Transations
-
ఎన్నారైలకు శుభవార్త: యూపీఐతో రోజుకు లక్ష పంపొచ్చు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రవాస భారతీయులకు (ఎన్నారైలు) నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) తీపి కబురు అందించింది. నాన్ రెసిడెంట్ ఎక్స్టర్నల్ (ఎన్ఆర్ఈ), నాన్ రెసిడెంట్ ఆర్డినరీ (ఎన్ఆర్వో) ఖాతాలున్న ఎన్నారైలు యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) ద్వారా ఇక నుంచి రోజుకు రూ.1 లక్ష వరకు భారత్‌లోని తమ కుటుంబ సభ్యులు, ఇతర చెల్లింపులకు నగదు పంపించవచ్చు.ఎన్నారైలు ఇక నుంచి అంతర్జాతీయ మొబైల్ నంబర్‌ను ఉపయోగించి నేరుగా వారి స్మార్ట్‌ఫోన్ నుండి ఉచిత లావాదేవీల కోసం యూపీఐని ఉపయోగించవచ్చు. తద్వారా విదేశాల నుండి లావాదేవీలను నిర్వహించడం మరింత సౌకర్యవంతంగా ఉంటుంది. యూఎస్, కెనడా, యూకే, యూఏఈ, సింగపూర్, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, హాంగ్‌కాంగ్, మలేషియా, ఒమన్, ఖతార్, సౌదీ అరేబియాలోని ఎన్నారైలకు ఈ సౌకర్యం వర్తిస్తుంది. కొత్తగా నమోదైన యూపీఐ ఐడీల ద్వారా తొలి 24 గంటల్లో రూ.5,000 మాత్రమే పంపేందుకు వీలుంది. ఆ తర్వాతి రోజు నుంచి రోజుకు రూ.1 లక్ష పంపొచ్చు.ఇవీ బ్యాంకులు..యూపీఐ కోసం అంతర్జాతీయ మొబైల్ నంబర్ల అనుసంధానానికి ప్రస్తుతం హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, కెనరా బ్యాంక్, సిటీ యూనియన్ బ్యాంక్, డీబీఎస్ బ్యాంక్, ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్, నేషనల్ బ్యాంక్, సౌత్ ఇండియన్ బ్యాంక్ మద్దతు ఇస్తున్నాయి.అంతర్జాతీయ మొబైల్ నంబర్లకు అనుకూలమైన యూపీఐ అప్లికేషన్లలో ఫోన్‌పే, గూగుల్ పే, పేటీఎం, భీమ్, భీమ్ ఏయూ, ఫెడ్‌మొబైల్, ఐమొబైల్, భీమ్ ఇండస్ పే, ఎస్ఐబీ మిర్రర్ ప్లస్ వంటివి ఉన్నాయి. ఎన్నారైలు తమ ఎన్ఆర్ఈ మరియు ఎన్ఆర్వో ఖాతాల మధ్య, అలాగే భారత్‌లోని ఖాతాలకు యుపీఐ లావాదేవీలు చేయవచ్చు. ఎన్ఆర్వో ఖాతా నుండి ఎన్ఆర్ఈ ఖాతాకు నిధులను బదిలీ చేయలేరు. విభిన్న బ్యాంక్ ఖాతాలను కలిగి ఉన్న ఎన్నారైలు ప్రతి ఖాతాకు ప్రత్యేక యూపీఐ ఐడీ అవసరం. ఖాతా ఉమ్మడిగా ఉంటే ప్రాథమిక ఖాతాదారు మాత్రమే యూపీఐని ఉపయోగించగలరు. -
ఇదే జరిగితే.. 75శాతం యూపీఐ ట్రాన్సక్షన్స్ ఆపేస్తారు!
భారతదేశంలో యూపీఐ లావాదేవీలు గణనీయంగా పెరిగిపోతున్నాయి. గత ఆర్ధిక సంవత్సరంతో పోలిస్తే.. ఈ ఏడాది యూపీఐ లావాదేవీలు 57 శాతం పెరిగినట్లు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) వెల్లడించింది. 2022-23లలో దేశంలో యూపీఐ లావాదేవీలు 84 బిలియన్లుగా నమోదయ్యాయి. కాగా ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు జరిగిన లావాదేవీలు అంతకంటే ఎక్కువని తెలుస్తోంది.యూపీఐ లావాదేవీలు భారీగా పెరగటానికి ప్రధాన కారణం.. ఎలాంటి అదనపు చార్జీలు లేకపోవడమే. ఒకవేలా అదనపు చార్జీలు వసూలు చేసినట్లయితే.. యూపీఐ లావాదేవీలను 75 శాతం మంది ఆపేసి అవకాశం ఉందని లోకల్ సర్కిల్స్ సర్వేలో వెల్లడయ్యింది.సర్వేలో పాల్గొన్నవారిలో సుమారు 38 శాతం మంది తాము చేసే ట్రాన్సాక్షన్లకు.. డెబిట్, క్రెడిట్ కార్డులకంటే కూడా యూపీఐను ఉపయోగిస్తున్నట్లు తెలిసింది. మరో 22 శాతం మంచి కేవలం యూపీఐను మాత్రమే వినియోగిస్తున్నట్లు వెల్లడైంది. కాబట్టి యూపీఐ వినియోగానికి అదనపు చార్జీలు వసూలు చేయడం జరిగితే.. 75 శాతం మంచి దీనిని ఉపయోగించడం ఆపేస్తారని సర్వేలో తెలిసింది.ఇదీ చదవండి: నోట్ల సమస్య!.. కేంద్ర ఆర్థిక మంత్రికి కాంగ్రెస్ ఎంపీ లేఖప్రస్తుతం భారతదేశంలోని 10 మందిలో కనీసం నలుగురు యూపీఐ వాడుతున్నట్లు తెలుస్తోంది. కాబట్టి యూపీఐ లావాదేవీల మీద ఎలాంటి ప్రత్యక్ష లేదా పరోక్ష ఫీజులను వసూలు చేయడం మొదలైతే.. వీరందరూ దీనిని వినియోగించడానికి కొంత వెనుకడుగు వేసే అవకాశం ఉంది. -
కస్టమర్లకు ఊరట.. దిగ్గజ బ్యాంక్‌తో పేటీఎం ఒప్పందం!
ప్రముఖ ఫిన్‌టెక్ సంస్థ పేటీఎంకు చెందిన పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్(ppbl)పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విధించిన ఆంక్షల గడువును పెంచింది. మార్చి 15 పీపీబీఎల్ ఖాతాలను ఇతర బ్యాంకులకు మార్చుకోవాలని కస్టమర్లకు సూచించింది. ఈ తరుణంలో ప్రస్తుతం తలెత్తుతున్న ఇబ్బందుల నుంచి గట్టెక్కేందుకు పేటీఎం అధినేత విజయ్ కుమార్ శర్మ ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఇందులో భాగంగా తమ సంస్థ (పేటీఎం) నోడల్ అకౌంట్‌ను పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ నుంచి యాక్సిస్ బ్యాంకుకు మార్చినట్లు అధికారికంగా ప్రకటించింది పేటీఎం. తద్వారా ఆర్బీఐ పొడిగించిన తర్వాత అంటే మార్చి 15 తర్వాత వినియోగదారులు తమ కార్యకలాపాల్ని యధావిధిగా కొనసాగించవచ్చు. పేటీఎం క్యూఆర్, సౌండ్‌బాక్స్, కార్డ్ మెషీన్ సేవలు మార్చి 15 తరవాతా వ్యాపారులకు యధావిధిగా కొనసాగుతాయని సంస్థ తెలిపింది. నోడల్ ఖాతా అంటే, సంస్థ ఖాతాదారులు, వ్యాపారుల లావాదేవీలన్నింటినీ ఈ ఖాతా ద్వారా సెటిల్మెంట్ చేస్తారు. వినియోగదారులకు ఆర్బీఐ సలహా కస్టమర్ల సౌకర్యార్థం పీపీబీఎల్‌తో లావాదేవీలపై గల సందేహాలను నివృత్తి చేసేందుకు ఎఫ్ఏక్యూలను (సాధారణంగా తలెత్తే ప్రశ్నలు, జవాబులు) కూడా రిజర్వ్ బ్యాంక్ విడుదల చేసింది. వాటి ప్రకారం.. మార్చి 15 తర్వాత జీతాలు, పెన్షన్లు పీపీబీఎల్ ఖాతాల్లో జమ కావు. పీపీబీఎల్ ద్వారా ఈఎంఐలు లేదా ఓటీటీ సబ్స్క్రిప్షన్లు కడుతున్న వారు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలి. పీపీబీఎల్ వాలెట్ ఉన్న వారు అందులోని బ్యాలెన్స్ మొత్తం అయిపోయే వరకు మార్చి 15 తర్వాత కూడా ఉపయోగించుకోవచ్చు. ఫాస్టాగ్స్‌లో బ్యాలెన్స్ ఉన్నంత వరకు వాడుకోవచ్చు. కానీ మార్చి 15 తర్వాత టాప్అప్ చేయ డానికి ఉండదు. డెడ్‌లైన్‌లోగా ఇతర బ్యాంకుల నుంచి కొత్త ఫాస్టాగ్ తీసుకోవడం మంచిది. పీపీబీఎల్ అకౌంట్ లేదా వాలెట్‌తో అనుసంధానమైన పేటీఎం క్యూఆర్ కోడ్, సౌండ్‌బాక్స్, పీవోఎస్ టెర్మినల్స్ ద్వారా చెల్లింపులను స్వీకరిస్తున్న వ్యాపారులు .. మరో బ్యాంకు అకౌంటు లేదా వాలెట్‌ని తీసుకోవాలి. ఇప్పటికే అవి వేరే బ్యాంకుతో అనుసంధానమై ఉంటే ఈ అవసరం ఉండదు. -
యూపీఐ నుంచి పొరపాటున డబ్బు పంపించారా? ఇలా చేస్తే మళ్ళీ వస్తాయ్..
Wrong UPI ID Transfer: ఆధునిక కాలంలో గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం వంటివి వాటి ద్వారా ఎక్కువ ట్రాన్సక్షన్స్ జరుగుతున్నాయి. స్మార్ట్‌ఫోన్ ఉన్న చాలా మంది ఇప్పుడు ఈ యాప్స్ ద్వారానే లావాదేవీలను చేస్తుంటారు. అయితే ఇలా ట్రాన్సక్షన్స్ జరిగే సమయాల్లో అప్పుడప్పుడు అనుకోకుండా వేరే ఖాతాలకు అమౌంట్ సెండ్ చేస్తూ ఉంటారు. ఇలాంటి అనుభవం చాలామందికి ఎదురై ఉంటుంది. అలాంటి సందర్భంలో అమౌంట్ మళ్ళీ ఎలా పొందాలి? ఎవరికి పిర్యాదు చేయాలనే మరిన్ని విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ✸ ఒక వ్యక్తి అనుకోకుండా యూపీఐ ద్వారా అమౌంట్ వేరే ఖాతాలకు పంపించినప్పుడు ముందుగా ఆ వ్యక్తిని కాంటాక్ట్ అవ్వాలి. అనుకోకుండా అమౌంట్ పంపించామని, దాన్ని తిరిగి పంపించాలని అడగాలి. నిజాయితీగా ఉండే వ్యక్తులు తప్పకుండా అమౌంట్ తిరిగి పంపిస్తారు. అలా కాకుండా కొంతమంది డబ్బు పంపించనప్పుడు వెంటనే యూపీఐ కస్టమర్ సపోర్ట్ తీసుకోవాలి. (ఇదీ చదవండి: దేశంలో మొట్టమొదటి సెల్ఫ్ డ్రైవింగ్ కారు - టెక్నాలజీలో భళా భారత్) ✸ యూపీఐ కస్టమర్ సపోర్ట్ తీసుకోవాలనుకున్నప్పుడు ముందుగా ఏ యూపీఐ ద్వారా అమౌంట్ ట్రాన్స్ఫర్ అయిందో ఆ యూపీఐ కస్టమర్ సపోర్ట్‌కి కంప్లైంట్ చేయాలి, పొరపాటున డబ్బు వేరే ఖాతాకు జమయ్యిందని జరిగిన విషయం వెల్లడిస్తే.. వారు తిరిగి డబ్బు వచ్చేలా చేస్తారు. ✸ యూపీఐ కస్టమర్ సపోర్ట్ నుంచి కూడా మీకు సానుకూల స్పందన రాకుండా పోతే, అప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను సంప్రదించాలి. ఆర్బీఐ ప్రత్యేకించి ఇలాంటి సమస్యలను పరిష్కరించడానికి 'అంబుడ్స్‌మెన్ ఫర్ డిజిటల్ ట్రాన్సక్షన్స్' (Ombudsman for Digital Transactions) పేరుతో ఒక ప్రత్యేక అధికారిని నియమించింది. ఆ అధికారికి మీరు పిర్యాదు చేయడం ద్వారా తిరిగి డబ్బు వెనక్కి పొందవచ్చు. -
మారనున్న ట్యాక్స్ రూల్స్, క్రిప్టో కరెన్సీలపై!
న్యూఢిల్లీ: వర్చువల్ డిజిటల్ అసెట్స్‌పై టీడీఎస్ (ట్యాక్స్ డిడక్టెడ్ ఎట్ సోర్స్) వివరాల వెల్లడికి సంబంధించి ఆదాయ పన్ను శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. దీని ప్రకారం డిడక్షన్ చేసిన నెల ముగిశాక, 30 రోజుల్లోగా టీడీఎస్‌ను జమ చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం చలానా–కమ్–స్టేట్మెంట్ ఫారం 26క్యూఈని ఉపయోగించాలి. వర్చువల్ డిజిటల్ అసెట్స్ (వీడీఏ) బదలాయింపు తేదీ, విలువ, చెల్లింపు విధానం మొదలైన వివరాలన్నీ దగ్గర ఉంచుకోవాలి. జూలై 1 నుంచి వీడీఏలు లేదా క్రిప్టోకరెన్సీలపై 1 శాతం టీడీఎస్ విధించనున్న నేపథ్యంలో తాజా వివరణ ప్రాధాన్యం సంతరించుకుంది. తాజా నిబంధనలు వీడీఏ లావాదేవీల గురించి తెలుసుకునేందుకు ట్యాక్స్ విభాగానికి ఉపయోగపడతాయని, కానీ పన్ను చెల్లింపుదారులపై మాత్రం నిబంధనల భారం పెరిగిపోతుందని ఏకేఎం గ్లోబల్ ట్యాక్స్ పార్ట్నర్ అమిత్ మహేశ్వరి తెలిపారు. -
డిజిటల్ లావాదేవీలు : ఆర్బీఐ కీలక నిర్ణయం
సాక్షి, ముంబై: వరుసగా మూడవ సారి కీలక వడ్డీరేట్లను యథాతథంగా ఉంచిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) మరోకీ లక నిర్ణయం తీసుకుంది. మరింత కాంటాక్ట్‌లెస్ చెల్లింపుల వాడకాన్ని ఊతమిచ్చే చర్యల్లో భాగంగా కాంటాక్ట్‌లెస్ కార్డు చెల్లింపుల పరిమితినిపెంచాలని ప్రతిపాదించింది. ప్రస్తుతమున్న కాంటాక్ట్ లెస్ కార్డు లావాదేవీల పరిమితిని 2 వేల రూపాయలనుంచి 5 వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. 2021, జనవరి నుంచి ఈ నిర్ణయం అమల్లోకి రానుందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ శుక్రవారం ప్రకటించారు. (ఆర్బీఐ ఎఫెక్ట్- 45,000 దాటిన సెన్సెక్స్) ముఖ్యంగా ప్రస్తుత కరోనా మహమ్మారి సమయంలో సమర్ధవంత, సురక్షితమైన, డిజిటల్ లావాదేవీలు అందుబాటులో ఉంటాయని శక్తికాంత దాస్ చెప్పారు. 24గంటలు,వారంరోజుల పాటు (24x7) ఆర్టీజీఎస్ వ్యవస్థ అందుబాటులో ఉండేలా త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. వాణిజ్య, సహకార బ్యాంకులు 2019-20లో వచ్చిన లాభాలను నిలుపుకోవాలని సూచించారు. చాలా రంగాలు రికవరీ మార్గంలోకి వస్తున్న క్రమంలో ఆర్థిక వ్యవస్థ వేగంగా పుంజుకుంటుందని ఆయన పేర్కొన్నారు. మరోవైపు కీలక వడ్డీ రేట్లలో ఆర్బీఐ ఎలాంటి మార్పులు చేయలేదు. దీంతో రెపో రేటు 4శాతం, రివర్స్ రెపో రేటు 3.35 శాతం వద్ద కొనసాగనుంది. ఈ నిర్ణయానికి మానిటరీ పాలసీ కమిటీ ఏకగ్రీవ ఆమోదం తెలిపింది. కొవిడ్-19 ప్రభావాన్ని సాధ్యమైనంత వరకూ తగ్గిస్తూ.. ద్రవ్యోల్బణాన్ని నియంత్రణలో ఉంచడమే లక్ష్యంగా మానిటరీ పాలసీ కమిటీ నిర్ణయాలు తీసుకుంటోందని శక్తికాంత దాస్ చెప్పారు. (చదవండి : కల్తీ తేనె కలకలం : మరింత కరోనా ముప్పు) -
నగదు రహిత లావాదేవీలపై శిక్షణ
గుంటూరు (నెహ్రూనగర్) : పెద్ద నోట్ల రద్దు కారణంగా ఇబ్బందులను అధిగమించడానికి వార్డు, గ్రామ స్థాయిలో రిసోర్స్‌పర్సన్స్‌కు నగదు రహిత లావాదేవీలు, మైక్రో ఏటీఎంల నిర్వహణపై శిక్షణ ఇచ్చారు. నగరపాలక సంస్థ కౌన్సిల్ హాలులో బ్యాంకర్లతో శిక్షణ ఇప్పించారు. ఈ సందర్భంగా మెప్మా పీడీ సలీంఖాన్ మాట్లాడుతూ 500, 1000 రూపాయిల నోట్ల రద్దుతో చిల్లర కొరత ఏర్పడి సామాన్యులు చాలా ఇబ్బందులు పడుతున్నారని, దానిని అదిగమించడానికి ప్రభుత్వ ఆదేశాల మేరకు రూపే కార్డుల ద్వారా నగరు రహిత లావాదేవీలు, చిల్లర అవసరమైన చోట బ్యాంకుల సహాయంతో మైక్రో ఏటీఎంలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. గుంటూరు జిల్లాలో 12 మున్సిపాలిటీల్లో, గుంటూరు నగరపాలక సంస్థలో ప్రతి శివారు కాలనీలలో సమైక్యల ద్వారా ఒక రిసోర్స్ పర్సన్‌ను ఎంపిక చేసి నగదు రహిత లావాదేవీలు ఏటీఎం ద్వారా, రూపేకార్డు ద్వారా, డెబిట్ కార్డు ద్వారా, మొబైల్ యాప్ ద్వారా, ఈ-బ్యాంకింగ్ ద్వారా, అకౌంట్ ద్వారా నగదు రహిత లావాదేవీలు నిర్వహించవచ్చునని వివరిస్తారన్నారు. సమావేశంలో ఆంధ్రా బ్యాంకు మేనేజర్ కృష్ణమోహన్, ఇండియన్ బ్యాంకు మైక్రోశాట్ మేనేజర్ రాఘవరావు, ఉపాసెల్ పీఓ సింహాచలం, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.