
వాషింగ్టన్: అంతరిక్షంలో 9 నెలలపాటు చిక్కుకుపోయి.. ఎట్టకేలకు నాసా-స్పేస్‌ఎక్స్ ప్రయోగం ద్వారా తిరిగి భూమ్మీదకు రాగలిగారు బచ్ విల్మోర్, సునీతా విలియమ్స్‌లు. బైడెన్ హయాంలో వాళ్లను వెనక్కి రప్పించడంలో నాసా విఫలం కాగా.. ఆ పనిని తాము చేశామంటూ ట్రంప్ ప్రభుత్వం గర్వంగా ప్రకటించుకుంది. అయితే వాళ్లకు చెల్లించాల్సిన జీతభత్యాలపై విమర్శలు రావడంతో స్వయంగా అమెరికా అధ్యక్షుడే స్పందించాల్సి వచ్చింది.
వ్యోమగాములు సునీతా విలియమ్స్(Sunita Williams), బచ్ విల్మోర్‌లు అంతరిక్షంలో అనుకున్న దానికంటే ఎక్కువ రోజులు గడిపారని.. అందుకుగానూ వాళ్లకు జీతభత్యాలేవీ అందలేదని పాత్రికేయులు తాజాగా ట్రంప్ దృష్టికి తీసుకెళ్లారు. దీనికి స్పందించిన ఆయన.. అవసరమైతే తన సొంత డబ్బును వాళ్లకు చెల్లిస్తానంటూ ప్రకటించారు. ఈ క్రమంలోనే వ్యోమగాములను సురక్షితంగా భూమికి తీసుకురావడానికి సహాయపడిన స్పేస్ ఎక్స్ అధినేత ఇలాన్ మస్క్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
నాసా ఎంత జీతం ఇస్తోందంటే..
నాసా ఉద్యోగులు ఫెడరల్ ఉద్యోగుల కిందకు వస్తారు. శాలరీలు, అలవెన్స్‌లు.. ఇలాంటి వాటి విషయంలో వ్యోమగాములు భూమ్మీద విధుల్లో ఉన్నప్పుడు, అలాగే అంతరిక్ష ప్రయోగాల టైంలో నాసా ఒకేలా చూస్తుంది. ఈ లెక్కన ఐఎస్‌ఎస్‌లో సునీత, విల్మోర్‌లకు ఒకే తరహా జీతాలు ఉంటాయి. అదనంగా వాళ్లకు చెల్లించేది ఏదైనా ఉంటే.. అది డెయిలీ స్టైఫండ్ కొంత మాత్రమేనని(రోజుకి 4 డాలర్లు.. మన కరెన్సీలో రూ.347) మాత్రమేనని నాసా వ్యోమగామి ఒకరు వెల్లడించారు. కాబట్టి.. 287 రోజులు అంతరిక్షంలో గడిపిన సునీతా విలియమ్స్‌కు శాలరీ ప్రత్యేకంగా నాసా ఏమీ చెల్లించదు. కాకుంటే.. ఇరువురికి డెయిలీ స్టైఫండ్ కింద 1,148 డాలర్లు(లక్ష రూపాయలు) చెల్లిస్తారంతే.
ఇప్పుడు వాళ్లకు వచ్చేది ఎంతంటే..
అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ(NASA)లో బచ్ విల్మోర్, సునీతా విలియమ్స్‌లు జీఎస్(General Schedule)-15 పే గ్రేడ్ ఉద్యోగులుగా ఉన్నారు. నాసాలో అత్యధిక జీతం అందుకునే ఉద్యోగులు ఈ గ్రేడ్ కిందకే వస్తారు. వీళ్లకు ఏడాదికి 1,25,133 - $1,62,672 డాలర్ల జీతం (మన కరెన్సీలో Rs 1.08 కోట్ల నుంచి Rs 1.41 కోట్ల దాకా) ఉంటుంది. ఈ 9 నెలలు ఐఎస్‌ఎస్‌లో గడిపినందుకు రూ.81 లక్షల నుంచి రూ.కోటి 5 లక్షల దాకా ఇద్దరికీ అందుతుంది. అది డెయిలీ స్టైఫండ్ కలిపి చూస్తే రూ.82 లక్షల నుంచి రూ.కోటి 6 లక్షల దాకా ఉండొచ్చు. అయితే..
నాసా డ్యూటీ అవర్స్ 8 గంటలు మాత్రమే. కానీ, అనివార్య పరిస్థితుల్లో ఐఎస్‌ఎస్‌లో చిక్కుకుపోయిన సునీత, విల్మోర్‌లు అదనపు పని గంటలు చేయాల్సి వచ్చింది. అయితే ఫెడరల్ ఉద్యోగుల మార్గదర్శకాల ప్రకారం.. వాళ్లకు ఆ అదనపు పని గంటలకుగానూ ఎలాంటి జీతం చెల్లించడానికి వీల్లేదు. దీనిపై విమర్శలు రావడం మొదలైంది. అందుకే ట్రంప్ ఆ సమయాన్ని ఓవర్ టైం కింద చెల్లిస్తానని ఇప్పుడు ప్రకటించారు.
కిందటి ఏడాది జూన్‌లో నాసా మిషన్ కింద సునీతా విలియమ్స్, బచ్ విల్మోర్‌లు అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధనా కేంద్రానికి వెళ్లారు. సాంకేతిక సమస్యలతో అక్కడే ఉండిపోవాల్సి రాగా.. నాసా క్రూ 10 మిషన్ ప్రయోగం ద్వారా వెనక్కి తీసుకొచ్చే ప్రయత్నాలు చేశారు. ఈ ప్రయోగంలో భాగంగా.. మార్చి 19వ తేదీ తెల్లవారుజామున స్పేస్‌ఎక్స్ డ్రాగన్ స్పేస్‌క్రాఫ్ట్ వాళ్లతో పాటు మరో ఇద్దరు వ్యోమగాములను కూడా సేఫ్‌గా భూమ్మీదకు తీసుకొచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment