
రూపాయి విలువ తగ్గుదలతో పెరుగుతున్న ధరలు
నూనెల దిగుమతిపై భారీగా సుంకం విధిస్తున్న కేంద్రం..
నెలరోజుల్లో లీటర్‌పై 10 నుంచి 15 శాతం పెరిగిన భారం
సాక్షి, హైదరాబాద్ : అమెరికా డాలర్‌తో రూపాయి మారకం విలువ తగ్గుతుండడంతో దేశీయంగా వంటనూనెల ధరలకు రెక్కలొస్తున్నాయి. జనవరి 24వ తేదీ నుంచి రూపాయి విలువ భారీగా పడిపో వటంతో, వంటనూనెల ధరల్లోనూ మార్పులు వచ్చా యి. రాష్ట్రంలో 20 రోజుల క్రితం ధరలతో పోల్చితే ప్రస్తుతం నూనెల ధరలు 10 నుంచి 15 శాతం పెరిగాయి. మూడేళ్ల క్రితం రష్యా, ఉక్రెయిన్ యుద్ధం మొదలైనప్పుడు వంట నూనె ధరలు భారీగా పెరిగాయి. లీటర్ సన్‌ఫ్లవర్ నూనె రూ.200 వరకు చేరింది.
పామాయిల్ ధరలు కూడా అప్పుడు భారీగా పెరిగాయి. కేంద్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవటంతో ధరలు దిగివచ్చినప్పటికీ.. లీటర్ నూనె ధర ఆయా కంపెనీల విలువను బట్టి రూ.125 పైనే కొనసాగింది. గత ఏడాది సెప్టెంబర్‌లో కేంద్రం నూనెలపై దిగుమతి సుంకాన్ని భారీగా పెంచింది. సన్‌ఫ్లవర్, సోయాబీన్ ముడి నూనెలపై దిగుమతి సుంకాన్ని 5.5 శాతం నుంచి ఏకంగా 27.5 శాతానికి పెంచింది.
రిఫైన్డ్ నూనెలపై సుంకాన్ని 13.7 శాతం నుంచి 35.7 శాతానికి పెంచింది. దీంతో మరోసారి దేశంలో వంటనూనెల ధరలకు రెక్కలొచ్చాయి. రూపాయి మారకం విలువ పడిపోతుండటంతో 20 రోజుల క్రితం వరకు రిటైల్ మార్కెట్‌లో రూ.135 ఉన్న లీటర్ వంట నూనె ధర.. ప్రస్తుతం రూ.150 దాటింది.
60 శాతం దిగుమతే..
మనదేశంలో వినియోగించే వంటనూనెలో 60 శాతానికి పైగా ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నదే. నవంబర్ నుంచి ఆ తర్వాతి ఏడాది అక్టోబర్ వరకు నూనె సంవత్సరంగా అంతర్జాతీయంగా పేర్కొంటారు. గత నూనె సంవత్సరంలో అత్యధికంగా 164.7 లక్షల మెట్రిక్ టన్నుల నూనెను భారత్ దిగుమతి చేసు కుంది. ఇందుకోసం రూ.1,38,424 కోట్లను వెచ్చించింది.
భారత్‌కు నూనెను ఎగుమతి చేసే దేశాల్లో ఇండోనేషియా, అర్జెంటీనా మొదటి రెండు స్థానాల్లో ఉండగా, పామాయిల్‌ను మలేషియా అధికంగా ఎగుమతి చేస్తోంది. బ్రెజిల్ నుంచి సోయాబీన్, రష్యా నుంచి క్రూడ్ సన్‌ఫ్లవర్ ఆయిల్, ఉక్రెయిన్ నుంచి సన్‌ఫ్లవర్ నూనెను దిగుమతి చేసుకుంటున్నాం. దిగుమతి చేసుకున్న నూనెలకు డాలర్ల రూపంలో చెల్లిస్తుండడంతో ఆ ప్రభావం రిటైల్ నూనెల మార్కెట్‌పై పడుతోంది.
ప్రస్తుతం రిటైల్ మార్కెట్ నూనెల ధరలు ఆయా కంపెనీలను బట్టి రూ.150 నుంచి రూ.170 వరకు ఉన్నాయి. కాగా దేశంలో రిటైల్ ద్రవ్యోల్బణం జనవరిలో ఐదు నెలల కనిష్ట స్థాయి 4.31 శాతానికి తగ్గింది. ఇది 2024 డిసెంబర్‌లో 5.22 శాతం ఉండగా, ఏడాది క్రితం 5.1 శాతంగా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment