ప్రముఖ ఫిన్‌టెక్ సంస్థ పేటీఎంకు చెందిన పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్(ppbl)పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విధించిన ఆంక్షల గడువును పెంచింది. మార్చి 15 పీపీబీఎల్ ఖాతాలను ఇతర బ్యాంకులకు మార్చుకోవాలని కస్టమర్లకు సూచించింది. ఈ తరుణంలో ప్రస్తుతం తలెత్తుతున్న ఇబ్బందుల నుంచి గట్టెక్కేందుకు పేటీఎం అధినేత విజయ్ కుమార్ శర్మ ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు.
ఇందులో భాగంగా తమ సంస్థ (పేటీఎం) నోడల్ అకౌంట్‌ను పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ నుంచి యాక్సిస్ బ్యాంకుకు మార్చినట్లు అధికారికంగా ప్రకటించింది పేటీఎం. తద్వారా ఆర్‌బీఐ పొడిగించిన తర్వాత అంటే మార్చి 15 తర్వాత వినియోగదారులు తమ కార్యకలాపాల్ని యధావిధిగా కొనసాగించవచ్చు.
పేటీఎం క్యూఆర్, సౌండ్‌బాక్స్, కార్డ్ మెషీన్ సేవలు మార్చి 15 తరవాతా వ్యాపారులకు యధావిధిగా కొనసాగుతాయని సంస్థ తెలిపింది. నోడల్ ఖాతా అంటే, సంస్థ ఖాతాదారులు, వ్యాపారుల లావాదేవీలన్నింటినీ ఈ ఖాతా ద్వారా సెటిల్‌మెంట్ చేస్తారు.
వినియోగదారులకు ఆర్‌బీఐ సలహా
కస్టమర్ల సౌకర్యార్థం పీపీబీఎల్‌తో లావాదేవీలపై గల సందేహాలను నివృత్తి చేసేందుకు ఎఫ్‌ఏక్యూలను (సాధారణంగా తలెత్తే ప్రశ్నలు, జవాబులు) కూడా రిజర్వ్ బ్యాంక్ విడుదల చేసింది. వాటి ప్రకారం..
మార్చి 15 తర్వాత జీతాలు, పెన్షన్లు పీపీబీఎల్ ఖాతాల్లో జమ కావు. పీపీబీఎల్ ద్వారా ఈఎంఐలు లేదా ఓటీటీ సబ్‌స్క్రిప్షన్లు కడుతున్న వారు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలి.
పీపీబీఎల్ వాలెట్ ఉన్న వారు అందులోని బ్యాలెన్స్ మొత్తం అయిపోయే వరకు మార్చి 15 తర్వాత కూడా ఉపయోగించుకోవచ్చు.
ఫాస్టాగ్స్‌లో బ్యాలెన్స్ ఉన్నంత వరకు వాడుకోవచ్చు. కానీ మార్చి 15 తర్వాత టాప్‌అప్ చేయ డానికి ఉండదు. డెడ్‌లైన్‌లోగా ఇతర బ్యాంకుల నుంచి కొత్త ఫాస్టాగ్ తీసుకోవడం మంచిది.
పీపీబీఎల్ అకౌంట్ లేదా వాలెట్‌తో అనుసంధానమైన పేటీఎం క్యూఆర్ కోడ్, సౌండ్‌బాక్స్, పీవోఎస్ టెర్మినల్స్ ద్వారా చెల్లింపులను స్వీకరిస్తున్న వ్యాపారులు .. మరో బ్యాంకు అకౌంటు లేదా వాలెట్‌ని తీసుకోవాలి. ఇప్పటికే అవి వేరే బ్యాంకుతో అనుసంధానమై ఉంటే ఈ అవసరం ఉండదు.
Comments
Please login to add a commentAdd a comment