న్యూఢిల్లీ: ధనత్రయోదశి, దీపావళి సందర్భంగా బంగారం ఆభరణాల విక్రయాలు జోరుగా సాగుతాయని జ్యుయలరీ పరిశ్రమ అంచనాలతో ఉంది. ముఖ్యంగా దసరా సందర్భంగా ఆభరణాల విక్రయాలు 30 శాతం అధికంగా నమోదు కావడం, పరిశ్రమలో సానుకూల అంచనాలకు మద్దతునిస్తోంది. ఇదే ధోరణి దీపావళి పండుగ వరకు కొనసాగొచ్చని భావిస్తోంది. తదుపరి వివాహ శుభ ముహూర్తాలు కూడా ఉండడంతో అమ్మకాలపై బలమైన అంచనాలతో కంపెనీలు ఉన్నాయి. బంగారం ధరలు దిగిరావడానికి తోడు, ఆర్థిక కార్యకలాపాలు పూర్తి స్థాయిలో అనుమతించడం అనుకూలిస్తున్నట్టు పరిశ్రమ అంటోంది. ఆభరణాలకు వినియోగించే 22 క్యారట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.50వేల దిగువకు రావడం గమనార్హం. దసరా సమయంలో రూ.49,000 స్థాయిలో ఉన్న ధర ప్రస్తుతం ఇంకా తగ్గి రూ.46వేలకు దిగొచ్చింది. దీంతో దీపావళికి విక్రయాలు అంచనాలను మించుతాయని ఆభరణాల వర్తకులు భావిస్తున్నారు.
దసరా నుంచి సానుకూలత
దసరా నుంచి కొనుగోళ్లు సానుకూలంగా ఉన్నట్టు పీఎన్‌జీ జ్యుయలర్స్ సీఎండీ సౌరభ్ గాడ్గిల్ తెలిపారు. గతేడాదితో పోలిస్తే కస్టమర్లు రెట్టింపు విలువ మేరకు కొనుగోలు చేస్తున్నట్టు చెప్పారు. కస్టమర్లు ముందుగా బుక్ చేసుకుని, స్టోర్లకు వచ్చి తీసుకెళుతున్నట్టు తెలిపారు. టెంపుల్ జ్యుయలరీ, ఆధునికతను జోడించుకున్న సంప్రదాయ డిజైన్లకు మద్దతు ఉన్నట్టు వివరించారు. మొత్తం మీద గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది పండుగల సీజన్‌లో విక్రయాలు సమారు 30 శాతం అధికంగా ఉన్నట్టు తెలిపారు.
ద్రవ్యోల్బణ ప్రభావం పెద్దగా లేదు
ద్రవ్యోల్బణ ప్రభావం కస్టమర్ల కొనుగోళ్లను పెద్దగా ప్రభావితం చేయలేదని ఇండియా బులియన్ అండ్ జ్యుయలర్స్ అసోసియేషన్ జాతీయ కార్యదర్శి సురేంద్ర మెహతా పేర్కొన్నారు. దసరా విక్రయాల్లో ఇదే కనిపించిందని, ఆర్థిక కార్యకలాపాలను పూర్తి స్థాయిలో అనుమతించడం కలిసొచ్చినట్టు చెప్పారు. దసరా నవరాత్రుల్లో విక్రయాలు బలంగా నమోదు కావడం, తదుపరి దీపావళి విక్రయాలకు మద్దతుగా నిలుస్తుందని పరిశ్రమ అంచనాతో ఉంది. ‘‘దీపావళి సందర్భంగా విక్రయాలు మరింత అధికంగా ఉంటాయని అంచనా వేస్తున్నాం. గతేడాది దీపావళి విక్రయాలతో పోలిస్తే ఈ ఏడాది 40 శాతం అధికంగా ఉండొచ్చు. ఈ పండుగల సీజన్ పట్ల మేము ఎంతో ఆశావహంగా ఉన్నాం’’అని మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ చైర్మన్ ఎంపీ అహ్మద్ తెలిపారు.
‘‘దసరా సీజన్ బలంగా ఉంది. దీంతో దీపావళి, ధనత్రయోదశి విక్రయాలపై ఆశలతో ఉన్నాం. గడిచిన మూడేళ్లతో పోలిస్తే ఈ సీజన్ గొప్పగా ఉంటుంది’’అని సి. కృష్ణయ్య చెట్టి గ్రూప్ ఆఫ్ జ్యుయలర్స్ ఎండీ సి. వినోద్ హయగ్రీవ్ పేర్కొన్నారు. ‘‘దసరా సమయంలో మా స్టోర్లలో 30 శాతం అధిక విక్రయాలు నమోదయ్యాయి. మార్కెట్లో ఎంతో పెంటప్ డిమాండ్ (గతంలో నిలిచిన డిమాండ్ ఇప్పుడు పుంజుకోవడం) ఉంది. వినియోగదారులు బంగారం కొనుగోలుకు ఆసక్తి చూపిస్తున్నారు. పెట్టుబడుల కోణంలో కస్టమర్లు కాయిన్లను సైతం కొనుగోలు చేస్తున్నారు’’అని జోయాలుక్కాస్ జ్యుయలరీ సీఎండీ జాయ్ అలుక్కాస్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment