అక్టోబర్‌లో 7 శాతం అధికం
పండుగల సందర్భంగా పెరిగిన వినియోగం
డీజిల్ వినియోగం 3 శాతం డౌన్
న్యూఢిల్లీ: పండుగల సీజన్ మద్దతుతో దేశవ్యాప్తంగా పెట్రోల్ అమ్మకాలు అక్టోబర్ నెలలో 7.3 శాతం పెరిగాయి. కానీ, డీజిల్ అమ్మకాలు మాత్రం 3.3 శాతం తక్కువగా నమోదయ్యాయి. ఇంధన మార్కెట్లో 90 శాతం వాటా కలిగిన మూడు ప్రభుత్వరంగ ఆయిల్ కంపెనీలు (హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్, ఐవోసీ) అక్టోబర్‌లో 3.1 మిలియన్ టన్నుల పెట్రోల్‌ను విక్రయించాయి. క్రితం ఏడాది ఇదే నెలలో అమ్మకాలు 2.87 మిలియన్ టన్నులుగా ఉన్నాయి.
డీజిల్ విక్రయాలు మాత్రం 3.3 శాతం తక్కువగా 6.7 మిలియన్ టన్నులకు పరిమితమయ్యాయి. పండుగల సందర్భంగా వ్యక్తిగత వాహనాల (టూవీలర్లు, ప్యాసింజర్ కార్లు) వినియోగం సాధారణంగా పెరుగుతుంది. ఇది పెట్రోల్ విక్రయాల వృద్ధికి దారితీసినట్టు పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. సాగు రంగం నుంచి డిమాండ్ తక్కువగా ఉండడం డీజిల్ అమ్మకాలు తగ్గడానికి కారణమని తెలిపాయి. గడిచిన కొన్ని నెలల నుంచి డీజిల్, పెట్రోల్ అమ్మకాలు స్తబ్దుగానే కొనసాగుతున్నాయి.
దేశవ్యాప్తంగా అధిక వర్షాలకుతోడు, సాగు రంగం నుంచి డిమాండ్ తగ్గడం వాహనాల వినియోగాన్ని పరిమితం చేసింది. ఇక సెపె్టంబర్ నెల గణాంకాలతో పోల్చి చూసినా అక్టోబర్‌లో పెట్రోల్ విక్రయాలు 7.8 శాతం పెరిగాయి. డీజిల్ అమ్మకాలు 20 శాతం అధికంగా నమోదయ్యాయి. సెపె్టంబర్ నెలలో పెట్రోల్ వినియోగం 2.86 మిలియన్ టన్నులు, డీజిల్ వినియోగం 5.59 మిలియన్ టన్నుల చొప్పున ఉంది. 40 శాతం వాటాతో డీజిల్ అధిక వినియోగ ఇంధనంగా ఉంటోంది. 70 శాతం డీజిల్‌ను రవాణా రంగమే వినియోగిస్తుంటుంది. ఆ తర్వాత వ్యవసాయ రంగంలో ట్రాక్టర్లు, ఇతర పరికరాల కోసం దీన్ని ఎక్కువగా వాడుతుంటారు.
2.5 శాతం అధికంగా ఏటీఎఫ్ అమ్మకాలు
ఇక విమానయాన ఇంధనం (ఏటీఎఫ్) విక్రయాలు అక్టోబర్ నెలలో క్రితం ఏడాది ఇదే నెలతో పోల్చి చూస్తే 2.5 శాతం పెరిగి 6,47,700 టన్నులుగా ఉన్నాయి. సెపె్టంబర్ నెలలో వినియోగం 6,31,100 టన్నుల కంటే 2.6 శాతం తగ్గింది. వంటగ్యాస్ (ఎల్‌పీజీ) అమ్మకాలు 7.5 శాతం పెరిగి 2.82 మిలియన్ టన్నులుగా ఉన్నాయి. సెప్టెంబర్ నెలలో వంటగ్యాస్ అమ్మకాలు 2.72 మిలియన్ టన్నులుగా ఉండడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment