న్యూఢిల్లీ: దీపావళికి ముందు ధనత్రయోదశి సందర్భంగా శుక్రవారం బంగారం షాపులు సందడిగా కనిపించాయి. సాధారణ రోజులతో పోలిస్తే బంగారం, వెండి విక్రయాలకు డిమాండ్ ఏర్పడింది. బంగారం ధరలు కూడా కొంత తగ్గడం సానుకూలించింది. అక్టోబర్ 28న 10 గ్రాముల బంగారం (24 క్యారెట్లు) రూ.63,000 వరకు వెళ్లగా, అక్కడి నుంచి రూ.1,500 వరకు తగ్గడంతో వినియోగదారులు కొనుగోళ్లకు ఆసక్తి చూపించారు.
ధన త్రయోదశి నాడు బంగారం కొనుగోలు చేస్తే మంచిదనే నమ్మకం ఎక్కువ మందిలో ఉండడం తెలిసిందే. గురువారం బంగారం 10 గ్రాముల ధర రూ.400 తగ్గి రూ.60,950 వద్ద ముగియగా, ధనత్రయోదశి సందర్భంగా ఢిల్లీలో 10 గ్రాములకు రూ.50,139 (పన్నులు కాకుండా) పలికింది. సాధారణంగా ధనత్రయోదశి నాడు దేశవ్యాప్తంగా 20–30 టన్నుల వరకు బంగారం అమ్ముడుపోతుంటుంది. మధ్యాహ్నం తర్వాత నుంచి షాపులకు కస్టమర్ల రాక పెరిగినట్టు వర్తకులు తెలిపారు.
మధ్యాహ్నం తర్వాత త్రయోదశి రావడం తెలిసిందే. శనివారం మధ్యాహ్నం వరకు త్రయోదశి ఉంటున్నందున కొనుగోళ్లు మరింత పెరగొచ్చని వర్తకుల అంచనాగా ఉంది. ‘‘బంగారం ధరలు వ్యాపారానికి అనుకూలంగా ఉన్నాయి. మంచి విక్రయాలు నమోదవుతాయని భావిస్తున్నాం. కస్టమర్ల నుంచి మంచి స్పందన వస్తోంది’’అని అఖిల భారత జెమ్ అండ్ జ్యుయలరీ డొమెస్టిక్ కౌన్సిల్ డైరెక్టర్ దినేష్ జైన్ తెలిపారు.
రాత్రి 8 గంటల వరకు అందిన సమాచారం మేరకు దేశవ్యాప్తంగా రూ.30,000 కోట్ల విలువ చేసే బంగారం, వెండి ఆభరణాలు, ఆరి్టకల్స్ కొనుగోళ్లు జరిగాయి. ఇందులో బంగారం కొనుగోళ్లు రూ.27,000 కోట్లుగా, వెండి కొనుగోళ్లు రూ.3,000 కోట్ల వరకు ఉంటాయని ఆల్ ఇండియా జ్యుయలర్స్, అండ్ గోల్డ్ స్మిత్స్ ఫెడరేషన్ నేషనల్ ప్రెసిడెంట్ పంకజ్ అరోరా తెలిపారు. గతేడాది ధనత్రయోదశి రోజున బంగారం, వెండి కొనుగోళ్లు రూ.25,000 కోట్లుగా ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment