వాట్సాప్‌ ‘పేమెంట్స్‌’కు లైన్‌ క్లియర్‌! | WhatsApp sets up data storage facility in India for payments biz | Sakshi
Sakshi News home page

వాట్సాప్‌ ‘పేమెంట్స్‌’కు లైన్‌ క్లియర్‌!

Published Fri, Jun 28 2019 4:59 AM | Last Updated on Fri, Jun 28 2019 5:50 AM

WhatsApp sets up data storage facility in India for payments biz - Sakshi

బెంగళూరు: మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌ త్వరలో పూర్తి స్థాయిలో చెల్లింపుల సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా రిజర్వ్‌ బ్యాంక్‌ నిర్దేశించినట్లుగా పేమెంట్‌ డేటాను భారత్‌లోనే భద్రపర్చేందుకు అవసరమైన వ్యవస్థను సిద్ధం చేసుకున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఏకీకృత చెల్లింపుల విధానం (యూపీఐ) ఆధారిత వ్యవస్థ ద్వారా వాట్సాప్‌ ఈ సేవలు అందించనుంది. ఈ సర్వీసుల కోసం ముందుగా ఐసీఐసీఐ బ్యాంక్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది.

తర్వాత రోజుల్లో ప్రైవేట్‌ రంగ యాక్సిస్‌ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లతో పాటు ప్రభుత్వ రంగ స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాతో కూడా జట్టు కట్టనున్నట్లు సమాచారం. ‘డేటా లోకలైజేషన్‌కి సంబంధించిన పనులన్నీ వాట్సాప్‌ పూర్తి చేసింది. ప్రస్తుతం ఆడిట్‌ ప్రక్రియ నడుస్తోంది. ఆడిటర్లు తమ నివేదికను రిజర్వ్‌ బ్యాంక్‌కు సమర్పించిన తర్వాత వాట్సాప్‌ తన పేమెంట్‌ సర్వీసులను పూర్తి స్థాయిలో విస్తరించేందుకు అవకాశం ఉంటుంది‘ అని సంబంధిత వర్గాలు వివరించాయి.  

గతేడాదే పైలట్‌ ప్రాజెక్టు..
అమెరికన్‌ సోషల్‌ నెట్‌వర్కింగ్‌ సైటు ఫేస్‌బుక్‌లో భాగమైన వాట్సాప్‌ 2018లోనే ప్రయోగాత్మకంగా పరిమిత సంఖ్యలో యూజర్లకు పేమెంట్‌ సేవలు అందించడం ప్రారంభించింది. గతేడాది ఫిబ్రవరిలో ఐసీఐసీఐ బ్యాంక్‌ భాగస్వామ్యంతో తమ యాప్‌లో పేమెంట్స్‌ ఫీచర్‌ను ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టింది. అయితే, దీనిపై వివాదం రేగింది. నియంత్రణ సంస్థ ఆదేశాలకు విరుద్ధంగా డేటాను భారత్‌లో కాకుండా విదేశాల్లో భద్రపరుస్తుండటం, యూజర్ల డేటా భద్రతపై అనుమానాలు, వాట్సాప్‌లో తప్పుదోవ పట్టించే వార్తలు వైరల్‌గా మారుతుండటం తదితర అంశాలు ఈ ప్రాజెక్టుకు ప్రతిబంధకాలుగా మారాయి. అయితే, ప్రధానమైన డేటా లోకలైజేషన్‌ అంశంతో పాటు ఇతరత్రా సమస్యలన్నింటినీ వాట్సాప్‌ పరిష్కరించుకోవడంతో పూర్తి స్థాయిలో సేవలు ప్రారంభించేందుకు మార్గం సుగమం కాగలదని పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి.

వెనక్కి తగ్గని ఆర్‌బీఐ ..
సాధారణంగా రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) నిబంధనల ప్రకారం.. చెల్లింపుల సేవలు అందించే సంస్థలు ముందుగా భారత్‌లో డేటా స్టోరేజీ సదుపాయాలను ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. దానికి సంబంధించిన ఆడిట్‌ నివేదికను కూడా సమర్పించిన తర్వాతే సర్వీసులు ప్రారంభించాల్సి ఉంటుంది. అయితే, ఇప్పటికే విదేశాల్లోని సర్వర్లలో డేటా నిల్వ, ప్రాసెస్‌ చేస్తున్న అంతర్జాతీయ సంస్థలు..మళ్లీ భారత్‌లో కూడా ప్రత్యేకంగా డేటా స్టోరేజీ చేయాలంటే శ్రమ, వ్యయాలతో కూడుకున్న వ్యవహారమని, తమకు మినహాయింపునివ్వాలని ఆర్‌బీఐని కోరాయి. కానీ భారత యూజర్ల డేటా భద్రత దృష్ట్యా నిబంధనలు పాటించి తీరాల్సిందేనంటూ రిజర్వ్‌ బ్యాంక్‌ స్పష్టం చేసింది. కావాలంటే డేటాను విదేశాల్లో ప్రాసెస్‌ చేసుకోవచ్చని, అయితే ఆ తర్వాత 24 గంటల్లోగా భారత్‌లోని సిస్టమ్స్‌లోకి బదలాయించాల్సి ఉంటుందని పేర్కొంది.

దీంతో దారికొచ్చిన అంతర్జాతీయ సంస్థలు రిజర్వ్‌ బ్యాంక్‌ డేటా లోకలైజేషన్‌ నిబంధనల ప్రకారం భారత్‌లో తగిన వ్యవస్థలను ఏర్పాటు చేసుకుంటున్నాయి. ఆన్‌లైన్‌ రిటైల్‌ దిగ్గజం అమెజాన్‌ కూడా డేటా స్థానికత మార్గదర్శకాలను పాటిస్తూ ఈ మద్యే యూపీఐ ఆధారిత పేమెంట్‌ సర్వీసులు ప్రారంభించింది. ఇందుకోసం యాక్సిస్‌ బ్యాంక్‌తో జట్టు కట్టింది. తాజాగా వాట్సాప్‌ కూడా అదే బాటలో స్టోరేజీ వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటోంది. ఇలా అంతర్జాతీయ దిగ్గజాలు నిర్దేశిత నిబంధనలు పాటించేలా చేయడంలో రిజర్వ్‌ బ్యాంక్‌ విజయం సాధించినట్లయిందని పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడ్డాయి. నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌పీసీఐ) తాజా గణాంకాల ప్రకారం దేశీయంగా మొత్తం 39 థర్డ్‌ పార్టీ యాప్స్‌.. పేమెంట్స్‌ సర్వీసులు అందిస్తున్నాయి. గూగుల్‌ పే, అమెజాన్, ఉబెర్, ఓలా వంటి సంస్థలు ఇందులో ఉన్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement