అమెరికా చదువులపై డాలర్ ఎఫెక్ట్ లేదు: వెల్ప్స్
ఓవైపు డాలర్ కొండెక్కుతున్నా... అమెరికాలో చదువుకు డిమాండ్ తగ్గలేదు. ది యునెటైడ్ స్టేట్స్-ఇండియా ఎడ్యుకేషనల్ ఫౌండేషన్, ఇనిస్టిస్ట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో శనివారం తాజ్ దక్కన్‌లో జరిగిన ‘యూఎస్ యూనివర్సిటీస్ ఫెయిర్’కు విద్యార్థులు వెల్లువెత్తారు. పెద్దసంఖ్యలో ప్రదర్శనకు హాజరై అమెరికా చదువులు, వీసా దరఖాస్తు విధానాలపై తెలుసుకున్నారు.
అమెరికన్ కాన్సులేట్ ప్రజాసంబంధాల అధికారి ఏప్రిల్ వెల్ప్స్ మాట్లాడుతూ.. అమెరికాలో ఉన్నత విద్య పై భారతీయ తల్లిదండ్రులకు ఎంతో నమ్మకమని అందువల్లే ఏటా భారత్ నుంచి పెద్దసంఖ్యలో విద్యార్థులు తమ దేశం వస్తున్నట్లు తెలిపారు. అమెరికాలో ఉన్నత విద్యనభ్యసించాలనుకునే వారిపై ‘డాలర్’ ప్రభావం ఉండదన్నారు. విద్యార్థులకు యూఎస్ వర్సిటీలపై అవగాహన కల్పించేందుకు ఫెయిర్ ఉపయోగపడుతుందన్నారు.
సాధారణంగా భారత్ నుంచి పీజీ కోర్సుల్లో చేరే విద్యార్థులు ఎక్కువ మంది ఉంటారని చెప్పారు. గత నాలుగైదేళ్లలో డిగ్రీ స్థాయి కోర్సుల్లో చేరేందుకు సైతం భారతీయులు మొగ్గుచూపుతున్నట్లు వివరించారు. గత ఏడాది లక్షమంది విద్యార్థులు భారత్ నుంచి యూఎస్ వీసా పొందారని తెలిపారు. కాగా, ఫెయిర్‌లో అమెరికాకు చెందిన 25 గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయాల ప్రతినిధులు పాల్గొని తమ వద్ద ఉన్న అవకాశాల గురించి వివరించారు.
వీసాపై అవగాహన సదస్సు
ప్రదర్శనకు వచ్చిన విద్యార్థుల కోసం ‘వీసా’కి సంబంధించిన సమాచారంపై సదస్సును నిర్వహించారు. పలువురు విద్యార్థులు ఎడ్యుకేషన్ వీసా పొందడంలో తామెదుర్కొన్న ఇబ్బందులపై అధికారులను అడిగి సందేహాలు నివృత్తి చేసుకున్నారు. ఎడ్యుకేషన్ వీసా వివరాల కోసం 1800 103 1231 టోల్ ఫ్రీ నంబర్‌లో (సోమవారం నుంచి శుక్రవారం వరకు రోజూ మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల మధ్య) తెలుసుకోవచ్చని చెప్పారు. దీనికోసం ప్రత్యేకంగా ఫేస్‌బుక్ పేజి సైతం ఉందన్నారు.