
భారత్‌లోని యూఎస్ ఎంబసీ ఇటీవల వేల సంఖ్యలో వీసా దరఖాస్తులను రద్దు చేసింది. మోసపూరిత కార్యకలాపాలను నిరోధించే చర్యల్లో సుమారు 2,000 వీసా అపాయింట్మెంట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. రెండు నెలల క్రితం డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడుగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి అమెరికా కొత్త ప్రభుత్వం కఠినమైన ఇమ్మిగ్రేషన్, వీసా విధానాన్ని చేపట్టింది.
కారణం ఇదే..
వీసా అపాయింట్‌మెంట్ల షెడ్యూలింగ్‌లో అవకతవకలపై యూస్ ఎంబసీ దృష్టి పెట్టింది. అందులో భాగంగా "బ్యాడ్ యాక్టర్స్" (అక్రమార్కలు) లేదా బాట్స్ (మెషీన్లు) ద్వారా అపాయింట్మెంట్ సిస్టమ్‌లో జరుగుతున్న ఉల్లంఘనల గుర్తించిన రాయబార కార్యాలయం ఆయా ఖాతాలను సస్పెండ్ చేసింది. ఇలా చేసిన సుమారు 2,000 వీసా అపాయింట్మెంట్లను రద్దు చేసింది. తమ షెడ్యూలింగ్ విధానాలను ఉల్లంఘించే ఏజెంట్లు, ఫిక్సర్ల పట్ల కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరిస్తామని అమెరికా రాయబార కార్యాలయం ఎక్స్ లో పోస్ట్ చేసింది. తక్షణమే ఈ నియామకాలను రద్దు చేస్తున్నామని, అనుబంధ ఖాతాల షెడ్యూలింగ్ అధికారాలను నిలిపివేస్తున్నామని పేర్కొంది.
భారతీయులే ఎక్కువ
విద్య, ఉద్యోగం, పర్యాటకం.. ఇలా వివిధ పనుల కోసం యునైటెడ్ స్టేట్స్ లోకి ప్రవేశించే అతి ఎక్కువ మందిలో భారతీయులు ప్రముఖంగా ఉంటున్నారు. భారత్ లో అమెరికా వీసా దరఖాస్తులు గణనీయంగా బ్యాక్ లాగ్ లను ఎదుర్కొంటున్నాయి. ముఖ్యంగా బీ1, బీ2 దరఖాస్తుదారుల్లో జాప్యం ఎక్కువ ఉంటోంది. ఈ వీసాలు వ్యాపారం, పర్యాటకం కోసం ఉద్దేశించినవి. 2022-23లో దరఖాస్తు చేసుకున్నవారు 800 నుంచి 1000 రోజుల వరకు వేచి ఉండాల్సి వచ్చింది.
ఇలాంటి సుదీర్ఘ నిరీక్షణ సమయాన్ని ఎదుర్కోవడానికి, జర్మనీలోని ఫ్రాంక్ఫర్ట్, థాయ్ రాజధాని బ్యాంకాక్‌లో భారతీయ దరఖాస్తుదారులకు అమెరికా వీసా అపాయింట్‌మెంట్లను తెరిచింది. వీసా వెయిటింగ్ టైమ్ గురించి భారత ప్రభుత్వం ఎప్పకప్పుడు ఆందోళన వ్యక్తం చేస్తూ వస్తోంది. 2022లో అప్పటి అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌తో వీసా జాప్యంపై భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఆందోళన వ్యక్తం చేశారు. కోవిడ్-19 మహమ్మారి కారణంగానే ఈ పరిస్థితి తలెత్తిందని అప్పటి బైడెన్ ప్రభుత్వం పేర్కొంది. డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారానికి ఇటీవల జనవరిలో వాషింగ్టన్ వెళ్లిన జైశంకర్ కొత్త విదేశాంగ మంత్రి మార్కో రూబియోతో మరోసారి ఈ అంశాన్ని లేవనెత్తారు.