US Education
-
చైనాకు 2 రోజులు.. భారత్‌కు రెండేళ్లు.. మరీ ఇంత వ్యత్యాసమా?
సాక్షి, న్యూఢిల్లీ: అమెరికా వెళ్లాలనుకునే భారతీయులు పర్యాటక వీసా రావాలంటే దాదాపు రెండేళ్లకుపైగా వేచి ఉండాల్సిందే. అయితే.. చైనా వంటి దేశాల ప్రజలకు ఆ సమయం రెండు రోజులుగానే ఉండటం గమనార్హం. పర్యాటక వీసా పొందాలనుకునే ఢిల్లీ వాసులు అపాయింట్మెంట్ కోసం సుమారు 833 రోజులు వేచి చూడాలి. అలాగే ముంబయి ప్రజలకు 848 రోజులుకుపైగా వేయింట్ లిస్ట్ ఉన్నట్లు అమెరికా ప్రభుత్వ వెబ్సైట్ సూచిస్తోంది. అయితే.. బీజింగ్‌కు రెండు రోజులు, ఇస్లామాబాద్‌కు 450 రోజులు సమయం పడుతోంది. విద్యార్థి వీసాల కోసం వెయిటింగ్ టైమ్ ఢిల్లీ, ముంబైవాసులకు 430 రోజులుగా ఉంది. ఆశ్చర్యకరంగా విద్యార్థి వీసాల విషయంలో పాకిస్థాన్‌కు కేవలం ఒకే రోజు సమయం ఉంది. అలాగే చైనాకు రెండు రోజులు పడుతోంది. ఢిల్లీ వాసులకు 833 రోజులుగా చూపిస్తున్న అమెరికా వెబ్సైట్ అమెరికా పర్యటనలో ఉన్న భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఈ అంశాన్ని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్ వద్ద లేవనెత్తారు. ఈ సమస్య పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని, ప్రపంచవ్యాప్తంగా సమస్య ఉందని తెలిపారు బ్లింకెన్. కరోనా కారణంగానే ఈ సమస్య తలెత్తిందని పేర్కొన్నారు. భారత్ నుంచి వచ్చే వీసా దరఖాస్తుల సమస్యను పరిష్కరించేందుకు తగిన ప్రణాళిక చేస్తామని హామీ ఇచ్చారు. మరోవైపు.. కరోనా సమయంలో తక్కువ దరఖాస్తులు రావటం వల్ల సిబ్బందిని తొలగించటమూ ప్రస్తుత సమస్యకు ఒక కారణంగా సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. కరోనా తర్వాత పర్యటక, విద్యార్థి వీసాల దరఖాస్తులు భారీగా పెరిగినట్లు వెల్లడించాయి. భారత్ నుంచి అమెరికాకు వెళ్లాలనుకునే నిపుణులు, విద్యార్థులు, పర్యటకుల కోసం అమెరికా ఎంబసీ వివిధ రకాల వీసాలను జారీ చేస్తుంది. ఇందుకోసం దరఖాస్తుదారులకు వీసా అపాయింట్మెంట్కు పట్టే సమయాన్ని అమెరికా ఎంబసీ వెబ్సైట్లో పొందుపరుస్తుంటుంది. అయితే, ఆయా ఎంబసీ, కాన్సులేట్లలో వీసా ఇంటర్వ్యూలను నిర్వహించే సిబ్బంది తదితర అంశాలను బట్టి ఈ సమయాన్ని ప్రతివారం అప్డేట్ చేస్తుంది. తాజాగా వీసా కోసం నిరీక్షణ సమయాన్ని అమెరికా అధికారిక వెబ్సైట్లో పరిశీలించగా ఢిల్లీ ఎంబసీ నుంచి పర్యటక వీసా కోసం దరఖాస్తు చేసుకునేందుకు వారు అపాయింట్మెంట్ కోసం 833 రోజులు వేచి ఉండాల్సిన ఉంటుందని తెలియజేస్తోంది. అలాగే.. మిగతా వివరాలు పరిశీలిద్దాం. బీజింగ్వాసులకు కేవలం 2రోజుల వెయిటింగ్ టైమ్ ఇదీ చదవండి: డ్రగ్స్ ముఠాలపై సీబీఐ ‘ఆపరేషన్ గరుడ’.. 175 మంది అరెస్ట్ -
పిల్లలకు కోడింగ్ నైపుణ్యాలు, టింకర్‌ను కొనుగోలు చేయనున్న బైజూస్
ముంబై: ఎడ్యుటెక్ స్టార్టప్ బైజూస్.. యూఎస్ కంపెనీ టింకర్‌ను కొనుగోలు చేయనున్నట్లు తెలుస్తోంది. పిల్లలకు కోడింగ్ నైపుణ్యాలు అందించే ప్లాట్‌ఫామ్ టింకర్‌ను సొంతం చేసుకునేందుకు 10 కోట్ల డాలర్లు(సుమారు రూ. 740 కోట్లు) వెచ్చించవచ్చని అంచనా. గతేడాది(2020) ఆగస్ట్‌లోనూ కోడింగ్ కార్యకలాపాల సంస్థ.. వైట్‌హ్యాట్ జూనియర్‌ను 30 కోట్ల డాలర్లకు కొనుగోలు చేసింది. ఈ బాటలో తాజాగా టింకర్ కొనుగోలుకి తెరతీసింది. తద్వారా కిండర్‌గార్టెన్(కేజీ) నుంచి 12వ తరగతి(గ్రేడ్)వరకూ బైజూస్ బిజినెస్ మరింత పటిష్టమయ్యేందుకు వీలుంటుందని విశ్లేషకులు పేర్కొన్నారు. ఇప్పటికే బైజూస్ యూఎస్‌కు చెందిన రెండు కంపెనీలను సొంతం చేసుకుంది. వీటిలో గేమింగ్ స్టార్టప్ ఓస్మో, ఆన్లైన్ రీడింగ్ ప్లాట్‌ఫామ్ ఎపిక్ ఉన్నాయి. కాగా.. త్వరలో పబ్లిక్ ఇష్యూ చేపట్టే యోచనలో ఉన్న బైజూస్ ఈ ఏడాది ఆరు కంపెనీలను హస్తగత చేసుకున్న విషయం విదితమే. ఇందుకు 200 కోట్ల డాలర్లు(సుమారు రూ. 14,800 కోట్లు) వెచ్చించింది. కంపెనీ ప్రారంభమయ్యాక ఇప్పటివరకూ 15 సంస్థలను కొనుగోలు చేసింది. ఇందుకు అనుగుణంగా 1.5 బిలియన్ డాలర్ల సమీకరణకు కంపెనీ సిద్ధపడుతోంది. తద్వారా బైజూస్ 21 బిలియన్ డాలర్ల విలువను అందుకోనున్నట్లు అంచనా. వెరసి ఇటీవల 16.5 బిలియన్ డాలర్ల విలువకు చేరిన పేటీమ్ను అధిగమిస్తూ దేశంలోనే అత్యంత విలువైన యూనికార్న్‌గా ఆవిర్భవించనున్నట్లు పరిశ్రమవర్గాలు భావిస్తున్నాయి. -
హెచ్1 బీ వీసాలకు నేడు తీపి కబురు
వాషింగ్టన్: తాత్కాలిక ప్రాతిపదికన జారీ చేసే హెచ్-1బీ వీసాల ఎంపిక విధానంలో కొత్త సవరణలకు నేడు తెరతీయనున్నట్లు యూఎస్ ప్రభుత్వం పేర్కొంది. ఇందుకు వీలుగా నిబంధనల్లో తుది సవరణలు చేపట్టనున్నట్లు తెలియజేసింది. తద్వారా నాన్‌ఇమ్మిగ్రెంట్ వీసాలైన హెచ్-1బీ జారీకి ఇప్పటివరకూ అనుసరిస్తున్న లాటరీ విధానానికి స్వస్తి చెప్పే యోచనలో ఉన్నట్లు వెల్లడించింది. ఇకపై వీటి జారీలో వేతనాలు, నైపుణ్యాలకు పెద్దపీట వేయనున్నట్లు వివరించింది. కొత్త సవరణలను నేడు(8న) ఫెడరల్ రిజిస్టర్లో ప్రచురించనున్నట్లు తెలియజేసింది. వెరసి 60 రోజుల్లోగా తాజా నిబంధనలు అమల్లోకి రానున్నాయి. 60,000 వీసాలు ఈ ఏడాది(2021) హెచ్-1బీ వీసాల ప్రక్రియ ఏప్రిల్ నుంచి మొదలుకానుంది. నాన్‌ఇమ్మిగ్రెంట్ వీసాలైన హెచ్-1బీలను అమెరికాలో కార్యకలాపాలు కలిగిన కంపెనీలు విదేశీ ఉద్యోగుల నియామకానికి వినియోగించుకునే సంగతి తెలిసిందే. నిబందనల సవరణపై ఇంతక్రితం 2020 నవంబర్ 2న యూఎస్ ప్రభుత్వం ముసాయిదా(నోటీస్) జారీ చేసింది. వీటిపై ప్రజాభిప్రాయ సేకరణను చేపట్టింది. నిబంధనల ప్రకారం యూఎస్ ప్రభుత్వం ఏడాదికి గరిష్టంగా 60,000 హెచ్-1బీ వీసాలను జారీ చేస్తుంటుంది. వీటికి అదనంగా స్థానిక యూనివర్శిటీలలో సైన్స్, టెక్నాలజీ, ఇంజినీంగ్, మ్యాథ్య్(STEM) సబ్జెక్టుల్లో డిగ్రీలు(హైయర్ స్టడీస్) చేసిన విద్యార్ధులకు 20,000 వీసాలను జారీ చేసేందుకు అవకాశముంది. (హెచ్1 బీ వీసాలకు మళ్లీ ట్రంప్ షాక్) ఉద్యోగ రక్షణకు తాజా నిబంధనల ద్వారా యూఎస్ ఉద్యోగులకు ఆర్థికపరమైన రక్షణ కల్పించేందుకు వీలు చిక్కనున్నట్లు ప్రభుత్వ అధికారులు పేర్కొన్నారు. దీంతోపాటు అత్యంత నైపుణ్యం కలిగిన విదేశీ ఉద్యోగులకు లబ్ది చేకూరనున్నట్లు తెలియజేశారు. ప్రధానంగా టెక్నాలజీ కంపెనీలు ఇండియా, చైనా తదితర దేశాల నుంచి ఐటీ నిపుణులను ఎంపిక చేసుకోవడం ద్వారా మరింత మెరుగైన సర్వీసులను అందించేందుకు ప్రయత్నిస్తుంటాయి. హెచ్-1బీ వీసాల జారీ నిబంధనల్లో చేపడుతున్న తాజా సవరణల ద్వారా అధిక వేతనాలు ఆఫర్ చేసే కంపెనీలకు ప్రోత్సాహం లభించనుంది. అంతేకాకుండా అత్యంత నైపుణ్యమున్న ఉద్యోగులను ఎంపిక చేసుకోవడం ద్వారా కంపెనీలు అంతర్జాతీయ బిజినెస్‌లలో మరింత పటిష్టతను సాధించేందుకు వీలుంటుందని పరిశ్రమవర్గాలు పేర్కొన్నాయి. హెచ్-1బీ వీసాల ద్వారా కొన్ని కంపెనీలు ప్రాథమిక స్థాయి ఉద్యోగులకు అవకాశాలు ఇవ్వడం ద్వారా బిజినెస్ వ్యయాలను తగ్గించుకునేందుకు వినియోగించుకుంటున్నట్లు ప్రభుత్వ అధికారి ఒకరు ప్రస్తావించారు. ప్రస్తుత లాటరీ విధానం ద్వారా నైపుణ్యం కలిగిన ఉద్యోగుల ఎంపికలో కంపెనీలు సవాళ్లు ఎదురవుతున్నాయని, అంతేకాకుండా తగిన ప్రయోజనాలను అందుకోలేకపోతున్నాయని వివరించారు. ఫలితంగా తక్కువ వేతనాలతో ముడిపడిన ఉద్యోగులకు అధిక అవకాశాలు లభిస్తున్నట్లు చెప్పారు. ఇది యూఎస్ ఉపాధి మార్కెట్‌కు విఘాతం కలిగిస్తున్నట్లు అభిప్రాయపడ్డారు. -
జ్ఞానం, నైపుణ్యం, నాయకత్వం
అమెరికాలో విద్యను అభ్యసించడం గొప్ప అనుభూతి అని స్టూడెంట్స్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్‌లో భాగంగా అమెరికాలో చదివిన పలువురు విద్యార్థులు అన్నారు. అంతర్జాతీయ యువజన దినోత్సవం పురస్కరించుకుని గురువారం సాయంత్రం యూఎస్ కాన్సులేట్ ఏర్పాటు చేసిన వెబినార్‌లో విద్యార్థులు మలావత్ పూర్ణ, సంజుక్తసింగ్, ప్రియాంక గడారి, నెమలి సిద్ధార్థ్ పాల్గొన్నారు. ఈ సంద ర్భంగా అమెరికాలోని వివిధ నగరాల్లో వారు విద్యన భ్యసించిన తీరు, సంస్కృతి, సంప్రదాయాలు, విద్యా విధానం, తెలుసుకున్న విషయాలు తదితర వాటిపై వారు తమ అనుభవాలు పంచుకున్నారు. ఏటా స్టూడెంట్స్ ఎక్సే ్చంజ్ ప్రోగ్రామ్ కోసం యూఎస్ కాన్సులేట్ సమాజంలో వెనకబడిన, పేద విద్యార్థులకు అమెరికాలో చదువుకునే అవకాశం కల్పిస్తోంది. – సాక్షి, హైదరాబాద్ నాయకత్వ లక్షణాలు మెరుగయ్యాయి అమెరికాలో చదువుకునేందుకు నాతోపాటు అనేక మందికి అవకాశం కల్పించిన అందరికీ ధన్యవాదాలు. కోర్సుకు ఎంపికయ్యాక.. మాకు ఆంగ్లభాష మీద పట్టు కోసం ఏర్పాటుచేసిన క్లాసులు ఎంతో ఉపయోగపడ్డాయి. అమెరికాలో చదువు అనంతరం నాలో నాయకత్వ లక్షణాలు బాగా మెరుగుపడ్డాయి. – పూర్ణ మలావత్, పర్వతారోహకురాలు. మరచిపోలేని అనుభవం ఇది మరచిపోలేని అనుభవం. మాది చాలా చిన్న కుటుంబం. విదేశాల్లో చదువుకునే అవకాశం రావడం నాకు దక్కిన వరం. వివిధ దేశాల నుంచి వచ్చిన విద్యార్థులతో కలసి చదువుకోవడం మర్చిపోలేని అనుభూతి. నైపుణ్యాలు పెంచుకునేందుకు చక్కటి వేదిక. నా ఇంగ్లిష్ మెరుగుపరచుకునేందుకు టీచర్లు ఎంతగానో సాయం చేశారు. ఇపుడు జీవితంలో నా లక్ష్యం చేరుకుంటానన్న ధీమా వచ్చింది. – సంజుక్త సింగ్. కమ్యూనికేషన్ స్కిల్స్ పెరిగాయి ఇది చాలా మంచి ప్రోగ్రామ్. క్యాంపస్‌లో వాతావరణం బాగుం ది. ప్రారంభంలో కొద్దిగా ఇబ్బంది పడినా క్రమంగా అలవాటయ్యింది. ఈ విద్యాభ్యాసం నా కమ్యూనికేషన్ స్కిల్స్ పెరగడానికి ఎంతో దోహదపడింది. ఈ కోర్సు కోసం మూడు నెలలు కష్టపడ్డాను. ఆన్లైన్లో పుస్తకాలు కొన్నాను. యూఎస్ కాన్సులేట్ అధికారులు కూడా సమాచారం విషయంలో నాకు ఎంతో సహకరించారు. – ప్రియాంక గడారి గర్వంగా ఉంది ఈ అవకాశం లభించినందుకు చాలా గర్వపడ్డా. అమెరికాలో 11వ క్లాస్ చదివాను. అక్కడి ప్రభుత్వం గురించి తెలు సుకునే అవకాశం దక్కింది. అలాగే పుస్తకాలు చదవడం నా భాషా నైపుణ్యం పెంపొందించుకునేందుకు దోహదపడ్డాయి. అమెరికాతోపాటు వివిధ దేశాల సంస్కృతులూ పరిచయమయ్యాయి. –నెమలి సిద్ధార్థ్ -
అత్యుత్తమ చదువులకు అమెరికా
స్టడీ అబ్రాడ్ : కంట్రీ ప్రొఫైల్ విదేశీ విద్యకు ప్రపంచంలో ఎన్నో దేశాలు అందుబాటులో ఉన్నాయి. అయితే భారతీయ విద్యార్థులకు.. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలవారికి అమెరికా.. మొదటి గమ్యస్థానంగా నిలుస్తోంది. అభిరుచికి తగిన, సత్వర ఉపాధినందించే కోర్సులుండటమే ఇందుకు కారణం. అమెరికాలో విద్యనభ్యసించే భారతీయ విద్యార్థుల సంఖ్య.. మార్చి-2016 నాటికి 1,94,438కి చేరుకుంది. ఈ నేపథ్యంలో యూఎస్ విద్యా విధానంలోని ప్రత్యేకతలపై ఫోకస్... నాణ్యమైన విద్య.. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా నాణ్యమైన విద్య.. సులువైన నిబంధనలతో అందుబాటులో ఉంటుంది. ఇక్కడి యూనివర్సిటీల్లో మెరుగైన మౌలిక సౌకర్యాలు, పరిశోధనలకు అనువైన వాతావరణం, నిష్ణాతులైన అధ్యాపకులు ఉంటారు. గ్రాడ్యుయేట్ స్థాయిలోనే మంచి ఉపాధినందించే కోర్సులు ఉంటాయి. లెర్నింగ్ బై డూయింగ్ లెర్నింగ్ బై డూయింగ్ విధానంలో సమగ్ర విద్య అందుతుంది. విద్యార్థులు క్యాంపస్‌లో పనిచేసుకోవడానికి వారానికి 20 గంటలు, సెలవులతో కలిపితే 40 గంటల వరకు అవకాశం ఇస్తారు. విదేశీ విద్యార్థులకు క్యాంపస్ బయట పనిచేసుకోవడానికి అనుమతి ఉండదు. ప్రభుత్వ ప్రత్యేక అనుమతితో పనిచేసుకునే అవకాశం పొందవచ్చు. చాలా డిగ్రీ కోర్సుల్లో 12 నెలల పాటు ప్రాక్టికల్ ట్రైనింగ్ ఉంటుంది. దీంతో వారికి నచ్చిన రంగాన్ని ఎంచుకునే అవకాశం లభిస్తుంది. అనుకూలతలు అమెరికా విద్యా వ్యవస్థలో ఎన్నో వెసులుబాట్లు ఉన్నాయి. కోర్సును మధ్యలో మార్చుకునే అవకాశం ఉంటుంది. గ్రాడ్యుయేషన్‌లో మొదటి రెండేళ్ల తర్వాత కోర్సుపై ఒక అవగాహన వస్తుంది. అప్పుడు విద్యార్థుల అభిరుచిని బట్టి కోర్సు మారే సౌలభ్యం ఉంది. దీంతో ఇష్టంలేని కోర్సు పూర్తి చేయాల్సి వస్తుందనే బాధ ఉండదు. టెక్నాలజీ విద్యలో అత్యుత్తమ టెక్నాలజీని అందిస్తామని అమెరికా యూనివర్సిటీలు గర్వంగా చెప్పుకుంటాయి. సాంకేతిక పరికరాలు, వనరులను సమకూర్చడంలో ముందుంటాయి. ఆధునిక టె క్నాలజీని వినియోగించుకుని విద్యార్థులు నైపుణ్యాలు పెంపొందించుకునేలా దోహదపడతాయి. క్యాంపస్ అనుభవం క్యాంపస్ జీవనం అమెరికా విద్యా వ్యవస్థలోనే గొప్ప అంశం. ఎందుకంటే ప్రపంచంలోని అన్ని దేశాల విద్యార్థులు అక్కడే ఉంటారు. సానుకూల వాతావరణంలో జరిగే చర్చల ద్వారా ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు. అంతర్జాతీయ స్థాయి గుర్తింపు నాణ్యతా ప్రమాణాలు ఉన్న అమెరికా విద్యకు మంచి గుర్తింపు ఉంది. విద్యా సర్టిఫికెట్లకు దాదాపు ప్రపంచంలోని అన్ని దేశాల్లో మంచి ఆదరణ ఉంటుంది. అక్కడ గతేడాది మార్చి నాటికి 1,48,360 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తుండగా.. ఈ ఏడాది మార్చి నాటికి 1,94,438కి చేరుకుందని స్టూడెంట్ అండ్ ఎక్స్ఛేంజ్ విజిటర్ ప్రోగ్రామ్ పేర్కొంది. విదేశాల్లో విద్యాభ్యాసానికి వెళ్లేందుకు, వీసా కోసం దరఖాస్తు చేసుకునేందుకు కన్సల్టెన్సీల బదులు రిప్రజెంటేటివ్స్‌ను సంప్రదించడం మంచిది. ఎందుకంటే కన్సల్టెన్సీలకు విదేశీ విద్యాసంస్థలతో ప్రత్యక్ష సంబంధాలు ఉండవు. రిప్రజెంటేటివ్స్ ఆయా ఇన్స్టిట్యూట్లతో నేరుగా టచ్‌లో ఉంటారు. అందువల్ల వాళ్లయితే ఖచ్చితమైన, తాజా సమాచారం చెబుతారు. బోగస్ వెబ్సైట్లు, కన్సల్టెన్సీల ద్వారా ప్రవేశించిన చాలా మంది భారతీయ విద్యార్థులను అమెరికా ఇటేవలే వెనక్కి పంపిన విషయం తెలిసిందే. - ఇంతియాజ్ బన్నూరు, ఏఈసీసీ గ్లోబల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ -
సరైన ఎంపికతోనే అమెరికాకు రావాలి!
యూఎస్ డిప్లొమాటిక్ మిషన్ డిప్యూటీ చీఫ్ మైకేల్ పెలిటియర్ ♦ మంచి వర్సిటీని ఎంపిక చేసుకోవాలి ♦ ప్రైవేటు ఏజెన్సీలు, ఏజెంట్ల సలహాలతో సమస్యలు ♦ అమెరికా ప్రభుత్వ వెబ్సైట్ల నుంచి సమాచారం తీసుకోవాలి ♦ ‘బ్లాక్‌లిస్టు’ అంటూ ఏమీ లేదు ♦ చట్టబద్ధమైన పత్రాలు, సరైన వీసా లేకుంటేనే వెనక్కి పంపుతారు ♦ అధికారుల ప్రశ్నలకు సరిగా సమాధానం చెప్పాలి ♦ ప్రతి విద్యార్థి కేసును ప్రత్యేకంగా పరిగణిస్తారు ♦ నిబంధనలను పాటించాల్సిన బాధ్యత విద్యార్థులదేనని వెల్లడి సాక్షి, హైదరాబాద్: ఉన్నత చదువుల కోసం అమెరికాకు వచ్చే విద్యార్థులు, వారి తల్లిదండ్రులపై పెద్ద బాధ్యతే ఉంటుందని భారత్‌లో అమెరికా డిప్లొమాటిక్ మిషన్ డిప్యూటీ చీఫ్ మైకేల్ పెలిటియర్ పేర్కొన్నారు. చదువు విషయంలో విద్యార్థి ఆలోచనలకు తగినట్లు వర్సిటీ ఎంపికతో పాటు కచ్చితమైన, చట్టబద్ధమైన పత్రాలు, సరైన వీసాతో అమెరికాకు వస్తే ఏ సమస్యలు ఉండవని ఆయన స్పష్టం చేశారు. హైదరాబాద్ పర్యటనలో ఉన్న ఆయన మంగళవారం ఇక్కడి ఓ ప్రైవేటు కళాశాలలో ఎంపిక చేసిన కొన్ని పత్రికల విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు.. విద్యార్థులను వెనక్కి పంపిన ఘటనలపై ఏం తేల్చారు? ప్రతి విద్యార్థి అంశం ప్రత్యేకమైనది. ఓ కేసుతో మరోదానికి పోలిక లేదు. మేం విశ్వసనీయమైన, చట్టబద్ధమైన ప్రతి విద్యార్థిని సాదరంగా ఆహ్వానిస్తాం. అమెరికాకు రావాలనుకునే విద్యార్థులు నిజంగానే అక్కడి విద్యా వనరులను వినియోగించుకోవాలి. మంచి వర్సిటీలను ఎంపిక చేసుకోవాలి. అమెరికా వెళ్లాలనే కోరికను బలపరిచే ఉద్దేశం, కచ్చితమైన పత్రాలను కలిగి ఉండాలి. యూఎస్ ఎడ్యుకేషన్ విభాగం వెబ్సైట్లో సూచించిన ‘వీసా ప్రాసెసింగ్’ ప్రక్రియను అనుసరిస్తే ఏ ఇబ్బందులూ ఉండవు. సరైన వర్సిటీ ఎంపిక కోసం అమెరికాలోని బంధువులు, స్నేహితుల సలహా తీసుకోవాలి. అమెరికాలో 9 వేల అధీకృత విద్యాసంస్థలు ‘ఐ-20’ను జారీ చేస్తున్నాయి. మీ ‘ఐ-20’ పొందాక విద్యార్థి వీసా కోసం ustraveldocs.com వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలి. అమెరికాలో ప్రవేశం కోసం మరో దరఖాస్తు చేసుకోవాలి. విమానాశ్రయంలో దిగి అమెరికాలోకి ప్రవేశం కోసం పత్రాలను సమర్పిస్తే అక్కడి ఇమిగ్రేషన్ అధికారులు కొన్ని ప్రశ్నలు వేస్తారు. మీరెందుకు అమెరికాలో చదవాలనుకుంటున్నారన్న విషయాన్ని తెలుసుకోవాలనుకుంటారు. విద్యార్థుల సమాధానాలను బలపరిచే విధంగా వీసా, ఇతర పత్రాలు ఉన్నాయా లేవా? అని పరిశీలిస్తారు. ఏదైనా కారణాలతో తప్పుడు వీసా అని భావిస్తే మాత్రం అనుమతించరు. రెండు వర్సిటీలకు వెళ్తున్న విద్యార్థులు వెనక్కి వస్తున్నారు? వాటిని బ్లాక్‌లిస్టులో పెట్టారని ఓ ఎయిర్‌లైన్స్ సంస్థ చెప్పడంలో వాస్తవమెంత? ఆ వర్సిటీలకు విద్యార్థులు ఇంకా వెళుతూనే ఉన్నారు. బ్లాక్‌లిస్టు అంటూ ఏం లేదు. ఆ వర్సిటీలూ ‘ఐ-20’ జారీ చేసే అధికారాన్ని కలిగి ఉన్నాయి. బ్లాక్‌లిస్టు విషయాన్ని ఎయిర్‌లైన్స్‌నే అడగండి. సరైన పత్రాలు కలిగి ఉన్నట్లు భావిస్తే తిరిగి వచ్చిన వారెవరైనా వీసా కోసం మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ఇది సుదీర్ఘమైన, వ్యయప్రయాసలతో కూడిన ప్రక్రియ. ఎక్కడ చదవాలనుకుం టున్నారు, ఏం చదవాలనుకుంటున్నారన్న అంశాలపై మాత్రం పునరాలోచన చేసుకోవాలి. కొందరు అమెరి కాలోని బంధువుల వద్ద ఉండాలనుకుంటారు. మరి కొందరు వేరుగా ఉండాలనుకుంటారు. కొందరు పెద్ద నగరాల్లో, మరికొందరు చిన్న పట్టణాలను ఎంపిక చేసుకుం టారు. ప్రతి విద్యార్థి సొంత వాస్తవికతను కలిగి ఉండాలి. ఉన్నత చదువుల కోసం విద్యా రుణాలు తీసుకున్నవారు.. తిప్పిపంపడంతో తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రాథమిక దశలోనే లోపాలున్న వీసా దరఖాస్తులను తిరస్కరించవచ్చు కదా? భారత్‌లో యూఎస్ కాన్సులేట్ ప్రతి వీసా దరఖాస్తును నిశితంగా పరిశీలిస్తుంది. చట్టబద్ధమైన పత్రాలు గల విద్యార్థులకు అమెరికాలో చదువుకోవడానికి అవకాశం కల్పించేందుకు సాధ్యమైనంతగా ప్రయత్నిస్తుంది. కాన్సులేట్ అధికారులు తమకు ఉన్న సమయంలోనే సాధ్యమైనన్ని ఎక్కువ దరఖాస్తులను పరిశీలించేందుకు.. తమ వద్ద ఉన్న సమాచారంతో సరైన నిర్ణయం తీసుకోవడానికి ప్రయత్నిస్తారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ ఏడాది భారత్‌లోని అమెరికన్ కాన్సులేట్లు 10 లక్షల వీసా దరఖాస్తులను పరిశీలించాయి. చదువు కోసం వచ్చి ఉద్యోగాలు చేస్తున్నారని విద్యార్థులను వెనక్కి పంపారు. ఉద్యోగం చేసుకునే అవకాశమిస్తున్న వర్సిటీలపై చర్యలు ఎందుకు తీసుకోరు? వర్సిటీలకు ‘ఐ-20’ జారీచేసే అధికారాన్ని ఆషామాషీగా అప్పగించరు. చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. క్రమం తప్పకుండా ఆ వర్సిటీల పనితీరును సమీక్షిస్తుంటారు కూడా. అంతేకాదు అమెరికాలోని అన్ని వర్సిటీలకు ఈ అవకాశం ఇవ్వలేదు. అయితే వీసా నిబంధనలు పాటించడం విద్యార్థి బాధ్యత. నిబంధనలు పాటిస్తే అక్కడి వర్సిటీలకు, తిరిగి వచ్చాక స్వదేశానికి ఎంతో మేలు చేయగలుగుతారు. వర్సిటీల సమాచారం కోసం ఏ ఏజెన్సీలను సంప్రదించాలి? మేం ఏ ప్రైవేటు ఏజెన్సీ, ఏజెంట్లకు మద్దతు తెలపం. విద్యా సంబంధిత సలహాల కోసం యూఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ ఫర్ ఎడ్యుకేషన్ వెబ్సైట్educationusa.state.govలో వర్సిటీలకు సంబంధించిన పూర్తి సమాచారం అందుబాటులో ఉంది. ఎవరైనా ఉచితంగా పొందవచ్చు. తమకు బేడీలు వేశారని, నిర్బంధించారని తిరిగొచ్చిన విద్యార్థులు చెబుతున్నారు. విద్యార్థులేమైనా నేరం చేశారా? అమెరికాలో ప్రవేశాన్ని నిరాకరిస్తే సాధ్యమైనంత త్వరగా వెనక్కి వెళ్లేందుకు తదుపరి విమానం కోసం వేచిచూడక తప్పదు. ఒక్కో విమానాశ్రయంలో ఒక్కో విధమైన వెయిటింగ్ సదుపాయాలుంటాయి. ఎక్కడెక్కడ ఎలాంటి సదుపాయాలున్నాయో చెప్పలేను. అయితే ప్రతి విద్యార్థితో మర్యాదపూర్వకంగా ప్రవర్తిస్తూ వృత్తి నియమావళికి అనుగుణంగా ఇమిగ్రేషన్ అధికారులు నడుచుకుంటారు. అమెరికాకు వెళుతున్న విద్యార్థులను తిప్పి పంపుతున్నారు. ఆ సమస్యను పరిష్కరించేందుకు తీసుకున్న చర్యలు? మైకెల్: భారత్ నుంచి ప్రత్యేకంగా తెలంగాణ, ఏపీల నుంచి అమెరికా వస్తున్న విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగింది. హైదరాబాద్‌లోని యూఎస్ కాన్సులేట్ గతేడాది వీసా దరఖాస్తుల్లో 50 శాతం పెరుగుదలను చూసింది. మా దేశానికి విద్యార్థులను సాదరంగా ఆహ్వానిస్తాం. అయితే విద్యార్థులను ఎందుకు వెనక్కి పంపారో తెలుసుకోవడానికి భారత విదేశాంగ శాఖ, అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్లు ప్రయత్నించాయి. విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై, హైదరాబాద్, అహ్మదాబాద్, బెంగళూరుల్లో ‘యూఎస్ విద్య సలహా కేంద్రా’లను ఏర్పాటు చేశాం. అమెరికా చదువులకు ఉపయోగపడే 800 ఫోన్ నంబర్లు, వివిధ వెబ్సైట్లు వివరాలు వాటిల్లో అందుబాటులో ఉంచాం. -
రేపు యూఎస్ ఎడ్యుకేషన్ ఎక్స్పో
సాక్షి, హైదరాబాద్: నగరంలోని తాజ్దక్కన్ హోటల్లో 25న ‘యూఎస్ ఎడ్యుకేషన్ అండ్ స్కాలర్షిప్ ఎక్స్ పో’ని ఇంటర్నేషనల్ స్టూడెంట్ నెట్వర్క్ (ఐఎస్ఎన్) నిర్వహించనుంది. ప్రతిభావంతులైన గ్రాడ్యుయేట్, అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు ఉపకార వేతనాలు అందించటం ఎక్స్పో ముఖ్య ఉద్దేశం. ఇంజనీరింగ్, బిజినెస్, ఫార్మసీ, ఆర్ట్స్ కోర్సులను అభ్యసించాలనుకున్న విద్యార్థులు తమ రిపోర్ట్ కార్డులు, ట్రాన్స్క్రిప్టులు, టోఫెల్ స్కోర్ వివరాలతో ఎక్స్పోకి హాజరుకావాలని నిర్వాహకులు కోరారు. మరిన్ని వివరాలకు 99490 93501లో సంప్రదించవచ్చు. మే 21న ఈసెట్ ఇంజనీరింగ్ ద్వితీయ సంవత్సరంలో ప్రవేశాలకు మే 21న ఈసెట్‌ను నిర్వహించనున్నట్లు ఉన్నత విద్యా శాఖ వర్గాలు వెల్లడించాయి. దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను ఈ నెల 28న విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు. మార్చి 6 నుంచి ఏప్రిల్ 15 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. పరీక్ష ఫలితాలను మే 31న వెల్లడించనున్నారు. రేపటి నుంచి పుస్తక ప్రదర్శన తెలుగు అకాడమీ ఆధ్వర్యంలో హిమాయత్‌నగర్‌లోని ఆ కార్యాలయ ఆవరణలో ఈ నెల 25వ తేదీ నుంచి పుస్తకాల ప్రదర్శన, విక్రయాలు నిర్వహించనున్నారు. వచ్చేనెల 6వ తేదీ వరకు కొనసాగే ఈ ప్రదర్శన ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల దాకా ఉంటుంది. ఇంటర్, డిగ్రీ, పీజీ, ఇతర ప్రచురణలతోపాటు ప్రపంచ తెలుగు మహాసభల్లో విడుదల చేసిన లఘు గ్రంథాలను ఈ ప్రదర్శనలో ఉంచనున్నారు. ఎంపిక చేసిన పుస్తకాలపై ధరలో 50% రాయితీ ఇవ్వనున్నారు. వివరాలకు 040- 23225215లో సంప్రదించవచ్చు. -
అమెరికా చదువులపై డాలర్ ఎఫెక్ట్ లేదు: వెల్ప్స్
ఓవైపు డాలర్ కొండెక్కుతున్నా... అమెరికాలో చదువుకు డిమాండ్ తగ్గలేదు. ది యునెటైడ్ స్టేట్స్-ఇండియా ఎడ్యుకేషనల్ ఫౌండేషన్, ఇనిస్టిస్ట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో శనివారం తాజ్ దక్కన్లో జరిగిన ‘యూఎస్ యూనివర్సిటీస్ ఫెయిర్’కు విద్యార్థులు వెల్లువెత్తారు. పెద్దసంఖ్యలో ప్రదర్శనకు హాజరై అమెరికా చదువులు, వీసా దరఖాస్తు విధానాలపై తెలుసుకున్నారు. అమెరికన్ కాన్సులేట్ ప్రజాసంబంధాల అధికారి ఏప్రిల్ వెల్ప్స్ మాట్లాడుతూ.. అమెరికాలో ఉన్నత విద్య పై భారతీయ తల్లిదండ్రులకు ఎంతో నమ్మకమని అందువల్లే ఏటా భారత్ నుంచి పెద్దసంఖ్యలో విద్యార్థులు తమ దేశం వస్తున్నట్లు తెలిపారు. అమెరికాలో ఉన్నత విద్యనభ్యసించాలనుకునే వారిపై ‘డాలర్’ ప్రభావం ఉండదన్నారు. విద్యార్థులకు యూఎస్ వర్సిటీలపై అవగాహన కల్పించేందుకు ఫెయిర్ ఉపయోగపడుతుందన్నారు. సాధారణంగా భారత్ నుంచి పీజీ కోర్సుల్లో చేరే విద్యార్థులు ఎక్కువ మంది ఉంటారని చెప్పారు. గత నాలుగైదేళ్లలో డిగ్రీ స్థాయి కోర్సుల్లో చేరేందుకు సైతం భారతీయులు మొగ్గుచూపుతున్నట్లు వివరించారు. గత ఏడాది లక్షమంది విద్యార్థులు భారత్ నుంచి యూఎస్ వీసా పొందారని తెలిపారు. కాగా, ఫెయిర్‌లో అమెరికాకు చెందిన 25 గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయాల ప్రతినిధులు పాల్గొని తమ వద్ద ఉన్న అవకాశాల గురించి వివరించారు. వీసాపై అవగాహన సదస్సు ప్రదర్శనకు వచ్చిన విద్యార్థుల కోసం ‘వీసా’కి సంబంధించిన సమాచారంపై సదస్సును నిర్వహించారు. పలువురు విద్యార్థులు ఎడ్యుకేషన్ వీసా పొందడంలో తామెదుర్కొన్న ఇబ్బందులపై అధికారులను అడిగి సందేహాలు నివృత్తి చేసుకున్నారు. ఎడ్యుకేషన్ వీసా వివరాల కోసం 1800 103 1231 టోల్ ఫ్రీ నంబర్లో (సోమవారం నుంచి శుక్రవారం వరకు రోజూ మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల మధ్య) తెలుసుకోవచ్చని చెప్పారు. దీనికోసం ప్రత్యేకంగా ఫేస్బుక్ పేజి సైతం ఉందన్నారు.