వాషింగ్టన్: తాత్కాలిక ప్రాతిపదికన జారీ చేసే హెచ్-1బీ వీసాల ఎంపిక విధానంలో కొత్త సవరణలకు నేడు తెరతీయనున్నట్లు యూఎస్ ప్రభుత్వం పేర్కొంది. ఇందుకు వీలుగా నిబంధనల్లో తుది సవరణలు చేపట్టనున్నట్లు తెలియజేసింది. తద్వారా నాన్‌ఇమ్మిగ్రెంట్ వీసాలైన హెచ్-1బీ జారీకి ఇప్పటివరకూ అనుసరిస్తున్న లాటరీ విధానానికి స్వస్తి చెప్పే యోచనలో ఉన్నట్లు వెల్లడించింది. ఇకపై వీటి జారీలో వేతనాలు, నైపుణ్యాలకు పెద్దపీట వేయనున్నట్లు వివరించింది. కొత్త సవరణలను నేడు(8న) ఫెడరల్ రిజిస్టర్‌లో ప్రచురించనున్నట్లు తెలియజేసింది. వెరసి 60 రోజుల్లోగా తాజా నిబంధనలు అమల్లోకి రానున్నాయి.
60,000 వీసాలు
ఈ ఏడాది(2021) హెచ్-1బీ వీసాల ప్రక్రియ ఏప్రిల్ నుంచి మొదలుకానుంది. నాన్‌ఇమ్మిగ్రెంట్ వీసాలైన హెచ్-1బీలను అమెరికాలో కార్యకలాపాలు కలిగిన కంపెనీలు విదేశీ ఉద్యోగుల నియామకానికి వినియోగించుకునే సంగతి తెలిసిందే. నిబందనల సవరణపై ఇంతక్రితం 2020 నవంబర్ 2న యూఎస్ ప్రభుత్వం ముసాయిదా(నోటీస్) జారీ చేసింది. వీటిపై ప్రజాభిప్రాయ సేకరణను చేపట్టింది. నిబంధనల ప్రకారం యూఎస్ ప్రభుత్వం ఏడాదికి గరిష్టంగా 60,000 హెచ్-1బీ వీసాలను జారీ చేస్తుంటుంది. వీటికి అదనంగా స్థానిక యూనివర్శిటీలలో సైన్స్, టెక్నాలజీ, ఇంజినీంగ్, మ్యాథ్య్(STEM) సబ్జెక్టుల్లో డిగ్రీలు(హైయర్ స్టడీస్) చేసిన విద్యార్ధులకు 20,000 వీసాలను జారీ చేసేందుకు అవకాశముంది. (హెచ్1 బీ వీసాలకు మళ్లీ ట్రంప్ షాక్)
ఉద్యోగ రక్షణకు
తాజా నిబంధనల ద్వారా యూఎస్ ఉద్యోగులకు ఆర్థికపరమైన రక్షణ కల్పించేందుకు వీలు చిక్కనున్నట్లు ప్రభుత్వ అధికారులు పేర్కొన్నారు. దీంతోపాటు అత్యంత నైపుణ్యం కలిగిన విదేశీ ఉద్యోగులకు లబ్ది చేకూరనున్నట్లు తెలియజేశారు. ప్రధానంగా టెక్నాలజీ కంపెనీలు ఇండియా, చైనా తదితర దేశాల నుంచి ఐటీ నిపుణులను ఎంపిక చేసుకోవడం ద్వారా మరింత మెరుగైన సర్వీసులను అందించేందుకు ప్రయత్నిస్తుంటాయి. హెచ్-1బీ వీసాల జారీ నిబంధనల్లో చేపడుతున్న తాజా సవరణల ద్వారా అధిక వేతనాలు ఆఫర్ చేసే కంపెనీలకు ప్రోత్సాహం లభించనుంది. అంతేకాకుండా అత్యంత నైపుణ్యమున్న ఉద్యోగులను ఎంపిక చేసుకోవడం ద్వారా కంపెనీలు అంతర్జాతీయ బిజినెస్‌లలో మరింత పటిష్టతను సాధించేందుకు వీలుంటుందని పరిశ్రమవర్గాలు పేర్కొన్నాయి. హెచ్-1బీ వీసాల ద్వారా కొన్ని కంపెనీలు ప్రాథమిక స్థాయి ఉద్యోగులకు అవకాశాలు ఇవ్వడం ద్వారా బిజినెస్ వ్యయాలను తగ్గించుకునేందుకు వినియోగించుకుంటున్నట్లు ప్రభుత్వ అధికారి ఒకరు ప్రస్తావించారు. ప్రస్తుత లాటరీ విధానం ద్వారా నైపుణ్యం కలిగిన ఉద్యోగుల ఎంపికలో కంపెనీలు సవాళ్లు ఎదురవుతున్నాయని, అంతేకాకుండా తగిన ప్రయోజనాలను అందుకోలేకపోతున్నాయని వివరించారు. ఫలితంగా తక్కువ వేతనాలతో ముడిపడిన ఉద్యోగులకు అధిక అవకాశాలు లభిస్తున్నట్లు చెప్పారు. ఇది యూఎస్ ఉపాధి మార్కెట్‌కు విఘాతం కలిగిస్తున్నట్లు అభిప్రాయపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment