిన సమయంలో సంస్థకు ఏ పేరు పెట్టాలని తీవ్రంగా ఆలోచించాడు. అప్పట్లో సామాన్యులకు కూడా నచ్చే విధంగా ఉండాలని కొంతమంది ప్రతినిధులతో చర్చించి 'లాక్మే' అని నామకరణం చేశారు. లాక్మే అంటే ఫ్రెంచ్ భాషలో 'లక్ష్మీదేవి' అని అర్థం. పురాణాల్లో లక్ష్మీదేవి అందానికి ప్రతిరూపంగా భావించేవారు కావున ఈ పేరునే స్థిరంగా ఉంచేశారు. ఇదీ చదవండి: చంద్రయాన్-3 బడ్జెట్ కంటే ఖరీదైన కారు.. ఇలాంటి మోడల్ ఇప్పటి వరకు చూసుండరు..! ప్రారంభంలో లాక్మే ముంబైలోని ఒక చిన్న అద్దె ఇంట్లో ప్రారంభమైంది. ఇది ప్రారంభమైన అతి తక్కువ సమయంలో మంచి ప్రజాదరణ పొందింది. ఈ కంపెనీ ప్రారంభించిన తరువాత దాదాపు విదేశీ వస్తువుల దిగుమతి భారతదేశంలో ఆగిపోయింది. 1961లో నావల్ టాటా భార్య సిమోన్ టాటా ఈ కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు. సంస్థ అభివృద్ధికి ఈమె ఎంతగానో కృషి చేసింది. -
సుధా మూర్తి కోపంతో జేఆర్డీ టాటాకు రాసిన లేఖలో అంత వుందా.. అదే మహిళలకు వరమైంది!
Sudha Murthy: ప్రముఖ రచయిత్రి, ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి భార్య 'సుధామూర్తి' గురించి ప్రత్యేకంగా పరిచయం అవసమే లేదు. అయితే ఇటీవల ఈమె కపిల్ శర్మ షోలో పాల్గొని తన జీవితంలో జరిగిన ఎన్నో ఆసక్తికరమైన విషయాలను అందరితో షేర్ చేసుకుంటోంది. ఇప్పటికే ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి గురించి వెల్లడించిన సుధా మూర్తి, తాజాగా జేఆర్డీ టాటాకు కోపంతో లేఖ రాసిన విషయాన్ని బయటపెట్టింది. దీని గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం. సుధా మూర్తి 1974లో బెంగళూరులో చదువుకునే టాటా ఇన్స్టిట్యూట్లో ఎమ్.టెక్ చేస్తున్న సమయంలో తమ క్లాసులో అందరూ అబ్బాయిలే ఉండేవారని, అంతకు ముందు బీఈ చేసినప్పుడు కూడా క్లాసులో తానొక్కటే అమ్మాయని చెప్పుకొచ్చింది. అయితే ఒకరోజు కాలేజీ నోటీస్ బోర్డులో ఉన్న ప్రకటనలో పుణెలోని టెల్కో కంపెనీలో పనిచేసేందుకు ఉత్సాహవంతులైన యువకులు కావాలని ఉండటం చూసింది. అయితే అందులోనే యువతులు అప్ప్లై చేసుకోకూడదని వెల్లడించింది. ఇది చూడగానే ఆమెకు పట్టరాని కోపం వచ్చిందని వెల్లడించింది. (ఇదీ చదవండి: సినిమా హీరోలా ఉంటాడనుకున్నా, తీరా చూస్తే.. భర్తపై సుధా మూర్తి ఆసక్తికర వ్యాఖ్యలు) నోటీసులొని ప్రకటన చూసిన తరువాత జేఆర్డీ టాటాకు లేఖ రాసినట్లు తెలిపింది. అందులో మహిళలు అవకాశం ఇవ్వకపోతే భారతదేశం ఎప్పటికీ అభివృద్ధి చెందదని.. సమాజంలో 50 శాతం పురుషులు, 50 శాతం మంది స్త్రీలు ఉన్నారు. అయితే ఉద్యోగావకాశాలను కేవలం పురుషులను మాత్రమే ఎంపిక చేస్తే సమాజం ఎలా ముందుకు పోతుందని ప్రశ్నించినట్లు చెప్పింది. ప్రతి సంవత్సరం టాటా పుట్టిన రోజు సందర్భంగా మార్చి 15న తమ ఇన్స్టిట్యూట్కు వచ్చారని, అప్పుడు ఆయనను భయంతోనే దూరం నుంచి చూశానని తెలిపింది. సుధా మూర్తి రాసిన లేఖ పనిచేసినట్లే ఉంది. అందువల్లనే టాటా సంస్థల్లో మహిళలు కూడా ముందుకు వెళుతున్నారు. దీనికి ప్రధాన పాత్ర 'సుధా మార్తి'దే అని చెప్పాలి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. -
ఆ ప్రేమను, వాత్సల్యాన్ని మిస్ అవుతున్నా: రతన్ టాటా భావోద్వేగం
సాక్షి, ముంబై: ప్రముఖ వ్యాపార వేత్త, టాటా ట్రస్ట్స్ ఛైర్మన్ రతన్ టాటా తన గురువు జేఆర్డీ టాటా (జహంగీర్ రతన్జీ దాదాభాయ్ టాటా)ను తలచుకుని భావోద్వేగానికి లోనయ్యారు. జేఆర్డీ టాటా 118వ జయంతి సందర్భంగా టాటాసన్స్ గౌరవ చైర్మన్ రతన్ టాటా ఇన్‌స్టాలో ఒక పోస్ట్‌ను షేర్ చేశారు. తాను ‘జే’ అని పిలుచుకునే జేఆర్డీ టాటా జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. తామిద్దరూ కలిసి జీవించిన కాలంలో ఆయన తన మీద అపారమైన ప్రభావాన్ని మిగిల్చి వెళ్లారని, ఇద్దరి మధ్య చాలా సారూప్యతలుండేవని పేర్కొన్నారు. ఆయన ప్రేమను, అభిమానాన్ని మిస్ అవుతున్నానంటూ రాశారు. ఈ రోజు జే మన మధ్య లేకపోయినా ఆయన గొప్పతనం, వారసత్వం కొనసాగుతుందని పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా జేఆర్డీ టాటా ఫోటోను షేర్ చేశారు. దీంతో కొన్న గంటల వ్యవధిలోనే లక్షల లైక్‌లతో వైరల్‌గా మారింది. గత ఏడాది కూడా పూణే ప్లాంట్‌లో టాటా ఎస్టేట్ లాంచ్ వేడుకలో తీసుకున్న ఫోటోనొకదాన్ని షేర్ చేసిన సంగతి తెలిసిందే. (చదవండి: Gold Demand Up: ఆభరణాలు తెగ కొనేశారుగా..!) View this post on Instagram A post shared by Ratan Tata (@ratantata) దేశంలోని ఉత్తమ పారిశ్రామికవేత్తల్లో ఒకరైన రతన్‌టాటా గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఆయన ప్రస్తానం ఎందరో యువ పారిశ్రామిక వేత్తలకు, వ్యాపార వేత్తలకు పుస్తకం లాంటిది. భారత్‌లో పురాతన కాలం నాటి అతిపెద్ద వ్యాపార, పారిశ్రామిక సంస్థ టాటా సన్స్ సారధిగా సంస్థను ఎన్నో విజయ తీరాలకు చేర్చారు. అంతేకాదు వ్యాపారవేత్తగా మాత్రమే కాకుండా, సామాజిక సేవలు, దాతృత్వంలోనూ తన ప్రత్యేకతను చాటు కున్నారు. కాగా రతన్ టాటా జీవిత చరిత్ర ‘ది ఆథరైజ్డ్ బయోగ్రఫీ’ పేరుతో ఈ ఏడాది నవంబరులో రానుంది. ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషల్లోనూ టాటా జీవిత చరిత్ర పుస్తక ప్రచురణ హక్కులను భారత్‌కు చెందిన హార్పర్ కాలిన్స్ సొంతం చేసుకుంది. -
చైతన్య భారతి: జె.ఆర్.డి.టాటా / 1904–1993
1992 మార్చిలో జరిగిన ఓ సన్మాన సభలో జె.ఆర్.డి టాటా మాట్లాడుతూ.. ‘‘వచ్చే శతాబ్దంలో భారతదేశం ఆర్థిక అగ్రరాజ్యం అవుతుందని ఓ అమెరికన్ ఆర్థిక శాస్త్రవేత్త అన్నారు. దేశం ఆర్థికంగా అగ్రరాజ్యం అవాలని నేను కోరుకోవడం లేదు. ఇది ఆనందమయ దేశం కావాలని కోరుకుంటున్నా..’’ అని అన్నారు. ఆయన జీవితం దాదాపు 20వ శతాబ్దం మొత్తానికీ విస్తరించింది. రైట్ సోదరులు తొలిసారిగా విమానం కనిపెట్టిన తర్వాత కొద్ది రోజులకే ఆయన జన్మించారు. 1991లో మన్మోహన్ సింగ్ సరళీకరణను ప్రవేశపెట్టడాన్ని కూడా టాటా వీక్షించారు. గగన విహారమనేది ధనికులకే పరిమితమైన రోజుల్లో 1932లో ఆయన టాటా ఎయిర్‌లైన్స్‌ను ప్రారంభించారు. ప్రపంచంపై నాజీలు దౌర్జన్యాలు సాగిస్తున్న రోజుల్లో యుద్ధం తర్వాత దేశాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలని ఆయన ఆలోచించారు. జె.డి . బిర్లా, కస్తూర్భాయ్ లాల్‌భాయ్ లాంటి అగ్రశ్రేణి పారిశ్రామికవేత్తలను సమావేశపరిచి మాట్లాడారు. ఫలితంగా ‘బాంబే ప్లాన్’ సిద్ధమైంది. 1945లో ఆయన ‘టెల్కో’ను ప్రారంభించారు. దేశం కోసం ఓ ప్రతిష్ఠాత్మకమైన ఇంజనీరింగ్ సంస్థను ప్రారంభించాలని ఆయన ఆలోచన. జె.ఆర్.డి. 1948లో ఎయిర్ ఇండియా ఇంటర్నేషనల్‌ను ప్రారంభించారు. పాశ్చాత్య దేశాలకు వెళ్లిన తొలి ఏషియన్ ఎయిర్ లైన్ అదే! టాటా సంస్థతో భాగస్వామ్యం వహించాల్సిందిగా ఆయన కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదన చేశారు. ప్రభుత్వం అందుకు సమ్మతించింది. భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ప్రభుత్వ సంస్థలు, ప్రైవేట్ సంస్థలు బండికి రెండు చక్రాల లాగా వ్యవహరించాలని ఆయన భావన. ‘‘మీరు ఎవరికైనా నాయకత్వం వహించాలీ అంటే వారి పట్ల ప్రేమతో ఆ పని చేయాలి’’ అని ఆయన అన్నారు. రెండో ప్రపంచ యుద్ధం ప్రారంభం కావడంతో, హోమీ భాభా భారతదేశంలో చిక్కుబడిపోయారు. దాంతో కేంబ్రిడ్జిలో చేస్తున్న పనిని భారత్‌లోనే భాభా కొనసాగించుకునేందుకు వీలుగా బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌లో ‘కాస్మిక్ ఎనర్జీ’ పేరిట ఒక ప్రత్యేక విభాగాన్ని టాటా ప్రారంభించిన సంగతి చాలామందికి తెలియదు. నాలుగేళ్ల తరువాత ‘టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రిసెర్చ్’ అనే భాభా ప్రణాళికకు ఆయన ఊతమిచ్చారు. చనిపోడానికి 20 నెలల ముందు టాటాకు భారత రత్న పురస్కారం లభించింది. – స్వర్గీయ ఆర్.ఎం.లాలా, టాటా వారసత్వ చరిత్రకారుడైన జర్నలిస్టు -
ఎయిరిండియా జాతీయీకరణ ఒక భారీ కుట్ర!
మన దేశంలో టాటా గ్రూప్ అంటే తెలియని వారు చాలా తక్కువ మంది ఉంటారని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. దేశంలో ఏ ప్రైవేట్ సంస్థకు లేని ఆదరణ టాటా గ్రూప్ సొంతం. ఇంత పెద్ద టాటా గ్రూప్, ఎయిరిండియాను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. అయితే, టాటా సన్స్ ఎయిరిండియాను రూ.18,000 కోట్లకు దక్కించుకున్నప్పుడు రతన్ టాటా ఒక బావోద్వేగా ట్వీట్ చేశారు. జెఆర్‌డీ టాటా ప్రస్తుతం జీవించి ఉంటే చాలా సంతోషించి ఉండేవారిని ఆ ట్విటర్ వేదికగా పేర్కొన్నారు. చాలా వరకు మన దేశంలోని ప్రజలు, మేధావి వర్గాలు ప్రైవేట్ కరణను వ్యతిరేకిస్తారు. కానీ, టాటా సన్స్ ఎయిరిండియాను కొనుగోలు చేసినప్పుడు మాత్రం ప్రతి ఒక్కరూ ఆహ్వానించారు. అయితే, ఈ ఎయిరిండియా కొనుగోలు వెనుక ఒక పెద్ద చరిత్ర ఉంది. రతన్ టాటా అలా ట్వీట్ చేయడం వెనుక చాలా పెద్ద స్టోరీ ఉంది. ఇప్పుడు మనం ఆ స్టోరీ గురుంచి తెలుసుకుందాం.. ఎయిరిండియాను వ్యాపారం కోసం రతన్ టాటా దక్కించు కోలేదు. ఎయిర్ ఇండియా అనేది జెఆర్‌డీ టాటా కలల ప్రాజెక్టు. టాటా ఎయిర్ లైన్స్ ఏప్రిల్ 1932లో జెహంగీర్ రతన్ జీ దాదాభోయ్(ప్రేమగా జెఆర్‌డి అని పిలుస్తారు) టాటా నాయకత్వంలో ప్రారంభించారు. ఈ ఎయిర్ లైన్స్ ముఖ్య ఉద్దేశ్యం సామాన్య ప్రజానీకానికి సాధ్యమైనంత తక్కువ ధరలో వరల్డ్ క్లాస్ సదుపాయాలతో విమానయాన సౌకర్యాన్ని కల్పించడం. భారతరత్న అందుకున్న భారతదేశపు మొదటి పౌర విమానయాన పైలట్ టాటా గ్రూప్ ఛైర్మన్, ఏకైక పారిశ్రామికవేత్త జెఆర్‌డి. భారతీయ వాణిజ్య పౌర విమానయానం కథ అక్టోబర్ 15, 1932న ప్రారంభమైంది. Welcome back, Air India 🛬🏠 pic.twitter.com/euIREDIzkV — Ratan N. Tata (@RNTata2000) October 8, 2021 ఎయిరిండియా ఇంటర్నేషనల్ జెఆర్‌డి కరాచీ డ్రిగ్ రోడ్ ఏరోడ్రోమ్ నుంచి తన మొదటి అధికారిక టాటా ఎయిర్ లైన్స్ విమానంలో బయలుదేరి అప్పటి బొంబాయి జుహు ఎయిర్ స్ట్రిప్ వద్ద ల్యాండ్ అయ్యారు. తర్వాత 5 సంవత్సరాలలో టాటా ఎయిర్‌లైన్స్ లాభాలు గణనీయంగా పెరిగాయి. బాహ్య ప్రపంచంతో, 99.4% సమయపాలనతో సేవలు అందించే ఈ విమానయాన సేవలను భారత రాకుమారులు చాలా ఇష్టపడ్డారు. ఇక స్వాతంత్ర్య అనంతరం టాటా ఎయిర్ లైన్స్ పాకిస్తాన్ నుంచి భారతదేశానికి శరణార్థులను తరలించింది. 1947 అక్టోబరులో టాటా సన్స్ అంతర్జాతీయ వైమానిక సేవను ఎయిరిండియా ఇంటర్నేషనల్ పేరుతో స్థాపించాలని అప్పటి ప్రధాన మంత్రి జవహర్ లాల్ నెహ్రూను కోరితే వారు కూడా మూడు వారాల్లో ఆమోదించారు. బాంబే నుంచి లండన్ కు మొదటి ఎయిరిండియా ఇంటర్నేషనల్ విమానం జూన్ 1948లో సకాలంలో(కైరో, జెనీవా వద్ద ఆగిపోయిన కూడా) దిగింది. స్వాతంత్ర్యం తర్వాత పాన్ అమెరికన్, ట్రాన్స్ వరల్డ్ ఎయిర్ లైన్స్, కెఎల్ఎమ్, ఎయిర్ ఫ్రాన్స్ వంటి ఎయిర్ లైన్స్ దేశంలో విమానయాన సేవలు అందిస్తున్నాయి. జవహర్ లాల్ నెహ్రూ సోదరి దౌత్యవేత్త విజయలక్ష్మీ పండిట్ స్వతంత్ర భారత తొలి రాయబారిగా మాస్కోకు ఎయిరిండియా విమానంలో వెళ్ళింది. ఆమె విమానయాన సంస్థ సేవలు, ప్రమాణాల గురించి పొగుడుతూ జెఆర్‌డీ టాటాకు లేఖ రాసింది. ఇక క్రమ క్రమంగా ఎయిరిండియాకు ప్రజాదరణ వస్తుంది. ఈ సమయంలోనే అసలు సమస్య ఉత్పన్నం అయ్యింది. ఒడిదుడుకులు ప్రారంభం అప్పటి దేశ కమ్యూనికేషన్ మంత్రి భారతదేశం నాలుగు మూలలను కలిపే తపాలా సేవలను ప్రారంభించడానికి ఎయిరిండియా సేవలను కోరారు. ఆ ఆలోచన చాలా మంచిదే కానీ, ఎయిర్ ఇండియా ఈ ప్రతిపాదనను పరిశీలించడానికి ముందు రాత్రి ల్యాండింగ్ సౌకర్యాలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని జెఆర్‌డి టాటా అప్పటి కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. దీనివల్ల రాత్రి వేల తపాలా సేవలను అందించాలని భావించారు. కానీ, ప్రభుత్వం అంగీకరించలేదు. రాను రాను ప్రభుత్వానికి, జెఆర్‌డీ టాటాకు మధ్య దూరం పెరిగింది. దీంతో అప్పటి కమ్యూనికేషన్ మంత్రి మరిన్ని ప్రైవేట్ సంస్థలకు లైసెన్స్ ఇవ్వడం ప్రారంభించారు. దీంతో అనేక దేశాల కంపెనీలు మన దేశంలో అడుగ పెట్టాయి. అయితే, రెండవ ప్రపంచ యుద్దం ముగిసిన తర్వాత యునైటెడ్ స్టేట్స్ అనేక డకోటా విమానాలను మన దేశంలో విమానయాన సేవల కోసం మార్కెట్లోకి పంపింది. ఏటువంటి వ్యాపార అనుభవం లేకుండా మార్కెట్లోకి అడుగు పెట్టడంతో కొన్ని సంస్థలు నష్ట పోయాయి. పోస్టల్ సర్వీస్ ఆలోచనను ఉమ్మడిగా వ్యతిరేకించడానికి ఎయిరిండియా, ఎయిర్ సర్వీసెస్ ఆఫ్ ఇండియా, ఎయిర్ వేస్(ఇండియా), ఇండియన్ నేషనల్ ఎయిర్ వేస్లతో ఒక సమావేశాన్ని జెఆర్‌డి టాటా ఏర్పాటు చేశారు. ఈ సమావేశ విషయం దేశ కమ్యూనికేషన్ మంత్రి రఫీ అహ్మద్ కిద్వాయ్ కి తెలవడంతో చాలా కలత చెందాడు. హిమాలయన్ ఏవియేషన్ అతను 1948లో హిమాలయన్ ఏవియేషన్ అనే కొత్త విమానయాన సేవలను ప్రారంభించాడు. జెఆర్‌డి టాటా, కమ్యూనికేషన్ మంత్రికి బహిరంగ లేఖ రాశారు. లాభాల గురించి మేము విమానయాన సేవలను నడిపించడం లేదు అని అతనికి రాశాడు. ఈ బహిరంగ లేఖతో కోపంతో ఉన్న కిద్వాయ్ జెఆర్‌డి టాటాకు ఒక గుణపాఠం నేర్పాలని నిశ్చయించుకున్నాడు. ఈ విషయం కాస్త అప్పటి ప్రధాన మంత్రి నెహ్రూకు తెలిసింది. టాటాలు మంచి పని చేస్తున్నారని, ఎయిరిండియా సమర్థవంతమైన, స్నేహపూర్వక సేవలను అందిస్తుందని బహిరంగంగా ప్రకటించారు. మంత్రికి, జెఆర్‌డి టాటాకు మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించడానికి జెఆర్‌డి టాటా ప్రతిపాదనను పరిశీలించడానికి ఒక కమిటీని ఏర్పాటు చేయాలని ప్రధాన మంత్రి సూచించారు. అప్పటి బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జి.ఎస్.రాజధ్యక్ష ఆధ్వర్యంలో నిర్ఘాంతకమిటీ ఆర్థిక సాధ్యాసాధ్యాల గురించి ఆలోచించకుండా లైసెన్స్ లు జారీ చేసినందుకు ప్రభుత్వాన్ని మందలించింది. “నాలుగు కంపెనీలు మనుగడ సాగించలేని చోట విచక్షణారహితంగా డజనుకు పైగా లైసెన్స్ లను జారీ చేయడం ఏకపక్షంగా ఉంది” అని కమిటీ తెలిపింది. దీంతో కమ్యూనికేషన్ మంత్రి కుట్ర వైఖరి నిరూపితమైంది. అయితే, కేంద్ర ప్రభుత్వం ఎయిరిండియా విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఎయిరిండియా జాతీయీకరణ త్వరలోనే ఎయిరిండియా జాతీయీకరణ చేయనున్నట్లు ప్రకటించింది. ఒక మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జెఆర్‌డి టాటా ఈ రంగాన్ని జాతీయం చేయడం దేశానికి మంచిది కాదని, ఇది రాజకీయం చేయడానికి దారితీస్తుందని, ఇది వినాశకరమైనదని అన్నారు. జాతీయసంస్థల కోసం పనిచేసే బ్యూరోక్రాట్లు సంబంధిత మంత్రిత్వ శాఖకు నివేదించారు. ఈ రంగంలో పోటీ తట్టుకోవాలంటే స్వతంత్ర నిర్ణయాలు వెంట వెంటనే తీసుకోలేరు అని అన్నారు. ప్రధానమంత్రికి ఆయన ఇంటర్వ్యూ కాపీని నెహ్రూకు పంపారు. నెహ్రూ మాత్రం ఈ విషయంపై స్పందించలేదు. త్వరలోనే జెఆర్‌డి టాటా భయపడినట్లుగా అంబికా ఎయిర్ లైన్స్, జూపిటర్ ఎయిర్ వేస్ అనే రెండు కంపెనీలు దివాలా ప్రకటించాయి. చివరగా 1953లో అన్ని విమానయాన సంస్థలను ఒకటిగా విలీనం చేసి ప్రభుత్వం కిందకు తీసుకొని వచ్చింది. చివరి ప్రయత్నంగా, జెఆర్‌డి టాటా రెండు కంపెనీలగా ఏర్పాటు చేయాలని సూచించారు. ఒకటి దేశీయ రంగానికి, మరొకటి అంతర్జాతీయ కార్యకలాపాల కోసం తెలిపారు. కాని నెహ్రూ ప్రభుత్వం వీటిని పట్టించుకోలేదు. విలీనం అవుతున్న కంపెనీలకు పరిహారం చెల్లించడానికి స్వతంత్ర కమిటీని నియమించాలని జెఆర్‌డి టాటా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. దానిని కూడా తిరస్కరించారు. దీంతో జెఆర్‌డి టాటా తీవ్రంగా కలత చెందారు. ఆయన ఇంకా పట్టు విడవలేదు. ఆ తర్వాత వచ్చిన అప్పటి కమ్యూనికేషన్స్ మంత్రి జగ్జీవన్ రామ్ తో జరిగిన సమావేశంలో జెఆర్‌డి టాటా ఇలా అడిగారు.. “మీరు ఇతర విభాగాలను నడుపుతున్న విధంగా విమానయాన సంస్థను నడపడం సులభమని మీరు భావిస్తున్నారా? మీరే చూస్తారు” అని అన్నారు. దానికి జగ్జీవమ్ రామ్ ఇలా జవాబిచ్చాడు” ఇది ప్రభుత్వ శాఖ కావచ్చు, కానీ మీ సహాయంతో దానిని నడపాలని మేము కోరుకుంటున్నాము” అని అన్నారు. ఆ సమావేశం అసంపూర్తిగా ముగిసింది. టాటాలకు కేంద్ర ప్రభుత్వం సరైన పరిహారం చెల్లించలేదు. ఆ తర్వాత జెఆర్‌డి టాటా ఆ విమానయాన బోర్డులో ఒక సభ్యుడిగా కొనసాగుతూ వచ్చారు. 1957 అక్టోబరు 15న భారత పౌర విమానయానం రజతోత్సవాన్ని దేశం జరుపుకోవడంతో రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్ భారతదేశాన్ని ప్రపంచ విమానయాన పటంలో నిలిపినందుకు జెఆర్‌డి టాటాని ప్రశంసించారు. ఆయనకు పద్మవిభూషణ్ తో సత్కరించారు. 1978 ఫిబ్రవరిలో మొరార్జీ దేశాయ్ నేతృత్వంలోని ప్రభుత్వం ఎయిర్ ఇండియా అధ్యక్షపదవి నుంచి, ఇండియన్ ఎయిర్ లైన్స్ డైరెక్టర్ పదవి నుంచి జె.ఆర్.డీ.ని తప్పించింది. పైసా పారితోషికం తీసుకోలేదు ఈ నిర్ణయంతో ఒక్క పైసా పారితోషికం తీసుకోకుండా 45 సంవత్సరాలు సంస్థకు సేవలందించిన వ్యక్తిగా నిలిచారు. కానీ, అతని కలల ప్రాజెక్టు విషయంలో భాగ కలత చెందాడు. 1980లో ఇందిరా గాంధీ తిరిగి అధికారంలోకి వచ్చినప్పుడు, ఆమె చైర్మన్ గా కాకపోయినా రెండు విమానయాన సంస్థల బోర్డులో జె.ఆర్.డీ.ని తిరిగి నియమించింది. ఎయిర్ ఇండియా చైర్మన్ గా రతన్ టాటా నియమితులైన సంవత్సరం 1986 వరకు జె.ఆర్.డీ.ని బోర్డులలో సేవలను కొనసాగించారు. 1990లో ప్రధాని వీపీ సింగ్ ప్రభుత్వం టాటాలను కొత్త దేశీయ విమానయాన సంస్థను ప్రారంభించడానికి ఆసక్తి చూపిస్తుందా అని ప్రశ్నించారు. దాదాపు నాలుగు దశాబ్దాల తర్వాత మరొక అవకాశం వచ్చింది, టాటాలు ఈ ప్రతిపాదనను ఒకే చేసే లోపే ప్రభుత్వం పడిపోయింది. 1994లో ప్రధానమంత్రి నరసింహారావు ఓపెన్ స్కైస్ పాలసీ ప్రకారం ఎయిర్ కార్పొరేషన్ చట్టం-1953 చట్టం ప్రకారం వైమానిక రవాణా సేవలు జాతీయం చేసిన వాటిని రద్దు చేయాలని చూశారు. సంకీర్ణ ప్రభుత్వాలు రావడం బలమైన నిర్ణయాలు తీసుకోలేకుండా పోయింది. ఆ తర్వాత 1995 నుంచి 1997 మధ్య ఎయిర్ ఇండియా వల్ల ₹671 కోట్ల నష్టం వచ్చింది. ఇలా నష్టాలతో కొనసాగుతున్న సంస్థను 2001లో అటల్ బిహారీ వాజ్ పేయి నేతృత్వంలోని ప్రభుత్వం ఎయిర్ ఇండియాలో 40% వాటాను అమ్మకానికి పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. ఎయిర్ ఇండియాలో ఒక్కొక్కటి 20% వాటాను కొనడానికి ఎస్ఐఎ(సింగపూర్ ఎయిర్ లైన్స్), టాటా సన్స్ ముందుకు వచ్చాయి. కొందరు పెట్టుబదుదారుల కుట్రలు, రాజకీయ నాయకుల అవినీతి వల్ల పరిస్థితులు క్షీణించాయి. ఈ పరిణామాలతో ఎస్ఐఎ తన భాగస్వామ్యాన్ని ఉపసంహరించుకుంది. విమానయాన రంగంలో టాటాల ప్రవేశం నిలిచిపోయింది. అలా అప్పటి నుంచి ఆ కొనుగోలు ఒప్పందం అగుతూ వచ్చింది. చివరికి ఈ ఏడాదిలో ఎయిర్ ఇండియాను కొనుగోలు టాటా సన్స్ దక్కించుకుంది. -
ఆ మహానుభావుడు ఉంటే ఎంతో సంతోషించేవాడు.. ఎమోషనలైన రతన్ టాటా
ఎయిర్ ఇండియాను టాటాసన్స్ తిరిగి సొంతం చేసుకోవడంపై రతన్ టాటా ఆనందం వ్యక్తం చేశారు. ఈ శుభ సమయంలో జేఆర్డీ టాటా మన మధ్య ఉంటే ఎంతో సంతోషించేవాడని పేర్కొంటూ ట్వీట్ చేశారు. జంషెడ్జీ రతన్ టాటా 1932లో టాటా ఎయిర్‌లైన్స్‌ని ప్రారంభించారు. ఆ తర్వాత టాటా ఎయిర్ ఇండియాగా మార్చారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎయిర్ ఇండియాను ప్రభుత్వం జాతీయం చేసింది. జేఆర్డీ టాటా నుంచి రూ. 2.8 కోట్లు వెచ్చించి ఎయిర్ ఇండియాను ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఆ తర్వాత 68 ఏళ్ల తర్వాత ఎయిర్ ఇండియా తిరిగి టాటా సన్స్ సంస్థ సొంతం చేసుకుంది. ఇందుకుగాను టాటా సన్స్ రూ. 18,000 కోట్ల రూపాయలను వెచ్చించనుంది. సుదీర్ఘకాలం తర్వాత ఎయిరిండియా సొంతం కావడంతో రతన్ టాటా ఎమోషనల్‌గా ఫీలయ్యారు. ఎయిర్ ఇండియా బోయింగ్ విమానం ముందు జేఆర్డీ టాటా నిల్చుని ఉన్న ఫోటోను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఎయిరిండియాను పునర్ నిర్మించేందుకు అవకాశ లభించిందని ఆయన వ్యాఖ్యానించారు. ఏవియేషన్ రంగంలో టాటా గ్రూపు ప్రాతినిథ్యానికి ఎయిర్ ఇండియా ద్వారా అవకాశం కలిగిందన్నారు. ఈ సందర్భంగా ఎయిర్ ఇండియా వ్యవస్థాపకుడు జంషెడ్జీ టాటాను గుర్తు చేసుకున్నారు రతన్ టాటా. జెఆర్‌డీ టాటా హయాంలో ప్రపంచలోనే ఎయిర్ ఇండియా బోయింగ్ విమానాలకు గొప్ప గౌరవం ఉండేదన్నారు. టాటా గ్రూపుకి మరోసారి ఆ స్థాయికి ఎయిర్ ఇండియాను తీసుకుపోయే సమయం వచ్చిందన్నారు. ఈ సమయంలో మన మధ్యన జేఆర్డీ టాటా ఉంటే చాలా సంతోషించేవారంటూ ఎమోషనల్ అయ్యారు రతన్ టాటా. తమకు ఈ అవకాశం కల్పించిన ప్రభుత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. Welcome back, Air India 🛬🏠 pic.twitter.com/euIREDIzkV — Ratan N. Tata (@RNTata2000) October 8, 2021 చదవండి : సొంతగూటికి ఎయిరిండియా!! -
సొంతింటికొస్తున్న విమానం
ఎయిర్ ఇండియా తిరిగి టాటా చేతికే వచ్చేసింది. స్వాతంత్రానికి పూర్వం ప్రయివేటు రంగంలో మొదలై, తర్వాత ప్రభుత్వ పరమై... భారత దేశ కీర్తి పతాకాన్ని దశాబ్దాల పాటు విశ్వ గగన వీధుల్లో రెపరెపలాడించిన ఓ విమానయాన సంస్థ తిరిగి అదే సంస్థ చేతికి రావడం భావోద్వేగాలు రేపే ఘట్టం! ‘చరిత్ర పునరావృతమౌతుంది’ అని తరచూ వాడే నానుడి ఇక్కడ నిజమైంది. ‘భూమి గుండ్రంగా ఉండును...’ అనేది సాపేక్షంగా రుజువవుతుందన్నట్టు... కొన్ని పరిణామాలు మొదలైన చోటికే మళ్లీ చేరడాన్ని జనం వింతగా చూస్తారు. కొందరు ఆశ్చర్యపోతారు. మరికొందరు లోతైన భావోద్వేగాలకు లోనవుతారు. భారతదేశం గర్వించదగ్గ పారిశ్రామికవేత్త, దేశంలో లైసెన్స్ పొందిన తొలి కమర్షియల్ పైలెట్ జహంగీర్ రతన్జీ దాదాబాయ్ (జే.ఆర్.డి) టాటా 1932లో స్థాపించిన సంస్థ, 1953లో చట్టం ద్వారా ప్రభుత్వ నిర్వహణలోకి వెళ్లి, 68 సంవత్సరాల తర్వాత తిరిగి అదే సంస్థ చేతుల్లోకి వచ్చింది. ఎయిర్ ఇండియా నూటికి నూరు శాతం కొనుగోలుకై వచ్చిన తాజా బిడ్లలో టాటాయే అర్హమైనట్టు, చివరకు అదే ఎంపికయినట్టు కేంద్రంలోని ‘పెట్టుబడులు, ప్రజా ఆస్తుల నిర్వహణ విభాగం (దీపం)’ కార్యదర్శి తుహిన్ కాంత్ పాండే శుక్రవారం అధికారికంగా ప్రకటించడంతో దేశమంతా ఓ ఆహ్లాదపు వార్త విన్న అనుభూతి పొందింది. ఎందుకంటే, టాటా గ్రూప్‌కు, దాని యాజమాన్యానికి ఉన్న పేరు అటువంటిది. జాతీయతా భావాలు కలిగిన నిబద్ద కార్పొరేట్ సంస్థగా వారికున్న పేరు దేశంలో మరే సంస్థకూ లేదంటే అతిశయోక్తి కాదు! ‘టాటా గ్రూప్‌కు ఇస్తే మంచిది. ఎయిర్ ఇండియాను స్వీకరించి, సమర్థంగా నిర్వహించడానికి అంతకు మించిన కార్పొరేట్ ఏదీ ఇవాళ దేశంలో లేదు’ అని ప్రణాళికా సంఘ మాజీ ఉపాధ్యక్షుడు, ప్రముఖ ఆర్థికవేత్త మాంటెక్ సింగ్ అçహ్లువాలియా రెండు రోజుల కింద చేసిన ట్వీట్ సగటు భారతీయుల భావాల ప్రతీక! చివరకు అదే జరిగింది. ‘...జాతీయ పతాకాన్ని రెపరెపలాడించే విమానయాన సంస్థను పొంది, నిర్వహించే అవకాశం, గ్రూప్‌కు లభించిన అరుదైన గౌరవంగా భావిస్తాం. ఓ ప్రపంచస్థాయి సంస్థగా తీర్చిదిద్ది ప్రతి భారతీయుడూ గర్వించేలా చేస్తాం....’ అన్న టాటా సన్స్ చైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ తక్షణ స్పందన గ్రూప్ సంస్థల సంకల్పాన్ని ప్రతిబింబించేదే! ఎయిర్ ఇండియాను ప్రయివేటుపరం చేసేందుకు కేంద్రం చేసిన తొలి యత్నం కాదిది. 2000– 01లోనే అప్పటి బీజేపీ నేతృత్వపు ఎన్డీయే ప్రభుత్వం, నిధుల సమీకరణ కోసం ఎయిర్ ఇండియా వాటాల విక్రయానికి సన్నద్దమైంది. అప్పుడూ టాటా గ్రూప్‌తో పాటు సింగపూర్ ఎయిర్‌లైన్స్ ఓ ప్రయత్నం చేశాయి. కానీ, ఎందుకో వ్యవహారం కుదరలేదు. 2005 తర్వాత ప్రయివేటు రంగం పోటీని, ప్రభుత్వ రంగంలోని అలసత్వాన్ని ఎయిర్ ఇండియా తట్టుకోలేకపోయింది. తీవ్ర నష్టాలు, తీరని రుణభారంతో అల్లాడుతూ వచ్చింది. ముఖ్యంగా, 2007లో అప్పటి కాంగ్రెస్ నేతృత్వపు యూపీఏ ప్రభుత్వం, ఎయిర్ ఇండియా, ఇండియన్ ఎయిర్‌లైన్స్‌ని విలీనం చేసి, యాౖభై వేలకోట్ల రూపాయల రుణం ఇప్పించడం ద్వారా కొత్త విమానాల్ని కొనుగోలు చేయించింది. మెరుగవక పోగా, పరిస్థితి దిగజారింది. ఒక దశలో ఉద్యోగులకు జీతాలివ్వలేని స్థితి వచ్చినపుడు, ఈక్విటీ ఫండ్ రూపంలో కేంద్రం ముఫ్ఫై వేల కోట్ల రూపాయలు ఇప్పించినా కోలుకోలేకపోయింది. ఎయిర్ ఇండియా వాటాలు 76 శాతం, ఎయిర్ ఇండియా–సింగపూర్ ఎయిర్పోర్ట్ టర్మినల్ సర్వీసెస్ వాటాలు 50 శాతం విక్రయించాలని 2018లో చేసిన మరో ప్రయత్నం కూడా ఫలించలేదు. ఇక నూరుశాతం విక్రయమే మార్గమని, 2019లో ప్రస్తుత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చివరకిలా పరిణమించింది. 63 వేల కోట్ల రూపాయల రుణభారంతో ఉన్న ఎయిర్ ఇండియాను కొనడానికి వచ్చిన బిడ్లలో స్పైస్‌జెట్, టాటా చివరి వరకూ మిగిలి, టాటా సన్స్ అంతిమ విజేత అయింది. టాటాలకు ఇంతటి శక్తి, కీర్తి ఒక రోజులో వచ్చినవి కాదు. నూరేళ్లకు పైబడ్డ సంకల్ప ఫలం. నిబద్ధత, దేశభక్తి, అంకితభావం కలగలిసిన కృషి ఫలితం. చిన్న గుండుసూది తయారీ నుంచి పెద్ద విమానాలు నడుపడం వరకు దేశాభివృద్ధిలో టాటాల భాగస్వామ్యం అగణితమని చెప్పాలి. నడమంత్రపు సిరితో తూగుతున్న నయా కార్పొరేట్లతో పోలిస్తే టాటాలది ఈ దేశపు మట్టితో, గాలితో, పౌరుల బతుకుతో ముడివడ్డ ప్రగతి! 1991 మార్చి 23న, జేఆర్డీ టాటా, బాంబేహౌజ్లోని తన కార్యాలయంలో కూర్చొని ‘నేను రిటైర్ అవాలని, ఆ స్థానంలో నిన్ను ప్రకటించాలని నిర్ణయించాను’ అని వెల్లడించడానికి దశాబ్దం ముందు నుంచే రతన్ టాటా మది నిండా ఆలోచనలున్నాయి. టాటా విస్తరణ బ్లూప్రింట్ అప్పటికే తయారైంది. ఒకవైపు దేశ ఆర్థికస్థితి, మరోవైపు ప్రభుత్వ విధానాల్ని గమనంలోకి తీసుకొని ఆయనీ బ్లూ ప్రింట్ రూపొందించారు. లైసెన్స్రాజ్లో ఎదురైన చేదు అను భవాలు ఆయనకు తెలుసు. టాటా స్టీల్, టాటా మోటార్స్ వంటి సంస్థల్ని అగ్రస్థానంలో నిలప డానికి ఎన్నెన్ని ఆటుపోట్లను ఎదుర్కొన్నారు! ఉత్పత్తి, ధరలు, విక్రయాలు, మార్కెటింగ్, ఎగుమతి–దిగుమతులు, విదేశీ మారకం.... ఇలా, అప్పట్లో ప్రతిదీ నియంత్రణే! అన్నీ అధిగమించి, దేశ ప్రయోజనాల విషయంలో అణుమాత్రం రాజీపడకుండా సంప్రదాయ–నెమ్మది పంథా నుంచి టాటా గ్రూప్‌ను ప్రపంచ పోటీ తట్టుకునే స్థితికి తీసుకువచ్చారు. టాటా అంటే, ఇవాళ విశ్వస నీయత కలిగిన బ్రాండ్! దేశ ప్రగతి సౌధంలో ఒక్కో ఇటుకై నిలిచిన పెద్ద గోడ! ఎయిర్ ఇండియా ప్రయివేటీకరణ అనివార్యమైతే... అందుకు టాటాయే యోగ్యం! దేశానికి అదే ప్రయోజనకరం. -
ఇందిరా గాంధీ, జేఆర్డీ టాటా మధ్య ఆసక్తికర లేఖ..!
మాజీ ప్రధాని ఇందిరాగాంధీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. భారత మొట్టమొదటి ఏకైక మహిళా ప్రధానమంత్రి. 1966 నుంచి 1977 వరకు మూడు పర్యాయాలు, 1980లో నాలుగో సారి ప్రధానమంత్రిగా పనిచేశారు. పలు రాజకీయ నేతలు ఇందిరాగాంధీని ప్రధానమంత్రి పదవి నుంచి తొలగించాలనే ఉద్ధేశ్యంతో ఇందిరా హటావో అనే నినాదంతో ప్రచారం చేస్తే..వారి ఎత్తులకు పై ఎత్తులు వేసి గరీబీ హటావో అనే నినాదాన్ని ప్రచారంలోకి తెచ్చిన నేర్పరి ఇందిరాగాంధీ. తన నాయకత్వంలో పలు విప్లవత్మాక నిర్ణయాలను తీసుకున్నారు. 1969లో బ్యాంకుల జాతీయీకరణ, దేశంలో పంటల ఉత్పత్తి పెంచడం కోసం హరిత విప్లవం, 20 సూత్రాల పథకము వంటి ప్రజాకర్షక పథకాలను ప్రవేశపెట్టారు. తాజాగా ప్రముఖ పారిశ్రామికవేత్త, ఆర్పీజీ ఎంటర్ప్రైజెస్ చైర్మన్ హర్ష గోయోంకా ఆసక్తికర ఉత్తరాన్ని మంగళవారం రోజున ట్విటర్లో షేర్ చేశారు. అప్పటి భారత ప్రధానమంత్రి ఇందిరా గాంధీ, పలు టాటా సంస్థల వ్యవస్తాపకుడు జేఆర్డీ టాటాకు 1973 జూలై 5 న ఉత్తరాన్ని రాశారు. అంతకుముందు ప్రధానమంత్రి ఇందిరాగాంధీకి జేఆర్డీ టాటా తన కంపెనీకు చెందిన పర్ఫ్యూమ్ బాటిళ్లను పంపారు. ఇందిరా గాంధీ తన లేఖలో బదులుగా... ‘డియర్ జే.. మీరు పంపిన పర్ఫ్యూమ్స్తో ఆశ్చర్యానికి గురైయ్యాను. పర్ఫ్యూమ్స్ను పంపినందుకు ధన్యవాదాలు. సాధారణంగా నేను పర్ఫ్యూమ్లను వాడను. అలాంటి వాటికి దూరంగా ఉంటాను . మీరు పంపినందుకు ఒకసారి ట్రై చేస్తాను. మీరు అనుకూలమైన లేదా విమర్శనాత్మకమైన అభిప్రాయాలను తెలియజేయాలనుకుంటే మోహమాట పడకుండా నన్ను సంప్రదించవచ్చున’ని ఇందిరా గాంధీలో లేఖలో పేర్కొన్నారు. ఈ లేఖను ప్రముఖ పారిశ్రామికవేత్త హర్ష గోయోంకా ట్విటర్లో పోస్ట్ చేస్తూ..‘శక్తివంతమైన ప్రధానమంత్రి, దిగ్గజ పారిశ్రామికవేత్త మధ్య జరిగిన వ్యక్తిగత లేఖ. పరిపూర్ణ స్థాయి.’ అంటూ రాసుకొచ్చారు. కాగా ప్రస్తుతం ఈ లేఖ పునరుద్ధరించిన బాంబే హౌజ్‌లో ప్రదర్శనగా ఉంది. A very personal letter exchange between a powerful Prime Minister and a giant industrialist. Sheer class ! #Tata pic.twitter.com/RqDKEcSsBf — Harsh Goenka (@hvgoenka) July 20, 2021 -
కొత్త ఎడిషన్ కార్లు : వారికి మాత్రమే
సాక్షి, ముంబై: దేశీయ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ భారత మార్కెట్లో 75 వసంతాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భాన్నిపురస్కరించుకుని ప్రతి ఫౌండర్స్ ఎడిషన్ కార్లను లాంచ్ చేసింది. ప్రస్తుతం ఉన్న మోడళ్లలో ప్రత్యేక 'ఫౌండర్స్ ఎడిషన్' వెర్షన్‌ను విడుదల చేసింది. టాటా టియాగో, టైగర్, ఆల్ట్రోజ్, నెక్సాన్ , హారియర్ కార్ల ప్రత్యేక ఎడిషన్లను లాంచ్ చేసింది. అయితే వీటిని అందరికీ అందుబాటులో ఉండవు. టాటా గ్రూప్ ఉద్యోగుల కోసం మాత్రమే ప్రత్యేకంగా వీటిని తీసుకొచ్చింది. ఈ కార్ల ప్రత్యేకత ఏమిటి? కొన్ని చిన్న మార్పులతోపాటు, టాటా వ్యవస్థాపకుడు జేఆర్డీ టాటా సంతకం ఉన్న ప్రత్యేక బ్యాడ్జ్ స్పెషల్ ఎట్రాక్షన్. ఫౌండర్ ఎడిషన్ కార్లలో నీలి రంగు బ్యాక్‌గ్రౌండ్‌తో కొత్త లోగోను అమర్చింది. మిగిలిన ఫీచర్లన్నీ యథాతథంగాఉంటాయి. దీంతోపాటు కార్లను కొనుగోలు చేసే టాటా గ్రూప్ ఉద్యోగులకు ఫోటో ఫ్రేమ్‌తో పాటు కంపెనీ ప్రయాణాన్ని వివరించే ఐకానిక్ సిరీస్ పోస్ట్‌కార్డ్ కూడా లభిస్తుంది. అయితే కార్లు ఒక వేరియంట్‌కు ప్రత్యేకమైనవి కావా లేదా ఏదైనా ట్రిమ్ ఆప్షన్లో కూడా కొనుగోలు చేయవచ్చా అనేది కంపెనీ వెల్లడించలేదు. 1945 లో జేఆర్డీ టాటా ఈ సంస్థను స్థాపించిన సంగతి తెలిసిందే. టాటా మోటార్స్ జర్నీ లోకోమోటివ్ తయారీదారుగా 1945లో టాటా మోటార్స్ ఆవిర్భవించింది. 1954 లో, టాటా గ్రూప్ జర్మనీకి చెందిన డైమ్లెర్-బెంజ్‌తో జాయింట్ వెంచర్‌తో వాణిజ్య వాహన రంగంలోకి ప్రవేశించింది. వాణిజ్య వాహనాల్లో సంవత్సరాల అనుభవం తరువాత, 1991 లో ప్యాసింజర్ వెహికల్ విభాగంలోకి ప్రవేశించింది. టాటా మొబైల్ ప్లాట్‌ఫాం ఆధారంగా తన తొలి స్పోర్ట్ యుటిలిటీ వాహనం టాటా సియెర్రాను లాంచ్ చేసింది. తద్వారా ప్రయాణీకుల వాహనాల మార్కెట్లోకి ప్రవేశించింది. అనంతరం టాటా ఎస్టేట్ (1992), టాటా సుమో (1994) టాటా సఫారి (1998) ను తీసుకొచ్చింది. 2004 లో, దక్షిణ కొరియాకు చెందిన ట్రక్ తయారీ యూనిట్, డేవూ కమర్షియల్ వెహికల్స్ కంపెనీ టాటా మోటార్స్ డేవూని కొనుగోలు చేసింది. తరువాత దీనిని టాటా డేవూగా మార్చారు. 2005 లో టాటా మోటార్స్ స్పానిష్ బస్సు , కోచ్ తయారీదారు హిస్పానో కరోసెరాలో వాటాలను సొంతం చేసుకుంది. 2008 లో టాటా మోటార్స్ ఫోర్డ్ మోటార్ కంపెనీ నుండి జాగ్వార్ అండ్ ల్యాండ్ రోవర్ కార్ల తయారీదారు జాగ్వార్ ల్యాండ్ రోవర్‌ను కొనుగోలు చేసింది. -
ఆయన గురించి మాటల్లో చెప్పలేను: రతన్ టాటా
ముంబై : పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా స్ఫూర్తివంతమైన విషయాలను యువతతో పంచుకుంటారన్న విషయం తెలిసిందే. ఇటీవల సోషల్ మీడియాలో అడుగుపెట్టిన ఆయన అనతి కాలంలోనే పది లక్షల మందికి పైగా ఫాలోవర్లను సంపాదించుకున్నారు. యువతలో ఆయనకు ఉన్న క్రేజ్ అలాంటిది. రతన్ టాటా ఎప్పుడూ ఏ విషయం చెబుతారా అంటూ నెటిజన్లు ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. కాగా ఇటీవల ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రతన్‌టాటా తన బాల్యం, ప్రేమ గురించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించిన విషయం తెలిసిందే. తాజాగా దీనికి సంబంధించిన రెండవ భాగం ఇంటర్వ్యూలో మరి కొన్ని విషయాలు పంచుకున్నారు. (అలా మా బంధం బీటలు వారింది: రతన్ టాటా) 1991 లో జహంగీర్ రతన్జీ దాదాభాయ్ టాటా నుంచి టాటా గ్రూప్ వ్యాపార సామ్రాజ్య వారసుడిగా రతన్ టాటా బాధ్యతలు అందిపుచ్చుకున్నారు. ఆ సమయంలో బంధుప్రీతిపై రతన్ టాటా ఎదుర్కొన్న విమర్శల గురించి చెప్పుకొచ్చారు. అవి ఆయన మాటల్లోనే.. ‘‘నేను టాటా గ్రూప్‌లో చేరినప్పడు ఎలాంటి విమర్శలు లేవు. కానీ ఎప్పుడైతే టాటా సన్స్ చైర్మన్ పదవి నుంచి జేఆర్డీ టాటా వైదొలగాని నిర్ణయించుకున్నారో అప్పడు విమర్శలు ప్రారంభమయ్యాయి. ఎందుకంటే చైర్మన్ పదవికి కోసం ఆ సమయంలో ఎంతోమంది ఆశపడ్డారు. కానీ జేఆర్డీ.. నన్ను టాటా గ్రూప్ చైర్మన్‌గా నియమించారు. దీంతో జేఆర్డీ బంధుప్రీతి కారణంగానే.. రతన్‌కు బాధ్యతలు అప్పజెప్పి తప్పు చేశారంటూ విపరీతమైన విమర్శలు వెలువడ్డాయి. విమర్శ అనేది ఆ కాలంలో వ్యక్తిగతంగా చేసేవారు. అయితే ఆ సమయంలో నేను ఎదురు దాడికి దిగలేదు. సంయమనం పాటించి నా పని ద్వారా నన్ను నేను నిరూపించుకోవడంపై దృష్టి సారించాను’’ అని వెల్లడించారు. (రతన్ టాటా అద్భుత రిప్లై) ఇక జేఆర్డీకీ తనకు మధ్య ఉన్న సంబంధం గురించి మాట్లాడుతూ.. ‘జేఆర్డీ నాకు తండ్రి, అన్న లాంటి వారు. అతన్ని సన్నిహితుడిగా కలిగి ఉండటం నా అదృష్టం. అతను గొప్ప గురువు. ఆయన గురించి మాటల్లో ఇంతకంటే ఏం చెప్పలేను’ అంటూ చెప్పుకొచ్చారు. కాగా జహంగీర్ రతన్జీ దాదాబాయ్ టాటా, రతన్ టాటా.. టాటా కుటుంబంలోని విభిన్న నేపథ్యాల నుంచి వచ్చారు. దాదాపు 50 ఏళ్ల పాటు టాటా కంపెనీకి నాయకత్వం వహించిన జేఆర్డీ టాటా అనంతరం తన వ్యాపార సామ్రాజ్య వారసుడిగా 1991లో రతన్ టాటాను నియమించారు. -
భారత్‌లో ఏవియేషన్‌కి ఆద్యుడు జేఆర్డీ..
దేశీయంగా విమానయానానికి టాటాలే ఆద్యులు. ఎయిర్‌మెయిల్ సర్వీసుగా విమానయాన సంస్థను జహంగీర్ రతన్జీ దాదాభాయ్ టాటా (జేఆర్డీ టాటా) 1932లో ప్రారంభించారు. తొలి ఫ్లయిట్‌ను కరాచీ నుంచి ముంబైకి ఆయనే స్వయంగా నడిపారు. భారత్‌లో మొట్టమొదటి లెసైన్స్డ్ పైలట్ కూడా ఆయనే. ప్రభుత్వం నుంచి అంతగా మద్దతు లభించకపోయినప్పటికీ క్రమక్రమంగా మెయిల్ కార్యకలాపాలను కలకత్తా, మద్రాస్, త్రివేండ్రం తదితర ప్రాంతాలకూ విస్తరించారు. 1937లో ఢిల్లీ-ముంబై రూటులో ఇటు మెయిల్, అటు ప్రయాణికులను కూడా చేరవేసేలా విమాన సర్వీసులను ప్రారంభించారు. 1946లో టాటా ఎయిర్‌లైన్స్ పబ్లిక్ కంపెనీగాను, ఆ తర్వాత ఎయిరిండియాగా మారింది. అయిదేళ్ల తర్వాత దాన్ని జాతీయం చేసినప్పటికీ.. 1978 దాకా జేఆర్‌డీనే చైర్మన్‌గా కొనసాగారు.