భారతీయ దిగ్గజ సంస్థ 'టాటా గ్రూప్' నేడు ఈ స్థాయిలో ఉందంటే దాని వెనుక ఎంతోమంది కృషి ఉంది. ఇందులో ప్రధానంగా చెప్పుకోదగ్గ వ్యక్తి 'జేఆర్‌డీ టాటా' (జహంగీర్ రతన్‌జీ దాదాభోయ్ టాటా). 1904 జులై 29న జన్మించిన ఈయన సుమారు 53 సంవత్సరాలు టాటా గ్రూప్ సంస్థకు ఛైర్మన్‌గా ఉన్నారు. కేవలం 34 ఏళ్ల వయసులోనే కంపెనీ చైర్మన్ బాధ్యతలు స్వీకరించారు.
జేఆర్‌డీ టాటా ఛైర్మన్‌గా ఉన్న కాలంలోనే టీసీఎస్, టాటా మోటార్స్, టాటా సాల్ట్, టాటా గ్లోబల్ బెవరేజెస్, టైటాన్ వంటి విజయవంతమైన వెంచర్‌లతో సహా 14 కొత్త కంపెనీలను ప్రారంభించారు. అంతే కాకుండా 1956లో ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (IAS) తరహాలో టాటా అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (TAS)ని స్థాపించారు.
జేఆర్‌డీ టాటా సంస్థలో పనిచేసే ఉద్యోగులు, వారి కుటుంబాల సంక్షేమం కోసం విరివిగా విరాళాలు అందించారు. రోజుకు ఎనిమిది గంటలు మాత్రమే పని అనే భావన ప్రవేశపెట్టిన ఘనత జేఆర్‌డీ టాటా సొంతం. అంతే కాకుండా ఉద్యోగుల కోసం ఉచిత వైద్య సేవలు, ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్ కూడా ప్రారంభించారు. ప్రమాదాల సమయంలో కార్మికులకు నష్టపరిహారం అందించే విధానం కూడా ఈయనే మొదలుపెట్టారు.
1936లో టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ (TISS) స్థాపించారు. ఆ తరువాత 1945లో టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ (TIFR), నేషనల్ సెంటర్ ఫర్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ కూడా స్థాపించారు. 1968లో టాటా కంప్యూటర్ సెంటర్‌గా టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) స్థాపించారు. నేడు ఈ కంపెనీ భారతదేశంలో అతిపెద్ద ఐటీ కంపెనీగా అవతరించింది. ఆ తరువాత 1987లో టైటాన్‌ను స్థాపించారు.
15 సంవత్సరాల వయసులోనే ఫైలట్ కావాలని, విమానయాన రంగంలో వృత్తిని కొనసాగించాలని నిశ్చయించుకున్న జేఆర్‌డీ టాటా 24 ఏళ్ల వయసులో ఫ్లయింగ్ లైసెన్స్ పొందారు. దీంతో ఈయన భారతదేశంలో మొట్టమొదటి ఫ్లయింగ్ లైసెన్స్ పొందిన వ్యక్తిగా నిలిచారు. ఆ తరువాత టాటా ఎయిర్ సర్వీస్ ప్రారంభించారు. దీన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. అయితే చివరికి ఈ సంస్థ మళ్ళీ ఎయిర్ ఇండియాగా టాటా గ్రూపులోకే వచ్చింది.
టాటా గ్రూప్ అభివృద్ధికి మాత్రమే కాకుండా.. ఉద్యోగుల జీవితాల్లో కూడా మార్పులు తీసుకువచ్చిన జేఆర్‌డీ టాటా 1993 నవంబర్ 29న జెనీవాలోని ఒక ఆసుపత్రిలో మరణించారు. పారిశ్రామిక రంగంలో ఈయన చేసిన కృషికి భారత ప్రభుత్వం భారతరత్న ప్రధానం చేసింది. దీంతో భారతదేశ అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్నను పొందిన ఏకైక పారిశ్రామికవేత్తగా జేఆర్‌డీ టాటా చరిత్ర సృష్టించారు.
Comments
Please login to add a commentAdd a comment