‘చూశావా... ఏం తెచ్చానో’ అన్నాడతను స్కూటర్ ఇంటి ముందు ఆపి. వెనుక ట్రాలీ వచ్చి ఆగింది. అన్నీ మొక్కలే. నర్సరీ నుంచి తాజాగా దిగినవి. ‘అడిగావుగా... మల్లెతీగ తెచ్చాను’... ‘ఇదిగో... నీకు ఇష్టమైన బంతి. కుండీలోనే ఎన్ని పూసేసిందో చూడు’... ‘చిట్టి రోజాలు... రెక్క చామంతులు... ఈ మందారం కొమ్మలేసేంతగా పెరిగితే చాలా బాగుంటుంది’... వరుసగా చూపుతున్నాడు. ఎన్నాళ్లుగానో అడుగుతోంది. ఇవాళ ఉదయాన్నే లేచి, చెప్పా పెట్టకుండా వెళ్లి తెచ్చాడు. సంతోషంగా, సంబరంగా, ప్రేమగా చూస్తోంది వాటన్నింటిని! ‘నన్నూ తీసుకెళ్లుంటే బాగుండేదిగా’...
‘ఇంట్లోకి మొక్కలు వస్తున్నప్పుడు నువ్వు ఎదురు రావాలనీ’... ఆమె చేతిలో చాలా పూలున్న చిన్న కుండీని పెట్టి సెల్ఫీ దిగాడు. ఇద్దరూ హాయిగా నవ్వారు ఫొటోలో. ‘దీని పేరు బెగోనియా అట. బాగుంది కదూ’...మరోచోట మరో ఇంటతను రెండు రోజులుగా ఇల్లు సర్దుతున్నాడు. భార్యను పిలిచి ‘అనవసరమైన సామాను చాలా పేర్చిపెట్టావు చూడు’ అని బుజ్జగించి పారవేయించాడు. మాసిన కర్టెన్లు తీసి, ఉతికిన కర్టెన్లు మార్చాడు. దుమ్ము పట్టిన లైట్లను తుడిచాడు. అన్నీ చక్కగా అమర్చి హాల్లో రెండు ర్యాకులను ఖాళీగా సంపాదించగలిగాడు. ‘ఇప్పుడు ఏం చేద్దామని ఈ ర్యాకులను’ అందామె. ‘చెప్తా’ అని సాయంత్రం పిల్లల్ని తీసుకొని ఆటో ఎక్కి పుస్తకాల షాపుకు చేరాడు.
‘పిల్లలూ... ఒక ర్యాకుకు సరిపడా పుస్తకాలు మీరు కొనుక్కోండి. ఒక ర్యాకుకు సరిపడా మేము కొనుక్కుంటాం’.... పెళ్లికి ముందు వారిద్దరూ పుస్తకాలు చదివేవారు. సంసారంలో పడి వదిలేశారు. ‘ఇష్టమైన అలవాటు. తిరిగి మొదలెడదాం’ అన్నాడు భార్యతో. అప్పటికే ఆమె పుస్తకాలు ఎంచి ఒకవైపు పెట్టేస్తోందిగా!
ఇంకో నగరం. ఉదయపు ఎండ ఎక్కువగా లేదు. అలాగని తక్కువగా లేదు. మంచి గాలి వీస్తున్నందు వల్ల బాల్కనీలో ఎదురూ బొదురూ సమయం ఆహ్లాదంగా ఉంది. ‘నీ ఫోను ఇవ్వు’ అన్నాడామెతో భర్త. తీసుకుని స్విగ్గి, జొమాటో లాంటి యాప్స్ డిలీట్ చేశాడు. తన ఫోన్ ఆమెకు ఇచ్చాడు. ‘ఫుడ్ డెలివరీ యాప్స్ తీసెయ్’ అన్నాడు. తీసేసింది. ‘ఇవాళ్టి నుంచి బయటి తిండి వద్దు.
ఈ ఇంట్లోకి ఏది వచ్చినా ఇకపై హెల్దీదే వస్తుంది. నేను వారంలో మూడు బ్రేక్‌ఫాస్ట్‌లు, కనీసం రెండు డిన్నర్లు నువ్వు కిచెన్ లోకి రానవసరం లేకుండా చేయగలను. మిగిలింది నువ్వు చేయి. అసలు పొయ్యి ఎక్కవలసిన అవసరం లేని మంచి తిండి కూడా పిల్లలతో కూచుని డిజైన్ చేద్దాం.
ఫేస్‌బుక్, యూట్యూబ్‌లకు వెచ్చించే సమయం మన ఉదరం కోసం వెచ్చిస్తే తెలిసి తెలిసీ ద్రోహం చేసుకోని వాళ్లం అవుతాం. మన తాత ముత్తాతలు వండుకోవడానికి తిండిలేక ఏడ్చేవాళ్లు. మనకు అన్నీ ఉన్నా వండుకోవడానికి ఏడిస్తే ఎలా? పరుగు పెట్టి సంపాదించి పట్టెడు మెతుకులు తినలేని స్థితికి చేరితే సంతోషమా మనకు?’
అబ్బో! ఆ ఇంటిలో సందడి వేరేగా ఉంది. కోడలు మాటిమాటికీ ఊరికి ఫోన్లు మాట్లాడుతూ ఉంది. టికెట్ల ఏర్పాటు చూస్తూ ఉంది. అంత వరకూ ఖాళీగా ఉన్న మూడో బెడ్‌రూమును సిద్ధం చేస్తూ ఉంది. కొడుకు ఉద్వేగంగా ఉన్నాడు. కలా నిజమా తేల్చుకోలేక ఉన్నాడు. సాకులు వెతుక్కున్నారు తనూ తన భార్య.
లేనిపోని తప్పులు వెతికారు తనూ తన భార్య. మా జోలికి రావద్దని తేల్చి చెప్పారు ఇద్దరూ కలిసి. బాగానే ఉంది. హాయిగా ఉంది. కాని బాగానే ఉందా... హాయిగా ఉందా... తల్లితండ్రులు అడుగుపెట్టి నాలుగేళ్లు అవుతున్న ఈ ఇల్లు. వారి ఆశీర్వాదం తాకని ఇల్లు.
వారి మాటలు వినపడని, వారి గదమాయింపులూ ఆత్మీయ హెచ్చరికలూ లేని ఇల్లు. పశ్చాత్తాపం పిల్లలకు మరో పుట్టుక ఇస్తుంది. ఈ పుట్టుక తల్లితండ్రులను కోరింది. మనవలు వెళ్లి రిసీవ్ చేసుకొని తీసుకువస్తే కొడుకూ కోడల్ని కన్నీటి కళ్లతో చూస్తూ లోపలికి అడుగు పెట్టారు తల్లితండ్రులు. విశేషం చూడండి. ఆ రోజు ‘ధన్ తేరస్’.
సాధారణంగా ధన్ తేరస్‌కి ఇంటికి బంగారం వస్తే మంచిది అనంటారు. కాని పై నాలుగు ఇళ్లలో బంగారం వంటి నిర్ణయాలు జరిగాయి. సిసలైన ‘ధన్ తేరస్’ అదే కావచ్చు.
ధనం వల్ల ధన్యత రాదు. ధన్యత నొసగే జీవితం గడపడమే నిజమైన ధనం కలిగి ఉండటం. గాలినిచ్చే మంచి చెట్టు, పుష్టినిచ్చే తాజా ఆహారం, కష్టసుఖాలు పంచుకునే నిజమైన మిత్రులు, బుద్ధీ వికాసాలు కలిగించి ఈర్షా్య వైషమ్యం పోగొట్టే పుస్తకాలు, సదా అమ్మా నాన్నల సాంగత్యం, కుటుంబ సభ్యులంతా కలిసి భోం చేయగల సమయాలు, కనీస వ్యాయామం... ఇవి ఏ ఇంట ప్రతిరోజూ ఉంటాయో, అడుగు పెడతాయో, అంటిపెట్టుకుని ఉన్నాయన్న భరోసా కల్పిస్తాయో ఆ ఇల్లు సదా సమృద్ధితో అలరారుతుంది. అక్కడ అనివార్యంగా సంపద పోగవుతుంది. ఉత్తమమైన లోహం బంగారం. అది ఉత్తమమైన నివాసాన్నే ఎంచుకుంటుంది.
శీతగాలులు ముమ్మరమయ్యే ముందు ఉల్లాస, ఉత్సాహాల కోసం దీపావళి. పనికి మనసొప్పని ఈ మందకొడి రోజులలో జీవనోపాధి దొరకకపోతే గనక జరుగుబాటుకు దాచిన ధన్‌తేరస్ పసిడి. పెద్దలు ఏం చేసినా ఆచితూచి, ఆలోచించి చేస్తారు. ధన్‌తేరస్‌కు తప్పక బంగారం, వెండి, వస్తువులు కొనదలుచుకుంటే కొనండి. కాని ప్రతి ఇల్లూ ఒక సువర్ణ వాకిలి కావాలంటే మాత్రం అహం, అసూయ, అజ్ఞానాలను చిమ్మి బయట పారబోయండి! ‘వాడికేం... బంగారంలా బతికాడు’ అంటారు. అలా బతికి అనిపించుకోండి! ధన త్రయోదశి శుభాకాంక్షలు. ప్రతి ఇంటా వికసిత కాంతులు కురియుగాక!
సువర్ణ వాకిలి
Published Mon, Oct 28 2024 12:02 AM | Last Updated on Mon, Oct 28 2024 12:02 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment