ఎన్నారైలకు శుభవార్త: యూపీఐతో రోజుకు లక్ష పంపొచ్చు | NRIs Can Now Send Rs 1 Lakh Per Day To India Using UPI And Details, Check Out More Details Inside | Sakshi
Sakshi News home page

ఎన్నారైలకు శుభవార్త: యూపీఐతో రోజుకు లక్ష పంపొచ్చు

Published Wed, Nov 6 2024 6:56 AM | Last Updated on Wed, Nov 6 2024 3:59 PM

NRIs Can Now Send Rs 1 Lakh Per Day To Using UPI And Details

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ప్రవాస భారతీయులకు (ఎన్నారైలు) నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌పీసీఐ) తీపి కబురు అందించింది. నాన్‌ రెసిడెంట్‌ ఎక్స్‌టర్నల్‌ (ఎన్‌ఆర్‌ఈ), నాన్‌ రెసిడెంట్‌ ఆర్డినరీ (ఎన్‌ఆర్‌వో) ఖాతాలున్న ఎన్నారైలు యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌ (యూపీఐ) ద్వారా ఇక నుంచి రోజుకు రూ.1 లక్ష వరకు భారత్‌లోని తమ కుటుంబ సభ్యులు, ఇతర చెల్లింపులకు నగదు పంపించవచ్చు.

ఎన్నారైలు ఇక నుంచి అంతర్జాతీయ మొబైల్‌ నంబర్‌ను ఉపయోగించి నేరుగా వారి స్మార్ట్‌ఫోన్‌ నుండి ఉచిత లావాదేవీల కోసం యూపీఐని ఉపయోగించవచ్చు. తద్వారా విదేశాల నుండి లావాదేవీలను నిర్వహించడం మరింత సౌకర్యవంతంగా ఉంటుంది. యూఎస్, కెనడా, యూకే, యూఏఈ, సింగపూర్, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, హాంగ్‌కాంగ్, మలేషియా, ఒమన్, ఖతార్, సౌదీ అరేబియాలోని ఎన్నారైలకు ఈ సౌకర్యం వర్తిస్తుంది. కొత్తగా నమోదైన యూపీఐ ఐడీల ద్వారా తొలి 24 గంటల్లో రూ.5,000 మాత్రమే పంపేందుకు వీలుంది. ఆ తర్వాతి రోజు నుంచి రోజుకు రూ.1 లక్ష పంపొచ్చు.

ఇవీ బ్యాంకులు..
యూపీఐ కోసం అంతర్జాతీయ మొబైల్‌ నంబర్ల అనుసంధానానికి ప్రస్తుతం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్, ఏయూ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్, యాక్సిస్‌ బ్యాంక్, కెనరా బ్యాంక్, సిటీ యూనియన్‌ బ్యాంక్, డీబీఎస్‌ బ్యాంక్, ఈక్విటాస్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్, ఫెడరల్‌ బ్యాంక్, నేషనల్‌ బ్యాంక్, సౌత్‌ ఇండియన్‌ బ్యాంక్‌ మద్దతు ఇస్తున్నాయి.

అంతర్జాతీయ మొబైల్‌ నంబర్లకు అనుకూలమైన యూపీఐ అప్లికేషన్‌లలో ఫోన్‌పే, గూగుల్‌ పే, పేటీఎం, భీమ్, భీమ్‌ ఏయూ, ఫెడ్‌మొబైల్, ఐమొబైల్, భీమ్‌ ఇండస్‌ పే, ఎస్‌ఐబీ మిర్రర్‌ ప్లస్‌ వంటివి ఉన్నాయి. ఎన్నారైలు తమ ఎన్‌ఆర్‌ఈ మరియు ఎన్‌ఆర్‌వో ఖాతాల మధ్య, అలాగే భారత్‌లోని ఖాతాలకు యుపీఐ లావాదేవీలు చేయవచ్చు. ఎన్‌ఆర్‌వో ఖాతా నుండి ఎన్‌ఆర్‌ఈ ఖాతాకు నిధులను బదిలీ చేయలేరు. విభిన్న బ్యాంక్‌ ఖాతాలను కలిగి ఉన్న ఎన్నారైలు ప్రతి ఖాతాకు ప్రత్యేక యూపీఐ ఐడీ అవసరం. ఖాతా ఉమ్మడిగా ఉంటే ప్రాథమిక ఖాతాదారు మాత్రమే యూపీఐని ఉపయోగించగలరు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement