Payment
-
డబ్బు లేకపోయినా ఫ్లైట్ బుకింగ్.. వినూత్న ఆఫర్
ట్రావెల్ బుకింగ్ ప్లాట్‌ఫామ్ మేక్మైట్రిప్ (MakeMyTrip) దేశంలో తొలిసారిగా వినూత్న సేవలకు శ్రీకారం చుట్టింది. విమానాల్లో విదేశాలకు (international flights) వెళ్లేవారికి పార్ట్ పేమెంట్ (part payment) ఆప్షన్‌ను ప్రవేశపెట్టింది. మొత్తం ఛార్జీలో తొలుత 10 నుండి 40 శాతం మధ్య చెల్లించాల్సి ఉంటుంది. మిగిలిన మొత్తాన్ని ప్రయాణ తేదీకి ముందు లేదా టికెట్ బుక్ చేసిన 45 రోజుల్లోగా పూర్తి చేయాలి.పార్ట్ పేమెంట్ ఆప్షన్ని ఎంచుకునే కస్టమర్లు చార్జీ మొత్తాన్ని చెల్లించిన తర్వాత నిబంధనల ప్రకారం ధృవీకరించిన బుకింగ్‌లను సవరించుకోవచ్చని మేక్మైట్రిప్ తెలిపింది. ‘పెద్ద కుటుంబాలు, బృందాలు ఒకేసారి మొత్తం టికెట్ చార్జీని చెల్లించడం భారం అవుతుంది. అటువంటి వారికి పార్ట్ పేమెంట్ ఆప్షన్ సౌకర్యవంతంగా చెల్లించేందుకు వీలు కల్పిస్తుంది’ అని కంపెనీ సీవోవో సౌజన్య శ్రీవాస్తవ తెలిపారు.కాగా, ఎక్కువ మందిని అంతర్జాతీయ ప్రయాణాలకు ప్రోత్సహించేందుకు పార్ట్ పేమెంట్ ఆప్షన్ దోహద పడుతుందని రిటైల్ రంగ నిపుణులు కలిశెట్టి నాయుడు తెలిపారు. ‘ఇటువంటి సౌకర్యంతో విమానయాన సంస్థలకు క్యాష్ రొటేషన్ అవుతుంది. విద్యార్థులు, వ్యాపారస్తులకు చెల్లింపుల సౌలభ్యం ఉంటుంది’ అని వివరించారు. ఈ కొత్త ఫీచర్ సుదూర, స్వల్ప-దూర అంతర్జాతీయ విమానాలను, ముఖ్యంగా రూ. 1 లక్షకుపైగా టిక్కెట్లను బుక్ చేసుకునే ప్రయాణికులను ఆకట్టుకుంటోందని కంపెనీ పేర్కొంది. దీనిపై సానుకూల ప్రారంభ స్పందన వచ్చిందని చెప్పిన కంపెనీ ఈ ఫీచర్ కస్టమర్లకు ప్రయాణ బుకింగ్ అనుభవాన్ని మరింత మెరుగుపరుస్తుందని ఆశిస్తోంది.ఇలా పని చేస్తుందంటే..కొత్తగా ప్రవేశపెట్టిన పార్ట్ పేమెంట్ ఆప్షన్ మొత్తం ఛార్జీలో కేవలం 10-40% ముందుగా చెల్లించడం ద్వారా నిర్ధారిత బుకింగ్‌లను పొందేందుకు ప్రయాణికులను అనుమతిస్తుంది. ఖచ్చితమైన శాతం విమానయాన సంస్థ, ప్రయాణ మార్గం, బుకింగ్ విండో వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది.మిగిలిన మొత్తాన్ని ప్రయాణ తేదీకి ముందు లేదా బుకింగ్ చేసిన 45 రోజులలోపు, ఏది ముందు అయితే అది ఎలాంటి అదనపు ఛార్జీలు లేకుండా చెల్లించవచ్చు. పూర్తి చెల్లింపు చేసిన తర్వాత, వినియోగదారులు ఛార్జీల నిబంధనల ప్రకారం ధ్రువీకరించిన బుకింగ్‌లను సవరించవచ్చు.ఇది కాకుండా జీరో క్యాన్సిలేషన్, ఫేర్ లాక్ ఫీచర్లతో పాటు ఉచితంగా ప్రయాణ తేదీని మార్చుకునే వెసులుబాటును కూడా మేక్మైట్రిప్ కల్పిస్తోంది. ఈ ఫీచర్ ద్వారా ప్రయాణికులు బయలుదేరడానికి రెండు గంటల ముందు వరకు విమానాలను రీషెడ్యూల్ చేయడానికి అవకాశం ఉంటుంది. -
ఈ క్రెడిట్ కార్డులు కనిపించవు! కానీ ఖర్చు చేయొచ్చు..
దేశంలో ఆర్థిక కార్యకలాపాలు, చెల్లింపు వ్యవస్థలో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. క్రెడిట్ కార్డులు విస్తృతంగా పెరిగిపోయాయి. వీటికితోడు అనుకూలమైన, సురక్షితమైన చెల్లింపు ఎంపికగా వర్చువల్ క్రెడిట్ కార్డ్‌లు ఉద్భవించాయి. సాంప్రదాయ భౌతిక క్రెడిట్ కార్డ్‌ల మాదిరిగా చోరీకి గురవ్వడం, పోగొట్టుకోవడం వంటి సమస్యలు వర్చువల్ క్రెడిట్ కార్డ్‌లతో ఉండవు.ఏమిటీ వర్చువల్ క్రెడిట్ కార్డ్?వర్చువల్ క్రెడిట్ కార్డ్ అనేది భౌతిక క్రెడిట్ కార్డుకు డిజిటల్ రూపం. 16-అంకెల కార్డ్ నంబర్, సీవీవీ (CVV), గడువు తేదీతో సహా భౌతిక కార్డుకు ఉన్న అన్ని ముఖ్యమైన వివరాలూ దీనికీ ఉంటాయి. సాధారణంగా వర్చువల్ క్రెడిట్ కార్డ్ అనేది స్వల్పకాలిక కార్డ్. ఇది మీ ప్రస్తుత క్రెడిట్ కార్డ్‌కి యాడ్-ఆన్‌గా పనిచేస్తుంది. పరిమిత సంఖ్యలో లావాదేవీలను అనుమతిస్తుంది.ఎలా పని చేస్తుంది?వర్చువల్ క్రెడిట్ కార్డ్ ఫిజికల్ క్రెడిట్ కార్డ్ లాగానే పని చేస్తుంది. అయితే మెరుగైన భద్రతా లక్షణాలను అందిస్తుంది. వర్చువల్ కార్డ్‌ని ఉపయోగించి చెల్లింపు చేసినప్పుడు, వన్-టైమ్ పాస్వర్డ్ (OTP) వస్తుంది. మోసం ప్రమాదాన్ని గణనీయంగా తగ్గిస్తుంది.ఉపయోగించండిలా..» వర్చువల్ క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగించడం సూటిగా ఉంటుంది. ఫిజికల్ కార్డ్‌ని స్వైప్ చేయాల్సిన అవసరం లేదు.» మీరు చెల్లింపు చేయాలనుకుంటున్న వెబ్‌సైట్‌కు వెళ్ళండి. » వర్చువల్ క్రెడిట్ కార్డ్ చెల్లింపు ఎంపికను ఎంచుకోండి.» మీ వర్చువల్ క్రెడిట్ కార్డ్ నంబర్, గడువు తేదీ, సీవీవీని నమోదు చేయండి.» తర్వాత, మీ రిజిస్టర్డ్ ఫోన్‌కు ఓటీపీ వస్తుతంది. ఇది కొన్ని నిమిషాలే చెల్లుబాటు అవుతుంది.» ఓటీపీని ఎంటర్ చేసి చెక్అవుట్ ప్రక్రియను పూర్తి చేయండి.వర్చువల్ క్రెడిట్ కార్డ్ ప్రయోజనాలు» వర్చువల్ క్రెడిట్ కార్డ్‌లను మీ ఫోన్ లేదా ఆన్లైన్ ఖాతాల ద్వారా సులభంగా యాక్సెస్ చేయవచ్చు. భౌతిక కార్డ్‌ని తీసుకెళ్లాల్సిన అవసరాన్ని తొలగిస్తుంది.» భౌతిక కార్డ్‌ని కోల్పోయే ప్రమాదం ఉండదు. మోసపూరిత లావాదేవీల నుండి వినియోగదారులను రక్షించడానికి అనేక ప్లాట్‌ఫామ్‌లు అంతర్నిర్మిత డిజిటల్ మోస నివారణ సాధనాలను కూడా అందిస్తాయి.» వర్చువల్ క్రెడిట్ కార్డ్ కోసం ఖర్చు పరిమితులు, గడువు తేదీలను సెట్ చేయవచ్చు. ఇది మెరుగైన ఆర్థిక నిర్వహణకు అధిక వ్యయం చేసే ప్రమాదాన్ని తగ్గిస్తుంది.వర్చువల్ క్రెడిట్ కార్డ్ పరిమితులు» వర్చువల్ క్రెడిట్ కార్డ్‌లను ప్రధానంగా ఆన్లైన్ చెల్లింపుల కోసం రూపొందించారు. భౌతిక కార్డ్‌ల వంటి ఆఫ్‌లైన్ లావాదేవీల కోసం వీటిని ఉపయోగించలేరు.» ఆన్లైన్ రిటైలర్లందరూ వర్చువల్ క్రెడిట్ కార్డ్‌లను అంగీకరించరు. దీంతో ఆన్లైన్ కొనుగోళ్లకు ఇబ్బంది కలుగుతుంది.» వర్చువల్ క్రెడిట్ కార్డ్‌లు సాధారణంగా తాత్కాలిక చెల్లుబాటును కలిగి ఉంటాయి. సాధారణంగా ఇది 24 నుండి 48 గంటల వరకు ఉంటుంది. అయితే ఇది జారీ చేసే సంస్థను బట్టి మారవచ్చు.టాప్ ఫ్రీ వర్చువల్ క్రెడిట్ కార్డ్‌లు ఇవే..దేశంలో వర్చువల్ క్రెడిట్ కార్డ్‌లను బ్యాంకులు అలాగే నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు (NBFC) అందిస్తాయి. దేశంలోని ప్రధాన బ్యాంకులు అందించే కొన్ని టాప్ వర్చువల్ క్రెడిట్ కార్డ్‌ల వివరాలు ఇక్కడ అందిస్తున్నాం. హెచ్డీఎఫ్సీ (HDFC) బ్యాంక్ హెచ్డీఎఫ్సీ నెట్సేఫ్ వర్చువల్ క్రెడిట్ కార్డ్, యాక్సిస్ బ్యాంక్ (Axis Bank) ఫ్రీఛార్జ్ క్రెడిట్ కార్డ్, కోటక్ మహీంద్రా బ్యాంక్ (Kotak Mahindra Bank) నెట్ కార్డ్ (Netc@rd), హెచ్ఎస్బీసీ (HSBC) బ్యాంక్ అడ్వాంటేజ్ వర్చువల్ కార్డ్, ఎస్బీఐ (SBI) కార్పొరేట్ వర్చువల్ కార్డ్ పేరుతో వర్చువల్ కార్డులు అందిస్తున్నాయి. -
వాట్సప్ పేమెంట్‌ను ఇక అందరూ వాడొచ్చు
న్యూఢిల్లీ: సామాజిక మాధ్యమ యాప్ అయిన వాట్సాప్‌లో ఇంతకాలం కేవలం కొద్ది మందికి మాత్రమే ఇతరులకు నగదు బదిలీ వెసులుబాటు ఉండగా ఇకపై అందరికీ ఆ అవకాశం దక్కనుంది. అతి త్వరలోనే ఈ చెల్లింపుల సదుపాయం దేశవ్యాప్తంగా అందుబాటులోకి రానుంది. టెక్స్ మెసేజ్‌లు, ఫొటోలు, ఆడియోలు, వీడియోలు షేర్చేసుకోవడంలో భారత్‌లో అగ్రగామి సోషల్‌మీడియా యాప్‌గా వర్ధిల్లుతున్న వాట్సాప్ ఇకపై పేమెంట్ యాప్‌గానూ ఎదిగే అవకాశాలు మెరుగయ్యాయి. దేశంలో ఆన్లైన్ చెల్లింపులపై నియంత్రణ బాధ్యతలు చూసే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్పీసీఐ) గతంలో వాట్సాప్‌కు కేవలం భారత్‌లోని 10 కోట్ల మంది యూజర్లకు మాత్రమే పేమెంట్స్ ఆప్షన్ ఇచ్చారు.తాజాగా ఆ పరిమితిని ఎత్తేశారు. దీంతో ఇకపై యూజర్లు అందరూ వాట్సాప్ ద్వారా నగదు చెల్లింపుల సేవలను వినియోగించుకోవచ్చని ‘వాట్సాప్ పే’ బహిరంగంగా అధికారికంగా స్మార్ట్ఫోన్లలో ఒక నోటిఫికేషన్ ఇచ్చింది. మొదట్నుంచి చూస్తే యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్(యూపీఐ) చెల్లింపుల సేవలు విస్తరించుకోవడంపై వాట్సాప్‌కు ఎన్పీసీఐ దశలవారీగా పరిమితిని పెంచుతూ వచ్చింది. 2020 సంవత్సరంలో కేవలం 4 కోట్ల మంది వాట్సాప్ యూజర్లకు మాత్రమే యూపీఐ పేమెంట్స్ ఆప్షన్ ఇచ్చారు. తర్వాత రెండేళ్లకు ఆ పరిమితిని 10 కోట్ల మంది యూజర్లకు అనుమతి మంజూరు చేశారు. భారత్‌లో రోజురోజుకూ విస్తరిస్తున్న డిజిటల్ నగదు చెల్లింపుల వ్యవస్థను దృష్టిలో ఉంచుకుని ఎన్పీసీఐ తాజాగా ఈ పరిమితిని ఎత్తేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. 13 బిలియన్ల లావాదేవీలుభారత్లో ఇప్పుడు యూపీఐ లావాదేవీలు ఎవరూ ఊహించనంతగా పెరిగిపోయాయి. నెలకు కనీసం 1300 కోట్ల లావాదేవీలు జరుగుతున్నాయి. వీటిలో ప్రధానంగా గూగుల్ పే, ఫోన్‌పే యాప్‌లలోనే దాదాపు 85 శాతం లావాదేవీలను యూజర్లు పూర్తిచేస్తున్నారు. దేశంలో వాట్సాప్ యాప్‌ను ఏకంగా 50 కోట్ల మంది యూజర్లు వాడుతున్నారు. ఇంతపెద్ద సంఖ్యలో యూజర్లు ఉన్న వాట్సాప్ ఇప్పుడు యూపీఐ పేమెంట్స్‌ను విస్తరిస్తే దేశంలోనే అగ్రగామి పేమెంట్ యాప్‌గానూ దూసుకుపోనుందని మార్కెట్ వర్గాలు అంచనావేస్తున్నాయి. దీంతో వాట్సాప్ మాతృసంస్థ మెటాకు ఎంతో ప్రయోజనం చేకూరనుంది. ఇటీవల మెటా తమ కృత్రిమేథ ఉపకరణం అయిన ‘మెటా ఏఐ’ను అందుబాటులోకి తెచ్చింది.దీనికి భారత్‌లో చక్కటి ప్రజాదరణ దక్కింది. గతంలో మాదిరే వాట్సాప్ పే విభాగం యూపీఐ వారి థర్ట్ పార్టీ అప్లికేషన్ ప్రొవైడర్ నిబంధనావళిని పాటించాల్సి ఉంటుంది. భారతీయ రిజర్వ్ బ్యాంక్, భారతీయ బ్యాంక్‌ల సమాఖ్య(ఐబీఏ)లు సంయుక్తంగా యూజర్లు అత్యంత వేగంగా నగదు బదిలీ చేసుకునేందుకు వీలుగా ఎన్పీసీఐను ఏర్పాటుచేశాయి. ఎన్పీసీఐ ఆధ్వర్యంలోనే యూపీఐ చెల్లింపుల వ్యవస్థ పనిచేస్తోంది. -
మైనింగ్‌పై కూటమి పిడుగు
కొలిమిగుండ్ల: నాపరాతి గనుల యజమానులపై మరో పిడుగు పడింది. ఇప్పటికే నష్టాల్లో కూరుకుపోయిన పరిశ్రమపై మళ్లీ కూటమి ప్రభుత్వం మరో బాదుడుకు రంగం సిద్ధం చేసింది. పెండింగ్‌లో ఉన్న కన్సిడరేషన్ ఫీజు బకాయిలు చెల్లించాలని లీజుదారులకు ఆదేశాలు అందాయి. దీంతో మంగళవారం మైనింగ్ యజమానులు బందార్లపల్లె క్రాస్ రోడ్డులోని రాయల్టీ చెక్‌పోస్టు వద్ద నిరసనకు దిగారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు భూగర్భ గనుల శాఖ అధికారులు కన్సిడరేషన్ ఫీజు బకాయిలు చెల్లించాలని ఆన్లైన్లో ఆదేశించడంతో మైనింగ్ యజమానులు షాక్ గురయ్యారు. ఒక్కో లీజుదారుడు రూ.20 లక్షలు మొదలుకొని రూ.60 లక్షల వరకు చెల్లించాలని ఆన్లైన్లో చూపిస్తుండటంతో కంగుతిన్నారు. గతంలో రాయల్టీలు (పర్మిట్లు) తీసుకున్న వారంతా బల్క్‌గా కేటాయించిన అమౌంట్‌ను 2025 జనవరి 10వ తేదీలోగా చెల్లించాలని డెడ్‌లైన్ విధించారు. లేదంటే పర్మిట్లు రద్దవుతాయని హెచ్చరికలు జారీ చేశారు. ఇకపై కన్సిడరేషన్ మొత్తాన్ని బల్క్‌గా కాకుండా ప్రతి పర్మిట్‌పై వసూలు చేసేందుకు రంగం సిద్ధమైంది.మైనింగ్ లీజుదారులు ఆన్లైన్లో రాయల్టీ పొందాలంటే డీఎంఎఫ్తో కలిసి రూ.482 చెల్లించేవారు. ఇకపై ప్రతి రాయల్టీపై కన్సిడరేషన్ మొత్తాన్ని సైతం చెల్లించాల్సి వస్తోంది. అంటే రాయల్టీపై యజమానులకు అదనపు భారం పడనుంది. లక్షలాది రూపాయలు జరిమానా రూపంలో డెడ్‌లైన్ విధించి మరీ చెల్లించాలనడంతో యజమానులు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. బనగానపల్లె నియోజకవర్గంలో దాదాపు 1,150 హెక్టార్లలో మైనింగ్ జరుగుతుండగా.. 600 మందికిపై లీజుదారులు ఉన్నారు. ఈసీ, మైనింగ్ ప్లానింగ్ తదితర రికార్డులు ఉన్న లీజుదారులకు మాత్రమే రాయల్టీలు వస్తున్నాయి. మిగిలిన లీజుదారులకు కూటమి ప్రభుత్వం దాదాపు 3 నెలల నుంచి ఆన్లైన్ రాయల్టీలు విడుదల చేయకపోవడంతో చాలామంది యజమానులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ఆందోళనతో స్తంభించిన రవాణారాయల్టీ చెక్‌పోస్టు వద్ద మైనింగ్ యజమానులు ఆందోళనతో నాపరాళ్లను రవాణా చేసే ట్రాక్టర్లు, లారీలతో పాటు ఆర్టీసీ బస్సులు, కార్లు ఇతర వాహనాలు ఇరువైపులా భారీగా నిలిచిపోయాయి. గంటన్నర పాటు ఎక్కడి వాహనాలు అక్కడే ఉండిపోయాయి. ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడ్డారు. విషయం తెలుసుకున్న సీఐ రమేష్‌బాబు రాయల్టీ చెక్‌పోస్టు వద్దకు చేరుకుని మైనింగ్ యజమానులతో చర్చించి నిలిచిపోయిన వాహనాలను పంపించారు. ధర్నాలో టీడీపీ నాయకులు పాల్గొని ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేయడం కొసమెరుపు. -
గోల్డ్ లోన్ చెల్లింపు విధానంలో మార్పులు
బంగారంపై రుణాల కోసం బ్యాంకులు, గోల్డ్ లోన్ అందించే సంస్థలు నెలవారీ చెల్లింపు ప్రణాళికలను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ప్రస్తుత రుణ పంపిణీ ప్రక్రియలో అంతరాలను గుర్తించినట్లు ఇటీవల విడుదల చేసిన సర్క్యులర్‌లో వెల్లడించింది. కొత్తగా అమలు చేయాలనుకుంటున్న విధానం ప్రకారం రుణగ్రహీతలు లోన్ ప్రారంభమైనప్పటి నుంచే ఈఎంఐల ద్వారా ఏకకాలంలో వడ్డీ, అసలు చెల్లించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.ఇప్పటి వరకు ఉన్న పరిస్థతిబంగారు ఆభరణాలపై రుణం తీసుకునేవారు నిర్ణీత కాలం తర్వాత వడ్డీతో కలిపి మొత్తం అప్పు తీరుస్తున్నారు. వినియోగదారుల వద్ద నగదు ఉన్నప్పుడు పాక్షికంగా రుణం చెల్లించే అవకాశం ఉంది. కానీ నెలవారీ ఈఎంఐ పద్ధతి లేదు. ఒకవేళ రుణగ్రహీతలకు రుణ కాలావధి కంటే ముందే డబ్బు సమకూరితే ఒకేసారి రుణం తీర్చే వెసులుబాటు అయితే ఉంది.ప్రతిపాదిత విధానంబంగారంపై రుణాలిచ్చే బ్యాంకులు, వివిధ ఆర్థిక సంస్థలు తనఖా పెట్టుకుని అప్పు ఇచ్చిన నెల నుంచి వడ్డీ, అసలును ఏకకాలంలో ఈఎంఐ రూపంలో చెల్లించేలా ప్రతిపాదనలున్నాయి. ఆర్థిక సంస్థలు కూడా రుణగ్రహీతలకు లోన్లు ఇచ్చేందుకు వీలుగా టర్మ్ లోన్లును తీసుకోవచ్చనేలా విధానాల్లో మార్పులు తీసుకురాబోతున్నట్లు సమాచారం.ఇదీ చదవండి: ఆరేళ్లలో రూ.84 లక్షల కోట్లకు చేరే రంగం!అంతరాలు గుర్తించిన ఆర్బీఐతనఖాపెట్టిన బంగారం విలువను కొన్ని సంస్థలు సరిగ్గా లెక్కించడం లేదని ఆర్బీఐ గుర్తించింది. దాంతోపాటు అప్పు తీర్చని వారికి సంబంధించిన బంగారాన్ని వేలం వేయడంలో అవకతవలు జరుగుతున్నాయని తెలిపింది. రుణం ఇచ్చేందుకు బంగారం విలువనే ప్రాతిపదికగా తీసుకోకూడదని స్పష్టం చేసింది. అప్పు చెల్లించేవారి చెల్లింపుల రికార్డులను పరిగణనలోకి తీసుకోవాలని చెప్పింది. రుణాన్ని రోలోవర్ చేయకుండా నెలవారీ చెల్లింపు విధానాన్ని తీసుకురావాలని చూస్తున్నట్లు అధికారులు తెలిపారు. దీనిపై మరింత స్పష్టత రావాల్సి ఉంది. -
ఎన్నారైలకు శుభవార్త: యూపీఐతో రోజుకు లక్ష పంపొచ్చు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రవాస భారతీయులకు (ఎన్నారైలు) నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) తీపి కబురు అందించింది. నాన్ రెసిడెంట్ ఎక్స్టర్నల్ (ఎన్ఆర్ఈ), నాన్ రెసిడెంట్ ఆర్డినరీ (ఎన్ఆర్వో) ఖాతాలున్న ఎన్నారైలు యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) ద్వారా ఇక నుంచి రోజుకు రూ.1 లక్ష వరకు భారత్‌లోని తమ కుటుంబ సభ్యులు, ఇతర చెల్లింపులకు నగదు పంపించవచ్చు.ఎన్నారైలు ఇక నుంచి అంతర్జాతీయ మొబైల్ నంబర్‌ను ఉపయోగించి నేరుగా వారి స్మార్ట్‌ఫోన్ నుండి ఉచిత లావాదేవీల కోసం యూపీఐని ఉపయోగించవచ్చు. తద్వారా విదేశాల నుండి లావాదేవీలను నిర్వహించడం మరింత సౌకర్యవంతంగా ఉంటుంది. యూఎస్, కెనడా, యూకే, యూఏఈ, సింగపూర్, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, హాంగ్‌కాంగ్, మలేషియా, ఒమన్, ఖతార్, సౌదీ అరేబియాలోని ఎన్నారైలకు ఈ సౌకర్యం వర్తిస్తుంది. కొత్తగా నమోదైన యూపీఐ ఐడీల ద్వారా తొలి 24 గంటల్లో రూ.5,000 మాత్రమే పంపేందుకు వీలుంది. ఆ తర్వాతి రోజు నుంచి రోజుకు రూ.1 లక్ష పంపొచ్చు.ఇవీ బ్యాంకులు..యూపీఐ కోసం అంతర్జాతీయ మొబైల్ నంబర్ల అనుసంధానానికి ప్రస్తుతం హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, కెనరా బ్యాంక్, సిటీ యూనియన్ బ్యాంక్, డీబీఎస్ బ్యాంక్, ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్, నేషనల్ బ్యాంక్, సౌత్ ఇండియన్ బ్యాంక్ మద్దతు ఇస్తున్నాయి.అంతర్జాతీయ మొబైల్ నంబర్లకు అనుకూలమైన యూపీఐ అప్లికేషన్లలో ఫోన్‌పే, గూగుల్ పే, పేటీఎం, భీమ్, భీమ్ ఏయూ, ఫెడ్‌మొబైల్, ఐమొబైల్, భీమ్ ఇండస్ పే, ఎస్ఐబీ మిర్రర్ ప్లస్ వంటివి ఉన్నాయి. ఎన్నారైలు తమ ఎన్ఆర్ఈ మరియు ఎన్ఆర్వో ఖాతాల మధ్య, అలాగే భారత్‌లోని ఖాతాలకు యుపీఐ లావాదేవీలు చేయవచ్చు. ఎన్ఆర్వో ఖాతా నుండి ఎన్ఆర్ఈ ఖాతాకు నిధులను బదిలీ చేయలేరు. విభిన్న బ్యాంక్ ఖాతాలను కలిగి ఉన్న ఎన్నారైలు ప్రతి ఖాతాకు ప్రత్యేక యూపీఐ ఐడీ అవసరం. ఖాతా ఉమ్మడిగా ఉంటే ప్రాథమిక ఖాతాదారు మాత్రమే యూపీఐని ఉపయోగించగలరు. -
మీ చేయి ఊపితే చాలు పేమెంట్ అయిపోతుంది
-
నగదు రహిత చెల్లింపుల్లో అంతకుమించి..!వాట్ ఏ టెక్నాలజీ..?
ప్రస్తుతం దేశంలో నగదు రహిత చెల్లింపుల హవా పెద్ద ఎత్తున నడుస్తుంది. పెద్ద పెద్ద మాల్స్ నుంచి రోడ్లపై ఉండే చిన్నా చితక దుకాణాల వరకు అన్ని చోట్ల డిజిటల్ పేమెంట్లే. ఇప్పటి వరకు మనం ఫోన్ లేదా క్యూర్ కోడ్ స్కాన్ చేసి చెల్లింపులు చేయడం చేశాం. వాటన్నింటిని తలదన్నేలా అడ్వాన్స్డ్ టెక్నాలజీతో కూడిన మరో చెల్లింపు విధానం వచ్చేసింది. దీన్నిచూస్తే అంతకు మించి..!..అని అనకుండా ఉండలేరు. ఇంతకీ ఏంటా చెల్లింపు విధానం అంటే..సాంకేతిక రంగంలో శరవేగంగా దూసుకుపోతున్న చైనాలో ఈ సరికొత్త చెల్లింపు విధానం కనిపిస్తుంది. సాంకేతికతకు సంబంధించిన విషయంలో చైనా సాధించిన పురోగతి ప్రపంచ దేశాలను బాగా ఆకర్షిస్తాయి. అందుకు ఉదాహారణే ఈ సరికొత్త డిజిటల్ చెల్లింపు విధానం. ఔను..! చైనాలోని ఓ దుకాణంలో 'పామ్ పేమెంట్ పద్ధతి'లో చెల్లింపులు చెయ్యొచ్చు.ఇదేంటీ ఫోన్ లేదా క్యూర్ కాకుండా ఏంటీ పామ్ అంటే..? . ఏం లేదు జస్ట్ మన చేతిని స్కాన్ చేసి చెల్లించేయొచ్చు. అందుకు సంబంధించిన వీడియోని పాకిస్తాన్ కంటెంట్ క్రియేటర్ రానా హంజా సైఫ్ షేర్ చేయడంతో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఎలా చేస్తారంటే..ఏం లేదు.. జస్ట్ పామ్ పామ్ ప్రింట్ డివైజ్‌లో మీ హ్యాండ్‌ని స్కాన్ చేసి రిజిస్టర్ అవ్వాలి. ఆ తర్వాత దాన్ని మన పేమెంట్ ఇన్ఫర్మేషన్నికి లింక్ అప్ చేస్తే చాలు. అంటే ఇక్కడ..ఒట్టి చేతులను స్కాన్ చేసి చెల్లింపులు చేసేయొచ్చు అన్నమాట. ఇది కాస్త భద్రతతో కూడిన సాంకేతికత. పైగా ఎలాంటి సమస్యలు ఉండవు. దీన్ని చూస్తే కచ్చితంగా వాటే టెక్నాలజీ గురూ..! అనాలనిపిస్తోంది కదూ..!. View this post on Instagram A post shared by Rana Hamza Saif ( RHS ) (@ranahamzasaif) (చదవండి: టెక్ మిలియనీర్ బ్రయాన్ జాన్సన్ జుట్టు సంరక్షణ చిట్కాలు..!) -
దివ్యాంగుల కోసం ఆర్బీఐ..
దివ్యాంగులకు (పీడబ్ల్యుడీ) డిజిటల్ చెల్లింపు విధాన్ని మరింత మెరుగుపరిచే లక్ష్యంతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. డిజిటల్ చెల్లింపులు అన్ని వర్గాలలో బాగా ప్రాచుర్యం పొందుతున్న తరుణంలో బ్యాంకులు, నాన్-బ్యాంకింగ్ పేమెంట్ ప్రొవైడర్లు.. చెల్లింపులను సమీక్షించి, సవరించాలని ఆర్బీఐ ఆదేశించింది.పీడబ్ల్యుడీల సౌలభ్యాన్ని దృష్టిలో ఉంచుకుని సిస్టమ్‌లు, పరికరాలు.. పాయింట్ ఆఫ్ సేల్ (POS) మెషీన్ల వంటి చెల్లింపు మౌలిక సదుపాయాలు యూజర్ ఫ్రెండ్లీగా ఉండాలి. ఇవన్నీ ఆర్థిక మంత్రిత్వ శాఖ నిర్దేశించిన యాక్సెసిబిలిటీ ప్రమాణాలకు కట్టుబడి ఉండాలని పేర్కొన్నారు.చెల్లింపు వ్యవస్థలకు అవసరమైన మార్పులను చేపడుతున్నప్పుడు, భద్రతా అంశాలలో రాజీ పడకుండా చూసుకోవాలని ఆర్బీఐ పేర్కొంది. అంతే కాకుండా.. ఆర్బీఐ ఈ సర్క్యులర్‌ను జారీ చేసిన ఒక నెలలోపు సమగ్ర నివేదికను సమర్పించాలని పీఎస్పీలను ఆదేశించింది. నివేదికలో ఈ మార్పులను అమలు చేయడానికి సమయానుకూల కార్యాచరణ ప్రణాళికను కూడా చేర్చాలి. -
Property Tax: ఇక నెలవారీగా ఆస్తి పన్ను చెల్లింపులు..!
సాక్షి, సిటీబ్యూరో: ఆస్తి పన్ను సంవత్సరంలో రెండు దఫాలుగా ఆర్నెల్లకోసారి చెల్లించే విధానం ప్రస్తుతం అమల్లో ఉంది. ఇకనుంచి అలా కాకుండా ఏకమొత్తంలో ఆర్థిక సంవత్సరం మొదటి నెలలోనే చెల్లించేవారికి ‘ఎర్లీబర్డ్’ ద్వారా అయిదు శాతం రాయితీ సదుపాయం ఉంది. ఆస్తిపన్ను ఏడాదికో, ఆర్నెల్లకో కాకుండా కరెంటు బిల్లు మాదిరిగానే నెలనెలా చెల్లిస్తే తమకు సదుపాయంగా, పెద్ద భారంగా కనిపించకుండా ఉంటుందని భావిస్తున్నవారూ ఉన్నారు. అలాంటి వారికి సదుపాయంగా ఆస్తిపన్నును సైతం నెలనెలా చెల్లించే విధానాన్ని ప్రభుత్వం త్వరలో అందుబాటులోకి తేనుంది. అంతేకాదు.. ఆస్తిపన్ను, కరెంటు, నల్లా బిల్లులు వేర్వేరు పర్యాయాలు వేర్వేరు సంస్థలకు చెల్లించనవసరం లేకుండా ఒకే విండో ద్వారా, ఏకకాలంలో అన్ని పనులు నెలవారీగా చెల్లించే సదుపాయం కలి్పంచేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇంటింటి నుంచి చెత్త సేకరించే వారికి చెల్లించే మొత్తాన్ని కూడా వాటితో పాటే చెల్లించే సదుపాయం అందుబాటులోకి తేవాలనుకుంటోంది. సీఎం ఆలోచనతో.. 👉 గ్రేటర్ పరిధిలో ప్రస్తుతమున్న పన్నుల విధానాన్ని సరళీకృతం చేసేందుకు ప్రభుత్వం యోచిస్తోంది. సిటీలో ప్రస్తుతం ఆస్తి పన్నులను జీహెచ్ఎంసీ, నల్లా బిల్లులను హైదరాబాద్ జలమండలి వసూలు చేస్తున్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలోని నివాసాలకు నెలకు 20 వేల లీటర్ల వరకు తాగు నీటిని ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేస్తోంది. అంతకు మించి నీటిని వాడుతున్న అపార్ట్మెంట్ల నుంచి మాత్రమే నల్లా బిల్లులను జలమండలి వసూలు చేస్తోంది. జీహెచ్ఎంసీ ఆస్తి పన్ను ఆర్నెల్లకోసారి చెల్లించే సదుపాయం ఉండగా, జలమండలి నల్లా బిల్లులను నెలకోసారి జారీ చేస్తోంది. ఇంటింటికీ తిరిగి చెత్త సేకరించేందుకు కొన్ని ప్రాంతాల్లో నామమాత్రంగా రూ.50 వసూలు చేస్తున్నారు. ఈ బిల్లుల చెల్లింపు వినియోగదారులకు మరింత వెసులుబాటుగా ఉండేలా కొత్త విధానం ఉండాలనే తలంపులో సీఎం రేవంత్‌రెడ్డి ఉన్నారు. ఇటీవల అధికారులతో చర్చల సందర్భంగా ఈ అంశాన్ని ప్రస్తావించారు. 👉 డిస్కంలు ప్రతి నెలా కరెంట్ బిల్లు పద్ధతి ప్రకా రం జారీ చేస్తున్నాయి. గడువు తేదీలోగా చెల్లించే విధానం అనుసరిస్తున్నాయి. యూపీఐ ద్వారా ఆన్లైన్లోనే ప్రతి నెలా కరెంట్ బిల్లు చెల్లించే సదుపాయం అందుబాటు లో ఉంది. దీంతో వినియోగదారులు క్రమం తప్పకుండా బిల్లులు చెల్లిస్తున్నారు. ఇదే తరహాలో ఆస్తి పన్ను, నల్లా బిల్లు, చెత్త సేకరణ బిల్లు కూడా నెల వారీగా జారీ చేసే లా కొత్త విధానం పై అధికారులు కసరత్తు చేస్తున్నారు. అలా చేయడంవల్ల ఒకేసారి ప్రజలపై ఎక్కువ ఆర్థిక భారం పడకుండా ఉంటుందని, సులభ వాయిదాల పద్ధతిలో బిల్లులు చెల్లించినట్లు ఉంటుందని వచ్చిన విజ్ఞప్తులు, అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్న సీఎం నెల నెలా బిల్లుల జారీకి ఉన్న సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. యూపీఐతో పాటు అన్ని ఈ పేమెంట్ ప్లాట్ ఫామ్ ల ద్వారా నెల నెలా ఈ బిల్లులు చెల్లించేలా సిటిజన్ ప్రెండ్లీ ఈజీ పేమెంట్ విధానం ఉండాలని సూచించారు.కరెంట్ బిల్లు చెల్లించకుంటే గడువు దాటిన తర్వాత అపరాధ రుసుము విధింపుతో పాటు కరెంటు కట్ చేసేలా చర్యలు ప్రస్తుతం అమల్లో ఉన్నాయి. అలాగే కొత్త గా జీహెచ్ఎంసీ, జలమండలి అనుసరించే విధానంలోనూ ఆస్తి పన్ను, నల్లా బిల్లులకు కూడా నిరీ్ణత గడువు ఉండాలని, గడువు దాటితే ఒకదానికొకటి లింక్ ఉండేలా తగిన చర్యలకు అధికారులు కసరత్తు చేయనున్నారు.సక్రమంగా చెల్లించేవారికి ప్రోత్సాహకాలు.. క్రమం తప్పకుండా బిల్లులు చెల్లించే వారికి ప్రోత్సాహకాలు కూడా ఇవ్వాలని ముఖ్యమంత్రి సూచించారు. అలాంటి వారికి ఆర్థిక సంవత్సరం చివరి నెల బిల్లులో రాయితీలు ఇవ్వాలని, లేదా కాలనీల వారీగా కొందరికి బహుమతులు ఇవ్వాలనే ఆలోచనలున్నాయి. బిల్లుల చెల్లింపుల విషయంలో కచి్చతంగా ఉన్నట్లుగా అంతే బాధ్యతగా మున్సిపల్ సేవలను మహా నగర ప్రజలకు అందించే విషయంలో జవాబుదారీగా ఉండాలని ముఖ్యమంత్రి అధికారులను అప్రమత్తం చేశారు.భారీ బకాయిలకు అడ్డుకట్ట.. నెలనెలా ఆస్తిపన్ను విధానం వల్ల బకాయిలు పేరుకుపోకుండా ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం బకాయిలపై నెలకు 2 శాతం చొప్పున పెనాల్టీ విధిస్తుండటంతో చాలామందికి అసలు కంటే పెనాలీ్టల భారం ఎక్కువ కావడంతో చెల్లించడంలేదు. ముఖ్యంగా, వాణిజ్య కార్యక్రమాలు నిర్వహిస్తున్న భవనాల యజమానులు వీరిలో ఎక్కువగా ఉన్నారు. వన్‌టైమ్ సెటిల్మెంట్ల ద్వారా పెనాలీ్టల్లో 90 శాతం రాయితీలిచ్చినప్పటికీ చెల్లించని వారూ ఉన్నారు. నెలనెలా చెల్లించే విధానంతో, ఎప్పటికప్పుడు చర్యలు తీసుకునే అవకాశం ఉన్నందున ఆస్తిపన్ను బకాయిలు భారీగా పేరుకుపోకుండా ఉంటాయనే అభిప్రాయాలున్నాయి. -
SmilePay: నగదు చెల్లింపునకు ఓ ‘నవ్వు’ చాలు!
ప్రైవేట్ రంగ బ్యాంక్ ఫెడరల్ బ్యాంక్ సరికొత్త డిజిటల్ చెల్లింపు వ్యవస్థను తీసుకొచ్చింది. ‘స్మైల్ పే’ అనే ఫేషియల్ పేమెంట్ సిస్టమ్‌ను ప్రారంభించింది. దీంతో కస్టమర్లు కేవలం కెమెరాను చూసి నవ్వుతూ చెల్లింపులు జరపవచ్చు. ఈ సేవతో డబ్బు లావాదేవీల కోసం మీకు నగదు, కార్డ్ లేదా మొబైల్ అవసరం ఉండదు. రిలయన్స్ రిటైల్, అనన్య బిర్లాకు చెందిన ఇండిపెండెంట్ మైక్రో ఫైనాన్స్ ద్వారా కొన్ని ఎంపిక చేసిన శాఖలలో దీని వినియోగం ఇప్పటికే ప్రారంభమైంది.పైలట్ ప్రాజెక్టుప్రస్తుతం ఈ సదుపాయాన్ని పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించారు. ఈ చెల్లింపు వ్యవస్థ 'భీమ్ ఆధార్ పే'పై ఆధారపడి ఉంటుంది. దీనిపై నిర్మించిన అప్‌గ్రేడెడ్ ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీని ఇది ఉపయోగించుకుంటుంది. యూజర్లు తమ ఫేస్‌ను స్కాన్ చేయడం ద్వారా చెల్లింపులు చేయడానికి వీలు కల్పిస్తుంది. దీంతో కార్డు లేదా మొబైల్ లేకుండా కూడా వ్యాపారులకు చెల్లింపులు చేయగలరు. మొత్తం లావాదేవీ ప్రక్రియ రెండు దశల్లో పూర్తవుతుంది.స్మైల్‌పే ఫీచర్లుస్మైల్పే ద్వారా నగదు, కార్డ్ లేదా ఫోన్‌ని తీసుకెళ్లకుండానే మీ లావాదేవీని పూర్తి చేయవచ్చు. దీనితో పాటు, ఈ సదుపాయాన్ని ప్రవేశపెట్టడం వల్ల కౌంటర్ వద్ద రద్దీ నుండి ఉపశమనం లభిస్తుంది. సురక్షితమైన ఆధార్ ఫేస్ రికగ్నిషన్ సర్వీస్ ఆధారంగా చేసే లావాదేవీలతో భద్రత చింత ఉండదు. స్మైల్‌పే ఫీచర్ ఫెడరల్ బ్యాంక్ కస్టమర్లకు మాత్రమే ప్రత్యేకంగా అందుబాటులో ఉంటుంది. దీని కోసం వ్యాపారులు, వినియోగదారులు ఇద్దరూ ఆ బ్యాంకులో ఖాతాలను కలిగి ఉండాలి. రాబోయే రోజుల్లో ఈ వ్యవస్థను మరింత విస్తరించాలని ఫెడరల్ బ్యాంక్ యోచిస్తోంది.ఎలా పనిచేస్తుందంటే..స్మైల్పేను వినియోగించాంటే మొబైల్లో ఫెడ్ మర్చెంట్ (FED MERCHANT) అనే యాప్ ఉండాలి.ఫెడరల్ బ్యాంక్‌తో అనుసంధానమైన దుకాణాల్లో షాపింగ్ చేసి బిల్లు చెల్లింపు సమయంలో స్మైల్ పే ఎంచుకోవాలి. తర్వాత దుకాణదారు.. కస్టమర్ ఆధార్ నంబర్‌ను నమోదు చేసి యాప్ ద్వారా చెల్లింపును ప్రారంభిస్తారు. దుకాణదారు మొబైల్ కెమెరా కస్టమర్ ఫేస్‌ను స్కాన్ చేస్తుంది. ఆధార్ సిస్టమ్ ఆధారంగా ఫేస్ రికగ్నిషన్ డేటాతో సరిపోల్చుకుని చెల్లింపు పూర్తవుతుంది. కస్టమర్ ఖాతా నుండి డబ్బు దుకాణదారుడి ఖాతాలో జమవుతుంది. -
హాయ్, నేను సీజేఐని... క్యాబ్‌కు రూ.500 పంపండి!
న్యూఢిల్లీ: సైబర్ నేరగాళ్లు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కూడా వదలడం లేదు. సీజేఐ పేరిట ఒక వ్యక్తిని రూ.500 అడిగారు! సదరు స్కామర్ తనను తాను సీజేఐ జస్టిస్ డి.వై.చంద్రచూడ్‌గా చెప్పుకున్నాడు. ‘‘హలో! నేను సీజేఐని. కొలీజియం అత్యవసర భేటీకి వెళ్లాల్సి ఉంది. కన్నాట్ ప్లేస్‌లో చిక్కుకున్నాను. క్యాబ్ కోసం రూ.500 పంపగలరా! కోర్టుకు చేరగానే తిరిగి పంపిస్తా’’ అంటూ మెసేజ్ చేశాడు. అది నిజమైందేనని నమ్మించడానికి ఐ పాడ్ నుంచి పంపుతున్నట్టు కూడా చెప్పుకొచ్చాడు. అయితే దాన్నిండా స్పెల్లింగ్, వ్యాకరణ దోషాలే ఉండటం విశేషం! ఈ నకిలీ మెసేజ్ వైరల్‌గా మారింది. దాన్ని కైలాశ్ మేఘ్వాల్ అనే వ్యక్తి ఎక్స్‌లో పోస్టు చేశారు. ‘ఫ్రెండ్స్, ఏం చేద్దాం మరి!’ అంటూ కామెంట్ చేశారు. ఈ వైరల్ పోస్టును సుప్రీంకోర్టు పరిగణనలోకి తీసుకుంది. సీజేఐ ఆదేశాల మేరకు సైబర్ క్రైమ్స్‌కు ఫిర్యాదు చేసింది. -
18 నుంచి ఇంటర్ ‘సప్లిమెంటరీ’ ఫీజు చెల్లింపు
సాక్షి, అమరావతి: ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల కోసం ఈనెల 18 నుంచి 24 వరకు ఫీజు చెల్లించాలని ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి సౌరభ్ గౌర్ ఓ ప్రకటనలో తెలిపారు. మార్కులు తక్కువగా వచ్చిన విద్యార్థులు రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్ కోసం ఇదే తేదీల్లో ఫీజు చెల్లించాలని సూచించారు. జవాబు పత్రాల (ఒక్కో పేపర్) రీ వెరిఫికేషన్‌కు రూ.1300, రీకౌంటింగ్‌కు రూ.260 చెల్లించాలన్నారు. సప్లిమెంటరీ పరీక్షల కోసం ఇంటర్మీడియట్ మొదటి, రెండో సంవత్సరం విద్యార్థులు పేపర్లతో సంబంధం లేకుండా రూ.550, ప్రాక్టికల్స్‌కు రూ.250, బ్రిడ్జి కోర్సులకు రూ.150 చొప్పున చెల్లించాలని పేర్కొన్నారు. ఇంటర్ మొదటి సంవత్సరంలో అన్ని పేపర్లు ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఇంప్రూవ్మెంట్ కోసం రూ.550 పరీక్ష ఫీజుతో పాటు పేపర్‌కు రూ.160 చొప్పున చెల్లించాలి. మొదటి, రెండో సంవత్సరం ఇంప్రూవ్మెంట్ రాయాలనుకుంటే.. సైన్స్ విద్యార్థులు రూ.1440, ఆర్ట్స్ విద్యార్థులు రూ.1240 చెల్లించాల్సి ఉంటుంది. పూర్తి వివరాలకు తమతమ కళాశాలల్లో సంప్రదించాలని సూచించారు. కాగా, మే 25 నుంచి జూన్ 1 వరకు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నామని, ఫీజు చెల్లింపునకు మరో అవకాశం ఉండదని, ఈ విషయం అన్ని జూనియర్ కళాశాలల ప్రిన్సిపాల్స్ గుర్తించాలని సౌరభ్ గౌర్ విజ్ఞప్తి చేశారు. -
ఎఫ్డీ రేట్లు పెంచిన ప్రముఖ బ్యాంక్
ప్రైవేటు రంగంలో సేవలందిస్తున్న బంధన్ బ్యాంక్ తన వినియోగదారులకు మరింత సేవలందించేలా చర్యలు తీసుకుంది. ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచినట్లు వెల్లడించింది. 500 రోజుల ప్రత్యేక డిపాజిట్‌పై వయో వృద్ధులకు(సీనియర్ సిటిజన్లు) 8.35 శాతం వార్షిక వడ్డీని అందిస్తున్నట్లు తెలిపింది. సాధారణ వ్యక్తులకు 7.85 శాతం వడ్డీ ఇస్తోంది. ఏడాది నుంచి వివిధ కాల వ్యవధులకు వడ్డీ రేటును 7.25 శాతంగా నిర్ణయించింది. 5-10 ఏళ్ల వ్యవధికి 5.85 శాతం వడ్డీని అందిస్తోంది. ఇదీ చదవండి.. ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ పసిడి రుణాలపై ఆర్బీఐ నిషేధం సీనియర్ సిటిజన్లకు 6.60 శాతంగా నిర్ణయించింది. పొదుపు ఖాతాలో రోజువారీ నిల్వ రూ.10 లక్షలకు మించి ఉన్న వారికి 7 శాతం వడ్డీనిస్తున్నట్లు తెలిపింది. హైదరాబాద్‌లో కొత్తగా రెండు శాఖలను ప్రారంభించినట్లు బంధన్ బ్యాంక్ వెల్లడించింది. దీంతో తెలంగాణలో మొత్తం శాఖల సంఖ్య 142కు చేరినట్లు పేర్కొంది. దేశ వ్యాప్తంగా బ్యాంకుకు 1664 శాఖలున్నాయి. -
పేటీఎంలో చైనా పెట్టుబడులపై ప్రభుత్వ ఫోకస్
న్యూఢిల్లీ: పేటీఎం పేమెంట్ సరీ్వసెస్ లిమిటెడ్ (పీపీఎస్ఎల్)లో చైనా నుంచి వచి్చన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (ఎఫ్‌డీఐ) అంతర్ మంత్రిత్వ శాఖ కమిటీ పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది. ‘పేమెంట్ అగ్రిగేటర్’ లైసెన్స్ కోసం పీపీఎస్ఎల్ 2020 నవంబర్‌లో దరఖాస్తు పెట్టుకుంది. 2022 నవంబర్‌లో ఈ దరఖాస్తును ఆర్బీఐ తిరస్కరించింది. ఎఫ్‌డీఐ మార్గదర్శకాల్లోని ప్రెస్‌నోట్ 3 నిబంధనలను పాటించడం ద్వారా తిరిగి దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఇందుకోసం కంపెనీలో ఎఫ్‌డీఐలకి కేంద్రం అనుమతి పొందాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. పేటీఎం మాతృ సంస్థ వన్97 కమ్యూనికేషన్స్ (ఓసీఎల్)లో చైనాకు చెందిన యాంట్ గ్రూప్‌కు వాటాలు ఉన్నాయి. ఆర్బీఐ సూచన మేరకు ఎఫ్‌డీఐ ప్రెస్ నోట్3 నిబంధనలను అనుసరించి, ఓసీఎల్‌లో చైనా ఎఫ్‌డీఐకి ఆమోదం కోసం పేటీఎం 2022 డిసెంబర్ 14న దరఖాస్తు చేసుకుంది. అప్పటి నుంచి ఇది కేంద్ర ప్రభుత్వం వద్ద అపరిష్కృతంగానే ఉంది. పీపీఎస్ఎల్లో చైనా పెట్టుబడులను అంతర్మంత్రిత్వ శాఖ కమిటీ అధ్యయనం చేస్తోందని, సంప్రదింపులు, విస్తృత పరిశీలన అనంతరం నిర్ణయం తీసుకుంటుందని ఈ వ్యవహారం తెలిసిన వర్గాలు తెలిపాయి. భారత్‌తో భూ సరిహద్దులను పంచుకునే దేశాల నుంచి వచ్చే ఎఫ్‌డీఐలకి ముందస్తు ఆమోదం తప్పనిసరి అంటూ కేంద్ర సర్కారు లోగడ నిబంధనలు తీసుకువచి్చంది. 2020లో చైనా–భారత్ బలగాల మధ్య గల్వాన్ లోయ ఘర్షణ తర్వాత ఈ కఠిన వైఖరికి మళ్లింది. యూజర్ల నుంచి పూర్తి మద్దతు: పేటీఎం మరోవైపు, పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ (పీపీబీఎల్) వివాదం ఎలా ఉన్నా .. యూజర్ల నుంచి తమకు పూర్తి మద్దతు లభిస్తోందని పేటీఎం ఒక బ్లాగ్‌పోస్టులో తెలిపింది. వారికి ఎటువంటి ఆటంకాలు లేకుండా సరీ్వసులను కొనసాగిస్తామని ధీమా వ్యక్తం చేసింది. నిబంధనల ఉల్లంఘన ఆరోపణలతో ఫిబ్రవరి 29 నుంచి దాదాపు అన్ని సేవలు నిలిపివేయాలంటూ పీపీబీఎల్‌ను ఆర్బీఐ ఆదేశించిన సంగతి తెలిసిందే. దరఖాస్తు చేసుకున్నాం.. ఆన్లైన్ పేమెంట్ అగ్రిగేటర్ కోసం దరఖాస్తు చేసుకున్నట్టు పేటీఎం అధికార ప్రతినిధి స్పష్టం చేశారు. గతంలో పేటీఎంలోకి వచి్చన ఎఫ్‌డీఐకి సంబంధించి తప్పనిసరి అనుమతులు పొందాలని ఆర్బీఐ సూచించినట్టు తెలిపారు. ‘‘ఇది నియంత్రపరమైన ప్రక్రియ. పేమెంట్ అగ్రిగేటర్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకునే ఎవరైనా కానీ, ఎఫ్‌డీఐ ఆమోదం పొందాల్సిందే’’అని చెప్పారు. ఈ నిబంధనలను అనుసరించి అన్ని రకాల పత్రాలతో నియంత్రణ సంస్థ వద్ద దరఖాస్తు సమరి్పంచినట్టు తెలిపారు. ఇది పరిష్కారం అయ్యేంత వరకు, కొత్త వరక్తులను చేర్చుకోకుండా, అప్పటికే చేరిన వర్తకులకు పేమెంట్ సేవలు అందించడానికి అనుమతి ఉంటుంది. ‘‘కంపెనీలో యాజమాన్య రూపం మారిపోయింది. పేటీఎం వ్యవస్థాపకుడు (శర్మ) ఇప్పడు కంపెనీలో 24.3 శాతం వాటాతో అతిపెద్ద వాటాదారుగా ఉన్నారు. ఓసీఎల్‌లో యాంట్ ఫైనాన్షియల్ పెట్టుబడి 10 శాతంలోపునకు తగ్గిపోయింది. కనుక పీపీఎస్ఎల్లో చైనా నుంచి ఎఫ్‌డీఐ అన్నదానికి ప్రస్తుతం అర్థం లేదు’’అని పేటీఎం అధికార ప్రతినిధి స్పష్టం చేశారు. -
జొమాటో కొత్త అవతారం.. ఆర్బీఐ అనుమతి!
ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫారమ్ జొమాటో (Zomato) అనుబంధ సంస్థ అయిన జొమాటో పేమెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కి భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) పేమెంట్స్ అగ్రిగేటర్ లైసెన్స్‌ని మంజూరు చేసింది. దీంతో తన ప్లాట్‌ఫామ్ ద్వారా ఈ-కామర్స్ లావాదేవీల నిర్వహణకు జొమాటోకు అనుమతి లభించింది. దేశంలో పేమెంట్స్ అగ్రిగేటర్‌గా పనిచేయడానికి జొమాటో పేమెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ (ZPPL)కు 2024 జనవరి 24న రిజర్వ్ బ్యాంక్ నుంచి అధికార ధ్రువీకరణ పత్రం మంజూరైంద అని ఫుడ్‌టెక్ సంస్థ ఒక ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో తెలిపింది. జొమాటోతోపాటు టాటా పే, రేజర్‌పే, క్యాష్‌ఫ్రీ సంస్థలకు కూడా ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న పేమెంట్స్ అగ్రిగేటర్ లైసెన్స్ లైసెన్స్ మంజూరైంది. జొమాటో గత సంవత్సరం ఐసీఐసీఐ బ్యాంక్‌తో కలిసి తన సొంత యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (UPI) సేవలు ప్రారంభించేందుకు ఒప్పందం చేసుకుంది. లావాదేవీలను సులభతరం చేయడానికి గూగుల్‌పే, ఫోన్‌పే, పేటీఎం వంటి ఇతర చెల్లింపు యాప్‌లపై ఆధారపడటాన్ని తగ్గించడమే ఇందుకు కారణం. దీంతో థర్డ్-పార్టీ యాప్‌ల ద్వారా చేసే చెల్లింపులతో వచ్చే మర్చెంట్ ఛార్జీలు ఆదా అవుతాయి. కాగా గతంలో కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్‌లను అందించడం కోసం RBL బ్యాంక్‌తో కూడా జొమాటో జతకట్టింది. అయితే గత ఏడాది మేలో ఈ భాగస్వామ్యానికి తెరపడింది. -
TS: ట్రాఫిక్ చలాన్ల చెల్లింపుపై భారీ డిస్కౌంట్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించినందుకు జరిమానాలు ఎదుర్కొంటున్న వాహనదారులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. న్యూ ఇయర్ నేపథ్యంలో పెండింగ్ ట్రాఫిక్ చలాన్ల చెల్లింపుపై భారీ రాయితీలు అందిస్తున్నట్లు ప్రకటించింది. ద్విచక్ర వాహనాలు, ఆటోలపై చలాన్ల మొత్తంలో 80 శాతం రాయితీ ఇచ్చింది. అలాగే కార్లు, ట్రక్కులు, ఇతర భారీ వాహనాలపై పెండింగ్ చలాన్ల మొత్తంలో 60 శాతం రాయితీని, ఆర్టీసీ డ్రైవర్లకు, తోపుడు బండ్ల వారికి 90 శాతం రాయితీని ప్రకటించింది. ట్రాఫిక్ చలాన్ల చెల్లింపులో రాయితీలకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అంగీకరించడంతో పోలీస్ అధికారులు ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. https://echallan. tspolice.gov.in/publicview/ వెబ్సైట్లో వాహనదారులు ఈ నెల 26 నుంచి జనవరి 10 వరకు ఆన్లైన్లో పెండింగ్ చలాన్లను రాయితీపై చెల్లించవచ్చని అధికారులు పేర్కొన్నారు. పెండింగ్ చలాన్ల విలువ రూ. 800 కోట్లు.. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 3 కోట్ల ఈ–చలాన్లు పెండింగ్‌లో ఉండగా వాటి విలువ సుమారు రూ. 800 కోట్ల వరకు ఉంటుందని పోలీసు ఉన్నతాధికారులు అంచనా వేస్తున్నారు. భారీ రాయితీలు కల్పించడం వల్ల పెండింగ్‌లో ఉన్న చలాన్లను వాహనదారులు చెల్లిస్తారని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నెల 30న తెలంగాణ హైకోర్టు పర్యవేక్షణలో మెగా జాతీయ లోక్ అదాలత్ ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. గతేడాది మార్చిలో ట్రాఫిక్ చలాన్ల చెల్లింపులపై ఇదే తరహాలో ఇచ్చిన డిస్కౌంట్‌ను హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ల పరిధిలో వాహనదారులు సద్వినియోగం చేసుకోగా జిల్లాల్లోని వాహదారులకు ఈ అంశంపై పూర్తిస్థాయిలో అవగాహన లేక ఆశించినట్లు వినియోగించుకోలేకపోయారని అధికారులు తెలిపారు. అప్పట్లో సుమారు రూ. 350 కోట్ల మేరకు రాయితీలను ఉపయోగించుకొని వాహనదారులు చెల్లింపులు చేసినట్లు పోలీసు వర్గాల సమాచారం. రాయితీలు ఇలా.. ద్విచక్ర వాహనాలు,ఆటోలు 80% కార్లు, ట్రక్కులు, ఇతర భారీ వాహనాలు 60% ఆర్టీసీ డ్రైవర్లు,తోపుడు బండ్లకు..90% -
పేమెంట్ అగ్రిగేటర్‌గా ఎన్‌క్యాష్‌కు అనుమతి
న్యూఢిల్లీ: పేమెంట్ అగ్రిగేటర్‌గా వ్యవహరించేందుకు రిజర్వ్ బ్యాంక్ నుంచి అనుమతి లభించినట్లు ఎన్‌క్యాష్ సంస్థ తెలిపింది. బిజినెస్–2–బిజినెస్ వ్యవస్థలో ఒలింపస్ బ్రాండ్ పేరిట కార్యకలాపాలు నిర్వహించనున్నట్లు సంస్థ తెలిపింది. నిరంతరాయంగా, వినూత్నమైన, విశ్వసనీయమైన పేమెంట్ సొల్యూషన్స్‌ను అందించేందుకు తాము కట్టుబడి ఉన్నామని ఈ సందర్భంగా సంస్థ సహ–వ్యవస్థాపకుడు యద్వేంద్ర త్యాగి తెలిపారు. కార్పొరేట్ పేమెంట్స్ సొల్యూషన్స్ సంస్థగా ఎన్‌క్యాష్ 2018లో కార్యకలాపాలు ప్రారంభించింది. అప్పటి నుంచి దాదాపు 2,50,000 పైచిలుకు వ్యాపారాలు తమ కార్పొరేట్ పేమెంట్స్ వ్యవస్థను డిజిటలీకరించుకోవడంలో తోడ్పాటు అందించింది. ఎన్క్యాష్తోపాటు క్యాష్‌ఫ్రీ పేమెంట్స్, ఓపెన్, రేజర్‌పే వంటి ఇతర ఫిన్‌టెక్ స్టార్టప్‌లకు కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేమెంట్ అగ్రిగేటర్ లైసెన్స్‌లను మంజూరు చేసింది. -
వీటిని తెగవాడుతున్నారు..!
ప్రస్తుతం ఏ చిన్న వస్తువు కొనాలన్నా యూపీఐ ద్వారా పేమెంట్ చేస్తున్నారు. ఎక్కడ చూసినా క్యూఆర్ కోడ్ స్కానర్లు కనిపిస్తున్నాయి. గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం వంటి యూపీఐ యాప్స్‌తో చెల్లింపులు సాగిస్తున్నారు. చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు కచ్చితంగా ఫోన్ పే, గూగుల్ పే వంటి యూపీఐ యాప్స్ ఉంటున్నాయి. చిటికెలో ట్రాన్సాక్షన్ పూర్తి చేసే సౌలభ్యం అందుబాటులోకి వచ్చిన క్రమంలో డిజిటల్ పేమెంట్లలో యూనిఫైడ్ ఫేమెంట్స్ ఇంటర్ ఫేస్ (యూపీఐ) ప్రధాన పాత్ర పోషిస్తోంది. ఈ మేరకు యూపీఐ పేమెంట్లకు సంబంధించి కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్ కె కరాద్ పార్లమెంట్లో కీలక విషయాలు వెల్లడించారు. యూపీఐ పేమెంట్లు పెరగడంతో గతేడాది చలామణిలో ఉన్న నోట్ల విలువలో వృద్ధి 7.8 శాతానికి తగ్గినట్లు చెప్పారు. 2017-18 ఏడాదిలో యూపీఐ ట్రాన్సాక్షన్ల సంఖ్య 92 కోట్లుగా ఉండగా.. అది 2022-23కు ఏకంగా 8,357 కోట్లకు చేరినట్లు చెప్పారు. యూపీఐ ట్రాన్సాక్షన్ల సంఖ్యాపరంగా వార్షిక వృద్ధి 147 శాతంగా ఉందని పేర్కొన్నారు. యూపీఐ ట్రాన్సాక్షన్ల విలువ 2017-18లో దాదాపు రూ.1 లక్ష కోట్లుగా ఉండగా.. అది 168 శాతం పెరిగి 2022-23లో రూ.139 లక్షల కోట్లకు చేరినట్లు కేంద్ర మంత్రి తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2023-24లో డిసెంబర్ 11 వరకు యూపీఐ మొత్తం ట్రాన్సాక్షన్ల సంఖ్య 8,572 కోట్లుగా తెలిపారు. 2022-23లో మొత్తం డిజిటల్ ట్రాన్సాక్షన్లలో యూపీఐ లావాదేవీలే 62 శాతంగా ఉన్నట్లు చెప్పారు. ఇదీ చదవండి: రూ.1000 కోట్లు ఆదా చేసిన ప్రభుత్వ సంస్థ.. చలామణిలో ఉన్న నోట్ల విలువలో వృద్ధి 2021-22లో 9.9 శాతంగా ఉండగా.. 2022-23లో 7.8 శాతానికి తగ్గిందన్నారు. యూపీఐతో రూపే క్రెడిట్ కార్డులు లింక్ చేసుకునేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుమతి ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. దీనివల్ల క్రెడిట్ కార్డులను తమతో తీసుకెళ్లకుండానే చిన్న విక్రయ కేంద్రాల్లోనైనా చెల్లింపులు చేసే అవకాశం ఉందని తెలిపారు. ఇదిలాఉండగా.. గత తొమ్మిదేళ్లలో 57 బ్యాంకులను మూసివేసినట్లు మంత్రి చెప్పారు. మూడు బ్యాంకులు పంజాబ్ అండ్ మహారాష్ట్ర కోఆపరేటివ్ బ్యాంక్, లక్ష్మీ విలాస్ బ్యాంక్, యెస్ బ్యాంకులను పునరుద్ధరించినట్లు చెప్పారు. -
కొత్త నిబంధన.. ఆ ఆన్లైన్ లావాదేవీలకు 4 గంటలు ఆగాల్సిందే..!
ఆన్లైన్ లావాదేవీల్లో జరుగుతున్న మోసాల గురించి ఎక్కడోచోట చూస్తూంటాం. వాటిని అరికట్టేందుకు ప్రభుత్వం ఎన్నో నిబంధనలు తీసుకొస్తోంది. తాజాగా మరో కొత్త నిబంధనను అమలు చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఇద్దరు వ్యక్తుల మధ్య తొలిసారి యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) ద్వారా జరిగే లావాదేవీల్లో.. రూ.2,000 లోపు అయితే వెంటనే పేమెంట్ అవుతుంది. తొలి లావాదేవీలో అంతకుమించి డబ్బు పంపాలంటే కనీసం 4 గంటల వ్యవధి ఉండేలా చూడాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2022-23 సంవత్సరానికిగాను విడుదల చేసిన నివేదికలో మొత్తం 13,530 ఆన్లైన్ మోసాలు నమోదైనట్లు తెలిపింది. వీటి మొత్తం విలువ రూ.30,252 కోట్లు. ఇందులో 49 శాతం మోసాలు ఆన్లైన్ చెల్లింపులకు సంబంధించినవే. ఆన్లైన్ మోసాలను మరింత సమర్థంగా అడ్డుకునేందుకు.. ఇద్దరు వ్యక్తుల మధ్య తొలి విడతలోనే రూ.2,000కు మించి ఆన్లైన్లో నగదు బదిలీ చేయాలంటే.. కనీసం 4 గంటల వ్యవధి ఉండేలా చూడాలని ప్రభుత్వం భావిస్తోంది. అంతకు మించి చెల్లించినప్పుడు.. ఆ నాలుగు గంటల వ్యవధిలో వినియోగదారుడు లావాదేవీని రద్దు చేసుకోవచ్చు, లేదా మార్చుకునే అవకాశం ఉంటుంది. ఫలితంగా మోసాలను సులభంగా అడ్డుకోవచ్చని ప్రభుత్వం ఆలోచిస్తోంది. యూపీఐ లావాదేవీలకే కాకుండా.. ఇమ్మీడియట్ పేమెంట్ సర్వీస్ (ఐఎంపీఎస్), రియల్ టైం గ్రాస్ సెటిల్మెంట్ (ఆర్టీజీఎస్) లావాదేవీలకూ ఈ షరతును వర్తింపచేయాలని ప్రభుత్వం భావిస్తోందని సమాచారం. ఇదీ చదవండి: అద్దెకు ఆమె సగం మంచం.. నెలకు రెంట్ ఎంతంటే..? ప్రస్తుత నిబంధనల ప్రకారం తొలిసారి యూపీఐ లావాదేవీని నిర్వహించే వారు 24 గంటల వ్యవధిలో రూ.5,000 మించి చేయడానికి వీలుకాదు. నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్ఫర్ (నెఫ్ట్) లావాదేవీల్లో ఒకసారి అవతలి వ్యక్తిని రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత, 24 గంటల పాటు రూ.50,000 వరకే బదిలీ చేసే వీలుంటుంది. -
ఏఐ ఎతిహాద్ పేమెంట్స్‌తో ఎన్పీసీఐ ఒప్పందం
న్యూఢిల్లీ: నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ (ఎన్పీసీఐ) అనుబంధ సంస్థ అయిన ఎన్పీసీఐ ఇంటర్నేషనల్ పేమెంట్స్, ఏఐ ఎతిహాద్ పేమెంట్స్‌తో ఒప్పందం చేసుకోనుంది. కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఆధ్వర్యంలోని బృందం ఈ నెల 5, 6 తేదీల్లో అబుదాబిలో పర్యటించనుంది. ఈ సందర్భంగా ఈ ఒప్పందంపై ఇరువైపులా సంతకాలు చేయనున్నారు. ఈ ఒప్పందంతో సీమాంతర చెల్లింపులకు వీలు కలుగనుంది. పెట్టుబడులకు సంబంధించి భారత్–యూఏఈ 11వ అత్యున్నత స్థాయి టాస్క్‌ఫోర్స్ సమావేశానికి మంత్రి పీయూష్ గోయల్ సహాధ్యక్షత వహించనున్నారు. అబుదాబి ఇన్వెస్ట్మెంట్ అథారిటీ ఎండీ షేక్ హమీద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ సైతం సహాధ్యక్షత వహిస్తారు. ముబదాలా ఎండీ, సీఈవో ఖల్దూన్ అల్ ముబారక్‌తో మంత్రి గోయల్ ద్వైపాక్షిక చర్చలు నిర్వహించనున్నారు. యూఏఈ ఇండియా బిజినెస్ కౌన్సిల్, ఇరుదేశాలకు చెందిన వ్యాపారవేత్తలతోనూ సమావేశం కానున్నారు. ఇరు దేశాల్లో మరో దేశం పెట్టుబడులకు సంబంధించి ఎదురయ్యే సవాళ్లు, ఇతర అంశాలపై రెండు దేశాలు చర్చించనున్నట్టు కేంద్ర వాణిజ్య శాఖ బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది. ఇప్పటి వరకు జాయింట్ టాస్క్‌ఫోర్స్ రూపంలో సాధించిన పురోగతిని సమీక్షించనున్నట్టు పేర్కొంది. రెండు రోజుల పర్యటనలో భాగంగా వాణిజ్యం, పెట్టుబడులకు సంబంధించి మంత్రి పీయూష్ గోయల్ ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించనున్నట్టు తెలిపింది. ద్వైపాక్షిక వాణిజ్యం ప్రోత్సాహానికి వీలుగా రెండు దేశాల మధ్య 2013లో జాయింట్ టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు కావడం గమనార్హం. -
విద్యుత్ బకాయిల చెల్లింపుపై తీర్పు వాయిదా
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ఏపీ మధ్య నెలకొన్న విద్యుత్ బకాయిల వివాదంలో హైకోర్టులో వాదనలు పూర్తయ్యాయి. బకాయిలు వెంటనే చెల్లించేలా చూడాలంటూ ఏపీ.. దీనిపై ఇప్పటికే ఇచ్చిన స్టేను పొడించాలంటూ తెలంగాణ వివిధ అంశాలను ప్రస్తావిస్తూ సుదీర్ఘంగా వాదనలు వినిపించగా.. హైకోర్టు మంగళవారం తన తీర్పును రిజర్వు చేసింది. రాష్ట్ర విభజన తర్వాత సరఫరా చేసిన విద్యుత్‌కు సంబంధించి తమకు తెలంగాణ నుంచి రూ.6,756.92 కోట్లు (అసలు రూ.3,441.78 కోట్లు, వడ్డీ, సర్‌చార్జీలు కలిపి మరో రూ.3,315.14 కోట్లు) రావాల్సి ఉందని ఏపీ వాదిస్తోంది. దీనిని పరిగణనలోకి తీసుకున్న కేంద్రం.. ఏపీకి 30 రోజుల్లోగా రూ.6,756.92 కోట్లు చెల్లించాలంటూ 2022 ఆగస్టు 29న తెలంగాణకు నోటీసులు జారీ చేసింది. ఆ నోటీసులను సవాల్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం, విద్యుత్ సంస్థలు 2022 సెప్టెంబర్‌లో తెలంగాణ హైకోర్టులో పిటిషన్లు వేశాయి. వాటిపై విచారణ చేపట్టిన హైకోర్టు.. బకాయిల విషయంలో తెలంగాణ సర్కార్‌పై ఒత్తిడి తేవొద్దని స్టే ఇచ్చింది. ఈ వ్యవహారం ఇలా కోర్టులో ఉండగానే.. విద్యుత్ బకాయిలు తప్పకుండా చెల్లించాలని ఆదేశించినా తెలంగాణ ఇవ్వడం లేదని.. అందువల్ల రిజర్వు బ్యాంకులోని తెలంగాణ ఖాతా నుంచి సొమ్మును మినహాయించుకుని ఏపీకి చెల్లించే ప్రయత్నం చేస్తున్నట్లు కేంద్రం పార్లమెంటులో వెల్లడించింది. రాజ్యసభ ప్రశ్నోత్తరాల సమయంలో వైఎస్సార్ సీపీ సభ్యుడు విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు ఈ సమాధానం ఇచ్చింది. దీనితో కేంద్రం ఎలాంటి కఠిన చర్యలు తీసుకోకుండా ఆదేశించాలని, చెల్లింపులపై స్టేను పొడిగించాలని కోరుతూ తెలంగాణ హైకోర్టులోని ప్రధాన పిటిషన్లో మధ్యంతర అప్లికేషన్ (ఐఏ) దాఖలు చేసింది. దీనిపై ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం సుదీర్ఘంగా విచారణ జరిపింది. బకాయిల వల్ల ఇబ్బందుల్లో ఏపీ డిస్కమ్‌లు తెలంగాణ బకాయిలు చెల్లించకపోవడంతో ఏపీ విద్యుత్ డిస్కమ్‌లు ఆర్థిక ఇబ్బందుల్లో పడాల్సి వచ్చిందని ఏపీ పవర్ జనరేషన్ కార్పొరేషన్ తరఫున సీనియర్ న్యాయవాది సీవీ మోహన్‌రెడ్డి వాదనలు వినిపించారు. పునర్విభజన తర్వాత విద్యుత్ ఉత్పత్తి, సరఫరాకు సంబంధించిన ఈ బకాయిలకు, పునర్విభజన చట్టానికి ఎలాంటి సంబంధం లేదని వివరించారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు విభజన తర్వాత 2017 వరకు కూడా ఏపీ డిస్కమ్‌లు తెలంగాణకు విద్యుత్ సరఫరా చేశాయన్నారు. బకాయిలు చెల్లించక బొగ్గు సరఫరా నిలిచిపోయిందని, తెలంగాణకు విద్యుత్ నిలిపివేయాల్సి వచ్చిందని తెలిపారు. బకాయి ఉన్న విషయాన్ని తెలంగాణ కూడా అంగీకరిస్తోందని గుర్తు చేశారు. కేంద్రం తరఫున అడిషనల్ సొలిసిటర్ జనరల్ సూర్యకిరణ్‌రెడ్డి వాదనలు వినిపించారు. కేంద్రం జోక్యంతోనే తెలంగాణకు ఏపీ విద్యుత్ సరఫరా చేసిందని, బకాయిల చెల్లింపుపై ఉత్తర్వులు ఇచ్చే అధికారం కేంద్రానికి ఉందని కోర్టుకు వివరించారు. వాదనలు విన్న చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ ఎన్వీ శ్రవణ్‌కుమార్‌ల ధర్మాసనం మంగళవారం తీర్పు రిజర్వు చేసింది. -
పేటీఎం నుంచి పాకెట్ సౌండ్ బాక్స్.. దీంతో ఏం చేయొచ్చంటే
హైదరాబాద్: పేటీఎం మాతృ సంస్థ వన్97 కమ్యూనికేషన్స్ వర్తకుల కోసం రెండు వినూత్న చెల్లింపుల సాధనాలను విడుదల చేసింది. 4జీ ఆధారిత పేటీఎం పాకెట్ సౌండ్ బాక్స్, పేటీఎం మ్యూజిక్ సౌండ్ బాక్స్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. పేటీఎం పాకెట్ సౌండ్‌బాక్స్ అనేది చెల్లింపుల ఆధారిత తొలి పోర్టబుల్ పరికంగా కంపెనీ పేర్కొంది. డెబిట్ కార్డ్ పరిమాణంలో పాకెట్లో పట్టేస్తుందని, డ్రైవర్లు, డెలివరీ, మార్కెటింగ్ ఉద్యోగులకు అనుకూలంగా ఉంటుందని తెలిపింది. ప్రస్తుతం ఇప్పటికే మార్కెట్లో ఉన్న పేటీఎం సౌండ్‌బాక్స్ అనేది కొంచెం పెద్దగా ఉంటుంది. దీన్ని వెంట తీసుకెళ్లడం సౌకర్యంగా ఉండదు. తరచూ వాహనాలపై ప్రయాణించే వారిని దృష్టిలో పెట్టుకుని పేటీఎం పాకెట్ సౌండ్‌బాక్స్‌ను తీసుకొచ్చినట్టు తెలుస్తోంది. అలాగే, పేటీఎం మ్యూజిక్ సౌండ్‌బాక్స్ అనేది వర్తకులకు చెల్లింపుల సమాచారాన్ని వాయిస్ రూపంలో వినిపించడమే కాకుండా, బ్లూటూత్‌తో ఫోన్‌ను కనెక్ట్ చేసుకోవచ్చు. దీని ద్వారా మ్యూజిక్ వినడం, మ్యాచ్ కామెంటరీ వినొచ్చని పేటీఎం తెలిపింది. వర్తకుల సౌకర్యం కోసమే ఈ రెండు ఉత్పత్తులను తీసుకొచ్చినట్టు పేటీఎం వ్యవస్థాపకుడు, సీఈవో విజయ్ శేఖర్ శర్మ ప్రకటించారు. ఇందులో పాకెట్ సౌండ్‌బాక్స్ చెల్లింపుల పరిశ్రమలో ఎంతో మార్పును తీసుకొస్తుందన్నారు. ఈ ఏడాది జూన్ చివరికి పేటీఎంకు 79 లక్షల సౌండ్‌బాక్స్, పేటీఎం కార్డ్ మెషిన్ల చందాదారులు ఉన్నారు. -
ఫోన్‌పే యూజర్లకు గుడ్‌న్యూస్.. సరికొత్త ఫీచర్ వచ్చింది, అదనపు బెనిఫిట్స్ కూడా
ఫోన్‌పే... ఈ పేరు తెలియని వారుండరు. చెల్లింపుల వ్యవస్థలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకోవడంతో పాటు కోట్లాది మంది యూజర్లను సొంతం చేసుకుంది ఈ సంస్థ. తాజాగా ఈ డిజిటల్ పేమెంట్స్ యాప్ తమ యూజర్లకు మరో సేవను అందుబాటులోకి తీసుకొచ్చింది. 'ఆదాయ పన్ను చెల్లింపు' అనే కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. కేంద్ర ప్రభుత్వం 2022-23 ఆర్థిక సంవత్సరానికి ఐటీఆర్ (ITR)ఫైలింగ్‌తో పాటు చెల్లించడానికి జూలై 31 గా నిర్ణయించింది. ఈ తేదీకి మించి ఐటీఆర్ ఫైల్ చేయడానికి గడువు పొడిగించేది లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇకపై చాలా ఈజీ ఇదిలా ఉండగా కొన్ని సార్లు పన్ను చెల్లింపు చేస్తుండగా సర్వర్లు యూజర్ల సంఖ్య పెరగడంతో మొరాయిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో ఈ సమస్యకు పరిష్కారంగా ఇన్కమ్ ట్యాక్స్ పేమెంట్స్ ఫీచర్ ప్రారంభిస్తున్నట్లు ఫోన్‌పే తెలిపింది. యూపీఐ లేదా క్రెడిట్ కార్డు పేమెంట్లను ఉపయోగించి నేరుగా యాప్ ద్వారానే సెల్ఫ్ అసెస్మెంట్, అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లింపులు చేసేందుకు ట్యాక్స్ పేయర్స్‌కు వీలు కల్పిస్తున్నట్లు వెల్లడించింది. ఈ కొత్త సేవను తీసుకొచ్చేందుకు ఫోన్ పే సంస్థ ప్రముఖ బీ2బీ పేమెంట్స్, సర్వీసెస్ సంస్థ పేమేట్ కంపెనీతో భాగస్వామ్యం ఏర్పరచుకుంది. కొత్తగా వచ్చిన ఫీచర్లో యూజర్లు తమ క్రెడిట్ కార్డ్ లేదా యూపీఐని ఉపయోగించి సులభంగా పన్నులు చెల్లించడానికి వీలు కల్పిస్తుంది. ఈ ఫీచర్ క్రెడిట్ కార్డ్ చెల్లింపుల కోసం అదనపు ప్రయోజనాలతో వస్తుంది, ఫోన్ పే తెచ్చిన ఈ ఫీచర్ ఉపయోగించడం ద్వారా 45 రోజుల ఇంటరెస్ట్ ఫ్రీ పీరియడ్ అవకాశం పొందవచ్చని, బ్యాంకును బట్టి వారి పన్ను చెల్లింపులపైనా రివార్డు పాయింట్లను కూడా అందుకోవచ్చని కంపెనీ తెలిపింది. ఫోన్‌పేలో బిల్ పేమెంట్స్, రీఛార్జ్ బిజినెస్ హెడ్ నిహారిక సైగల్ ఈ అంశంపై మాట్లాడుతూ, "ఫోన్‌పేలో, మా యూజర్లు అవసరాలను తీర్చడానికి మా యాప్‌ను నిరంతరం అప్డేట్ చేస్తూ వారికి అనుగుణంగా మార్పులు చేస్తూనే ఉంటాం. మా సరికొత్త ఫీచర్‌ను ప్రారంభించడం పట్ల మేము సంతోషిస్తున్నాం. ఫోన్‌పేలో ఆదాయపు పన్నులు చెల్లించే సౌలభ్యం తరచుగా ఉంటుంది. పన్నులు కట్టడం అనేది క్లిష్టమైన ప్రక్రియ, చాలా సమయం పడుతుంది కూడా. ఇకపై మా యూజర్లకు ఎలాంటి అడ్డంకులు లేకుండా సురక్షితమైన పన్ను చెల్లింపు ప్రక్రియను అందిస్తోందని అన్నారు. చదవండి: EPFO: వేతన జీవులకు గుడ్‌న్యూస్: ఈపీఎఫ్ వడ్డీని పెంచిన కేంద్రం -
ఇక ‘క్యాష్‌లెస్’ చెక్‌పోస్టులు
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం/సాక్షి, అమరావతి: రవాణాశాఖలో ఇప్పటికే అన్ని రకాల లైసెన్సులను ఆన్లైన్ విధానంలో అందిస్తున్న రవాణాశాఖ.. ఇక సరిహద్దుల్లో కూడా ఆన్లైన్ విధానాన్ని ప్రవేశపెట్టింది. అంతర్రాష్ట్ర రవాణా చెక్‌పోస్టులను ఇక క్యాష్‌లెస్‌గా మార్చేందుకు శ్రీకారం చుట్టింది. రవాణాశాఖకు చెందిన అంతర్రాష్ట్ర చెక్‌పోస్టుల్లో యూపీఐ పేమెంట్స్ విధానాన్ని ప్రారంభించింది. తద్వారా చెక్‌పోస్టుల్లో అవినీతిని కట్టడికి ఉపయోగపడుతుందని రవాణాశాఖ అధికారులు భావిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 15 రవాణాశాఖ చెక్‌పోస్టుల్లో ఈ విధానం అమల్లోకి వచ్చింది. అన్ని చెక్‌పోస్టుల్లో క్యాష్‌లెస్ విధానం అమలు కావడంతో అవినీతికి అడ్డుకట్ట పడుతుందని రవాణాశాఖ ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. అన్ని ట్యాక్స్‌లూ ఆన్లైన్లోనే.. వాస్తవానికి రవాణాశాఖ చెక్‌పోస్టుల్లో అవినీతి జరుగుతోందన్న ఆరోపణలున్నాయి. క్యాష్‌లెస్ విధానాన్ని ప్రవేశపెట్టడం ద్వారా అవినీతికి అడ్డుకట్ట వేయాలని రవాణాశాఖ ఉన్నతాధికారులు నిర్ణయించారు. బోర్డర్ ట్యాక్స్, టెంపరరీ పర్మిట్ ట్యాక్స్, వలంటరీ ట్యాక్స్, కంపౌండింగ్ ఫీజు ఇలా అన్నింటినీ అక్కడ ఉన్న క్యూఆర్ కోడ్‌ను స్కానింగ్ చేయడం ద్వారా చెల్లించే వెసులుబాటు కల్పించారు. అంతేకాకుండా హెచ్‌టీ టీపీఎస్://ఏపీఆర్టీఏసిటిజెన్ డాట్ ఈ ప్రగతి డాట్ ఓఆర్జీ ద్వారా చెల్లించే వెసులుబాటు కల్పించారు. ఆన్లైన్ విధానంతో అవినీతి కట్టడితో పాటు చెక్‌పోస్టుల వద్ద లైన్లలో నిలబడి చెల్లించే బాధ తప్పనుంది. తద్వారా వాహనాలను ఎక్కువ సమయం నిలిపి ఉంచే సమయం కూడా తగ్గడం ద్వారా వాహన రవాణా ప్రయాణ సమయం కూడా తగ్గనుందని రవాణాశాఖ అధికారులు పేర్కొంటున్నారు. రవాణాశాఖ చెక్పోస్టులివే.. రాష్ట్రానికి అటు కర్ణా్ణటక, ఇటు తమిళనాడు, ఒడిశా, తెలంగాణ రాష్ట్రాలకు మధ్య అంతర్రాష్ట్ర చెక్‌పోస్టులను రవాణాశాఖ నిర్వహిస్తోంది. మొత్తం 15 చెక్‌పోస్టులు.. ఇచ్ఛాపురం, జీలుగువిుల్లి, పంచలింగాల, పెనుకొండ, సున్నిపెంట, తిరువూరు, గరికపాడు, పలమనేరు, తడ, బీవీ పాలెం, రేణిగుంట, నరహరిపేట, దాచేపల్లి, మాచర్ల, బెండపూడి ప్రాంతాల్లో రవాణాశాఖ నిర్వహిస్తోంది. సీఎం ఆదేశాలతో చెక్‌పోస్టుల వద్ద క్యాష్‌లెస్ విధానాన్ని ప్రవేశపెట్టాం. ఇక నుంచి చెక్‌పోస్టుల్లో నగదు లావాదేవీలను పూర్తిగా నిలిపివేశాం. అవినీతిరహిత పరిపాలన దిశగా ముఖ్యమంత్రి ఆదేశాలతో ఎటువంటి మధ్యవర్తులకు తావులేకుండా ఈ విధానం తోడ్పడనుంది. ట్రాఫిక్ ఇబ్బందులకు కొత్త విధానంతో చెక్ పడుతుంది. – మనీష్‌కుమార్ సిన్హా, రవాణాశాఖ కమిషనర్