![world facing a shortage of mineral metals needed to provide alternatives to fossil fuels](/styles/webp/s3/article_images/2024/05/25/saireddy01.jpg.webp?itok=nf5IG7P0)
పర్యావరణ పరిరక్షణకు అవసరమైన పరిశోధనలు మంచి ఫలితాలు ఇస్తున్నాయి. కొత్త టెక్నాలజీల వినియోగం ద్వారా పరిశుభ్రమైన ఇంధనాలతో ప్రపంచంలో కాలుష్యాన్ని, వాతావరణ విధ్వంసాన్ని అదుపు చేయగలుగుతున్నాం. అయితే పెట్రోలు, డీజిల్ వంటి శిలాజ ఇంధనాలకు ప్రత్యామ్నాయాలు అందుబాటులోకి తీసుకురావడానికి అవసరమైన ఖనిజ లోహాల కొరత ప్రపంచానికి పొంచి ఉంది. ఎలక్ట్రిక్ వాహనాలు, విండ్ టర్బయిన్లు, సోలార్ ప్యానెల్స్ తదితర నూతన సాధనాలకు కీలకమైన ఖనిజ లోహాలు తగినంత స్థాయిలో ఇక ముందు లభ్యం కాకపోవచ్చని తాజా సమాచారం చెబుతోంది.
శిలాజ ఇంధనాలపై ఆధారపడడం తగ్గాలంటే కొత్త సాంకేతిక పరిజ్ఞానంతో పనిచేసే ప్రత్యామ్నాయాలకు రాగి, లిథియం లోహాలు అవసరం. రాగి విద్యుత్ ఉత్పత్తికి, లిథియం బ్యాటరీలు పనిచేయడానికి కీలకమనే విషయం తెలిసిందే. 2035 నాటికి ప్రపంచానికి అవసరమైన రాగి డిమాండును 70 శాతం, లిథియం డిమాండును 50 శాతం మేరకే తీర్చగలిగే పరిస్థితులున్నాయని పారిస్ కేంద్రంగా పనిచేసే అంతర్జాతీయ ఇంధన సంస్థ (ఐఈఏ) తన తాజా నివేదికలో హెచ్చరించింది. కిందటేడాది లిథియం, కోబాల్ట్, నికెల్, గ్రాఫైట్ ధరలు తగ్గడం మంచి పరిణామామమేగాని, దీంతో ఈ లోహాల ఉత్పత్తిలో నిమగ్నమైన రంగాల్లో పెట్టుబడులు తగ్గడం వల్ల భవిష్యత్తులో ఈ ఖనిజ లోహాల కొరత ప్రపంచదేశాల ప్రజలకు ఇబ్బందికరంగా మారుతుందని ఐఈఏ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఫతీహ్ బిరోల్ ఒక ప్రకటనలో తెలిపారు. ‘సోలార్ ప్యానెల్స్, బ్యాటరీలు, ఎలక్ట్రిక్ కార్లు వంటి నూతన సాంకేతిక సాధనాలకు ప్రపంచంలో డిమాండు విపరీతంగా పెరుగుతోంది. వాటి తయారీకి అత్యంత కీలకమైన ఖనిజ లోహాల సరఫరా తగినంత స్థాయిలో లేకపోతే ఈ డిమాండును తట్టుకోవడం కష్టమవుతుంది’ అని ఐఈఏ వివరించింది.
2040 వరకు 80వేల కోట్ల డాలర్లు
మైనింగ్ ప్రాజెక్టుల్లో 2040 వరకు ఇన్వెస్టర్లు 80వేల కోట్ల డాలర్ల పెట్టుబడులు పెడితేనే ప్రపంచంలో ఉష్ణోగ్రతలను పారిశ్రామిక యుగం మునుపటి స్థాయికి అంటే 1.5 డిగ్రీల సెల్సియస్ కు పరిమితం చేయడం సాధ్యమౌతుందని అంచనా. మైనింగ్ రంగంలో పెట్టుబడులు మందగిస్తే ఖనిజ లోహాల సరఫరా గణనీయంగా పడిపోతుందని ఐఈఏ హెచ్చరించింది. ప్రపంచంలో ఉష్ణోగ్రతలు తగ్గించడానికి ఉపకరించే సాధనాల తయారీకి కీలకమైన గ్రాఫైట్ వినియోగం 2040 నాటికి నాలుగు రెట్లు పెరుగుతుందని అంచనా. పైన పేర్కొన్న కీలకమైన కొన్ని ఖనిజ లోహాల ధరలు కొవిడ్ ముందునాటి స్థాయిలకు పడిపోయాయి. బ్యాటరీల తయారీకి అవసరమైన లోహాల ధరలు బాగా తగ్గిపోయాయి. అయినా భవిష్యత్తులో వాటి కొరత తప్పదని నిపుణులు భావిస్తున్నారు.
ఇండియాలో బ్యాటరీల తయారీకి అవసరమైన లిథియం నిక్షేపాలు పెద్ద మొత్తాల్లో ఉన్నట్టు గతేడాది కనుగొన్నారు. శిలాజ ఇంధనాలపై ఆధారపడడం తగ్గించడానికి, ప్రపంచ ఉష్ణోగ్రతలను అదుపు చేయడానికి అవసరమైన ఖనిజ లోహాల ఉత్పత్తి కేవలం కొన్ని దేశాకే పరిమితం కావడం మంచిది కాదు. దానివల్ల వాటి సరఫరా సాఫీగా సాగదు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో కీలక స్థానానికి చేరిన ఇండియా వంటి పెద్ద దేశాల్లో ఈ ఖనిజ లోహాల లభ్యత, విస్తృత స్థాయిలో ఉత్పత్తి ఎంతో అవసరమని అంతర్జాతీయ ఇంధన నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
- విజయసాయిరెడ్డి, వైఎస్సార్‌సీపీ, రాజ్యసభ సభ్యులు
Comments
Please login to add a commentAdd a comment