ముంబై: మెసేజింగ్ యాప్ వాట్సాప్ తాజాగా భారత మార్కెట్లో తమ చెల్లింపుల సేవలను మరింతగా విస్తరిస్తోంది. ఇందులో భాగంగా వ్యాపార సంస్థలకు కొనుగోలుదారులు చేసే పేమెంట్స్ ప్రక్రియను సులభతరం చేసింది. ‘వాట్సాప్ బిజినెస్ ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించే భారతీయ వ్యాపార సంస్థలన్నింటికీ మా పేమెంట్స్ సర్వీసును విస్తరిస్తున్నాం. కొనుగోలుదారులు తమకు కావాల్సిన ఉత్పత్తులను వాట్సాప్‌లోనే కార్ట్‌కి జోడించుకోవడంతో పాటు తమకు నచ్చిన పేమెంట్ విధానం ద్వారా .. అంటే వాట్సాప్ లేదా యూపీఐ యాప్‌లు, డెబిట్ .. క్రెడిట్ కార్డులతో కూడా చెల్లించవచ్చు.
ఇందుకోసం ఇతర వెబ్‌సైట్‌కి గానీ, మరో యాప్‌కి గానీ వెళ్లనక్కర్లేదు. వ్యక్తిగతంగా వెళ్లి చెల్లించనక్కర్లేదు‘ అని సంస్థ తెలిపింది. ఈ ఫీచర్ ఇప్పటికే సింగపూర్, బ్రెజిల్‌లో చిన్న వ్యాపార సంస్థల కోసం కంపెనీ అమలు చేస్తోంది. వ్యాపార సంస్థలు, కొనుగోలుదారులు మెసేజింగ్ ఫీచర్‌ను సమర్ధంగా వినియోగించుకునే విషయంలో ప్రపంచానికి భారత్ సారథ్యం వహిస్తోందని బిజినెస్ మెసేజింగ్ సదస్సు ’కన్వర్సేషన్స్’ కార్యక్రమంలో వర్చువల్‌గా పాల్గొన్న వాట్సాప్ మాతృసంస్థ మెటా వ్యవస్థాపకుడు, సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ తెలిపారు.
వాట్సాప్ ఫ్లోస్, వెరిఫైడ్ బ్యాడ్జ్ ..
మెసేజింగ్ ఫార్మాట్లు, గ్రూప్ చాట్స్, బ్రాడ్‌కాస్ట్ చానల్స్ విషయంలో మెటా ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను ఆవిష్కరిస్తోందని జుకర్‌బర్గ్ చెప్పారు. ఇందులో భాగంగా వ్యాపార సంస్థల కోసం వాట్సాప్ ఫ్లోస్, మెటా వెరిఫైడ్ బ్యాడ్జ్‌లను విస్తృతంగా అందుబాటులోకి తెస్తున్నట్లు తెలిపారు. రిజర్వేషన్ బుకింగ్, ఉత్పత్తులను ఆర్డర్ చేయడం, ఫ్లయిట్స్‌లో చెకిన్ చేయడం వంటి అంశాల్లో కస్టమర్లకు వెసులు బాటు కల్పించేలా వాట్సాప్ ఫ్లోస్‌ను వ్యాపార సంస్థలు ఉపయోగించుకోవచ్చు. మరోవైపు, మెటా వెరిఫైడ్ బ్యాడ్జ్‌లను ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్‌లకు విస్తరిస్తున్నట్లు ఆయన తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment