
ఢిల్లీ: తొమ్మిది నెలలపాటు అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయిన నాసా వ్యోమగాములు సునీతా విలియమ్స్(sunita williams) , బుచ్ విల్మోర్‌లు ఎట్టకేలకు భూమికి తిరుగు పయనమయ్యారు. వ్యోమగాములంతా సురక్షితంగా భూమ్మీద అడుగు మోపాలని కోట్ల మంది ప్రార్థిస్తున్నారు. అయితే ఒక ఊరు మాత్రం ప్రత్యేకంగా సునీత క్షేమం కోసం పూజలు, హోమాలు చేస్తోంది. ఆమె రాకను ఒక పండుగలా జరిపేందుకు సన్నాహాలు చేస్తోంది.
సునీతా విలియమ్స్ భారత సంతతి అనే విషయం తెలిసిందే కదా. గుజరాత్‌లోని మెహసానా జిల్లా ఝూలాసన్ ఆమె పూర్వీకుల గ్రామం(Ancestral Village). అక్కడ ఇప్పటికీ ఆమెకు బంధువులు ఉన్నారు. కిందటి ఏడాది.. సునీత అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయినప్పటి నుంచి వాళ్లంతా ఆందోళనతోనే ఉన్నారు. ఆమె క్షేమంగా తిరిగి రావాలని ప్రార్థనలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు.. ఆమె తిరిగి వస్తుండడంపై వాళ్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

‘‘నా సోదరి సునీతా రాక కోసం మేమంతా ఎంతో ఎదురుచూస్తున్నాం. సునీత తల్లి, సోదరి, సోదరుడుతో సహా ఈ దేశంలోని కుటుంబంలోని ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉన్నారు. ఆమె సురక్షితంగా కిందకు దిగాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాం. సునీత కోసం దేవాలయాలకు వెళ్లి పూజలు చేశాం. సునీతా కోసం యజ్ఞం నిర్వహిస్తున్నాం’’ అని ఆమె సోదరుడు దినేశ్ అంటున్నారు. మరోవైపు ఊరు ఊరంతా.. సునీత రాకను చిరస్మరణీయమైన రోజు.. దేశం గర్వించదగిన రోజుగా చెబుతోంది. దీపావళి పండుగలా ఆమె రాకను సంబురంగా జరిపేందుకు సిద్ధం అయ్యింది.
సునీతా విలియమ్స్ గతంలో రెండుసార్లు భారత్ పర్యటనకు వచ్చారు. 2007లో తొలిసారి ఇండియాకు వచ్చిన ఆమె.. ఝూలాసన్‌తో పాటు సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించారు. తిరిగి 2013లో పర్యటనకు వచ్చి.. కోల్‌కతా, న్యూఢిల్లీతో పాటు తన పూర్వీకుల గ్రామాన్ని సందర్శించారు. ఆ సమయంలో ఝూలాసన్ గడ్డకు ఆమె ప్రత్యేకంగా భావిస్తున్నట్లు చెప్పారు.
ఇదిలా ఉంటే.. కిందటి వ్యోమగాములను భూమ్మీదకు తీసుకొచ్చేందుకు అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన స్పేస్‌ఎక్స్ క్రూ డ్రాగన్(Space X Crew Dragon Capsule)లోకి వీరు చేరుకున్నారు. ఈ వ్యోమనౌక అంతరిక్ష కేంద్రం నుంచి విడిపోయి భూమ్మీదకు బయల్దేరింది. స్పేస్‌ఎక్స్ క్రూ డ్రాగన్ ఐఎస్‌ఎస్‌ను వీడే అన్‌డాకింగ్ దృశ్యాలను ప్రపంచమంతా వీక్షించేందుకు నాసా ప్రత్యక్ష ప్రసారం చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment