Unknown Story Behind Tata Sons Air India Acquisition, And Ratan Tata Tweet - Sakshi
Sakshi News home page

Tata Sons Air India Acquisition: ఎయిరిండియా జాతీయీకరణ ఒక భారీ కుట్ర!

Published Sun, Oct 31 2021 9:21 PM | Last Updated on Mon, Nov 1 2021 5:47 PM

Tata And Their Baby, Group Get Back What Was Snatched Six Decades Ago - Sakshi

మన దేశంలో టాటా గ్రూప్ అంటే తెలియని వారు చాలా తక్కువ మంది ఉంటారని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. దేశంలో ఏ ప్రైవేట్ సంస్థకు లేని ఆదరణ టాటా గ్రూప్ సొంతం. ఇంత పెద్ద టాటా గ్రూప్, ఎయిరిండియాను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. అయితే, టాటా సన్స్ ఎయిరిండియాను రూ.18,000 కోట్లకు దక్కించుకున్నప్పుడు రతన్ టాటా ఒక బావోద్వేగా ట్వీట్ చేశారు. జెఆర్‌డీ టాటా ప్రస్తుతం జీవించి ఉంటే చాలా సంతోషించి ఉండేవారిని ఆ ట్విటర్ వేదికగా పేర్కొన్నారు. చాలా వరకు మన దేశంలోని ప్రజలు, మేధావి వర్గాలు ప్రైవేట్ కరణను వ్యతిరేకిస్తారు. కానీ, టాటా సన్స్ ఎయిరిండియాను కొనుగోలు చేసినప్పుడు మాత్రం ప్రతి ఒక్కరూ ఆహ్వానించారు. అయితే, ఈ ఎయిరిండియా కొనుగోలు వెనుక ఒక పెద్ద చరిత్ర ఉంది. రతన్ టాటా అలా ట్వీట్ చేయడం వెనుక చాలా పెద్ద స్టోరీ ఉంది. ఇప్పుడు మనం ఆ స్టోరీ గురుంచి తెలుసుకుందాం..

ఎయిరిండియాను వ్యాపారం కోసం రతన్ టాటా దక్కించు కోలేదు. ఎయిర్ ఇండియా అనేది జెఆర్‌డీ టాటా కలల ప్రాజెక్టు. టాటా ఎయిర్ లైన్స్ ఏప్రిల్ 1932లో జెహంగీర్ రతన్ జీ దాదాభోయ్(ప్రేమగా జెఆర్‌డి అని పిలుస్తారు) టాటా నాయకత్వంలో ప్రారంభించారు. ఈ ఎయిర్ లైన్స్ ముఖ్య ఉద్దేశ్యం సామాన్య ప్రజానీకానికి సాధ్యమైనంత తక్కువ ధరలో వరల్డ్ క్లాస్ సదుపాయాలతో విమానయాన సౌకర్యాన్ని కల్పించడం. భారతరత్న అందుకున్న భారతదేశపు మొదటి పౌర విమానయాన పైలట్ టాటా గ్రూప్ ఛైర్మన్, ఏకైక పారిశ్రామికవేత్త జెఆర్‌డి. భారతీయ వాణిజ్య పౌర విమానయానం కథ అక్టోబర్ 15, 1932న ప్రారంభమైంది. 

ఎయిరిండియా ఇంటర్నేషనల్ 
జెఆర్‌డి కరాచీ డ్రిగ్ రోడ్ ఏరోడ్రోమ్ నుంచి తన మొదటి అధికారిక టాటా ఎయిర్ లైన్స్ విమానంలో బయలుదేరి అప్పటి బొంబాయి జుహు ఎయిర్ స్ట్రిప్ వద్ద ల్యాండ్ అయ్యారు. తర్వాత 5 సంవత్సరాలలో టాటా ఎయిర్లైన్స్ లాభాలు గణనీయంగా పెరిగాయి. బాహ్య ప్రపంచంతో, 99.4% సమయపాలనతో సేవలు అందించే ఈ విమానయాన సేవలను భారత రాకుమారులు చాలా ఇష్టపడ్డారు. ఇక స్వాతంత్ర్య అనంతరం టాటా ఎయిర్ లైన్స్ పాకిస్తాన్ నుంచి భారతదేశానికి శరణార్థులను తరలించింది. 1947 అక్టోబరులో టాటా సన్స్ అంతర్జాతీయ వైమానిక సేవను ఎయిరిండియా ఇంటర్నేషనల్ పేరుతో స్థాపించాలని అప్పటి ప్రధాన మంత్రి జవహర్ లాల్ నెహ్రూను కోరితే వారు కూడా మూడు వారాల్లో ఆమోదించారు. 

బాంబే నుంచి లండన్ కు మొదటి ఎయిరిండియా ఇంటర్నేషనల్ విమానం జూన్ 1948లో సకాలంలో(కైరో, జెనీవా వద్ద ఆగిపోయిన కూడా) దిగింది. స్వాతంత్ర్యం తర్వాత పాన్ అమెరికన్, ట్రాన్స్ వరల్డ్ ఎయిర్ లైన్స్, కెఎల్ఎమ్, ఎయిర్ ఫ్రాన్స్ వంటి ఎయిర్ లైన్స్ దేశంలో విమానయాన సేవలు అందిస్తున్నాయి. జవహర్ లాల్ నెహ్రూ సోదరి దౌత్యవేత్త విజయలక్ష్మీ పండిట్ స్వతంత్ర భారత తొలి రాయబారిగా మాస్కోకు ఎయిరిండియా విమానంలో వెళ్ళింది. ఆమె విమానయాన సంస్థ సేవలు, ప్రమాణాల గురించి పొగుడుతూ జెఆర్‌డీ టాటాకు లేఖ రాసింది. ఇక క్రమ క్రమంగా ఎయిరిండియాకు ప్రజాదరణ వస్తుంది. ఈ సమయంలోనే అసలు సమస్య ఉత్పన్నం అయ్యింది.

ఒడిదుడుకులు ప్రారంభం
అప్పటి దేశ కమ్యూనికేషన్ మంత్రి భారతదేశం నాలుగు మూలలను కలిపే తపాలా సేవలను ప్రారంభించడానికి ఎయిరిండియా సేవలను కోరారు. ఆ ఆలోచన చాలా మంచిదే కానీ, ఎయిర్ ఇండియా ఈ ప్రతిపాదనను పరిశీలించడానికి ముందు రాత్రి ల్యాండింగ్ సౌకర్యాలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని జెఆర్‌డి టాటా అప్పటి కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. దీనివల్ల రాత్రి వేల తపాలా సేవలను అందించాలని భావించారు. కానీ, ప్రభుత్వం అంగీకరించలేదు. రాను రాను ప్రభుత్వానికి, జెఆర్‌డీ టాటాకు మధ్య దూరం పెరిగింది. దీంతో అప్పటి కమ్యూనికేషన్ మంత్రి మరిన్ని ప్రైవేట్ సంస్థలకు లైసెన్స్ ఇవ్వడం ప్రారంభించారు. 

దీంతో అనేక దేశాల కంపెనీలు మన దేశంలో అడుగ పెట్టాయి. అయితే, రెండవ ప్రపంచ యుద్దం ముగిసిన తర్వాత యునైటెడ్ స్టేట్స్ అనేక డకోటా విమానాలను మన దేశంలో విమానయాన సేవల కోసం మార్కెట్లోకి పంపింది. ఏటువంటి వ్యాపార అనుభవం లేకుండా మార్కెట్లోకి అడుగు పెట్టడంతో కొన్ని సంస్థలు నష్ట పోయాయి. పోస్టల్ సర్వీస్ ఆలోచనను ఉమ్మడిగా వ్యతిరేకించడానికి ఎయిరిండియా, ఎయిర్ సర్వీసెస్ ఆఫ్ ఇండియా, ఎయిర్ వేస్(ఇండియా), ఇండియన్ నేషనల్ ఎయిర్ వేస్లతో ఒక సమావేశాన్ని జెఆర్‌డి టాటా ఏర్పాటు చేశారు. ఈ సమావేశ విషయం దేశ కమ్యూనికేషన్ మంత్రి రఫీ అహ్మద్ కిద్వాయ్ కి తెలవడంతో చాలా కలత చెందాడు. 

హిమాలయన్ ఏవియేషన్
అతను 1948లో హిమాలయన్ ఏవియేషన్ అనే కొత్త విమానయాన సేవలను ప్రారంభించాడు. జెఆర్‌డి టాటా, కమ్యూనికేషన్ మంత్రికి బహిరంగ లేఖ రాశారు. లాభాల గురించి మేము విమానయాన సేవలను నడిపించడం లేదు అని అతనికి రాశాడు. ఈ బహిరంగ లేఖతో కోపంతో ఉన్న కిద్వాయ్ జెఆర్‌డి టాటాకు ఒక గుణపాఠం నేర్పాలని నిశ్చయించుకున్నాడు. ఈ విషయం కాస్త అప్పటి ప్రధాన మంత్రి నెహ్రూకు తెలిసింది. టాటాలు మంచి పని చేస్తున్నారని, ఎయిరిండియా సమర్థవంతమైన, స్నేహపూర్వక సేవలను అందిస్తుందని బహిరంగంగా ప్రకటించారు. మంత్రికి, జెఆర్‌డి టాటాకు మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించడానికి జెఆర్‌డి టాటా ప్రతిపాదనను పరిశీలించడానికి ఒక కమిటీని ఏర్పాటు చేయాలని ప్రధాన మంత్రి సూచించారు.

అప్పటి బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జి.ఎస్.రాజధ్యక్ష ఆధ్వర్యంలో నిర్ఘాంతకమిటీ ఆర్థిక సాధ్యాసాధ్యాల గురించి ఆలోచించకుండా లైసెన్స్ లు జారీ చేసినందుకు ప్రభుత్వాన్ని మందలించింది. “నాలుగు కంపెనీలు మనుగడ సాగించలేని చోట విచక్షణారహితంగా డజనుకు పైగా లైసెన్స్ లను జారీ చేయడం ఏకపక్షంగా ఉంది” అని కమిటీ తెలిపింది. దీంతో కమ్యూనికేషన్ మంత్రి కుట్ర వైఖరి నిరూపితమైంది. అయితే, కేంద్ర ప్రభుత్వం ఎయిరిండియా విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. 

ఎయిరిండియా జాతీయీకరణ
త్వరలోనే ఎయిరిండియా జాతీయీకరణ చేయనున్నట్లు ప్రకటించింది. ఒక మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జెఆర్‌డి టాటా ఈ రంగాన్ని జాతీయం చేయడం దేశానికి మంచిది కాదని, ఇది రాజకీయం చేయడానికి దారితీస్తుందని, ఇది వినాశకరమైనదని అన్నారు. జాతీయసంస్థల కోసం పనిచేసే బ్యూరోక్రాట్లు సంబంధిత మంత్రిత్వ శాఖకు నివేదించారు. ఈ రంగంలో పోటీ తట్టుకోవాలంటే స్వతంత్ర నిర్ణయాలు వెంట వెంటనే తీసుకోలేరు అని అన్నారు. ప్రధానమంత్రికి ఆయన ఇంటర్వ్యూ కాపీని నెహ్రూకు పంపారు. నెహ్రూ మాత్రం ఈ విషయంపై స్పందించలేదు.

త్వరలోనే జెఆర్‌డి టాటా భయపడినట్లుగా అంబికా ఎయిర్ లైన్స్, జూపిటర్ ఎయిర్ వేస్ అనే రెండు కంపెనీలు దివాలా ప్రకటించాయి. చివరగా 1953లో అన్ని విమానయాన సంస్థలను ఒకటిగా విలీనం చేసి ప్రభుత్వం కిందకు తీసుకొని వచ్చింది. చివరి ప్రయత్నంగా, జెఆర్‌డి టాటా రెండు కంపెనీలగా ఏర్పాటు చేయాలని సూచించారు. ఒకటి దేశీయ రంగానికి, మరొకటి అంతర్జాతీయ కార్యకలాపాల కోసం తెలిపారు. కాని నెహ్రూ ప్రభుత్వం వీటిని పట్టించుకోలేదు.

విలీనం అవుతున్న కంపెనీలకు పరిహారం చెల్లించడానికి స్వతంత్ర కమిటీని నియమించాలని జెఆర్‌డి టాటా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. దానిని కూడా తిరస్కరించారు. దీంతో జెఆర్‌డి టాటా తీవ్రంగా కలత చెందారు. ఆయన ఇంకా పట్టు విడవలేదు. ఆ తర్వాత వచ్చిన అప్పటి కమ్యూనికేషన్స్ మంత్రి జగ్జీవన్ రామ్ తో జరిగిన సమావేశంలో జెఆర్‌డి టాటా ఇలా అడిగారు.. “మీరు ఇతర విభాగాలను నడుపుతున్న విధంగా విమానయాన సంస్థను నడపడం సులభమని మీరు భావిస్తున్నారా? మీరే చూస్తారు” అని అన్నారు. దానికి జగ్జీవమ్ రామ్ ఇలా జవాబిచ్చాడు” ఇది ప్రభుత్వ శాఖ కావచ్చు, కానీ మీ సహాయంతో దానిని నడపాలని మేము కోరుకుంటున్నాము” అని అన్నారు. ఆ సమావేశం అసంపూర్తిగా ముగిసింది. 

టాటాలకు కేంద్ర ప్రభుత్వం సరైన పరిహారం చెల్లించలేదు. ఆ తర్వాత జెఆర్‌డి టాటా ఆ విమానయాన బోర్డులో ఒక సభ్యుడిగా కొనసాగుతూ వచ్చారు. 1957 అక్టోబరు 15న భారత పౌర విమానయానం రజతోత్సవాన్ని దేశం జరుపుకోవడంతో రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్ భారతదేశాన్ని ప్రపంచ విమానయాన పటంలో నిలిపినందుకు జెఆర్‌డి టాటాని ప్రశంసించారు. ఆయనకు పద్మవిభూషణ్ తో సత్కరించారు. 1978 ఫిబ్రవరిలో మొరార్జీ దేశాయ్ నేతృత్వంలోని ప్రభుత్వం ఎయిర్ ఇండియా అధ్యక్షపదవి నుంచి, ఇండియన్ ఎయిర్ లైన్స్ డైరెక్టర్ పదవి నుంచి జె.ఆర్.డీ.ని తప్పించింది. 

పైసా పారితోషికం తీసుకోలేదు
ఈ నిర్ణయంతో ఒక్క పైసా పారితోషికం తీసుకోకుండా 45 సంవత్సరాలు సంస్థకు సేవలందించిన వ్యక్తిగా నిలిచారు. కానీ, అతని కలల ప్రాజెక్టు విషయంలో భాగ కలత చెందాడు. 1980లో ఇందిరా గాంధీ తిరిగి అధికారంలోకి వచ్చినప్పుడు, ఆమె చైర్మన్ గా కాకపోయినా రెండు విమానయాన సంస్థల బోర్డులో జె.ఆర్.డీ.ని తిరిగి నియమించింది. ఎయిర్ ఇండియా చైర్మన్ గా రతన్ టాటా నియమితులైన సంవత్సరం 1986 వరకు జె.ఆర్.డీ.ని బోర్డులలో సేవలను కొనసాగించారు.

1990లో ప్రధాని వీపీ సింగ్ ప్రభుత్వం టాటాలను కొత్త దేశీయ విమానయాన సంస్థను ప్రారంభించడానికి ఆసక్తి చూపిస్తుందా అని ప్రశ్నించారు. దాదాపు నాలుగు దశాబ్దాల తర్వాత మరొక అవకాశం వచ్చింది, టాటాలు ఈ ప్రతిపాదనను ఒకే చేసే లోపే ప్రభుత్వం పడిపోయింది. 1994లో ప్రధానమంత్రి నరసింహారావు ఓపెన్ స్కైస్ పాలసీ ప్రకారం ఎయిర్ కార్పొరేషన్ చట్టం-1953 చట్టం ప్రకారం వైమానిక రవాణా సేవలు జాతీయం చేసిన వాటిని రద్దు చేయాలని చూశారు. సంకీర్ణ ప్రభుత్వాలు రావడం బలమైన నిర్ణయాలు తీసుకోలేకుండా పోయింది. ఆ తర్వాత 1995 నుంచి 1997 మధ్య ఎయిర్ ఇండియా వల్ల ₹671 కోట్ల నష్టం వచ్చింది. 

ఇలా నష్టాలతో కొనసాగుతున్న సంస్థను 2001లో అటల్ బిహారీ వాజ్ పేయి నేతృత్వంలోని ప్రభుత్వం ఎయిర్ ఇండియాలో 40% వాటాను అమ్మకానికి పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. ఎయిర్ ఇండియాలో ఒక్కొక్కటి 20% వాటాను కొనడానికి ఎస్ఐఎ(సింగపూర్ ఎయిర్ లైన్స్), టాటా సన్స్ ముందుకు వచ్చాయి. కొందరు పెట్టుబదుదారుల కుట్రలు, రాజకీయ నాయకుల అవినీతి వల్ల పరిస్థితులు క్షీణించాయి. ఈ పరిణామాలతో ఎస్ఐఎ తన భాగస్వామ్యాన్ని ఉపసంహరించుకుంది. విమానయాన రంగంలో టాటాల ప్రవేశం నిలిచిపోయింది. అలా అప్పటి నుంచి ఆ కొనుగోలు ఒప్పందం అగుతూ వచ్చింది. చివరికి ఈ ఏడాదిలో ఎయిర్ ఇండియాను కొనుగోలు టాటా సన్స్ దక్కించుకుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement