పది కోట్ల మంది యూజర్ల పరిమితిని ఎత్తేసిన ఎన్‌పీసీఐ
న్యూఢిల్లీ: సామాజిక మాధ్యమ యాప్ అయిన వాట్సాప్‌లో ఇంతకాలం కేవలం కొద్ది మందికి మాత్రమే ఇతరులకు నగదు బదిలీ వెసులుబాటు ఉండగా ఇకపై అందరికీ ఆ అవకాశం దక్కనుంది. అతి త్వరలోనే ఈ చెల్లింపుల సదుపాయం దేశవ్యాప్తంగా అందుబాటులోకి రానుంది. టెక్స్ మెసేజ్‌లు, ఫొటోలు, ఆడియోలు, వీడియోలు షేర్‌చేసుకోవడంలో భారత్‌లో అగ్రగామి సోషల్‌మీడియా యాప్‌గా వర్ధిల్లుతున్న వాట్సాప్ ఇకపై పేమెంట్ యాప్‌గానూ ఎదిగే అవకాశాలు మెరుగయ్యాయి. దేశంలో ఆన్‌లైన్ చెల్లింపులపై నియంత్రణ బాధ్యతలు చూసే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్‌పీసీఐ) గతంలో వాట్సాప్‌కు కేవలం భారత్‌లోని 10 కోట్ల మంది యూజర్లకు మాత్రమే పేమెంట్స్ ఆప్షన్ ఇచ్చారు.
తాజాగా ఆ పరిమితిని ఎత్తేశారు. దీంతో ఇకపై యూజర్లు అందరూ వాట్సాప్ ద్వారా నగదు చెల్లింపుల సేవలను వినియోగించుకోవచ్చని ‘వాట్సాప్ పే’ బహిరంగంగా అధికారికంగా స్మార్ట్‌ఫోన్లలో ఒక నోటిఫికేషన్ ఇచ్చింది. మొదట్నుంచి చూస్తే యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్(యూపీఐ) చెల్లింపుల సేవలు విస్తరించుకోవడంపై వాట్సాప్‌కు ఎన్‌పీసీఐ దశలవారీగా పరిమితిని పెంచుతూ వచ్చింది. 2020 సంవత్సరంలో కేవలం 4 కోట్ల మంది వాట్సాప్ యూజర్లకు మాత్రమే యూపీఐ పేమెంట్స్ ఆప్షన్ ఇచ్చారు. తర్వాత రెండేళ్లకు ఆ పరిమితిని 10 కోట్ల మంది యూజర్లకు అనుమతి మంజూరు చేశారు. భారత్‌లో రోజురోజుకూ విస్తరిస్తున్న డిజిటల్ నగదు చెల్లింపుల వ్యవస్థను దృష్టిలో ఉంచుకుని ఎన్‌పీసీఐ తాజాగా ఈ పరిమితిని ఎత్తేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.
13 బిలియన్ల లావాదేవీలు
భారత్‌లో ఇప్పుడు యూపీఐ లావాదేవీలు ఎవరూ ఊహించనంతగా పెరిగిపోయాయి. నెలకు కనీసం 1300 కోట్ల లావాదేవీలు జరుగుతున్నాయి. వీటిలో ప్రధానంగా గూగుల్ పే, ఫోన్‌పే యాప్‌లలోనే దాదాపు 85 శాతం లావాదేవీలను యూజర్లు పూర్తిచేస్తున్నారు. దేశంలో వాట్సాప్ యాప్‌ను ఏకంగా 50 కోట్ల మంది యూజర్లు వాడుతున్నారు. ఇంతపెద్ద సంఖ్యలో యూజర్లు ఉన్న వాట్సాప్ ఇప్పుడు యూపీఐ పేమెంట్స్‌ను విస్తరిస్తే దేశంలోనే అగ్రగామి పేమెంట్ యాప్‌గానూ దూసుకుపోనుందని మార్కెట్ వర్గాలు అంచనావేస్తున్నాయి. దీంతో వాట్సాప్ మాతృసంస్థ మెటాకు ఎంతో ప్రయోజనం చేకూరనుంది. ఇటీవల మెటా తమ కృత్రిమేథ ఉపకరణం అయిన ‘మెటా ఏఐ’ను అందుబాటులోకి తెచ్చింది.
దీనికి భారత్‌లో చక్కటి ప్రజాదరణ దక్కింది. గతంలో మాదిరే వాట్సాప్ పే విభాగం యూపీఐ వారి థర్ట్ పార్టీ అప్లికేషన్ ప్రొవైడర్ నిబంధనావళిని పాటించాల్సి ఉంటుంది. భారతీయ రిజర్వ్ బ్యాంక్, భారతీయ బ్యాంక్‌ల సమాఖ్య(ఐబీఏ)లు సంయుక్తంగా యూజర్లు అత్యంత వేగంగా నగదు బదిలీ చేసుకునేందుకు వీలుగా ఎన్‌పీసీఐను ఏర్పాటుచేశాయి. ఎన్‌పీసీఐ ఆధ్వర్యంలోనే యూపీఐ చెల్లింపుల వ్యవస్థ పనిచేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment