US Visa
-
ట్రంప్.. విద్యార్థుల జంప్!
సాక్షి, అమరావతి: అమెరికాలోని డల్లాస్‌లో చదువుకుంటున్న సురేష్‌ది పశ్చిమ గోదావరి జిల్లాలోని ఓ మారుమూల పల్లె. ఏటా రూ.40 లక్షలు ఖర్చవుతుండగా కొంత అప్పు చేసి, పార్ట్ టైం ఉద్యోగం (Part time job) చేస్తూ ఫీజులు కడుతున్నాడు. అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) విధించిన నిబంధనలు సురేష్ కు పిడుగుపాటులా మారాయి. యూనివర్సిటీల్లో చదువుకునే విద్యార్థులు పార్ట్ టైం జాబ్స్ చేస్తూ పట్టుబడితే వీసా రద్దు (Visa Cancel) చేస్తామని హెచ్చరించడంతో హతాశుడయ్యాడు. పార్ట్ టైం జాబ్ చేయకుండా చదువుకు అయ్యే ఖర్చులెలా సమకూర్చుకోవాలో తెలియక, మధ్యలో చదువు వదిలేసి స్వదేశానికి తిరిగి రాలేక తల పట్టుకుంటున్నాడు.కరిగిపోతున్న కల..అమెరికాలో ఉన్నత విద్య చదువుకోవడమనేది మన విద్యార్థుల కల. తమ పిల్లలను అప్పు చేసైనా సరే అమెరికా పంపాలని ఎంతో మంది తల్లిదండ్రులు ఆరాట పడుతుంటారు. సంపన్న కుటుంబాలు దీన్ని ప్రతిష్టాత్మకంగా భావిస్తుంటాయి. కానీ అక్కడికి వెళ్లిన తరువాత మన విద్యార్ధులు పడే అగచాట్లు సాధారణంగా బయటకు రావు. ఎవరికీ చెప్పుకోలేక మౌనంగా భరిస్తుంటారు. దూరపు కొండలు నునుపు అన్నట్లు అమెరికా చదువులు, ఉద్యోగాలు దూరం నుంచి చూసేవారికి అందంగానూ, గొప్పగానూ కనిపిస్తుంటాయి. ట్రంప్ రాకతో వాస్తవాలు బయటకు వస్తున్నాయి.ఇంటి అద్దెకూ చాలవు..ఓపెన్ డోర్స్ నివేదిక ప్రకారం.. అమెరికాలో ప్రస్తుతం దాదాపు 3 లక్షల మంది భారతీయ విద్యార్ధులు (Indian Students) ఉండగా వీరి సంఖ్య ఏటా 35 శాతం పెరుగుతోంది. చైనాను కూడా ఈ విషయంలో మనవాళ్లు వెనక్కు నెట్టేశారు. అయితే అమెరికా వెళ్లే విద్యార్థుల్లో అధిక శాతం అప్పులు చేసి విమానం ఎక్కుతున్నారు. ఆ అప్పులను తీర్చడం కోసం అమెరికాలో గ్యాస్ స్టేషన్లు, సూపర్ మార్కెట్లు, రెస్టారెంట్లు తదితర చోట్ల పార్ట్‌టైమ్ జాబ్స్ చేస్తుంటారు. వీరికి సగటున గంటకు 10 డాలర్ల వరకూ చెల్లిస్తారు. మాస్టర్ ఆఫ్ సైన్స్(ఎంఎస్) చేస్తున్న విద్యార్ధి వారానికి 20 గంటలు పాటు పని చేసేందుకు అవకాశం ఉంటుంది. ఈ లెక్కన నెలకు దాదాపు రూ.70 వేల వరకూ సంపాదిస్తాడు. దీన్ని ఇంటి అద్దె, కళాశాల ఫీజు, భోజనం, రవాణా ఖర్చులకు సరిపెట్టుకోవాలి. అమెరికాలో ప్రస్తుతం ఒక సింగిల్ బెడ్రూమ్ అద్దెకు తీసుకోవాలంటే 1,700 డాలర్లు అంటే దాదాపు రూ.1.46 లక్షలు చెల్లించాలి. మెయింటెనెన్స్ ఖర్చులు అదనం. ఒక విద్యార్ధి నెలంతా పార్ట్‌టైమ్ జాబ్ చేసినా ఇంటి అద్దె, ఇతర ఖర్చులు నెగ్గుకు రావడం కష్టం. అలాంటిది ఇప్పుడు అది కూడా సంపాదించడం కుదరదని అమెరికా ప్రభుత్వం ఖరాకండిగా చెబుతుండటంతో తీవ్ర నిరాశలో కూరుకుపోతున్నారు.బతుకు భారం.. పోనీ ఎలాగోలా ఇంటి దగ్గర్నుంచి అప్పులు చేసి డబ్బు తెప్పించి చదువుకుని ఉద్యోగం తెచ్చుకున్నా వచ్చే జీతంలో ప్రతి రూ.100కి ప్రభుత్వానికి రూ.30 పన్ను కింద చెల్లించాలి. ఆ మిగిలిన దానిలోనే అన్ని ఖర్చులూ భరించాలి. అలా అయినా ఎలాగోలా గడుపుదామంటే గ్రీన్ కార్డ్ రావడం పెద్ద ప్రహసనం. మన దేశానికి ఏటా 7 వేల గ్రీన్ కార్డులు (అమెరికా పౌరసత్వం) మాత్రమే ఇస్తుండగా పోటీపడుతున్న వారు లక్షల్లో ఉన్నారు.2012లో గ్రీన్ కార్డు కోసం దరఖాస్తు చేసిన వారికి ఇప్పుడు ఇస్తున్నారంటే ఇక ఇప్పుడు దరఖాస్తు చేసుకునే వారికి రావాలంటే కనీసం 40 ఏళ్లు పడుతుంది. అప్పటి వరకూ అదనపు ట్యాక్స్‌లు కడుతూ.. హెచ్1 వీసాపై బిక్కుబిక్కుమంటూ జీవించాలి. చదవండి: అన్నంత పనీ చేసిన డొనాల్డ్ ట్రంప్!ఇంత కష్టం ఉన్నప్పటికీ అమెరికాలో చదువుకోవాలనే ఆశతో వెళుతున్న వారికి ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ (ఐసీఈ) షాక్ ఇస్తోంది. ట్రంప్ అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే దాదాపు 18 వేల మందికి పైగా పార్ట్‌టైమ్ జాబ్ చేస్తున్న వారిని గుర్తించి ‘ఐస్’ టీమ్ అదుపులోకి తీసుకుంది. దీంతో భారతీయ విద్యార్ధులు అమెరికాలో పార్ట్‌టైమ్ జాబ్స్‌ను వదులుకుంటున్నారు. దండిగా డబ్బులుంటేనే రండి.. అమెరికాలో చదువుకోవాలనుకుంటే ముందుగా అంత ఆర్థ్ధిక స్తోమత ఉందో లేదో చూసుకోవాలి. ఏదో అప్పు చేసి కొంత డబ్బు సమకూర్చుకుని ఇక్కడికి రావడం సరైన విధానం కాదు. అమెరికాలో ప్రస్తుతం పార్ట్‌టైమ్ జాబ్స్ చేయడానికి ప్రభుత్వం అంగీకరించడం లేదు.కాబట్టి చదువుకుంటూ సంపాదించడం ఇక కుదరకపోవచ్చు. జాబ్ వచ్చినా ఇక్కడ ఖర్చులతో పోల్చితే సంపాదించేది ఏమాత్రం సరిపోదు. అమెరికాకు రావాలనుకునే విద్యార్ధులు, వారి తల్లిదండ్రులు ఈ విషయాలను గమనించి నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది’’ – మణితేజ, డాలస్, అమెరికా -
వీసా కష్టం.. పైసా నష్టం..
సాక్షి, హైదరాబాద్: ఉన్నత విద్యార్జన, ఉజ్వల భవిష్యత్తు కోసం, ఇతర కారణాలతో విదేశాలకు వెళ్లేవారు ఇటీవలి కాలంలో బాగా పెరిగిపోగా.. మరోవైపు వీసా తిరస్కరణ (Visa Reject) బాధితుల సంఖ్యా ఎక్కువగానే పెరుగుతోంది. తెలుగు రాష్ట్రాలకు చెందిన వారి వీసాలూ అధిక సంఖ్యలోనే తిరస్కరణకు గురవుతున్నాయి. దేశవ్యాప్తంగా వీసాల తిరస్కరణ కారణంగా గత ఏడాదిలో నష్టపోయిన మొత్తం రూ.660 కోట్ల పైమాటేనని నిపుణులు అంచనా వేస్తున్నారు. పర్యాటకులను స్వాగతించే దేశంగా పేరున్న యూఏఈ వీసాలు పొందడంలో సైతం ఎదుర్కొన్న ఇబ్బందులను చాలామంది గత ఏడాది చివరిలో సోషల్ మీడియా (Social Media) వేదికగా పంచుకున్నారు.జనవరి నుంచి అక్టోబర్ 2024 మధ్యకాలంలో 24.8% మంది భారతీయలు (Indians) యూఏఈని సందర్శించారు. భారతీయ పర్యాటకులకు అత్యంత ప్రసిద్ధ గమ్యస్థానాలలో ఒకటిగా యూఏఈ (UAE) ఉంది. అయితే కొంతకాలం క్రితం దుబాయ్ ఇమ్మిగేషన్ విభాగం ప్రవేశపెట్టిన కఠినమైన నిబంధనల కారణంగా భారీ స్థాయిలో వీసాలు తిరస్కరణలకు గురయ్యాయి. కోవిడ్ అనంతరం ఇతర అనేక దేశాలు కూడా తమ వీసా నిబంధనలను సవరించాయి. ఈ నేపథ్యంలో వీసాల తిరస్కరణ కారణంగా గత ఏడాది భారతీయులు రూ.664 కోట్లను నష్టపోయారని గణాంకాలు చెబుతున్నాయి. తిలా పాపం తలా పిడికెడువీసా నిబంధనలు కఠినతరం చేసిన దేశాలలో యూఏఈతో పాటు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, యూకే ప్రధానంగా ఉన్నాయి. గత ఏడాది న్యూజిలాండ్ 32.5 శాతం భారతీయ వీసా (Indian Visa) దరఖాస్తులను తిరస్కరించింది, ఆస్ట్రేలియా 29.3 శాతం, యూకే 17 శాతం మందిని తిరస్కరించాయి. స్కెంజెన్ ఏరియా (యూరప్) 15.7 శాతం వీసాల్ని తిరస్కరించింది. యూఏఈ భారతీయ వీసాల తిరస్కరణ రేటు గత ఏడాది 6 శాతానికి చేరుకుంది. అయితే 2019లో వీసా ఆమోదం రేట్లతో పోల్చనప్పుడు. 2024లో భారతీయుల కోసం అధిక శాతం వీసాలను ఆమోదించిన దేశంగా అమెరికా నిలిచింది. 2019లో 28 శాతం భారతీయ వీసా దరఖాస్తులను యూఎస్ తిరస్కరించగా, 2024లోకి వచ్చేసరికి ఇది 16 శాతానికి తగ్గింది. అయితే అమెరికా వెళ్లేందుకు మనవారి వీసా దరఖాస్తుల సంఖ్య పరంగా చూస్తే ఈ 16 శాతం కూడా ఎక్కువేనని నిపుణులు చెబుతున్నారు. కోవిడ్ తర్వాత కఠినంగా..ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, యూకే, యూఏఈ వంటి దేశాలు వీసా నిబంధనలను కఠినతరం చేయడం అనేది..కరోనా మహమ్మారి అనంతరం ప్రపంచ వ్యాప్తంగా పెరిగిన వీసా దరఖాస్తుల సూక్ష్మస్థాయి పరిశీలన, ఎంపిక ధోరణిని ప్రతిబింబిస్తోంది. వీసాల తిరస్కరణ రేటు పెరుగుదల భారతీయ ప్రయాణీకులను ఆందోళనకు గురిచేస్తోంది. దరఖాస్తుదారులు.. తమకు సంబంధించిన అన్ని డాక్యుమెంట్లు సరిగ్గానే ఉన్నాయని, తమ దరఖాస్తులు పూర్తి దోష రహితంగా ఉన్నాయని నిర్ధారించుకోవాల్సిన ఆవశ్యకతను ఈ పరిస్థితి స్పష్టం చేస్తోంది.సర్వ సాధారణంగా మారిన తిరస్కరణలు‘ఎంఫార్మ్ కోసం అమెరికా వీసాకు దరఖాస్తు చేస్తే రెండుసార్లు తిరస్కరణకు గురైంది. మరోసారి అప్లయ్ చేయబోతున్నా. ఇప్పటివరకు రూ.42 వేలు ఖర్చయ్యింది. నా స్నేహితుడు ఒకరికి 10 సార్లు వీసా నిరాకరించారు..’అని పంజాగుట్ట నివాసి ప్రవీణ్ చెప్పాడు. ఇక రెండుసార్లు, మూడుసార్లు వీసా తిరస్కరణలకు గురి కావడమనేది సర్వసాధారణంగా మారుతోంది. యూకేకి రూ.12 వేలు మొదలుకుని రూ.లక్ష పైగా వీసా దరఖాస్తు ఫీజులు ఉన్నాయి. అలాగే ఆ్రస్టేలియాకు రూ.4 వేల నుంచి రూ.60 వేలు వరకూ, న్యూజిలాండ్‌కు రూ.11 వేల నుంచి రూ.1.15లక్షల వరకూ, యూఏఈకి రూ.8 వేల నుంచి రూ.35 వేలు ఆపైన ఉన్నాయి.చదవండి: ఆర్జీకర్ ఘటన అందుకే ‘అరుదైన కేసు’ కాలేకపోయింది!అమెరికాకు రూ.20 వేల వరకూ వీసా ఫీజులు ఉన్నాయి. అయితే వెళ్లే కారణాన్ని బట్టి, వీసా పొందడానికి ఎంచుకున్న విధానాన్ని బట్టి ఈ ఫీజులు ఇంతకంటే పెరగవచ్చు కూడా. ‘మా అబ్బాయి అమెరికా వీసాకి మొదటిసారి రూ.70 వేల దాకా పెట్టిన ఖర్చు వృథా అయ్యింది. రెండవసారి దాదాపు అంతే ఖర్చు పెట్టి వీసా తెచ్చుకున్నాం..’ అని మల్కాజిగిరికి చెందిన లక్ష్మి చెప్పారు. మొత్తంగా చూస్తే వీసా తిరస్కరణల కారణంగా పెద్ద మొత్తంలోనే నష్టం జరుగుతోందనేది నిర్వివాదాంశం. ఈ నేపథ్యంలో వీసా నిబంధనలపై సంపూర్ణ అవగాహన పెంచుకోవాలని, డాక్యుమెంట్లన్నీ పూర్తి కచ్చితత్వంతో ఉండేలా చూసుకున్న తర్వాతే దరఖాస్తు చేయడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. -
యూఎస్ వీసా నిబంధనల్లో భారీ మార్పులు! కొత్తేడాది నుంచి అమల్లోకి..
చదువుకోవడానికి లేదా ఉద్యోగం చేయడానికి అమెరికా వెళ్లే వ్యక్తులు కొత్త వీసా నిబంధనల గురించి తప్పకుండా తెలుసుకోవాలి. 2025 జనవరి 1 నుంచి భారతదేశంలోని యూఎస్ ఎంబసీలో.. వీసా అపాయింట్మెంట్ల కోసం ఎక్కువ కాలం వేచి ఉండాల్సిన సమయాన్ని తగ్గించడానికి అనేక మార్పులు చేయనున్నారు. అంతే కాకుండా యూఎస్ 'డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ' కూడా హెచ్-1బీ వీసా ప్రోగ్రామ్‌లో పెద్ద మార్పును తీసుకురానున్నట్లు సమాచారం. త్వరలో జరగనున్న మార్పులు వీసా ప్రక్రియను సులభతరం చేయడమే కాకుండా.. వేగవతం చేస్తాయి. కొత్త నిబంధనల ప్రకారం ఇప్పుడు ఎటువంటి అదనపు రుసుము చెల్లించకుండా అపాయింట్‌మెంట్‌ని ఒకసారి రీషెడ్యూల్ చేయవచ్చు. అయితే మీరు రెండోసారి రీషెడ్యూల్ చేసినా లేదా అపాయింట్‌మెంట్‌ని మిస్ చేసినా.. మీకు మళ్ళీ కొత్త అపాయింట్మెంట్ అవసరం. దీనికోసం మీరు మళ్ళీ సుమారు రూ. 15,730 నాన్ రిఫండబుల్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.రెండోసారి రీషెడ్యూల్ చేసిన సమయానికి వెళ్తే మళ్ళీ డబ్బు చెల్లించాల్సిన అవసరం ఉండదు. కాబట్టి అపాయింట్మెంట్ రోజున మీరు తప్పకుండా సమయానికి చేరుకోవాలి. అప్పుడే వీసా ప్రక్రియ సజావుగా కొనసాగుతుంది. ఎవరికి ఎటువంటి ఇబ్బంది ఉండదని యూఎస్ ఎంబసీ తెలిపింది.హెచ్-1బీ వీసా నిబంధనలలో మార్పులుయూఎస్ హెచ్-1బీ వీసాను చాలామంది దుర్వినియోగం చేస్తున్న కారణంగా.. దీనిని నిరోధించడానికి కొన్ని మార్పులు చేశారు. కొత్త నిబంధనల ప్రకారం, ఇకపై నిపుణులు మాత్రమే ఈ వీసాను పొందవచ్చు.2025 జనవరి 17 నుంచి హెచ్-1బీ వీసా కోసం దరఖాస్తు చేసుకునే దరఖాస్తుదారులు తమ విద్యార్హత నేరుగా వారు దరఖాస్తు చేస్తున్న ఉద్యోగానికి సంబంధించినదని నిరూపించుకోవాలి. ఈ నిబంధన ప్రకారం.. ఎలాంటి స్పెషలైజేషన్ లేని వారు హెచ్-1బీ వీసా పొందడం కష్టం.సింపుల్‌గా చెప్పాలంటే, ఐటీ ఫీల్డ్ ఉద్యోగాల కోసం.. మీరు కంప్యూటర్ సైన్స్ లేదా ఇంజనీరింగ్‌లో డిగ్రీని కలిగి ఉంటే మాత్రమే మీకు హెచ్-1బీ వీసా లభిస్తుంది. అంతే కాకుండా.. ఇప్పుడు హెచ్-1బీ వీసా పొడిగింపు ప్రక్రియ కూడా సులభతరం కానుంది. ఇమ్మిగ్రేషన్ అధికారులు మునుపటి ఆమోదాల ఆధారంగా పొడిగింపు అభ్యర్థనను ప్రాసెస్ చేయనున్నారు. ఇలా చేయడం వల్ల పేపర్ వర్క్ తగ్గడం మాత్రమే కాకుండా.. నిర్ణయాలు త్వరగా వచ్చేస్తాయి. కంపెనీలు కూడా హెచ్-1బీ ప్రోగ్రామ్ నిబంధనలను అనుసరిస్తున్నాయా లేదా అనేది కూడా ఖచ్చితంగా తనిఖీ చేయడం జరుగుతుంది.ఇంటర్వ్యూ మినహాయింపులో మార్పులుఇంటర్వ్యూ మినహాయింపులో కూడా కొన్ని మార్పులు చోటు చేసుకున్నాయి. గతంలో యూఎస్ వీసా కోసం అప్లై చేసుకున్న వ్యక్తి ఇకపై ఇంటర్వ్యూ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కొత్త అప్లికేషన్లను ప్రాసెస్ చేయడానికి పాత రికార్డులు ఉపయోగించనున్నారు. ఈ రూల్ తరచుగా యూఎస్ వెళ్లాలనుకునే వారికి ప్రయోజనం చేకూర్చుతుంది.ఇదీ చదవండి: ఐటీ ఫ్రెషర్లకు గుడ్‌న్యూస్.. ఏకంగా 40000 ఉద్యోగాలుమార్పులు ఎందుకంటే?హెచ్-1బీ వీసా ప్రోగ్రామ్‌లో చేసిన ఈ మార్పులు.. టెక్ పరిశ్రమతో సహా కీలక పరిశ్రమల అవసరాలను తీర్చడానికి యూఎస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని చూపిస్తుంది. సిలికాన్ వ్యాలీ.. ఇతర యూఎస్ టెక్ హబ్‌లకు నైపుణ్యం కలిగిన కార్మికులకు భారతదేశం ప్రధాన వనరు. కాబట్టి.. ఈ మార్పులు బ్యాక్‌లాగ్‌ను తగ్గించడానికి మాత్రమే కాకుండా, ఐటీ వంటి అధిక డిమాండ్ ఉన్న రంగాల అవసరాలను తీర్చడానికి ఉపయోగపడుతాయి. -
హెచ్1బీ వీసా రెన్యువల్ కోసం తిప్పలు!
అగ్రరాజ్యం అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్న మనోళ్లకు కొత్త కష్టాలు వచ్చిపడ్డాయి. అంటే అందరికీ కాదులెండి కొంత మందికి మాత్రమే. అమెరికా అనగానే అందరికీ ముందుగా గుర్తుకొచ్చేది వీసా. ఇది లేకపోతే అక్కడికి వెళ్లడం కుదరని అందరికీ తెలుసు. యూఎస్ వీసా రావాలంటే ఎంత కష్టపడాలో తెలుకోవాలంటే.. అది దక్కించుకున్న వారిని అడిగితే ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. యూఎస్ వీసా దక్కించుకోవడానికే కాదు.. రెన్యువల్ కూడా కష్టపడాల్సి వస్తోందట. ఈ విషయాన్ని ఓ ఎన్నారై సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. వీసా రెన్యువల్ కష్టాలను పీడకలగా పేర్కొంటూ ‘రెడిట్’లో తన వ్యథను వ్యక్తపరిచాడు.హెచ్1బీ వీసా రెన్యువల్ (H1B visa renewal) కోసం ముప్పు తిప్పలు పడుతున్నట్టు అమెరికాలోని భారత పౌరుడొకరు వాపోయాడు. తనలాగే ఎవరైనా ఉంటే బాధలు పంచుకోవాలని కోరాడు. ‘నెల రోజుల నుంచి హెచ్1బీ డ్రాప్‌బాక్స్ వీసా స్లాట్ల కోసం వెతుకుతున్నాను. నవంబర్‌లోపు స్టాంప్ వేయించుకోవడానికి ఇండియాకు వెళ్లాలి. కానీ డ్రాప్‌బాక్స్ వీసా స్లాట్ దొరికేట్టు కనబడడం లేదు. ఈ పరిస్థితి నన్ను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. వీసా రెన్యువల్ స్లాట్ కోసం ఆశగా ఎదురుచూస్తున్నాను. నాలాగే ఎవరైనా ఉన్నారా? మనం ఇప్పుడు ఏం చేయాల’ని తన గోడు వెళ్లబోసుకున్నాడు.తాము కూడా వీసా రెన్యువల్ కోసం చకోర పక్షుల్లా ఎదురుచూస్తున్నామంటూ పలువురు ఎన్నారైలు స్పందించారు. ‘నేను కూడా ఇదే సమస్య ఎదుర్కొంటున్నాను. నవంబర్ లేదా డిసెంబర్ స్లాట్ల కోసం వెతుకుతున్నా.. కానీ ఇప్పటివరకు విడుదల కాలేదు. నేను ఎలాగైనా ఇండియా వెళ్లాలి. డ్రాప్‌బాక్స్ వీసా స్లాట్స్ త్వరలో విడుదలవుతాయని ఆశిస్తున్నాన’ని ఒకరు తెలిపారు. ‘వీసా రెన్యువల్ కోసం వేలాది మంది ఆగస్ట్ నుంచి ఎదురు చూస్తున్నారు. నవంబర్, డిసెంబర్ స్లాట్లను జూలైలో తెరిచారు. మరికొన్ని స్లాట్ కూడా త్వరలో విడుదలవుతాయి. కానీ స్లాట్లు దొరకడం కష్టమ’ని మరొకరు పేర్కొన్నారు. డ్రాప్‌బాక్స్ వీసా స్లాట్స్ గ్యారంటీ లేకపోవడంతో తమ ప్రయాణాలను ప్లాన్ చేసుకోలేకపోతున్నామని ఇంకొరు వాపోయారు.డ్రాప్‌బాక్స్ స్కీమ్ అంటే?డ్రాప్‌బాక్స్ స్కీమ్ ప్రకారం దరఖాస్తుదారులు వ్యక్తిగత ఇంటర్వ్యూకి హాజరుకాకుండా వీసా పునరుద్ధరణ కోసం అప్లయ్ చేసుకోవచ్చు. భారత పౌరులు సమర్పించిన పత్రాలను చెన్నైలోని యూఎస్ కాన్సులేట్ ప్రాసెస్ చేస్తుంది. రెన్యువల్ కోసం దరఖాస్తుదారులు తమ పత్రాలను భారతదేశంలోని వీసా కేంద్రాలలో ఎక్కడైనా సమర్పించేందుకు వీలుంది. అమెరికాలో పనిచేస్తున్న హెచ్1బీ వీసా వినియోగదారులు తమ డ్రాప్‌బాక్స్ అపాయింట్మెంట్ల కోసం ఇండియాకు తిరిగి వెళ్లాల్సి ఉంటుంది. యూఎస్ కాన్సులేట్ కేవలం 2 రోజుల ముందు స్లాట్లు విడుదల చేస్తోంది. దీంతో అమెరికా నుంచి ఇండియా రావడానికి హెచ్1బీ వీసా వినియోగదారులు కష్టపడాల్సి వస్తోంది. H1B Dropbox Visa Slots for India are a Nightmare!byu/AccomplishedPolicy94 inusvisaschedulingచదవండి: హిట్లర్‌ను ప్రస్తావించిన ట్రంప్.. కమలా హారీస్‌కు బిగ్ బూస్ట్ -
అరుణ్ యోగిరాజ్‌కు చేదు అనుభవం.. వీసాపై అమెరికా ట్విస్ట్!
బెంగళూరు: యూపీలోని అయోధ్య రామాలయంలో బాలరాముడి విగ్రహాన్ని చెక్కిన ప్రముఖ శిల్పి అరుణ్ యోగిరాజ్‌కు చేదు అనుభవం ఎదురైంది. అరుణ్ సహా అతడి కుటుంబ సభ్యులకు అమెరికా వీసాను నిరాకరించింది. దీంతో, ఆయన అమెరికా పర్యటన రద్దు అయ్యినట్టు తెలుస్తోంది.కాగా, వర్జీనియాలోని రిచ్మండ్లో ఆగస్ట్ 30 నుంచి సెప్టెంబర్ ఒకటో తేదీ వరకు ప్రపంచ కన్నడ కాన్ఫరెన్స్-2024 కార్యక్రమం జరుగనుంది. ఈ కార్యక్రమానికి కర్ణాటకకు చెందిన ప్రసిద్ధ శిల్పి అరుణ్ యోగిరాజ్‌ను ఆహ్వానించారు. దీంతో, అరుణ్ తన కుటుంబ సభ్యులతో కలిసి అమెరికా వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో అమెరికా వీసా కోసం రెండు నెలల కిందట అరుణ్ దరఖాస్తు చేసుకున్నారు. అయితే, తాజాగా ఆగస్టు పదో తేదీన అరుణ్ యోగిరాజ్ వీసాను తిరస్కరించినట్లు అమెరికా రాయబార కార్యాలయం తెలిపింది. కాగా, వీసా నిరాకరణకు మాత్రం ఎలాంటి కారణాలను వెల్లడించలేదు.ఈ నేపథ్యంలో వీసా తిరస్కరణ విషయం తెలుసుకున్న అరుణ్, అతడి కుటుంబ సభ్యులు షాక్ అయ్యారు. కార్యక్రమంలో పాల్గొనే అవకాశం లేకపోవడంపై నిరాశ చెందారు. ఇక, వీసా నిరాకరణపై తాజాగా అరుణ్ స్పందిస్తూ.. వీసా ఎందుకు తిరస్కరించారో నాకు తెలియదు. కానీ, మేము మాత్రం వీసాకు సంబంధించిన అన్ని పత్రాలను సమర్చించాము అంటూ కామెంట్స్ చేశారు. BREAKING NEWS 🚨 US refuses visa to Ayodhya Ram Lalla sculptor Arun Yogiraj.US Embassy hasn't given any reason so far as to why it rejected the application.Yogiraj had applied to visit an event by the Association of Kannada Kootas of America, World Kannada Conference-2024. pic.twitter.com/0EWLTqEoJQ— Satyaagrah (@satyaagrahindia) August 14, 2024 -
అమెరికా వెళ్లేవారికి అలర్ట్: కొత్త ఫీజులు రేపటి నుంచే..
అమెరికా వెళ్లాలనుకుని వీసా ప్రయత్నాల్లో ఉన్నవారికి షాకింగ్ వార్త ఇది. ఏప్రిల్ 1 నుంచి వలసేతర అమెరికన్ వీసా కోసం వసూలు చేసే ఫీజులో భారీ పెరుగుదల ఉండబోతోంది. వీసా ఫీజు ఒకేసారి దాదాపు మూడు రెట్లు పెరగనుంది. ఈ పెంపు హెచ్-1బీ (H-1B), ఎల్-1 (L-1), ఈబీ-5 (EB-5) వీసాలకు వర్తిస్తుంది. 8 ఏళ్ల తర్వాత పెంపు అమెరికాలో నివసించడానికి వచ్చే భారతీయులు ఎక్కువగా హెచ్-1బీ, ఎల్-1, ఈబీ-5 వీసాలు తీసుకుంటారు. దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత ఈ ఫీజుల పెంపుదల జరుగుతోంది. గతంలో 2016లో ఫీజులు పెంచారు. వీసాల పెంపుదల తర్వాత ఏప్రిల్ 1 నుంచి కొత్త ఛార్జీలు వర్తిస్తాయని ఇప్పటికే జారీ చేసిన నోటిఫికేషన్లో యునైటెడ్ స్టేట్స్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్సీఐఎస్) పేర్కొంది. వీసా కొత్త ఫీజులు ఇలా.. కొత్త హెచ్1బీ వీసా కోసం దరఖాస్తు చేయాలనుకుంటే, దీని కోసం ఫారమ్ I-129 ఉంటుంది. దీని రుసుము 460 డాలర్లు నుండి 780 డాలర్లకు పెరగనుంది. ఇండియన్ కరెన్సీలో చెప్పాలంటే రూ.38,000 నుంచి రూ.64,000కు పైగా పెరుగుతుంది. ఇది కాకుండా హెచ్1బీ రిజిస్ట్రేషన్ ఫీజు 10 డాలర్లు(రూ. 829) నుంచి 215 డాలర్లు (సుమారు రూ. 17,000) పెరుగుతుంది. ఇక ఎల్-1 వీసా రుసుము ఏప్రిల్ 1 నుంచి మూడు రెట్లు పెరగనుంది. ప్రస్తుతానికి ఇది 460 డాలర్లు (సుమారు రూ. 38,000) ఉంది. ఇది ఏప్రిల్ 1 నుండి 1385 డాలర్లకు (రూ. 1,10,000) పెరుగుతుందని అంచనా. ఎల్-1 అమెరికాలో నాన్-ఇమ్మిగ్రెంట్ వీసా కేటగిరీ కింద వస్తుంది. కంపెనీలో పనిచేసే ఉద్యోగుల బదిలీ కోసం దీన్ని రూపొందించారు. అలాగే ఈబీ-5 వీసా ఫీజులు కూడా మూడు రెట్లు పెరుగుతాయని భావిస్తున్నారు. ఇది ప్రస్తుతం 3675 డాలర్లు (దాదాపు రూ. 3 లక్షలు) ఉండగా 11160 డాలర్లకు (దాదాపు రూ.9 లక్షలు) పెరగవచ్చని అంచనా. ఈబీ-5 వీసాను 1990లో యూఎస్ ప్రభుత్వం ప్రారంభించింది. దీని కింద అధిక ఆదాయ విదేశీ పెట్టుబడిదారులు అమెరికన్ వ్యాపారాలలో కనీసం 5 లక్షల డాలర్ల పెట్టుబడి పెట్టడం ద్వారా వారి కుటుంబాలకు వీసాలు పొందవచ్చు. కనీసం 10 మంది అమెరికన్లు ఉద్యోగాలు పొందగలిగేలా ఈ వ్యాపారం ఉండాలి. -
అమెరికా ప్రయాణం.. తప్పని వీసా ఇంటర్వ్యూ కష్టాలు
అమెరికాలో చదవాలనుకునే విద్యార్థులకు కష్టాలు తప్పడంలేదు. అందులో ప్రధానంగా వీసాకోసం దరఖాస్తు చేసుకున్న వారిని ఇంటర్వ్యూలకు పిలవకుండా కాలం వెళ్లదీస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. అమెరికాలో ఉన్నత విద్యాభ్యాసం చేయాలనుకునే విద్యార్థులకు వీసా(ఎఫ్1) ఇంటర్వ్యూ స్లాట్ల కోసం ఎదురుచూపులు తప్పట్లేదు. సాధారణంగా ఫాల్ సీజను ఆగస్టు నెల మధ్యలో ప్రారంభమవుతుంది. అందుకోసం మార్చి నెల నుంచి దశల వారీగా వీసా తేదీలు విడుదలవుతాయి. ఈసారి మార్చి నెల ముగుస్తున్నా ఇప్పటి వరకు విడుదల చేయకపోవటం చర్చనీయాంశంగా మారింది. విద్యా సంవత్సరం ప్రారంభానికి 60 రోజుల ముందుగా మాత్రమే ఇంటర్వ్యూ తేదీలు అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. అందుకు తక్కువ సమయం ఉండగా స్లాట్లు విడుదల చేస్తే ఇబ్బందులు తప్పవనే విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారు. రెండు దఫాలే స్లాట్లు జారీ.. గతంలో వీసా స్లాట్లు అందుబాటులో ఉంటే మూడు దఫాల వరకు ఇంటర్వ్యూకు హాజరు అయ్యేందుకు అవకాశం ఉండేది. ఇక నుంచి రెండుసార్లకు పరిమితం చేయాలని అమెరికా ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. జూన్, జులై నెలల్లో విడుదల చేసే స్లాట్లలో వీసా రాకపోతే పరిస్థితి ఏమిటని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఆగస్టు రెండో వారం తరవాత నుంచి తరగతులు ప్రారంభం అవుతాయి. ఇదీ చదవండి: హైదరాబాద్‌లో ఇళ్లు అ‘ధర’హో.. -
భారతీయులకు మరో శుభవార్త.. యూఎస్ వీసాల జారీలో సరికొత్త రికార్డులు!
భారత్‌లో యూఎస్ వీసాల జారీలో సరికొత్త రికార్డులు నమోదయ్యాయి. 2022తో పోలిస్తే 2023లో వీసాల మంజూరు 60 శాతం పెరిగాయి. బీ1, బీ2 విజిటింగ్ వీసాల కింద దాదాపు 7లక్షల వీసాలు జారీ చేయగా.. లక్షా 40 వేల స్టూడెంట్ వీసాలు జారీ చేసింది అమెరికన్ ఎంబసీ. ఫలితంగా విజిటర్ వీసా అపాయింట్మెంట్ కోసం నిరీక్షించే సమయం 75 శాతం తగ్గింది. గత ఏడాది ఏకంగా 1.4 మిలియన్ యూఎస్ వీసాల్ని అందించింది. ఈ ఏడాది హెచ్1బీ వీసాల మంజూరును పరిశీలిస్తామని యూఎస్ ఎంబసీ ప్రకటన చేసింది. ఈ సందర్భంగా ప్రపంచంలోని ప్రతి 10 వీసాల్లో ఒకరిది భారతీయులదేనని తెలిపింది. నిరీక్షణ సమయం తగ్గింది ప్రాసెస్ మెరుగుదల,పెట్టుబడుల కారణంగా విజిటింగ్ వీసాల కోసం అపాయింట్మెంట్ నిరీక్షణ సమయాన్ని సగటున 1,000 రోజుల నుండి 250 రోజులకు తగ్గించాయి. దీంతో విజిటింగ్ వీసాలు (B1/B2) యూఎస్ ఎంబసీ చరిత్రలో రెండవ సారి 7లక్షల కంటే అత్యధిక సంఖ్యలో దరఖాస్తు చేసుకున్నట్లు ఎంబసీ అధికారులు తెలిపారు. విదేశీ విద్యార్ధుల్లో భారతీయులే అధికం భారత్‌లోని యుఎస్ కాన్సులర్ బృందం 2023లో 1,40,000 స్టూడెంట్ వీసాలను జారీ చేసింది. ఈ మంజూరు ప్రపంచంలోని ఇతర దేశాల కంటే భారీ మొత్తంలో భారతీయులకు మంజూరు చేసి వరుసగా మూడవ సంవత్సరం రికార్డు సృష్టించింది.తద్వారా అమెరికాలోని అంతర్జాతీయ గ్రాడ్యుయేట్ విద్యార్థులలో భారతీయ విద్యార్థులే ఎక్కువమంది ఉన్నారు. యునైటెడ్ స్టేట్స్లో చదువుతున్న ఒక మిలియన్ విదేశీ విద్యార్థులలో నాలుగో వంతు కంటే ఎక్కువ మంది భారతీయులు ఉన్నారు. హెచ్1బీ వీసా దారలు సైతం 2023లో భారతీయులు, వారి కుటుంబ సభ్యుల కోసం 3,80,000 ఉద్యోగ వీసాలకు ప్రాసెసింగ్ చేయాల్సి వచ్చింది. యూఎస్ మిషన్‌కు కనీస అపాయింట్మెంట్ వెయిట్ టైమ్‌ని తగ్గించేందుకు వీలుగా కాన్సులర్ బృందం భారత్‌లోని చెన్నై, హైదరాబాద్‌లలో పిటిషన్ ఆధారిత వీసా ప్రాసెసింగ్ చేసే అవకాశాన్ని కల్పించింది. మరోవైపు ఈ సంవత్సరం పైలట్ ప్రోగ్రామ్ అర్హతగల హెచ్1 బీ హోల్డర్లను యునైటెడ్ స్టేట్స్లో వారి వీసాలను పునరుద్ధరించేందుకు సిద్ధమైంది. ఈ ప్రక్రియను మరింత వేగవంతం చేయనుంది. భారతీయులకు శుభవార్త మహమ్మారి కారణంగా ఆలస్యం అయిన 31,000 ఇమ్మిగ్రెంట్ వీసా క్యూను యూఎస్ ముంబై కాన్సులేట్ జనరల్ తగ్గించేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా పెండింగ్‌లో ఉన్న ఇమ్మిగ్రెంట్ వీసా పిటిషన్‌ను కలిగి ఉన్నవారు, షెడ్యూలింగ్ కోసం సిద్ధంగా ఉన్న అభ్యర్ధులు ఇప్పుడు స్టాండర్డ్, ప్రీ-పాండమిక్ అపాయింట్మెంట్ విండోలో అపాయింట్మెంట్ పొందవచ్చని ఈ సందర్భంగా వీసా కోసం ఎదురు చూస్తున్నవారికి ఎంబసీ శుభవార్త చెప్పింది. -
స్టూడెంట్ వీసాకు అమెరికా కొత్త నిబంధనలు.. నేటి నుంచే అమలు
ఢిల్లీ: భారతీయ విద్యార్థుల కోసం వీసా దరఖాస్తు ప్రక్రియలో అమెరికా రాయబార కార్యాలయం సవరణలు చేసింది. ఈ మార్పులు సోమవారం (నవంబర్ 27) నుండి అమలులోకి వచ్చాయి. ఈ మార్పులు భారతీయ నగరాల్లోని అన్ని రాయబార కార్యాలయాలకు వర్తిస్తాయి. ఎఫ్, ఎమ్, జే వీసా ప్రోగ్రామ్‌ల క్రింద అమెరికాలో చదువుకోవాలనుకునే విద్యార్థులు ఈ మార్పులను గమనించాలని సూచించారు. అధికారిక వెబ్సైట్లో తమ ప్రొఫైల్ క్రియేషన్, వీసా అపాయింట్మెంట్ షెడ్యూల్ చేసుకునేటప్పుడు సొంత పాస్‌పోర్ట్ సమాచారాన్నే వినియోగించాలి. తప్పుడు పాస్‌పోర్ట్ నంబరు ఇస్తే.. ఆ దరఖాస్తులను వీసా అప్లికేషన్ సెంటర్ల వద్ద తిరస్కరిస్తారు. వారి అపాయింట్మెంట్లు రద్దు అవుతాయి. వీసా రుసుమును కూడా రద్దు చేస్తారు. ఎఫ్, ఎమ్ వీసాల కోసం దరఖాస్తు చేసుకునేవారు తప్పనిసరిగా స్టూడెండ్ అండ్ ఎక్స్ఛేంజ్ విజిటర్ ప్రోగ్రామ్ ధ్రువీకరించిన స్కూల్ లేదా ప్రోగ్రామ్‌లో తమ పేర్లను నమోదు చేసుకోవాలి. ఇక, జే వీసాల కోసం దరఖాస్తు చేసుకునేవారు అమెరికా విదేశాంగ శాఖ అనుమతి ఉన్న సంస్థ నుంచి స్పాన్సర్షిప్ అవసరం అవుతుంది. Attention Students! To prevent fraud and abuse of the appointment system, we are announcing the following policy change which will be implemented beginning November 27, 2023. All F, M, and J student visa applicants must use their own passport information when creating a profile… pic.twitter.com/2JqoEg3DJ1 — U.S. Embassy India (@USAndIndia) November 24, 2023 తప్పుడు పాస్‌పోర్ట్ నంబరుతో ప్రొఫైల్ క్రియేట్ చేసుకున్నవారు.. మళ్లీ సరైన నంబరుతో కొత్త ప్రొఫైల్‌ను క్రియేట్ చేసుకోవాలి. అప్పుడు అపాయింట్మెంట్ కోసం బుక్ చేసుకోవాలి. ఇందుకోసం మళ్లీ వీసా ఫీజులను చెల్లించాల్సి ఉంటుంది. పాత పాస్‌పోర్టు పోవడం లేదా చోరీకి గురైతే కొత్త పాస్‌పోర్ట్ తీసుకున్నవారు, కొత్తగా పాస్‌పోర్టును రెన్యూవల్ చేసుకున్నవారు.. పాత పాస్‌పోర్ట్‌కు సంబంధించిన ఫొటోకాపీ లేదా ఇతర డాక్యుమెంటేషన్లను అందించాలి. అప్పుడే వారి అపాయింట్మెంట్ను అంగీకరిస్తారు. ఇదీ చదవండి: అమెరికాలో భారత రాయబారిని అడ్డుకున్న ఖలిస్థానీ మద్దతుదారులు -
అమెరికా హెచ్1బీ వీసాతో కెనడాలో ఉద్యోగం
టొరొంటొ: అమెరికాలో హెచ్1బీ వీసా వినియోగదారులు ఇక కెనడాలో కూడా ఉద్యోగాలు చేసుకోవచ్చు. ఈ మేరకు కెనడా ప్రభుత్వం బంపర్ ఆఫర్ ప్రకటించింది. మొత్తం 10 వేల మంది ఉద్యోగాలు చేయడం కోసం ఓపెన్ వర్క్ పరి్మట్కు ఏర్పాట్లు చేస్తోంది. దీంతో అమెరికాలో భారతీయ టెక్కీలకు కూడా లబ్ధి చేకూరుతుంది. అమెరికాలో దిగ్గజ కంపెనీలు ఉద్యోగాల్లో కోత విధిస్తూ ఉండడంతో దానిని తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నాల్లో కెనడా ఉంది. అమెరికాలో ఉద్యోగాలు కోల్పోయిన నిపుణులైన టెక్కీలను ఆకర్షించి సాంకేతిక రంగంలో ప్రపంచంలో అగ్రగామిగా ఎదగాలని చూస్తోంది. ‘‘అమెరికాలో హెచ్1బీ వీసా కలిగి ఉన్న వారు 10 వేల మంది వరకు జూలై 16లోగా కెనడాకు రావడానికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక్కడే ఉద్యోగాలు చేయొచ్చు. వారి కుటుంబ సభ్యులు చదువుకోవడం, పని చేయడానికి కూడా అనుమతులిస్తాం’’ అని కెనడా వలసలు, పౌరసత్వ సేవల మంత్రి సియాన్ ఫ్రాజర్ చెప్పారు. తాము ఎన్నో లక్ష్యాలను ఏర్పాటు చేసుకున్నామని, దానికి తగ్గట్టుగానే ఇమ్మిగ్రేషన్ టెక్ టాలెంట్ స్ట్రాటజీని అనుసరిస్తున్నట్టుగా చెప్పారు. సాంకేతికంగా వైవిధ్యభరితమైన పురోగతి సాధించి టెక్ జెయింట్గా ఎదగాలన్నదే తమ లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమం కింద హెచ్1బీ వీసా వినియోగదారులకు మూడేళ్ల పాటు ఓపెన్ వర్క్ పరి్మట్ లభిస్తుంది. వారి జీవిత భాగస్వామి ఉద్యోగం లేదా చదువుకోవడం వంటివి చేయొచ్చు. అమెరికాలో భారత్, చైనాకు చెందిన వేలాది మంది టెక్కీలను టెక్ కంపెనీలు ప్రతీ ఏటా ఉద్యోగాల్లోకి తీసుకుంటాయి. ప్రస్తుతం అమెరికా మార్కెట్ సరిగా లేకపోవడంతో లేఆఫ్‌లు ఎక్కువగా ఉన్నాయి. గత ఏడాది నవంబర్ నుంచి దాదాపుగా 2 లక్షల మంది టెక్కీలు అమెరికాలో ఉద్యోగాలు కోల్పోయారు. ఇప్పుడు అలాంటి వారందరికీ కెనడాలో మంచి అవకాశాలు దొరికే చాన్స్ వచి్చంది. ఇది కూడా చదవండి: బార్లో ఉన్న అన్ని కాక్ టెయిల్స్ తాగేశాడు.. చివరికి.. -
భారతీయులకు శుభవార్త.. ఈ ఏడాది పది లక్షల అమెరికా వీసాలు
సాక్షి, హైదరాబాద్: అమెరికా వీసా కోసం ఎదురుచూస్తున్న భారతీయులకు ఓ శుభవార్త. ఈ ఏడాది దేశంలోని అమెరికా దౌత్య కార్యాలయంతోపాటు 4 కాన్సుల్ జనరల్ ఆఫీసుల ద్వారా పది లక్షల కంటే ఎక్కువ వీసాలు జారీ చేయనున్నట్లు హైదరాబాద్‌లోని అమెరికన్ కాన్సుల్ జనరల్ జెన్నిఫర్ లార్సన్ ప్రకటించారు. అలాగే, హైదరాబాద్ కాన్సుల్ జనరల్ కార్యాలయంలోనూ తగిన ఏర్పాట్లు చేసినట్లు ఆమె తెలిపారు. హైదరాబాద్ నానక్‌రామ్‌గూడలో ఇటీవల ప్రారంభించిన అమెరికన్ కాన్సుల్ జనరల్ కొత్త కార్యాలయంలో జెన్నిఫర్ లార్సన్ ఇతర అధికారులతో కలిసి బుధవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కోవిడ్ కారణంగా మందగించిన వీసాల జారీ ప్రక్రియను వేగవంతం చేసేందుకు తీసుకున్న చర్యల గురించి వివరించారు. విద్యార్థి వీసాల జారీకి ప్రాధాన్యమిస్తున్నామని, సకాలంలో వారు కోర్సుల్లో చేరేందుకు వీలుగా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. వీసాల జారీకి ఓవర్‌టైమ్: హైదరాబాద్ కార్యాలయంలో వీసా అధికారులను గణనీయంగా పెంచినట్లు కాన్సులర్ వ్యవహారాల చీఫ్ రెబెకా డ్రామే తెలిపారు. తాత్కాలిక కాన్సుల్ జనరల్ కార్యాలయం పైగా ప్యాలెస్‌లో ఉన్నప్పుడు ఒక్క రోజులో గరిష్టంగా 1,100 వీసాలు/ఇతర లావాదేవీలు ప్రాసెస్ చేసే సామర్థ్యం ఉండగా, కొత్త కార్యాలయంలో ఈ సామర్థ్యం 3,500 వరకూ ఉంటుందన్నారు. పైగా ప్యాలెస్ కార్యాలయంలో 16 కౌన్సిలర్ విండోస్ ఉండగా, కొత్త కార్యాలయంలో 54 ఉన్నాయని తెలిపారు. వీసాల్లో మార్పులు చేసుకునేందుకు ప్రస్తుతం ఉపయోగిస్తున్న డ్రాప్‌బాక్స్ సౌకర్యాన్ని కూడా మరింత విస్తృతం చేస్తున్నట్లు తెలిపారు. విద్యార్థి వీసాలపై మాట్లాడుతూ.. అమెరికాలో విద్యాభ్యాసానికి తొలిసారి దరఖాస్తు చేసుకున్న వారికి పాఠాలు మొదలయ్యే సమయానికి అక్కడ ఉండేలా చూసేందుకు ప్రయతి్నస్తామని వివరించారు. వీలైనంత ఎక్కువ సంఖ్యలో వీసాల జారీకి అధికారులతో ఓవర్‌టైమ్ చేయించేందుకూ ప్రయత్నిస్తున్నామని, ఇందుకు సంబంధించిన అనుమతులు లభించాయన్నారు. అలాగే వచ్చే వారం రెండు రోజులపాటు అదనపు వీసాల జారీకి చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. విద్యార్థులకు ఉచిత కౌన్సెలింగ్ అమెరికాలో విద్యనభ్యసించే విద్యార్థులు తగిన కోర్సు, విద్యాసంస్థలను ఎంచుకునేందుకు అమెరికన్ కాన్సుల్ జనరల్ కార్యాలయం సహాయ సహకారాలు అందిస్తోందని పబ్లిక్ అఫైర్స్ ఆఫీసర్ డేవిడ్ మోయర్ తెలిపారు. యూఎస్–ఇండియా ఎడ్యుకేషనల్ ఫౌండేషన్ ద్వారా ఉచిత కౌన్సెలింగ్ సేవలు అందిస్తున్నట్లు చెప్పారు. జూబ్లీహిల్స్‌లోని వై–యాక్సిస్ ఫౌండేషన్ కార్యాలయంలో ఎడ్యుకేషన్ యూ ఎస్ఏ ప్రోగ్రామ్‌లో భాగంగా ఈ కౌన్సెలింగ్ జరుగుతుందని, ఆసక్తి, అర్హతల ఆధారంగా అమెరికాలోని మొత్తం 4,500 విద్యాసంస్థల్లో తగిన దాన్ని ఎంచుకునేందుకు ఇది ఉపయోగపడుతుందని వివరించారు. ఈ సమావేశంలో మేనేజ్మెంట్ ఆఫీసర్ ఆడ్రీ మోయర్, పొలిటికల్ ఎకనమిక్ సెక్షన్ చీఫ్ సీన్ రూథ్ పాల్గొన్నారు. -
మరింత తొందరగా అమెరికన్ వీసా.. భారతీయులకు అధిక ప్రాధాన్యత!
వీసాల జారీలో భారతీయులకు అమెరికా ప్రథమ ప్రాధాన్యత ఇస్తోంది. కోవిడ్‌కు ముందు కంటే ఈ ఏడాది ఇప్పటి వరకు 36 శాతం అధికంగా భారతీయులకు వీసాలు జారీ చేసినట్లు అమెరికా తెలిపింది. కోవిడ్ తర్వాత భారతీయులకు మొదటి ప్రాధాన్యం ఇవ్వడంతో వారికి వీసాల కోసం వేచిచూసే సమయం చాలా తగ్గిపోయిందని పేర్కొంది. ముఖ్యంగా మొదటిసారి వచ్చే వారికి వీసా కోసం వేచిచూసే సమయం 1000 రోజుల నుంచి 580 రోజులకు తగ్గిపోయింది. తరచూ వచ్చే వారికి ఇంటర్వ్యూ ప్రక్రియను మినిహాయించడం, కాన్సులర్ విధుల్లో అదనపు సిబ్బందిని నియమించడం, సూపర్ సాటర్డే వంటి చర్యలు ఇందుకు మేలు చేశాయి. అంతేకాకుండా వచ్చే వేసవి నుంచి కొన్ని కేటగిరీల్లో స్టేట్‌సైడ్ వీసాల రెన్యూవల్‌ను పైలట్ విధానంలో అమలు చేయనున్నట్లు అమెరికా పేర్కొంది. వీసాల జారీలో భారత్‌కు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు అమెరికా కాన్సులర్ ఆపరేషన్స్ విభాగం సీనియర్ అధికారి జూలీ స్టఫ్ తెలిపారు. వీసాల జారీలో జాప్యంపై ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ పరిస్థితిని మార్చడానికి తాము పట్టుదలతో పనిచేస్తున్నట్లు వివరించారు. ఇందులో భాగంగా చేపట్టిన పలు చర్యలతో కోవిడ్‌కు ముందు కంటే ఇప్పుడు 36 శాతం ఎక్కువగా వీసాలను జారీ చేసినట్లు చెప్పారు. ఇది ఇంకా పెరుగుతుందని ధీమా వ్యక్తం చేశారు. కోవిడ్ కాలంలో అమెరికా ప్రపంచవ్యాప్తంగా తమ కాన్సులర్ కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేయడంతో వీసాల జారీ ప్రక్రియ నిలిచిపోయింది. దీంతో భారత్‌లో అధిక సంఖ్యలో వీసా దరఖాస్తులు పేరుకుపోయాయి. టూరిస్టులకు ఇచ్చే బీ1, బీ2 వీసాలతో పాటు హెచ్1బీ, ఎల్ వర్క్ వీసాలు నిలిచిపోయాయి. గత సెప్టెంబర్‌లో జరిగిన ద్వైపాక్షిక విదేశాంగ మంత్రుల సమావేశంలో భారత విదేశాంగ మంత్రి జైశంకర్.. వీసాల జారీలో తీవ్ర జాప్యం జరుగుతుండటాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు. (ఇదీ చదవండి: వాట్సాప్ యూజర్లను తెగ విసిగిస్తున్న కాల్స్, మెసేజ్‌లు!) -
భారతీయుల అమెరికా వీసా ప్రక్రియలో పురోగతి
వాషింగ్టన్: అమెరికా వీసాల కోసం నెలల తరబడి నిరీక్షిస్తున్న భారతీయుల ఇబ్బందుల్ని తొలగించేందుకు అధ్యక్ష అడ్వైజరీ కమిషన్ చేసిన సిఫార్సులను ఆ దేశ హోం మంత్రిత్వ శాఖ ఆచరణలో పెడుతోంది. భారతీయుల వీసా దరఖాస్తులను విదేశాల్లోనూ త్వరగా తేల్చేలా అదనంగా దౌత్య కార్యాలయాలు, కౌంటర్లు తెరుస్తున్నారు. కోవిడ్ అనంతరం ప్రయాణ ఆంక్షలు తొలగించాక అమెరికా వీసాల కోసం భారత్ నుంచి దరఖాస్తులు వెల్లువలా వచ్చిపడటం తెల్సిందే. అమెరికాలో అభ్యసించనున్న విద్యార్థులు, పర్యటించే సందర్శకులు చాలాకాలంపాటు వేచి ఉండాల్సి రావడంతో ఇబ్బందులు పడుతున్నారని ప్రెసిడెన్షియల్ కమిషన్ సభ్యుడు అజయ్ జైన్ భుటోరియా వ్యాఖ్యానించారు. భారతీయ వీసా దరఖాస్తుదారులకు ప్రపంచంలో ఏ దేశంలో కుదిరితే ఆ దేశం నుంచే అక్కడి అమెరికా ఎంబసీ సిబ్బంది వర్చవల్‌గా ఇంటర్వ్యూలు చేసి వీసా జారీ/నిరాకరణ ప్రక్రియను పూర్తిచేయడంలో సాయపడతారు. విదేశాల్లోని అమెరికా ఎంబసీల్లో ఎక్కువ వీసా అపాయ్మెంట్ కౌంటర్లను తెరుస్తారు. సిబ్బంది సంఖ్యను పెంచుకుంటారు. ఎంబసీల్లో కొత్తగా సిబ్బందిని నియమించుకుంటారు. 400 రోజులకుపైబడిన వెయిటింగ్ సమయాన్ని 2–4 వారాలకు కుదించడమే వీరి లక్ష్యం. -
లే ఆఫ్స్ దెబ్బకి భారత ఐటీ ఉద్యోగుల విలవిల
వాష్టింగన్: ఐటీ కంపెనీల్లో ఉద్యోగాల తొలగింపు పరంపర కొనసాగుతోంది. ఇంట మాత్రమే కాదు.. విదేశాల్లోనూ లక్షల మంది ఈ చేదు అనుభవాన్ని ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా అమెరికాలో ఉద్యోగాలు పొగొట్టుకున్న భారతీయుల పరిస్థితి వర్ణనాతీంగా ఉందని వాషింగ్టన్ ఓ కథనాన్ని ప్రముఖంగా ప్రచురించింది. అగ్రరాజ్యంలో వేలమంది భారతీయ ఐటీ ఉద్యోగులు.. లే ఆఫ్స్ బారిన పడ్డారు. గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ లాంటి బడా కంపెనీలతో పాటు పలు ప్రముఖ కంపెనీల్లోనూ ఉద్యోగాలు కోల్పోతున్నారు. కమిట్మెంట్ల కారణంగా తిరిగి స్వదేశానికి రావడానికి ఇష్టపడడం లేదు. ఈ తరుణంలో మరో ఉద్యోగం వెతుక్కునేందుకు బాగా కష్టపడుతున్నారు. ఇక వీసా చిక్కులతో దేశం విడిచిపెట్టాల్సిన పరిస్థితి నెలకొనడంతో.. ఈ లోపే కొత్త ఉద్యోగాల కోసం అన్వేషణలో మునిగిపోయారు. వాషింగ్టన్ పోస్ట్ కథనం ప్రకారం.. గతేడాది నవంబర్ నుంచి సుమారు 2 లక్షల మందికిపైగా ఐటీ ఉద్యోగులు లే ఆఫ్స్ బారినపడి ఉద్యోగాలు పొగొట్టుకున్నారు. అయితే అందులో 30 నుంచి 40 శాతం ఇండియన్ ఐటీ ప్రొఫెషనల్స్ ఉన్నారని నివేదికలు చెప్తున్నాయి. వాళ్లలో ఎక్కువగా హెచ్1బీ, ఎల్1 వీసాల మీద వెళ్లిన వాళ్లే ఉన్నారు. ఈ క్రమంలో.. ఉద్యోగాల వేటకు.. వాట్సాప్ గ్రూపు ఉద్యోగాలు పొగొట్టుకున్నవాళ్లు.. వర్క్ వీసాల కింద డెడ్లైన్లు ముందు ఉండడంతో కొత్త జాబ్‌ను వెతుక్కోవడానికి కష్టపడుతున్నారు. ఉద్యోగాలు పొగొట్టుకున్న ఉద్యోగుల్లో కొందరు వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసుకున్నారు. ఎనిమిది వందల మందితో ఉన్న ఓ గ్రూప్ అందుకు నిదర్శనం. ఇక వీళ్ల కష్టాలను చూసి జిట్‌ప్రో(GITPRO), ఫిడ్స్(FIIDS) రంగంలోకి దిగాయి. ఆదివారం నుంచి ఓ ఉమ్మడి ప్లాట్‌ఫామ్‌ను వాళ్ల కోసం ఏర్పాటు చేశాయి. ఉద్యోగాలు పొగొట్టుకున్నవాళ్లకు ఉద్యోగావకాశాలు ఎక్కడెక్కడ ఉన్నాయనే సమాచారాన్ని ప్లాట్‌ఫామ్ ద్వారా ఎప్పటికప్పుడు అందజేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే.. పరిస్థితి వర్ణనాతీతంగా ఉండడంతో ఉద్యోగులు సైతం తమ వంతు ప్రయత్నాలను చేస్తున్నారు. పరిస్థితి దారుణంగా ఉందని, చాలా కష్టంగా గడుస్తోందని కొందరు ఉద్యోగుల గోడు వెల్లబోసుకోగా.. వాళ్ల వ్యథలను వాషింగ్టన్ పోస్ట్ ప్రచురించింది. ఈ రెండు వీసాలు ఎవరికంటే.. H-1B వీసా అనేది వలసేతర వీసా. అమెరికన్ కంపెనీలు తమకు అవసరమయ్యే టెక్నికల్ ఎక్స్‌పర్ట్‌లను(విదేశీ ఉద్యోగులను) నియమించుకునేందుకు అనుమతి ఇస్తుంది. ఇక ఈ వీసా కింద భారత్, చైనా లాంటి దేశాల నుంచి వేల సంఖ్యలో ఉద్యోగులను నియమించుకుంటున్నాయి అక్కడి బడా కంపెనీలు.హెచ్ 1 బీ వీసా జాబ్ పోతే గనుక.. 60రోజుల్లోగా హెచ్-1బీ స్పాన్సరింగ్ ఉద్యోగాన్ని వెతుక్కోవాల్సి ఉంటుంది. ఇక L-1A, L-1B వీసాలు.. కంపెనీలు తాత్కాలిక బదిలీల మీద పంపిస్తుంటాయి. మేనేజెరియల్ పొజిషన్స్ లేదంటే ప్రత్యేక పరిజ్ఞానం కలిగి ఉన్న ఉద్యోగుల విషయంలో ఈ వీసాలు ఎక్కువగా ఇస్తుంటారు. -
‘వీసా వెయిటింగ్’ తగ్గిస్తాం: అమెరికా
వాషింగ్టన్: అమెరికా వీసాల కోసం భారతీయులు వేచి ఉండే సమయాన్ని గణనీయంగా తగ్గించేందుకు శాయశక్తులా కృషిచేస్తున్నామని యూఎస్‌కౌన్సిలర్ అఫైర్స్ బ్యూరోలో వీసాల జారీ విభాగం ఉన్నతాధికారి జూలీ స్టఫ్ చెప్పారు. అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ కూడా ఈ విషయంలో చొరవ తీసుకుంటున్నారన్నారు. ‘‘గత అక్టోబర్‌లో బిజినెస్(బీ1), పర్యాటక(బీ2) వీసాల వెయిటింగ్ పీరియడ్ మూడేళ్లుంది! వీటిని తగ్గించేందుకు అహర్నిశలు శ్రమిస్తున్నాం. కోవిడ్‌కు ముందునాటి సాధారణ స్థాయికి తేవడంపై దృష్టిసారించాం. హెచ్–1బీ, ఎల్1 వీసాల వెయిటింగ్ పీరియడ్‌ను 18 నెలల నుంచి 60 రోజులకు కుదించగలిగాం’’ అని ఆమె చెప్పారు. ‘‘ఇంటర్వ్యూతో పనిలేని సందర్భాల్లో వీసా రెన్యువల్‌కు వేచి ఉండాల్సిన పనిలేదు. ఇండియాతోపాటు జర్మనీ, థాయ్‌లాండ్‌లలోనూ భారతీయుల వీసా జారీ కోసం ఎంబసీలు, కాన్సులేట్లకు మరింత మంది సిబ్బందిని పంపుతున్నాం. వారాంతాల్లోనూ ఇంటర్వ్యూలు చేస్తున్నారు’’ అని చెప్పారు. -
వేసవికల్లా వీసా చిక్కులకు చెల్లు
సాక్షి, హైదరాబాద్: అమెరికా వీసాల జారీలో జరుగుతున్న జాప్యాన్ని త్వరలోనే అధిగమిస్తామని, వచ్చే వేసవికల్లా జారీ వేగవంతం అవుతుందని చార్జ్ డి అఫైర్స్ ఎ.ఎలిజబెత్ జోన్స్ స్పష్టం చేశారు. వీసాల జారీ జాప్యాన్ని అత్యంత ప్రాధాన్యం గల అంశంగా పరిగణిస్తున్నామని చెప్పారు. ఆమె మంగళవారం ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ.. ఈ సమస్యపై ఇప్పటికే ఇరు దేశాల విదేశాంగ మంత్రులు ఆంటోనీ జాన్ బ్లింకిన్, జయశంకర్ చర్చించారని చెప్పారు. వీసాల జారీ ప్రక్రియను వేగవంతం చేసేందుకు ఎక్కువ మంది సిబ్బందిని నియమిస్తున్నామన్నారు. వచ్చే వేసవికల్లా భారత్‌లో కోవిడ్‌కు ముందు ఉన్నదాని కంటే ఎక్కువ మంది సిబ్బంది పనిచేస్తారని వివరించారు. ‘సాధారణంగా బీ1, బీ2 వీసాల జారీలోనే జాప్యం ఎక్కువగా జరుగుతోంది. దీన్ని తగ్గించేందుకు అన్ని ప్రయత్నాలూ చేస్తున్నాం. హైదరాబాద్‌లోనూ అదనపు సిబ్బంది త్వరలోనే అందుబాటులోకి వస్తారు. గత ఏడాది విద్యార్థులకు 1.25 లక్షల వీసాలు జారీ చేయగా.. ప్రస్తుతం మరోసారి వీసాలకు డిమాండ్ పెరిగింది. విద్యార్థి వీసాలకు ప్రాధాన్యమిచ్చి వారు సకాలంలో తమ కోర్సుల్లో చేరేలా వీసాలు జారీ చేస్తాం’అని ఎలిజబెత్ తెలిపారు. భారత్ పరిస్థితిని అర్థం చేసుకున్నాం భారత్‌కు పూర్తిస్థాయి దౌత్యవేత్త నియామకం రెండేళ్లుగా జరక్కపోవడంపై ఎలిజబెత్ జోన్స్ మాట్లాడుతూ.. దాని ప్రభావం ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలపై ఏమాత్రం ప్రభావం చూపదని స్పష్టం చేశారు. పూర్తిస్థాయి దౌత్యవేత్త లేకున్నా అనేకమంది అమెరికా పార్లమెంటు సభ్యులు భారత్‌ను సందర్శించారని, ఇరుదేశాల మిలటరీ దళాలు సంయుక్తంగా విన్యాసాలు నిర్వహించాయని, వాణిజ్యం కూడా పెరిగిందని తెలిపారు. ‘రష్యా–ఉక్రెయిన్ యుద్ధం విషయంలో భారత్ పరిస్థితిని మేము సంపూర్ణంగా అర్థం చేసుకున్నాం. ఏ దేశమైనా తమ ప్రజల ప్రయోజనాలకు ప్రాధాన్యమిస్తుంది. అందుకే విదేశీ వ్యవహారాల్లో ఏ దేశం ఎలా వ్యవహరించాలో మేము ఎప్పుడూ నిర్ణయించం’అని ఆమె చెప్పారు. ఆయా దేశాల సమస్యలను అర్థం చేసుకుని.. వాటికి లోబడే ద్వైపాక్షిక సంబంధాలను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తామన్నారు. ఉక్రెయిన్ యుద్ధ బాధితులకు మానవతా సాయం అందించడం భారత్ చేస్తున్న అతిపెద్దమేలని పేర్కొన్నారు. జీ–20 అధ్యక్ష స్థానంలో ఉన్న భారత్‌తో కలిసి పనిచేసేందుకు అమెరికా నుంచి మరిన్ని బృందాలు వస్తున్నాయని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వ సహకారం భేష్ అమెరికా పారిశ్రామికవేత్తలకు ఇక్కడ అన్ని రకాలుగా మద్దతు లభిస్తోందని, మరీ ముఖ్యంగా తెలంగాణలో ప్రభుత్వం నుంచి అందుతున్న సహకారాన్ని అమెరికా వ్యాపారవేత్తలు ఎంతగానో ప్రశంసిస్తున్నారని ఎలిజబెత్ జోన్స్ చెప్పారు. అయితే, మేకిన్ ఇండియా కార్యక్రమంలో తామెలా భాగం కావాలన్నది వారికి ఇంకా స్పష్టం కావడం లేదని, భారతీయ కంపెనీలతో కలిసి ఉత్పత్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నారని వివరించారు. చైనాతో భారత్ సరిహద్దు వివాదాల విషయంలో అమెరికా పాత్ర ఏమీ ఉండదని, కాకపోతే భారతీయ భౌగోళిక సమగ్రతకు ఎలాంటి ముప్పు రాకూడదని అమెరికా భావిస్తోందని తెలిపారు. హైదరాబాద్‌లో కొత్త కాన్సుల్ జనరల్ భవనం త్వరలోనే అందుబాటులోకి వస్తుందని, ఈ కొత్త భవనానికి నిపుణుల అనుమతి లభించాల్సి ఉందని చెప్పారు. కొత్త భవనంలో మరింత ఎక్కువ మంది సిబ్బంది పనిచేసేందుకు సౌకర్యాలు ఉన్నాయన్నారు. -
అమెరికా వీసా కావాలంటే 1000 రోజులు
న్యూఢిల్లీ: రోజురోజుకీ అమెరికా వీసాల కోసం నిరీక్షణ సమయం పెరిగిపోతోంది. అమెరికా బిజినెస్ (బీ–1), టూరిస్ట్ (బీ–2) వీసాల కోసం ఎదురుచూడాల్సిన సమయంతొలిసారిగా వేయి రోజులకు చేరింది. ఇప్పటికిప్పుడు అమెరికన్ వీసా కోసం భారతీయులు దరఖాస్తు చేసుకుంటే 2025 నాటికి ఇంటర్వ్యూకి పిలుపు వస్తుందని అమెరికా విదేశాంగ శాఖ నివేదించింది. ముంబై వాసులు 999 రోజులు, హైదరాబాద్‌వాసులు 994 రోజులు, ఢిల్లీ 961 రోజులు, చెన్నై 948 రోజులు, కోల్‌కతా వాసులు 904 రోజులు ఇంటర్వ్యూ కోసం నిరీక్షించాల్సి ఉందని ఢిల్లీలోని అమెరికా ఎంబసీ అధికారి చెప్పారు. అత్యవసరంగా ఎవరైనా అమెరికా వెళ్లాలనుకుంటే కారణాలు చూపిస్తే అపాయింట్మెంట్ వెంటనే ఇస్తామని అమెరికా విదేశాంగ శాఖ ట్వీట్ చేసింది. ప్రస్తుతం అమెరికా కళాశాలల్లో అడ్మిషన్లు ఉండటంతో విద్యార్థి వీసాలు మంజూరుకు ప్రాధాన్యతనివ్వడంతో ఇతర వీసాల వెయిటింగ్ పీరియడ్ పెరిగిపోయింది. -
చైనాకు 2 రోజులు.. భారత్‌కు రెండేళ్లు.. మరీ ఇంత వ్యత్యాసమా?
సాక్షి, న్యూఢిల్లీ: అమెరికా వెళ్లాలనుకునే భారతీయులు పర్యాటక వీసా రావాలంటే దాదాపు రెండేళ్లకుపైగా వేచి ఉండాల్సిందే. అయితే.. చైనా వంటి దేశాల ప్రజలకు ఆ సమయం రెండు రోజులుగానే ఉండటం గమనార్హం. పర్యాటక వీసా పొందాలనుకునే ఢిల్లీ వాసులు అపాయింట్మెంట్ కోసం సుమారు 833 రోజులు వేచి చూడాలి. అలాగే ముంబయి ప్రజలకు 848 రోజులుకుపైగా వేయింట్ లిస్ట్ ఉన్నట్లు అమెరికా ప్రభుత్వ వెబ్సైట్ సూచిస్తోంది. అయితే.. బీజింగ్‌కు రెండు రోజులు, ఇస్లామాబాద్‌కు 450 రోజులు సమయం పడుతోంది. విద్యార్థి వీసాల కోసం వెయిటింగ్ టైమ్ ఢిల్లీ, ముంబైవాసులకు 430 రోజులుగా ఉంది. ఆశ్చర్యకరంగా విద్యార్థి వీసాల విషయంలో పాకిస్థాన్‌కు కేవలం ఒకే రోజు సమయం ఉంది. అలాగే చైనాకు రెండు రోజులు పడుతోంది. ఢిల్లీ వాసులకు 833 రోజులుగా చూపిస్తున్న అమెరికా వెబ్సైట్ అమెరికా పర్యటనలో ఉన్న భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఈ అంశాన్ని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్ వద్ద లేవనెత్తారు. ఈ సమస్య పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని, ప్రపంచవ్యాప్తంగా సమస్య ఉందని తెలిపారు బ్లింకెన్. కరోనా కారణంగానే ఈ సమస్య తలెత్తిందని పేర్కొన్నారు. భారత్ నుంచి వచ్చే వీసా దరఖాస్తుల సమస్యను పరిష్కరించేందుకు తగిన ప్రణాళిక చేస్తామని హామీ ఇచ్చారు. మరోవైపు.. కరోనా సమయంలో తక్కువ దరఖాస్తులు రావటం వల్ల సిబ్బందిని తొలగించటమూ ప్రస్తుత సమస్యకు ఒక కారణంగా సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. కరోనా తర్వాత పర్యటక, విద్యార్థి వీసాల దరఖాస్తులు భారీగా పెరిగినట్లు వెల్లడించాయి. భారత్ నుంచి అమెరికాకు వెళ్లాలనుకునే నిపుణులు, విద్యార్థులు, పర్యటకుల కోసం అమెరికా ఎంబసీ వివిధ రకాల వీసాలను జారీ చేస్తుంది. ఇందుకోసం దరఖాస్తుదారులకు వీసా అపాయింట్మెంట్కు పట్టే సమయాన్ని అమెరికా ఎంబసీ వెబ్సైట్లో పొందుపరుస్తుంటుంది. అయితే, ఆయా ఎంబసీ, కాన్సులేట్లలో వీసా ఇంటర్వ్యూలను నిర్వహించే సిబ్బంది తదితర అంశాలను బట్టి ఈ సమయాన్ని ప్రతివారం అప్డేట్ చేస్తుంది. తాజాగా వీసా కోసం నిరీక్షణ సమయాన్ని అమెరికా అధికారిక వెబ్సైట్లో పరిశీలించగా ఢిల్లీ ఎంబసీ నుంచి పర్యటక వీసా కోసం దరఖాస్తు చేసుకునేందుకు వారు అపాయింట్మెంట్ కోసం 833 రోజులు వేచి ఉండాల్సిన ఉంటుందని తెలియజేస్తోంది. అలాగే.. మిగతా వివరాలు పరిశీలిద్దాం. బీజింగ్వాసులకు కేవలం 2రోజుల వెయిటింగ్ టైమ్ ఇదీ చదవండి: డ్రగ్స్ ముఠాలపై సీబీఐ ‘ఆపరేషన్ గరుడ’.. 175 మంది అరెస్ట్ -
భారీగా తగ్గిన హెచ్1–బీ వీసాలు
వాషింగ్టన్: అమెరికా కలల ప్రయాణానికి కరోనా మహమ్మారి అడుగడుగునా అడ్డు పడుతోంది. భారతీయ టెక్కీల్లో అత్యధిక డిమాండ్ ఉండే హెచ్1–బీ వీసాల సంఖ్య గత దశాబ్దంలో ఎన్నడూ లేని విధంగా తగ్గిపోయింది. ప్రస్తుతం అమెరికాలో ఉద్యోగాలకి కొరత లేదు. జాబ్ ఓపెనింగ్స్ భారీ సంఖ్యలో ఉన్నాయి. కానీ హెచ్1–బీ ఉద్యోగస్తుల సంఖ్య పడిపోయింది. కోవిడ్ నేపథ్యంలో అమెరికా ప్రయాణాలపై, వీసాలపై ఆంక్షలు విధించడంతో ఈ వలసేతర వీసాలు తగ్గాయి. రెండేళ్లలో 19 శాతం తగ్గిపోయిన ఉద్యోగులు అమెరికా కార్మిక శాఖ వెల్లడించిన గణాంకాలను బ్లూమ్‌బర్గ్ న్యూస్ విశ్లేషించింది. గత ఏడాదితో పోల్చి చూస్తే సెప్టెంబర్ 2021 నాటికి హెచ్–1బీ కేటగిరి కింద విదేశీ ఇంజనీరింగ్, మ్యాథ్‌మేటిక్స్ ఉద్యోగస్తులు 12.6% తగ్గిపోయారు. కరోనా ముందు అంటే 2019లో పోల్చి చూస్తే ఇదే కేటగిరిలో 19% హెచ్1–బీ వీసాలు తగ్గిపోయాయి. కరోనా కారణంగా లాక్డౌన్లు విధించడం, వీసాల జారీ ప్రక్రియ మందగించడం, కోవిడ్ ముప్పుతో అమెరికాకు వెళ్లడానికి ఇష్టపడకపోవడం వంటి కారణాలతోనే హెచ్–1బీ వీసాల సంఖ్య తగ్గిపోయిందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ‘2020 మార్చి నుంచి కొత్త వీసాల జారీ ప్రక్రియ బాగా నెమ్మదించింది. లాక్డౌన్ ఆంక్షలతో ఒకానొక దశలో కొన్నాళ్ల పాటు దాదాపు నిలిచింది. స్టెమ్ (సైన్స్, సాంకేతికం, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్) కేటగిరీలో ఉద్యోగులు తగ్గిపోయాయి. కొన్ని కంపెనీలు విదేశాల నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్‌కి అనుమతినివ్వడంతో హెచ్–1బీ వీసాల సంఖ్య తగ్గిపోయింది’ అని కాలిఫోర్నియా యూనిర్సిటీ ప్రొఫెసర్ పేరి గోవణ్ణ చెప్పారు. ప్రతీ ఏడాది కొత్తగా 85 వేల హెచ్1బీ వీసాలు జారీ చేస్తుంటారు. స్టెమ్‌లో గత ఏడాది మార్చి, ఏప్రిల్‌లో కరోనా కారణంగా ఉద్యోగాలు పోయాయి. కానీ త్వరగానే ఆయా రంగాలు కోలుకోవడంతో ఈ ఏడాది రికార్డు స్థాయిలో 2,30,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్టుగా అమెరికా కార్మిక శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో 4,97,000 ఉద్యోగాలు ఉన్నాయని 2020 నుంచి పోల్చి చూస్తే 9% తగ్గిందని, 2019తో పోల్చి చూస్తే 17% తగ్గిందని బ్లూమ్‌బర్గ్ న్యూస్ వెల్లడించింది. -
యూఎస్ వీసా కోసం నిరీక్షణ తప్పదు
సాక్షి, న్యూఢిల్లీ/ హైదరాబాద్: విదేశీ ప్రయాణికులపై కోవిడ్–19 ఆంక్షల్ని అమెరికా ఎత్తేయడంతో చాలా మంది అగ్రరాజ్యానికి ప్రయాణమయ్యేందుకు సిద్ధమయ్యారు. అయితే వారు వీసా అపాయింట్మెంట్ కోసం మరింత కాలం నిరీక్షించాల్సిన అవసరం ఉందని భారత్‌లోని అమెరికా రాయబార కార్యాలయం వెల్లడించింది. వలసేతర వీసా కేటగిరీలో ఈ నిరీక్షణ తప్పదని పేర్కొంది. నవంబర్ 8 నుంచి అమెరికా ప్రయాణాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో రెండు టీకా డోసులు వేసుకున్న దాదాపుగా 30 లక్షల మంది భారతీయులు అమెరికాకు ప్రయాణం చేసే అవకాశం ఉందని తెలిపింది. ‘‘కోవిడ్ వల్ల ఏర్పడిన అంతరాయం నుంచి ఇప్పుడే కార్యకలాపాలను పునరుద్ధరిస్తున్నాం. అందువల్ల రాయబార, కాన్సులేట్ కార్యాలయాల్లో పనులు కాస్త ఆలస్యమయ్యే అవకాశాలున్నాయి. వీసా అపాయింట్మెంట్ కోసం ఇంకొంత కాలం ఎదురు చూడాల్సిన పరిస్థితులున్నాయి. వీలైనంత త్వరగా ఆ పనులు జరిగేలా చూస్తాం. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలకే పెద్ద పీట వేస్తాం’’అని పేర్కొంది. రాయబార కార్యాలయ సిబ్బంది, ప్రయాణికులు భద్రంగా ఉండడానికే ప్రాధాన్యతనిస్తూ వీసా మంజూరు ప్రక్రియని వేగవంతం చేస్తామని స్పష్టం చేసింది. లక్షల మంది భారతీయులు వీసాల పునరుద్ధరణ/ కొత్త వీసాల జారీకి ఎదురుచూస్తుండడంతో యూఎస్ ఎంబసీల నుంచి అపాయింట్మెంట్లు అంత సులువుగా లభించే అవకాశాలు కనిపించడం లేదు. ప్రధానంగా రెండు తెలుగు రాష్ట్రాల నుంచి యూఎస్ వెళ్లేందుకు నిరీక్షిస్తున్న తెలుగువారు సైతం మరికొంత కాలం వేచిఉండాల్సి రావచ్చని యూఎస్ ఎంబసీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. వెయిటింగ్ లిస్టు చాంతాడంత ఉందని, ఆంక్షల నుంచి ఉపశమనం లభించినా వెంటనే యూఎస్ ప్రయాణాలు సాధ్యం కాకపోవచ్చని పేర్కొంటున్నాయి. -
American Embassy: టీకా తప్పనిసరి కాదు
సాక్షి, హైదరాబాద్: వ్యాక్సినేషన్ విషయంలో తమ నుంచి ఎలాంటి ఒత్తిడి లేదని, జూన్ 14 నుంచి యూఎస్ వీసా అపాయింట్మెంట్లు యథాతథంగా ఉంటాయని మినిస్టర్ కౌన్సెలర్ ఫర్ కాన్సులర్ ఎఫైర్స్ డాన్ హెప్లిన్ స్పష్టం చేశారు. అమెరికాలో అడుగుపెట్టేందుకు వ్యాక్సినేషన్ అర్హత కానే కాదన్నారు. కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న వేళ అమెరికాలో అడ్మిషన్లు పొందిన విద్యార్థుల కోసం అమెరికన్ ఎంబసీ ఈ మేరకు ఓ ప్రకటన చేసింది. అదే సమయంలో అమెరికాకు రావాలనుకున్న పర్యాటకులు, విద్యార్థుల తల్లిదండ్రులకు ఇప్పట్లో అనుమతి లేదని, అలాంటి వారు వీసాకు దరఖాస్తు చేసుకోకపోవడమే ఉత్తమమని కాన్సులేట్ వర్గాలు సూచించాయి. కరోనా తీవ్రత కారణంగా ఇటీవల కొంతకాలంపాటు అమెరికా వీసాల జారీ నిలిపివేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం పరిస్థితులు కుదుట పడుతున్న వేళ నిబంధనలను సడలించి అడ్మిషన్లు పొందిన విద్యార్థులంతా తిరిగి వీసాలకు https://www.ustraveldocs.com/in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని ఢిల్లీలోని యూఎస్ ఎంబసీ తెలిపింది. మరిన్ని వివరాల కోసం https://in.usembassy.gov/visas వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సూచించింది. ఒకవేళ వర్సిటీ తప్పనిసరంటే మాత్రం.. టీకాకు సంబంధించి అమెరికా ప్రభుత్వం ఎలాంటి సూచనలు ఇవ్వలేదని, ప్రయాణానికి మూడురోజుల ముందు కరోనా నిర్ధారణ పరీక్షలో నెగిటివ్ రిపోర్ట్ తప్పనిసరి అని ఎంబసీ తెలిపింది. వ్యాక్సినేషన్ కోసం సంబంధిత యూనివర్సిటీ నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించాల్సి ఉంటుందని స్పష్టంచేసింది. కొన్ని వర్సిటీలు మాత్రం వ్యాక్సిన్ తప్పనిసరి చెబుతున్నందున, దీనిపై ఆ వర్సిటీ అధికారులను సంప్రదించాల్సి ఉంటుందని చెప్పింది. ఇండియన్ వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ.. స్థానిక టీకా తప్పనిసరిగా వేసుకోవాలని సూచించిన వర్సిటీలోనే వేయించుకుంటే ఉత్తమమని అభిప్రాయపడింది. జూన్ 14 తరువాత ఉన్న అపాయింట్మెంట్లు యథావిధిగా కొనసాగుతాయని, అంతకంటే ముందు దరఖాస్తు చేసుకుని రద్దయినవారు మరోసారి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని సూచించింది. వర్సిటీని సంప్రదించాల్సిందే.. తాజాగా అమెరికన్ యూనివర్సిటీల్లో ఐ20 (యూనివర్సిటీలో అడ్మిషన్ పత్రం) పొంది, జూన్, జూలైలో వెళ్లాల్సిన (సమ్మర్ సెమిస్టర్) విద్యార్థులకు ప్రస్తుతం వీసా అవకాశం దక్కదని ఎంబసీ తెలిపింది. అందుకే ముందుగా యూనివర్సిటీని సంప్రదించి వీలును బట్టి సెమిస్టర్‌ను పొడిగించుకోవాల్సిన అవసరం ఉందని తేల్చిచెప్పింది. ఆగస్టులో సెమిస్టర్లో చేరే విద్యార్థులు నెలరోజుల ముందు కాకుండా.. ఆగస్టులోనే వెళ్లాల్సి ఉంటుందని పేర్కొంది. భారత్‌లో అమెరికా వీసాలకు చాలాడిమాండ్ నేపథ్యంలో అపాయింట్మెంట్ కోసం భారీగా దరఖాస్తులు వచ్చే అవకాశం ఉన్నందున జూన్ 14న వెబ్సైట్ క్రాష్ అయ్యే ప్రమాదం ఉందని కాన్సులేట్ వర్గాలు తెలిపాయి. అందుకే, వీసా దరఖాస్తుల సంఖ్యను బట్టి స్థానిక కాన్సులేట్లు నిర్ణయం తీసుకుంటాయని వివరించాయి. విద్యార్థులు ఇప్పటికే వీసాల కోసం చెల్లించిన ఫీజు వ్యాలిడిటీ విషయంలో ఆందోళన అవసరం లేదని, దానిని పొడిగిస్తారని స్పష్టంచేశాయి. -
‘వీసా అప్లికేషన్ల’పై డబ్బుల వసూలు
సాక్షి, హైదరాబాద్: అన్లైన్లో అమెరికా వీసా కోసం దరఖాస్తు నింపుతున్న అనేకమంది డబ్బు వసూలు చేస్తున్నారంటూ అమెరికా కాన్సులేట్ అధికారులు బుధవారం సిటీ సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేశారు. అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్ మైఖేల్ పీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. వివిధ రకాలైన వీసాల కోసం దరఖాస్తు చేసుకోవడానికి యూఎస్ కాన్సులేట్ ప్రత్యేకంగా వెబ్సైట్ నిర్వహిస్తోంది. స్టూడెంట్ వీసా కోసం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్న ఇద్దరు విద్యార్థులు ఇటీవల వేర్వేరుగా కాన్సులేట్‌లో ఇంటర్వూ్యకు హాజరయ్యారు. దరఖాస్తును తాము స్వయంగా పూర్తి చేయలేదని, వేరే వ్యక్తుల ద్వారా పని చేయించుకుని రూ.3 వేలు, రూ.2 వేల చొప్పున చెల్లించామని చెప్పారు. తమ అధికారిక వెబ్సైట్లో వీసా దరఖాస్తు నింపడానికి డబ్బు వసూలు చేయడం నిబంధనలకు విరుద్ధమని, ఇది నేరమంటూ మైఖేల్ పీ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. వేరే వారితో పూర్తి చేయించుకుని డబ్బు చెల్లించిన కొందరి ఫోన్ నంబర్లు జతచేశారు. కేసు నమోదు చేసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే ఇలా చేయడం నేరమా? కాదా? అనే దానిపై స్పష్టత లేదని అధికారులు చెపుతున్నారు. పాస్‌పోర్ట్ పొందడానికి, రెన్యువల్ చేసుకోవడానికి అనేక ఈ, మీ–సేవ కేంద్రాలు సైతం ఈ సేవల్ని అందిస్తున్నాయి. దరఖాస్తు నింపడం తెలియని, ఇబ్బందిగా భావించేవాళ్లు వీటిని ఆశ్రయించి స్లాట్లు బుక్ చేసుకుంటారు. దీని కోసం నిర్ణీత మొత్తాలను చెల్లిస్తారు. ఇది నేరం కానప్పుడు యూఎస్ వీసాకు ఆన్లైన్లో దరఖాస్తును వేరే వ్యక్తుల ద్వారా పూర్తి చేయించడం ఎలా తప్పవుతుందని పోలీసులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ కేసుపై న్యాయ నిపుణుల అభిప్రాయం తీసుకోవాలని భావిస్తున్నారు. ఫిర్యాదు ఆధారంగా విద్యార్థులతో మాట్లాడాలని నిర్ణయించారు. తామే ఇతరులను ఆశ్రయించి దరఖాస్తును ఇష్టపూర్వకంగా పూర్తిచేయించుకున్నామని చెప్తే కేసు నిలబడదని అధికారులు చెపుతున్నారు. -
హెచ్1 బీ వీసాలకు నేడు తీపి కబురు
వాషింగ్టన్: తాత్కాలిక ప్రాతిపదికన జారీ చేసే హెచ్-1బీ వీసాల ఎంపిక విధానంలో కొత్త సవరణలకు నేడు తెరతీయనున్నట్లు యూఎస్ ప్రభుత్వం పేర్కొంది. ఇందుకు వీలుగా నిబంధనల్లో తుది సవరణలు చేపట్టనున్నట్లు తెలియజేసింది. తద్వారా నాన్‌ఇమ్మిగ్రెంట్ వీసాలైన హెచ్-1బీ జారీకి ఇప్పటివరకూ అనుసరిస్తున్న లాటరీ విధానానికి స్వస్తి చెప్పే యోచనలో ఉన్నట్లు వెల్లడించింది. ఇకపై వీటి జారీలో వేతనాలు, నైపుణ్యాలకు పెద్దపీట వేయనున్నట్లు వివరించింది. కొత్త సవరణలను నేడు(8న) ఫెడరల్ రిజిస్టర్లో ప్రచురించనున్నట్లు తెలియజేసింది. వెరసి 60 రోజుల్లోగా తాజా నిబంధనలు అమల్లోకి రానున్నాయి. 60,000 వీసాలు ఈ ఏడాది(2021) హెచ్-1బీ వీసాల ప్రక్రియ ఏప్రిల్ నుంచి మొదలుకానుంది. నాన్‌ఇమ్మిగ్రెంట్ వీసాలైన హెచ్-1బీలను అమెరికాలో కార్యకలాపాలు కలిగిన కంపెనీలు విదేశీ ఉద్యోగుల నియామకానికి వినియోగించుకునే సంగతి తెలిసిందే. నిబందనల సవరణపై ఇంతక్రితం 2020 నవంబర్ 2న యూఎస్ ప్రభుత్వం ముసాయిదా(నోటీస్) జారీ చేసింది. వీటిపై ప్రజాభిప్రాయ సేకరణను చేపట్టింది. నిబంధనల ప్రకారం యూఎస్ ప్రభుత్వం ఏడాదికి గరిష్టంగా 60,000 హెచ్-1బీ వీసాలను జారీ చేస్తుంటుంది. వీటికి అదనంగా స్థానిక యూనివర్శిటీలలో సైన్స్, టెక్నాలజీ, ఇంజినీంగ్, మ్యాథ్య్(STEM) సబ్జెక్టుల్లో డిగ్రీలు(హైయర్ స్టడీస్) చేసిన విద్యార్ధులకు 20,000 వీసాలను జారీ చేసేందుకు అవకాశముంది. (హెచ్1 బీ వీసాలకు మళ్లీ ట్రంప్ షాక్) ఉద్యోగ రక్షణకు తాజా నిబంధనల ద్వారా యూఎస్ ఉద్యోగులకు ఆర్థికపరమైన రక్షణ కల్పించేందుకు వీలు చిక్కనున్నట్లు ప్రభుత్వ అధికారులు పేర్కొన్నారు. దీంతోపాటు అత్యంత నైపుణ్యం కలిగిన విదేశీ ఉద్యోగులకు లబ్ది చేకూరనున్నట్లు తెలియజేశారు. ప్రధానంగా టెక్నాలజీ కంపెనీలు ఇండియా, చైనా తదితర దేశాల నుంచి ఐటీ నిపుణులను ఎంపిక చేసుకోవడం ద్వారా మరింత మెరుగైన సర్వీసులను అందించేందుకు ప్రయత్నిస్తుంటాయి. హెచ్-1బీ వీసాల జారీ నిబంధనల్లో చేపడుతున్న తాజా సవరణల ద్వారా అధిక వేతనాలు ఆఫర్ చేసే కంపెనీలకు ప్రోత్సాహం లభించనుంది. అంతేకాకుండా అత్యంత నైపుణ్యమున్న ఉద్యోగులను ఎంపిక చేసుకోవడం ద్వారా కంపెనీలు అంతర్జాతీయ బిజినెస్‌లలో మరింత పటిష్టతను సాధించేందుకు వీలుంటుందని పరిశ్రమవర్గాలు పేర్కొన్నాయి. హెచ్-1బీ వీసాల ద్వారా కొన్ని కంపెనీలు ప్రాథమిక స్థాయి ఉద్యోగులకు అవకాశాలు ఇవ్వడం ద్వారా బిజినెస్ వ్యయాలను తగ్గించుకునేందుకు వినియోగించుకుంటున్నట్లు ప్రభుత్వ అధికారి ఒకరు ప్రస్తావించారు. ప్రస్తుత లాటరీ విధానం ద్వారా నైపుణ్యం కలిగిన ఉద్యోగుల ఎంపికలో కంపెనీలు సవాళ్లు ఎదురవుతున్నాయని, అంతేకాకుండా తగిన ప్రయోజనాలను అందుకోలేకపోతున్నాయని వివరించారు. ఫలితంగా తక్కువ వేతనాలతో ముడిపడిన ఉద్యోగులకు అధిక అవకాశాలు లభిస్తున్నట్లు చెప్పారు. ఇది యూఎస్ ఉపాధి మార్కెట్‌కు విఘాతం కలిగిస్తున్నట్లు అభిప్రాయపడ్డారు. -
రెండు నెలల పాటు నో ఎంట్రీ
వాషింగ్టన్/న్యూఢిల్లీ: అమెరికాలోకి కొన్ని రకాలైన వలసలను రానున్న 60 రోజులపాటు నిషేధిస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ అయ్యాయి. దేశ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేసిన కోవిడ్ కారణంగా ఉద్యోగ భద్రత కోల్పోతున్న అమెరికన్ల కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు అమెరికా అధ్యక్షుడుట్రంప్ పేర్కొన్నారు. అమెరికాలోకి ఉద్యోగాల కోసం రావాలనుకుంటున్న వారికే ఈ నిషేధ ఉత్తర్వులు వర్తిస్తాయని, ఇప్పటికే అమెరికాలో ఉంటున్న వారికి ఇవి వర్తించవన్నారు. అమెరికన్ల ఉద్యోగాల రక్షణ కోసం అధికారిక ఉత్తర్వులపై సంతకం చేశానన్నారు. కరోనాతో దాదాపు 2 కోట్ల మంది అమెరికన్లు ఉద్యోగాలు కోల్పోయారని, వారికి మళ్లీ ఉపాధి కల్పించాల్సి∙ఉందన్నారు. వలసలకు విరామం ఇవ్వడం ద్వారా.. కరోనా ప్రభావం అంతమై, మళ్లీ ఆర్థిక వ్యవస్థ గాడిన పడ్డాక దేశంలో ఉద్యోగ అవకాశాలు మొదట అమెరికన్లకే లభిస్తాయన్నారు. అమెరికన్లకు కాకుండా, కొత్తగా వచ్చిన విదేశీయులకు ఉద్యోగావకాశాలు కల్పించడం అన్యాయమవుతుందన్నారు. 60 రోజుల తర్వాత నిషేధం తొలగించాలా? కొంతకాలం కొనసాగించడమా? అనేది నిర్ణయిస్తామని చెప్పారు. మినహాయింపులు ఈ కార్యనిర్వాహక ఉత్తర్వుల్లో పలు మినహాయింపులు ఉన్నాయి. ఇవి అమల్లోకి వచ్చిన తేదీ నాటికి అమెరికా వీసా, లేదా గ్రీన్ కార్డ్ ఉన్నవారికి ఈ ఉత్తర్వులు వర్తించబోవు. ఆ తేదీ నాటికి విదేశాల్లో ఉన్న, ఎలాంటి ఇమిగ్రంట్ వీసా కానీ, లేదా వేరే ఏ అధికారిక ట్రావెల్ డాక్యుమెంట్ కానీ లేనివారికే అవి వర్తిస్తాయి. ఉద్యోగ నిమిత్తం అమెరికాకు రావాలనుకుంటున్న వైద్యులు, ఇతర వైద్య సిబ్బందికి, ఇన్వెస్ట్మెంట్ కేటగిరీలో చట్టబద్ధమైన శాశ్వత నివాసితులుగా రావాలనుకుంటున్నవారికి ఈ నిషేధం వర్తించదు. అమెరికన్ల జీవిత భాగస్వాములు, వారి 21 ఏళ్లలోపు పిల్లలు, అమెరికన్లు దత్తత తీసుకోవాలనుకునేవారు నిషేధ పరిధిలోకి రారు. అన్ని రకాల ఇమిగ్రంట్ వీసాలపై తాత్కాలిక నిషేధం విధించబోతున్నట్లు ఇటీవల ట్రంప్ చెప్పడం తెల్సిందే. ఐటీ నిపుణులు, వ్యవసాయ కార్మికుల అందుబాటుపై ఈ నిర్ణయం తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుందని పారిశ్రామిక, రాజకీయ వర్గాలు విమర్శించాయి. నవంబర్‌లో అధ్యక్ష ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కరోనాను కట్టడి చేయడంలో తన వైఫల్యాన్ని.. ట్రంప్ ఇలా కప్పిపుచ్చుకుంటున్నారని డెమొక్రాట్లు విమర్శలు గుప్పించారు. భారత్ సమీక్ష వలసలపై తాత్కాలిక నిషేధం విధిస్తూ అమెరికా జారీ చేసిన ఉత్తర్వులను భారత ప్రభుత్వం అధ్యయనం చేస్తోందని అధికార వర్గాలు తెలిపాయి. ఆ ఉత్తర్వులు భారతీయులపై, భారత్–అమెరికాల మధ్య సంబంధాలపై చూపే ప్రభావాన్ని అంచనా వేస్తున్నామని పేర్కొన్నాయి. -
యూఎస్ వీసాలకు కోవిడ్ దెబ్బ!
సాక్షి, హైదరాబాద్: కోవిడ్ ప్రపం చాన్ని వణికిస్తోన్న దరిమిలా.. ఆ ప్రభావం అమెరికా వీసాలపైనా పడింది. ఇప్పటికే నేషనల్ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించిన అమెరికా ఐరోపా దేశాలకు విమాన సర్వీ సులనూ నిలిపివేసింది. విదేశీ ప్రయాణికులతో వైరస్ విస్తరిస్తున్న క్రమంలో.. ఈ నెల 16 నుంచి భారత్‌లోని అన్ని అమెరికన్ కాన్సులేట్ కార్యాలయాల్లో వీసా ఇంటర్వూ్యలను నిలిపివేస్తున్నట్లు యూఎస్ ఎంబసీ వెబ్సైట్ ప్రకటించింది. దేశంలోని చెన్నై, ముంబై, కోల్‌కతాలోని అమెరికన్ సెంటర్లలోకి ప్రజల ప్రవేశాన్ని నిషేధిస్తున్నట్లు తెలిపింది. వీసా ఇంటర్వూ్యలను తిరిగి ఎప్పటి నుంచి నిర్వహించేది మాత్రం ప్రకటించలేదు. దీంతో ఈ నెలలో ఇంటర్వూ్యలకు హాజరై, ప్రయాణాలు చేద్దామనుకున్న వారంతా అయోమయంలో పడ్డారు. హెచ్1–బీ వీసాదారుల ఇబ్బందులు అమెరికాలో ఉద్యోగాలు చేసేందుకు హెచ్1–బీ వీసా ఇంటర్వూ్యల కోసం ఎదురుచూస్తోన్న ఆశావహులు అమెరికా ఎంబసీ ప్రకటనతో నీరుగారిపోయారు. ఓవైపు ప్రయాణానికి ఏర్పాట్లు చేసుకుంటున్న క్రమంలో వీసా ఇంటర్వూ్యల నిలిపివేత వార్త పిడుగులా పడటంతో వీరికి ఏం పాలుపోవడం లేదు. దీంతో అమెరికాలోని పలు కంపెనీలకు ఫోన్లుచేసి విషయాన్ని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇంటర్వూ్యలు తిరిగి ఎప్పుడు ప్రారంభమవుతాయో స్పష్టత లేకపోవడం వారిని గందరగోళపరుస్తోంది. ఇటీవలే పెళ్లిళ్లయిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ల భార్యలకు చిక్కొచ్చి పడింది. భర్తలు అమెరికాలో, భార్యలు ఇక్కడే ఉండిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరోవైపు శుభకార్యాలు, వేడుకల్లో పాల్గొనేందుకు వచ్చిన పలువురు ఎన్నారైలు కూడా ఇక్కడే చిక్కుకుపోయారు. ఎంబసీ ఆంక్షలపై స్పష్టత లేకపోవడంతో తమ వ్యాపారాలపై బెంగపెట్టుకున్నారు. అమెరికాలో ఉద్యోగులందరికీ వర్క్‌ఫ్రం హోం సదుపాయం కల్పించడంతో పలువురు ఇండియా నుంచే పని చేసుకుంటున్నారు. ఏడాదిలో నాలుగుసార్లు అవకాశం వాస్తవానికి అమెరికాకు పలు రకాల వీసాలపై ఇంటర్వూ్యకు హాజరవ్వాలనుకునేవారు అనివార్య కారణాలతో ఒక్కోసారి హాజరు కాలేకపోవచ్చు. అలాంటి వారికి 4సార్లు వీసా ఇంటర్వూ్యల తేదీని మార్చుకునే వెసులుబాటు ఉంది. వీసా ఇంటర్వూ్యల తేదీని తిరిగి ప్రకటించే వరకు వీరంతా తేదీని సర్దుబాటు చేసుకోలేని పరిస్థితి. మరోవైపు కోవిడ్ విస్తరిస్తున్న నేపథ్యంలో భారత్ కూడా ముందుజాగ్రత్త చర్యలకు దిగింది. దేశంలోకి విదేశీయుల రాకపై నిషేధం విధించింది. ఐక్యరాజ్యసమితి ప్రతినిధులు, దౌత్యవేత్తలు, అంతర్జాతీయ ప్రాజెక్టులలో పనిచేస్తున్న వారికి మాత్రం మినహాయింపు ఇచ్చింది. -
అమెరికా కాన్సులేట్ కీలక నిర్ణయం
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా వైరస్ (కోవిడ్-19) మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో అమెరికా కాన్సులేట్ కీలయ నిర్ణయం తీసుకుంది. సోమవారం నుంచి వీసా సర్వీసులను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఇమ్మిగ్రెంట్, నాన్ ఇమ్మిగ్రెంట్ వీసా అపాయింట్మెంట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. తదుపరి నిర్ణయం ప్రకటించేవరకు వీసా సర్వీసులు అందుబాటులో ఉండవని పేర్కొంది. వీసా అపాయింట్మెంట్లు రీషెడ్యూల్ చేసుకోవాలని సూచించింది. భారత్‌లోని అన్ని అమెరికన్ కాన్సులేట్లకు ఇది వర్తిస్తుందని పేర్కొంది. కాగా, కరోనా వ్యాప్తిని దృష్ట్యా అమెరికాలో శుక్రవారం ఎమర్జెన్సీ(నేషనల్ ఎమర్జెన్సీ) విధించిన సంగతి తెలిసిందే. (చదవండి : కరోనా ఎఫెక్ట్: అమెరికాలో నేషనల్ ఎమర్జెన్సీ) కరోనా ప్రపంచ దేశాల్లో మరణమృదంగం మోగిస్తోంది. ఈ కోవిడ్–19 వల్ల ఇప్పటివరకు మృతి చెందిన వారి సంఖ్య 5 వేలు దాటింది. కేసుల సంఖ్య 1.34 లక్షలకు చేరింది. కరోనా ప్రకంపనలు భారత్‌లో కూడా విస్తరిస్తున్నాయి.ఈ మహమ్మారి బారిన పడి ఇప్పటికే ఇద్దరు మృతి చెందారు. దీంతో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. పలు రాష్ట్రాలు వైరస్ వ్యాప్తిని నిరోధించే దిశగా చర్యలను ముమ్మరం చేశాయి. ముఖ్యంగా ఐటీ రాజధాని బెంగళూరు నగరం సహా కర్నాటక వ్యాప్తంగా వైరస్ వ్యాప్తిని నిరోధించే చర్యలను యుద్ధ ప్రాతిపదికన చేపట్టారు. షాపింగ్ మాల్స్‌ను, సినిమా థియేటర్లను, పబ్‌లు, నైట్ క్లబ్‌లను తక్షణమే మూసేయాలని ఆదేశించారు. (చదవండి :భారత్‌లో రెండో మరణం) -
ఈ ‘శ్రీపొన్నాడ’ని అమెరికా పొమ్మంటోంది!
అన్నింటికంటే పెద్ద కష్టం ఏమిటంటే నిలబడటానికి గుప్పెడంత నేల లేకపోవడం.చెప్పుకోవడానికి ఒక దేశం లేకపోవడం. ఎప్పుడో మూడేళ్ల వయస్సులో అమ్మానాన్నతో పాటు అమెరికా వెళ్లిన ఆ 21 ఏళ్ల సాఫ్ట్వేర్ ఇంజనీర్‌కు అలాంటి కష్టమే వచ్చింది. తనిప్పుడు దారీ తెన్నూ లేని కూడలిలో ఉంది. ఎటు వెళ్లాలో పాలుపోని స్థితి. అమెరికాలో డాక్టర్‌గా పని చేయడానికి వచ్చిన తల్లితోపాటు ఆమె వేలుపట్టుకొని అమెరికా వచ్చిన ‘శ్రీపొన్నాడ’ని అమెరికా ఇప్పుడు పొమ్మంటోంది. 20 ఏళ్ల పాటు అమెరికానే తన దేశమనుకొని పెరిగిన ఆ అమ్మాయి, అక్కడే ఆడుతూ పాడుతూ తనదైన బుల్లి ప్రపంచాన్ని కలగన్న ఆ అమ్మాయి ఇలాంటి రోజొకటొస్తుందని, దానిని ఎదుర్కొనాల్సి వస్తుందని అస్సలు ఊహించలేదు. ట్రంపే కారణం డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం విధించిన కఠినతరమైన వీసా నిబంధనలు శ్రీ పొన్నాడ కలల ప్రపంచాన్ని ఛిద్రం చేశాయి. ‘నాకు అమెరికా తప్ప వేరే ప్రపంచం తెలియదు. నాకు 21 ఏళ్లు వచ్చేశాయని, ఇకపై నేను డిపెండెంట్ వీసాతో అమెరికాలో ఉండరాదని ఇక్కడి నుంచి నన్ను గెంటేస్తోంటే నేనెక్కడికెళ్లాలి’ అని ఆమె అమెరికా న్యాయవ్యవస్థని ప్రశ్నిస్తూ ఫేస్బుక్లో పెట్టిన పోస్ట్ ఇప్పుడు వైరల్‌గా మారింది. అదే ఇప్పుడు అమెరికాలో స్థిరపడిన భారతీయుల పిల్లల భవిష్యత్తుని ప్రశ్నార్థకంగా మారుస్తోన్న వ్యవస్థకి అద్దంపడుతోంది. శ్రీ పొన్నాడ పోస్ట్ సారాంశం ‘‘నా మూడేళ్ల వయస్సులోనే అమ్మతో కలిసి నా పుట్టినిల్లు భారత్‌ను వదిలిపెట్టాను. మొదట జమైకా లో ఉన్నాను. అమ్మ న్యూయార్క్‌లో ఉండగా నాకు 14 ఏళ్ల వయస్సున్నప్పుడు జమైకా నుంచి నా తమ్ముడు శ్యాంతో సహా అమెరికాలో అడుగుపెట్టాను. 2008 నుంచి అమ్మ న్యూయార్క్‌లోని మేయో క్లినిక్‌లో కార్డియాలజీలో పరిశోధన చేస్తుండేది. అక్కడికెవ్వరూ వెళ్లరునా హైస్కూల్ చదువు పూర్తయ్యేసరికి వైద్యుల అవసరం ఎక్కువగా ఉన్న మిడ్ వెస్ట్‌లోని అయోవా పట్టణంలో అమ్మకి ఫిజీషియన్‌గా ఉద్యోగం వచ్చింది. న్యూయార్క్‌ను విడిచిపెట్టి మిడ్ వెస్ట్‌కు వెళ్లడానికి చాలామంది ఇష్టపడరు. కానీ వైద్యం అవసరమున్న ఆ చోటికి మా కుటుంబమంతా పయనమైంది. నేనూ అయోవా యూనివర్సిటీలో చేరిపోయాను. అందరం కలిసిపోయాం అయోవా డైలీకి ఆర్టికల్స్ రాయడం, అక్కడి పిల్లలకి ఉచితంగా ట్యూషన్స్ చెప్పడం, కంప్యూటర్ సైన్స్‌లో ఉచితంగా శిక్షణనివ్వడం నా దినచర్యలో భాగమైంది. వీకెండ్స్‌లో ఆడపిల్లలకోసం ప్రత్యేకంగా నిర్వహించే కార్యక్రమాలూ నన్నెంతో సజీవంగా ఉంచాయి. అలాగే వుమన్స్ రీసోర్స్ అండ్ యాక్షన్ సెంటర్లో సైతం స్వచ్ఛందంగా పనిచేయడం ప్రారంభించాను. ‘ఇన్ఫార్మాటిక్స్ అండ్ కంప్యూటర్ సైన్స్ క్లబ్’కి అధ్యక్షురాలిగా ఉన్నాను. అప్పటి వరకూ అన్నిరకాలుగా వెనుకబడి ఉన్న అయోవా వాసులను ఐటీ ఉద్యోగాల్లోకి తీసుకునేవారు కాదు. అలాంటి అయోవా నుంచి సైతం అనేక మందిని ఐటీ కంపెనీల్లోకి ప్రవేశించేలా ప్రయత్నం చేశాం. ఇంత చేస్తూ కూడా నాకెప్పుడూ ఒకటే ఆందోళన. నాకూ నా కుటుంబ సభ్యులకూ గ్రీన్‌కార్డ్ వస్తుందా లేదా అనే ఒత్తిడితోనే నా జీవితమంతా గడిపాను. సమయం తరుముకొస్తోంది ఏ వనరులూ, సదుపాయాలూ అందుబాటులో లేని అయోవా ప్రజల ఆరోగ్యం కోసం అమ్మ చేసిన సేవకు గాను గుర్తింపుగా జాతీయ ప్రయోజనాల రీత్యా ఆమెకు గ్రీన్‌కార్డ్ ఇస్తామని హామీ ఇచ్చారు. ఆమె దాని కోసం ఇంకా ఎన్నేళ్లు ఎదురుచూడాలో కూడా తెలియదు. అయితే నాకు వచ్చే యేడాదికి.. అంటే 2019లో 21 ఏళ్లు నిండుతున్న కారణంగా అందర్నీ వదిలి అక్కడి నుంచి వెళ్లిపోక తప్పని పరిస్థితి ఎదురయ్యింది. ఎటు వెళ్లాలో తెలియని అంధకారంలో పడ్డాను. నా తమ్ముడికి కూడా అమెరికా నుంచి వెళ్లిపోక తప్పని రోజు కాచుకొని ఉంది. నా తమ్ముడు శ్యాం అయోవా యూనివర్సిటీలో మ్యాథ్స్, ఫిజిక్స్ చదువుతున్నాడు. మరో రెండేళ్లలో తను కూడా తన స్టేటస్‌ని కోల్పోతాడు. నేను డిపెండెంట్ చిల్డ్రన్స్ వీసాతో చట్టబద్ధంగానే అమెరికాలో అడుగుపెట్టినా ఎందరో భారతీయులకు ఎదురైన దయనీయమైన పరిస్థితే నాకూ ఎదురైంది. అటు అమెరికాతో కాక, ఇటు ఇండియాతో ఎటువంటి అనుబంధమూ లేక, పద్నాలుగేళ్ల వయస్సులో వదిలొచ్చిన జమైకాతో ఏ బంధమూ మిగలక ఇప్పుడేం కావాలో తెలియక ఇలా మిగిలాను. ఇంకా ఎందరో ‘శ్రీ’లు మరో ఆరు నెలల్లో ఇక్కడి నుంచి బలవంతంగా నన్ను బయటకు గెంటేస్తున్నారు. ఎక్కడైతే నేను బుడి బుడి నడకలతో బడికెళ్లానో, ఎక్కడైతే యూనివర్సిటీ పట్టా పుచ్చుకున్నానో, ఎక్కడైతే సమాజసేవా లక్ష్యంతో పనిచేశానో అక్కడి నుంచి సుదూరంగా వెళ్లడానికి వీసా నిబంధనల భూతం నన్ను తరుముకొస్తోంది. ఒక్క నన్నే కాదు. ఇంకా ఎందరో శ్రీలను కూడా’’ అంటోంది శ్రీ పొన్నాడ. చట్టబద్ధంగా అమెరికాలోకి అడుగుపెట్టిన తనలాంటి, తన తమ్ముడిలాంటి పిల్లలకు అండగా ఉండేలా ఒక చట్టం తేవాలని పొన్నాడ కోరుతోంది. ఉద్యోగాధారిత గ్రీన్‌కార్డ్ కేటగిరీలో సంస్కరణ గాలిలో దీపంలా ఉన్న తమలాంటి వారి పరిస్థితిలో మార్పుతెస్తుందని ఆమె ఆశగా ఎదురుచూస్తోంది. గతంలో చట్టం ఎప్పుడూ పిల్లలను తల్లిదండ్రుల నుంచి వేరు చేయలేదు. కానీ ఇప్పుడు చేస్తోంది. ప్లీజ్ హెల్ప్... వు నీడ్ యువర్ సపోర్ట్ అంటూ శ్రీ పెట్టిన పోస్ట్ అందర్నీ కలవరపెడుతోంది. – అరుణ -
ఆ మొత్తం హిస్టరీ ఇస్తేనే వీసా!
వాషింగ్టన్: వీసా నిబంధనలను అమెరికా ప్రభుత్వం మరింత కఠినతరం చేయనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే వీసాపై అంక్షలు విధిస్తూ వస్తున్న ట్రంప్ సర్కార్ మరోసారి ఇండియన్స్‌కు షాక్ ఇచ్చేలా మరికొన్ని నిబంధనలను చేర్చడానికి సన్నాహాలు చేస్తోంది. ముఖ్యంగా అభ్యర్థులు గతంలో వాడిన ఫోన్ నంబర్లు, ఈమెయిల్స్ మొత్తం వివరాలను కోరుతోంది. అంతేకాదు గత అయిదు సంవత్సరాలుగా సోషల్ మీడియా ఖాతాల హిస్టరీ కూడా కావాలని కోరుతోంది. ఈ నిబంధనలకు సంబంధించిన డాక్యుమెంట్‌ని శుక్రవారం ఫెడరల్ రిజిస్టర్లో పోస్ట్ చేసింది. ఈ ప్రతిపాదనలపై అభిప్రాయాలు తెలపాల్సిందిగా కోరింది. ఇందుకు 60 రోజుల సమయం కేటాయించింది. వీసా జారీ పక్రియలో కొత్త నిబంధనలను చేర్చడం ప్రజల నుంచి వచ్చే స్పందనపై ఆధారపడి ఉంది. ఈ నిబంధనల ప్రకారం నాన్ ఇమిగ్రెంట్ వీసా కోసం దరఖాస్తు చేసుకునేవారు ఐదు సంవత్సారాల నుంచి వాడిన ఫోన్ నంబర్లు, ఈ మెయిల్, సోషల్ మీడియా అకౌంట్ల వివరాలు తప్పనిసరిగా జతచేయాల్సి ఉంటుంది. దేశ భద్రతకు ముప్పు కల్గించే వారు దేశంలోకి ప్రవేశించకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు తెలిపారు. అలాగే ఇంతకు ముందు ఏయో దేశాలకు ప్రయాణించారు, ప్రయాణిస్తే ఆ దేశం మీపై నిషేధం విధించటం కానీ, బహిష్కరించం గానీ జరిగిందా, దరఖాస్తులో పేర్కొన్న మీ కుటుంబ సభ్యుల ఏవరికైనా ఉగ్ర సంస్థలతో సంబంధాలున్నాయనే ప్రశ్నలను కూడా ఎదుర్కొవాల్సి ఉంటుంది. నూతన విధానం అమల్లోకి వస్తే 7లక్షల పదివేలమంది ఇమిగ్రేంట్స్పై, కోటి 40 లక్షల నాన్ ఇమిగ్రెంట్స్పై ఇది ప్రభావం చూపే ఆవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. -
ఆ వీసాలకు పెరిగిన డిమాండ్
సాక్షి, ముంబై: హెచ్1బీ వీసాలపై ఆంక్షల నేపథ్యంలో అమెరికాలో చదువుతున్నవిద్యార్థుల తల్లితండ్రులు ఇన్వెస్టర్ వీసాలుగా పేరొందిన ఈబీ-5 వీసాలపై ఆరా తీస్తున్నారు. ఎంట్రీ లెవెల్ ఉద్యోగాలకు హెచ్1బీ వీసా పొందడం సంక్లిష్టంగా మారడంతో ఇన్వెస్టర్ వీసాలపై సంపన్న కుటుంబాలు కన్నేశాయి. ఈబీ-5 వీసాలపై ఎంక్వయిరీలు పెరగడంతో ప్రాంతీయ కేంద్రాల ద్వారా ఇన్వెస్ట్‌మెంట్స్‌కు గడువును అమెరికా సెప్టెంబర్ 30 నుంచి డిసెంబర్ 8 వరకు పొడిగించింది. ఈ ఏడాది ఇలా గడువు పొడిగించడం ఇది రెండవసారి కావడం గమనార్హం. మరోవైపు గత ఏడాది అమెరికాలో ఉద్యోగాలు పొందిన ఐఐటీ గ్రాడ్యుయేట్లు సైతం వర్క్ వీసా పొందేందుకు సమస్యలు ఎదుర్కోవడంతో ఆర్థిక స్తోమత కలిగిన తల్లితండ్రులు ఇన్వెస్టర్ వీసాలు పొందడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈబీ-5 వీసాను పొందిన విద్యార్థి హెచ్1బీ సంబంధిత ఆటంకాలు లేకుండా అమెరికాలో పనిచేసే వెసులుబాటు ఉంది. ఇక ఈ వీసాలకు గడువు పొడిగించడంతో ఇమిగ్రేషన్ సంబంధిత పెట్టుబడి వ్యవహారాల్లో ప్రత్యేకంగా సేవలందించే నిపుణులు, సంస్థల్లో ఈ వీసాల గురించి ఆశావహులు పెద్ద ఎత్తున ఆరా తీస్తున్నారు. -
వారికి యూఎస్ వీసా తిరస్కరణ
కాబూల్: అంతర్జాతీయ రొబోటిక్స్ పోటీలో పాల్గొనేందుకు ఆరుగురు ఔత్సాహిక అఫ్గానిస్తాన్ విద్యార్థినులకు వీసా ఇచ్చేందుకు అమెరికా తిరస్కరించింది. ఇలా ఒకసారి కాదు రెండుసార్లు నిరాకరించింది. 162 బృందాలు హాజరయ్యే ఈ పోటీలో అఫ్గాన్లు కూడా రోబోలను తయారు చేయగరలని ప్రపంచానికి చాటిచెప్పేందుకు అఫ్గానిస్తాన్ నుంచి ఒకే ఒక్క మహిళల టీమ్ పాల్గొనాలని భావించింది. అమెరికాకు 800 కిలోమీటర్లు ప్రయాణం చేశాక మొదటిసారి తమ వీసాల దరఖాస్తులను అమెరికా తిరస్కరించిందని 14 సంవత్సరాల విద్యార్థిని సౌమ్యా ఫరూఖి తెలిపింది. కాబూల్‌లోని రాయబార కార్యాలయంలో మళ్లీ దరఖాస్తు చేసుకోగా రెండోసారి కూడా తిరస్కరణకు గురయ్యాయి. దీనిపై మాట్లాడేందుకు యూఎస్ స్టేట్ డిపార్టుమెంట్ నిరాకరించింది. ట్రావెల్ బ్యాన్ ఎదుర్కొంటున్న ఆరు ముస్లిం దేశాల జాబితాలో అఫ్గానిస్తాన్ లేనప్పటికీ వీరికి వీసా నిరాకరించడం గమనార్హం. గాంబియా విద్యార్థుల బృందానికి ముందుగా వీసా నిరాకరించారు. మలిదశలో వారికి వీసాలు మంజూరు చేశారు. అఫ్గానిస్తాన్ విద్యార్థినులకు అమెరికా వీసా నిరాకరించడం బాధాకరమని రోబో పోటీ నిర్వాహకులు వ్యాఖ్యనించారు. -
అమెరికా వీసాలు: పాక్ తోక కట్, భారత్ హ్యాపీ
డోనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత జారీచేసిన వీసాలలో పాకిస్తాన్‌కు ఏకంగా 40 శాతం కోత పెట్టారు. భారతీయులకు మాత్రం నాన్ ఇమ్మిగ్రెంట్ అమెరికా వీసాలు గత సంవత్సరంతో పోలిస్తే 28 శాతం పెరిగాయి. ఈ విషయం అమెరికా అధికారికంగా విడుదల చేసిన సమాచారంలో ఉంది. 2016 నాటి మార్చి-ఏప్రిల్‌లో విడుదల చేసిన వీసాల కంటే పాకిస్తాన్‌కు 40 శాతం తగ్గిపోవడం గమనార్హం. ఒబామా యంత్రాంగం గత సంవత్సరం నెలకు సుమారు 6,553 వీసాలు మంజూరు చేయగా, ట్రంప్ సర్కారు మాత్రం 3,925 వీసాలే ఇచ్చింది. ఈ సంవత్సరం మార్చికి ముందు అమెరికా విదేశాంగ శాఖ నెలవారీ జారీచేసిన వీసాల సంఖ్య వెల్లడించేది కాదు. కేవలం ఏడాదికి ఒక్కసారి మాత్రమే చెప్పేది. దాని సగటును బట్టి చూస్తే తాజా వివరాలు వెల్లడయ్యాయి. వీసాల డిమాండు ఏడాది పొడవునా ఒకే మాదిరిగా ఉండబోదని, అది మారుతూ ఉంటుందని విదేశాంగ శాఖ ప్రతినిధి తెలిపారు. వేసవి సెలవుల్లోను, శీతాకాలం సెలవుల్లోను వీసాల సంఖ్య బాగా పెరుగుతుందని, అలాగే దేశాన్ని బట్టి కూడా మారుతుంటాయని చెప్పారు. గత సంవత్సరం భారత దేశానికి ప్రతినెలా సగటున 72,082 వీసాలు మంజూరు కాగా ఈసారి మాత్రం మార్చిలో 97,925 వీసాలు, ఏప్రిల్ నెలలో 87,049 వీసాలు వచ్చాయి. పాకిస్తాన్ సహా సుమారు 50 ముస్లిం దేశాలకు వీసాల సంఖ్య గత సంవత్సరంతో పోలిస్తే 20 నుంచి 40 శాతం వరకు తగ్గిందని చెబుతున్నారు. డోనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చాక ఇరాన్, సిరియా, సూడన్, సోమాలియా, లిబియా, యెమెన్ దేశాలపై ట్రావెల్ బ్యాన్ విధించారు. దాంతో నాన్ ఇమ్మిగ్రెంట్ వీసాలు 55 శాతం తగ్గిపోయాయి. -
వీసా రావడం ఇక చాలా కష్టమే!
వాషింగ్టన్ : హెచ్-1బీ వీసాల్లో మార్పులపై ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ తీసుకొచ్చి భారతీయ కంపెనీలకు షాకిచ్చినా ట్రంప్ ప్రభుత్వం, తాజాగా మరోసారి వీసా అభ్యర్థులపై బాంబు పేల్చింది. వీసాలు దరఖాస్తు చేసిన అభ్యర్థులు కఠినతరమైన ప్రశ్నలు ఎదుర్కొనేలా అదనపు విచారణ వారెంట్ ను అమెరికా డిపార్ట్ మెంట్ ఆఫ్ స్టేట్ ప్రతిపాదించింది. ఈ విచారణలో భాగంగా అభ్యర్థులందరూ అన్ని పాస్ పోర్టు నెంబర్లను, ఐదేళ్ల విలువైన సోషల్ మీడియా ఖాతాలు, ఈ-మెయిల్ అడ్రస్ లు, ఫోన్ నెంబర్లను, అదేవిధంగా 15 ఏళ్ల బయోగ్రాఫికల్ సమాచారాన్ని అమెరికా వీసా అప్లయ్ చేసే ముందు సమర్పించాల్సి ఉంటుంది. అయితే సోషల్ మీడియా అకౌంట్ల యూజర్లు పాస్ వర్డ్ లను ఆఫీసర్లు అడగరు. గురువారం ప్రచురించిన డాక్యుమెంట్లో స్టేట్ డిపార్ట్ మెంట్ ఈ విషయాలను వెల్లడించింది. అమెరికా టెర్రర్ అటాక్స్ ను నిరోధించే అవసరం ఎంతైనా ఉందని భావించిన ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఈ మేరకు కఠినతరమైన నిబంధనలు అమలుచేయాలని వెల్లడించినట్టు డాక్యుమెంట్లో పేర్కొంది. ఈ క్వశ్చన్స్ లో సోషల్ మీడియా అకౌంట్ల విచారణ కూడా ఓ భాగమని తెలిసింది. ఏడాదికి 65వేల మంది అమెరికాకు వీసాలను అప్లై చేస్తున్నట్టు స్టేట్ డిపార్ట్ మెంట్ అంచనావేసింది. ఏ ఒక్క దేశాన్నో టార్గెట్ చేసి ఈ నిబంధనలు తీసుకురావడం లేదని పేర్కొంది. ఈ అదనపు విచారణ ప్రభావం 65వేలమందిపై చూపనుంది. వీసా దరఖాస్తుదారుడికి ఉగ్రవాదం తదితర అంశాలతో సంబంధాలు ఉంటే సోషల్‌మీడియా ద్వారా తెలుసుకుని వీసా జారీని నిలిపివేయనున్నట్లు చెప్పారు. ఈ అదనపు స్క్రీనింగ్ తో ఒక్కో అప్లికెంట్ కు గంటకు పైగా పట్టనుందని, 65వేల మందికోసం అదనంగా 65వేల గంటలను వెచ్చించాల్సి ఉందని తెలుస్తోంది. -
డబ్ల్యూటీవో ముందుకు వీసాల వ్యవహారం?
న్యూఢిల్లీ: వీసాల ఫీజుల పెంపుపై అమెరికా దుందుడుకుతనాన్ని భారత్, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్(డబ్ల్యూటీవో) ముందుకు తీసుకెళ్లింది. ఈ విషయంపై వివాదాల పరిష్కారాల ఏజెన్సీ డబ్ల్యూటీవోను ఆశ్రయించినట్టు పరిశ్రమల, వాణిజ్య శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం రాజ్యసభలో తెలిపారు.హెచ్-1బీ, ఎల్-1 వీసాల విషయంలో వీసా ప్రక్రియ ఫీజులను అమెరికా పెంచుతుందని ఆమె ఆరోపించారు. దీంతో దేశీయ సర్వీసు కంపెనీలు సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పారు. ఇప్పటికే చాలా సార్లు అమెరికా ప్రభుత్వంతో తాము చర్చలు జరిపామని, ఇక చివరికి ఈ విషయంపై డబ్ల్యూటీవో ముందుకెళ్లినట్టు తెలిపారు. హెచ్-1బీ వీసా ప్రక్రియలో నిబంధనల కఠినతరంపై భారత ప్రభుత్వం, అమెరికా కార్యావర్గానికి నచ్చజెప్పేలా ప్రయత్నాలు సాగిస్తూనే ఉందని, ఎప్పడికప్పుడూ అమెరికా కార్యవర్గంతో చర్చలు జరుపుతూనే ఉందని ఆమె తెలిపారు. భారత విదేశాంగ కార్యదర్శి ఎస్. జయశంకర్ కూడా ఈ నెల మొదట్లో అమెరికాను సందర్శించారు. అమెరికా ఆర్థికవ్యవస్థ వృద్ధి చెందడానికి భారత్ భాగస్వామ్యం ఎంతో అవసరమని ఆయన ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ తో చెప్పారు. ఈ విషయంపై అమెరికాకు నచ్చజెప్పేందుకు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ అధికారులతో, కాంగ్రెస్‌తో చాలా సార్లు చర్చలు జరిపినట్టు జయశంకర్ తెలిపారు. ఏప్రిల్ 3 నుంచి హెచ్-1బీ వీసాల ప్రీమియం ప్రాసెసింగ్ ను సస్పెండ్ చేస్తామని అమెరికా ఇంతకముందే చెప్పింది. ప్రతిభావంతులైన విదేశీయులు మాత్రమే అమెరికాలోకి వచ్చే విధంగా హెచ్-1బీ వీసా ప్రక్రియను కఠినతరం చేస్తామని అమెరికా హెచ్చరిస్తోంది. అమెరికాలో పనిచేసే చాలా భారత ఐటీ కంపెనీలు హెచ్-1బీ వీసాలపై ఆధారపడి ఉన్నాయి. ఈ నిబంధనల కఠినతరంతో భారత ఐటీ కంపెనీలకు తీవ్ర నష్టం వాటిల్లనుంది. దీంతో భారత్ లో ఆందోళన నెలకొంది. -
‘అమెరికాకు స్థిర వీసా విధానముండాలి’
న్యూఢిల్లీ: అమెరికా వీసా విధానంలో స్థిరత్వం, పారదర్శకత ఉండాలని భారత్ పేర్కొంది. అలాంటి వాతావరణంలోనే వ్యాపారం అభివృద్ధి చెందుతుందని తెలిపింది. భారత పర్యటనకొచ్చిన అమెరికా కాంగ్రెస్ సభ్యులతో సోమవారం ఈ విషయాలపై సమగ్రంగా చర్చించినట్లు వాణిజ్య మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. ఐక్యరాజ్య సమితి నివేదిక ఒకటి విడుదల సందర్భంగా ఆమె మంగళవారం విలేకర్లతో మాట్లాడారు. అమెరికాలో కొత్త ప్రభుత్వం కుదురుకునే దాకా వేచి చూస్తున్నామని కాంగ్రెస్ సభ్యులు చెప్పినట్లు మంత్రి తెలిపారు. వీసా సంబంధ సమస్యల పరిష్కారంలో రెండు పార్టీలకు చెందిన సభ్యులు కీలక పాత్ర పోషిస్తారని ఆశిస్తున్నట్లు చెప్పారు. సోమవారం ఈయూ ప్రతినిధులతో జరిగిన సమావేశం గురించి అడిగినపుడు... స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం(ఎఫ్‌టీఏ), ద్వైపాక్షిక పెట్టుబడుల ఒప్పందం(బీఐటీ)పై వారితో చర్చలు జరిపినట్లు తెలిపారు. ఈ రెండు అంశాలపై భారత వైఖరిని వారికి స్పష్టం చేసినట్లు పేర్కొన్నారు. ఎఫ్‌టీఏపై తదుపరి విడత చర్చలకు ఎలాంటి కాలపరిమితి లేదని, వీలైనంత త్వరగానే ప్రారంభమవుతాయని చెప్పారు. -
బ్రహ్మచారినని.. వీసా ఇవ్వలేదు
-
బ్రహ్మచారినని.. వీసా ఇవ్వలేదు
ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది శిష్యులతో పాటు, రూ. 4,500 కోట్ల పతంజలి సామ్రాజ్యానికి ఏకైక అధిపతి అయిన యోగా గురువు రాందేవ్ బాబాకు ఒకప్పుడు అమెరికా వీసా తిరస్కరించిందట. ఆయనకు బ్యాంకు అకౌంటు లేదని, బ్రహ్మచారి కావడం వల్ల వీసా రాలేదట. తర్వాత ఐక్యరాజ్య సమితిలో ప్రసంగించడానికి ఏకంగా పదేళ్ల పాటు అమలులో ఉండేలా వీసాను అందించి మరీ స్వయంగా అగ్రరాజ్యమే ఆయనను ఆహ్వానించింది. ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయం న్యూయార్క్‌లో ఉన్న విషయం తెలిసిందే. తనకు అమెరికా వీసా తిరస్కరించిన విషయాన్ని రాందేవ్ బాబా గ్లోబల్ ఇన్వెస్టర్ సద్సులో చెప్పారు. తొలిసారి తాను అమెరికా వీసాకు దరఖాస్తు చేసుకోగా.. వాళ్లు తిరస్కరించారన్నారు. ఎందుకని కారణం అడిగితే, మీకు బ్యాంకు ఖాతా లేదని, మీరు పెళ్లి చేసుకోలేదని చెప్పారన్నారు. బహుశా ఇవి కాక వాళ్లకు వేరే ఏవో కారణాలు ఉండి ఉంటాయని, అవేంటో చెప్పాలని తాను ఎంతగా అడిగినా వాళ్లు మాత్రం అప్పట్లో వీసా ఇవ్వలేదని చెప్పారు. అయితే ఏ సంవత్సరంలో ఈ ఘటన జరిగిందీ ఆయన చెప్పలేదు. అనిల్ అంబానీ, గోపీచంద్ హిందూజా లాంటి బడా పారిశ్రామికవేత్తలతో పాటు కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ లాంటి నాయకులఉ పాల్గొన్న వేదికను ఆయన పంచుకున్నారు. స్వామీజీలు ఎప్పుడూ అంతర్జాతీయ పౌరులు అవుతారని ఆయన అన్నారు. మధ్యప్రదేశ్‌లోని ధార్ జిల్లాలో పతంజలి గ్రూపు రూ. 500 కోట్లతో ఒక ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ స్థాపిస్తోంది. -
యూఎస్ వీసా ఫీజుల పెంపుపై జైట్లీ కోపం!
వాషింగ్టన్: అమెరికా వీసా ఫీజులను భారీగా పెంచడంపై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నిర్ణయం వివక్ష చూపడమేనని, భారతీయ ఐటీ నిపుణులపై ఇది తీవ్ర ప్రభావం చూపుతుందని పేర్కొంది. అమెరికా పర్యటనలో ఉన్న కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ గురువారం ఆ దేశ వాణిజ్య ప్రాతినిధ్య రాయబారి మైఖేల్ ఫ్రోమన్‌తో సమావేశమై.. ద్వైపాక్షిక అంశాలను చర్చించారు. ఈ సందర్భంగా వీసా ఫీజుల పెంపు అంశాన్ని ఆయన ప్రస్తావించారు. అంతేకాకుండా అమెరికాలో పనిచేసే భారతీయులకు లబ్ధి చేకూర్చేందుకు ఉద్దేశించిన టోటలైజేషన్ ఒప్పందాన్ని త్వరగా పూర్తిచేయాల్సిన అవసరముందని తెలిపారు. అమెరికా హెచ్ 1బీ, ఎల్1 వీసా ఫీజులను పెంచడంపై జైట్లీ ఒకింత ఆగ్రహాన్ని వ్యక్తంచేశారు. 'వీసా ఫీజుల పెంపుపై భారత్ ఆందోళనను వ్యక్తం చేసింది. ఈ పెంపు వివక్షపూరితం. భారతీయ ఐటీ కంపెనీలపై ఇది తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది' అని ఆయన పేర్కొన్నారు. హెచ్ 1బీ, ఎల్ 1 వీసాలు భారతీయ ఐటీ కంపెనీల్లో అత్యంత ప్రజాదరణ పొందాయి. అయితే వీటిపై 2015లో అమెరికా చట్టసభ కాంగ్రెస్ 4,500 డాలర్ల ప్రత్యేక ఫీజు విధించింది. ఈ మొత్తాన్ని 9/11 హెల్త్‌కేర్ చట్టానికి కేటాయించనున్నట్టు తెలిపింది. ఈ ఫీజు నిర్ణయంపై భారత్ ఆందోళన వ్యక్తంచేస్తున్నది. -
ఫేస్బుక్ ఫాలోయర్ తెచ్చిన తంటా
లండన్ : ఫేస్బుక్లో చేసే పోస్టింగ్స్‌తో పాటు ఫాలోయర్స్ వల్ల కూడా సమస్యలొస్తున్నాయి. తెలిసో తెలియకో ఏదో పోస్ట్ చేయడం వల్ల ఇబ్బంది రావడమే కాదు. మనల్ని ఫాలో అవుతున్న వారి వల్ల కూడా తంటాలు తప్పడం లేదు. ఇటీవలి కాలంలో అమెరికా వెళుతున్న వారికి సంబంధించిన సోషల్ మీడియా అకౌంట్లను పరిశీలిస్తున్నట్టు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ప్యారిస్ బాంబు దాడుల ఘటన అనంతరం ఇలాంటి తనిఖీలు మరీ ఎక్కువయ్యాయి. ఫేస్బుక్లో ఫాలోయర్స్ వల్ల ఇబ్బంది తలెత్తిన తాజా సంఘటన వెలుగు చూసింది. ఇదెవరికో కాదు అప్పటికే నాలుగు సార్లు అమెరికా పర్యటించిన అభ్యర్థికే ఈ సమస్య తలెత్తింది. బ్రిటన్‌కు చెందిన ఇమామ్ అజ్మల్ మస్రూర్‌కు అమెరికా అధికారుల నుంచి ఇలాంటి చేదు అనుభవం ఎదురైంది. బంగ్లాదేశ్ కు చెందిన అజ్మల్ మస్రూర్ బ్రిటన్ లో స్థిరపడ్డాడు. 2010లో బ్రిటన్ లోని లిబరల్ డెమాక్రట్స్ తరఫున బేథల్ గ్రీన్ అండ్ బొ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ప్రస్తుతం బ్రిటన్ ముస్లిం కౌన్సిల్ సభ్యుడిగా పనిచేయడమే కాకుండా వివిధ టెలివిజన్ చానెళ్లకు ప్రజెంటర్ గా అనేక కార్యక్రమాలు నిర్వహించాడు. ఇప్పటికే నాలుగుసార్లు అమెరికా పర్యటించిన అజ్మల్ డిసెంబర్ నెలలో మాత్రం చేదు అనుభవం ఎదురైంది. న్యూయార్క్‌లోని క్వీన్స్ మసీదులో జరిగే కార్యక్రమంలో పాల్గొనడానికి లండన్ హిత్రూ నుంచి జేఏఎఫ్ విమానాశ్రయానికి బయలుదేరగా విమానాశ్రయంలో అధికారులు ఆయనను అడ్డుకున్నారు. అనుమతించేది లేదని తేల్చిచెప్పారు. వీసా ఉన్నప్పటికీ ఎందుకు అడ్డుకున్నారని అజ్మల్ మస్రూర్ ప్రశ్నించినప్పుడు ఆయనకు అమెరికా అధికారుల నుంచి ఆశ్చర్యకరమైన సమాధానం వచ్చింది. ఆయన ఫేస్‌బుక్‌లోని 4500 మంది ఫాలోయర్స్‌లో ఒక వ్యక్తి అధికారులకు నచ్చలేదు. అజ్మల్ గతంలో తీవ్రవాదానికి వ్యతిరేకంగా మాట్లాడినందుకు చంపేస్తామని బెదిరింపులు కూడా వచ్చాయి. వాటిని దృష్టిలో ఉంచుకొనే ఆయన బిజినెస్ వీసాను రద్దు చేసినట్టు అమెరికన్ ఎంబసీ అధికారులు వెళ్లడించారు. ఫేస్బుక్లో వేలాది మంది తనను ఫాలో అవుతుంటారని, అందులో వారెవరో కూడా తనకు తెలియదని, దానిపై తనకు నియంత్రణ కూడా ఉండదని, నేను అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాను కూడా ఫాలో కావొచ్చు. సోషల్ మీడియా అదొక ఓపెన్ ఫోరం. పైగా అమెరికా అధికారులు ఎవరి గురించి చెబుతున్నారో కూడా సమాధానమివ్వలేదని అజ్మల్ అంటున్నారు. అమెరికా వెళ్లకుండా తనను ఎందుకు బ్యాన్ చేశారో చెప్పాల్సిన అవసరముందని అంటున్నాడు. ఈ విషయంలో అమెరికా అధికారుల సమాధానం కోసం వేచిచూస్తున్నా.. దాని తర్వాత న్యాయవాదులను సంప్రదిస్తానని అజ్మల్ చెబుతున్నారు. అమెరికా పర్యటించే విషయంలో ఇలాంటి చేదు అనుభవాలు ఎదురైన వారి వివరాల కోసం అజ్మల్ ఇప్పుడో వెబ్ సైట్ ను కూడా ప్రారంభించారు. -
పెరిగిన యూఎస్ వీసా ఫీజు
వాషింగ్టన్: హెచ్ 1బీ, ఎల్1 వీసాల్లోని కొన్ని కేటగిరీల వీసాల ఫీజులను అమెరికా భారీగా పెంచింది. ఈ పెంపు ప్రభావం ప్రధానంగా భారతీయ ఐటీ కంపెనీలపై పడనుంది. డిసెంబర్ 18, 2015 తరువాత హెచ్1బీలోని కొన్ని కేటగిరీల వీసాల కోసం దరఖాస్తు చేసుకున్నవారు అదనంగా 4 వేల డాలర్లను(రూ. 2.67 లక్షలు) చెల్లించాలని యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీస్(యూఎస్సీఐఎస్) ప్రకటించింది. అలాగే, ఎల్1ఏ, ఎల్2బీ దరఖాస్తుదారులు 4500 డాలర్లను(రూ. 3.01 లక్షలు) అదనంగా చెల్లించాలని స్పష్టం చేసింది. అమెరికాలో 50 మందికి పైగా ఉద్యోగస్తులుండి, వారిలో కనీసం 50% మంది హెచ్1బీ, లేదా ఎల్1ఏ, ఎల్1బీ నాన్‌ఇమిగ్రంట్ స్టేటస్ వీసాదారులై ఉన్న కంపెనీలకు ఈ పెంపు వర్తిస్తుందని యూఎస్సీఐఎస్ పేర్కొంది. ఈ ఫీజు సాధారణ, ప్రీమియం ప్రాసెసింగ్ ఫీజులు, ఫ్రాడ్ ప్రివెన్షన్ అండ్ డిటెక్షన్ ఫీజు, అమెరికన్ కాంపిటీటివ్నెస్ అండ్ వర్క్‌ఫోర్స్ ఇంప్రూవ్మెంట్ యాక్ట్ ఫీజులకు.. తాజాగా పేర్కొన్న ఫీజు అదనమని స్పష్టం చేసింది. ఈ పెంపు సెప్టెంబర్ 30, 2025 వరకు అమల్లో ఉంటుందని తెలిపింది. అధ్యక్షుడు బరాక్ ఒబామా డిసెంబర్ 18న సంతకం చేయడంతో సంబంధిత చట్టం అమల్లోకి వచ్చిందని వెల్లడించింది. కొత్త చట్టంలో పేర్కొన్న సమాచారం ఇవ్వని వీసా పిటిషన్లను ఈ ఏడాది ఫిబ్రవరి 11 నుంచి తిరస్కరిస్తామని యూఎస్సీఐఎస్ పేర్కొంది. -
నకిలీ పత్రాలతో దొరికిపోయిన నటి
చెన్నై: నకిలీ పత్రాలతో అమెరికా వెళ్లేందుకు ప్రయత్నించిన కేరళ సహాయ నటిని పోలీసులు అరెస్టు చేశారు. ఆమె అనుచరుడిని కూడా అదుపులోకి తీసుకున్నారు. కేరళ రాష్ట్రం పత్తనందిట్టకు చెందిన మళయాల నటి నీతూ కృష్ణ వాసు (28) అమెరికా వెళ్లేందుకు వీసా కోరుతూ చెన్నై అమెరికన్ కాన్సులేట్‌కు వచ్చింది. ఆమె సమర్పించిన పత్రాలు నకిలీవని తేలడంతో అధికారులు రాయపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. నీతూకృష్ణను ఇన్స్పెక్టర్ సత్యశీలన్ విచారణ జరిపారు. పోలీసులు విచారణలో నీతూకృష్ణ పలు విషయాలను వెల్లడించింది. రాజి అనే సినీ నిర్మాత తనను సంప్రదించి అమెరికా వివాహ కార్యక్రమాల్లో డ్యాన్సులు చేసినట్లయితే అధికంగా సంపాదించవచ్చని తెలిపాడని, ఇందుకు చెన్నైకు వెళ్లి వీసా తీసుకోవడానికి రెండు లక్షల రూపాయలు ఖర్చు అవుతుందన్నాడని, దీంతో నగదును తాను అందచేసినట్లు చెప్పింది. అయితే అతడు తనను మోసం చేస్తాడనుకోలేదని వాపోయింది. అలాగే బ్రోకర్లు రాజీ, కుంజుమోన్ల కోసం గాలిస్తున్నారు. -
నకిలీ దంపతుల అరెస్ట్
చెన్నై: అమెరికా వీసా పొందేందుకు దంపతులుగా నటించిన ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. చెన్నైలోగల అమెరికా రాయబార కార్యాలయంలో వీసా పొందేందుకు దరఖాస్తు చేసుకున్న వారి దస్తావేజులను అధికారులు తనిఖీ చేశారు. ఆ సమయంలో గుజరాత్‌కు చెందిన ఏంజలిన్, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన శంకర్ నకిలీ దస్తావేజులను అందజేసినట్లు తెలిసింది. వారు భార్య,భర్తగా నటించి వీసా పొందేందుకు ప్రయత్నించినట్లు గుర్తించారు. దీంతో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. -
మోడీ ప్రధాని అయితే ఆటోమేటిగ్గా అమెరికా వీసా!
ప్రధానమంత్రిగా ఎన్నికైతే నరేంద్ర మోడీకి ఆటోమేటిగ్గా అమెరికా వీసా వచ్చేస్తుందా? దాదాపుగా అవుననే అంటున్నాయి అమెరికా వర్గాలు. భారతీయులు ఎవరిని ప్రధానిగా ఎంచుకున్నా వాళ్లతో కలిసి పనిచేయడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మేరీ హార్ఫ్ తెలిపారు. కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్ (సీఆర్ఎస్) ఇటీవల విడుదల చేసిన ఓ మెమోలో మోడీకి ఆటోమేటిగ్గా వీసా వస్తుందన్న విషయం ఉంది. అయితే ఆ మెమో గురించి మాత్రం తనకు ఇంకా తెలియదని, కానీ ప్రధాని ఎవరైనా కూడా భారతదేశంతో సత్సంబంధాలు కొనసాగించాలన్నదే తమ ఉద్దేశమని మేరీ హార్ఫ్ అన్నారు. దేశాన్ని ఎవరు నడిపించాలో భారతీయులే నిర్ణయించుకుంటారని, వాళ్లు ఎవరిని నిర్ణయించినా ఆ నాయకుడితో కలిసి తాము ముందుకెళ్తామని ఆమె చెప్పారు. ఒకవేళ మోడీ ప్రధాని అయితే, ఆయనకు ఎ-1 (దౌత్యపరమైన) వీసా దానంతట అదే వచ్చేస్తుందని, ఆయన ఏ ఉద్దేశంతో పర్యటన చేసినా వీసా అదే వచ్చేస్తుందని సీఆర్ఎస్ ఇమ్మిగ్రేషన్ విధాన నిపుణుడు రూత్ ఎలెన్ వసీం తెలిపారు. నరేంద్రమోడీపై ఇంతకుముందున్న అభియోగాలేవీ ఎ-1 వీసాకు అడ్డం కాబోవని ఆయన అన్నారు. భారతదేశంలో అమెరికా రాయబారి నాన్సీ పావెల్ రాజీనామాతో భారత అమెరికా సంబంధాలకు ఎలాంటి లింకు అవసరం లేదని మార్ఫ్ స్పష్టం చేశారు. పావెల్ ఇప్పటికే 37 ఏళ్ల పాటు సేవలు అందించారని, ఇక పదవీ విరమణ చేయాలనుకోవడం సహజమేనని చెప్పారు. -
మోడి విషయంలో పునరాలోచనలో పడ్డ 'పెద్దన్న'
-
మోడీ విషయంలో పునరాలోచనలో పడ్డ 'పెద్దన్న'
న్యూఢిల్లీ : బీజేపీ ప్రధాని అభ్యర్థి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీపై అమెరికా తన వైఖరి మార్చుకున్నట్లు కనిపిస్తోంది. గుజరాత్ రాష్ట్రంలో 2002లో జరిగిన అల్లర్ల నేపథ్యంలో అమెరికా విదేశాంగ శాఖ 2005లో మోడీ వీసాను రద్దు చేసిన విషయం తెలిసిందే. తమ వీసా విధానంలో ఎలాంటి మార్పు లేదని అమెరికా ఇన్నాళ్లుగా పదే పదే చెబుతూ వస్తోంది. కానీ ఇప్పుడు మాత్రం మోడీని వ్యతిరేకించే విషయంలో అగ్రరాజ్యం పునరాలోచనలో పడింది. మోడీపై ఇంత కాలం ఉన్న వ్యతిరేకతను అమెరికా పక్కకు పెట్టేసింది. బిజెపి ప్రధాని అభ్యర్ధిగా మోడీ విజయావకాశాలపై సర్వేల రిపోర్టులు చూస్తూ తన వైఖరిని మార్చుకుంటోంది. భారత్‌లో అమెరికా రాయబారి నాన్సీ పావెల్ మోడీతో సమావేశం కానున్నారు. ఈ నెల 14, 15 తేదీల్లో గాంధీనగర్‌లో ఈ సమావేశం జరుగుతుంది. గుజరాత్ అల్లర్ల నేపధ్యంలో మోడీకి వీసా ఇచ్చేందుకు అమెరికా నిరాకరిస్తూ వస్తోంది. అయితే ఇటీవల కోర్టు మోడీకి క్లీన్చిట్ ఇచ్చిన నేపధ్యంలో అమెరికా తన తీరును మార్చుకుంటోంది. రాబోయే రోజుల్లో మోడీతో కలిసి పనిచేయాల్సి రావచ్చన్న వాస్తవాన్ని గుర్తించే శ్వేత సౌధం క్రమంగా దారిలోకొస్తోందని పరిశీలకులు భావిస్తున్నారు. మోడీ అమెరికా వీసా కోసం దరఖాస్తు చేసుకోవచ్చని, దానిపై ప్రస్తుతమున్న నియమ నిబంధనల ప్రకారమే నిర్ణయం తీసుకుంటామని అమెరికా సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. అంతేకాకుండా ఇటీవలే అక్కడి అత్యంత ప్రభావవంతమైన 'టైమ్' పత్రిక తన సంపాదకీయంలో మోడీ ప్రధాని అయితే అప్పుడు కూడా వీసా నిరాకరించగలరా అంటూ ప్రశ్నించిన విషయం తెలిసిందే. ఆ తర్వాతి నుంచి అమెరికా స్వరంలో కొంత మార్పు కనిపిస్తోంది. ఇప్పుడు మోడీతో భేటీ కూడా అందుకు భాగంగానే భావిస్తున్నారు. -
మోడీ వీసా కోసం దరఖాస్తు చేసుకోవచ్చు: అమెరికా
బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్రమోడీ కావాలనుకుంటే అమెరికా వీసా కోసం దరఖాస్తు చేసుకోవచ్చని, దానిపై ప్రస్తుతమున్న నియమ నిబంధనల ప్రకారమే నిర్ణయం తీసుకుంటామని అమెరికా సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఈ విషయమై అమెరికా విదేశాంగ శాఖ ఉప అధికార ప్రతినిధి మేరీ హార్ఫ్ అక్కడి మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. గుజరాత్ రాష్ట్రంలో 2002లో జరిగిన అల్లర్ల నేపథ్యంలో అమెరికా విదేశాంగ శాఖ 2005లో మోడీ వీసాను రద్దుచేసింది. తమ వీసా విధానంలో ఎలాంటి మార్పు లేదని అమెరికా ఇన్నాళ్లుగా పదే పదే చెబుతూ వస్తోంది. కానీ, ఇప్పుడు మాత్రం అమెరికా స్వరంలో మార్పు కనిపిస్తోంది. ఇటీవలే అక్కడి అత్యంత ప్రభావవంతమైన 'టైమ్' పత్రిక తన సంపాదకీయంలో మోడీ ప్రధాని అయితే అప్పుడు కూడా వీసా నిరాకరించగలరా అంటూ ప్రశ్నించిన విషయం తెలిసిందే. ఆ తర్వాతి నుంచి అమెరికా స్వరంలో కొంత మార్పు కనిపిస్తోంది. ఇప్పుడు ఇలా చెప్పడం కూడా అందులో భాగమేనని భావిస్తున్నారు. -
ఇన్ఫోసిస్ అమెరికా వీసాల వివాదం పరిష్కారం
బెంగళూరు: వీసాల దుర్వినియోగం కేసును పరిష్కరించుకునే దిశగా 34 మిలియన్ డాలర్లు (రూ. 208 కోట్లు) అమెరికాకు చెల్లించనున్నట్లు ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ వెల్లడించింది. అయితే, తాము మోసానికి పాల్పడ్డామన్న అభియోగాలు అవాస్తవమని స్పష్టం చేసింది. గతంలో వీసాలకు సంబంధించిన ఐ-9 పత్రాల విషయంలో కొన్ని తప్పిదాలున్న సంగతి గుర్తించి 2010-11 నుంచి వాటిని సరిచేయడం ప్రారంభించామని ఇన్ఫీ వివరించింది. అమెరికా న్యాయశాఖ విచారణ మొదలుకు ముందే తాము ఈ ప్రక్రియను ప్రారంభించినట్లు తెలిపింది. తాము తీసుకున్న బీ-1 వీసాలు పూర్తిగా న్యాయబద్ధమైన వ్యాపార అవసరాలకే వినియోగించామని, హెచ్-1బీ వీసాలకు ప్రత్యామ్నాయంగా వాడుకోలేదని ఇన్ఫీ తెలిపింది. స్వల్పకాలికంగా ఉద్యోగులు వ్యాపారపరమైన సెమినార్లు వంటివాటిల్లో పాల్గొనేందుకు అమెరికా బీ-1 వీసాలను జారీ చేస్తుంది. అయితే, ఇన్ఫీ వీటిని వ్యాపారావసరాలకు వినియోగించుకుందని 2011లో అమెరికా అభియోగాలు మోపింది. తాజాగా ఈ వివాదాన్నే ఇన్ఫీ పరిష్కరించుకుంది.