
న్యూఢిల్లీ: త్వరలో ప్రవేశపెట్టనున్న పేమెంట్ సేవలకు 24 గంటల కస్టమర్ సపోర్ట్ వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు వాట్సాప్ కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం ప్రయోగ దశలో ఉన్న పేమెంట్ సేవలను వచ్చే కొద్ది వారాల్లో భారత్‌లో ప్రవేశపెట్టేందుకు వాట్సాప్ ముమ్మరంగా చర్యలు చేపడుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం భారత్‌లో వాట్సాప్ మెసెంజర్ యాప్‌కు 20 కోట్ల మందికిపైగా యూజర్లు ఉన్నారు. ‘పేమెంట్ సేవల కోసం రోజంతా అందుబాటులో ఉండే కస్టమర్ సపోర్ట్‌ను ఏర్పాటు చేయనున్నాం. సేవలను ప్రవేశపెట్టిన తర్వాత యూజర్లు ఈ–మెయిల్, టోల్ ఫ్రీ నంబర్ల ద్వారా సంప్రతించవచ్చు’ అని వాట్సాప్ ప్రతినిధి తెలిపారు. ఇంగ్లిష్‌తో పాటు హిందీ, మరాఠీ, గుజరాతీ ఈ మూడు ప్రాంతీయ భాషల్లో కస్టమర్ సర్వీస్ సేవలను పొందొచ్చని ఆయన పేర్కొన్నారు.
అయితే, ఈ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేజ్(యూపీఐ) ఆధారిత పేమెంట్ సర్వీసుల ప్రారంభ తేదీ, ఇతరత్రా వివరాలను మాత్రం వెల్లడించలేదు. గడిచిన కొద్ది నెలలుగా పది లక్షల మందికిపైగా వాట్సాప్ యూజర్లు భారత్‌లో ఈ సర్వీసులను ప్రయోగాత్మకంగా వాడుతున్నట్లు అంచనా. తమ పేమెంట్ సర్వీస్ ఎలా పనిచేస్తుంది, ఇతరత్రా వివరాలను నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్‌పీసీఐ), భాగస్వామ్య బ్యాంకులు, భారత ప్రభుత్వానికి ఇప్పటికే తెలియజేశామని వాట్సాప్ ప్రతినిధి చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment