Dhanteras
-
ఆర్డర్ పెట్టిందొకటి.. డెలివరీ అయ్యిందొకటి
ధన్‌తేరాస్ సందర్బంగా క్విక్ కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లైన స్విగ్గీ ఇన్‌స్టామార్ట్, బ్లింకిట్, జెప్టో, బిగ్‌బాస్కెట్ వంటి వాటి ద్వారా కేవలం 10 నిమిషాల్లో కస్టమర్లకు బంగారు, వెండి నాణేలను అందించారు. అయితే ఆన్లైన్లో గోల్డ్, సిల్వర్ కాయిన్స్ ఆర్డర్ చేసిన ఓ కస్టమర్‌కు చేదు అనుభవం ఎదురైంది. దీని గురించి పూర్తి సమాచారం ఇక్కడ చూసేద్దాం..మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ నుంచి బ్లింకిట్ ద్వారా మోహిత్ జైన్ అనే వ్యక్తి.. 24 క్యారెట్ల 1 గ్రామ్ లక్ష్మి గోల్డ్ కాయిన్, 10 లక్షి గణేష్ సిల్వర్ కాయిన్ ఆర్డర్ చేశారు. అయితే అతనికి 1 గ్రామ్ గోల్డ్ కాయిన్ స్థానంలో 0.5 గ్రామ్ గోల్డ్ కాయిన్ డెలివరీ అయింది. దీనికి సంబంధించిన ఫోటోలను తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో షేర్ చేశారు.ఫోటోలను షేర్ చేస్తూ.. బ్లింకిట్ డెలివరీ చేసే సమయానికి నేను ఇంట్లో లేను, అందుకే దాన్ని రిసీవ్ చేసుకోవడానికి మా తమ్ముడికి ఓటీపీ చెప్పి తీసుకోమన్నాను. కానీ నేను 20 నిమిషాల తర్వాత ఇంటికి వచ్చి చూసేసరికి 0.5 గ్రామ్ గోల్డ్ కాయిన్ డెలివరీ అయి ఉండటం చూసి ఖంగుతిన్నాను వెల్లడించారు.వచ్చిన డెలివరీకి ఆర్డర్ చేద్దామనుకుంటే.. రిటర్న్ విండో గడువు ముగిసింది. ఇప్పటి వరకు ఇంత ఖరీదైన వస్తువులను బ్లింకిట్‌లో ఆర్డర్ చేయడం ఇదే మొదటిసారి. అయితే డెలివెరీకి సంబంధించిన సీసీ ఫుటేజ్ కూడా ఉందని కూడా పేర్కొన్నారు. ఇది చూసిన చాలామంది ఆన్లైన్లో జరుగుతున్న మోసాలపైన మండిపడ్డారు.Got scammed by blinkitI ordered 1 gm gold coin from blinkit, along with the 1gm silver coin. It was all prepaid. I wasn't there at home to receive the order, so I gave the otp to my younger brother to get it received. After 20 mins I reached home and saw wrong item was… pic.twitter.com/N15wSfIhpt— Mohit Jain (@MohitJa30046159) October 29, 2024 -
Dhanteras 2024 : సంతోషాన్ని నింపే సెలబ్రిటీల విషెస్
-
Dhanteras 2024 : ధర్మ ఆఫీసు ధన్తేరస్ పూజలో సెలబ్రిటీల సందడి
-
భారీగా బంగారం కొనుగోళ్లు: రేటు పెరిగినా.. తగ్గని డిమాండ్
న్యూఢిల్లీ/కోల్‌కతా: ధరలు గణనీయంగా పెరిగినప్పటికీ పసిడికి డిమాండ్ పటిష్టంగానే ఉంటోంది. ధన్‌తేరాస్ సందర్భంగాను అదే ధోరణి నెలకొంది. మంగళవారం ధన్‌తేరాస్ సందర్భంగా అమ్మకాలు ఉదయం పూట అంతంతమాత్రంగానే ఉన్నప్పటికీ మధ్యాహ్నం నుంచి పుంజుకున్నట్లు పరిశ్రమ వర్గాలు వివరించాయి. ఎక్కువగా చిన్న ఐటమ్స్, నాణేలకు డిమాండ్ నెలకొన్నట్లు పేర్కొన్నాయి.బుధవారం మధ్యాహ్నం వరకు ధన్‌తేరాస్ ఉండటంతో మరింతగా వ్యాపారం జరగవచ్చని పీఎన్ గాడ్గిల్ జ్యుయలర్స్ సీఎండీ సౌరభ్ గాడ్గిల్ తెలిపారు. ధరలు అధిక స్థాయిలో ఉన్నా డిమాండ్ పటిష్టంగా ఉన్నట్లు కల్యాణ్ జ్యుయలర్స్ ఈడీ రమేష్ కల్యాణరామన్ చెప్పారు. అయితే, అధిక ధరల వల్ల విలువపరంగా అమ్మకాలు పెరిగినా, పరిమాణంపరంగా మాత్రం తగ్గొచ్చని కొన్ని వర్గాలు పేర్కొన్నాయి.‘రేటు అధికంగా ఉన్నా కొనుగోళ్లు మెరుగ్గానే ఉన్నాయి. పరిమాణంపరంగా గతేడాదితో పోలిస్తే 10 శాతం తగ్గినా, విలువపరంగా చూస్తే 20 శాతం అధికంగా ఉండొచ్చు‘ అని ఆలిండియా జెమ్ అండ్ జ్యుయలరీ డొమెస్టిక్ కౌన్సిల్ చైర్మన్ సయ్యమ్ మెహ్రా తెలిపారు. రీసైకిల్డ్ ఆభరణాల అమ్మకాలు కూడా బాగున్నట్లు పేర్కొన్నారు. 2, 3, 4, 5, 8 గ్రాముల గోల్డ్ కాయిన్స్, తేలికపాటి ఆభరణాలు విక్రయాలు గణనీయంగా ఉన్నట్లు వివరించారు.ఆఫర్లు, డిస్కౌంట్లను కొనుగోలుదార్లు వినియోగించుకుంటున్నట్లు పేర్కొన్నారు. మొత్తం అమ్మకాల్లో 30–40% వాటా వివాహ ఆభరణాలది ఉండగా, మిగతాది పండుగపరమైన నామమాత్రపు కొనుగోళ్లది ఉన్నట్లు సెన్కో గోల్డ్ అండ్ డైమండ్స్ ఎండీ సువంకర్ సేన్ తెలిపారు. గతేడాదితో పోలిస్తే పసిడి అమ్మకాల పరిమాణం 15% తగ్గొచ్చని, విలువపరంగా మాత్రం 12% అధికంగా ఉండొచ్చన్నారు. ధన్‌తేరాస్, దీపావళి సందర్భంగా దేశీ మార్కెట్లో అమ్మకాలు రూ. 30,000 కోట్ల పైగా ఉంటాయని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి.రేటు 33 శాతం జంప్.. గతేడాది నవంబర్ 11న ధన్‌తేరాస్ నాడు న్యూఢిల్లీ మార్కెట్లో పది గ్రాముల పసిడి ధర రూ. 61,200గా ఉండగా ఈసారి ఏకంగా 33 శాతం ఎగిసి రూ. 81,400కి చేరింది. వెండి ధర కేజీకి గతేడాది ధన్‌తేరాస్ నాడు రూ.74,000గా ఉండగా ఈసారి 35% పెరిగి రూ. 99,700గా ఉంది.సుంకాల తగ్గింపుతో బూస్ట్: ఎంఎంటీసీఇటీవల పసిడిపై దిగుమతి సుంకాలను తగ్గించడంతో ధన్‌తేరాస్ సందర్భంగా బంగారం కొనుగోళ్లకు ఊతం లభించిందని ఎంఎంటీసీ–పీఏఎంపీ ఎండీ వికాస్ సింగ్ తెలిపారు. కస్టమర్లు అధిక స్వచ్ఛత గల పసిడి ఉత్పత్తులపై ఆసక్తి కనపరుస్తున్నట్లు చెప్పారు. రాబోయే పెళ్లిళ్ళ సీజన్లోనూ ఇదే సానుకూల ధోరణి కొనసాగవచ్చని సింగ్ చెప్పారు. సీజన్‌తో సంబంధం లేకుండా సంప్రదాయాలపరమైన వివిధ వేడుకల కారణంగా కూడా పసిడికి డిమాండ్ కొనసాగుతూనే ఉంటుందని ఆయన పేర్కొన్నారు. -
పండుగ కళ వచ్చేసింది: పింక్ సారీలో నటి లయ
-
మళ్ళీ షాకిచ్చిన పసిడి.. భారీగా పెరిగిన ధరలు
ధన త్రయోదశి.. బంగారం కొనుగోలు చేస్తే శుభమని చాలామంది భావిస్తారు. అయితే నేడు పసిడి ధరలు మళ్ళీ తారాస్థాయికి చేరాయి. కాబట్టి దేశంలోని ప్రధాన నగరాల్లోని బంగారం ధరల్లో మార్పులు జరిగాయి. ఈ కథనంలో నేటి (మంగళవారం) గోల్డ్ రేట్లు గురించి వివరంగా తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడలలో ఈ రోజు బంగారం ధరలు పెరిగాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ. 80,450 వద్ద, 22 క్యారెట్ల ధర రూ. 73,750 వద్ద ఉంది. నిన్నటి ధరలతో పోలిస్తే.. నేడు ధరలు రూ. 600, రూ. 650 పెరిగింది. ఇదే ధరలు బెంగళూరు, ముంబై, గుంటూరు, ప్రొద్దుటూరు ప్రాంతాల్లో కూడా ఉన్నాయి.చెన్నైలో కూడా పసిడి ధరలు పెరుగుదలను నమోదు చేశాయి. తెలుగు రాష్ట్రాల్లో మాదిరిగానే చెన్నైలో కూడా పసిడి ధర రూ. 600, రూ. 650 పెరిగింది. దీంతో 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 80,450 కాగా.. 22 క్యారెట్ల రేటు రూ. 73,750 వద్ద ఉంది.ఇక ఢిల్లీలో బంగారం ధరల విషయానికి వస్తే.. ఇక్కడ కూడా పసిడి ధరలు భారీగానే పెరిగాయి. అయితే ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఢిల్లీలో ధరలు కొంత ఎక్కువ. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 73,900 కాగా.. 24 క్యారెట్ల ధర రూ. 80,600 వద్ద ఉంది. నిన్నటి ధరలతో పోలిస్తే.. నేటి ధరలు వరుసగా రూ. 600, రూ. 650 పెరిగింది.ఇదీ చదవండి: 10 నిమిషాల్లో బంగారు, వెండి నాణేల డెలివరీ..సిల్వర్ ధరలుబంగారం ధరలు పెరిగినప్పటికీ.. వెండి ధరలు మాత్రం స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. దీంతో కేజీ వెండి రేటు రూ.1,06,900 వద్ద నిలిచింది. గత మూడు రోజులు స్థిరంగా ఉన్న వెండి ధర ఈ రోజు రూ. 100 మాత్రమే తగ్గింది. ఇదే ధరలు దేశంలోని ఇతర రాష్ట్రాల్లో కూడా కొనసాగుతాయి.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి). -
10 నిమిషాల్లో బంగారు, వెండి నాణేల డెలివరీ..
నిత్యావసర వస్తువులను డెలివరీ చేసే ఆన్లైన్ గ్రోసరీ ప్లాట్‌ఫారమ్‌లు 'ధన త్రయోదశి' సందర్భంగా బంగారం, వెండి నాణేలను డెలివరీ చేయడానికి సిద్దమయ్యాయి. స్విగ్గీ ఇన్‌స్టామార్ట్, బ్లింకిట్, జెప్టో, బిగ్‌బాస్కెట్ వంటివి కేవలం 10 నిమిషాల్లో కస్టమర్లకు నాణేలను అందించనున్నట్లు సమాచారం.ధన త్రయోదశి నాడు బంగారం, వెండి కొనుగోలును చాలామంది శుభప్రదంగా భావిస్తారు. అయితే జ్యువెలరీకి వెళ్లి షాపింగ్ చేసే ఓపిక, సమయం లేనివారు.. ఇప్పుడు గ్రోసరీ ప్లాట్‌ఫారమ్‌లో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. బంగారం, వెండి నాణేలను డెలివరీ చేయడానికి జోయాలుక్కాస్, మలబార్ గోల్డ్ & డైమండ్స్, తనిష్క్ మొదలైనవి ఈ యాప్‌లతో జతకట్టాయి.ఆన్లైన్ గ్రోసరీ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా 24 క్యారెట్ల 0.1 గ్రా, 0.25 గ్రా, 1 గ్రా సాధారణ గోల్డ్ కాయిన్స్ కొనుగోలు చేయవచ్చు. అదే సమయంలో 5గ్రా, 11.66 గ్రా, 20 గ్రా స్వచ్ఛమైన వెండి నాణేలను కూడా ఈ గ్రోసరీ ప్లాట్‌ఫారమ్‌లలో బుక్ చేసుకోవచ్చు. 24 క్యారెట్ల లక్ష్మీ గణేష్ గోల్డ్ కాయిన్స్, సిల్వర్ కాయిన్లు కూడా కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటాయి.ఇదీ చదవండి: రతన్ టాటా గౌరవార్థం: లండన్‌లో..ఆన్లైన్ గ్రోసరీ ప్లాట్‌ఫారమ్ ద్వారా బంగారు, వెండి నాణేలను కొనుగోలు చేసే సమయంలో కస్టమర్లు ఏ జ్యువెలరీ ఎలాంటి నాణేలను అందిస్తుంది, ధరలు ఎలా ఉన్నాయనే విషయాలను తెలుసుకోవడానికి యాప్‌లని తనిఖీ చేయవచ్చు. కస్టమర్లు తప్పకుండా అధికారిక యాప్‌లను మాత్రమే తనిఖీ చేయాలి. లేకుంటే నకిలీ యాప్‌లు మోసం చేసే అవకాశం ఉంటుంది. -
సువర్ణ వాకిలి
‘చూశావా... ఏం తెచ్చానో’ అన్నాడతను స్కూటర్ ఇంటి ముందు ఆపి. వెనుక ట్రాలీ వచ్చి ఆగింది. అన్నీ మొక్కలే. నర్సరీ నుంచి తాజాగా దిగినవి. ‘అడిగావుగా... మల్లెతీగ తెచ్చాను’... ‘ఇదిగో... నీకు ఇష్టమైన బంతి. కుండీలోనే ఎన్ని పూసేసిందో చూడు’... ‘చిట్టి రోజాలు... రెక్క చామంతులు... ఈ మందారం కొమ్మలేసేంతగా పెరిగితే చాలా బాగుంటుంది’... వరుసగా చూపుతున్నాడు. ఎన్నాళ్లుగానో అడుగుతోంది. ఇవాళ ఉదయాన్నే లేచి, చెప్పా పెట్టకుండా వెళ్లి తెచ్చాడు. సంతోషంగా, సంబరంగా, ప్రేమగా చూస్తోంది వాటన్నింటిని! ‘నన్నూ తీసుకెళ్లుంటే బాగుండేదిగా’... ‘ఇంట్లోకి మొక్కలు వస్తున్నప్పుడు నువ్వు ఎదురు రావాలనీ’... ఆమె చేతిలో చాలా పూలున్న చిన్న కుండీని పెట్టి సెల్ఫీ దిగాడు. ఇద్దరూ హాయిగా నవ్వారు ఫొటోలో. ‘దీని పేరు బెగోనియా అట. బాగుంది కదూ’...మరోచోట మరో ఇంటతను రెండు రోజులుగా ఇల్లు సర్దుతున్నాడు. భార్యను పిలిచి ‘అనవసరమైన సామాను చాలా పేర్చిపెట్టావు చూడు’ అని బుజ్జగించి పారవేయించాడు. మాసిన కర్టెన్లు తీసి, ఉతికిన కర్టెన్లు మార్చాడు. దుమ్ము పట్టిన లైట్లను తుడిచాడు. అన్నీ చక్కగా అమర్చి హాల్లో రెండు ర్యాకులను ఖాళీగా సంపాదించగలిగాడు. ‘ఇప్పుడు ఏం చేద్దామని ఈ ర్యాకులను’ అందామె. ‘చెప్తా’ అని సాయంత్రం పిల్లల్ని తీసుకొని ఆటో ఎక్కి పుస్తకాల షాపుకు చేరాడు. ‘పిల్లలూ... ఒక ర్యాకుకు సరిపడా పుస్తకాలు మీరు కొనుక్కోండి. ఒక ర్యాకుకు సరిపడా మేము కొనుక్కుంటాం’.... పెళ్లికి ముందు వారిద్దరూ పుస్తకాలు చదివేవారు. సంసారంలో పడి వదిలేశారు. ‘ఇష్టమైన అలవాటు. తిరిగి మొదలెడదాం’ అన్నాడు భార్యతో. అప్పటికే ఆమె పుస్తకాలు ఎంచి ఒకవైపు పెట్టేస్తోందిగా!ఇంకో నగరం. ఉదయపు ఎండ ఎక్కువగా లేదు. అలాగని తక్కువగా లేదు. మంచి గాలి వీస్తున్నందు వల్ల బాల్కనీలో ఎదురూ బొదురూ సమయం ఆహ్లాదంగా ఉంది. ‘నీ ఫోను ఇవ్వు’ అన్నాడామెతో భర్త. తీసుకుని స్విగ్గి, జొమాటో లాంటి యాప్స్ డిలీట్ చేశాడు. తన ఫోన్ ఆమెకు ఇచ్చాడు. ‘ఫుడ్ డెలివరీ యాప్స్ తీసెయ్’ అన్నాడు. తీసేసింది. ‘ఇవాళ్టి నుంచి బయటి తిండి వద్దు. ఈ ఇంట్లోకి ఏది వచ్చినా ఇకపై హెల్దీదే వస్తుంది. నేను వారంలో మూడు బ్రేక్‌ఫాస్ట్‌లు, కనీసం రెండు డిన్నర్లు నువ్వు కిచెన్ లోకి రానవసరం లేకుండా చేయగలను. మిగిలింది నువ్వు చేయి. అసలు పొయ్యి ఎక్కవలసిన అవసరం లేని మంచి తిండి కూడా పిల్లలతో కూచుని డిజైన్ చేద్దాం. ఫేస్బుక్, యూట్యూబ్‌లకు వెచ్చించే సమయం మన ఉదరం కోసం వెచ్చిస్తే తెలిసి తెలిసీ ద్రోహం చేసుకోని వాళ్లం అవుతాం. మన తాత ముత్తాతలు వండుకోవడానికి తిండిలేక ఏడ్చేవాళ్లు. మనకు అన్నీ ఉన్నా వండుకోవడానికి ఏడిస్తే ఎలా? పరుగు పెట్టి సంపాదించి పట్టెడు మెతుకులు తినలేని స్థితికి చేరితే సంతోషమా మనకు?’అబ్బో! ఆ ఇంటిలో సందడి వేరేగా ఉంది. కోడలు మాటిమాటికీ ఊరికి ఫోన్లు మాట్లాడుతూ ఉంది. టికెట్ల ఏర్పాటు చూస్తూ ఉంది. అంత వరకూ ఖాళీగా ఉన్న మూడో బెడ్రూమును సిద్ధం చేస్తూ ఉంది. కొడుకు ఉద్వేగంగా ఉన్నాడు. కలా నిజమా తేల్చుకోలేక ఉన్నాడు. సాకులు వెతుక్కున్నారు తనూ తన భార్య. లేనిపోని తప్పులు వెతికారు తనూ తన భార్య. మా జోలికి రావద్దని తేల్చి చెప్పారు ఇద్దరూ కలిసి. బాగానే ఉంది. హాయిగా ఉంది. కాని బాగానే ఉందా... హాయిగా ఉందా... తల్లితండ్రులు అడుగుపెట్టి నాలుగేళ్లు అవుతున్న ఈ ఇల్లు. వారి ఆశీర్వాదం తాకని ఇల్లు. వారి మాటలు వినపడని, వారి గదమాయింపులూ ఆత్మీయ హెచ్చరికలూ లేని ఇల్లు. పశ్చాత్తాపం పిల్లలకు మరో పుట్టుక ఇస్తుంది. ఈ పుట్టుక తల్లితండ్రులను కోరింది. మనవలు వెళ్లి రిసీవ్ చేసుకొని తీసుకువస్తే కొడుకూ కోడల్ని కన్నీటి కళ్లతో చూస్తూ లోపలికి అడుగు పెట్టారు తల్లితండ్రులు. విశేషం చూడండి. ఆ రోజు ‘ధన్ తేరస్’.సాధారణంగా ధన్ తేరస్కి ఇంటికి బంగారం వస్తే మంచిది అనంటారు. కాని పై నాలుగు ఇళ్లలో బంగారం వంటి నిర్ణయాలు జరిగాయి. సిసలైన ‘ధన్ తేరస్’ అదే కావచ్చు.ధనం వల్ల ధన్యత రాదు. ధన్యత నొసగే జీవితం గడపడమే నిజమైన ధనం కలిగి ఉండటం. గాలినిచ్చే మంచి చెట్టు, పుష్టినిచ్చే తాజా ఆహారం, కష్టసుఖాలు పంచుకునే నిజమైన మిత్రులు, బుద్ధీ వికాసాలు కలిగించి ఈర్షా్య వైషమ్యం పోగొట్టే పుస్తకాలు, సదా అమ్మా నాన్నల సాంగత్యం, కుటుంబ సభ్యులంతా కలిసి భోం చేయగల సమయాలు, కనీస వ్యాయామం... ఇవి ఏ ఇంట ప్రతిరోజూ ఉంటాయో, అడుగు పెడతాయో, అంటిపెట్టుకుని ఉన్నాయన్న భరోసా కల్పిస్తాయో ఆ ఇల్లు సదా సమృద్ధితో అలరారుతుంది. అక్కడ అనివార్యంగా సంపద పోగవుతుంది. ఉత్తమమైన లోహం బంగారం. అది ఉత్తమమైన నివాసాన్నే ఎంచుకుంటుంది. శీతగాలులు ముమ్మరమయ్యే ముందు ఉల్లాస, ఉత్సాహాల కోసం దీపావళి. పనికి మనసొప్పని ఈ మందకొడి రోజులలో జీవనోపాధి దొరకకపోతే గనక జరుగుబాటుకు దాచిన ధన్తేరస్ పసిడి. పెద్దలు ఏం చేసినా ఆచితూచి, ఆలోచించి చేస్తారు. ధన్‌తేరస్‌కు తప్పక బంగారం, వెండి, వస్తువులు కొనదలుచుకుంటే కొనండి. కాని ప్రతి ఇల్లూ ఒక సువర్ణ వాకిలి కావాలంటే మాత్రం అహం, అసూయ, అజ్ఞానాలను చిమ్మి బయట పారబోయండి! ‘వాడికేం... బంగారంలా బతికాడు’ అంటారు. అలా బతికి అనిపించుకోండి! ధన త్రయోదశి శుభాకాంక్షలు. ప్రతి ఇంటా వికసిత కాంతులు కురియుగాక! -
బంగారంపై పండుగ ఆఫర్లు
బంగారం అంటే అందరికీ మక్కువే ముఖ్యంగా మహిళలు అమితంగా ఇష్టపడతారు. అయితే ప్రస్తుతం పసిడి ధరలు కొండెక్కి కూర్చున్నాయి. అయినా పండుగ వేళ రవ్వంత బంగారమైనా కొనుగోలుచేయాలని ఆశపడతారు. ఈ నేపథ్యంలో దీపావళి, ధన త్రయోదశి సందర్భంగా వివిధ జువెలరీ సంస్థలు ప్రత్యేక ఆఫర్లు ప్రకటించాయి.జోస్ ఆలుక్కాస్ ‘ఆహా దీపావళి’ ఆఫర్లు హైదరాబాద్: దీపావళి సందర్భంగా జోస్ ఆలుక్కాస్ ‘ఆహా దీపావళి’ పేరుతో ఆఫర్లు ప్రకటించింది. కస్టమర్లు రూ.60 వేల కొనుగోలుపై బంగారు ఆభరణాలకు ఉచితంగా వెండి, వజ్రాల కొనుగోలుపై ఒక బంగారు నాణేన్ని ఉచితంగా పొందవచ్చు. వజ్రాలపై 20% తగ్గింపు, ప్లాటినం ఆభరణాలపై 7% తగ్గింపు అందిస్తుంది. పాత బంగారాన్ని హెచ్‌యూఐడీ హాల్‌మార్క్ బంగారు ఆభరణాలతో మార్పిడి చేసుకునే సదుపాయం ఉంది.దీపావళి బహుమతిగా ఒక కారు ఈ ఆఫర్లో భాగంగా ఉంటుంది. ధన త్రయోదశి కోసం ముందస్తు బుకింగ్‌లు ప్రారంభమయ్యాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాల్లోని ‘ఆహా దీపావళి’ ఆఫర్లను ప్రజలంతా వినియోగించుకోవాలని కంపెనీ చైర్మన్ జోస్ ఆలుక్కా కోరారు.తనిష్క్ పండుగ ఆఫర్లు ముంబై: ఆభరణాల సంస్థ తనిష్క్ పండుగ సందర్భంగా అద్భుతమైన ఆఫర్లు ప్రకటించింది. కస్టమర్లు బంగారు ఆభరణాలు, వజ్రాభరణాల తయారీ చార్జీలపై 20% వరకు తగ్గింపు పొందవచ్చు. పాత బంగారు విలువకు సమానమైన బంగారు ఆభరణాలకు ఎలాంటి చెల్లింపు లేకుండా ఉచితంగా పొందవచ్చు. ఈ నవంబర్ 3 వరకు ఆఫర్లు అందుబాటులో ఉంటాయి. మరిన్ని ఆఫర్ల కోసం తనిష్క్ షోరూం లేదా, అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. -
Dhanteras 2024 : వెండి, బంగారమేనా? ఇలా చేసినా ఐశ్వర్యమేనట!
ధనత్రయోదశి, ధంతేరస్, లేదా చోటీ దివాలీ పేరు ఏదైనా సందడి మాత్రం ఒకటే. ధనత్రయోదశి అంటే సంపద, శ్రేయస్సుకోసం లక్ష్మీదేవిని, ధన్వంతరి ఆరాధించడమే దీని ప్రాముఖ్యత. అలాగే సంపదకు అధిపతి కుబేరుడికీ మొక్కుతారు. పూజ చేస్తారు. ధంతేరస్ అంటే పూజలు మాత్రమే కాదు, లక్ష్మికి ప్రతిరూపమైన బంగారాన్ని కొనుగోలు చేయడం ఆనవాయితీ. ఎవరికి శక్తికి తగ్గట్టు వారు బంగారం, వెండి ఆభరణాలను, లేదా వెండి లక్ష్మీదేవి, గణేష్ నాణేలను కూడా ఇంటికి తెచ్చుకుంటారు. అలా అదృష్టాన్ని తమ ఇంటికి తెచ్చుకున్నట్టు మురిసిపోతారు. అయితే ధనత్రయోదశి అంటే కేవలం వెండి, బంగారం, కొత్తబట్టలు కొత్త ఇల్లు, కొత్త వాహనం, కొత్త ఫోన్ తదితర విలువైన వస్తువులు కొనడం మాత్రమే కాదు, కొన్ని ఆశ్చర్యకరమైన వస్తువులను కూడా ఇంటికి తెచ్చుకుంటారు. ఎందుకంటే వాటిని శుభప్రదంగా భావిస్తారు కాబట్టి!ఈ పవిత్రమైన రోజున అత్యంత భక్తిశ్రద్దలతో లక్ష్మీదేవిని పూజించడం, ఇంట్లోని ఆడపిల్లలను లక్ష్మీస్వరూపులుగా భావించి కానుకలు ఇవ్వడం. తమ కున్నంతలో పేద ప్రజలకు బట్టలు, ధనము దానం చేయడంచీపురు కొనడం: లక్ష్మీదేవి రూపంగా భావించే చీపురును ధంతేరస్ రోజు కొనుగోలు చేస్తారు. ఫలితంగా కష్టాలు, అనారోగ్య సమస్యలతో పాటు తొలగి అష్టైశ్వార్యాలతో తులతూగుతామని నమ్ముతారు. వాహనం కొనుగోలు: కారు, బైక్ లేదా స్కూటర్, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను కొనుగోలు చేయాలని భావిస్తారు. అందుకే అనేక కంపెనీలు కూడా దీపావళి సందర్భంగా అనేక అఫర్లను కూడా ప్రకటిస్తాయి. మీరు దానిని కొనుగోలు చేయవచ్చు.ఇత్తడి- రాగి వస్తువులు : ధన్వంతరికి ఇత్తడి అంటే చాలా ఇష్టమట. అందుకే ఈ రోజు ఇత్తడి వస్తువులను కొనడం శ్రేయస్కరమని భావిస్తారు. ఉప్పు: ధంతేరాస్ రోజు ఉప్పు కొనడం కూడా పవిత్రంగా చూస్తారు. ఉప్పును లక్ష్మీ దేవిగా భావిస్తారు. ధన త్రయోదశి రోజు ఉప్పునుకొనుగోలు చేస్తే ఐశ్వర్యం, అదృష్టం కలిసి వస్తుందని భక్తులు నమ్ముతారు. అలాగే కొత్తి మీరను కూడా సంపదకు చిహ్నంగా భావిస్తారు. కాబట్టి ఈ రోజున కొత్తిమీరను కొంటే డబ్బుకు లోటు ఉండదనేవి విశ్వాసం. -
ధనత్రయోదశి 2024 : అసలే కొండెక్కిన గోల్డ్ , ఈ విషయాలు మీకోసమే!
దీపావళి అనగానే గుర్తొచ్చే ముఖ్యమైన వేడుక ధంతేరస్. ఐదు రోజుల దీపావళి పండుగకు నాంది ఈ ధనత్రయోదశి. కార్తీక మాసంలో కృష్ణ పక్షం పదమూడో రోజున జరుపుకునే ముఖ్యమైన పండుగ ధన త్రయోదశి(ధంతేరస్) ఈ ఏడాది అక్టోబర్ 29న వస్తోంది. సాగర మథనం సమయంలో దుర్గాదేవి ,కుబేరుడు సముద్రం నుండి ఉద్భవించారని పురాణ కథ చెబుతోంది. అందుకే ఈ అందుకే త్రయోదశి నాడు ఇద్దరినీ పూజిస్తారు. అలాగే దేవతలు అసురులు "అమృతం"తో సముద్రంమీదుగా ప్రయాణిస్తున్నప్పుడు, ధన్వంతరి భగవానుడు ఉద్భవించాడట. అందుకే ఈ పండుగను ధనత్రయోదశి , ధన్వంతరి త్రయోదశి అని కూడా అంటారు.అలాగే సంపద , శ్రేయస్సును సూచించే లక్ష్మీ దేవిని, కుబేరుడిని భక్తితో పూజిస్తారు. ఎంతో శుభప్రదమైన ఈ రోజున ఒక గ్రాము అయినా బంగారం లేదా విలువైన వస్తువలను, కొనుగోలు చేయడం అదృష్టంగా భావిస్తారు. అలాగే కొత్త పెట్టుబడులు లాభాలను ప్రసాదిస్తాయని నమ్మకం. స్టాక్మార్కెట్లో కూడా దీపావళి రోజు ముహూరత్ ట్రేడింగ్ పేరుతో ప్రత్యేక ట్రేడింగ్ కూడా ఉంటుంది.సాధారణంగా బంగారం, వెండి నగలను కొనుగోలు చేయడంతోపాటు ఈ రోజు కొత ఇల్లు, కొత్త కారు, టీవీ తదితరఎలక్ట్రానిక్ వస్తువులను ఇంటికి తెచ్చుకోవడం శుభప్రదంగా భావిస్తున్నారు. ఈ క్రేజ్‌ను సొంతం చేసుకునేందుకు అనేక ఆఫర్లు, బంపర్ ఆఫర్లు అంటూ వినియోగదారులను ఆకట్టుకునే ప్రయత్నాలు ఇబ్బడిముబ్బడిగా ఉంటాయి. అసలే బంగార ధర కొండెక్కి కూర్చున్న నేపథ్యంలో బంగారం, వెండి ఆభరణాలు కొనుగోలు సమయంలో తీసుకోవల్సిన కనీసం జాగ్రత్తల గురించి తెలుసుకుందాం!బంగారం స్వచ్ఛతబంగారం స్వచ్ఛతను నిర్ధారించుకోవాలి. సాధారణంగా 18 క్యారట్లు, 22 క్యారట్లు, 24 క్యారట్ల బంగారం అందుబాటులో ఉంటుంది.హాల్ మార్క్ నమ్మకమైన దుకాణదారుని వద్ద మాత్రమే బంగారు, డైమండ్ ఆభరణాలను కొనుగోలు చేయడం ఉత్తమం. బంగారు ఆభరణాలు కొనుగోలులో అతి కీలకమైంది హాల్ మార్క్. బంగారు నాణ్యతకు ప్రామాణికమైన బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) హాల్‌మార్క్‌ను ప్రభుత్వం మాండేటరీ చేసినప్పటికీ, మన నగలపై హాల్ మార్క్ ఉందో లేదో కచ్చితంగా చెక్ చేసుకోవాలి. ఆభరణాల లోపలి వైపు ఉండే బీఐఎస్ సర్టిఫికేషన్ మీదే నగల విలువ ఆధారపడి ఉంటుంది.( Dhanteras 2024 : వెండి, బంగారమేనా? ఇలా చేసినా ఐశ్వర్యమేనట!) తూకానికి సంబంధించి బంగారం, గ్రాములు. మిల్లీ గ్రాములు లెక్కను సరిగ్గా చూసుకోవాలి. లేదంటే, ఆదమరిచి ఉంటే, మోసపోయే, డబ్బులు నష్టపోయే అవకాశం ఉంది. ఆ రోజు మార్కెట్లో ధరను పరిశీలించాలి. తరుగు, మజూరీ చార్జీలను కూడా కూడా ఒక కంట గమనించాలి. డైమండ్నగల విషయంలో అయితే మరింత జాగ్రత్తగా ఉండాలి. -
Dhanteras 2023: బంగారానికి ధనత్రయోదశి డిమాండ్
న్యూఢిల్లీ: దీపావళికి ముందు ధనత్రయోదశి సందర్భంగా శుక్రవారం బంగారం షాపులు సందడిగా కనిపించాయి. సాధారణ రోజులతో పోలిస్తే బంగారం, వెండి విక్రయాలకు డిమాండ్ ఏర్పడింది. బంగారం ధరలు కూడా కొంత తగ్గడం సానుకూలించింది. అక్టోబర్ 28న 10 గ్రాముల బంగారం (24 క్యారెట్లు) రూ.63,000 వరకు వెళ్లగా, అక్కడి నుంచి రూ.1,500 వరకు తగ్గడంతో వినియోగదారులు కొనుగోళ్లకు ఆసక్తి చూపించారు. ధన త్రయోదశి నాడు బంగారం కొనుగోలు చేస్తే మంచిదనే నమ్మకం ఎక్కువ మందిలో ఉండడం తెలిసిందే. గురువారం బంగారం 10 గ్రాముల ధర రూ.400 తగ్గి రూ.60,950 వద్ద ముగియగా, ధనత్రయోదశి సందర్భంగా ఢిల్లీలో 10 గ్రాములకు రూ.50,139 (పన్నులు కాకుండా) పలికింది. సాధారణంగా ధనత్రయోదశి నాడు దేశవ్యాప్తంగా 20–30 టన్నుల వరకు బంగారం అమ్ముడుపోతుంటుంది. మధ్యాహ్నం తర్వాత నుంచి షాపులకు కస్టమర్ల రాక పెరిగినట్టు వర్తకులు తెలిపారు. మధ్యాహ్నం తర్వాత త్రయోదశి రావడం తెలిసిందే. శనివారం మధ్యాహ్నం వరకు త్రయోదశి ఉంటున్నందున కొనుగోళ్లు మరింత పెరగొచ్చని వర్తకుల అంచనాగా ఉంది. ‘‘బంగారం ధరలు వ్యాపారానికి అనుకూలంగా ఉన్నాయి. మంచి విక్రయాలు నమోదవుతాయని భావిస్తున్నాం. కస్టమర్ల నుంచి మంచి స్పందన వస్తోంది’’అని అఖిల భారత జెమ్ అండ్ జ్యుయలరీ డొమెస్టిక్ కౌన్సిల్ డైరెక్టర్ దినేష్ జైన్ తెలిపారు. రాత్రి 8 గంటల వరకు అందిన సమాచారం మేరకు దేశవ్యాప్తంగా రూ.30,000 కోట్ల విలువ చేసే బంగారం, వెండి ఆభరణాలు, ఆరి్టకల్స్ కొనుగోళ్లు జరిగాయి. ఇందులో బంగారం కొనుగోళ్లు రూ.27,000 కోట్లుగా, వెండి కొనుగోళ్లు రూ.3,000 కోట్ల వరకు ఉంటాయని ఆల్ ఇండియా జ్యుయలర్స్, అండ్ గోల్డ్ స్మిత్స్ ఫెడరేషన్ నేషనల్ ప్రెసిడెంట్ పంకజ్ అరోరా తెలిపారు. గతేడాది ధనత్రయోదశి రోజున బంగారం, వెండి కొనుగోళ్లు రూ.25,000 కోట్లుగా ఉన్నాయి. -
అబ్బుర పరిచేలా, టన్నుల్లో బంగారం అమ్మకాలు
ఐదురోజుల దీపావళి పండగ పర్వదినాన్ని పురస్కరించుకుని ధన్‌తేరాస్ రోజు భారత్‌లో బంగారం, వెండిపై జరిగే లావాదేవీలు సుమారు రూ.30వేల కోట్లు జరుగుతుందని అంచనా. అదే సమయంలో ఆటోమొబైల్స్, కిచెన్‌లో వినియోగించే వస్తువులు, చీపుర్ల వ్యాపారం సైతం భారీగా జరిగే అవకాశం ఉందని సమాచారం. ధన్‌తేరాస్‌తో (నవంబర్ 10తో) దేశంలో దీపావళి ఉత్సవాలు ప్రారంభమై..రూపచతుర్ధశి, దీపావళి, గోవర్ధన్ పూజ, అన్నాచెల్లెళ్ల (భయ్యా దూజ్) ముగుస్తాయి. ఈ ఐదు రోజుల సమయంలో పైన పేర్కొన్న పరిశ్రమల్లో వ్యాపారం జోరుగా సాగుతుందనే అంచనాలు నెలకొన్నాయి. రూ.50వేల కోట్లు దాటింది కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (సీఏఐటీ) ప్రకారం.. నవంబర్ 10న దేశం అంతటా జరిగిన వ్యాపారం రూ.50 వేల కోట్లు దాటినట్లు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఒక్క ఢిల్లీలో బిజినెస్ రూ. 5,000 కోట్లు జరిగినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఈ సందర్భంగా సీఏఐటీ అధ్యక్షుడు బీసీ భారతియా, ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ ఖండేల్వాల్ ధన్‌తేరాస్ రోజు గణేష్,లక్ష్మి, కుబేరుల విగ్రహాలతో పాటు, వాహనాలు, బంగారం, వెండి ఆభరణాలు, అలాగే పాత్రలు, వంటగది ఉపకరణాలు, ఎలక్ట్రానిక్స్, చీపుర్లు వంటి వస్తువులు ఈ రోజున కొనుగోలు చేసేందుకు కొనుగోలుదారులు మంచిదని భావిస్తారని అన్నారు. అంతేకాకుండా, మట్టి దీపాలు, ఇల్లు, ఆఫీసుల అలంకరణ కోసం వినియోగించే వస్తువులు, ఫర్నిషింగ్ ఫ్యాబ్రిక్, దీపావళి పూజ సామగ్రి కొనుగోలు కూడా ధన్‌తేరాస్ రోజున కొనుగోలు చేస్తారని చెప్పారు బంగారం, వెండి విక్రయ లావాదేవీలు దేశవ్యాప్తంగా బంగారం, వెండి తదితర వస్తువులకు సంబంధించి రూ.30,000 కోట్ల టర్నోవర్ దాటిందని ఆల్ ఇండియా జువెలర్స్ అండ్ గోల్డ్స్మిత్స్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షుడు పంకజ్ అరోరా తెలిపారు. ఈ వ్యాపారంలో సుమారు రూ. 27,000 కోట్ల విలువైన బంగారు వస్తువులు, రూ. 3,000 కోట్ల వెండి లావాదేవీలు ఉన్నాయి. ఇప్పటి వరకు ఎంత బంగారం అమ్ముడు పోయిందంటే ధన్‌తేరాస్‌లో ఇప్పటి వరకు సుమారుగా 41 టన్నుల బంగారం, 400 టన్నుల వెండి ఆభరణాలు, నాణేలు అమ్ముడుపోయాయి. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) క్రింద నమోదైన 1,85,000 రిజిస్టర్ చేసుకోగా.. దాదాపు నాలుగు లక్షల చిన్న, పెద్ద ఆభరణాలు విక్రయించే వ్యాపారులు ఉన్నట్లు తేలింది. బీఐఎస్ ప్రమాణాలు ఇంకా అమలు చేయని ప్రాంతాల్లో అదనంగా 2,25,000 చిన్న ఆభరణాల షాపులు విక్రయాలు నిర్వహిస్తున్నాయి. ఐదురోజుల దీపావళికి భారత్ ఏటా విదేశాల నుంచి దాదాపు 800 టన్నుల బంగారం, 4,000 టన్నుల వెండిని దిగుమతి చేసుకుంటోంది. -
ధంతేరాస్ దెబ్బ... చైనాకు 75,000 కోట్ల నష్టం
-
బంగారం కొనుగోలు చేస్తున్నారా? అయితే ఈ తప్పులు చేయకండి
ప్రపంచ వ్యాప్తంగా ఆర్ధిక మాంద్యం, ద్రవ్యోల్బణం వంటి ప్రతికూల పరిస్థితులు కొనసాగుతున్నప్పటికీ బంగారం ఎక్సేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్)లో ఇన్వెస్టర్లు పెట్టుబడులకు మొగ్గు చూపుతున్నారు. ఇక సంక్రాంతి, దసరా.. ముఖ్యంగా దంతెరాస్, దీపావళి వంటి పండగల సమయాల్లో ఫిజికల్ గోల్డ్, గోల్డ్ కాయిన్స్, జ్వువెలరీ కొనుగోళ్లు భారీ ఎత్తున జరుగుతుంటాయి. దీనికి తోడు భారత ప్రభుత్వం దేశ వ్యాప్తంగా 282 జిల్లాల్లో బంగారంపై హాల్‌మార్క్ తప్పని సరిచేయడంతో కొనుగోళ్లు సాఫీగా జరుగుతాయని మార్కెట్ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పుడు మనం ఈ ధంతేరాస్, దీపావళికి ఫిజికల్ గోల్డును ఎలా కొనుగోలు చేయాలి? పండగల సమయాల్లో ఎంత బంగారం కొనుగోలు చేయాలో తెలుసుకుందాం. ఇందుకోసం పాప్లీ గ్రూప్ డైరెక్టర్ రాజీవ్ పాప్లీ, బంగారంపై తప్పనిసరి హాల్‌మార్కింగ్‌ను అమలు చేయడానికి వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన నిపుణుల సలహా కమిటీలో ఉన్న ఆల్ ఇండియా జెమ్ & జ్యువెలరీ డొమెస్టిక్ కౌన్సిల్ ఛైర్మన్ ఆశిష్ పెథే, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ పూనమ్ రుంగ్తా జాతీయ మీడియాకు ఇచ్చిన సలహాలు ఇలా ఉన్నాయి. కోవిడ్- 19 లాక్డౌన్ ఎత్తివేత, తగ్గిపోతున్న మహమ్మారి కారణంగా భారత్‌లో బంగారంపై డిమాండ్ పెరుగుతుందా? ట్రెండ్స్ ఎలా ఉన్నాయి. రాజీవ్ పాప్లీ : అవును, బంగారానికి డిమాండ్ ఎక్కువగా ఉంది. కోవిడ్ -19 మహమ్మారి సమయంలో ఇండస్ట్రీ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది. కానీ ఈ సంవత్సరం ఆ భయంకరమైన పరిస్థితుల నుంచి బయటపడినట్లు అనిపిస్తుంది. ఎందుకంటే? రక్షా బంధన్ నుంచి బంగారం విక్రయాలు ఊపందుకున్నాయి. కోవిడ్ ఎఫెక్ట్‌తో అనిశ్చిత కాలంలో గోల్డ్‌లో పెట్టుబడులు సురక్షితమని పెట్టుబడి దారులు భావిస్తున్నారు. ఆశిష్ పేథే : గత రెండేళ్లుగా నేను చూస్తున్న మరో ట్రెండ్ ఏమిటంటే పెట్టుబడి దారులు ముఖ్యంగా యువకులు చిన్న మొత్తాల్లో పెట్టుబడులు పెట్టడం ప్రారంభించారు. రెట్టింపు ఆదాయం ఉన్న కుటుంబాలు కూడా బంగారం కొనుగోళ్ల కోసం కొంత డబ్బును పక్కన పెట్టడం ప్రారంభించాయి. హాల్‌మార్క్ లేని ఆభరణాలను తప్పుగా అమ్మడం సాధ్యమేనా? పెథే : హాల్‌మార్కింగ్ తప్పనిసరి అయిన 282 జిల్లాల్లో మీరు బంగారం కొనుగోలు చేస్తే, హాల్‌మార్క్ లేని ఒక్క ఆభరణాన్ని కూడా విక్రయించలేరు. 2 గ్రాముల చిన్న ముక్క లేదా చిన్న చెవిపోగు కూడా హాల్‌మార్క్ చేయబడాలి. వాస్తవానికి, ప్రతి స్వర్ణకారుడు కనీసం 10x మాగ్నిఫికేషన్ ఉన్న భూతద్దం కలిగి ఉండాలని చట్టం నిర్దేశిస్తుంది. తద్వారా వినియోగదారు హాల్‌మార్కింగ్‌ను తనిఖీ చేయవచ్చు. 18-క్యారెట్ బంగారు ముక్క మొదలైన వాటి కోసం మార్కింగ్‌ను వివరించే చార్ట్‌ను కూడా సిద్ధంగా ఉంచుకోవాలి. బంగారం కొనాలనుకుంటున్నారా? అయితే ఈ తప్పులు చేయకండి పూనమ్ రుంగ్తా : మనం భారతీయులం. బంగారు ఆభరణాల్ని ఎక్కువగా ఇష్టపడతాం. కానీ మన పెట్టుబడుల్ని మాత్రం ఆభరణాల్లో కలపకూడదు. ఎందుకంటే? కొన్న బంగారాన్ని కుటుంబ సభ్యులకు విభజించాలంటే.. వాటిని అమ్మాల్సి ఉంటుంది. అందువల్ల, గోల్డ్ బార్గా లేదా ఇ-గోల్డ్ లేదా పేపర్ గోల్డ్ కొనుగోలు చేయడం వంటి మార్గాలు బంగారంపై ఉత్తమమైన పెట్టుబడిగా భావించాలి. బంగారాన్ని ఈక్విటీ (షేర్లు), డెబిట్ వంటి ఏదైనా ఇతర ఆస్తిలాగా పరిగణించండి. భౌతిక రూపంలో (స్వచ్ఛమైన బంగారం) లేదా గోల్డ్ ఇటిఎఫ్‌లలో మీ పెట్టుబడి పోర్ట్‌ఫోలియోలో 10-15 శాతం బంగారం రూపంలో ఉంచండి. ధంతేరస్, దీపావళి సమయాల్లో బంగారం ఎలా కొనుగోలు చేయాలి? రుంగ్తా : ప్రజలు ధంతేరస్, దీపావళి సందర్భంగా బంగారం కొనుగోలు చేసేందుకు ఇష్టపడుతుంటారు. అలాంటి సమయాల్లో బంగారం ధరలు పెరుగుతాయని గుర్తుంచుకోవాలి. ఎందుకంటే బంగారం ధర కూడా డిమాండ్, సప్లై నిర్విరామంగా కొనసాగుతుంది. అలాంటి సమయాల్లో కొనుగోలు దారులకు నేను ఇచ్చే సలహా ఏంటంటే? పండగల సమయాల్లో బంగారం ధరలు పెరుగుతాయి. ఆ సమయంలో కొద్ది బంగారం మాత్రమే కొనుగోలు చేయాలి. సాధారణ సమయాల్లో మీకు కావాల్సినంత బంగారం కొనుగోలు చేయడం ఉత్తమం. ధంతేరాస్, దీపావళి సమయంలో మేకింగ్ ఛార్జీలు తక్కువగా ఉంటాయి. కాబట్టి బంగారు నాణేలు కొనుగోలు చేయడం ఉత్తమమేనా? రుంగ్తా : తక్కువ మేకింగ్ ఛార్జీల సంగతి అటుంచితే. బంగారు నాణేలు స్వచ్ఛమైన బంగారంతో తయారు చేశారు. మనకు తెలిసినట్లుగా, బంగారు కడ్డీలు, నాణేలు 24-క్యారెట్ల స్వచ్ఛమైన నాణ్యతతో వస్తాయి. అంతేకాకుండా, బంగారు నాణేలు వినియోగం కంటే పెట్టుబడి పెడితే ఎక్కువ రుణాలు ఇస్తాయి. -
నగల అమ్మకాలు జిగేల్!
న్యూఢిల్లీ: ధనత్రయోదశి, దీపావళి సందర్భంగా బంగారం ఆభరణాల విక్రయాలు జోరుగా సాగుతాయని జ్యుయలరీ పరిశ్రమ అంచనాలతో ఉంది. ముఖ్యంగా దసరా సందర్భంగా ఆభరణాల విక్రయాలు 30 శాతం అధికంగా నమోదు కావడం, పరిశ్రమలో సానుకూల అంచనాలకు మద్దతునిస్తోంది. ఇదే ధోరణి దీపావళి పండుగ వరకు కొనసాగొచ్చని భావిస్తోంది. తదుపరి వివాహ శుభ ముహూర్తాలు కూడా ఉండడంతో అమ్మకాలపై బలమైన అంచనాలతో కంపెనీలు ఉన్నాయి. బంగారం ధరలు దిగిరావడానికి తోడు, ఆర్థిక కార్యకలాపాలు పూర్తి స్థాయిలో అనుమతించడం అనుకూలిస్తున్నట్టు పరిశ్రమ అంటోంది. ఆభరణాలకు వినియోగించే 22 క్యారట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.50వేల దిగువకు రావడం గమనార్హం. దసరా సమయంలో రూ.49,000 స్థాయిలో ఉన్న ధర ప్రస్తుతం ఇంకా తగ్గి రూ.46వేలకు దిగొచ్చింది. దీంతో దీపావళికి విక్రయాలు అంచనాలను మించుతాయని ఆభరణాల వర్తకులు భావిస్తున్నారు. దసరా నుంచి సానుకూలత దసరా నుంచి కొనుగోళ్లు సానుకూలంగా ఉన్నట్టు పీఎన్జీ జ్యుయలర్స్ సీఎండీ సౌరభ్ గాడ్గిల్ తెలిపారు. గతేడాదితో పోలిస్తే కస్టమర్లు రెట్టింపు విలువ మేరకు కొనుగోలు చేస్తున్నట్టు చెప్పారు. కస్టమర్లు ముందుగా బుక్ చేసుకుని, స్టోర్లకు వచ్చి తీసుకెళుతున్నట్టు తెలిపారు. టెంపుల్ జ్యుయలరీ, ఆధునికతను జోడించుకున్న సంప్రదాయ డిజైన్లకు మద్దతు ఉన్నట్టు వివరించారు. మొత్తం మీద గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది పండుగల సీజన్లో విక్రయాలు సమారు 30 శాతం అధికంగా ఉన్నట్టు తెలిపారు. ద్రవ్యోల్బణ ప్రభావం పెద్దగా లేదు ద్రవ్యోల్బణ ప్రభావం కస్టమర్ల కొనుగోళ్లను పెద్దగా ప్రభావితం చేయలేదని ఇండియా బులియన్ అండ్ జ్యుయలర్స్ అసోసియేషన్ జాతీయ కార్యదర్శి సురేంద్ర మెహతా పేర్కొన్నారు. దసరా విక్రయాల్లో ఇదే కనిపించిందని, ఆర్థిక కార్యకలాపాలను పూర్తి స్థాయిలో అనుమతించడం కలిసొచ్చినట్టు చెప్పారు. దసరా నవరాత్రుల్లో విక్రయాలు బలంగా నమోదు కావడం, తదుపరి దీపావళి విక్రయాలకు మద్దతుగా నిలుస్తుందని పరిశ్రమ అంచనాతో ఉంది. ‘‘దీపావళి సందర్భంగా విక్రయాలు మరింత అధికంగా ఉంటాయని అంచనా వేస్తున్నాం. గతేడాది దీపావళి విక్రయాలతో పోలిస్తే ఈ ఏడాది 40 శాతం అధికంగా ఉండొచ్చు. ఈ పండుగల సీజన్ పట్ల మేము ఎంతో ఆశావహంగా ఉన్నాం’’అని మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ చైర్మన్ ఎంపీ అహ్మద్ తెలిపారు. ‘‘దసరా సీజన్ బలంగా ఉంది. దీంతో దీపావళి, ధనత్రయోదశి విక్రయాలపై ఆశలతో ఉన్నాం. గడిచిన మూడేళ్లతో పోలిస్తే ఈ సీజన్ గొప్పగా ఉంటుంది’’అని సి. కృష్ణయ్య చెట్టి గ్రూప్ ఆఫ్ జ్యుయలర్స్ ఎండీ సి. వినోద్ హయగ్రీవ్ పేర్కొన్నారు. ‘‘దసరా సమయంలో మా స్టోర్లలో 30 శాతం అధిక విక్రయాలు నమోదయ్యాయి. మార్కెట్లో ఎంతో పెంటప్ డిమాండ్ (గతంలో నిలిచిన డిమాండ్ ఇప్పుడు పుంజుకోవడం) ఉంది. వినియోగదారులు బంగారం కొనుగోలుకు ఆసక్తి చూపిస్తున్నారు. పెట్టుబడుల కోణంలో కస్టమర్లు కాయిన్లను సైతం కొనుగోలు చేస్తున్నారు’’అని జోయాలుక్కాస్ జ్యుయలరీ సీఎండీ జాయ్ అలుక్కాస్ తెలిపారు. -
ధంతేరస్ 2022: బంగారు, వెండిపై ఫోన్‌పే క్యాష్ బ్యాక్ ఆఫర్
సాక్షి, ముంబై: ధంతేరస్ 2022కి టాప్ ఫిన్‌టెక్ ప్లాట్‌ఫారమ్ ఫోన్‌పే బంపర్ ఆఫర్ అందిస్తోంది. తన ఫ్లాట్‌ఫాం ద్వారా బంగారం, వెండి కొనుగోలు చేసిన వినియోగ దారులకు క్యాష్‌బ్యాక్ ఆఫర్ చేస్తోంది. రానున్న ధన్తేరస్ సందర్భంగా గోల్డెన్ డేస్ ప్రచారంలో భాగంగా వినియోగదారుల బంగారం, వెండి కొనుగోళ్లపై ఆకర్షణీయమైన ప్రోత్సాహకాలను ప్రకటించింది. ముఖ్యంగా బంగారం కొనుగోళ్లపై రూ. 2,500, వెండి కొనుగోళ్లపై రూ. 500 వరకు క్యాష్ బ్యాక్‌ను పొందవచ్చు. క్యాష్‌బ్యాక్ ఆఫర్‌కు ఎవరు అర్హులు? అక్టోబర్ 26 వరకు బంగారం లేదా వెండి కొనుగోళ్లను చేసినట్లయితే, కస్టమర్లు క్యాష్‌బ్యాక్ ఆఫర్‌కు అర్హులు. ధంతేరస్ సందర్భంగా యాప్లోఈ ఆఫర్ పొందాలంటే రూ. 1,000 లేదా అంతకంటే ఎక్కువ బంగారం ,వెండి కొనుగోలు చేయాల్సి ఉంటుంది. కస్టమర్లు 99.99 శాతం స్వచ్ఛమైన 24కె బంగారం, వెండిని కొనుగోలు చేయవచ్చు. దీంతోపాటు బీమా చేయబడిన డోర్‌స్టెప్ డెలివరీ అవకాశం ఉంది. లేదంటే ధృవీకృత 24కే గోల్డ్ బార్లను ఉచితం సేఫ్‌గా డిజిటల్‌గా గ్రేడ్ గోల్డ్ లాకర్లో దాచుకోవచ్చు. బంగారాన్ని ఎలా కొనుగోలు చేయాలి ♦ ఫోన్‌పేలో సైట్ దిగువన ఉన్న వెల్త్ చిహ్నాన్ని ఎంచుకోండి. ♦ బంగారం, వెండి ఏది కొనుగోలు చేయాలనుకుంటున్నారో, ఎంచుకుని, పేమెంట్ పద్ధతిని ఎంచుకోవాలి. ♦ ఆప్షన్లలో 'స్టార్ట్ అక్యుమ్యులేటింగ్' లేదా ‘బై మోర్ గోల్డ్ ఎంచుకోవాలి. ఆ తరువాత డోర్ డెలివరీ కావాలనుకుంటే ఆ ఆప్షన్ ఎంచుకోవాలి. ♦ చివరగా మీరుకొనాలనుకునే బంగారు లేదా వెండి నాణేలను క్లిక్ చేయవచ్చు. సంబంధిత నగదును నమోదు చేసి 'ప్రొసీడ్' బటన్‌పై క్లిక్ చేయాలి. -
ఆ సెంటిమెంట్ తెలుసో లేదో! కానీ యువత ఇప్పుడు లవ్ యూ బంగారం అంటూ!
అక్షయ తృతీయ, ధనత్రయోదశి రోజులలో బంగారం కొంటే మంచిది అనే సెంటిమెంట్ గురించి వీరికి పెద్దగా తెలిసి ఉండకపోవచ్చు. ‘హాల్‌మార్క్ సింబల్ ఏం తెలియజేస్తుంది?’ అనేదాని గురించి తెలుసుకోవాలనే ఆసక్తి లేకపోవచ్చు. అయితే ఇది ఒకప్పటి విషయం. ఇప్పుడు యూత్ ‘లవ్ యూ బంగారం’ అనడం మాత్రమే కాదు గోల్డ్ గురించి బోలెడు విషయాలు తెలుసుకొని మరీ కొనుగోలు చేస్తోంది...! ఆరోజుల్లో ఒకరోజు...తన బర్త్‌డేకు ఫ్రెండ్‌ని ‘గోల్డ్ రింగ్’ని గిఫ్ట్‌గా అడిగింది ఆమె. ‘నువ్వే 50 కేజీల బంగారం. నీకు బంగారం ఎందుకు బంగారం!’ అని ఆ ఫ్రెండ్ అన్నాడట. అయితే ఈ మిలీనియల్స్ జమానాలో అలాంటి డైలాగులతో తప్పించుకోవడం అసాధ్యం. అప్పుడూ, ఇప్పుడూ బంగారం అంటే బంగారమే! ఒకప్పుడంటే... బంగారం కొనుగోలు అనేది వివాహాది శుభకార్యాలలో పెద్దల వ్యవహారం. అయితే గత కొంత కాలంగా యూత్‌లో చిన్న మొత్తంలో అయినా బంగారం కొనుగోలు చేయడాన్ని ఇష్టపడే ధోరణి పెరుగుతోంది. 18–క్యారెట్ల వేర్/ఫ్యాషన్ జ్యువెలరీ ఆన్లైన్ షాపింగ్‌లో మిలీనియల్స్ చురుగ్గా ఉన్నట్లు వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (డబ్ల్యూజిసి) రిపోర్ట్ తెలియజేస్తుంది. మిలీనియల్స్ నుంచి కూడా డిమాండ్ ఏర్పడడంతో ఇండియన్ జ్యువెలరీ ఆన్లైన్ మార్కెట్ వేగం పెరిగింది. పెద్ద సంస్థలు యూత్‌ని దృష్టిలో పెట్టుకొని తేలికపాటి బరువుతో, స్టైలిష్‌గా ఉండే సబ్–బ్రాండ్స్‌ను లాంచ్ చేశాయి. అమ్మాయిలలో ఎక్కుమంది గోల్డ్ ఇయర్ రింగ్స్‌కు ప్రాధాన్యత ఇస్తున్నారు. బరువును పెద్దగా పట్టించుకోవడం లేదు. యూత్‌ని దృష్టిలో పెట్టుకొని కొత్త మార్కెటింగ్, ఎడ్వర్టైజింగ్ స్ట్రాటజీలు మొదలయ్యాయి. ‘కష్టకాలంలో అక్కరకొస్తుంది’ అనే భావనతో కాస్తో,కూస్తో బంగారం కొనుగోలు చేయడం అనేది పెద్దల సంప్రదాయం. కానీ ఈతరంలో ఎక్కువమందికి ఖరీదైన స్మార్ట్‌ఫోన్‌లాగే గోల్డ్ అనేది లగ్జరీ ఫ్యాషన్. ‘గోల్డ్ అంటే మా దృష్టిలో లగ్జరీ ఫ్యాషన్ మాత్రమే’ అనే స్టేట్మెంట్కు యువతరంలో కొద్దిమంది మినహాయింపు. దీనికి ఒక ఉదాహరణ చెన్నైకి చెందిన సచిత. ‘గతంలో స్టాక్‌మార్కెట్‌పై ఆసక్తి ఉండేది. ఆసక్తి మాత్రమే ఉంటే సరిపోదు. చాలా విషయాలు తెలిసి ఉండాలి అనేది తెలుసుకున్నాక గోల్డ్ ఇన్వెస్ట్‌మెంట్‌పై ఆసక్తి పెరిగింది’ అంటోంది సచిత. తమ ఫైనాన్షియల్ ప్లానింగ్‌ను దృష్టిలో పెట్టుకొని గోల్డ్‌ను సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్‌గా చూస్తున్న సచితలాంటి వాళ్లు యువతరంలో ఎంతోమంది ఉన్నారు. చదవండి: Podcast: ఆత్మీయనేస్తంగా పాడ్‌కాస్ట్! యూత్‌కు దగ్గరైన జానర్లలో అగ్రస్థానంలో ఉన్నది ఏమిటంటే! -
దంతేరాస్ ధమాఖా... 50 టన్నుల బంగారం సోల్డవుట్
న్యూఢిల్లీ: పండుగల సీజన్ కావడంతో అక్టోబర్‌లో బంగారం ఎక్సేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (గోల్డ్ ఈటీఎఫ్‌లు) పట్ల ఇన్వెస్టర్లలో ఆసక్తి కొనసాగింది. ఫలితంగా రూ.303 కోట్ల పెట్టుబడులు గోల్డ్ ఈటీఎఫ్‌ల్లోకి వచ్చాయి. అంతకుముందు సెప్టెంబర్ నెలలో గోల్డ్ ఈటీఎఫ్‌ల్లోకి రూ.446 కోట్ల పెట్టుబడులు రావడం గమనార్హం. ఆగస్ట్‌లో వచ్చిన పెట్టుబడులు కేవలం రూ.24 కోట్లుగానే ఉన్నాయని.. మ్యూచువల్ ఫండ్స్ అసోసియేషన్ (యాంఫి) గణాంకాలు తెలియజేస్తున్నాయి. పండుగల సీజన్ కావడంతో గోల్డ్ ఈటీఎఫ్‌లకు డిమాండ్ కొనసాగినట్టు ఎల్‌ఎక్స్‌ఎంఈ వ్యవస్థాపకురాలు ప్రీతిరాతిగుప్తా పేర్కొన్నారు. భారీ దంతేరాస్ విక్రయాలు ఈ ఏడాది దంతేరస్ సందర్భంగా 50 టన్నుల బంగారం విక్రయమైందని.. 2019తో పోలిస్తే 20 టన్నులు ఎక్కువని చెప్పారు. సెప్టెంబర్‌తో పోలిస్తే అక్టోబర్‌లో కాస్తంత పెట్టుబడులు తగ్గడానికి.. భౌతిక బంగారాన్ని ఎక్కువగా కొనుగోలు చేసి ఉండొచ్చని మార్నింగ్‌స్టార్ రీసెర్చ్ మేనేజర్ హిమాన్షు శ్రీవాస్తవ అభిప్రాయపడ్డారు. అలాగే, బంగారం ధరలు పెరగడం కూడా ఒక కారణమై ఉంటుందన్నారు. అయినప్పటికీ అక్టోబర్‌లో వచ్చిన నికర పెట్టుబడుల పరిమాణాన్ని పరిశీలిస్తే ఇన్వెస్టర్లు ఇప్పటికీ బంగారానికి ప్రాధాన్యం ఇస్తున్నట్టు పేర్కొన్నారు. అక్టోబర్ చివరికి గోల్డ్ ఈటీఎఫ్‌ల్లో ఫోలియోల (పెట్టుబడి ఖాతా) సంఖ్య 8 శాతం పెరిగి 26.6 లక్షలకు చేరింది. చదవండి:బంగారం ఎలా ఉన్నా మెరుస్తుంది..! -
ధన్‌తేరస్‌కు గృహోపకరణాల జోరు
న్యూఢిల్లీ: ధన్‌తేరస్‌కు ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాల అమ్మకాలు జోరుగా సాగాయి. గతేడాదితో పోలిస్తే ఈ ధన త్రయోదశికి విక్రయాలు 45 శాతం దాకా పెరిగాయని కంపెనీలు అంటున్నాయి. భారీ తెర గల టీవీలు, ప్రీమియం ఉత్పత్తులతో ఈ పండుగ సీజన్లో అమ్మకాలు మెరుగైన వృద్ధిని సాధిస్తాయని ధీమా వ్యక్తం చేస్తున్నాయి. సెమీకండక్టర్ల కొరతతోపాటు నిరంతర ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కొంటున్నప్పటికీ కంపెనీలు సానుకూల ఫలితాలను నమోదు చేశాయి. ‘ఈ పండుగల సీజన్లో కస్టమర్ల సెంటిమెంట్ ఆల్–టైమ్ హైలో ఉంది. మహమ్మారి తర్వాత బలంగా ఉద్భవించిన ఈ–కామర్స్ రంగం గ్రామీణ, చిన్న మార్కెట్లలో బ్రాండ్లు చొచ్చుకుపోవడానికి సహాయపడుతోంది’ అని కంపెనీలు చెబుతున్నాయి. ఓనమ్, దసరాతో మొదలైన కొనుగోళ్ల జోరు దీపావళి వరకు కొనసాగుతుందని పరిశ్రమ ఆశగా ఉంది. ఏడాదిలో జరిగే మొత్తం అమ్మకాల్లో పండుగల సీజన్ వాటా 30 శాతం దాకా ఉంది. ప్రీమియం టెలివిజన్లకు.. ఈ ధన్‌తేరస్‌కు పెద్ద తెర గల ప్రీమియం టెలివిజన్లకు మంచి డిమాండ్ ఉందని సోనీ ఇండియా ఎండీ సునీల్ నయ్యర్ తెలిపారు. ప్రధానంగా 55 అంగుళాలు, ఆపైన సైజు టీవీలకు అద్భుత స్పందన ఉందన్నారు. అన్ని రకాల సౌండ్ బార్స్ సైతం అమ్ముడయ్యాయని చెప్పారు. కిత్రం ఏడాదితో పోలిస్తే ఈ ధంతేరస్‌కు 30–35 శాతం అధిక వ్యాపారం చేశామన్నారు. ఫెస్టివల్ సీజన్ అయ్యేంత వరకు ఈ జోష్ ఉంటుందన్నారు. 2020తో పోలిస్తే 24 శాతం వృద్ధి సాధించామని ప్యానాసోనిక్ ఇండియా, దక్షిణాసియా సీఈవో మనీశ్ శర్మ తెలిపారు. పండుగల సీజన్ పూర్తి అయ్యేసరికి 50 శాతం అధిక విక్రయాలు నమోదు చేస్తామన్నారు. స్మార్ట్ 4కే ఆన్‌డ్రాయిడ్ టీవీలు, స్మార్ట్ ఏసీలు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లు, మైక్రోవేవ్స్ ఈ వృద్ధిని నడిపిస్తున్నాయని వివరించారు. బలంగా సెంటిమెంట్.. పండుగ సీజన్ పూర్తి అయ్యేనాటికి వృద్ధి మరింతగా ఉంటుందని కంజ్యూమర్ ఎలక్ట్రానిక్స్, అప్లయాన్సెస్ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ (సియామా) ప్రెసిడెంట్ ఎరిక్ బ్రగాంజా అన్నారు. కొనుగోళ్ల విషయంలో కస్టమర్ల సెంటిమెంట్ బలంగా ఉందని శామ్సంగ్ చెబుతోంది. 2020తో పోలిస్తే ఈ ఏడాది ధంతేరస్‌కు 20 శాతం అధికంగా అమ్మకాలు సాధించామని శాంసంగ్ ఇండియా కంజ్యూమర్ ఎలక్ట్రానిక్స్ బిజినెస్ ఎస్వీపీ రాజు పుల్లన్ వెల్లడించారు. ఓఎల్ఈడీ టీవీ, అల్ట్రా హెచ్డీ టీవీ, సైడ్ బై సైడ్ రిఫ్రిజిరేటర్స్, చార్కోల్ మైక్రోవేవ్స్ వంటి ఉత్పత్తులకు స్థిరమైన వృద్ధి చూస్తున్నామని ఎల్జీ ఇండియా కార్పొరేట్ ప్లానింగ్ వైస్ ప్రెసిడెంట్ దీపక్ బన్సల్ తెలిపారు. గోద్రెజ్ అప్లయాన్సెస్ 45 శాతం వృద్ధి నమోదు చేసింది. 2019లో ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాల మార్కెట్ భారత్‌లో సుమారు రూ.76,400 కోట్లు ఉంది. -
పసిడి ‘ధనత్రయోదశి’ ధగధగలు
ముంబై: ధనత్రయోదశి పర్వదినం సందర్భంగా మంగళవారం దేశవ్యాప్తంగా బంగారం ఆభరణాల కొనుగోళ్లు పెరిగాయి. కరోనా కారణంగా గతేడాది డిమాండ్ తగ్గగా.. ఈ ఏడాది పరిస్థితుల్లో స్పష్టమైన మార్పు కనిపించింది. కొనుగోళ్లకు వచ్చే వారి సంఖ్య ఎక్కువగా ఉందని.. గతేడాదితో పోలిస్తే 40 శాతం పెరిగినట్టు పరిశ్రమ వర్గాలు చెప్పాయి. ఆన్లైన్ విక్రయాలు కూడా ఊపందుకున్నాయి. 15 టన్నుల ఆభరణాలు.. జ్యుయలరీ పరిశ్రమ కరోనా మహమ్మారి నుంచి కోలుకుందని అఖిలభారత ట్రేడర్ల సమాఖ్య (సీఏఐటీ) పేర్కొంది. ‘‘దేశవ్యాప్తంగా రూ.7,500 కోట్ల విలువ మేర సుమారు 15 టన్నుల బంగారం ఆభరణాలు విక్రయాలు ధనత్రయోదశి రోజున నమోదయ్యాయి’’ అని తెలిపింది. గత డిమాండ్ తోడవ్వడం, ధరలు అనుకూలంగా ఉండడం, లాక్డౌన్ ఆంక్షలు సడలిపోవడం డిమాండ్‌కు మద్దతునిస్తాయని ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ) సీఈవో సోమసుందరం పీఆర్ పేర్కొన్నారు. ప్రస్తుత త్రైమాసికం ఇటీవలి సంవత్సరాల్లోనే బంగారానికి అత్యంత మెరుగ్గా ఉంటుందని అంచనా వేస్తున్నట్టు చెప్పారు. ఈ ఏడాది ధనత్రయోదశి సందర్భంగా బంగారానికి డిమాండ్ గతేడాదితో పోలిస్తే మెరుగ్గా ఉందని పీసీ జ్యుయలర్స్ ఎండీ బలరామ్‌గార్గ్ సైతం తెలిపారు. గతేడాదితో పోలిస్తే డిమాండ్ రెట్టింపైనట్టు ఆగ్మంట్ గోల్డ్ ఫర్ ఆల్ డైరెక్టర్ సచిన్ కొథారి పేర్కొన్నారు. 20–30 టన్నుల మేర.. ‘‘బంగారం ధరలు 2019తో పోలిస్తే పెరిగినప్పటికీ.. కరోనా ముందు నాటి స్థాయికి విక్రయాలు చేరుకుంటాయని అంచనా వేస్తున్నాము’’అని అఖిల భారత జెమ్ అండ్ జ్యుయలరీ డొమెస్టిక్ కౌన్సిల్ చైర్మన్ ఆవిష్ పెథే తెలిపారు. ఏటా ధనత్రయోదశి నాడు దేశవ్యాప్తంగా 20–30 టన్నుల బంగారం అమ్ముడుపోతోందని.. ఈ ఏడాది విక్రయాలు కొంచెం అధికంగానే ఉంటాయని పరిపరిశ్రమ వరా>్గలు వెల్లడించాయి. బంగారం ధరలు తులం రూ.57,000 స్థాయి వరకు వెళ్లి దిగి రావడం కూడా డిమాండ్‌కు కలిసొచ్చింది. ఢిల్లీలో బంగారం 10 గ్రాముల ధర రూ.47,644 (పన్నులు కాకుండా) పలికింది. అయితే 2020 ధనత్రయోదశి రోజున ఉన్న ధర రూ.39,240తో పోలిస్తే కాస్త పెరగడం గమనార్హం. బుధవారం ఉదయం వరకు త్రయోదశి తిథి ఉన్నందున ఆ రోజు కూడా బంగారం కొనుగోళ్లు కొనసాగనున్నాయి. హాల్‌మార్క్ ఉన్న ఆభరణాలే కొనండి హాల్‌మార్క్ కలిగిన ఆభరణాలను మాత్రమే కొనుగోలు చేయాలని ప్రభుత్వం సూచించింది. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) వద్ద నమోదైన వర్తకులకు చెందిన దుకాణాల్లో మాత్రమే హాల్‌మార్క్ ఆభరణాలను, కళాఖండాలను కొనుగోలు చేయాల్సిందిగా వినియోగదార్ల వ్యవహారాల శాఖ స్పష్టం చేసింది. ‘బిల్లు/ఇన్వాయిస్ తప్పనిసరిగా తీసుకోవాలి. హాల్‌మార్క్ ఆభరణాల విక్రయ బిల్లు, ఇన్వాయిస్లో.. ప్రతి ఆభరణం తాలూకు ప్రత్యేక వివరణ, విలువైన లోహం నికర బరువు, క్యారెట్లో స్వచ్ఛత, హాల్‌మార్కింగ్ రుసుమును సూచిస్తుంది’ అని వివరించింది. దేశవ్యాప్తంగా 256 జిల్లాల్లో 2021 జూన్ 23 నుంచి 14, 18, 22 క్యారట్ల ఆభరణాలకు హాల్‌మార్కింగ్‌ను ప్రభుత్వం తప్పనిసరి చేసింది. -
అమెజాన్ బంపర్ ఆఫర్: బంగారం, వెండి నాణేలపై భారీ డిస్కౌంట్
దివాళీ ఫెస్టివల్ సీజన్ సందర్భంగా ఈకామర్స్ దిగ్గజం అమెజాన్ భారీ ఆఫర్లను ప్రకటించింది. బంగారం, వెండి నాణేలు, టీవీలు, హోమ్ అప్లయన్సెస్ పై భారీ డిస్కౌంట్లు అందిస్తున్నట్లు తెలిపింది. బంగారు నాణేలపై ఆఫర్ ధన్‌తేరాస్ సందర్భంగా అమెజాన్ ధన్‌తేరాస్ షాపింగ్ స్టోర్ పేరుతో బంగారు నాణేలపై 20 శాతం డిస్కౌంట్, వెండి నాణేలపై 20 శాతం డిస్కౌంట్ అందిస్తోంది. అలాగే బంగారం, వెండి ఆభరణాలపై 40 శాతం వరకు తగ్గింపును అందిస్తోంది. అంతేకాదు డైమండ్ ఆభరణాలపై జీరో శాతం మేకింగ్ ఛార్జీలు ఉంటాయని పేర్కొంది. ఇక ఈ సేల్‌లో ఐసిఐసిఐ బ్యాంక్, కోటక్, రూపే క్రెడిట్, డెబిట్ కార్డ్‌లపై 10 శాతం డిస్కౌంట్ అందిస్తుంది. అమెజాన్ ధన్‌తేరాస్ షాపింగ్ స్టోర్‌లో ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై డిస్కౌంట్లు అందిస్తోంది. స్మార్ట్ఫోన్లపై 40 శాతం, ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్లపై 40 శాతం తగ్గింపును అందిస్తోంది. స్మార్ట్ టీవీలపై 65 శాతం వరకు తగ్గింపు, రిఫ్రిజిరేటర్లు, ఎయిర్ కండీషనర్లపై కూడా 40 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది ఆఫర్లు ఎలా ఉన్నాయ్ దాదాపూ నెలరోజులుగా కొనసాగుతున్న అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ రేపటితో ముగియనుంది. అయితే మరికొన్ని గంటల్లో ముగియనున్న ఈ సేల్‌లో టీవీలు, హోమ్ అప్లయన్సెస్ 65శాతం డిస్కౌంట్లు ఇస్తున్నట్లు ట్వీట్ చేసింది. మొబైల్,యాక్సెసరీలపై అమెజాన్ 40 శాతం, పురుషులు, మహిళల ఫ్యాషన్‌లో 80 శాతం డిస్కౌంట్‌ను అందిస్తున్నట్లు తెలిపింది. చదవండి:సేల్స్ బీభత్సం..! గంటలో 5లక్షల ఫోన్లు అమ్ముడయ్యాయి..! -
ధన్తేరస్ అమ్మకాలు జిగేల్!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ధన్‌తేరస్‌కు జువెల్లరీ షాపులు తళుక్కుమన్నాయి. ఎనిమిది నెలల తర్వాత ఒక్కసారిగా కస్టమర్లతో దుకాణాలు కిటకిటలాడాయి. కోవిడ్–19 కారణంగా తీవ్ర ప్రభావం ఎదుర్కొన్న బంగారు, వెండి ఆభరణాల మార్కెట్ కోలుకుంటుందా అన్న ఆందోళన నెలకొన్న పరిస్థితుల్లో విక్రేతలు కాస్త ఉపశమనం పొందారు. గతేడాదితో పోలిస్తే విక్రయాలు 30–50% నమోదైనట్టు మార్కెట్ వర్గాలు తెలిపాయి. గతం కంటే అమ్మకాలు తగ్గినప్పటికీ, కోవిడ్ ప్రభావం నుంచి కాస్త కోలుకోవడం శుభపరిణామం అని విక్రేతలు అంటున్నారు. కొన్ని నెలలుగా వాయిదా వేసుకుంటూ వస్తున్న కస్టమర్లు ధన్‌తేరస్‌కు కొనుగోళ్లకు ఆసక్తి చూ పారు. ఏడాది మొత్తంలో ధన త్రయోదశికే దుకాణాలు కస్టమర్లతో సందడి చేస్తాయి. బంగారం కంటే వెండికే.. ఈసారి ధన్‌తేరస్‌కు పుత్తడి కంటే వెండివైపే కస్టమర్లు మొగ్గు చూపారు. మొత్తం అమ్మకాల్లో పసిడి వాటా 30 శాతమేనని విక్రేతలు అంటున్నారు. వెండి నాణేలు, దీపాల వంటి పూజా సామాగ్రి ఎక్కువగా అమ్ముడైంది. బంగారం విషయానికి వస్తే వినియోగదార్లు ఎక్కువగా కాయిన్స్ కొన్నారు. ప్రధానంగా 0.5 నుంచి 2 గ్రాముల వరకు బరువున్న లక్ష్మీ రూపు నాణేలను కస్టమర్లు అధికంగా దక్కించుకున్నారని సిరివర్ణిక జువెల్లర్స్ ఫౌండర్ ప్రియ మాధవి వడ్డేపల్లి సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. డిసెంబర్ వరకు ఈ ట్రెండ్ సానుకూలంగా కొనసాగుతుందని అన్నారు. పెద్ద ఆభరణాలు కోరుకునేవారు బంగారం బదులు డైమండ్ జువెల్లరీ వైపు మొగ్గుచూపుతున్నారని ఎన్నారై రేణుక జొన్నలగడ్డ తెలిపారు. సోమవారంతో పోలిస్తే.. హైదరాబాద్ మార్కెట్లో శుక్రవారం 24 క్యారెట్ల పసిడి ధర 10 గ్రాములకు రూ.52,600 పలికింది. సోమవారం ఈ ధర రూ.53,900 దాకా వెళ్లింది. ధర కాస్త తగ్గడం కస్టమర్లకు కలిసి వచ్చింది. వాస్తవానికి మార్చి నుంచి ఆగస్టు వరకు 10 శాతం లోపే అమ్మకాలు జరిగాయి. సెప్టెంబర్ నుంచి కాస్త సేల్స్‌లో కదలిక వచ్చింది. అయితే కస్టమర్లతో విక్రేతలకు ఉన్న అనుబంధాన్నిబట్టి ఒక్కో షాపు శుక్రవారం 30–50% సేల్స్ నమోదు చేసిందని నగల హోల్‌సేల్ వ్యాపారి గుల్లపూడి నాగ కిరణ్ తెలిపారు. గతేడాది ఈ సీజన్లో బంగారం ధర రూ.38,000 ఉందని గుర్తు చేశారు. ఇప్పుడు ధర పెరగడం, కరోనా భయాల తో మార్కెట్‌పై ప్రభావం పడిందన్నారు. ఇన్వెస్టర్ల చూపు పసిడిపై.. గతేడాది కంటే ఈ సీజన్లో బంగారం ధర వేగంగా పెరగడం ఇన్వెస్టర్లను ఎక్కువగా ఆకట్టుకునే అవకాశం ఉందని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (సీఏఐటీ) వెల్లడించింది. కోవిడ్–19 భయాందోళనల నేపథ్యంలో వినియోగదార్లు డిజిటల్ వేదికలపై కాయిన్స్, బార్స్‌ను ఎక్కువగా కొనుగోలు చేశారని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఎండీ సోమసుందరం పీఆర్ తెలిపారు. గతేడాదితో పోలిస్తే 70% డిమాండ్ ఉండొచ్చని అంచనా వేస్తున్నట్టు ఆల్ ఇండియా జెమ్, జువెల్లరీ డొమెస్టిక్ కౌన్సిల్ చైర్మన్ అనంత పద్మనాభన్ తెలిపారు. గతేడాది రెండవ త్రైమాసికంలో దేశవ్యాప్తంగా 101.6 టన్నుల గోల్డ్ జువెల్లరీ అమ్ముడైంది. ఈ ఏడాది జూలై–సెపె్టంబర్లో ఇది 48% తగ్గి 52.8 టన్నులకు పరిమితమైందని సీఏఐటీ గోల్డ్, జువెల్లరీ కమిటీ చైర్మన్ పంకజ్ అరోరా వెల్లడించారు. బంగారం విషయం లో ప్రపంచంలో రెండవ అతిపెద్ద మార్కెట్‌గా భారత్ కొనసాగుతోంది. -
పసిడి- ధన్‌తెరాస్ వెలుగులు
న్యూయార్క్/ ముంబై : గత(2019) ధన్‌తెరాస్ నుంచి నేటి వరకూ చూస్తే.. పసిడి ధరలు దేశీయంగా 30 శాతం ర్యాలీ చేశాయి. ఫలితంగా 10 గ్రాముల ధర తొలిసారి రూ. 50,000 మార్క్‌ను అధిగమించింది. ప్రపంచ దేశాలను కోవిడ్-19 వణికిస్తుండటంతో పలు దేశాల ప్రభుత్వాలు, కేంద్ర బ్యాంకులు ట్రిలియన్ల కొద్దీ డాలర్లతో సహాయక ప్యాకేజీలకు తెరతీశాయి. కరోనా వైరస్ కట్టడికి అమలు చేసిన లాక్‌డవున్ తదితర సవాళ్లతో ప్రపంచ ఆర్థిక వృద్ధి మందగించింది. దీంతో సంక్షోభ పరిస్థితుల్లో రక్షణాత్మక పెట్టుబడిగా భావించే పసిడిలోకి చౌకగా లభిస్తున్న నిధులు ప్రవహించినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. కేంద్ర బ్యాంకులు, ఈటీఎఫ్ సంస్థలు తదితర ఇన్వెస్టర్లు పసిడిలో పెట్టుబడులకు ఆసక్తి చూపడంతో ధరలు భారీగా లాభపడినట్లు విశ్లేషించారు. నిజానికి 2018 నుంచీ బంగారం లాభాల బాటలో సాగుతున్నప్పటికీ 2020లో మరింత జోరందుకున్నట్లు తెలియజేశారు. కాగా.. నేటి ట్రేడింగ్‌లో బంగారం ధరలు సానుకూలంగా కదులుతున్నాయి. న్యూయార్క్ కామెక్స్‌లో 0.15 శాతం పుంజుకోగా.. దేశీయంగా ఎంసీఎక్స్‌లో నామమాత్ర లాభంతో ట్రేడవుతున్నాయి. ఎంసీఎక్స్‌లో గురువారం పసిడి సుమారు రూ. 350, వెండి రూ. 150 స్థాయిలో బలపడ్డాయి. చదవండి: (మెరుస్తున్న పసిడి, వెండి ధరలు) అటూఇటుగా.. ఎంసీఎక్స్‌లో ప్రస్తుతం 10 గ్రాముల బంగారం రూ. 50 లాభపడి రూ. 50,650 వద్ద ట్రేడవుతోంది. ఇది డిసెంబర్ ఫ్యూచర్స్ ధర కాగా.. ఇంట్రాడేలో రూ. 50,665 వద్ద గరిష్టాన్ని తాకింది. రూ. 50,609 వద్ద కనిష్టానికి చేరింది. అయితే వెండి కేజీ డిసెంబర్ ఫ్యూచర్స్ స్వల్పంగా రూ. 96 క్షీణించి రూ. 62,643 వద్ద కదులుతోంది. తొలుత రూ. 62,696 వద్ద నీరసంగా ప్రారంభమైన వెండి తదుపరి రూ. 62,510 వరకూ వెనకడుగు వేసింది. స్వల్ప లాభాలతో న్యూయార్క్ కామెక్స్‌లో ప్రస్తుతం బంగారం ధరలు సానుకూలంగా కదులుతున్నాయి. ఔన్స్(31.1 గ్రాములు) 0.15 శాతం లాభంతో1,876 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. స్పాట్ మార్కెట్లోనూ నామమాత్ర లాభంతో 1,878 డాలర్లకు చేరింది. వెండి మాత్రం 0.2 శాతం నీరసించి ఔన్స్ 24.26 డాలర్ల వద్ద కదులుతోంది. చదవండి: (కొనసాగుతున్న రూపాయి పతనం) నేలచూపుతో అమెరికాలో గత 8 రోజులుగా రోజుకి లక్ష కేసులకుపైగా నమోదవుతున్న నేపథ్యంలో ముడిచమురు ధరలు బలహీనపడ్డాయి. సెకండ్ వేవ్‌లో భాగంగా యూరోపియన్ దేశాలలోనూ కోవిడ్-19 వేగంగా విస్తరిస్తుండటంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మాంద్యం బారిన పడవచ్చన్న అంచనాలు పెరిగినట్లు నిపుణులు పేర్కొన్నారు. దీనికితోడు డెమొక్రాట్ల ప్రతిపాదిత ప్యాకేజీని రిపబ్లికన్లు తిరస్కరించడంతో ఆందోళనలు పెరిగినట్లు తెలియజేశారు. ప్రస్తుతం న్యూయార్క్‌లో నైమెక్స్ బ్యారల్ దాదాపు 2 శాతం పతనమై 40.35 డాలర్లకు చేరింది. మరోపక్క లండన్ మార్కెట్లోనూ బ్రెంట్ చమురు 1.55 శాతం క్షీణించి 42.86 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. -
ధన్‌తేరాస్‌కు ‘డబుల్’ ధమాకా
న్యూఢిల్లీ/ముంబై: ఈసారి ధన్‌తేరాస్ రెండు రోజులు రావడం పసిడి అమ్మకాలకు కలిసి రానుంది. ప్రస్తుతం బంగారం ధర కాస్త తగ్గడం కూడా ఇందుకు తోడ్పడనుందని, దీనితో ధన్‌తేరాస్ సందర్భంగా కొనుగోళ్లు మెరుగ్గానే ఉండగలవని పరిశ్రమవర్గాలు భావిస్తున్నాయి. క్రమంగా అమ్మకాలు పుంజుకుంటున్నాయని వెల్లడించాయి. పసిడి, వెండి మొదలైన వాటి కొనుగోలుకు శుభకరమైన రోజుగా దీపావళికి ముందు వచ్చే ధన్‌తేరాస్ (ధన త్రయోదశి)ని పరిగణిస్తారు. ఈసారి ధన్‌తేరాస్ రెండు రోజులు (గురు, శుక్రవారం) వచ్చింది. ఇప్పటిదాకా పేరుకుపోయిన డిమాండ్ అంతా అమ్మకాల రూపం దాల్చగలదని, శుక్రవారం విక్రయాలు మరింత పుంజుకోగలవని ఆలిండియా జెమ్ అండ్ జ్యుయలరీ డొమెస్టిక్ కౌన్సిల్ చైర్మన్ అనంత పద్మనాభన్ తెలిపారు. ‘కొనుగోలుదారులు నెమ్మదిగా ముందుకొస్తున్నారు. అమ్మకాలు మెరుగుపడుతున్నాయి. అయినప్పటికీ గతేడాది స్థాయిలో మాత్రం ఈసారి ధన్‌తేరాస్ అమ్మకాలు ఉండకపోవచ్చు’ అని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ఎండీ (ఇండియా) సోమసుందరం పీఆర్ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం పసిడి ధర తగ్గటమనేది డిమాండ్‌కు కొంత ఊతమివ్వగలదని పేర్కొన్నారు. అయితే పరిమాణంపరంగా అమ్మకాలు 15–20 శాతం తగ్గినా.. విలువపరంగా చూస్తే గతేడాది స్థాయిని అందుకునే అవకాశం ఉందని సెన్కో గోల్డ్ అండ్ డైమండ్స్ సీఈవో సువంకర్ సేన్ చెప్పారు. కరోనా కేసుల కారణంగా చాలా మంది ఆన్లైన్ జ్యుయలరీ సంస్థల నుంచి కూడా కొనుగోళ్లు జరుపుతున్నారని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. -
ఈసారి బంగారాన్ని పట్టించుకోలేదా?
దీపావళికి అమాంతం పెరిగే బంగారం అమ్మకాలు ఈసారి వెలవెలబోయాయి. అయితే ట్రేడర్లు ఊహించినదానికన్నా ఎక్కువ కొనుగోళ్లు జరగడం గమనార్హం. దంతేరస్ నాడు 30 టన్నుల బంగారం కొనుగోళ్లు జరిగాయని అధికారులు తెలిపారు. గత కొన్నేళ్లుగా దీపావళి సీజన్లో అమ్మకాలు 40 టన్నులకు చేరుకున్నాయి. కానీ ఈ ఏడాది బంగారం ధర మెట్టు దిగకపోవడంతో కొనుగోళ్లు అంతంత మాత్రంగానే జరిగాయి. ఇండియన్ బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ జాతీయ కార్యదర్శి సురేంద్ర మెహతా మాట్లాడుతూ.. బంగారం అధిక ధర పలకడంతో మార్కెట్లో వాటికి డిమాండ్ తక్కువగా ఉందన్నారు. దీంతో ఈసారి ధన త్రయోదశికి అమ్మకాలు 20 టన్నుల వద్ద ఆగిపోతాయని అంచనా వేశామన్నారు. కానీ అంచనాలను దాటి.. 30 టన్నుల బంగారం కొనుగోళ్లు జరిగాయని తెలిపారు. అయితే అమ్మకాల్లో వృద్ధి కనిపించినప్పటికీ గత సంవత్సరంతో పోలిస్తే 25 % క్షీణించాయని పేర్కొన్నారు. పసిడి రేట్లు ఎగబాకడం వల్ల మార్కెట్లో డిమాండ్ తగ్గిందన్నారు. భారత ప్రభుత్వం విలువైన లోహాలపై దిగుమతి సుంకాన్ని 10 నుంచి 12.5 శాతానికి పెంచడంతో బంగారం ధర చుక్కలనంటడానికి కారణమైందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కాగా శుక్రవారం 10 గ్రాముల బంగారం ధర రూ.38,275గా నమోదైంది. గతేడాది అదేరోజున బంగారం ధర రూ.31,702 పలికింది. -
బంగారం దుకాణాలు కళకళ
-
పడిపోయిన బంగారం అమ్మకాలు
-
పసిడి ప్రియం.. సేల్స్ పేలవం!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ధంతేరాస్‌గా పిలిచే ధన త్రయోదశికి పసిడి మెరుపులు తగ్గాయి. గతేడాదితో పోలిస్తే అమ్మకాలు ఏకంగా 40% దాకా తగ్గినట్లు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. 10 గ్రాముల పసిడి ధర రూ.40 వేలకు అటూఇటుగా కదులుతుండటంతో పాటు.. కస్టమర్లు చేసే వ్యయాలు తగ్గడం కూడా ఇందుకు కారణమని వర్తకులు అంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాక దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. నిజానికి ధన త్రయోదశికి బంగారం, వెండి, లేదా విలువైన వస్తువులు కొనడం శుభసూచకమని హిందువులు భావిస్తారు. 2018లో రికార్డు స్థాయి కొనుగోళ్లు జరిగాయి కూడా. అయితే పసిడి ధర అప్పటితో పోలిస్తే 10 గ్రా. రూ.6000 వరకూ ప్రస్తుతం ఎక్కువ. శుక్రవారం హైదరాబాద్‌లోని నగల షాపుల్లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రా. ధర రూ.39,900 కాగా.. 22 క్యారెట్ల ధర రూ.36,850 పలికింది. కిలో వెండి రూ.50,600 ఉంది. రూ.2,500 కోట్ల విక్రయాలు... ఈ సంవత్సరం ధన త్రయోదశికి శుక్రవారం సాయంత్రం వరకు రూ.2,500 కోట్ల విలువైన సుమారు 6,000 కిలోల పుత్తడి అమ్ముడైనట్లు కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (సీఏఐటీ) అంచనా వేసింది. గతేడాది ధనత్రయోదశికి మాత్రం రూ.5,500 కోట్ల విలువైన 17,000 కిలోల బంగారం విక్రయమైనట్లు సీఏఐటీ తెలియజేసింది. ‘‘వ్యాపారం 35–40% పడిపోయింది. గోల్డ్, సిల్వర్ ధరలు క్రితం ఏడాదితో పోలిస్తే గణనీయంగా పెరగడమే దీనికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది. గత పదేళ్లలో అత్యధికంగా నిరాశపర్చిన ఏడాది ఇదే’’ అని సీఏఐటీ గోల్డ్, జ్యుయలరీ కమిటీ చైర్మన్ పంకజ్ అరోరా చెప్పారు. పరిమాణం పరంగా 2018తో పోలిస్తే అమ్మకాలు 20% తగ్గొచ్చని ఆల్ ఇండియా జెమ్ అండ్ జ్యుయలరీ డొమెస్టిక్ కౌన్సిల్ (జీజేసీ) చైర్మన్ అనంత పద్మనాభన్ పేర్కొన్నారు. మెరిసిన వెండి..: అధిక ధర కారణంగా ఈ సారి సెంటిమెంట్ పడిపోయిందని గోల్డ్ రిఫైనింగ్ సంస్థ ఎంఎంటీసీ– పీఏఎంపీ ఇండియా ఎండీ రాజేశ్ ఖోస్లా చెప్పారు. ‘‘బంగారం ప్రస్తుత ధర వినియోగదార్ల దృష్టిలో చాలా ఎక్కువ. అందుకే కస్టమర్లు వెండి నాణేల వైపు మొగ్గు చూపారు’’ అని ఆయన వ్యాఖ్యానించారు. సిల్వర్ కాయిన్స్ విక్రయాలు 2018తో పోలిస్తే 15% పెరిగాయని చెప్పారాయన. వివాహాల సీజన్ తోడవడంతో వెండి వస్తువుల అమ్మకాలు పెరిగాయని శ్రీ స్వర్ణ జ్యుయలర్స్ ఎండీ ప్రియ మాధవి ‘సాక్షి’ బిజినెస్ బ్యూరోకు తెలిపారు. కాలికి వేసుకునే కడియాలకు మళ్లీ డిమాండ్ పెరిగిందన్నారు. విదేశాల నుంచి సైతం వీటికి ఆర్డర్లు వచ్చాయని చెప్పారామె. చిన్న ఆభరణాలకే.. అన్ని షోరూంలలోనూ అమ్మకాలు సానుకూలంగా ఉన్నాయని కళ్యాణ్ జువెల్లర్స్ సీఎండీ టి.ఎస్.కళ్యాణరామన్ తెలిపారు. స్తబ్దుగా ఉన్న మార్కెట్లో ధంతేరాస్ రాకతో పరిస్థితిలో కొంత మార్పు కనపడిందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ఇండియా ఎండీ సోమసుందరం పీఆర్ చెప్పారు. ఈ సారి తక్కువ విలువ ఉన్న ఆభరణాల వైపు ఎక్కువ మంది ఆసక్తి చూపారని జీజేసీ అంటోంది. 60–70 శాతం చిన్న ఆభరణాల అమ్మకాలేనని శారీనికేతన్ గోల్డ్ విభాగం ఇన్చార్జ్ గుల్లపూడి నాగ కిరణ్ చెప్పారు. పెళ్లిళ్ల సీజన్‌తో ముడిపడి 30% పైగా అమ్మకాలు నమోదయ్యాయని చెప్పారాయన. మొత్తంగా పుత్తడి అమ్మకాలు 40 శాతం పడిపోయాయన్నారు. -
ధంతేరస్ : కార్లపై భారీ డిస్కౌంట్లు
సాక్షి, ముంబై: ధంతేరస్ సందర్భంగా కొత్త కారును కొందామని ప్లాన్ చేస్తున్నారా. లేదంటే ప్రస్తుత కారును మార్పిడి చేసి కొత్త కారును ఇంటికి తెచ్చుకోవాలని యోచిస్తున్నారా? అయితే ఇది మంచి సమయం త్వరపడండి. ధనత్రయోదశి సందర్భంగా ప్రముఖకార్ల కంపెనీలుపండుగ సీజన్‌ను సద్వినియోగం చేసుకోవటానికి, అమ్మకాలను మెరుగుపరచడానికి భారీ ఆఫర్లు అందిస్తున్నాయి. హోండా, మారుతి సుజికి, టాటా మోటార్స్ తమ టాప్ మోడల్ కార్లపై వినియోగదారులకు పలు ప్రయోజనాలు అందిస్తున్నాయి. ముఖ్యంగా డిస్కౌంట్ ఆఫర్లు, ఎక్స్టెండెడ్ వారంటీ, ఎక్స్జేంజ్ బోనస్‌తో పాటు భారీ ఆఫర్లను అందిస్తోంది. హోండా ఆఫర్లు హోండా అమేజ్, జాజ్, సిటీ ఇలా ఏడు మోడల్స్కార్లపై ధరలను తగ్గించింది. రూ.9.78 లక్షల కారుపై 42వేల దాకా డిస్కౌంట్.రూ. 12వేల రూపాయల విలువైన ఎక్స్టెండెడ్ వారంటీ (4 వ & 5 వ సంవత్సరం). రూ .30,000 విలువైన కార్ల మార్పిడిపై అదనపు తగ్గింపు. రూ .16 వేల విలువైన హోండా కేర్ మెయింటెనెన్స్ ప్రోగ్రాం (మూడేళ్లు) ఉచితం. హోండా జాజ్‌లో రూ .25 వేల వరకు డిస్కౌంట్ రూ .25 వేల విలువైన కార్ ఎక్స్ఛేంజ్లో అదనపు డిస్కౌంట్ పొందవచ్చు. హోండా జాజ్ అసలు ధర రూ .9.41 లక్షలు. హోండా సిటీ: రూ. 32,000 ఆఫర్, కార్ ఎక్స్ఛేంజ్ ద్వారా రూ .30,000 అదనపు తగ్గింపు. అసలు ధరరూ .14.16 లక్షలు హోండా బిఆర్-విలో, కంపెనీ మొత్తం 1,10,000 రూపాయల వరకు డిస్కౌంట్‌ను అందిస్తుంది, ఇందులో నగదు తగ్గింపు (రూ .33,500), కార్ ఎక్స్ఛేంజ్ (రూ .50,000) ఇతరాలు (రూ .26,500) ఉన్నాయి. హోండా సివిక్ 250,000 రూపాయల వరకు తగ్గింపుతో లభిస్తుంది. డిస్కౌంట్ తరువాత, కారు కొత్త ధర 17.94 లక్షలు. ఈ కారు అసలు ధర. రూ .22.35 లక్షల కారు. హోండా సివిక్ విత్ పెట్రోల్ ఇంజన్ (విసివిటి) రూ .200,000 వరకు నగదు తగ్గింపుతో లభిస్తుంది. హోండా సివిక్ (విఎక్స్ సివిటి, జెడ్ఎక్స్ సివిటి) మోడళ్లలో రూ .75,000 వరకు నగదు తగ్గింపు లభిస్తుంది. మారుతి సుజుకి : మారుతి సుజుకి తన కార్లపై అధిక డిస్కౌంట్లను అందిస్తోంది. విటారా బ్రెజ్జా (డీజిల్) రూ .45,000 నగదు తగ్గింపు, 5 సంవత్సరాల వారంటీ రూ .20,000 వరకు ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్, రూ .10వేల కార్పొరేట్ డిస్కౌంట్‌ను అందిస్తుంది. మొత్తం రూ .96,100 వరకు తగ్గింపు. మారుతి సుజుకి డిజైర్ (డీజిల్) : రూ .83,900 వరకు ఆఫర్ కాంప్లిమెంటరీ 5 సంవత్సరాల పొడిగించిన వారంటీ, ఎక్స్ఛేంజ్ బోనస్ , కార్పొరేట్ డిస్కౌంట్ ఉన్నాయి. మారుతి సుజుకి డిజైర్ (పెట్రోల్ వెర్షన్ అన్ని వేరియంట్లలో) 55,000 రూపాయల వరకు ఆఫర్. దీంతోపాటు చాలా సంవత్సరాలుగా కంపెనీ బెస్ట్ సెల్లర్ అయిన మారుతి సుజుకి స్విఫ్ట్, పెట్రోల్ వేరియంట్‌కు రూ .50 వేలు, డీజిల్ వేరియంట్‌కు రూ .77,600 వరకు, డీజిల్ వెర్షన్ కోసం కాంప్లిమెంటరీ ఎక్స్టెండెడ్ వారంటీ ప్యాకేజీతో పాటు ఆఫర్లను అందిస్తోంది. మారుతి సుజుకి ఆల్టో, ఆల్టో కె 10, సెలెరియోలపై వరుసగా రూ .60 వేలు రూ. 55వేలు, రూ .60వేల వరకు ప్రయోజనాలు ఉన్నాయి, ఇందులో ఎక్స్ఛేంజ్ , కార్పొరేట్ డిస్కౌంట్లు ఉన్నాయి. టాటా మోటార్స్ కొత్త టాటా కారు కోసం తమ పాత కార్లను మార్పిడి చేసుకోవాలనుకునే వారికి డిస్కౌంట్లను అందిస్తోంది. కార్పొరేట్ ఉద్యోగుల కోసం కంపెనీ నిర్దిష్ట పథకాలను ప్రారంభించింది. టాటా హెక్సా కొనుగోలుపై రూ .1.65 లక్షల వరకు ఆఫర్. టాటా నెక్సాన్ రూ .87,000 వరకు తగ్గింపు టాటా టియాగో , టాటా టియాగో ఎన్ఆర్జి రెండూ రూ .70 వేలదాకా ఆఫర్స్ . టాటా టైగర్‌పై 1.17 లక్షల రూపాయల తగ్గింపు టాటా హారియర్ 65,000 రూపాయల వరకు ఆఫర్ -
ధన్తేరస్; అప్పుడు పూజ చేస్తేనే మంచిది!
భారతీయ సంస్కృతిలో దీపావళితో పాటు... దివ్వెల పండుగకు రెండు రోజుల ముందుగానే వచ్చే ధన్‌తేరస్‌కు కూడా అంతే ప్రాముఖ్యం ఉంది. సర్వ సంపద ప్రదాయిని శ్రీ మహాలక్ష్మి జన్మదినం సందర్భంగా అమ్మవారిని పూజించి.. ఆ రోజు బంగారం, వెండి కొనడం వల్ల తమ ఇంట్లో అష్ట ఐశ్వర్యాలు కొలువుదీరుతాయని చాలా మంది విశ్వసిస్తారు. అందుకే ధన్తేరస్ నాడు బంగారం షాపులు కొనుగోలుదారులతో కిటకిటలాడుతాయి. ఇంతటి విశిష్టత కలిగి ఉన్న ధన్తేరస్ గురించి శాస్త్రం ఏం చెబుతుందో.. ఆరోజు ఏ సమయంలో పూజ చేయాలో ఓసారి గమనిద్దాం. చిరంజీవులుగా ఉండేందుకు అమృతం కోసం దేవతలు, రాక్షసులు క్షీరసాగరాన్ని చిలుకుతున్న సమయంలో.. ఆ క్షీరాబ్ది నుంచి శ్రీ మహాలక్ష్మి జన్మించింది. ఆమెతో పాటు సంపదలను ప్రసాదించే కల్పవృక్షం, కోరిన వరాలిచ్చే కామధేనువు.. అదే విధంగా దేవ వైద్యుడు ధన్వంతరి కూడా జన్మించారు. ఆ రోజు అశ్వయుజ కృష్ణ త్రయోదశి కావడంతో పాటు... ధనానికి అధిదేవత అయిన లక్ష్మీదేవి జనియించడం వల్ల ధన త్రయోదశి లేదా ధన్తేరస్ అని కూడా పిలుస్తారు. అయితే సాధారణంగా అశ్వయుజ మాసంలో మొదటి పది రోజుల్లో పార్వతీదేవిని, మూలా నక్షత్రంనాడు సరస్వతీ మాతను పూజిస్తారు. సరస్వతీ కటాక్షం మెండుగా ఉన్నా లక్ష్మీదేవి అనుగ్రహం కూడా ఉంటేనే ముందుకు సాగుతామని ప్రతీతి. కాబట్టి త్రిమూర్తుల భార్యల్లో పూజ జరగకుండా మిగిలిన లక్ష్మీదేవిని మూడు రోజుల పాటు(ధన త్రయోదశితో పాటు నరకచతుర్ధశి, దీపావళి) ప్రత్యేకంగా పూజించాలని శాస్త్రం చెబుతోంది. అందుకే సిరి సందలకు మూలమైన లక్ష్మీదేవిని మానవాళి అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించి.. ఆశీసులు అందుకుంటారు. ఇక ధనత్రయోదశి నాడు లక్ష్మీదేవితో పాటు ఉత్తర దిక్పాలకుడు, ధనానికి అధినాయకుడు అయిన కుబేరుడితో పాటు ధన్వంతరిని కూడా పూజించడం ఆనవాయితీ. ముందుగా చెప్పినట్లుగా ధంతేరస్ నాడు బంగారం వెండి ఇతర విలువైన వస్తువులు కొనడంతో పాటు దేవ వైద్యుడు, ఆయుర్వేద పితామహుడు అయిన ధన్వంతరిని పూజించడం వల్ల ఐశ్వర్యం వృద్ధి చెందడంతో పాటు దీర్ఘ కాలంగా బాధిస్తున్న వ్యాధుల నుంచి ఉపశమనం కలుగుతుంది. కుబేరుడు- ధన్వంతరి ప్రదోష కాలంలో పూజ.. సాధారణంగా దీపావళికి రెండు రోజుల ముందు అంటే ధంతేరస్ నాడు సాయంకాల సమయంలో అనగా ప్రదోష వేళలో వృషభ లగ్నంలో లక్ష్మీపూజ ఆచరిస్తారు. సూర్యాస్తమయం అయిన తర్వాత సుమారు 90 నిమిషాలు ఈ ప్రదోషకాలం కొనసాగుతుంది. ఆశ్వయిజ మాసంలో వృషభలగ్నం రాత్రి సుమారు 7 గంటల నుంచి 9 గంటల వరకు ఉంటుంది. కనుక ఈ సమయంలో లక్ష్మీపూజ చేసుకుంటే చాలా మంచిది. కొన్ని ప్రాంతాల్లో లక్ష్మీ దేవిని పూజించడంతో పాటు దీపాలు వెలిగించి.. కోటి ఆశలతో ఇంట్లోకి ఆహ్వానిస్తారు. ఇక ఈ ఏడాది లక్ష్మీదేవికి ప్రీతిపాత్రమైన శుక్రవారం(అక్టోబరు 25) రోజే ధన్తేరస్ కావడం విశేషం. -
స్త్రీలకు ఐరనే ఆభరణం
-
స్త్రీలకు కావాల్సింది బంగారం కాదు..
మన దేశంలో స్త్రీలకు కావాల్సింది బంగారం కాదు.. ఇనుము! స్త్రీ ధనం కింద బంగారాన్ని కాదు ఐరన్‌ను అందించాలి. కాబట్టి ఈ ధన్‌తేరస్‌కి.. అంటే ధనత్రయోదశికి బంగారు నగల మీద కాక ఒంట్లోని ఐరన్ మీద దృష్టిపెట్టండి అంటూ ‘ప్రాజెక్ట్ స్త్రీధన్’ పేరుతో పౌష్టికాహారం, సుస్థిర ఆరోగ్యవంతమైన జీవనం గురించి పనిచేసే డీఎస్ఎమ్ అనే సంస్థ ఓ ప్రచారం ప్రారంభించింది. సాధారణంగా ధన్‌తేరస్‌కు బంగారు ఆభరణాల దుకాణాలు విడుదల చేసే కమర్షియల్స్‌కు భిన్నంగా ఆ సంస్థ తన యాడ్స్‌ను తయారు చేసింది. ఐరన్ పుష్కలంగా దొరికే ఆహార పదార్థాన్ని తింటున్న మహిళను చూపిస్తూ ‘ఈ ధన్‌తేరస్‌కు ఈ మహిళ బంగారం కన్నా ఎంతో విలువైన దాన్ని పొందుతోంది’ అనే క్యాప్షన్‌తో ఒక యాడ్‌ను తయారు చేసింది. అలాగే.. చెవికి జూకాలు, మెడలో నగలు, చేతులకు గాజులు, నడుముకు వడ్డాణం, కాళ్లకు పట్టీలు పెట్టుకొని నడుస్తున్న యువతిని చూపిస్తూ.. ఇదే ఐరన్ అయితే మీ నరనరాల్లో ప్రవహిస్తుంది ఆరోగ్యంతో మిమ్మల్ని మెరిపిస్తుంది. అంటూ ఇంకో యాడ్‌ను రూపొందించింది. ‘ఐరన్ తీసుకోండి’ అంటూ ఇంకొన్ని యాడ్స్‌ను తయారు చేసి గ్రామీణ, పట్టణ వాసులను చైతన్యపరుస్తోంది. ఈ ప్రచారంలో డీఎస్ఎమ్ తన లాభాపేక్షను చూసుకుంటోందా వగైరా అనుమానాలను పక్కన పెడదాం. మన దేశంలో మహిళలకు ఐరన్ కావాల్సిన అవసరాన్ని గుర్తిద్దాం. 2018 జనవరిలో నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే (ఎన్ఎఫ్హెచ్ఎస్ –4) విడుదల చేసిన గణాంకాల ప్రకారం మన దేశంలో దాదాపు యాభై మూడు శాతం మహిళలు రక్తహీనతతో బాధపడ్తున్నారు. కాబట్టి ఈ ధన్‌తేరస్‌నే ఆరోగ్య సంరక్షణకు శుభారంభంగా భావించి ప్రతిరోజు ఆహారంలో విధిగా ఐరన్ ఉండేలా చూసుకోండి. స్త్రీ ఆరోగ్యమే దేశానికి మహాభాగ్యం. -
ధంతేరాస్‌లో మెరిసిన పసిడి
న్యూఢిల్లీ: పసిడి కొనుగోళ్లకు శుభప్రదమైన రోజుగా భావించే ధంతేరాస్‌లో అమ్మకాలు 15 శాతం పెరిగాయి. ధరలు భారీగా ఉండడం, దీనికితోడు వ్యవస్థలో నగదు లభ్యత (లిక్విడిటీ) సమస్యలు ఉండడంతో ధంతేరాస్‌నాడు అమ్మకాలు అంతంతమాత్రంగానే ఉండొచ్చని అంచనాలు వెలువడ్డాయి. అయితే ఇందుకు భిన్నమైన పరిస్థితి ఏర్పడింది. పండుగల సీజన్ కొనసాగుతున్నదున, వచ్చే వారాల్లో పసిడి, ఆభరణాల కొనుగోళ్లు మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు అంచనావేస్తున్నారు. ఆభరణాలకన్నా, నాణేలకు అధికంగా డిమాండ్ ఉందని వారు తెలిపారు. రూపాయి బలహీనత బలంగా... ‘రూపాయి బలహీనత వల్ల వచ్చే వారాల్లో పసిడి 10 గ్రాములకు రూ.35,000–40,000 వరకూ ధర పెరిగే అవకాశాలు ఉన్నాయని విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఈ వార్తలు పసిడి డిమాండ్‌ను పునరుద్ధరించాయి. గత ఏడాదితో పోల్చితే అమ్మకాలు 10 శాతం అధికంగా ఉంటాయని బావిస్తున్నాం’ అని ఏఐజీజేడీసీ చైర్మన్ నితిన్ ఖండేల్వాల్ పేర్కొన్నారు. -
ధనత్రయోదశికి ధరల షాక్..
సాక్షి, న్యూఢిల్లీ : ధనత్రయోదశి రోజు బంగారం కొనడాన్ని శుభప్రదంగా భావించే ఆనవాయితీ ఉన్నా ఈసారి అధికధరలతో బంగారం కొనుగోళ్లకు మగువలు పెద్దగా ఆసక్తి కనబరచలేదని వర్తకులు పేర్కొన్నారు. ప్రధానంగా ఉత్తరాదిలో ధనత్రయోదశికి బంగారం కొనుగోలుకు మహిళలు మొగ్గుచూపుతారు. దుకాణాలకు ప్రజలు భారీగానే తరలివస్తున్నా ధరల కారణంగా బంగారం విక్రయాలు ఆశాజనకంగా లేవని, ప్రీ బుకింగ్‌లతో కలుపుకుని అమ్మకాల్లో కేవలం 5 నుంచి 7 శాతం మాత్రమే పెరుగుదల నమోదైందని అఖిల భారత జెమ్ అండ్ జ్యూవెలరీ కౌన్సిల్ చైర్మన్ నితిన్ ఖండేల్వాల్ చెప్పారు. పదిగ్రాముల బంగారం రూ 32,000 దాటడంతో పలువురు కొనుగోలుదారులు ఆభరణాల కొనుగోలుకు వెనుకాడుతున్నారు. గత ఏడాది ధనత్రయోదశి రోజున దేశ రాజధాని ఢిల్లీలో పదిగ్రాముల పసిడి రూ 30,710 కాగా, ఇప్పుడు రూ 32,690కి ఎగబాకింది. అధిక ధరలతో బంగారానికి డిమాండ్ తగ్గిందని, వినియోగదారులు ఆభరణాల కంటే బంగారం, వెండి నాణేల కొనుగోలుకు మొగ్గుచూపుతున్నారని ఢిల్లీ బులియన్ అసోసియేషన్‌కు చెందిన సురేందర్ జైన్ పేర్కొన్నారు. బంగారం ధరల పెరుగుదలతో మార్కెట్లో స్ధబ్ధత నెలకొందని, ఈసారి బంగారు నాణేలకు కార్పొరేట్ వర్గాల నుంచే డిమాండ్ నెలకొందని ఎంఎంటీసీ-పీఏఎంపీ ఇండియా ఎండీ రాజేష్ ఖోస్లా వెల్లడించారు. -
మోదీ ఫోటోతో గోల్డ్, సిల్వర్ బిస్కెట్లు..
సూరత్ : ధనత్రయోదశి సందర్భంగా సూరత్‌లోని ఓ బంగారు ఆభరణాల దుకాణంలో ప్రధాని నరేంద్ర మోదీ ఫోటోతో కూడిన బంగారు, వెండి కడ్డీలు విక్రయిస్తున్నారు. మోదీ బొమ్మతో రూపొందిన గోల్డ్ బార్లను పెద్ద సంఖ్యలో కస్టమర్లు కొనుగోలు చేస్తున్నారని జ్యూవెలర్ చెబుతున్నారు. ప్రతి దీపావళికి లక్ష్మీదేవి, గణేష్‌లను కొలుస్తారని, ప్రధాని మోదీ కూడా తమకు భగవంతుడేనని, ఈ ఏడాది ప్రధాని మోదీ బొమ్మతో కూడిన గోల్డ్, సిల్వర్ బార్లను కొనుగోలు చేసి పూజిస్తామని ఓ కస్టమర్ చెబుతున్నారు. దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ బాధ్యతలు చేపట్టిన అనంతరం అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు పెద్ద ఎత్తున సాగుతున్న క్రమంలో దివాళీ సందర్భంగా ఆయన బొమ్మతో బంగారు, వెండి కడ్డీలు రూపొందిచాలనే ఆలోచన తనకు కలిగిందని జ్యూవెలరీ షోరూం యజమాని మిలన్ చెప్పుకొచ్చారు. గతంలోనూ ప్రధాని మోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యానాధ్, గుజరాత్ సీఎం విజయ్ రూపానీల ఫోటోలతో మిలన్ గోల్డ్ రాఖీలను తయారుచేశారు. 22 కేరట్ల బంగారంతో తయారుచేసిన ఈ కాఖీలు అప్పట్లో హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయని ఆయన వెల్లడించారు. -
హెచ్‌టీసీ భారీ డిస్కౌంట్... ఈ ఒక్కరోజే..!
ప్రముఖ మొబైల్ మేకర్ హెచ్‌టీసీ తన ఫ్లాగ్ షిప్ స్మార్ట్‌ఫోన్ ధరను భారీగా తగ్గించింది. ధంతేరస్ కానుకగా వినియోగదారులకు ఈ బంపర్ ఆఫర్ అందిస్తోంది. హెచ్‌టీసీ యూ అల్ట్రా స్మార్ట్‌ఫోన్ ధరపై ఏకంగా రూ. 22,991ల డిస్కౌంట్ అందిస్తోంది. అయితే ఈ ఆఫర్ ధంతేరస్ రోజు (అక్టోబర్ 17) మాత్రమే అందుబాటులోఉంటుంది. గత ఏడాది మార్చిలో విడుదలైన ఈ ఫోన్ అసలు ధర రూ.52,990 ఉండగా, రూ.22,991 తగ్గింపుతో ప్రస్తుతం రూ.29,999 ధరకు లభిస్తోంది. కొనుగోలుదారులకు పరిమిత కాలం ఆఫర్‌గా ఈ ఆఫర్ ఇవాళ ఒక్క రోజే ఉంటుందని హెచ్‌టీసీ వెల్లడించింది. దీపావళి సందర్భంగా ఈ భారీ ఆఫర్‌ను అందిస్తున్నట్టు తెలిపింది. హెచ్‌టీసీ యూ అల్ట్రా ఫీచర్లు 5.7 ఇంచ్ క్వాడ్ హెచ్డీ సూపర్ ఎల్సీడీ డిస్ప్లే 1440 x 2560 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 2 ఇంచ్ సెకండరీ డిస్ప్లే 1040 x 160 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్ క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగన్ 821 ప్రాసెసర్ ఆండ్రాయిడ్ 7.0 నౌగట్ 4 జీబీ ర్యామ్ 64 జీబీ స్టోరేజ్ 2 టీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్ 12 అల్ట్రా పిక్సెల్ రియర్ కెమెరా 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా 3000 ఎంఏహెచ్ బ్యాటరీ -
ధన్‌తెరాస్ : బంగారంపై భలే ఆఫర్లు
సాక్షి, న్యూఢిల్లీ : నేడు దేశవ్యాప్తంగా ధన్‌తెరాస్ శోభ వెల్లివిరుస్తోంది. దీపావళికి ఒక్కరోజు ముందుగా వచ్చే ఈ ఫెస్టివల్‌కు ఏదైనా సరికొత్త వస్తువులను కొనుగోలుచేయాలని వినియోగదారులు ఆసక్తి కనబరుస్తుంటారు. ముఖ్యంగా ఈ పర్వదినాన బంగారానికి బహు గిరాకి. బంగారానికి ఉన్న గిరాకితో జువెలర్స్ కూడా సరికొత్త కలెక్షన్స్‌తో కనువిందు చేస్తూ ఉన్నారు. ఇప్పటికే పలు ఈ-కామర్స్ సైట్లు, జువెల్లరీ బ్రాండ్లు ధన్‌తెరాస్ సందర్భంగా ఆకట్టుకునే డిస్కౌంట్లను అందుబాటులోకి తీసుకొచ్చాయి. ధన్‌తెరాస్ 2017: రూపాయికే బంగారమంటూ పేటీఎం, అమెజాన్, జువెల్లర్స్ ఆకర్షణీయమైన డిస్కౌంట్లను తెరతీశాయి. రూపాయికే బంగారం కొనుగోలు : పేటీఎం గోల్డ్ 'దివాళి గోల్డ్ సేల్' సందర్భంగా ఈ ఫెస్టివ్ సీజన్లో కనీసం రూ.10వేల మొత్తంలో కొనుగోలు చేపడితే అదనంగా 3 శాతం బంగారం అందించనున్నారు. ఒకవేళ రూ.10వేల కంటే తక్కువ మొత్తంలో చేపడితే 2 శాతం బంగారం ఆఫర్ చేస్తోంది. గోల్డ్ఫెస్ట్ అనే ప్రోమోకోడ్‌ను వాడి ఈ ఆఫర్‌ను సద్వినియోగం చేసుకోవచ్చు. అంతేకాక పేటీఎం గోల్డ్‌లో రూ.1కే ఇన్వెస్ట్ చేసుకునే అవకాశం కల్పించింది. అమెజాన్ గోల్డ్ కాయిన్లు : గోల్డ్ కాయిన్లపై అమెజాన్ 10 శాతం వరకు డిస్కౌంట్లు ఇస్తోంది. జోయలుక్కాస్, మలబార్, సెన్కో గోల్డ్, బ్లూస్టోన్, పీఎన్ డాడ్గిల్ జువెల్లర్స్, ఎంఎంటీసీ-పీఏఎంపీ వంటి దిగ్గజ బ్రాండ్లపై అమెజాన్ డిస్కౌంట్లను అందిస్తోంది. 1 నుంచి 50 గ్రాముల స్వచ్ఛత కలిగిన 22 క్యారెట్ల నుంచి 24 క్యారెట్ల గోల్డ్ కాయిన్లను అమెజాన్ అందుబాటులోకి తీసుకొచ్చింది. చాలా మంది జువెల్లర్స్ కొనుగోలుదారులకు క్యాష్‌బ్యాక్ ఆఫర్లను అందిస్తోంది. తనిష్క్, మియా ద్వారా ఆభరణాలు కొనుగోలు చేస్తే హెచ్డీఎఫ్సీ కార్డులపై 5 శాతం, మలబార్ గోల్డ్, డైమండ్స్ నుంచి కనీసం రూ.25వేలకు కొనుగోలుచేపడితే ఎస్బీఐ కార్డులపై 5 శాతం క్యాష్‌బ్యాక్‌ను జువెల్లర్స్ ఆఫర్ చేస్తున్నారు. స్నాప్‌డీల్, ఫ్లిప్‌కార్ట్, మింత్రా వంటి ఈ-కామర్స్ వెబ్సైట్లు బంగారం, సిల్వర్ జువెల్లరీపై స్పెషల్ ఆఫర్లను తెరతీశాయి. గోల్డ్ బార్లపై స్నాప్‌డీల్ 10 శాతం వరకు, గోల్డ్ కాయిన్లపై 25 శాతం వరకు డిస్కౌంట్లను ఆఫర్ చేస్తోంది. -
ధన్‌తేరాస్ ధనాధన్‌కు జువెలర్ల వ్యూహాలు
ధన్‌తేరాస్ పర్వదినాన్ని పురస్కరించుకుని పసిడి భారీ విక్రయాలకు జువెలర్లు ఒకవైపు వ్యూహాలు రూపొందిస్తుండగా, మరోవైపు కొనుగోళ్లు ఎలా ఉంటాయన్న అంశంపై పరిశ్రమ మదింపు జరుపుతోంది. గత ఏడాదితో పోల్చితే అమ్మకాలు తగ్గే అవకాశం ఉందని, వస్తు సేవల పన్నుపై ఇంకా కొంత అయోమయ ధోరణి నెలకొనటమే దీనికి ప్రధాన కారణమని కొందరి విశ్లేషణ. అయితే వినియోగదారులను ఆకర్షించడమే లక్ష్యంగా తాము అందిస్తున్న డిస్కౌంట్లు, బహుమతులు అమ్మకాలను పెంచుతాయని మరికొందరు ఆశాభావంతో ఉన్నారు. ఆయా అంశాలపై నిపుణుల అభిప్రాయాలు చూస్తే... సెంటిమెంట్ బాగుంది కానీ..! మార్కెట్ సెంటిమెంట్ మెరుగుపడింది.అయితే భారీ కొనుగోళ్లు జరిగిపోతాయని భావించడంలేదు. స్టోర్స్‌కు వచ్చేవారి సంఖ్య పెరిగే అవకాశం ఉన్నా, అమ్మకాల పరిమాణం తక్కువగానే ఉండే వీలుంది. కొందరు ఉద్యోగులకు వేతనాల వాయిదా, ఊహించినదానికన్నా తక్కువ బోనస్, అక్రమ ధనార్జనా నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) పరిధి నుంచి జువెలర్ల తొలగింపుపై అస్పష్టత మార్కెట్‌కు ప్రతికూలంగా ఉన్న అంశాల్లో కొన్ని. ఇక ఆర్థిక మందగమన ధోరణి ఉండనే ఉంది. – ఐబీజేఏ డైరెక్టర్ సౌరభ్ గాడ్గిల్ కొనుగోళ్లు ఊపందుకోవాలి... మార్కెట్ సెంటిమెంట్ బాగున్నా, కొనుగోళ్ల పరిమాణం తక్కువగా ఉండవచ్చు. పీఎంఎల్‌ఏపై నిర్ణయం కొంత ఊరట కల్పించే అంశమైనా, తక్కువ నగదు సరఫరా మొత్తం సెంటిమెంట్‌ను బలహీన పరుస్తోంది. డీమోనిటైజేషన్ ప్రభావం ఇంకా మార్కెట్‌పై కనబడే వీలుంది. కనుక గత ఏడాదికన్నా తక్కువ అమ్మకాలే ఉంటాయని భావిస్తున్నాం. సాధ్యమైనంత తక్కువ డబ్బు పెట్టాలి. నగ బాగుండాలి. ఈ లక్ష్యంతో ‘లైట్ వెయిట్’ ఆభరణాలకు డిమాండ్ బాగుండే వీలుంది. – నితిన్ ఖండేల్వాల్, జీజేఎఫ్ డిమాండ్ పెరుగుతుంది...అయితే! ఈ ఏడాది మొదటి ఆరు నెలలతో పోల్చితే పరిస్థితి మెరుగుపడింది. అయితే పసిడి కొనుగోలుకు సంబంధించిన సెంటిమెంట్ మరింత పటిష్టమవ్వాలి. జీఎస్టీ అమల్లో అస్పష్టతలు, దక్షిణ కొరియా నుంచి దిగుమతులను నియంత్రణల జాబితాలో పెట్టడం వంటి అంశాలు మార్కెట్‌కు సవాలు విసురుతున్నాయి. కొంతకాలం ఈ సవాళ్లు కొనసాగే అవకాశం ఉంది. ఏదిఏమైనా డిమాండ్ పురోగమిస్తుందని నేను చెప్పగలను. గత ఏడాది స్థాయినీ తాకే వీలుంది. – సోమసుందరం పీఆర్, ఎండీ (ఇండియా) డబ్ల్యూజీసీ -
పేటీఎంలో బంగారం అమ్మకాలు భారీగా..
సాక్షి, న్యూఢిల్లీ : మొబైల్ వాలెట్ కంపెనీ పేటీఎంలో బంగారం అమ్మకాలు భారీగా పెరుగనున్నాయి. రాబోతున్న దంతెరాస్, దివాలి సందర్భంగా తమ ప్లాట్‌ఫామ్‌పై బంగారం అమ్మకాలు ఐదింతల వృద్ధిని నమోదుచేస్తాయని పేటీఎం అంచనావేస్తోంది. గోల్డ్ రిఫైనరీ ఎంఎంటీసీ-పీఏఎంపీతో భాగస్వామ్యం ఏర్పరుచుకున్న పేటీఎం, తమ ప్లాట్‌ఫామ్‌పై బంగారం కొనుగోళ్లకు వినియోగదారులకు అనుమతి ఇచ్చింది. మరింత మంది కస్టమర్లను తమ ప్లాట్‌ఫామ్‌పై తెచ్చుకోవడం కోసం మార్కెటింగ్‌కు కంపెనీ రూ.10 కోట్లను పెట్టుబడులు పెడుతోంది. అదేవిధంగా దివాలి గోల్డ్ సేల్‌ను కూడా కంపెనీ ప్రకటించింది. అక్టోబర్ 10 నుంచి అక్టోబర్ 19 వరకు బంగారం కొనుగోలు చేసిన వారికి ఎక్కువ రివార్డింగ్ కూడా ఇస్తోంది. కనీసం రూ.10వేల మొత్తంతో కొనుగోలు చేస్తే 3 శాతం అదనపు బంగారాన్ని అందిస్తున్నామని చెప్పారు. ఈ ఏడాది మొదట్లో ఎంఎంటీసీ-పీఏఎంపీతో భాగస్వామ్యం ఏర్పరుచుకున్న పేటీఎం, ఒక్క రూపాయికే బంగారాన్ని ఆఫర్ చేసిన సంగతి తెలిసిందే. '' భారతీయులు బంగారాన్ని ప్రేమిస్తారు. దంతెరాస్ లాంటి పండుగల కాంలో లక్షల కొద్దీ భారతీయులు బంగారాన్ని కొనుగోలు చేయడానికి ఇష్టపడతారు'' అని పేటీఎం సీనియర్ వైస్-ప్రెసిడెంట్ నితిన్ మిశ్రా చెప్పారు. ప్రస్తుతం డిమాండ్ తొలి దశలో ఉందని, దంతెరాస్, దీపావళి కాలంలో ఈ డిమాండ్ మరింత పెరుగుతుందని కంపెనీ తెలిపింది. పేటీఎం గోల్డ్ కోసం నెలవారీ కనీసం 20 లక్షల లావాదేవీలు జరుగుతున్నాయని నితిన్ పేర్కొన్నారు. -
కార్ల కంపెనీలకు ధన్‌తేరాస్ ధమాకా
ఈ పండుగ సీజన్ కార్ల తయారీ కంపెనీలు ఫుల్ జోష్‌లో ఉన్నాయి. కొత్త కార్ల ఆవిష్కరణలతో వినియోగదారుల ముందుకు వస్తున్న కంపెనీలకు కస్టమర్ల నుంచి భారీ డిమాండ్ కనిపిస్తోంది. ధన్‌తేరాస్ సందర్భంగా దేశీయ కార్ల దిగ్గజం మారుతీ సుజుకీ 30వేల వాహనాలను డెలివరీ చేసినట్టు ప్రకటించింది. ఈ విక్రయాలు గతేడాది కంటే 20 శాతం ఎక్కువ. బెలెనో, విటారా బ్రీజా మోడల్స్ ఇతర కంపెనీల నుంచి పోటీని తట్టుకుని, మార్కెట్లో కంపెనీకి సహకరిస్తున్నాయని పేర్కొంది. అయితే కంపెనీ నిర్దేశించుకున్న టార్గెట్ 50 వేల యూనిట్ల కంటే తక్కువగానే విటారా బ్రీజాలు నమోదవుతున్నాయని, ఈ ఏడాది చివరికల్లా లక్ష్యాలను చేధిస్తామని కంపెనీ ఆశాభావం వ్యక్తంచేస్తోంది. అదేవిధంగా హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ కూడా ధన్‌తేరాస్ సందర్భంగా మంచి విక్రయాలనే నమోదుచేసినట్టు తెలిపింది. 15,153 హ్యుందాయ్ కార్ల డెలివరీలను చేశామని పేర్కొంది. గతేడాది కంటే ఈ ఏడాది 26 శాతం వృద్ధి సాధించినట్టు హెచ్ఎమ్ఐఎల్ సేల్స్, మార్కెటింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రాకేష్ శ్రీవాస్తవ తెలిపారు. ఈ నెలంతా మరో 50వేలకు పైగా యూనిట్లను డెలివరీ చేస్తామని అంచనావేస్తున్నట్టు పేర్కొన్నారు. గత రెండేళ్లలో ఈ ఏడాది పండుగ సీజనే కార్లకంపెనీలకు మంచి సీజన్‌గా నిలుస్తున్నట్టు సంతోషం వ్యక్తంచేశారు. సకాలంలో రుతుపవనాల వల్ల మంచి వర్షాలు పడడం, ఏడో వేతన సంఘం సిఫార్సుల అమలు ఫలితంగా కార్ల విక్రయాలు పెరిగినట్లు కంపెనీలు భావిస్తున్నాయి. -
ధన్‌తేరాస్ ‘గోల్డ్’రష్!
• దేశవ్యాప్తంగా అమ్మకాలు 25% జూమ్ • తేలికైన ఆభరణాలకే కస్టమర్ల మొగ్గు • ఆన్లైన్లో 10 రెట్లు పెరిగిన విక్రయాలు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : ధన్‌తేరాస్‌కు దేశవ్యాప్తంగా పుత్తడి మెరిసింది. కొన్ని నెలలుగా స్తబ్దుగా ఉన్న ఆభరణ దుకాణాలు కస్టమర్ల రాకతో కళకళలాడాయి. బంగారం, వెండి, ఇతర విలువైన వస్తువులు కొనడం ధన త్రయోదశికి ఆనవాయితీగా వస్తోంది. గతేడాదితో పోలిస్తే ఈ ధన్‌తేరాస్‌కు అమ్మకాలు 25 శాతం దాకా పెరిగాయి. అన్ని ప్రాంతాల్లోనూ వర్షాలు బాగా కురవడం కూడా సెంటిమెంటును బలపరిచింది. అటు ధర కూడా ఆకర్షణీయంగా ఉంది. బంగారు, వెండి నాణేలు, కడ్డీల విక్రయాలు కూడా పెద్ద ఎత్తున నమోదు కావడం విశేషం. పుత్తడి కొనుగోళ్లకు దూరంగా ఉన్న కస్టమర్లు తిరిగి దుకాణాల్లో అడుగు పెడుతున్నారని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ వెల్లడించింది. 2015 ధన్‌తేరాస్, దీపావళితో పోలిస్తే ఆభరణాలు, బ్రాండెడ్ నాణేలకు ఈసారి డిమాండ్ అధికంగా ఉంటుందని వివరించింది. హైదరాబాద్‌లో శుక్రవారం 24 క్యారట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.30,460 ఉంది. వెండి కిలో రూ.42,570 పలికింది. తేలికైన ఆభరణాలే.. దేశవ్యాప్తంగా ఈసారి తేలికైన ఆభరణాలకే కస్టమర్లు మొగ్గు చూపారని ఆల్ ఇండియా జెమ్స్, జువెల్లరీ ట్రేడ్ ఫెడరేషన్ (జీజేఎఫ్) చైర్మన్ జి.వి.శ్రీధర్ సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. నాణ్యతలో రాజీ లేకుండా తక్కువ బరువుతో ఆభరణాల తయారీని దేశీయ కంపెనీలు చేపడుతున్నాయని చెప్పారు. వీటి విక్రయాలు 15-20 శాతం అధికమయ్యాయని వివరించారు. డైమండ్ జువెల్లరీ అమ్మకాలు 10 శాతం దాకా పెరిగాయని చెప్పారు. మొత్తంగా గతేడాదితో పోలిస్తే పుత్తడి విక్రయాల్లో ఉత్తరాదిలో 20-25 శాతం, దక్షిణాది రాష్ట్రాల్లో 15 శాతం వృద్ధి నమోదైందన్నారు. మెరుగైన రుతుపవనాలు, ధరలు స్థిరపడడం కారణంగా సెంటిమెంటు బలపడిందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ఎండీ సోమసుందరం తెలిపారు. రానున్న పెళ్లిళ్ల సీజన్ కస్టమర్లకు, వర్తకులకు మరింత ఆశాజనకంగా ఉంటుందని అన్నారు. బంగారు, వెండి నాణేల విక్రయాలు 15-20 శాతం అధికమయ్యాయని ఎంఎంటీసీ-పీఏఎంపీ ఇండియా మార్కెటింగ్ ప్రెసిడెంట్ విపిన్ రైనా వివరించారు. పెట్టుబడి సాధనంగా కస్టమర్లు భావిస్తున్నారని చెప్పారు. అడ్వాన్సు బుకింగ్స్ సైతం.. రెండు నెలల క్రితంతో పోలిస్తే ప్రస్తుతం ధరలు తక్కువగా ఉన్నాయి. ధరలు ఇప్పుడు స్థిరంగా ఉన్నాయని కళ్యాణ్ జువెల్లర్స్ ఈడీ రమేశ్ కళ్యాణరామన్ తెలిపారు. ఆభరణాల అడ్వాన్సు బుకింగులు 20-25 శాతం పెరిగాయని అన్నారు. మంచి రుతుపవనిల కారణంగా ఆభరణాలకు డిమాండ్ అధికమైందని వివరించారు. 2015 ధన్‌తేరాస్‌తో పోలిస్తే ప్రస్తుతం 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు సుమారు రూ.4 వేలు ఎక్కువగా ఉంది. ఏడాదిలో పరిమాణం పరంగా 20 శాతం, విలువ పరంగా 30 శాతం వృద్ధి నమోదవుతుందని అంచనా వేస్తున్నట్టు పీసీ జువెల్లర్స్ ఎండీ బలరామ్ గర్గ్ తెలిపారు. బంగారు కడ్డీలు ఎక్కువగా కొనే కస్టమర్లు ఈసారి వజ్రాభరణాలను ఎంచుకున్నారని వర్తకులు వెల్లడించారు. ఆన్‌లైన్‌లోనూ క్లిక్.. ఈ ధన్‌తేరాస్‌కు ఆన్లైన్ అమ్మకాల్లో గోల్డ్, సిల్వర్ నాణేలు హాట్ ఫేవరేట్లుగా నిలిచాయి. సాధారణంగా బంగారు ఆభరణాల ధర కాస్త ఎక్కువగా ఉంటుంది. అందుకే ఆన్లైన్లో వీటి అమ్మకాలు అంతంగానే ఉన్నాయి. గతేడాది దీపావళితో పోలిస్తే డిమాండ్ ఉన్న కారణంగా ఈసారి పుత్తడి, వెండి నాణేల విక్రయాలు 10 రెట్లు అధికమవుతాయని అంచనా వేస్తున్నట్టు స్నాప్‌డీల్ వెల్లడించింది. చెవి రింగులు, పెండెంట్లు, ఉంగరాల విక్రయాలు ఆన్లైన్లో ఎక్కువగా నమోదవుతున్నాయి. సగటు బిల్లు ధర ఆన్లైన్లో రూ.20-30 వేలు ఉన్నట్టు కంపెనీలు చెబుతున్నాయి. భారత్‌లో ఆన్లైన్ జువెల్లరీ మార్కెట్ 2019 నాటికి రూ.23,760 కోట్లకు చేరుతుందని అంచనా. -
'ధంతేరస్' రోజు బంగారానికి ఏమైంది?
న్యూఢిల్లీ: 'ధంతేరస్' రోజు గోరెడు బంగారమైనా సొంతం చేసుకోవాలని ప్రజలు భావిస్తారు. ముఖ్యంగా ఉత్తర, పశ్చిమ భారతదేశీయులు పవిత్రమైన రోజుగా పరిగణించే ధంతేరస్ రోజు బంగారం, వెండి మరియు ఇతర విలువైన వస్తువులను కొనుగోలు చేయడం ఆనవాయితీ. అలాగే ఈరోజు కచ్చితంగా అమ్మకాలు జోరందుకుంటాయనీ, తమ వ్యాపారం బావుంటుందని బంగారం దుకాణందారులు కూడా ఆశిస్తారు. ఈ మేరకు ధంతేరస్ రోజు అమ్మకాలతో పసిడి మెరుపులు మెరిపించడం మామూలే. కానీ ఈ ఏడాది మాత్రం ఇందుకు విరుద్ధంగా బంగారం ధరలు నేల చూపులు చూస్తున్నాయి. బంగారం కొనుగోళ్లు పసిడి ధరలకు ఊతమివ్వలేకపోయాయి. పవిత్రమైన పండుగ సందర్భంగా ఆభరణాల కొనుగోళ్ల మద్దతు లభిస్తున్నప్పటికీ, అంతర్జాతీయ మార్కెట్లో బలహీన ధోరణి ఎక్కువగా ప్రభావితం చేస్తోంది. బులియన మార్కెట్ లో పది గ్రాముల పసిడి110 రూపాయలు క్షీణించి రూ 30,590 వద్ద నమోదవుతోంది. అటు ఎంసీఎక్స్ మార్కెట్ లో కూడా పుత్తడి లాభాలతో ప్రారంభమైనా నష్టాల్లోకి జారుకుంది 53 రూపాయల నష్టంతో 29,874 వద్ద ఉంది. అయితే బంగారు ఆభరణాల అమ్మకాలు బాగానే ఉన్నప్పటికీ గ్లోబల్ ట్రెండ్ కారణంగా బంగారం ధరలు బలహీన పడుతున్నాయని బులియన్ ట్రేడర్స్ చెబుతున్నారు. విలువైన ఖనిజాలు మార్కెట్ల బలహీనంగా ధోరణి బంగారం ధరల పతనానికి దారితీసిందని తెలిపాయి. వెండి ధరలు స్థిరంగా ఉన్నప్పటికీ బంగారం ధరలు వన్నె తగ్గాయన్నారు. ప్రపంచ వ్యాప్తంగా పసిడి ధరలు బలహీనంగా ఉన్నాయి. సింగపూర్ లో ఔన్స్ బంగారం ధర 0.17తగ్గి 1,266 డాలర్లు నమోదైంది. 99.5 స్వచ్ఛత బంగారం 110 క్షీణించి రూ. 30,440 వద్ద ఉంది. వెండి ధరలు కూడా 0.34శాతం క్షీణించాయి. ఎనిమిది గ్రాముల సావరిన్ గోల్డ్ రూ. 24,500 పలుకుతోంది. ఫ్యూచర్స్ ట్రేడింగ్‌లో డిసెంబర్ డెలివరీ బంగారు రూ 46 పతనమై (0.15 శాతం)10 గ్రాములు రూ 29,881 వద్ద ఉంది. -
28న ప్రత్యేక ధన్తేరస్ ట్రేడింగ్...
ధనతేరాస్(ఈ నెల 28న) రోజున గోల్డ్ ఈటీఎఫ్‌లు, గోల్డ్ బాండ్‌ల్లో ట్రేడింగ్‌ను సాయంత్రం ఏడు గంటలవరకూ నిర్వహించాలని ప్రముఖ స్టాక్ ఎక్స్చేంజ్, బీఎస్ఈ నిర్ణయించింది. సాధారణంగా గోల్డ్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్(ఈటీఎఫ్), సావరిన్ గోల్డ్ బాండ్(ఎస్జీబీ)ల్లో లైవ్ ట్రేడింగ్ ఉదయం గం,9.15 నిమిషాలకు ప్రారంభమై, మధ్యాహ్నం గం,3.30 వరకూ కొనసాగుతుంది. కానీ ధన్తేరస్ రోజున ఈ లైవ్ ట్రేడింగ్ మళ్లీ సాయంత్రం గం.4.30 నుంచి ప్రారంభమై, రాత్రి 7 గంటల వరకూ కొనసాగుతుందని బీఎస్ఈ తెలిపింది. 30న ముహూరత్ ట్రేడింగ్ దీపావళి, ఈ నెల 30 ఆదివారం రోజున ప్రత్యేక ముహూరత్ ట్రేడింగ్‌ను బీఎస్ఈ, ఎన్ఎస్ఈలు నిర్వహించనున్నాయి. సాయంత్రం గం.6.30 నుంచి ప్రారంభమై రాత్రి గం,7.30 వరకూ గంట పాటు ఈ ముహూరత్ ట్రేడింగ్ జరుగుతుంది. ఈక్విటీ డెరివేటివ్‌లు, కరెన్సీ డెరివేటివ్‌లు, ఈక్విటీ, ఎస్ఎల్బీ(సెక్యూరిటీస్ లెండింగ్ అండ్ బారోయింగ్) సెగ్మెంట్లలో బీఎస్ఈ, ఈక్విటీ, ఈక్విటీ డెరివేటివ్‌లు కరెన్సీ డెరివేటివ్‌లు, ఫ్యూచర్స్, ఆప్షన్స్‌ల్లో ఎన్ఎస్ఈ ట్రేడింగ్ నిర్వహిస్తాయి. -
నగరంలో ప్రారంభమైన ధన్త్రయోదశి
-
ధన్‌తేరాస్ డిమాండ్‌పై వర్తకుల ఆశలు
* ధరలు తగ్గడంతో అమ్మకాలు పెరగొచ్చు.. * కొత్త పుత్తడి పథకాలతో సానుకూలత ముంబై: ఇటీవల పుత్తడి ధరలు తగ్గడం వల్ల ఈ సారి ధన్‌తేరాస్(సోమవారం) రోజు పుత్తడి అమ్మకాల్లో వృద్ధి వుండవచ్చని బంగారం వర్తకులు అంచనావేస్తున్నారు. సాధారణంగా ధన్‌తేరాస్ నాడు బంగారం కొనుగోలు చేస్తే మంచిదనే నమ్మకం ఉంది. ఈ నమ్మకం కారణంగా గతంలో ధన్‌తేరాస్ నాడు పుత్తడి అమ్మకాలు జోరుగా ఉండేవి. కానీ ఈసారి ఆర్థిక పరిస్థితులు బాగా లేకపోవడం, వర్షాలు సరిగ్గా కురవకపోవడం వల్ల పుత్తడి అమ్మకాలు బలహీనంగానే ఉంటాయని తొలుత భావించారు. అయితే ధరలు తగ్గడం, ఇటీవల ప్రధాని మూడు పుత్తడి పథకాలు ప్రారంభించడం వల్ల అమ్మకాలకు సానుకూలత ఏర్పడిందన్నఅభిప్రాయం వ్యక్తం అవుతోంది. స్వల్ప వృద్ధికి అవకాశం ఈ ఏడాది ధన్‌తేరాస్ అమ్మకాలు గత ఏడాది మాదిరిగానే లేదా స్వల్ప వృద్ధిగానీ ఉండొచ్చని అన్మోల్ జ్యూయలర్స్ వ్యవస్థాపకులు ఇషు దత్వాని చెప్పారు. వర్షాలు తగినంతగా కురవకపోవడంతో గ్రామీణ ప్రాంతాల నుంచి డిమాండ్ తగ్గే అవకాశాలున్నాయని చెప్పారు. గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది అమ్మకాలు ఏమంత జోరుగా ఉండకపోవచ్చని పి.ఎన్. గాడ్గిల్ జ్యూయలర్స్ కంపెనీ సీఎండీ సౌరభ్ గాడ్గిల్ చెప్పారు. అయితే బంగారం ధరలు బలహీనంగా ఉండటంతో కొంత డిమాండ్ ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. ఇదే తరహా అభిప్రాయాన్ని ఆల్ ఇండియా జెమ్స్ అండ్ జ్యూయలరీ ట్రేడ్ ఫెడరేషన్(జీజేఎఫ్) చైర్మన్ జి.వి. శ్రీధర్ వ్యక్తం చేశారు. గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది డిమాండ్ 15-20% పెరగగలదని ఆయన అంచనా వేస్తున్నారు. -
హీరో, హోండా.. రికార్డు విక్రయాలు
* ధన్‌తేరాస్ రోజున టూవీలర్ అమ్మకాల జోరు... 2 లక్షలు విక్రయించిన హీరో * హోండా అమ్మకాలు 1.65 లక్షలు న్యూఢిల్లీ: ద్విచక్ర వాహనాల తయారీ దిగ్గజాలు హీరో మోటోకార్ప్, హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (హెచ్ఎంఎస్ఐ) ధన్‌తేరాస్ రోజున భారీ అమ్మకాలు నమోదు చేశాయి. హీరో ఏకంగా రెండు లక్షల వాహనాల అమ్మకాల మార్కును అధిగమించింది. ఇలా ఒక్క రోజులో ఇన్ని అమ్మకాలు సాధించ డం తమకు ఇదే తొలిసారని, గతేడాది ఇదే రోజుతో పోలిస్తే 80% పైగా వృద్ధి సాధించామని హీరో మోటోకార్ప్ నేషనల్ సేల్స్ హెడ్ ఎ.శ్రీనివాసు తెలిపారు. డిమాండ్ భారీగా ఉంటుందని ముందుగానే అంచనా వేసి అందుకు అన్ని ఏర్పాట్లతో సంసిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. మరోవైపు హోండా 1.65 లక్షల వాహనాలను విక్రయించినట్లు వెల్లడించింది. గతేడాది ధన్‌తేరాస్ రోజున 78,500 వాహనాలు విక్రయించగా.. ఈసారి అమ్మకాలు ఏకంగా 110% వృద్ధి చెందినట్లు తెలిపింది. హీరో నుంచి విడిపోయి ప్రత్యేక కంపెనీగా ఏర్పడిన తర్వాత ఇదే తమకు తొలి పండుగ సీజన్ అని, భారీ విక్రయాలు కస్టమర్లకు తమపై ఉన్న నమ్మకాన్ని తెలియజే స్తోందని హెచ్ఎంఎస్ఐ వైస్ ప్రెసిడెంట్ యాదవీందర్ గులేరియా చెప్పారు. ఈ పండుగ సీజన్‌ను రికార్డు అమ్మకాలతో ముగించగలమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. -
గోల్డ్ రష్@ ధన్‌తేరాస్
చాలా రోజులకు కిటకిటలాడిన దుకాణాలు ఆఫర్లతో ఆకట్టుకున్న జువెలర్లు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ధన్‌తేరాస్‌కు ఆభరణాల దుకాణాలు కిటకిటలాడాయి. నిన్న మొన్నటి వరకు వెలవెలబోయిన షాపులు కస్టమర్లతో సందడిగా మారాయి. ధన్‌తేరాస్ సెంటిమెంట్‌కుతోడు బంగారం ధర తక్కువగా ఉండడం, జువెలర్ల ఆకర్షణీయ ఆఫర్లు.. వెరశి దేశవ్యాప్తంగా మంగళవారం పసిడి మెరుపులు మెరిపించింది. నాణేలతోపాటు అన్ని రకాల ఆభరణాలు అమ్ముడయ్యాయి. అయితే అమ్మకాలు గతేడాది కంటే తక్కువే నమోదయ్యాయి. ధన్‌తేరాస్ రాకతో కొంత ఊరట లభించినట్టు అయిందని వ్యాపారులు చెబుతున్నారు. కస్టమర్లను ఆకట్టుకోవడానికి మజూరీ చార్జీలను జువెలర్లు గణనీయంగా తగ్గించారు. బంగారం, వెండి నాణేలను బహుమతిగా ఇచ్చిన సంస్థలూ ఉన్నాయి. 10 గ్రాముల మేలిమి బంగారం ధర హైదరాబాద్ మార్కెట్లో రూ.27,850 వద్ద ఉంది. మళ్లీ పెరుగుతుందని.. 2013 సెప్టెంబర్‌లో 68.25 కోట్ల డాలర్లుగా ఉన్న పసిడి దిగుమతులు ఈ ఏడాది సెప్టెంబర్‌లో 3.75 బిలియన్ డాలర్లకు చేరాయి. ఈ నేపథ్యంలో దీపావళి తర్వాత పసిడి దిగుమతులపై మళ్లీ ఆంక్షలు విధించే అంశాన్ని పరిశీలించనున్నట్టు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సోమవారం తెలిపారు. ఆయన వ్యాఖ్యలతో వినియోగదారులు ఆందోళనకు గురయ్యారనే చెప్పొచ్చు. కారణమేమంటే 2013తో పోలిస్తే 10 గ్రాముల బంగారం ధర ప్రస్తుతం రూ.28 వేల దిగువకు ఉంది. రూ.25 వేలకు దిగొస్తుందని చాలా మంది కస్టమర్లు కొన్నాళ్లుగా వేచి చూస్తున్నారు. దీపావళి తర్వాత మళ్లీ ధర పెరిగితే ఎలా అని భావించి దుకాణాల వైపు అడుగులేశారు. ఉద్యోగాలు చేసే మహిళలతో సాయంత్రం నుంచి హడావుడి పెరిగిందని ఆర్ఎస్ బ్రదర్స్ ప్రతినిధి నాగ కిరణ్ తెలిపారు. విజయవంతంగా విక్రయించాం.. ధన్‌తేరాస్‌కు బంగారం డిమాండ్ ఎకానమీ ఆశావాదానికి నిదర్శనమని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ఇండియా ఎండీ పి.ఆర్.సోమసుందరం వ్యాఖ్యానించారు. విధానపర నియంత్రణలు ఈ సీజన్లో పసిడి డిమాండ్‌పై కొంత ప్రభావం చూపాయని వెల్లడించారు. గతేడాదితో పోలిస్తే 40 శాతం వృద్ధితో 1.5 లక్షల పీసుల వెండి నాణేలు, 25 వేల పీసుల (1.5 టన్నులు) బంగారు నాణేలు అమ్మినట్టు ఎంఎంటీసీ-పీఏఎంపీ ఇండియా మార్కెటింగ్ ప్రెసిడెంట్ విపిన్ రైనా తెలిపారు. ఈసారి మెరుగైన అమ్మకాలు సాధించామని తనిష్క్ మార్కెటింగ్, రిటైల్ వైస్ ప్రెసిడెంట్ సందీప్ కులహళ్లి వెల్లడించారు. పుత్తడి ధరలు ప్రస్తుతం మెరుగ్గా ఉన్నాయని, కస్టమర్ల సెంటిమెంటూ అధికంగా ఉందని హైదరాబాద్ జువెల్లరీ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మహేందర్ తయాల్ తెలిపారు. -
జోరుగా దీపావళి షాపింగ్
సాక్షి, న్యూఢిల్లీ: ధన్‌తేరస్‌తో నగరంలో దీపావళి షాపింగ్ పరాకాష్టకు చేరుకుంది. ధన్తేరస్ నాడు బంగారం, వెండి లేదా స్టీలు వస్తువును కొనడం శుభప్రదమని ఉత్తరాదివాసుల నమ్మకం. ధనతేరస్ రోజున బంగారం, వెండి కొనే తాహతులేకపోతే కనీసం ఓ స్టీలు వస్తువు కొనుక్కోవాలని ఉత్తరాదివాసులనుకుంటారు. దాంతో మంగళవారం బంగారు, వెండి ఆభరణాల దుకాణాలతో పాటు స్టీలు సామగ్రి విక్రయించే దుకాణాలు కూడా కొత్తకొత్త స్కీములతో, ఆఫర్లతో కొనుగోలుదారులను ఆకట్టుకునేందుకు ప్రయత్నించాయి. గణేషుడు, లక్ష్మీప్రతిమలు, లక్ష్మీ వినాయక వెండినాణేలు, రూపాయినోట్ల నమూనాలు వెండి దుకాణాలలో ప్రత్యేకతను సంతరించుకున్నాయి. బంగారం, వెండి ధరలు గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం తక్కువగా ఉండడంతో నగరవాసులు ఉత్సాహంగా కొనుగోళ్లు జరుపుతారని దుకాణాదారులు ఆశించినప్పటికీ ఊహించినంత సందడి కనిపించలేదు. అయినప్పటికీ ధన్తేరస్ కొనుగోలుదారులతో పాటు దీపావళి షాపర్లతో నగర మార్కెట్లు కిటకిటలాడాయి. దీపావళి సమయంలో తమతో వ్యాపారలావాదేవీలు నిర్వహించేవారికి, బంధుమిత్రులకు మిఠాయిలు, కానుకలు పంచడం ఉత్తరాదిలో మరోసాంప్రదాయం. దానితో మిఠాయిలు, కానుకలు కొనుగోలు చేసేవారితో రోడ్లపై గంటలతరబడి ట్రాఫిక్‌జామ్‌లు ఏర్పడతాయి. సాధారణంగా కానుకలు పంచే తతంగాన్ని చాలామంది వారం రోజుల ముందునుంచే ప్రారంభించినప్పటికీ దీపావళి రోజులలో ఇది పతాకస్థాయికి చేరుతుంది. దీపావళికి ఇచ్చిపుచ్చుకునే కానుకలలో ప్రధానంగా చెప్పుకోవలసింది డ్రైఫ్రూట్స్. డ్రైప్రూట్స్ కొనుగోలుదారులతో ఆసియాలోనే మసాలాలకు అతిపెద్ద మార్కెట్‌గా పేరొందిన ఖరీబౌలీ మార్కెట్లో మంగళవారం కాలుపెట్టడానికి చోటులేకుండా పోయింది. కాలిఫోర్నియా, కాబూల్ బాదాం, రాజస్థాన్, చైనా కిస్మిస్, ఆస్ట్రేలియా నుంచి దిగుమతి చేసుకున్న డీహ్రైడేటెడ్ పళ్లు... డ్రైఫ్రూట్స్‌లో వెరయిటీకి అంతులేనట్లున్నాయి. అఫ్గానిస్తాన్ నుంచి వచ్చే ైడ్రె ఫ్రూట్స్ నాణ్యమైనవని దుకాణాదారులు చెప్పారు. చాలారకాల డ్రైఫ్రూట్స్‌ను ఎక్కువగా దిగమతి చేసుకుంటారు కనుక వాటి ధర పంటదిగుబడితో పాటు డాలర్ రేటుపై ఆధారపడి ఉంటుందని వారు చెప్పారు. ఈ సంవత్సరం డ్రైఫ్రూట్స్ ధరలు ఎక్కువగా ఉండడం వల్ల కొనుగోలుదారులు అనుకున్నదానికంటే తక్కువ స్థాయిలో కొనుగోళ్లు జరుపుతున్నారని వారు చెప్పారు. దీపావళి కొనుగోళ్లనగానే మొదట గుర్తుకొచ్చే బాణసంచా గురించి చివరగా చెప్పుకుంటే.... ఈ సంవత్సరం చైనా బాణసంచా పై నిషేధం అమల్లోకి తేవడంతో చాలాదుకాణాలు చైనా ఉత్పత్తులు తమ వద్దలేవనే బోర్డులు వేలాడదీశాయి. అయినప్పటికీ మార్కెట్లలోని చిన్నాచితకా దుకాణాలలో విక్రయించే చైనా బాణసంచా కొనుగోలుదారులను ఆకట్టుకుంటోంది. ప్రమాదాలను, పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించడం కోసం ప్రభుత్వం చైనా టపాసుల విక్రయాన్ని నిషేధించినప్పటికీ వాటి ధర దేశీ బాణసంచా కంటే తక్కువగా ఉండడం కొనుగోలుదారులను ఆక ర్షిస్తోంది. గతేడాదితో పోలిస్తే ఈ యేడాది టపాసుల ధరలు ఎక్కువగా ఉన్నాయని అంగీకరించిన పెద్ద దుకాణదారులు ధరల ప్రభావం తమ అమ్మకాలపై కనిసిస్తోందని చెప్పారు. పర్యావరణ సన్నిహితంగా దీపావళి జరుపుకునేవారి సంఖ్య పెరగడం కూడా బాణసంచా అమ్మకాలపై ప్రభావం చూపుతోందని వారు చెప్పారు. -
ఆఫర్లూ బంగారమే..
ధన్‌తేరాస్‌కు ఆఫర్లే ఆఫర్లు ధర తగ్గడంతో అమ్మకాలకు జోష్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ధన త్రయోదశికి (ధన్‌తేరాస్) బంగారు మెరుపులు మెరియనున్నాయి. ధర తగ్గడంతో సామాన్యులను సైతం పుత్తడి ఊరిస్తోంది. దీనికితోడు ఆభరణాల విక్రయ సంస్థలు ఆకర్షణీయ ఆఫర్లను ప్రకటించాయి. బంగారు నాణేల ఉచితం, డిస్కౌంట్లు, మజూరీపై తగ్గింపు, లక్కీ డ్రా వంటి ఆఫర్లతో సిద్ధమయ్యాయి. నూతన డిజైన్లతో కస్టమర్లను ఆహ్వానిస్తున్నాయి. గతేడాది 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు అటూ ఇటుగా రూ.31 వేలుంటే, నేడు రూ.27,500 వద్దకు దిగొచ్చింది. దీంతో ఈసారి ధన్‌తేరాస్‌కు ఆభరణాల అమ్మకాల్లో 10-15 శాతం వృద్ధి ఉంటుందని ఆల్ ఇండియా జెమ్స్ జువెల్లరీ ట్రేడ్ ఫెడరేషన్(జీజేఎఫ్) అంచనా వేస్తోంది. జువెలర్ల ఆఫర్ల కారణంగానే అమ్మకాలకు జోష్ ఉంటుందని, నాణేల కంటే ఆభరణాల వైపే కస్టమర్లు మొగ్గు చూపే అవకాశం ఉందని చెబుతోంది. ధన త్రయోదశికి విలువైన లోహాలు కొనుగోలు చేస్తే సంపద వృద్ధి చెందుతుందని చాలా మంది భావిస్తారు. హాల్‌మార్క్ ఉన్న ఆభరణాలను మాత్రమే కొనుగోలు చేయాలని భారతీయ ప్రమాణాల సంస్థ ఈ సందర్భంగా కస్టమర్లకు గుర్తు చేస్తోంది. అక్టోబర్ 21న ధన్‌తేరాస్. ఊరిస్తున్న ఆఫర్లు.. రూ.1 కోటి విలువైన బహుమతులను చెన్నై షాపింగ్ మాల్ ప్రకటించింది. ప్రతి రూ.1,000 కొనుగోలుపై లక్కీ డ్రా గిఫ్ట్ కూపన్ పొందొచ్చు. జీఆర్టీ జువెల్లర్స్ 50వ వార్షికోత్సవం జరుపుకుంటోంది. బంగారం బరువుకు సమానమైన వెండి ఉచితమని ప్రకటించింది. వజ్రాల కొనుగోలుపై ప్రతి క్యారట్‌కు 25 గ్రాముల వెండి ఫ్రీగా ఇస్తోంది. రూ.25 వేల విలువగల బంగారు ఆభరణాలపై గోల్డ్ కాయిన్‌ను జోస్ ఆలుక్కాస్ అందిస్తోంది. ప్రత్యేక వజ్రాల కలెక్షన్‌ను సిద్ధం చేసింది. వజ్రాలపై 15 శాతం డిస్కౌంట్ ప్రకటించింది. ఖజానా జువెల్లరీ స్వర్ణాభరణాలపై గ్రాముకు రూ.100 తగ్గింపు ఇస్తోంది. వజ్రాలపై ఒక్కో క్యారట్‌కు రూ.5 వేలు డిస్కౌంట్ అందిస్తోంది. బంగారు నగల మజూరీపై 50 శాతం, వజ్రాల నగల మజూరీపై 100 శాతం తగ్గింపును అందుకోండంటూ టీబీజెడ్ ఆకర్షిస్తోంది. ఆభరణాలపై తరుగును తగ్గించామని కల్యాణ్ జువెల్లర్స్ చెబుతోంది. 916 ఆభరణాలపై చెన్నై ధరపై 10 గ్రాములకు రూ.1,000 తగ్గింపును జేసీ బ్రదర్స్ ఆఫర్ చేస్తోంది. రూ.50 వేలు ఆపైన ఆభరణాల కొనుగోలుపై బంగారు నాణెంను జోయాలుక్కాస్ ఆఫర్ చేస్తోంది. తయారీపై 50 శాతం డిస్కౌంట్, వజ్రాభరణాలపై తయారీ చార్జీల మినహాయింపును రిలయన్స్ జువెల్స్ అందిస్తోంది. -
బంగారం అమ్మకాలకు కళ్లెం వేసిన ప్రభుత్వం
ఈ దీపావళికి బంగారం అమ్మకాలు బాగా తగ్గాయి. గోల్డ్ షాపులు ఏమంత కళకళలాడటంలేదు. బంగారానికి భారతీయులకు విడదీయరాని అనుబంధం ఉంది. దీపావళి లాంటి పండుగల సమయంలో ఎంతో కొంత బంగారం కొనడానికి మహిళలు ఉత్సాహం చూపుతారు. అదీగాక దీపావళికి ముందు ధనత్రయోదశి (ధన్‌తేరాస్) ఉంటుంది. అందువల్ల బంగారంతో లక్ష్మీ పూజ చేస్తే అష్ట ఐశ్వర్యాలు తమ సొంతం అవుతాయనే నమ్మకం చాలామందిలో ఉంటుంది. ఈ విశిష్ట రోజున హిందువులు తమ సామర్థ్యానికి తగ్గట్టుగా ఎంతో కొంత బంగారాన్ని కొనుగోలు చేస్తుంటారు. ఆ రకంగా బంగారం కొనుగోలు చేసేందుకు వినియోగదారులు ముందుకు వస్తారని బంగారం షాపులవారు ఆశించారు. ధనత్రయోదశి (ధన్‌తేరాస్) నాడు కూడా దేశవ్యాప్తంగా బంగారం అమ్మకాలు నిరాశపర్చాయి. దేశంలోకి బంగారం దిగుమతులకు కళ్లెం వేసేందుకు ప్రభుత్వం, రిజర్వు బ్యాంకు తీసుకుంటున్న చర్యల వల్ల కొంత ఫలితం కనిపిస్తోంది. కిందటి ఏడాది దీపావళితో పోలిస్తే ఈ సారి అమ్మకాలు బాగా తగ్గాయి. బంగారంపై కేంద్ర ప్రభుత్వం పెంచిన పన్ను బంగారం అమ్మకం దారులకు అశినిపాతంగా మారింది. ధరలు పెరగడంతో కొనుగోలుదారులు వెనక్కు తగ్గారు. గోల్డ్ స్టాకిస్టుల పరిస్ధితి కూడా అంతంతమాత్రంగానే ఉంది. రిటైల్ మార్కెట్లో బంగారం లేక పాత బంగారాన్ని కరిగించాల్సిన పరిస్ధితి ఉందని గోల్డ్ ట్రేడర్స్ సైతం ఒప్పుకుంటున్నారు. చాలా వరకు గోల్డ్ షాపుల యజమానులు అమ్మకాలు లేక కొట్టుమిట్టాడుతున్నారు. కిందటి ఏడాది ఇదే సమయంలో 10 గ్రాముల బంగారం ధర ఇంచు మించు 32వేల రూపాయలు ఉంది. అయితే అప్పుడు బంగారం అందుబాటులో ఉండేది. కానీ ఈ ఏడాది అంతే మొత్తంలో బంగారం ధరలు ఉన్నా ఇపుడు మాత్రం స్టాక్ లేదు. మొత్తం మీద ఈ సారి ధన్ త్రయోదశి పెరిగిన బంగారం ధరలతో అటు వినియోగదరుల్లోను ఇటు బంగారం అమ్మకం దారుల్లోను నిరుత్సాహం నింపింది. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు కొంతవరకు ఫలిస్తున్నట్లు భావించవచ్చు. దేశ ప్రయోజనాలరీత్యా కూడా బంగారం అమ్మకాలు తగ్గవలసిన అవసరం ఉంది. -
ధన త్రయోదశికి వెండితో సరి
* బంగారం అమ్మకాలు అంతంతే * 50 శాతానికి పడిన విక్రయాలు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా బంగారం అమ్మకాలు ధనత్రయోదశి (ధన్‌తేరాస్) నాడు కూడా నిరాశపర్చాయి. సాధారణంగా ఈ విశిష్ట రోజున హిందువులు తమ సామర్థ్యానికి తగ్గట్టుగా ఎంతో కొంత బంగారాన్ని కొనుగోలు చేయడం పరిపాటి. అలాంటిది గతేడాదితో పోలిస్తే ఈసారి అమ్మకాలు 50 శాతానికి పడిపోయాయి. 2012లో 10 గ్రాముల బంగారం సుమారు రూ.32,500 ఉంటే.. నేడు అటూ ఇటూగా రూ.వెయ్యి తక్కువగా ఉన్నా అమ్మకాలు ఆశించినస్థాయిలో నమోదు కాలేదు. ద్రవ్యోల్బణం, బలహీన సెంటిమెంటు ఈ పరిస్థితికి కారణమని ఆల్ ఇండియా జెమ్స్, జువెల్లరీ ఫెడరేషన్ చైర్మన్ హరేష్ సోనీ తెలిపారు. వాస్తవానికి ఈ ఏడాది ఏప్రిల్‌లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర ఊహించనంతగా రూ.25 వేల స్థాయికి వచ్చింది. ఆ సమయంలో అప్పులు చేసి మరీ ఈ విలువైన లోహాన్ని కొనుగోలు చేశారు. అందుకే ధన త్రయోదశికి కొనేవారు లేరని వర్తకులు అంటున్నారు. వెండి అమ్మకాలే ఎక్కువ.. బంగారానికి బదులు వెండి నాణేలు, ఇతర వెండి సామాగ్రి కొనేందుకే కస్టమర్లు ఎక్కువగా మొగ్గు చూపారు. రాష్ట్రంలో గతేడాదితో పోలిస్తే ఈసారి ధన త్రయోదశి అమ్మకాలు 20 శాతం కూడా నమోదు కాలేదని ఒక అసోసియేషన్ ప్రతినిధి చెప్పారు. ధన్‌తేరాస్ కాబట్టి సెంటిమెంట్ కోసం వెండి నాణేలు కొనుగోలు చేశారని ఆయన తెలిపారు. సుమారు రూ.70 లక్షల విలువైన వ్యాపారం తమ స్టోర్‌లో నమోదైందని అమీర్‌పేటలోని ఆర్ఎస్ బ్రదర్స్ జువెల్లరీ విభాగం మేనేజర్ నాగ కిరణ్ పేర్కొన్నారు. గతేడాదితో పోలిస్తే ఇది 30 శాతం తక్కువ అన్నారు. ఎలక్ట్రానిక్స్ ఫర్వాలేదు.. దసరాతో పోలిస్తే ఈ దీపావళికి గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్స్ అమ్మకాలు ఆశించినంతగా ఉన్నాయని కంపెనీలు అంటున్నాయి. సాధారణంగా రాష్ట్రంలో దీపావళికి రూ.200 కోట్ల వ్యాపారం జరుగుతుంది. ఈసారి ఇది రూ.160 కోట్లు ఉంటుందని ప్యానాసోనిక్ ఆంధ్రప్రదేశ్ ప్రాంతీయ మేనేజర్ బొమ్మారెడ్డి ప్రసాదరెడ్డి తెలిపారు. రాష్ట్రంలో ప్యానాసోనిక్ దసరాకు రూ.10 కోట్ల అమ్మకాలు చేయగా, దీపావళికి రూ.15 కోట్లు దాటతామని చెప్పారు. హైదరాబాద్‌లో దీపావళికి రూ.100 కోట్ల వ్యాపారం జరగొచ్చని ఆదీశ్వర్ ఆంధ్రప్రదేశ్ ఆపరేషన్స్ హెడ్ బాలాజీ రామ్ అన్నారు. ఆదీశ్వర్‌కు చెందిన 14 ఔట్లెట్లలో ఈ పండక్కి రూ.15 కోట్ల అమ్మకాలు అంచనా వేస్తున్నామని తెలిపారు. అత్యధికులు 32 అంగుళాల టీవీలను కొంటున్నారని వివరించారు. -
బంగారం రూ. 33 వేల దిశగా...!