American Embassy: టీకా తప్పనిసరి కాదు | Corona negative report must for students coming to America | Sakshi
Sakshi News home page

American Embassy: టీకా తప్పనిసరి కాదు

Published Sat, Jun 12 2021 5:50 AM | Last Updated on Sat, Jun 12 2021 8:01 AM

Corona negative report must for students coming to America - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: వ్యాక్సినేషన్‌ విషయంలో తమ నుంచి ఎలాంటి ఒత్తిడి లేదని, జూన్‌ 14 నుంచి యూఎస్‌ వీసా అపాయింట్‌మెంట్లు యథాతథంగా ఉంటాయని మినిస్టర్‌ కౌన్సెలర్‌ ఫర్‌ కాన్సులర్‌ ఎఫైర్స్‌ డాన్‌ హెప్లిన్‌ స్పష్టం చేశారు. అమెరికాలో అడుగుపెట్టేందుకు వ్యాక్సినేషన్‌ అర్హత కానే కాదన్నారు. కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న వేళ అమెరికాలో అడ్మిషన్లు పొందిన విద్యార్థుల కోసం అమెరికన్‌ ఎంబసీ ఈ మేరకు ఓ ప్రకటన చేసింది. అదే సమయంలో అమెరికాకు రావాలనుకున్న పర్యాటకులు, విద్యార్థుల తల్లిదండ్రులకు ఇప్పట్లో అనుమతి లేదని, అలాంటి వారు వీసాకు దరఖాస్తు చేసుకోకపోవడమే ఉత్తమమని కాన్సులేట్‌ వర్గాలు సూచించాయి. కరోనా తీవ్రత కారణంగా ఇటీవల కొంతకాలంపాటు అమెరికా వీసాల జారీ నిలిపివేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం పరిస్థితులు కుదుట పడుతున్న వేళ నిబంధనలను సడలించి అడ్మిషన్లు పొందిన విద్యార్థులంతా తిరిగి వీసాలకు https://www.ustraveldocs.com/in  వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని ఢిల్లీలోని యూఎస్‌ ఎంబసీ తెలిపింది. మరిన్ని వివరాల కోసం https://in.usembassy.gov/visas వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సూచించింది. 

ఒకవేళ వర్సిటీ తప్పనిసరంటే మాత్రం.. 
టీకాకు సంబంధించి అమెరికా ప్రభుత్వం ఎలాంటి సూచనలు ఇవ్వలేదని, ప్రయాణానికి మూడురోజుల ముందు కరోనా నిర్ధారణ పరీక్షలో నెగిటివ్‌ రిపోర్ట్‌ తప్పనిసరి అని ఎంబసీ తెలిపింది. వ్యాక్సినేషన్‌ కోసం సంబంధిత యూనివర్సిటీ నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించాల్సి ఉంటుందని స్పష్టంచేసింది. కొన్ని వర్సిటీలు మాత్రం వ్యాక్సిన్‌ తప్పనిసరి చెబుతున్నందున, దీనిపై ఆ వర్సిటీ అధికారులను సంప్రదించాల్సి ఉంటుందని చెప్పింది. ఇండియన్‌ వ్యాక్సిన్‌ తీసుకున్నప్పటికీ.. స్థానిక టీకా తప్పనిసరిగా వేసుకోవాలని సూచించిన వర్సిటీలోనే వేయించుకుంటే ఉత్తమమని అభిప్రాయపడింది. జూన్‌ 14 తరువాత ఉన్న అపాయింట్‌మెంట్లు యథావిధిగా కొనసాగుతాయని, అంతకంటే ముందు దరఖాస్తు చేసుకుని రద్దయినవారు మరోసారి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని సూచించింది.

వర్సిటీని సంప్రదించాల్సిందే.. 
తాజాగా అమెరికన్‌ యూనివర్సిటీల్లో ఐ20 (యూనివర్సిటీలో అడ్మిషన్‌ పత్రం) పొంది, జూన్, జూలైలో వెళ్లాల్సిన (సమ్మర్‌ సెమిస్టర్‌) విద్యార్థులకు ప్రస్తుతం వీసా అవకాశం దక్కదని ఎంబసీ తెలిపింది. అందుకే ముందుగా యూనివర్సిటీని సంప్రదించి వీలును బట్టి సెమిస్టర్‌ను పొడిగించుకోవాల్సిన అవసరం ఉందని తేల్చిచెప్పింది. ఆగస్టులో సెమిస్టర్‌లో చేరే విద్యార్థులు నెలరోజుల ముందు కాకుండా.. ఆగస్టులోనే వెళ్లాల్సి ఉంటుందని పేర్కొంది. భారత్‌లో అమెరికా వీసాలకు చాలాడిమాండ్‌ నేపథ్యంలో అపాయింట్‌మెంట్‌ కోసం భారీగా దరఖాస్తులు వచ్చే అవకాశం ఉన్నందున జూన్‌ 14న వెబ్‌సైట్‌ క్రాష్‌ అయ్యే ప్రమాదం ఉందని కాన్సులేట్‌ వర్గాలు తెలిపాయి. అందుకే, వీసా దరఖాస్తుల సంఖ్యను బట్టి స్థానిక కాన్సులేట్లు నిర్ణయం తీసుకుంటాయని వివరించాయి. విద్యార్థులు ఇప్పటికే వీసాల కోసం చెల్లించిన ఫీజు వ్యాలిడిటీ విషయంలో ఆందోళన అవసరం లేదని, దానిని పొడిగిస్తారని స్పష్టంచేశాయి.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement