sales high
-
లగ్జరీ ఇళ్ల మెరుపులు
న్యూఢిల్లీ: విశాలమైన ఇళ్లు, ప్రీమియం సదుపాయాలు కోరుకునే సంపన్నుల సంఖ్య పెరుగుతుండటంతో దానికి అనుగుణంగా లగ్జరీ ఇళ్లకు డిమాండ్ కూడా గణనీయంగా పెరుగుతోంది. 2024లో హైదరాబాద్ సహా ఏడు ప్రధాన నగరాల్లో రూ. 4 కోట్లకు పైగా ఖరీదు చేసే లగ్జరీ ఇళ్ల అమ్మకాలు 53 శాతం ఎగిసినట్లు రియల్ ఎస్టేట్ సంస్థ సీబీఆర్ఈ తెలిపింది. మొత్తం 19,700 యూనిట్లు అమ్ముడైనట్లు వివరించింది. హైదరాబాద్‌లో లగ్జరీ ఇళ్ల అమ్మకాలు 2,030 యూనిట్ల నుంచి 70 పెరిగి 2,100 యూనిట్లకు చేరాయి. ఢిల్లీ–ఎన్సీఆర్లో (నేషనల్ క్యాపిటల్ రీజియన్) అత్యధికంగా 10,500 యూనిట్లను రియల్టీ సంస్థలు విక్రయించాయి. 2023 క్యాలెండర్ సంవత్సరంలో రూ. 4 కోట్ల ఖరీదు చేసే లగ్జరీ ఇళ్లు 12,895 అమ్ముడయ్యాయి. కొనుగోళ్లకు నెలకొన్న డిమాండ్‌తో రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్ మార్కెట్ పటిష్టంగా ఉందని, రాబోయే క్వార్టర్లలోనూ ఇదే ధోరణి కొనసాగవచ్చని సీబీఆర్ఈ చైర్మన్ అన్షుమన్ మ్యాగజైన్ తెలిపారు. మధ్యస్థాయి ప్రాజెక్టుల ఉండే పుణె, చెన్నై తదితర నగరాలు కూడా హై–ఎండ్ ప్రాజెక్టుల వైపు మళ్లుతున్నాయని పేర్కొన్నారు. ప్రీమియం ప్రాంతాల్లో ఆధునిక సదుపాయాలు, అసమానమైన సౌకర్యాన్ని అందించే హై–ఎండ్ ఇళ్లకు డిమాండ్ భారీగా ఉంటోందని క్రిసుమి కార్పొరేషన్ ప్రెసిడెంట్ ఆకాశ్ ఖురానా వివరించారు. సీబీఆర్ఈ డేటా ప్రకారం.. → రూ. 4 కోట్ల పైబడి ఖరీదు చేసే ఇళ్ల అమ్మకాలు ముంబైలో 4,200 యూనిట్ల నుంచి 5,500 యూనిట్లకు పెరిగాయి. → పుణెలో 400 నుంచి 825 పెరగ్గా, బెంగళూరులో 265 యూనిట్ల నుంచి 50కి పడిపోయాయి. → కోల్‌కతాలో అమ్మకాలు 310 నుంచి 530కి, చెన్నైలో 165 యూనిట్ల నుంచి 275 యూనిట్లకు పెరిగాయి. -
పుంజుకున్న పెట్రోల్ విక్రయాలు
న్యూఢిల్లీ: పండుగల సీజన్ మద్దతుతో దేశవ్యాప్తంగా పెట్రోల్ అమ్మకాలు అక్టోబర్ నెలలో 7.3 శాతం పెరిగాయి. కానీ, డీజిల్ అమ్మకాలు మాత్రం 3.3 శాతం తక్కువగా నమోదయ్యాయి. ఇంధన మార్కెట్లో 90 శాతం వాటా కలిగిన మూడు ప్రభుత్వరంగ ఆయిల్ కంపెనీలు (హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్, ఐవోసీ) అక్టోబర్‌లో 3.1 మిలియన్ టన్నుల పెట్రోల్‌ను విక్రయించాయి. క్రితం ఏడాది ఇదే నెలలో అమ్మకాలు 2.87 మిలియన్ టన్నులుగా ఉన్నాయి. డీజిల్ విక్రయాలు మాత్రం 3.3 శాతం తక్కువగా 6.7 మిలియన్ టన్నులకు పరిమితమయ్యాయి. పండుగల సందర్భంగా వ్యక్తిగత వాహనాల (టూవీలర్లు, ప్యాసింజర్ కార్లు) వినియోగం సాధారణంగా పెరుగుతుంది. ఇది పెట్రోల్ విక్రయాల వృద్ధికి దారితీసినట్టు పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. సాగు రంగం నుంచి డిమాండ్ తక్కువగా ఉండడం డీజిల్ అమ్మకాలు తగ్గడానికి కారణమని తెలిపాయి. గడిచిన కొన్ని నెలల నుంచి డీజిల్, పెట్రోల్ అమ్మకాలు స్తబ్దుగానే కొనసాగుతున్నాయి. దేశవ్యాప్తంగా అధిక వర్షాలకుతోడు, సాగు రంగం నుంచి డిమాండ్ తగ్గడం వాహనాల వినియోగాన్ని పరిమితం చేసింది. ఇక సెపె్టంబర్ నెల గణాంకాలతో పోల్చి చూసినా అక్టోబర్‌లో పెట్రోల్ విక్రయాలు 7.8 శాతం పెరిగాయి. డీజిల్ అమ్మకాలు 20 శాతం అధికంగా నమోదయ్యాయి. సెపె్టంబర్ నెలలో పెట్రోల్ వినియోగం 2.86 మిలియన్ టన్నులు, డీజిల్ వినియోగం 5.59 మిలియన్ టన్నుల చొప్పున ఉంది. 40 శాతం వాటాతో డీజిల్ అధిక వినియోగ ఇంధనంగా ఉంటోంది. 70 శాతం డీజిల్‌ను రవాణా రంగమే వినియోగిస్తుంటుంది. ఆ తర్వాత వ్యవసాయ రంగంలో ట్రాక్టర్లు, ఇతర పరికరాల కోసం దీన్ని ఎక్కువగా వాడుతుంటారు. 2.5 శాతం అధికంగా ఏటీఎఫ్ అమ్మకాలు ఇక విమానయాన ఇంధనం (ఏటీఎఫ్) విక్రయాలు అక్టోబర్ నెలలో క్రితం ఏడాది ఇదే నెలతో పోల్చి చూస్తే 2.5 శాతం పెరిగి 6,47,700 టన్నులుగా ఉన్నాయి. సెపె్టంబర్ నెలలో వినియోగం 6,31,100 టన్నుల కంటే 2.6 శాతం తగ్గింది. వంటగ్యాస్ (ఎల్పీజీ) అమ్మకాలు 7.5 శాతం పెరిగి 2.82 మిలియన్ టన్నులుగా ఉన్నాయి. సెప్టెంబర్ నెలలో వంటగ్యాస్ అమ్మకాలు 2.72 మిలియన్ టన్నులుగా ఉండడం గమనార్హం. -
Dhanteras 2023: బంగారానికి ధనత్రయోదశి డిమాండ్
న్యూఢిల్లీ: దీపావళికి ముందు ధనత్రయోదశి సందర్భంగా శుక్రవారం బంగారం షాపులు సందడిగా కనిపించాయి. సాధారణ రోజులతో పోలిస్తే బంగారం, వెండి విక్రయాలకు డిమాండ్ ఏర్పడింది. బంగారం ధరలు కూడా కొంత తగ్గడం సానుకూలించింది. అక్టోబర్ 28న 10 గ్రాముల బంగారం (24 క్యారెట్లు) రూ.63,000 వరకు వెళ్లగా, అక్కడి నుంచి రూ.1,500 వరకు తగ్గడంతో వినియోగదారులు కొనుగోళ్లకు ఆసక్తి చూపించారు. ధన త్రయోదశి నాడు బంగారం కొనుగోలు చేస్తే మంచిదనే నమ్మకం ఎక్కువ మందిలో ఉండడం తెలిసిందే. గురువారం బంగారం 10 గ్రాముల ధర రూ.400 తగ్గి రూ.60,950 వద్ద ముగియగా, ధనత్రయోదశి సందర్భంగా ఢిల్లీలో 10 గ్రాములకు రూ.50,139 (పన్నులు కాకుండా) పలికింది. సాధారణంగా ధనత్రయోదశి నాడు దేశవ్యాప్తంగా 20–30 టన్నుల వరకు బంగారం అమ్ముడుపోతుంటుంది. మధ్యాహ్నం తర్వాత నుంచి షాపులకు కస్టమర్ల రాక పెరిగినట్టు వర్తకులు తెలిపారు. మధ్యాహ్నం తర్వాత త్రయోదశి రావడం తెలిసిందే. శనివారం మధ్యాహ్నం వరకు త్రయోదశి ఉంటున్నందున కొనుగోళ్లు మరింత పెరగొచ్చని వర్తకుల అంచనాగా ఉంది. ‘‘బంగారం ధరలు వ్యాపారానికి అనుకూలంగా ఉన్నాయి. మంచి విక్రయాలు నమోదవుతాయని భావిస్తున్నాం. కస్టమర్ల నుంచి మంచి స్పందన వస్తోంది’’అని అఖిల భారత జెమ్ అండ్ జ్యుయలరీ డొమెస్టిక్ కౌన్సిల్ డైరెక్టర్ దినేష్ జైన్ తెలిపారు. రాత్రి 8 గంటల వరకు అందిన సమాచారం మేరకు దేశవ్యాప్తంగా రూ.30,000 కోట్ల విలువ చేసే బంగారం, వెండి ఆభరణాలు, ఆరి్టకల్స్ కొనుగోళ్లు జరిగాయి. ఇందులో బంగారం కొనుగోళ్లు రూ.27,000 కోట్లుగా, వెండి కొనుగోళ్లు రూ.3,000 కోట్ల వరకు ఉంటాయని ఆల్ ఇండియా జ్యుయలర్స్, అండ్ గోల్డ్ స్మిత్స్ ఫెడరేషన్ నేషనల్ ప్రెసిడెంట్ పంకజ్ అరోరా తెలిపారు. గతేడాది ధనత్రయోదశి రోజున బంగారం, వెండి కొనుగోళ్లు రూ.25,000 కోట్లుగా ఉన్నాయి. -
ఐఫోన్ల విక్రయాలు కొత్త రికార్డు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: స్మార్ట్ఫోన్ల విపణిలో యాపిల్ కొత్త రికార్డు నమోదు చేసింది. దేశవ్యాప్తంగా ఈ ఏడాది జూలై–సెపె్టంబర్ కాలంలో 25 లక్షల యూనిట్లకుపైగా ఐఫోన్లను విక్రయించింది. అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే అమ్మకాలు 34 శాతం అధికంగా సాధించడం విశేషం. ఒక త్రైమాసికంలో భారత్‌లో కంపెనీ ఖాతాలో ఇదే ఇప్పటి వరకు రికార్డు. ఖరీదైన మోడళ్లకు మార్కెట్ మళ్లుతోందనడానికి ఈ గణాంకాలే నిదర్శనం. సెపె్టంబర్ త్రైమాసికంలో భారత్‌లో 17.2 శాతం వాటాతో శామ్సంగ్ తొలి స్థానంలో నిలిచింది. నాలుగు త్రైమాసికాలుగా శామ్సంగ్ అగ్రస్థానాన్ని కొనసాగిస్తోందని పరిశోధన సంస్థ కౌంటర్‌పాయింట్ బుధవారం వెల్లడించింది. ఏ, ఎం సిరీస్ ఫోన్లు ఇందుకు దోహదం చేసిందని తెలిపింది. ఇక 16.6 శాతం వాటాతో షావొమీ రెండవ స్థానం ఆక్రమించింది. రూ.30–45 వేల ధరల శ్రేణి విభాగంలో వన్‌ప్లస్ 29 శాతం వాటాతో సత్తా చాటుతోంది. ఫోల్డబుల్ మోడళ్లకు.. ప్రీమియం విభాగం, 5జీ లక్ష్యంగా కంపెనీలు కొత్త మోడళ్లను విడుదల చేస్తున్నాయి. రూ.45,000 ఆపైన ఖరీదు చేసే అల్ట్రా ప్రీమియం మోడళ్లకు డిమాండ్ ప్రతి త్రైమాసికంలోనూ పెరుగుతూ వస్తోంది. సెప్టెంబర్ క్వార్టర్లో అల్ట్రా ప్రీమియం మోడళ్ల అమ్మకాలు క్రితం ఏడాదితో పోలిస్తే 44 శాతం దూసుకెళ్లాయి. సులభ వాయిదాలు, ఇతర ప్రోత్సాహకాలు, నూతన టెక్నాలజీవైపు కస్టమర్ల మొగ్గు ఇందుకు దోహదం చేశాయి. ఫోల్డబుల్ మోడళ్లకు డిమాండ్ దూసుకెళ్తోంది. ఈ విభాగంలోకి కంపెనీలు క్రమంగా ప్రవేశిస్తున్నాయి. అన్ని బ్రాండ్ల అమ్మకాల్లో 5జీ స్మార్ట్ఫోన్ల వాటా ఏకంగా 53 శాతానికి ఎగబాకింది. 10–15 వేల ధరల శ్రేణిలో ఎక్కువ మోడళ్లను కంపెనీలు ప్రవేశపెట్టాయి. వీటిలో 5జీ మోడళ్ల వాటా ఏడాదిలో 7 నుంచి 35 శాతానికి చేరింది. ఆసక్తికర విషయం ఏమంటే 5జీ, అధిక ర్యామ్ (8జీబీ) వంటి కీలక ఫీచర్లు రూ.10,000లోపు సరసమైన స్మార్ట్ఫోన్లకు విస్తరించాయి. -
మూడు రోజుల్లో రూ.8,000 కోట్లు
న్యూఢిల్లీ: రియల్టీ రంగ సంస్థ డీఎల్ఎఫ్ సరికొత్త రికార్డు సృష్టించింది. కంపెనీ గురుగ్రామ్‌లో ఓ లగ్జరీ ప్రాజెక్టును చేపట్టింది. ప్రీలాంచ్లో ఫిబ్రవరి 15–17 మధ్య కంపెనీ మొత్తం 1,137 ఫ్లాట్స్‌ను విక్రయించింది. వీటి విలువ రూ.8,000 కోట్లకుపైమాటే. ఒక్కో ఫ్లాట్ రూ.7 కోట్లకుపైగా ఖరీదు చేస్తున్నాయి. భారత రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్ రంగంలో ఇదొక చరిత్ర, రికార్డు అని డీఎల్ఎఫ్ సీఈవో అశోక్ త్యాగి వెల్లడించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కంపెనీ మొత్తం రూ.15,000 కోట్ల వ్యాపారం నమోదు చేస్తుందని చెప్పారు. 2021–22లో ఇది రూ.7,273 కోట్లుగా ఉందన్నారు. పదేళ్ల విరామం తర్వాత గురుగ్రామ్ సెక్టార్ 63లో ‘ద ఆర్బర్’ పేరుతో గ్రూప్ హౌజింగ్ ప్రాజెక్టును ఫిబ్రవరిలో ప్రీలాంచ్ చేసింది. ఫిబ్రవరి 24న ఈ ప్రాజెక్టును ఆవిష్కరించాల్సి ఉండగా వారం ముందుగానే మొత్తం ఫ్లాట్స్‌ను మూడు రోజుల్లో విక్రయించడం విశేషం. అతిపెద్ద కంపెనీగా.. ఫ్లాట్స్ కొనుగోలుకై సుమారు 3,600 మంది ఆసక్తి చూపగా లాటరీ ద్వారా కస్టమర్లను ఎంపిక చేసినట్టు డీఎల్ఎఫ్ తెలిపింది. వినియోగదార్ల నుంచి రూ.800 కోట్లు ఇప్పటికే సమకూరిందని వెల్లడించింది. కార్పొరేట్ కంపెనీల్లో పనిచేస్తున్న ఉన్నతోద్యోగులే 90 శాతం ఫ్లాట్స్‌ను దక్కించుకున్నారు. ఎన్నారైల వాటా 14 శాతం. వచ్చే నాలుగేళ్లలో 25 ఎకరాల విస్తీర్ణంలోని ఆర్బర్‌లో 38–39 అంతస్తుల్లో అయిదు టవర్లను నిర్మిస్తారు. ఒక్కొక్కటి 3,950 చదరపు అడుగుల్లో 4 బీహెచ్‌కే ఫ్లాట్స్ రానున్నాయి. మార్కెట్ క్యాప్‌లో భారతదేశపు అతిపెద్ద రియల్టీ సంస్థ అయిన డీఎల్ఎఫ్.. ఈ ఆర్థిక సంవత్సరంలో బుకింగ్స్ పరంగా కూడా అతిపెద్ద కంపెనీగా అవతరించనుంది. -
మార్చిలో పెట్రోల్, డీజిల్ విక్రయాల్లో క్షీణత
న్యూఢిల్లీ: దేశంలో పెట్రోల్, డీజిల్ వినియోగం నెమ్మదించింది. ఫిబ్రవరిలో గరిష్ట స్థాయి అమ్మకాలు నమోదు కాగా, మార్చి మొదటి 15 రోజుల్లో డిమాండ్ తగ్గినట్టు విక్ర,య గణాంకాలను పరిశీలిస్తే తెలుస్తోంది. వ్యవసాయ రంగం, రవాణా రంగాల నుంచి భారీ డిమాండ్ రావడంతో ఫిబ్రవరిలో రికార్డు స్థాయి అమ్మకాలు నమోదయ్యాయి. సాధారణంగా మార్చి నుంచి ఉష్ణోగ్రతలు పెరుగుతుంటాయి. ఈ సమయంలో డిమాండ్ తగ్గడం సహజంగా కనిపిస్తుంటుంది. పెట్రోల్ అమ్మకాలు క్రితం ఏడాది మార్చి 1–15 కాలంతో పోల్చినప్పుడు.. ఈ ఏడాది అదే కాలంలో 1.4 శాతం తగ్గి 1.22 మిలియన్ టన్నులుగా ఉన్నాయి. నెలవారీగా ఫిబ్రవరి గణాంకాలో పోల్చి చూస్తే 0.5 శాతం తగ్గాయి. డీజిల్ అమ్మకాలు 3.18 మిలియన్ టన్నులుగా ఉన్నాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో అమ్మకాలు 3.54 మిలియన్ టన్నులతో పోలిస్తే 10.2 శాతం తగ్గాయి. నెలవారీగా చూస్తే ఈ డిమాండ్ 4.6 శాతం క్షీణించింది. ఫిబ్రవరి నెల మొదటి భాగంలో పెట్రోల్ అమ్మకాలు వార్షికంగా క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూస్తే 18 శాతం, డీజిల్ అమ్మకాలు 25 శాతం చొప్పున పెరగడం గమనార్హం. విమానయాన ఇంధనం (ఏటీఎఫ్) అమ్మకాలు 19.2 శాతం పెరిగి మార్చి మొదటి 15 రోజుల్లో 2,94,900 టన్నులుగా ఉన్నాయి. 2021 మార్చి మొదటి 15 రోజులతో పోలిస్తే 35 శాతం అధికం కాగా, 2020 మార్చి 15 రోజులతో పోలిస్తే 8.2 శాతం తక్కువ కావడం గమనించొచ్చు. దేశీ ఎయిర్ ట్రాఫిక్ కరోనా ముందు నాటి స్థాయికి చేరుకోగా, విదేశీ ఎయిర్ ట్రాఫిక్ మాత్రం పలు దేశాల్లో ఆంక్షల కారణంగా ఇంకా పుంజుకోవాల్సి ఉందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ఇక వంటగ్యాస్ (ఎల్పీజీ) విక్రయాలు 9.7 శాతం తగ్గి 1.18 మిలియన్ టన్నులుగా ఉన్నాయి. -
నాలుగు నెలల కనిష్టానికి సూచీలు
ముంబై: దేశీయ ఈక్విటీ మార్కెట్లో అమ్మకాలు ఆగడం లేదు. ద్రవ్యోల్బణ భయాలతో స్టాక్ సూచీలు వరుసగా ఎనిమిదో ట్రేడింగ్ సెషన్లోనూ నష్టాలను చవిచూశాయి. విదేశీ ఇన్వెస్టర్ల విక్రయాలు సెంటిమెంట్‌పై ఒత్తిడిని పెంచాయి. డిసెంబర్ క్వార్టర్ జీడీపీ డేటా వెల్లడి(మార్కెట్ ముగిసిన తర్వాత)కి ముందు అప్రమత్తత చోటు చేసుకుంది. అధిక వెయిటేజీ రిలయన్స్, ఇన్ఫోసిస్, ఐటీసీ షేర్లు 2% నుంచి 1.5% నష్టపోయి సూచీల పతనానికి ప్రధాన కారణమయ్యాయి. ఓ దశలో సెన్సెక్స్ 491 పాయింట్లు పతనమై 58,796 వద్ద, నిఫ్టీ 138 పాయింట్లు క్షీణించి 17,255 వద్ద ఇంట్రాడే కనిష్టాలను తాకాయి. చివరి గంటలో కొనుగోళ్ల మద్దతు లభించడంతో సెన్సెక్స్ 326 పాయింట్ల నష్టపోయి 58,962 వద్ద ముగిసింది. నిఫ్టీ 89 పాయింట్లు తగ్గి 17,304 వద్ద స్థిరపడింది. ఈ ముగింపు స్థాయిలు సూచీలకు 4 నెలల కనిష్టం కావడం గమనార్హం. అయిల్ అండ్ గ్యాస్, మెటల్, ఫార్మా, ఎఫ్ఎంసీజీ షేర్లు నష్టపోయాయి. ఆటో, మీడియా, బ్యాంకింగ్, రియాల్టీ, వినిమయ రంగాలకు చెందిన చిన్న, మధ్య తరహా షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ఫలితంగా బీఎస్ఈ మిడ్, స్మాల్ క్యాప్ సూచీలు అరశాతం చొప్పున లాభపడ్డాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.4,559 కోట్ల షేర్లను అమ్మేశారు. సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.4,610 కోట్ల షేర్లను కొన్నారు. డాలర్ మారకంలో రూపాయి విలువ 21 పైసలు బలపడి 82.58 స్థాయి వద్ద స్థిరపడింది. -
లగ్జరీ కార్లు రయ్.. రయ్!
న్యూఢిల్లీ: ఈ ఏడాది దేశ వ్యాప్తంగా రికార్డు స్థాయిలో లగ్జరీ కార్లు అమ్ముడవుతాయని కంపెనీలు అంచనా వేస్తున్నాయి. హై ఎండ్ మోడళ్లకు డిమాండ్ నేపథ్యంలో 2019 సంవత్సరాన్ని మించి అమ్మకాలు నమోదవుతాయని ధీమాగా ఉన్నాయి. పండుగల సీజన్లో పెద్ద ఎత్తున విక్రయాలు ఉంటాయని చెబుతున్నాయి. 2019లో దేశంలో 40,000 లగ్జరీ కార్లు రోడ్డెక్కాయి. ఒక ఏడాదిలో ఈ స్థాయి అమ్మకాలు ఇదే తొలిసారి. ‘పరిశ్రమ మరింత స్థితిస్థాపకంగా మారింది. కోవిడ్ థర్డ్ వేవ్ అంత తీవ్రంగా లేకపోవడంతో స్థిరమైన పునరుద్ధరణ ఉంది. లగ్జరీ కస్టమర్ల తీరులో మార్పు, స్టార్టప్‌లు విజయవంతం కావడం, యువ సంపన్న వినియోగదారులు, దేశీయంగా కార్ల తయారీ.. వెరశి అధిక అమ్మకాలకు దారి తీస్తుంది. విక్రయాలు 2019 స్థాయిని దాటతాయి’ అని లెక్సస్ ఇండియా ప్రెసిడెంట్ నవీన్ సోని తెలిపారు. జూలైలో కంపెనీ అత్యధిక యూనిట్లను సాధించింది. ఇప్పటి వరకు సంస్థ సాధించిన ఉత్తమ అమ్మకాలతో పోలిస్తే పండుగల సీజన్లో మూడు రెట్ల వృద్ధి ఆశిస్తున్నామని వివరించారు. సెంటిమెంట్ సానుకూలం.. వినియోగదార్ల సెంటిమెంట్ సానుకూలంగా ఉండడంతో రెండవ త్రైమాసికం నుంచి పండుగల సీజన్ వరకు బలమైన డిమాండ్ ఉంటుందని మెర్సిడెస్ బెంజ్ ఇండియా ఎండీ, సీఈవో మార్టిన్ ష్వెంక్ తెలిపారు. ‘సరఫరా సవాళ్లు ఉన్నాయి. పండుగల సీజన్లో సెమీకండక్టర్ల కొరత కొనసాగుతుందని భావిస్తున్నాం. ఏఎంజీ, ఇతర వర్షన్స్‌లో ఈక్యూఎస్ లగ్జరీ సెడాన్ ఈ పండుగలకు రానుంది’ అన్నారు. కొన్ని నెలలుగా డిమాండ్ క్రమంగా పెరుగుతోందని ఆడి ఇండియా హెడ్ బల్బీర్ సింగ్ ధిల్లాన్ తెలిపారు. కంపెనీ కార్లకు డిమాండ్ తీవ్రం కావడంతో వెయిటింగ్ పీరియడ్ అధికమైందని చెప్పారు. ప్రపంచ సవాళ్లు కొత్త కార్ల సరఫరాను ప్రభావితం చేయడమే కాకుండా ధరలపై ఒత్తిడిని పెంచుతున్నాయని వెల్లడించారు. దేశంలో మొత్తం కార్ల పరిశ్రమలో లగ్జరీ మోడళ్ల వాటా 2 శాతం లోపే ఉంది. ఈ విభాగం దశాబ్ద కాలంగా అదే స్థాయిలో కొనసాగుతోంది. లగ్జరీ కార్లపై జీఎస్టీ 28 శాతంగా ఉంది. సెడాన్స్పై 20, ఎస్‌యూవీలపై 22 శాతం సెస్ అదనం. -
వాహన విక్రయాల జోష్
ముంబై: సెమీకండక్టర్ల కొరత ప్రభావం తగ్గుముఖం పట్టడంతో దేశీయ వాహన విక్రయాలు జూన్‌లో వృద్ధి బాటపట్టాయి. ప్యాసింజర్ వాహనాలకు డిమాండ్ ఊపందుకోవడంతో ఆశించిన స్థాయిలో అమ్మకాలు జరిగాయి. మారుతీ సుజుకీతో సహా హ్యుందాయ్, టాటా మోటార్స్, కియా మోటార్స్, ఎంజీ మోటార్స్ కంపెనీలు సమీక్షించిన నెలలో సానుకూల అమ్మకాలను సాధించాయి. ఆర్థిక రికవరీలో భాగంగా మౌలిక, నిర్మాణ రంగం ఊపందుకుంది. ఫలితంగా వాణిజ్య వాహన విక్రయా ల్లో వృద్ధి నమోదైంది. గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్ ఊపందుకోవడంతో బజాజ్ ఆటో మినహా మిగిలిన అన్ని ద్విచక్ర వాహన కంపెనీల అమ్మకాలు ఆశించిన స్థాయిలో ఉన్నాయి. -
యుటిలిటీ వాహనాలకు డిమాండ్
ముంబై: యుటిలిటీ వాహనాలకు (యూవీ) డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో కొత్తగా అమ్ముడయ్యే కార్లలో ఇవి అధిక వాటా దక్కించుకునే ధోరణి కొనసాగవచ్చని ఫిచ్ రేటింగ్స్ ఒక నివేదికలో తెలిపింది. అధిక మార్జిన్లు ఉండే యూవీల విక్రయాలపై మరింత దృష్టి పెట్టడం ద్వారా కమోడిటీల ధరల పెరుగుదల, అదనపు భద్రత ప్రమాణాలపరమైన వ్యయాల భారాన్ని ఆటోమొబైల్ సంస్థలు కొంత మేర ఎదుర్కొనేందుకు వీలుంటుందని పేర్కొంది. మరోవైపు, ఉత్పత్తి వ్యయాలు పెరిగిపోతుండటంతో కాంపాక్ట్ హ్యాచ్‌బ్యాక్‌ల తయారీని ఆటోమొబైల్ సంస్థలు తగ్గించుకుంటున్నట్లు వివరించింది. దేశీ ఆటోమొబైల్ తయారీ సంస్థల సమాఖ్య సియామ్ గణాంకాల ప్రకారం గత ఆర్థిక సంవత్సరంలో మొత్తం కార్ల విక్రయాల్లో యూవీల పరిమాణం 49 శాతం పెరిగినట్లు (అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో ఇది 28 శాతం) ఫిచ్ రేటింగ్స్ తెలిపింది. హ్యాచ్‌బ్యాక్‌లు, సెడాన్ల సంయుక్త వాటా 66 శాతం నుండి 48 శాతానికి పడిపోయింది. యూవీలకు ఆదరణ పెరుగుతోందనడానికి ఇది నిదర్శనమని ఫిచ్ రేటింగ్స్ వివరించింది. ఇక యూవీ కేటగిరీలో అంతర్గతంగా ఎంట్రీ, మధ్య స్థాయి వాహనాల అమ్మకాల వాటా మొత్తం కార్ల విక్రయాల్లో 38 శాతానికి చేరింది. విశిష్టమైన సామర్థ్యాలతో పనిచేసే విశాలమైన యూవీల వైపు కస్టమర్లు మొగ్గు చూపుతున్నారని ఫిచ్ పేర్కొంది. కొత్త మోడల్స్‌తో వృద్ధికి ఊతం.. గత కొన్నేళ్లుగా హ్యాచ్‌బ్యాక్‌లతో పోలిస్తే ఆటోమొబైల్ సంస్థలు పెద్ద సంఖ్యలో కొత్త యూవీ మోడల్స్‌ను ప్రవేశపెడుతున్నాయి. ఎంట్రీ కార్ల కొనుగోలుదారులతో పోల్చినప్పుడు ధరను పెద్దగా పట్టించుకోకుండా కొత్త కార్లకు అప్‌గ్రేడ్ అయ్యేవారు, అధికాదాయ వర్గాల వారు ఎక్కువగా వీటి వైపు మొగ్గు చూపుతున్నారు. 2021 ఆర్థిక సంవత్సరంలో ఎంట్రీ, మధ్య స్థాయి యూవీల అమ్మకాలు 21 శాతం పెరగ్గా, గత ఆర్థిక సంవత్సరంలో 35 శాతం మేర పెరిగాయి. కోవిడ్–19పరమైన ప్రతికూల పరిస్థితులు నెలకొన్నప్పటికీ యూవీలకు డిమాండ్ తగ్గలేదని ఫిచ్ రేటింగ్స్ పేర్కొంది. తగ్గుతున్న హ్యాచ్‌బ్యాక్‌లు, సెడాన్లు.. సెడాన్లు, హ్యాచ్‌బ్యాక్ కార్ల ఉత్పత్తి వ్యయాలు పెరుగుతూ ఉండటం వల్ల డిమాండ్, లాభదాయకతపై ప్రతికూల ప్రభావం పడుతోందని ఫిచ్ రేటింగ్స్ తెలిపింది. కమోడిటీల రేట్లు పెరిగిపోవడం, వాహన భద్రత ప్రమాణాలు కఠినతరం చేయడంతో 2018 నుంచి చూస్తే ఎంట్రీ స్థాయి కార్ల ధరలు 20–30 శాతం పెరిగాయని పేర్కొంది. 2020 ఆర్థిక సంవత్సరం నుంచి ఈ విభాగంలో అమ్మకాలు తగ్గుతూ వస్తున్నాయని తెలిపింది. కార్లలో అదనంగా ఎయిర్‌బ్యాగ్‌లను తప్పనిసరి చేసే నిబంధన ఈ ఏడాది అక్టోబర్ నుంచి అమల్లోకి వస్తే తయారీ వ్యయాలు మరో 3–5 శాతం మేర పెరగవచ్చని పేర్కొంది. దీంతో ఎంట్రీ లెవెల్ సెగ్మెంట్లో కొత్త కార్ల ఆవిష్కరణలు తగ్గవచ్చని, కొన్ని మోడల్స్‌ను నిలిపివేసే అవకాశాలున్నాయని ఫిచ్ రేటింగ్స్ వివరించింది. దీని ఫలితంగా ఈ విభాగం వృద్ధి అవకాశాలు మరింతగా మందగిస్తాయని పేర్కొంది. ఖర్చులు పెరుగుతున్నా యూవీల అమ్మకాలు పెరుగుతుండటమనేది దేశీ కార్ల తయారీ సంస్థల లాభదాయకతకు తోడ్పాటుగా ఉండగలదని ఫిచ్ రేటింగ్స్ వివరించింది. సియామ్ గణాంకాల ప్రకారం 2022 ఆర్థిక సంవత్సరంలో ఎంట్రీ లెవెల్ కార్ల అమ్మకాలు 6 శాతం క్షీణించగా యూవీల అమ్మకాలు 40 శాతం పెరిగి ఆ మేరకు వ్యత్యాసాన్ని భర్తీ చేశాయని, పరిశ్రమ 13 శాతం వృద్ధి నమోదు చేయడంలో తోడ్పడ్డాయని పేర్కొంది. -
వాహన విక్రయాల్లో వృద్ధి
ముంబై: గత ఆర్థిక ఏడాది చివరి నెల మార్చి వాహన విక్రయాల్లో వృద్ధి నమోదైంది. టాటా మోటార్స్, ఎంఅండ్ఎం, టయోటా కిర్లోస్కర్ అమ్మకాలు పెరిగాయి. మారుతీ సుజుకీ, హ్యుందాయ్ మోటార్స్, ఎంజీ మోటార్స్ విక్రయాలు క్షీణించాయి. వినియోగదారులు ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రాధాన్యత ఇస్తుండటంతో ద్విచక్ర వాహనాలు అమ్మకాలు స్వల్పంగా తగ్గాయి. ‘‘2021–22లో వాహనాల ఉత్పత్తిపై ఎలక్ట్రానిక్ విడిభాగాల కొరత కొంత ప్రభావం చూపింది. ఆ ప్రభావాన్ని తగ్గించేందుకు కంపెనీ అన్ని చర్యలు తీసుకుంది. ఎలక్ట్రానిక్ విడిభాగాల సరఫరా పరిస్థితి అనూహ్యంగా కొనసాగుతున్నందున ప్రస్తుత సంవత్సరంలో ఇది కొంత ప్రభావం చూపవచ్చు’’ అని మారుతీ తెలిపింది. ► మారుతీ సుజుకీ మార్చి మొత్తం అమ్మకాలు 1,43,899 యూనిట్లుగా నమోదయ్యాయి. గతేడాది ఇదే ఫిబ్రవరిలో విక్రయించిన మొత్తం 1,55,417 విక్రయాలతో పోలిస్తే స్వల్పంగా ఆరుశాతం(6.3)గా ఉంది. 2021–22లో ఎగుమతులు 2,38,376 యూనిట్లు నమో దయ్యాయి. ఒక ఆర్థిక సంవత్సరంలో ఈ స్థాయి ఎగుమతులు రికార్డు కావడం సంస్థ చరిత్రలో ఇదే తొలిసారి. ► కియా మోటర్స్ మార్చి విక్రయాలు 18% పెరిగాయి. ఈ మార్చిలో మొత్తం 22,622 యూనిట్లకు అమ్మింది. ఒక నెలలో ఈ స్థాయిలో విక్రయించడం ఇదే తొలిసారి. సెమికండెక్టర్ల కొరత కారణంగా గడచిన ఆర్థిక సంవత్సరంలో మొత్తం 1,86,787 వాహనాలను విక్రయించింది. ప్యాసింజర్ వాహనాల (పీవీ) విక్రయాల్లో టాటా మోటార్స్ 35 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఈ సంస్థ మార్చిలో 86,718 కార్లను అమ్మగా.. గతేడాది ఇదేనెలలో 42,293 యూనిట్లను అమ్మింది. హీరో మోటో మార్చి అమ్మకాలు 14% క్షీణించాయి. గతే డాది మార్చిలో 5.24 లక్షల వాహనాలను విక్రయించగా.., ఈ మార్చిలో 4.50 లక్షల యూనిట్లు అమ్మింది. -
ఓరియంట్ ఎలక్ట్రిక్ లాభం రూ. 35 కోట్లు
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జులై–సెప్టెంబర్ త్రైమాసికంలో ఓరియంట్ ఎలక్ట్రిక్ సంస్థ లాభం 7 శాతం పెరిగి రూ. 35 కోట్లకు చేరింది. గత క్యూ2లో ఇది రూ. 32 కోట్లు. తాజాగా ఆదాయం రూ. 434 కోట్ల నుంచి రూ. 594 కోట్లకు పెరిగింది. సమీక్షా కాలంలో వివిధ విభాగాల పనితీరు మెరుగ్గా ఉందని, ఆదాయం 37 శాతం వృద్ధి నమోదు చేసిందని సంస్థ వెల్లడించింది. ఎంట్రీ స్థాయి ఉత్పత్తులు, ప్రీమియం ఉత్పత్తుల అమ్మకాలు మెరుగ్గా ఉన్నాయని పేర్కొంది. ఇక ఎగుమతి మార్కెట్లు కూడా తెరుచుకుంటూ ఉండటంతో కొత్త ఆర్డర్లు కూడా లభించాయని ఓరియంట్ ఎలక్ట్రిక్ తెలిపింది. కోవిడ్ కేసులు తగ్గుముఖం పడుతుండటం, మూడో క్వార్టర్లో పండుగ సీజన్, వర్షపాతం మెరుగ్గా ఉండటం తదితర అంశాలు డిమాండ్‌కు దోహదపడగలవని ఆశిస్తున్నట్లు పేర్కొంది. వేసవి సీజన్లో దీని సానుకూల ప్రభావం ఉండవచ్చని భావిస్తున్నట్లు వివరించింది. -
ఇళ్ల అమ్మకాలు పెరిగాయ్
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఎనమిది ప్రధాన నగరాల్లో జూలై–సెప్టెంబర్ కాలంలో ఇళ్ల అమ్మకాలు పెరిగాయి. అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 59 శాతం వృద్ధి నమోదై 55,907 యూనిట్లు విక్రయమయ్యాయి. 2021 ఏప్రిల్–జూన్‌తో పోలిస్తే క్రితం త్రైమాసికంలో మూడు రెట్లకుపైగా డిమాండ్ రావడం గమనార్హం. హౌసింగ్ బ్రోకరేజ్ కంపెనీ ప్రాప్‌టైగర్.కామ్ ప్రకారం.. 2020 జూలై–సెపె్టంబర్లో ఈ సంఖ్య 35,132 యూనిట్లుగా ఉంది. కోవిడ్ సెకండ్ వేవ్ తర్వాత ఇళ్లకు డిమాండ్ అధికమైంది. వడ్డీ రేట్లు తక్కువగా ఉండడం, ఇళ్ల ధరలు అందుబాటులోకి రావడం, కోవిడ్ నేపథ్యంలో సొంత ఇల్లు ఉండాలని కోరుకోవడం వంటివి ఈ డిమాండ్‌కు కారణం. మొత్తం అమ్మకాల్లో రూ.45 లక్షలలోపు విలువ చేసే ఇళ్ల వాటా 40 శాతంగా ఉంది. రూ.45–75 లక్షల విలువ గలవి 28 శాతం వాటా దక్కించుకున్నాయి. హైదరాబాద్‌లో ఇళ్ల అమ్మకాలు రెండింతలకుపైగా అధికమై 3,260 నుంచి 7,812 యూనిట్లకు చేరాయి. -
టాప్‌గేర్‌లో హైదరాబాద్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ రియల్ ఎస్టేట్ టాప్‌గేర్‌లో పడింది. ఈ ఏడాది మూడో త్రైమాసికంలో రికార్డ్ స్థాయిలో గృహ విక్రయాలు జరిగాయి. గతేడాది క్యూ3తో పోలిస్తే 308 శాతం వృద్ధి నమోదయింది. 2021 క్యూ3లో 6,735 యూనిట్లు అమ్ముడుపోయాయి. ఈ ఏడాది క్యూ2లో ఇది 3,240 యూనిట్లుగా ఉన్నాయి. త్రైమాసికంతో పోలిస్తే 108 శాతం పెరుగుదల. గతేడాది క్యూ3లో నగరంలో 1,650 గృహ విక్రయాలు జరిగాయి. కొత్త గృహాల ప్రారంభాలు చూస్తే.. 2021 క్యూ3లో 14,690 యూనిట్లు లాంచింగ్ అయ్యాయి. క్యూ2లో 8,850 యూనిట్లు లాంచింగ్ అయ్యాయి. త్రైమాసికంతో పోలిస్తే 66 శాతం వృద్ధి. ఇక గతేడాది క్యూ3లో 4,900 గృహాలు ప్రారంభమయ్యాయి. ఏడాది కాలంతో పోలిస్తే 67 శాతం వృద్ధి రేటు. ► కరోనా మహమ్మారి నుంచి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం క్రమంగా తేరుకుంటోంది. ఉద్యోగ భద్రత పెరగడం, వర్క్ ఫ్రం ఆఫీస్ మొదలవుతుండటంతో, ఐటీ/ఐటీఈఎస్ రంగాలలో నియామకాలు జోరందుకోవటం, గృహ రుణ వడ్డీ రేట్లు తక్కువగా ఉండటం, డెవలపర్ల ఆకర్షణీయమైన పథకాలు.. కారణాలేవైనా నగర రియల్టీ రంగంలో జోష్ నెలకొంది. నిర్మాణ కారి్మకులలో కూడా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం కావటంతో నిర్మాణ పనులు స్పీడందుకున్నాయి. డెవలపర్లు కొత్త ప్రాజెక్ట్‌ల లాంచింగ్స్పై ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇన్వెంటరీ, నిర్మాణంలో ఉన్న గృహాలను విక్రయిం చడంపైనే ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నారు. దీంతో గతేడాది క్యూ3తో పోలిస్తే ఈ ఏడాది క్యూ3లో హైదరాబాద్‌లో ప్రాజెక్ట్‌ల లాంచింగ్స్‌లో 67 శాతం వృద్ధి నమోదయితే, విక్రయాల్లో మాత్రం 308 శాతం పెరుగుదల కనిపించింది. కొనుగోలుదారులు పెద్ద సైజు గృహాల కొనుగోళ్లకు మక్కువ చూపుతున్నారని అనరాక్ గ్రూప్ చైర్మన్ అనూజ్ పూరీ తెలిపారు. దేశవ్యాప్తంగా 62,800 ఇళ్ల విక్రయం.. హైదరాబాద్‌తో సహా దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో ఈ ఏడాది క్యూ3లో 62,800 ఇళ్లు అమ్ముడుపోయాయి. క్యూ2లో 24,560 యూనిట్లు సేల్ అయ్యాయి. అంటే క్యూ2తో పోలిస్తే 156 శాతం వృద్ధి. ఇక గతేడాది క్యూ3లో చూస్తే 29,520 ఇళ్లు విక్రయమయ్యాయి. అంటే 113 శాతం పెరుగుదల. ► ఇక కొత్త గృహాల ప్రారంభాలు చూస్తే.. ఈ ఏడాది క్యూ3లో మొత్తం 64,560 యూనిట్లు లాంచింగ్ అయ్యాయి. క్యూ2లో 36,260 గృహాలు ప్రారంభమయ్యాయి. అంటే గత త్రైమాసికంతో పోలిస్తే 78 శాతం పెరుగుదల. గతేడాది క్యూ3లో 32,530 యూనిట్లు లాంచింగ్ అయ్యాయి. అంటే ఏడాదితో పోలిస్తే 98 శాతం వృద్ధి రేటు. ఈ ఏడాది క్యూ3లోని లాంచింగ్స్లలో రూ.40–80 లక్షల మధ్య ధర ఉండే మధ్యస్థాయి ఇళ్ల వాటా 41 శాతం, రూ.80 లక్షల నుంచి రూ.1.5 కోట్ల మధ్య ధర ఉండే ప్రీమియం గృహాల వాటా 25 శాతం, రూ.40 లక్షల కంటే తక్కువ ధర ఉండే అఫర్డబుల్ హౌసింగ్ వాటా 24 శాతంగా ఉన్నాయి. ► నిర్మాణ సామగ్రి ధరలు పెరగడంతో 2021 క్యూ3లో ధరలు 3 శాతం మేర పెరిగాయి. దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో చ.అ. ధర సగటున రూ.5,760గా ఉంది. గతేడాది క్యూ3లో చ.అ. సగటు ధర రూ.5,600గా ఉండేది. ► ప్రాపరీ్టలను వెతకడం నుంచి మొదలుపెడితే డాక్యుమెంటేషన్, న్యాయ సలహా, చెల్లింపుల వరకు ప్రతీ దశలోనూ కొనుగోలుదారులు డిజిటల్ మాధ్యమాన్ని వినియోగిస్తున్నారు. కరోనా కంటే ముందు ప్రాపర్టీ కొనుగోలు ప్రక్రియలో ఆన్లైన్ వాటా 39 శాతంగా ఉండగా.. ఇప్పుడది 60 శాతానికి పెరిగింది. పటిష్టమైన ఆన్లైన్ మార్కెటింగ్ బృందం ఉన్న డెవలపర్లు మాత్రమే ప్రస్తుతం నిలబడగలుగుతారు. ఒక్క మన నగరంలోనే.. ఈ ఏడాది క్యూ3లో హైదరాబాద్ మినహా ఏ నగరంలోనూ 130 శాతం వృద్ధి రేటు నమోదు కాలేదు. గతేడాది క్యూ3తో పోలిస్తే ఈ ఏడాది క్యూ3లో నగరంలో ఇళ్ల అమ్మకాలలో 308 శాతం పెరుగుదల కనిపించగా.. ముంబైలో 128 శాతం, చెన్నైలో 113 శాతం, పుణేలో 100 శాతం, కోల్‌కతాలో 99 శాతం, ఎన్సీఆర్లో 97 శాతం, బెంగళూరులో 58 శాతం వృద్ధి రేటు నమోదయింది. -
ఇప్పటికే రూ.2 వేలు పెంపు, మరింత పెరగనున్న ఏసీల ధరలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎయిర్ కండీషనర్ల (ఏసీ) అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. వేసవి ముందుగా ప్రారంభం కావడమే ఇందుకు కారణం. అయితే ముడి సరుకు వ్యయాలు పెరగడంతో మరోసారి ఏసీల ధరలను సవరించే చాన్స్ ఉందని కంపెనీలు అంటున్నాయి. ఈ నెలలో లేదా ఏప్రిల్‌లో ధర 4–5 శాతం అధికం అయ్యే అవకాశం ఉందని చెబుతున్నాయి. ఇప్పటికే కొన్ని కంపెనీలు ఈ ఏడాది రెండుసార్లు ధరలను పెంచాయి. లాక్డౌన్ కారణంగా గతేడాది పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపింది. ప్రస్తుతం నెలకొన్న డిమాండ్ నేపథ్యంలో 2021లో కోవిడ్ ముందస్తు స్థాయికి అమ్మకాలు చేరతాయని కంపెనీలు ధీమాగా ఉన్నాయి. భారత్‌లో ఏసీల పరిశ్రమ 70–75 లక్షల యూనిట్లుగా ఉంది. భారమవుతున్న ముడిసరుకు.. ఏసీల తయారీలో వాడే కాపర్, స్టీల్, ప్లాస్టిక్ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. మరోవైపు కంప్రెసర్ల ధరలూ అధికమవుతూనే వస్తున్నాయి. దేశీయ పరిశ్రమ ఇప్పటికీ పెద్ద ఎత్తున కంప్రెసర్ల కోసం విదేశాలపై ఆధారపడాల్సి వస్తోంది. దీంతో గత్యంతరం లేక ఈ ఏడాది ఒక్కో ఏసీపై రూ.1,500–2,000 వరకు ధర పెంచాల్సి వచ్చిందని కంపెనీలు అంటున్నాయి. మూడు నెలలుగా ముడిసరుకు వ్యయాలు పెరుగుతూనే ఉన్నాయని లాయిడ్ అంటోంది. తగ్గుముఖం పట్టే పరిస్థితి కనిపించడం లేదని, ఇలాగే కొనసాగితే ధరలు మరోసారి పెంచడం తప్ప వేరే మార్గం లేదని స్పష్టం చేసింది. జనవరితోపాటు ఫిబ్రవరిలోనూ ధరలను ఎల్జీ సవరించింది. కొత్త కస్టమర్ల చేరిక.. ఈసారి వేసవిలో ఏసీల అమ్మకాలు జోరుగా ఉంటాయని పరిశ్రమ అంచనా వేస్తోంది. ముందస్తుగా అమ్మకాలు మొదలు కావడంతో వేసవి తాపం మాదిరిగానే విక్రయాలు పెరుగుతాయని కంపెనీలు అంటున్నాయి. ఈ సంవత్సరం కొత్త కస్టమర్లు వచ్చి చేరతారని ఆశగా ఉన్నాయి. పరిశ్రమ రెండంకెల వృద్ధి సాధిస్తుందనే ధీమాతో ఉంది. రవాణా వ్యయాలు భారమవుతున్నాయని హాయర్ చెబుతోంది. 4–5 శాతం ధర పెంచనున్నామని.. అధిక వేసవి దృష్ట్యా సవరించిన ధరల ప్రభావం అమ్మకాలపై ఉండబోదని అంటోంది. 2020తో పోలిస్తే ఈ ఏడాది జనవరి–మార్చిలో రెండింతల అమ్మకాలు సాధించామని వెల్లడించింది. ముందుగా మొదలైన విక్రయాలు.. విపరీత డిమాండ్ నేపథ్యంలో డిమాండ్‌కు తగ్గట్టుగా పూర్తి స్థాయి తయారీ సామర్థ్యంతో ఏసీ ఫ్యాక్టరీలు నడుస్తున్నాయని ఎల్జీ వెల్లడించింది. 2019తో పోలిస్తే 40 శాతం వృద్ధికి చాన్స్ ఉందని ఆశాభావం వ్యక్తం చేసింది. గతేడాది అమ్మకాలు లేకపోవడం, ప్రస్తుతం ఎండలు జోరుగా మొదలు కావడంతో 2021 సీజన్లో ఏసీలకు డిమాండ్ పెద్ద ఎత్తున ఉంటుందని ప్యానాసోనిక్ చెబుతోంది. మూడు నాలుగు నెలలుగా డిమాండ్ 25 శాతం పెరిగిందని, ఈ ట్రెండ్ కొనసాగుతుందని జోస్యం చెబుతోంది. 2019తో పోలిస్తే హైదరాబాద్‌లో ప్రస్తుతం సేల్స్‌లో 15 శాతంపైగా వృద్ధి ఉందని ఐటీ మాల్ ఎండీ మొహమ్మద్ అహ్మద్ తెలిపారు. ఫిబ్రవరి నుంచే కస్టమర్ల రాక పెరిగిందని అన్నారు. వాహనం... భారం! ► మరోసారి పెంపునకు కంపెనీల సిద్ధం ► ముడి సరుకు వ్యయాల ప్రభావం ► ఇప్పటికే పెరిగిన పలు మోడళ్ల ధర చెన్నై: వాహనాల ధరలు మరోసారి పెరగనున్నాయి. స్టీల్, అల్యూమినియం, ఇతర ముడి సరుకు వ్యయాలే ఇందుకు కారణం. ఏప్రిల్ నుంచి 1–3 శాతం ధరలు అధికం అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే కంపెనీ, మోడల్‌నుబట్టి వాహనం ధర రూ.45,000 వరకు పెరిగింది. మహీంద్రా అండ్ మహీంద్రా, ఐషర్ మోటార్స్, అశోక్ లేలాండ్ తమ వాహనాల ధరలను సవరించే అవకాశం ఉంది. మరోవైపు బీఎస్–4 నుంచి బీఎస్–6కి మళ్లిన సమయంలో వాహనాల ధరలకు రెక్కలొచ్చాయి. ముడి పదార్థాల భారం.. ముడి పదార్థాల ఖర్చులు అధికం అయ్యాయని ఐషర్ మోటార్స్ ఎండీ సిద్ధార్థ లాల్ తెలిపారు. వాణిజ్య వాహనాలతోపాటు రాయల్ ఎన్ఫీల్డ్ మోటార్‌సైకిల్స్ ధరలనూ పెంచుతామన్నారు. ‘అక్టోబరు, జనవరిలో ధరలను పెంచాం. స్టీల్, ప్రత్యేక ఖనిజాల ధరలు గణనీయంగా పెరిగాయి. ఇది ఇలాగే కొనసాగితే ధరల సవరణ తప్ప మరో మార్గం లేదు’ అని అశోక్ లేలాండ్ సీఎఫ్‌వో, డైరెక్టర్ గోపాల్ మహదేవన్ అన్నారు. ఏప్రిల్–జూన్‌లో వాణిజ్య వాహనాలతోపాటు ఎస్‌యూవీల ప్రైస్ పెంచనున్నట్టు మహీంద్రా గ్రూప్ ఆటో ఈడీ రాజేశ్ జేజూరికర్ వెల్లడించారు. -
ఫ్రిజ్‌లు, ఏసీలు రయ్రయ్!
న్యూఢిల్లీ: వినియోగ ఉత్పత్తుల విక్రయాలపై మందగమన ప్రభావాలు గణనీయంగా కనిపిస్తున్నప్పటికీ .. ఎలక్ట్రికల్ ఉపకరణాల అమ్మకాలు మాత్రం జోరుగా సాగుతున్నాయి. ఈ ఏడాది వేసవిలో ఉష్ణోగ్రతలు అధిక స్థాయిలో నమోదుకావడంతో ఏసీలు, ఎయిర్ కూలర్లు, రిఫ్రిజిరేటర్లు, ఫ్యాన్లు వంటి పలు రకాల కూలింగ్ ఉత్పత్తుల విక్రయాలు భారీగా వృద్ధి నమోదు చేశాయి. కన్జూమర్ డ్యూరబుల్స్ రంగంలోని మిగతా విభాగాలతో పోలిస్తే ఎలక్ట్రికల్ ఉపకరణాల విభాగం మెరుగైన పనితీరు కనపర్చినట్లు బజాజ్ ఎలక్ట్రికల్స్ ఈడీ అనుజ్ పొద్దార్ తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో పరిశ్రమపరంగా ఏసీల అమ్మకాలు 20 శాతం, ఫ్రిజ్‌ల విక్రయాలు 12 శాతం మేర వృద్ధి సాధించినట్లు గోద్రెజ్ అప్లయెన్సెస్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ అండ్ అప్లయెన్సెస్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కమల్ నంది తెలిపారు. టీవీల కన్నా .. ఏసీలకే ఓటు.. వేసవి ఉష్ణోగ్రతలు ఈసారి ఎగబాకడంతో కొనుగోలుదారులు టీవీల కన్నా ఏసీల వైపే ఎక్కువగా మొగ్గు చూపినట్లు నంది పేర్కొన్నారు. అంతే కాకుండా వీడియో కంటెంట్ చూసే విషయానికొస్తే.. టీవీల్లో కన్నా మొబైల్ ఫోన్స్‌కి ప్రాధాన్యం పెరుగుతుండటం కూడా టీవీల అమ్మకాలపై ప్రభావం చూపిందన్నారు. దీంతో టీవీల విక్రయాలు ఒక మోస్తరు స్థాయికే పరిమితమయ్యాయని వివరించారు. ఆఖరికి క్రికెట్ వరల్డ్ కప్ కూడా టెలివిజన్ల అమ్మకాల వృద్ధికి ఉపయోగపడలేదు. మరోవైపు లో–బేస్ ఎఫెక్ట్ సైతం ఏసీల విక్రయాల్లో వృద్ధికి కొంత కారణమై ఉండొచ్చని బ్లూస్టార్ జాయింట్ ఎండీ బి. త్యాగరాజన్ తెలిపారు. గతేడాది అధిక కమోడిటీల ధరలు, కరెన్సీ మారకం రేటులో హెచ్చుతగ్గులు, కొంత సాధారణ ఉష్ణోగ్రతలు తదితర అంశాల కారణంగా ఏసీల విక్రయాల వృద్ధి పెద్దగా నమోదు కాలేదని ఆయన వివరించారు. దేశవ్యాప్తంగా పలు చోట్ల వర్షాలు, వరదల మూలంగా ఆగస్టులో ఏసీల విక్రయాలు ఒక మోస్తరు స్థాయిలో ఉన్నా పండుగల సీజన్ మొదలవుతుండటంతో సెప్టెంబర్‌లో మళ్లీ వృద్ధి కనిపించవచ్చని పేర్కొన్నారు. మందగమన ప్రభావాలూ ఉన్నాయి.. జూలై, ఆగస్టుల్లో మొత్తం కన్జూమర్ డ్యూరబుల్స్ పరిశ్రమని పరిగణనలోకి తీసుకుంటే మాత్రం అమ్మకాలు అంత ఆశావహంగా ఏమీ లేవని నంది పేర్కొన్నారు. కొన్ని విభాగాల్లో క్షీణత కూడా నమోదైందని వివరించారు. చాలా రంగాల్లో ఆర్థిక మందగమనం మూలంగా.. వినియోగదారుల కొనుగోలు ధోరణులపై కూడా ప్రభావం పడిందని తెలిపారు. కొనుగోలు నిర్ణయాలను కస్టమర్లు వాయిదా వేసుకోవడం కూడా జరిగిందని క్రిసిల్ రీసెర్చ్ డైరెక్టర్ హేతల్ గాంధీ తెలిపారు. మరోవైపు, వర్షపాతం సరైన రీతిలో లేకపోవడంతో కొన్ని ప్రాంతాల్లో పంటలు వేయడంలో జాప్యాలు జరగ్గా.. ఇంకొన్ని ప్రాంతాల్లో అధిక వర్షపాతంతో పంటలు కొట్టుకుపోవడం జరిగిందని నంది చెప్పారు. ఇలా వ్యవసాయోత్పత్తి మందగించి, ఆదాయాలు తగ్గడం వల్ల కన్జూమర్ డ్యూరబుల్స్ పరిశ్రమ కూడా మిగతా రంగాల్లాగానే క్షీణత నమోదు చేసే అవకాశం ఉందని తెలిపారు. రేట్ల కోత ఊతం.. వినియోగదారులు, పరిశ్రమ సెంటిమెంటును మెరుగుపర్చే దిశగా ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన కొన్ని చర్యలు పరిస్థితి మెరుగుపడటానికి ఊతమివ్వగలవని భావిస్తున్నట్లు నంది చెప్పారు. ప్రభుత్వ రంగ బ్యాంకులకు రూ. 70,000 కోట్ల మేర కేంద్రం నిధులు ప్రకటించడం, ఆర్బీఐ పాలసీపరంగా కీలకవడ్డీ రేట్లను తగ్గించడం వంటి అంశాలతో మార్కెట్లో నిధుల లభ్యత మెరుగుపడుతుందని, రుణ వితరణ మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని ఆయన వివరించారు. వినియోగదారుల సానుకూల సెంటిమెంటు, వర్షపాతం, ఉపాధి కల్పన.. ఈ మూడు అంశాలు పరిశ్రమకు కీలకంగా ఉంటాయని చెప్పారు. వడ్డీ రేట్లపై ఆర్బీఐ ఉదార విధానాలు, వ్యవస్థలో నిధుల లభ్యత మెరుగుపడటం మొదలైనవి ఈ ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థంలో వినియోగ వృద్ధికి ఊతమివ్వగలవని వివరించారు. ప్రథమార్ధం మందగించడంతో.. వినియోగ వస్తువుల తయారీ సంస్థలు.. ఈ పండుగ సీజన్లో కస్టమర్లను ఆకర్షించేందుకు ప్రమోషనల్ ఆఫర్లను మరింతగా పెంచవచ్చని, పలు ఆకర్షణీయ ఫైనాన్సింగ్ స్కీములు కూడా ప్రవేశపెట్టే అవకాశం ఉందని హేతల్ గాంధీ చెప్పారు. కన్జూమర్ డ్యూరబుల్స్ పరిశ్రమ వార్షిక అమ్మకాల్లో ఏకంగా 21 శాతం వాటా పండుగ సీజన్‌దే ఉంటోంది. అయినప్పటికీ 2020 ఆర్థిక సంవత్సరంలో మొత్తం కన్జూమర్ డ్యూరబుల్స్ అమ్మకాల పరిమాణం గతంలో అంచనా వేసిన 6–7 శాతం కన్నా 200–300 బేసిస్ పాయింట్ల మేర తగ్గవచ్చని పేర్కొన్నారు. -
బంతిపూల ‘సిరులు’
బంతి పూల సాగు రైతులకు సిరులు కురిపిస్తోంది. వరుస పండుగల నేపథ్యంలో డిమాండ్ పెరగడంతో ధరలు భారీగా పలుకుతున్నాయి. డీ.హీరేహాళ్ మండలం బాదనహాళ్ సమీపంలో రైతు బసవరాజు ఎకరా విస్తీర్ణంలో పూలు విరగకాశాయి. కోతకు 250 కిలోల నుంచి 300 కిలోల వరకు పూలదిగుబడి వస్తోంది. గత వినాయక చవితి నుంచి ఇప్పటిదాకా 15 కోతలు కోసినట్లు రైతు తెలిపాడు. గతంలో కిలో రూ.30 ప్రకారం అమ్ముడుపోయాయని, ప్రస్తుతం పొలంవద్దకే వచ్చి కిలో రూ.70కు కొనుగోలు చేస్తున్నారని చెప్పాడు. ఇప్పటిదాకా ఖర్చులుపోను లక్షరూపాయల వరకు ఆదాయం వచ్చినట్లు వివరించాడు. దీపావళి వరకు పూలకు డిమాండ్ ఉంటుందని, మరో రూ.1.50 లక్షల వరకు ఆదాయం రావచ్చునని ఆశాభావం వ్యక్తం చేశాడు.