ఇండియన్ రూపాయి సుమారు పదేళ్లపాటు అంతర్జాతీయ మార్కెట్‌లో ప్రజలను, పాలకులను ఇబ్బందులకు గురిచేస్తూ వచ్చింది. గ్లోబల్, దేశీయ పరిస్థితులు 2013లో రూపాయి పతనానికి దారితీశాయి. నాటి నుంచి ఇంచుమించు స్థిరంగా కొనసాగిన భారత కరెన్సీ- ఈసారి అంతర్జాతీయ పరిస్థితుల కారణంగా తీవ్ర ఆటుపోట్లకు గురైంది. 2021 నుంచి దాదాపు 12 శాతం నష్టపోయింది. అయితే 2023లో దాదాపు కన్సాలిడేషన్‌లో ఉంది.
అంతర్జాతీయ మార్కెట్లో భారత రూపాయి కొంతకాలంగా పతనమవుతూ వచ్చింది. డాలరు బలపడటం, ముడిచమురు ధరలు విపరీతంగా పెరగడం, విదేశీ పెట్టుబడులు వెనక్కి తరలిపోవడమే ఇందుకు ప్రధాన కారణాలుగా నిపుణులు విశ్లేషిస్తున్నారు. యూఎస్ ఫెడరల్ రిజర్వు 2023లో వడ్డీరేట్లను మొదట్లో కొంతమేర పెంచినా తదుపరి వడ్డీరేట్లను తగ్గించే అవకాశం ఉందని సానుకూలంగా స్పందించింది. భారత దిగుమతుల్లో అత్యధికం ముడిచమురే కావడంతో, పెరిగిన ధరల కారణంగా వాణిజ్యలోటు ఏర్పడింది. మదుపరులు ఈక్విటీ, రుణాల రూపంలో ఉన్న విదేశీ ప్రైవేటు పెట్టుబడులను డాలర్లలోకి మార్చుకోవడంతో రూపాయి విలువ పడిపోయింది. దాంతో తీవ్ర ఒత్తిడికి గురైంది. నవంబర్ చివరి నుంచి డిసెంబర్ నెలలో మార్కెట్లు జీవితకాల గరిష్ఠాల్లోకి చేరుకోవడంతో తిరిగి ఎఫ్‌ఐఐలు మార్కెట్‌లో పెట్టుబడులు పెడుతున్నారు. ఫలితంగా నెల రోజుల నుంచి రూపాయి కన్సాలిడేషన్‌లో ఉంది.
రూపాయి పతనానికి ఈ ఏడాదిలో కొంత విరామం లభిస్తుందన్నది ఆర్థిక నిపుణుల అంచనా. గతంలో మన కరెన్సీ పతనానికి దారితీసిన పరిస్థితుల తీవ్రత 2024లో అంతగా ఉండకపోవచ్చు. భారత్ తన చమురు అవసరాలకు సుమారు 85శాతం దిగుమతులపైనే ఆధారపడుతోంది. నిజానికి ముడిచమురు వినియోగం దేశ ఆర్థికప్రగతికి చిహ్నం. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు ఇటీవల తగ్గుముఖం పట్టడం దేశ ఆర్థికాభివృద్ధికి తోడ్పడుతుంది. మన చమురు దిగుమతులు దేశ మొత్తం దిగుమతుల్లో 30శాతం వరకు ఉన్నాయి.
తగ్గనున్న కరెంటు ఖాతా లోటు..
భారత కరెంటు ఖాతాలో సింహభాగం సాఫ్ట్‌వేర్ ఎగుమతులు, ప్రైవేటు బదలాయింపులదే. భవిష్యత్తులో ఈ రెండింటి వాటా ఇంకా పెరుగుతుందన్న అంచనాలు ఉన్నాయి. దిగివస్తున్న ముడిచమురు ధరలతో వస్తు వాణిజ్యలోటు తగ్గుముఖం పట్టడం; సాఫ్ట్‌వేర్, ప్రైవేటు బదలాయింపులు పెరగడం- కరెంటు ఖాతా లోటును కొంతవరకు పరిష్కరించగలుగుతాయి. కొత్త ఏడాదిలో ముఖ్యంగా ముడిచమురు వాణిజ్య లోటు తగ్గడం, కరెంటు ఖాతా లోటు సన్నగిల్లడం, విదేశీ పెట్టుబడుల రాక వంటి బలమైన ఆర్థిక పరిస్థితులు రూపాయిని బలోపేతం చేస్తాయని చెప్పవచ్చు.
మాంద్యం ప్రభావం ఇలా..
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న మాంద్యం పరిస్థితులతో కొన్ని దేశాలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ ఏడాదిలో మాంద్యం మరింత తీవ్రంగా మారవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 2023లో ప్రపంచ వృద్ధిరేటు 3 శాతం. 2024లో ఇది 2.9 శాతానికి పడిపోతుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) గతంలో వెల్లడించింది. ఈలోగా డాలరు సాధారణంగానే బలపడుతుంది. 2001 మాంద్యం సమయంలో డాలరు సూచీ ఆ ఏడాది జనవరిలో 108గా ఉండగా జులై నాటికి 121కు పెరిగి, ఆ తరవాత తగ్గింది. అలాగే 2008-09 మాంద్యం కాలంలో డాలరు సూచీ 71 నుంచి 89కు ఎగబాకి ఆ తరవాత కిందికి వచ్చింది. అంటే సాధారణంగా మాంద్యం సమయంలో డాలరు తొలుత బలపడి, తరవాత బలహీనపడుతుంది.
ఇదీ చదవండి: ఏడాదిలో రూ.81.90 లక్షల కోట్ల సంపద.. ఎక్కడంటే..
మిగతా దేశాలపై ఉన్నట్లే ఒకవేళ భారత్‌పైనా మాంద్యం ప్రభావం ఉంటుందని భావించినా- మాంద్యం మధ్యకాలం నుంచి విదేశీ పెట్టుబడులు భారత్‌లో విశేషంగా ప్రవహించి ఆ ప్రవాహం కొన్నాళ్లు కొనసాగుతుందని చరిత్ర చెబుతోంది. 2008-09 సంక్షోభ సమయంలో భారత్ నుంచి 1200 కోట్ల డాలర్ల మేర ఈక్విటీ వెనక్కి తరలిపోయింది. 2009లో మార్చి-జూన్ మధ్య మాంద్యం తిరోగమనం పట్టడంతో తిరిగి ఈక్విటీ రూపంలో పెట్టుబడులు భారత్‌లోకి రావడం మొదలయ్యాయి. అదే ఏడాది మార్చి- డిసెంబరు కాలంలో 1800 కోట్ల డాలర్ల మేర విదేశీ పెట్టుబడులు భారత్‌లోకి వచ్చాయి. దీన్ని బట్టి మాంద్యం తీవ్రరూపం దాల్చినా స్వల్పకాలమే ఉంటుందని చెప్పవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment