వివరాలు వెల్లడిస్తున్న ఎలిజబెత్ జోన్స్
సాక్షి, హైదరాబాద్: అమెరికా వీసాల జారీలో జరుగుతున్న జాప్యాన్ని త్వరలోనే అధిగమిస్తామని, వచ్చే వేసవికల్లా జారీ వేగవంతం అవుతుందని చార్జ్ డి అఫైర్స్ ఎ.ఎలిజబెత్ జోన్స్ స్పష్టం చేశారు. వీసాల జారీ జాప్యాన్ని అత్యంత ప్రాధాన్యం గల అంశంగా పరిగణిస్తున్నామని చెప్పారు. ఆమె మంగళవారం ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ.. ఈ సమస్యపై ఇప్పటికే ఇరు దేశాల విదేశాంగ మంత్రులు ఆంటోనీ జాన్ బ్లింకిన్, జయశంకర్ చర్చించారని చెప్పారు.
వీసాల జారీ ప్రక్రియను వేగవంతం చేసేందుకు ఎక్కువ మంది సిబ్బందిని నియమిస్తున్నామన్నారు. వచ్చే వేసవికల్లా భారత్‌లో కోవిడ్‌కు ముందు ఉన్నదాని కంటే ఎక్కువ మంది సిబ్బంది పనిచేస్తారని వివరించారు. ‘సాధారణంగా బీ1, బీ2 వీసాల జారీలోనే జాప్యం ఎక్కువగా జరుగుతోంది. దీన్ని తగ్గించేందుకు అన్ని ప్రయత్నాలూ చేస్తున్నాం. హైదరాబాద్‌లోనూ అదనపు సిబ్బంది త్వరలోనే అందుబాటులోకి వస్తారు. గత ఏడాది విద్యార్థులకు 1.25 లక్షల వీసాలు జారీ చేయగా.. ప్రస్తుతం మరోసారి వీసాలకు డిమాండ్ పెరిగింది. విద్యార్థి వీసాలకు ప్రాధాన్యమిచ్చి వారు సకాలంలో తమ కోర్సుల్లో చేరేలా వీసాలు జారీ చేస్తాం’అని ఎలిజబెత్ తెలిపారు.
భారత్ పరిస్థితిని అర్థం చేసుకున్నాం
భారత్‌కు పూర్తిస్థాయి దౌత్యవేత్త నియామకం రెండేళ్లుగా జరక్కపోవడంపై ఎలిజబెత్ జోన్స్ మాట్లాడుతూ.. దాని ప్రభావం ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలపై ఏమాత్రం ప్రభావం చూపదని స్పష్టం చేశారు. పూర్తిస్థాయి దౌత్యవేత్త లేకున్నా అనేకమంది అమెరికా పార్లమెంటు సభ్యులు భారత్‌ను సందర్శించారని, ఇరుదేశాల మిలటరీ దళాలు సంయుక్తంగా విన్యాసాలు నిర్వహించాయని, వాణిజ్యం కూడా పెరిగిందని తెలిపారు.
‘రష్యా–ఉక్రెయిన్ యుద్ధం విషయంలో భారత్ పరిస్థితిని మేము సంపూర్ణంగా అర్థం చేసుకున్నాం. ఏ దేశమైనా తమ ప్రజల ప్రయోజనాలకు ప్రాధాన్యమిస్తుంది. అందుకే విదేశీ వ్యవహారాల్లో ఏ దేశం ఎలా వ్యవహరించాలో మేము ఎప్పుడూ నిర్ణయించం’అని ఆమె చెప్పారు. ఆయా దేశాల సమస్యలను అర్థం చేసుకుని.. వాటికి లోబడే ద్వైపాక్షిక సంబంధాలను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తామన్నారు. ఉక్రెయిన్ యుద్ధ బాధితులకు మానవతా సాయం అందించడం భారత్ చేస్తున్న అతిపెద్దమేలని పేర్కొన్నారు. జీ–20 అధ్యక్ష స్థానంలో ఉన్న భారత్‌తో కలిసి పనిచేసేందుకు అమెరికా నుంచి మరిన్ని బృందాలు వస్తున్నాయని తెలిపారు.
తెలంగాణ ప్రభుత్వ సహకారం భేష్
అమెరికా పారిశ్రామికవేత్తలకు ఇక్కడ అన్ని రకాలుగా మద్దతు లభిస్తోందని, మరీ ముఖ్యంగా తెలంగాణలో ప్రభుత్వం నుంచి అందుతున్న సహకారాన్ని అమెరికా వ్యాపారవేత్తలు ఎంతగానో ప్రశంసిస్తున్నారని ఎలిజబెత్ జోన్స్ చెప్పారు. అయితే, మేకిన్ ఇండియా కార్యక్రమంలో తామెలా భాగం కావాలన్నది వారికి ఇంకా స్పష్టం కావడం లేదని, భారతీయ కంపెనీలతో కలిసి ఉత్పత్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నారని వివరించారు.
చైనాతో భారత్ సరిహద్దు వివాదాల విషయంలో అమెరికా పాత్ర ఏమీ ఉండదని, కాకపోతే భారతీయ భౌగోళిక సమగ్రతకు ఎలాంటి ముప్పు రాకూడదని అమెరికా భావిస్తోందని తెలిపారు. హైదరాబాద్‌లో కొత్త కాన్సుల్ జనరల్ భవనం త్వరలోనే అందుబాటులోకి వస్తుందని, ఈ కొత్త భవనానికి నిపుణుల అనుమతి లభించాల్సి ఉందని చెప్పారు. కొత్త భవనంలో మరింత ఎక్కువ మంది సిబ్బంది పనిచేసేందుకు సౌకర్యాలు ఉన్నాయన్నారు.
Comments
Please login to add a commentAdd a comment