మరికొన్ని గంటల్లో భూమి మీదకు సునీత విలియమ్స్‌.. టైమ్‌ ఎప్పుడంటే? | Nasa Confirms Sunitha Williams And Wilmore Set To Return To Earth, Check Date Time And Live Details | Sakshi
Sakshi News home page

Sunita Williams Earth Return: మరికొన్ని గంటల్లో భూమి మీదకు సునీత విలియమ్స్‌.. టైమ్‌ ఎప్పుడంటే?

Published Mon, Mar 17 2025 9:24 AM | Last Updated on Mon, Mar 17 2025 11:00 AM

Nasa confirms Sunitha Williams and Wilmore Return to Earth

వాషింగ్టన్‌: భారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్ ఎట్టకేలకు మరికొన్ని గంటల్లో భూమికి చేరుకోనున్నారు. భారత కాలమానం ప్రకారం బుధవారం తెల్లవారుజామున 3:27 AM గంటలకు(అమెరికా కాలమానం ప్రకారం మంగళవారం సాయంత్రం 5.57 గంటలకు) సునీతా విలియమ్స్‌ సహా వ్యోమగామి బుచ్‌ విల్మోర్‌ భూమిపై అడుగుపెట్టనున్నారు. ఈ మేరకు నాసా ఓ ప్రకటనలో వెల్లడించింది.

2024 జూన్‌ 5న ప్రయోగించిన బోయింగ్‌ వ్యోమనౌక ‘స్టార్‌లైనర్‌’లో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి(ISS) ఎనిమిది రోజుల పర్యటనకు వెళ్లారు. అయితే, స్టార్‌లైనర్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో వ్యోమగాములు లేకుండానే అది భూమికి తిరిగొచ్చింది. దీంతో, సునీతా విలియమ్స్ (Sunita williams), బుచ్‌ విల్మోర్‌లు సుమారు తొమ్మిది నెలల అక్కడే గడపాల్సి వచ్చింది.

ఈ నేపథ్యంలో వారిని తీసుకురావాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్ట​్‌ ట్రంప్‌ ఆదేశాలతో వారిని భూమి మీదకు తీసుకువచ్చేందుకు నాసా, స్పేస్‌ఎక్స్‌ రంగంలోకి దిగి ‘క్రూ-10 మిషన్‌’ చేపట్టింది. ఈ క్రమంలో అంతరిక్షంలోకి వెళ్లిన స్పేస్‌ఎక్స్‌ వ్యోమనౌక క్రూ డ్రాగన్‌ ఆదివారం విజయవంతంగా భూ కక్ష్యలోని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)తో అనుసంధానమైన సంగతి తెలిసిందే. ‘క్రూ-10 మిషన్‌’లో వెళ్లిన నలుగురు వ్యోమగాములు ఒక్కొక్కరిగా అంతరిక్ష కేంద్రంలోకి ప్రవేశించారు. దీంతో సునీత రాకకు మార్గం సుగమమైంది. ఈ మేరకు రిటర్న్‌ షెడ్యూల్‌ను నాసా తాజా ప్రకటనలో వెల్లడించింది. 

క్రూ-10 సభ్యులకు స్వాగతం పలికిన సునీతా, విల్మోర్

ప్రయాణం ఇలా.. 
అంతరిక్షం నుంచి వారు బయలుదేరే క్రమంలో క్రూ డ్రాగన్‌ వ్యోమనౌక హ్యాచ్‌ మూసివేత ప్రక్రియ సోమవారం రాత్రి 10.45 గంటలకు (అమెరికా కాలమానం ప్రకారం) మొదలవుతుంది. సోమవారం అర్ధరాత్రి 12.45 గంటలకు అంతరిక్ష కేంద్రం నుంచి క్రూ డ్రాగన్‌ వ్యోమనౌక అన్‌డాకింగ్‌ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ స్పేస్‌షిప్‌ విజయవంతంగా విడిపోయిన తర్వాత మంగళవారం సాయంత్రం 4.45 గంటలకు వ్యోమనౌక భూమికి తిరుగు పయనమవుతుంది. సాయంత్రం 5.11 గంటలకు భూ కక్ష్యలను దాటుకుని కిందకు వస్తుంది. సాయంత్రం 5.57 గంటలకు(బుధవారం తెల్లవారుజామున 3:27 AM ప్రకారం) ఫ్లోరిడా తీరానికి చేరువలో ఉన్న సముద్ర జలాల్లో స్పేస్‌ఎక్స్‌ క్యాప్సూల్‌ దిగుతుంది. అందులో నుంచి ఒక్కొక్కరిగా వ్యోమగాములను బయటకు తీసుకొస్తారని నాసా వెల్లడించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement