Reserve Bank of India (RBI)
-
కోవిడ్ వెంటాడినా ఏపీ వృద్ధి ముందుకే
సాక్షి, అమరావతి: రెండేళ్లపాటు కోవిడ్ సంక్షోభం వెంటాడినా గడచిన ఐదేళ్ల వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో రాష్ట్ర వృద్ధి ముందుకే సాగింది. ఐదేళ్ల పాలనలో స్థిర ధరల ఆధారంగా రాష్ట్ర స్థూల ఉత్పత్తి రూ.1.94 లక్షల కోట్లు పెరిగింది. వ్యవసాయ, తయారీ, పారిశ్రామిక, సేవలు, నిర్మాణ రంగాలన్నింటిలోనూ వృద్ధి కొనసాగింది. స్థిర ధరల ఆధారంగా వృద్ధి గణన మాత్రమే నిజమైన అభివృద్ధిని ప్రతిబింబిస్తుందని ఆర్ధికరంగ నిపుణులు పేర్కొంటారు. రిజర్వుబ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) 2023–24 ఆర్థిక సంవత్సరం వరకు వివిధ రంగాల వృద్ధి గణాంకాలను విడుదల చేసింది. ఐదేళ్ల వైఎస్ జగన్ పాలనలో స్థిర ధరల ఆధారంగా జీఎస్డీపీ 31.04 శాతం వృద్ధి నమో దైనట్టు ఆర్బీఐ గణాంకాలు స్పష్టం చేశాయి. సగటు వార్షిక వృద్ధి 6.20 శాతం నమోదైంది. వైఎస్ జగన్ పాలనలో వ్యవసాయ రంగం వృద్ధి 16.46 శాతం నమోదు కాగా.. సగటు వార్షిక వృద్ధి 3.29 శాతం నమోదైంది. సంక్షోభంలోనూ.. కోవిడ్ సంక్షోభం ప్రపంచాన్ని రెండేళ్లు వెంటాడింది. ఆ పరిస్థితుల్లోనూ ఆర్థిక కార్యకలాపాలు నిలిచిపోకుండా తగిన జాగ్రత్తలు పాటిస్తూ వైఎస్ జగన్ ప్రభుత్వం కొనసాగించడం వల్లే ఈ వృద్ధి నమోదైందని ఆర్ధిక రంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. తయారీ రంగం ఐదేళ్లలో 58.39 శాతం వృద్ధి నమోదు కాగా.. సగటు వార్షిక వృద్ధి 11.67 శాతం నమోదైంది. పారిశ్రామిక రంగంలో 46.62 శాతం వృద్ధి నమోదు కాగా.. సగటు వార్షిక వృద్ధి 9.32 శాతంగా నమోదైంది. నిర్మాణ రంగంలో గత ఐదేళ్లలో 41.50 శాతం వృద్ధి నమోదవ్వగా.. సగటు వార్షిక వృద్ధి 8.3 శాతంగా ఉంది. ఐదేళ్లలో బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ రంగంలో 42.04 శాతం వృద్ధి నమోదు కాగా.. సగటు వార్షిక వృద్ధి 8.40 శాతంగా ఉంది. సేవా రంగం 22.90 శాతం వృద్ధి నమోదు చేయగా.. సగటు వార్షిక వృద్ధి 4.5 శాతంగా నమోదైంది. -
రైతులకు తనఖా లేకుండా రూ.2 లక్షల రుణం
న్యూఢిల్లీ: రైతులకు తనఖా లేని రుణ పరిమితిని రూ.2 లక్షలకు పెంచుతూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నిర్ణయం తీసుకుంది. ఇది 2025 జనవరి 1 నుండి అమలులోకి రానుంది. ఈ మేరకు దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంకులకు ఆదేశించింది. ఇప్పటి వరకు తనఖా లేని రుణ పరిమితి రూ.1.6 లక్షలు ఉంది. ముడిసరుకు వ్యయాలు పెరుగుతున్న నేపథ్యంలో చిన్న, సన్నకారు రైతులను ఆదుకునే లక్ష్యంతో ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. ఆర్బీఐ తీసుకున్న నిర్ణయంతో కిసాన్ క్రెడిట్ కార్డ్ (కేసీసీ) రుణాలు సులభంగా రైతులకు చేరేందుకు వీలు కల్పిస్తుందని భావిస్తున్నారు. ఈ చర్య దేశంలోని చిన్న, సన్నకారు భూస్వాములైన 86 శాతం మంది రైతులకు గణనీయంగా ప్రయోజనం చేకూరుస్తుందని వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన తెలిపింది. ఆర్బీఐ తాజా మార్గదర్శకాలను వేగంగా అమలు చేయాలని, కొత్త రుణ నిబంధనలపై రైతులకు విస్తృతంగా అవగాహన కల్పించాలని బ్యాంకులకు ఈ సందర్భంగా సూచించింది. వ్యవసాయ రంగంలో ఆర్థిక సేవలను పెంపొందించడానికి, వ్యవసాయ కార్యకలాపాలలో పెట్టుబడి పెట్టడానికి, వారి జీవనోపాధిని మెరుగుపరచడానికి రైతులకు అవసరమైన ఆర్థిక సౌలభ్యాన్ని అందించడానికి ఈ చొరవ ఒక వ్యూహాత్మక చర్యగా పరిగణిస్తున్నారు. వ్యవసాయ ముడిసరుకు ఖర్చులపై ద్రవ్యోల్బణ ఒత్తిళ్లను పరిష్కరించడం, రుణ లభ్యత పెంచడం, వ్యవసాయ ఆర్థిక వృద్ధికి మద్దతు ఇవ్వడం కోసం ఈ చొరవ కీలక దశగా ఈ రంగ నిపుణులు భావిస్తున్నారు. -
నవంబర్‌లో ద్రవ్యోల్బణం ఊరట
న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ద్రవ్య పరపతి విధానానికి ప్రాతిపదిక అయిన రిటైల్ ద్రవ్యోల్బణం నవంబర్‌లో కొంత ఊరట నిచ్చింది. సూచీ 5.48 శాతంగా (2023 ఇదే నెలతో పోల్చి) నమోదయ్యింది. ఆహార ఉత్పత్తులు ప్రత్యేకించి కూరగాయల ధరలు తగ్గడం దీనికి ప్రధాన కారణం. రిటైల్ ద్రవ్యోల్బణం అక్టోబర్‌లో ఆందోళనకరంగా 14 నెలల గరిష్ట స్థాయిలో 6.2 శాతంగా (2023 ఇదే నెలతో పోల్చి) నమోదయిన సంగతి తెలిసిందే. ఆర్బీఐకి కేంద్రం నిర్దేశాల ప్రకారం రిటైల్ ద్రవ్యోల్బణం 2 శాతం అటు ఇటుగా 4 శాతం వద్ద ఉండాలి. అంటే ఎగువదిశగా 6 శాతం పైకి పెరగకూడదు. జాతీయ గణాంకాల కార్యాలయం విడుదల చేసిన నవంబర్ గణాంకాల్లో ముఖ్యమైనవి... → అక్టోబర్‌లో 10.87 శాతంగా ఉన్న ఫుడ్ బాస్కెట్ ద్రవ్యోల్బణం సమీక్షా నెల్లో 9.04 శాతానికి తగ్గింది. → కూరగాయలుసహా పప్పుదినుసులు, ఉత్పత్తులు, చక్కెర, పండ్లు, గుడ్లు, పాలు, పాల ఉత్పత్తులు సుగంధ ద్రవ్యాల ధరలు తగ్గాయి. -
ఆర్బీఐపై వెబ్ సిరీస్
న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) 90 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణంపై స్టార్ ఇండియా వెబ్ సిరీస్‌ను రూపొందించనుంది. దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలో కేంద్ర బ్యాంక్ కీలక పాత్ర గురించి ఈ వెబ్ సిరీస్ ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తారు. 1935లో ప్రారంభమైన ఆర్బీఐ.. ఈ ఏడాది ఏప్రిల్‌లో 90 వసంతాలు పూర్తి చేసుకుంది. వెస్ సిరీస్ రూపొందించేందుకు ఆర్బీఐ 2024 జూలైలో టెండర్లను పిలిచింది. స్టార్ ఇండియా, వయాకామ్ 18, జీ ఎంటర్టైన్మెంట్ నెట్వర్క్, డిస్కవరీ కమ్యూనికేషన్స్ ఇండియా పోటీపడ్డాయి. స్టార్ ఇండియా రూ.6.5 కోట్ల విలువైన ఈ టెండర్‌ను దక్కించుకుంది. 25–30 నిముషాల నిడివిగల అయిదు ఎపిసోడ్స్ నిర్మిస్తారు. జాతీయ టీవీ చానెళ్లు, ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో ఈ ఎపిసోడ్స్ ప్రసారం చేస్తారు. -
రూ.2,610 కోట్ల అక్రమ డిపాజిట్లు..18 ఏళ్లుగా జిత్తులు!
చట్టపరమైన చర్యల కోసం కింది కోర్టులో అదీకృత అధికారి ఫిర్యాదు చేస్తే దానిపై పిటిషన్..! వాస్తవాలను నిగ్గు తేల్చేందుకు కమిషన్‌ను నియమిస్తే పిటిషన్...! అధీకృత అధికారిని నియమిస్తే పిటిషన్..! కేసు వాదించడానికి స్పెషల్ పీపీని నియమిస్తే పిటిషన్! కింది కోర్టు విచారణకు స్వీకరిస్తే పిటిషన్...! వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశిస్తే పిటిషన్..! హైకోర్టు జోక్యానికి నిరాకరిస్తే సుప్రీంకోర్టులో పిటిషన్...!! సాక్షి, అమరావతి: ఇలా పిటిషన్ల మీద పిటిషన్లు వేస్తూ, స్టేల మీద స్టేలు పొందుతూ మార్గదర్శి, రామోజీరావు కాలం వెళ్లదీస్తూ వచ్చారు. దాని ఫలితంగానే గత 18 ఏళ్లుగా కేసు కొనసాగుతూ వస్తోంది. ప్రజల నుంచి ఏకంగా రూ.2,610 కోట్ల మేర డిపాజిట్లను అక్రమంగా వసూలు చేసిన మార్గదర్శి ఫైనాన్షియర్స్, దాని కర్త రామోజీరావు బండారం 2006 నవంబర్ 6న బట్టబయలైంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) చట్టం సెక్షన్ 45 ఎస్‌కు విరుద్ధంగా అక్రమంగా డిపాజిట్లు వసూలు చేయడంపై ప్రజల ముందు నిలబెట్టిన రోజు అది. ఇంత భారీ మొత్తంలో డిపాజిట్లు వసూలు చేసి అడ్డంగా దొరికిపోయిన మార్గదర్శి, రామోజీరావు చట్టం నుంచి తప్పించుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తూ వచ్చారు. ప్రతి దశలోనూ విచారణను అడ్డుకుంటూ వచ్చారు. అయితే ఈ కేసులో సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు తిరిగి విచారణ చేపట్టిన తెలంగాణ హైకోర్టు ఈ నెల 7వ తేదీన మరోసారి విచారణ జరపనుంది. ఆర్బీఐ చట్టం సెక్షన్ 45 ఎస్‌కు విరుద్ధంగా మార్గదర్శి డిపాజిట్లు స్వీకరించిందా? లేదా? అనే విషయాన్ని తేల్చనుంది. చట్ట విరుద్ధంగా మార్గదర్శి డిపాజిట్లు సేకరించినట్లు తేలితే వసూలు చేసిన రూ.2,610 కోట్లకు రెట్టింపు మొత్తాన్ని జరిమానాగా చెల్లించాల్సి ఉంటుంది. అటు అక్రమ డిపాజిట్లు.. ఇటు నష్టాలంటూ రామోజీరావు 1972లో హిందూ అవిభాజ్య కుటుంబం (హెచ్‌యూఎఫ్) కింద మార్గదర్శి ఫైనాన్షియర్స్‌ను ఏర్పాటు చేశారు. 1997 కేంద్ర చట్టం ప్రకారం హెచ్‌యూఎఫ్ లాంటి అన్ ఇన్ కార్పొరేటెడ్ (చట్టపరంగా ఓ కంపెనీగా రిజిష్టర్ కాకుండా వ్యాపారం చేసేవి) సంస్థలు వ్యాపార కార్యకలాపాల కోసం ప్రజల నుంచి డిపాజిట్లు స్వీకరించడం నిషిద్ధం. అయితే దీన్ని ఖాతరు చేయకుండా మార్గదర్శి ఫైనాన్షియర్స్ ఆర్బీఐ చట్ట నిబంధనలను ఉల్లంఘించి 1997 నుంచి 2006 మార్చి నాటికి 2.75 లక్షల మంది డిపాజిటర్ల నుంచి దాదాపు రూ.2,610.38 కోట్లు అక్రమంగా వసూలు చేసింది. ఇంత భారీగా డిపాజిట్లు వసూలు చేసిన మార్గదర్శి ఆశ్చర్యకరంగా 2006 మార్చి నాటికి రూ.1,369.47 కోట్లను వృద్ధి చెందుతున్న నష్టాలుగా చూపింది. తద్వారా 50 శాతం మంది డిపాజిటర్లకు డిపాజిట్లు చెల్లించలేని పరిస్థితికి మార్గదర్శి ఫైనాన్షియర్స్ చేరింది. డొంక కదిల్చిన ఉండవల్లి... మార్గదర్శి ఫైనాన్షియర్స్ ద్వారా రామోజీ చట్ట విరుద్ధంగా డిపాజిట్లు స్వీకరించడంపై అప్పటి కాంగ్రెస్ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ 2006 నవంబర్ 6న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఫిర్యాదు చేశారు. మార్గదర్శి అక్రమాల తీరును బహిర్గతం చేశారు. ఇదే సమయంలో ఆ డిపాజిట్ల వివరాలను ఆర్బీఐ అప్పటి రాష్ట్ర ప్రభుత్వానికి పంపడంతోపాటు మార్గదర్శి ఫైనాన్షియర్స్ నుంచి వివరణ కోరింది. వాస్తవానికి 1997లోనే డిపాజిట్ల సేకరణపై మార్గదర్శి స్పష్టత కోరగా ప్రజల నుంచి అలా సేకరించడం చట్ట విరుద్ధమని ఆర్బీఐ అప్పుడే స్పష్టం చేసింది. అయినా సరే పట్టించుకోకుండా మార్గదర్శి చట్ట విరుద్ధంగా డిపాజిట్లు సేకరిస్తూ వచ్చింది. ఎప్పుడైతే ఉండవల్లి అరుణ్ కుమార్ ఫిర్యాదు చేశారో అప్పుడు మళ్లీ ఆర్బీఐ దీనిపై స్పందించింది. డిపాజిటర్ల పరిరక్షణ చట్టం కింద చర్యలు తీసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రమే ఉందని ఆర్బీఐ స్పష్టంగా చెప్పింది. రంగాచారి, కృష్ణరాజు నియామకం.. డిపాజిటర్ల పరిరక్షణ చట్టం కింద చర్యలు తీసుకునే అధికారం తమకు లేదని ఆర్బీఐ చేతులెత్తేయడంతో చట్ట ప్రకారం అప్పటి రాష్ట్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. ముందుగా మార్గదర్శి ఫైనాన్షియర్స్ అక్రమాలపై నిగ్గు తేల్చి నివేదిక ఇచ్చేందుకు అప్పటి ప్రభుత్వ సలహాదారు (ఫైనాన్స్) ఎన్.రంగాచారిని, చట్ట ప్రకారం న్యాయస్థానాల్లో ఫిర్యాదు చేసేందుకు, తదనుగుణంగా చర్యలు తీసుకునేందుకు ఐపీఎస్ టి.కృష్ణరాజును అ«దీకృత అధికారిగా నియమిస్తూ జీవో జారీ చేసింది. ఈ నియామకాలను సవాలు చేస్తూ రామోజీ 2006లో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా న్యాయస్థానం కొట్టివేసింది. అనంతరం 2007లో సుప్రీంకోర్టును ఆశ్రయించగా అత్యున్నత న్యాయస్థానం సైతం ఆ పిటిషన్‌ను కొట్టేసింది. ఐటీ శాఖ నుంచి సేకరించిన రంగాచారి.. డిపాజిటర్ల ప్రయోజనాల పరిరక్షణే లక్ష్యంగా రంగాచారి నిర్వహించిన విచారణకు రామోజీరావు, మార్గదర్శి సహకరించకుండా కార్యాలయాల్లో తనిఖీలకు అడ్డంకులు సృష్టించారు. తమ పిటిషన్లు కోర్టు ముందు పెండింగ్‌లో ఉన్నాయని, డాక్యుమెంట్లు ఇచ్చేది లేదంటూ మొండికేశారు. దీంతో రంగాచారి ఆ వివరాలను ఆదాయపు పన్ను శాఖ నుంచి తెప్పించుకున్నారు. ఆర్బీఐ చట్టం సెక్షన్ 45(ఎస్)కు విరుద్ధంగా మార్గదర్శి డిపాజిట్లు సేకరించడం నిజమేనని పేర్కొంటూ 2007 ఫిబ్రవరి 19న ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. వడ్డీ చెల్లించే అలవాటే మార్గదర్శికి లేదని, ఒత్తిడి చేస్తేనే చెల్లిస్తుందంటూ ఓ డిపాజిటర్ హైకోర్టుకు నివేదించటాన్ని తన నివేదికలో పొందుపరిచారు. మార్గదర్శి ఫైనాన్షియర్స్ ఆర్ధిక పరిస్థితి దారుణంగా ఉందని, అది డిపాజిట్లను తిరిగి చెల్లించే స్థితిలో లేదని ఆయన స్పష్టంగా పేర్కొన్నారు. రామోజీ పెట్టుబడి రూపాయైనా లేదు.. మార్గదర్శి ఫైనాన్షియర్స్ ద్వారా ప్రజల నుంచి సేకరించిన డిపాజిట్లను రామోజీ తన అనుబంధ కంపెనీలకు మళ్లించడమే నష్టాలకు ప్రధాన కారణమని రంగాచారి తన విచారణలో తేల్చారు. 2000, ఆ తరువాత బ్యాలెన్స్ షీట్లను గమనిస్తే మార్గదర్శి ఫైనాన్షియర్స్‌లో రామోజీ ఒక్క రూపాయి కూడా పెట్టుబడి పెట్టలేదన్నారు. ప్రజల నుంచి వసూలు చేసిన డిపాజిట్లతోనే మార్గదర్శిని నడిపారని నిగ్గు తేల్చారు. కోర్టు అనుమతితో తనిఖీలు.. మరోవైపు ఈ కేసులో అదీకృత అధికారిగా నియమితులైన కృష్ణరాజు కోర్టు అనుమతితో మార్గదర్శి ఫైనాన్షియర్స్‌లో తనిఖీలు చేశారు. దీన్ని సవాలు చేస్తూ మార్గదర్శి, రామోజీరావు దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేస్తూ 14.3.2007న కోర్టు ఉత్తర్వులిచ్చింది. దీనిపై రామోజీ హైకోర్టును ఆశ్రయించగా కింది కోర్టు ఇచ్చిన సెర్చ్ వారెంట్‌ను నిలుపుదల చేసింది. ఈ క్రమంలో చట్ట ఉల్లంఘనలకు పాల్పడినందుకు మార్గదర్శి ఫైనాన్షియర్స్, రామోజీరావులను ప్రాసిక్యూట్ చేయాలని కోరుతూ అ«దీకృత అధికారి టి.కృష్ణరాజు 2008 జనవరి 23న నాంపల్లి మొదటి అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో ఫిర్యాదు (సీసీ నెంబర్ 540) చేశారు. దీన్ని కొట్టి వేయాలంటూ అదే ఏడాది రామోజీ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు తోసిపుచ్చింది. జస్టిస్ రజనీ స్టేతో మూలపడిన కేసు.. దీంతో దిక్కుతోచని రామోజీ 2010లో ఓ అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు. అ«దీకృత అధికారి ఇచ్చిన ఫిర్యాదులో విచారణను సెక్షన్ 45(ఎస్)(1), 45(ఎస్)(2), 58బీ(5ఏ) రెడ్ విత్ సెక్షన్ 58(ఈ)లకే పరిమితం చేయాలన్న అభ్యర్థనను తోసిపుచ్చుతూ నాంపల్లి కోర్టు 2011లో ఉత్తర్వులిచ్చింది. ఈ ఉత్తర్వులపై మార్గదర్శి, రామోజీ హైకోర్టును ఆశ్రయించారు. ఆర్బీఐ చట్టం పరిధిలోకి మార్గదర్శి ఫైనాన్షియర్స్ రాదంటూ వాదించారు. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన అప్పటి న్యాయమూర్తి జస్టిస్ తేలప్రోలు రజనీ మార్గదర్శిపై కృష్ణరాజు దాఖలు చేసిన ఫిర్యాదులో తదుపరి చర్యలన్నీ నిలిపేస్తూ 20.7. 2011న మధ్యంతర ఉత్తర్వులిచ్చారు.‘‘స్టే’’ వల్ల కేసు అప్పటి నుంచి మూలనపడిపోయింది. అటు తరువాత వచ్చిన ప్రభుత్వాలు రామోజీ గుప్పిట్లో ఉండటంతో మార్గదర్శి అక్రమాలను పట్టించుకోలేదు. విచారణ.. తీర్పు.. ఒకే రోజు ఉమ్మడి హైకోర్టు విభజన 1.1.2019న జరిగింది. 31.12.2018 ఉమ్మడి హైకోర్టుకు చివరి రోజు. అటు న్యాయవాదులు ఇటు న్యాయమూర్తులు అందరూ భావోద్వేగ వాతావరణంలో ఉన్నారు. కేసుల విచారణపై దృష్టి సారించలేని పరిస్థితిని రామోజీరావు తనకు అనుకూలంగా మలచుకున్నారు. నాంపల్లి కోర్టులో అ«దీకృత కృష్ణరాజు చేసిన ఫిర్యాదును కొట్టేయాలంటూ 2011లో తాము దాఖలు చేసిన వ్యాజ్యాలను రామోజీ విచారణకు తెప్పించారు. ఈ వ్యాజ్యాలపై న్యాయమూర్తి జస్టిస్ తేలప్రోలు రజనీ విచారణ జరిపారు. రామోజీరావు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్దార్థ లూథ్రాను రంగంలోకి దించారు. లూథ్రా వాదనలు విన్న జస్టిస్ రజనీ ఇంత పెద్ద కేసులో అదే రోజు అంటే 31వతేదీన తీర్పు కూడా ఇచ్చేశారు. రామోజీ, మార్గదర్శి వాదనను సమర్ధించారు. హెచ్‌యూఎఫ్.. ఆర్బీఐ చట్టంలోని సెక్షన్ 45ఎస్ పరిధిలోకి రాదని జస్టిస్ రజనీ తన తీర్పులో తేల్చేశారు. మార్గదర్శి, రామోజీరావులను ప్రాసిక్యూట్ చేయాలని కోరుతూ నాంపల్లి కోర్టులో అధీకృత అధికారి కృష్ణరాజు దాఖలు చేసిన ఫిర్యాదును కొట్టేస్తూ తీర్పునిచ్చారు. ఇంత పెద్ద కేసులో ఒకే రోజు విచారణ జరిపి అదే రోజు తీర్పునివ్వడం అరుదైన ఘటన. అసలు ఈ కేసు విచారణకు వచ్చినట్లు గానీ, న్యాయమూర్తి ఈ విధంగా తీర్పునిచ్చినట్లుగానీ ఎవరూ గుర్తించలేదు. అటు తరువాత కొద్ది నెలలకు ఈ తీర్పు వెలుగు చూసింది. మరో ఆసక్తికర విషయం ఏమిటంటే.. జస్టిస్ రజనీ తీర్పుపై మార్గదర్శి, రామోజీరావు సుప్రీంకోర్టును ఆశ్రయించడం. అటు తరువాత మార్గదర్శి ఫైనాన్షియర్స్ కుంభకోణాన్ని బయటపెట్టిన మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అప్రమత్తమై హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ 2019 డిసెంబర్ 17న సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంలో ఆంధప్రదేశ్ ప్రభుత్వం ఇంప్లీడ్ అయింది. హైకోర్టు తీర్పును రద్దు చేసిన సుప్రీం.. హైకోర్టు తీర్పులో కొంత భాగంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ మార్గదర్శి, రామోజీరావు 19.9.2020న సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కేసును కొట్టేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం17.8.2022న సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అటు ఉండవల్లి అరుణ్ కుమార్, ఏపీ ప్రభుత్వం, ఇటు మార్గదర్శి, రామోజీరావు వేర్వేరుగా దాఖలు చేసిన వ్యాజ్యాలపై సుప్రీంకోర్టు 2020 నుంచి విచారిస్తూ వచ్చింది. మార్గదర్శి, రామోజీరావు చట్ట ఉల్లంఘనలకు పాల్పడినట్లు విచారణ సందర్భంగా ఆర్బీఐ న్యాయవాది మౌఖికంగా కోర్టుకు తెలిపారు. చివరగా ఈ ఏడాది ఏప్రిల్ 9న సుప్రీంకోర్టు ఈ వ్యాజ్యాలన్నింటిపై విచారణ జరిపింది. చట్ట ఉల్లంఘనలకు పాల్పడినందుకు రామోజీరావు, మార్గదర్శి ఫైనాన్షియర్స్‌ను ప్రాసిక్యూట్ చేయాలని కోరుతూ అదీకృత అధికారి కృష్ణరాజు నాంపల్లి కోర్టులో దాఖలు చేసిన ఫిర్యాదును కొట్టేస్తూ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ తేలప్రోలు రజనీ ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు రద్దు చేసింది. కేసుల కొట్టివేతకు సుప్రీం నిరాకరణ.. డిపాజిట్లు తిరిగి ఇచ్చేశాం కాబట్టి తనపై కేసులు కొట్టేయాలంటూ ఇదే సమయంలో రామోజీ, మార్గర్శి ఫైనాన్షియర్స్ చేసిన అభ్యర్థనలను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. చట్ట విరుద్ధంగా సేకరించిన డిపాజిట్లపై నిగ్గు తేలాల్సిందేనని.. మార్గదర్శి, రామోజీకి అనుకూలంగా హైకోర్టు ఏకపక్షంగా ఇచ్చిన తీర్పును పక్కనపెడుతున్నామని స్పష్టం చేసింది. కేసు లోతుల్లోకి వెళ్లి అందరి వాదనలు వినాలని, సీనియర్ న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసును విచారించాలని తెలంగాణ హైకోర్టును ఆదేశించింది. తాజాగా విచారణ జరిపి ఆరు నెలల్లో విచారణను ముగించాలని, సేకరించిన డిపాజిట్లకు సంబంధించి పబ్లిక్ నోటీసు ఇవ్వాలని తెలిపింది. తిరిగి విచారణ చేపట్టిన తెలంగాణ హైకోర్టు... సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తెలంగాణ హైకోర్టు ఈ ఏడాది జూన్‌లో తిరిగి విచారణ ప్రారంభించింది. విచారణ జరుగుతుండగానే రామోజీరావు మరణించగా ఆయన స్థానంలో హెచ్‌యూఎఫ్ కర్తగా తనను చేర్చాలని రామోజీ కుమారుడు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పలు దఫాలు వాయిదాల అనంతరం పూర్తిస్థాయి వాదనల నిమిత్తం ఈ నెల 7న విచారణ చేపట్టనున్నట్లు న్యాయస్థానం పేర్కొంది. -
వేస్ అండ్ మీన్స్, ఓడీ పరిమితుల పెంపు
సాక్షి, అమరావతి : రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఆర్థిక వెసులుబాటు కల్పించేందుకు వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ పరిమితులను రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) పెంచింది. ప్రస్తుతం అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ పరిమితి రూ.47,010 కోట్లు ఉండగా, జూలై 1 నుంచి ఈ పరిమితిని రూ.60,118 కోట్లకు పెంచుతున్నట్లు ఆర్బీఐ ఉత్తర్వులు జారీచేసింది. రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఆర్థిక వెసులుబాటు కోసం వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ పరిమితిని పెంచేందుకు ఆర్బీఐ ఆధ్వర్యంలో వివిధ రాష్ట్రాల ఆర్థిక శాఖ కార్యదర్శులతో ఏర్పాటుచేసిన కమిటీ సూచనల మేరకు ఈ పరిమితులను పెంచినట్లు ఆర్బీఐ పేర్కొంది.ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు జారీచేసిన సెక్యూరిటీలలో పెట్టుబడుల పరిమాణం, ట్రెజరీ బిల్లుల వేలం, గ్యారెంటీ రిడెంప్షన్ ఫండ్ తదితరాల ఆధారంగా ఈ పరిమితులను పెంచినట్లు రిజర్వ్ బ్యాంకు తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వాల అత్యవసర వ్యయాలకు నిధులు లభ్యత లేని పక్షంలో ఆర్థిక వెసులుబాటుకు వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్‌లను, ఓవర్ డ్రాఫ్ట్‌ల ద్వారా ఆర్బీఐ నుంచి తాత్కాలికంగా నిధులను పొందేందుకు వెసులుబాటు కల్పిస్తారు.ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ప్రస్తుతం వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ పరిమితి రూ.2,252 కోట్లు ఉండగా.. జూలై 1 నుంచి రూ.2,921 కోట్లకు పెంచుతూ ఆర్బీఐ నిర్ణయం తీసుకుంది. అలాగే, మిగతా రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు కూడా ఈ పరిమితులను పెంచింది. -
ఆర్బీఐ కీలక నిర్ణయం: మరో బ్యాంక్ లైసెన్స్ రద్దు
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గత కొన్ని రోజులుగా నియమాలను అతిక్రమించిన బ్యాంకులపై విరుచుకుపడుతోంది. ఇందులో భాగంగానే కొన్ని బ్యాంకులకు భారీ జరిమానాలు విధించడం మాత్రమే కాకుండా.. లైసెన్సులు కూడా క్యాన్సిల్ చేస్తోంది.ఇటీవల ఉత్తరప్రదేశ్‌లోని ఘాజీపూర్‌లోని పూర్వాంచల్ సహకార బ్యాంకు లైసెన్సును ఆర్బీఐ రద్దు చేసింది. ఈ బ్యాంకు వద్ద తగినంత మూలధనం లేకవడంతో రిజర్వ్ బ్యాంక్ ఈ నిర్ణయం తీసుకుంది. బ్యాంక్‌ను మూసివేసి లిక్విడేటర్‌ను నియమించాలని ఉత్తర్‌ప్రదేశ్‌లోని కోఆపరేటివ్ కమిషనర్, రిజిస్ట్రార్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్ను ఆర్బీఐ ఆదేశించినట్లు సమాచారం.ఉత్తరప్రదేశ్‌లోని ఘాజీపూర్‌లోని పూర్వాంచల్ సహకార బ్యాంకు లైసెన్సును ఆర్బీఐ రద్దు చేయడంతో.. లిక్విడేషన్ కింద్ ప్రతి డిపాజిటర్ తన డిపాజిట్ మొత్తాన్ని.. డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ (DICGC) నుంచి మాత్రమే రూ. 5 లక్షల వరకు పొందేందుకు అర్హులు.పూర్వాంచల్ కో-ఆపరేటివ్ బ్యాంక్ సమర్పించిన డేటా ప్రకారం.. దాదాపు 99.51 శాతం మంది డిపాజిటర్లు డిఐసిజిసి నుంచి తమ డిపాజిట్ల పూర్తి మొత్తాన్ని స్వీకరించడానికి అర్హులు అని ఆర్బీఐ తెలిపింది. సహకార బ్యాంకు ప్రస్తుత ఆర్థిక స్థితితో ప్రస్తుత డిపాజిటర్లకు పూర్తిగా చెల్లించలేదని ఆర్బీఐ తెలిపింది. -
RBI Governor Shaktikanta Das: ఆర్థికాభివృద్ధి.. ధరల కట్టడే లక్ష్యం
ముంబై: అంతా ఊహించినట్లే రిజర్వ్ బ్యాంక్ కీలక వడ్డీ రేట్లను (రెపో) వరుసగా ఎనిమిదో సారీ యథాతథంగా ఉంచింది. ఇటు పటిష్టమైన వృద్ధి అటు ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో ఉంచుకుని 6.5 శాతం స్థాయిలోనే కొనసాగించాలని నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024–25) వృద్ధి రేటు గతంలో భావించిన 7 శాతానికి మించి 7.2 శాతంగా ఉండవచ్చని అంచనా వేసింది. అలాగే ద్రవ్యోల్బణం 4.5 శాతం స్థాయిలో ఉండొచ్చని పేర్కొంది. ద్వైమాసిక ద్రవ్య పరపతి సమీక్షకు సంబంధించి బుధవారం నుంచి మూడు రోజుల పాటు సమావేశమైన ఆరుగురు సభ్యుల మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) ఈ మేరకు నిర్ణయాలు తీసుకుంది. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ శుక్రవారం ఈ విషయాలు వెల్లడించారు. ఆగస్టు 8న తదుపరి పాలసీ ప్రకటన ఉంటుంది. వడ్డీ రేటును తగ్గించాలని గత సమీక్షలో అభిప్రాయపడిన వారు ఒకరే ఉండగా ఈసారి అది ఇద్దరికి పెరిగింది. ఎక్స్టర్నల్ సభ్యులు (ఆషిమా గోయల్, జయంత్ వర్మ) వీరిలో ఉన్నారు. బ్యాంకులకు ఆర్బీఐ తానిచ్చే నిధులపై వసూలు చేసే వడ్డీ రేటే రెపో. బ్యాంకింగ్ వ్యవస్థలో వడ్డీ రేట్లు ప్రధానంగా దీనిపై ఆధారపడి ఉంటాయి. 2023 ఫిబ్రవరి నుంచి ఈ రేటు య«థాతథంగా ఉంది.బల్క్ డిపాజిట్ల పరిమితి పెంపు బ్యాంకుల అసెట్ మేనేజ్మెంట్ను మెరుగుపర్చేందుకు తోడ్పడేలా బల్క్ ఫిక్సిడ్ డిపాజిట్ల ప్రారంభ పరిమితిని ఆర్బీఐ రూ. 2 కోట్ల నుంచి రూ. 3 కోట్లకు పెంచింది. సాధారణంగా రిటైల్ టర్మ్ డిపాజిట్లతో పోలిస్తే బల్క్ ఎఫ్డీలపై బ్యాంకులు కొంత అధిక వడ్డీ రేటు ఇస్తాయి. పరిమితులను సవ రించడం సాధారణంగా జరిగేదేనని కొన్నేళ్ల క్రితం ఇది కోటి రూపాయలుగా ఉండేదని, తర్వాత రెండు కోట్లకు పెరిగిందని, తాజా పరిస్థితుల కు అనుగుణంగా దీన్ని రూ. 3 కోట్లకు పెంచామని డిప్యుటీ గవర్నర్ జె. స్వామినాథన్ తెలిపారు. యూపీఐ లైట్ వాలెట్లు, ఫాస్టాగ్‌లకు ఆటోలోడ్ సదుపాయం.. చిన్న మొత్తాలను డిజిటల్‌గా చెల్లించేందుకు ఉపయోగపడే యూపీఐ లైట్ వాలెట్లలో బ్యాలెన్స్ తగ్గినప్పుడల్లా ఆటోమేటిక్‌గా లోడ్ చేసుకునే సదుపాయాన్ని కస్టమర్లకు అందుబాటులోకి తేవాలని ఆర్బీఐ ప్రతిపాదించింది. ఇందుకోసం దీన్ని ఈ–మ్యాన్‌డేట్ ఫ్రేమ్‌వర్క్ పరిధిలోకి తేవాలని నిర్ణయించింది. యూపీఐ లైట్ వినియోగాన్ని మరింతగా ప్రోత్సహించేందుకు ఇది ఉపయోగపడగలదని దాస్ తెలిపారు. ఫాస్టాగ్, నేషనల్ కామన్ మొబిలిటీ కార్డ్ (ఎన్సీఎంసీ)లను కూడా ఈ–మ్యాన్‌డేట్ పరిధిలోకి తేవాలని నిర్ణయించినట్లు చెప్పారు. ప్రస్తుతం యూపీఐ లైట్ రోజువారీపరిమితి రూ. 2,000గా ఉండగా, ఒకసారి గరిష్టంగా రూ. 500 వరకు మాత్రమే చేయడానికి వీలుంది. యూపీఐ లైట్ యాప్‌లో బ్యా లెన్స్ గరిష్టంగా రూ. 2,000కు మించరాదు.బ్యాంకుల సిస్టమ్ వైఫల్యాల వల్లే పేమెంట్స్ అంతరాయాలు.. చెల్లింపు లావాదేవీల్లో అంతరాయాలతో కస్టమర్లకు సమస్యలు ఎదురవడానికి కారణం బ్యాంకుల సిస్టమ్‌ల వైఫల్యమే తప్ప యూపీఐ, ఎన్‌పీసీఐలు కాదని దాస్ చెప్పారు. ప్రతి అంతరాయాన్ని కేంద్రీయ బ్యాంకులో సంబంధిత అధికారులు నిశితంగా అధ్యయనం చేస్తారని, ఈ విషయంలో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ (ఎన్పీసీఐ) లేదా ఏకీకృత చెల్లింపుల విధానం ప్లాట్‌ఫాం లోపాలున్నట్లుగా ఏమీ వెల్లడి కాలేదని ఆయన తెలిపారు. టెక్నాలజీకి సంబంధించి బ్యాంకులు గణనీయంగా ఇన్వెస్ట్ చేస్తున్నాయన్నారు. -
కేంద్రంపై ఆర్బీఐ కనకవర్షం
ముంబై: కేంద్రానికి రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) గత ఆర్థిక సంవత్సరానికి (2023–24) భారీగా రూ.2,10,874 కోట్ల డివిడెండ్‌ను అందించనుంది. ఆర్బీఐ చరిత్రలోనే ఇది రికార్డ్ కాగా.. బడ్జెట్ అంచనాలకన్నా రెట్టింపు. జీడీపీలో 0.2% నుంచి 0.3 శాతానికి సమానం. ఎన్నికల అనంతరం అధికారంలోకి రానున్న కొత్త ప్రభుత్వానికి ఆదాయపరంగా ఇది పెద్ద ఊరటనిచ్చే అంశం. ఈ మేరకు గవర్నర్ శక్తికాంత్‌దాస్ నేతృత్వంలో జరిగిన ఆర్బీఐ 608వ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల సమావేశం తాజా కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకూ కేంద్రానికి ఆర్బీఐ నుంచి అందిన అత్యధిక నిధుల బదలాయింపు విలువ( 2018–19) రూ. 1.76 లక్షల కోట్లు. తాజా నిర్ణయాలపై ఆర్బీఐ ఒక ప్రకటన విడుదల చేసింది. కొన్ని ముఖ్యాంశాలు..⇢ 2024–25లో ఆర్బీఐ, ప్రభు త్వ రంగ బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి రూ.1.02 లక్షల కోట్ల డివిడెండ్లు అందుతాయని ఈ ఏడాది ఫిబ్రవరి బడ్జెట్ అంచనావేసింది. అయితే దీనికి రెట్టింపు మొత్తాలు రావడం గమనార్హం. ⇢ తాజా బోర్డ్ సమావేశం దేశీయ, అంతర్జాతీయ అంశాలపై చర్చించింది. వృద్ధి అవుట్‌లుక్‌కు ఎదురయ్యే సవాళ్లను, తీసుకోవాల్సిన చర్యలను సమీక్షించింది. ద్రవ్యలోటు, బాండ్ ఈల్డ్ తగ్గే చాన్స్... ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కేంద్రానికి వచ్చే ఆదాయం చేసే వ్యయానికి మధ్య నికర వ్యత్యాసం– ద్రవ్యలోటు రూ.17.34 లక్షల కోట్లుగా ఉంటుందని ఫిబ్రవరి బడ్జెట్ అంచనావేసింది. ఈ నేపథ్యంలో ఆర్బీఐ తాజా నిర్ణయం కేంద్ర ఖజానాకు పెద్ద ఊరటకానుంది. తాజా నిర్ణయం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్రవ్యలోటు 4 బేసిస్ పాయింట్ల వరకూ తగ్గడానికి దోహదపడే అంశం. కేంద్రంపై రుణ భారాన్ని తగ్గిస్తుంది. తద్వారా బాండ్ మార్కెట్ విషయంలో కేంద్రానికి సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. దేశ బెంచ్‌మార్క్ 10 సంవత్సరాల బాండ్ ఈల్డ్ కూడా 4 శాతం తగ్గి 7 శాతం వద్ద స్థిరపడే వీలుంది.భారీ మిగులుకు కారణం? అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్ల పెంపు నేపథ్యంలో ఆర్బీఐ ఫారిన్ ఎక్సే్చంజ్ అసెట్స్ ద్వారా లభించిన అధిక వడ్డీ ఆదాయాలు ఆర్బీఐ భారీ నిధుల బదలాయింపులకు ఒక ప్రధాన కారణం. దేశీయ, అంతర్జాతీయ సెక్యూరిటీలపై అధిక వడ్డీరేట్లు, ఫారిన్ ఎక్సే్చంజ్ భారీ స్థూల విక్రయాలు కూడా ఇందుకు దోహదపడ్డాయి. ఎకానమీపై భరోసాతో 6.5 శాతానికి సీఆర్‌బీఐ పెంపు మరోవైపు సెంట్రల్ బ్యాంక్ నిధుల నిర్వహణకు సంబంధించిన కంటింజెంట్ రిస్క్ బఫర్‌ను (సీఆర్బీ) ఆర్బీఐ బోర్డ్ 2023–24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 6.50 శాతానికి పెంచింది. భారత్ ఎకానమీ రికవరీని ఇది సూచిస్తోంది. ఆర్బీఐ బ్యాలెన్స్ షీట్ మొత్తంలో తన వద్ద ఎంత స్థాయిలో మిగులు నిధులను ఉంచుకోవాలి, కేంద్రానికి ఎంత మొత్తంలో మిగులును బదలాయించాలి అనే అంశంపై మాజీ గవర్నర్ బిమల్ జలాన్ నేతృత్వంలోని కమిటీ ఒక ఎకనమిక్ క్యాపిటల్ ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందించింది. సీఆర్‌బీఐ 5.5% – 6.5 % శ్రేణిలో ఉండాలని ఈ ఫ్రేమ్‌వర్క్ నిర్దేశించింది. దీని ప్రకారమే ఆర్బీఐ మిగులు బదలాయింపు నిర్ణయాలు జరుగుతాయి. ఆర్థిక పరిస్థితులు, కోవిడ్–19 మహమ్మారి వంటి పరిణామాల నేపథ్యంలో 2018–19 నుంచి 2021–22 వరకూ 5.50 శాతం సీఆర్బీ నిర్వహణకు ఆర్బీఐ నిర్ణయం తీసుకుంది. తద్వారా కేంద్రానికి అధిక మిగులు నిధులు అందించి ఆర్థిక పురోగతి, ఎకానమీ క్రియాశీలతకు దోహదపడాలన్నది సెంట్రల్ బ్యాంక్ ఉద్దేశం. ఎకానమీ పురోగతి నేపథ్యంలో 2022–23లో సీఆర్బీని 6 శాతానికి, తాజాగా 6.5 శాతానికి సెంట్రల్ బ్యాంక్ బోర్డ్ పెంచింది. -
అధిక చార్జీల రిఫండ్
ముంబై: కొన్ని బ్యాంకులు, ఆర్థిక సంస్థలు వడ్డీ విధింపు విషయంలో అసమంజస విధానాలను పాటిస్తుండటంపై ఆందోళన వ్యక్తం చేసిన రిజర్వ్ బ్యాంక్ .. దిద్దుబాటు చర్యలు తీసుకోవాల్సిందిగా వాటిని ఆదేశించింది. అలా అధికంగా వసూలు చేసిన వడ్డీలు, చార్జీలను కస్టమర్లకు తిరిగివ్వాలని ఒక సర్క్యులర్‌లో సూచించింది. పలు నియంత్రిత సంస్థలను (ఆర్ఈ) పరిశీలించిన మీదట వడ్డీ విషయంలో కొన్ని సంస్థలు అసమంజస విధానాలు పాటిస్తున్నాయని గుర్తించినట్లు ఆర్బీఐ తెలిపింది. కొన్ని ఆర్ఈలు వాస్తవంగా రుణాన్ని విడుదల చేసిన తేదీ నుంచి కాకుండా రుణాన్ని మంజూరు చేసిన తేదీ నుంచి లేదా రుణ ఒప్పందం కుదుర్చుకున్న తేదీ నుంచి వడ్డీ విధిస్తున్నాయని పేర్కొంది. -
జనం సొమ్ముతో గురివింద విందు!
సాక్షి, అమరావతి: ఆర్థిక అక్రమాల ఉగ్రవాది ‘ఈనాడు’ రామోజీ పాపాలు పండాయి! చట్టాలంటే లెక్క లేకుండా దశాబ్దాలుగా సాగిస్తున్న ఆర్థిక అక్రమాలకు చెక్ పడింది. వ్యవస్థలను మేనేజ్ చేసి తప్పించుకునే ఎత్తుగడలు ఎల్లకాలం సాగవని రుజుౖవెంది. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) నిబంధనలకు విరుద్ధంగా సాగించిన అక్రమ డిపాజిట్ల దందా రామోజీ మెడకు చుట్టుకుంది. టీడీపీ హయాంలో చంద్రబాబు అండదండలతో ‘రమణ’ మంత్రంతో కనికట్టు చేసి అక్రమ డిపాజిట్ల కేసు నుంచి తప్పించుకున్నా చట్టం నుంచి తప్పించుకోలేక పోయారు. మార్గదర్శి ఫైనాన్సియర్స్ అక్రమ డిపాజిట్ల కేసును కొట్టివేయడానికి వీల్లేదని, ఆ కేసును సమగ్రంగా విచారించాలని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఈనాడు పేరుతో పత్రికా స్వేచ్ఛ ముసుగులో ఈ కేసు నుంచి తప్పించుకునేందుకు రామోజీ చేసిన ప్రయత్నాలన్నీ సుప్రీంకోర్టు క్రియాశీలత ముందు వీగిపోయాయి. ఈనాడు అంటే ఆఫ్టరాల్ ఒక పేపర్ మాత్రమేనని న్యాయస్థానం వ్యాఖ్యానించడం గమనార్హం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈనాడుకు వ్యతిరేకంగా ఉందన్న రామోజీ మొసలి కన్నీళ్లను కొట్టిపారేస్తూ సుప్రీంకోర్టు విప్లవాత్మకమైన తీర్పును విస్పష్టంగా వెలువరించింది. మార్గదర్శి ఫైనాన్సియర్స్ అక్రమ డిపాజిట్ల దందా పూర్వాపరాలు ఇవిగో... రూ.2,600 కోట్ల అక్రమ డిపాజిట్ల సేకరణ.. నిర్భీతిగా నిబంధనల ఉల్లంఘన చట్టాలకు తాను అతీతం అన్నట్టుగా భావించే రామోజీరావు మార్గదర్శి ఫైనాన్సియర్స్ పేరిట బరితెగించి ఆర్థిక అక్రమాలకు పాల్పడ్డారు. ఆర్బీఐ చట్టం 45 ఎస్ ప్రకారం ఇన్కార్పొరేటెడ్ కంపెనీలు మాత్రమే ప్రజల నుంచి డిపాజిట్లు సేకరించాలి. అంతేగానీ ఇన్కార్పొరేటెడ్ కంపెనీలు కాని వ్యక్తులు, సంస్థలు, హిందూ అవిభక్త కుటుంబాలు(హెచ్‌యూఎఫ్)లు ప్రజల నుంచి డిపాజిట్లు సేకరించకూడదు. ఈ నిబంధనను రామోజీ నిర్భీతిగా ఉల్లంఘించి అక్రమంగా డిపాజిట్లు సేకరించారు. 2006లో అప్పటి ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ ఫిర్యాదుతో సీఐడీ దీనిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టింది. మార్గదర్శి ఫైనాన్సియర్స్ పేరిట రామోజీరావు 1997 నుంచి 2006 వరకు యథేచ్ఛగా అక్రమ డిపాజిట్లు సేకరించినట్లు గుర్తించడంతో మార్గదర్శి ఫైనాన్సియర్స్‌పై కేసు నమోదు చేసింది. మార్గదర్శి ఫైనాన్సియర్స్ 2006లో సమర్పించిన అఫిడవిట్ ప్రకారమే అప్పటికి రూ.2,610.38 కోట్లు అక్రమ డిపాజిట్లు సేకరించినట్లు వెల్లడైంది. హెచ్యూఎఫ్గా తాము డిపాజిట్లు సేకరించవచ్చంటూ రామోజీ చేసిన వితండవాదాన్ని ఆర్బీఐ అప్పట్లోనే సమ్మతించలేదు. సెక్షన్ 45ఎస్ ప్రకారం హెచ్‌యూఎఫ్‌లు ప్రజల నుంచి డిపాజిట్లు సేకరించడానికి వీల్లేదని తేల్చి చెప్పింది. తన ఆర్థిక అక్రమాల వ్యవహారం బట్టబయలు కావడంతో రామోజీ అనివార్యంగా తప్పిదాలను అంగీకరించారు. డిపాజిట్‌దారులకు వారి డిపాజిట్లను తిరిగి చెల్లిస్తామని, మార్గదర్శి ఫైనాన్సియర్స్‌ను మూసి వేస్తామని ప్రకటించారు. అక్రమ డిపాజిట్ల వివరాలు వెల్లడించం.. 2006 నాటికే 32,385 మంది నుంచి రూ.2,610.38 కోట్లు డిపాజిట్లుగా సేకరించామని పేర్కొన్న రామోజీరావు 2008లో కోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో తాము ఇంకా చెల్లించాల్సిన డిపాజిట్లు రూ.1,864.10 కోట్లు అని వెల్లడించారు. మరి మిగతా రూ.746.28 కోట్ల డిపాజిట్లు ఏమయ్యాయో ఆయన వెల్లడించలేదు. మరోవైపు తాము సేకరించిన డిపాజిట్లను పూర్తిగా చెల్లించేశామని 2012 తరువాత రామోజీ తాపీగా ప్రకటించారు. దీనిపై ఉండవల్లి అరుణ్ కుమార్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. డిపాజిట్లు ఎవరెవరి నుంచి ఎంతెంత సేకరించారు..? ఎవరెవరికి ఎంతెంత డిపాజిట్లు ఏయే తేదీల్లో చెల్లించారు...? నగదు రూపంలో చెల్లించారా? చెక్కుల రూపంలో చెల్లించారా? అనే వివరాలు వెల్లడించేలా ఆదేశించాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సీఐడీ వాస్తవాలు ఏమిటో వెలికి తీసేందుకు ప్రయత్నించాల్సి ఉండగా... నాడు అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంగానీ, ఆ తరువాత చంద్రబాబు సారథ్యంలోని టీడీపీ సర్కారుగానీ ఉద్దేశపూర్వకంగానే మౌనం దాల్చాయి. తద్వారా రామోజీరావు ఆర్థిక అక్రమాలకు పరోక్షంగా వత్తాసు పలికాయి. దాంతో రామోజీరావు తాను సేకరించిన అక్రమ డిపాజిట్ల వివరాలు చెపాల్సిన అవసరం లేదంటూ వితండవాదాన్ని వినిపించారు. తమకు ఎలాంటి క్రిమినల్ లయబులిటీ లేదని వాదిస్తూ వచ్చారు. ఈ క్రమంలో 2018 డిసెంబర్ 21న (ఉమ్మడి హైకోర్టు చివరి పనిదినాన) మార్గదర్శి ఫైనాన్సియర్స్‌పై కేసును ఉమ్మడి హైకోర్టు కొట్టివేసింది. డిపాజిటర్ల ప్రయోజనాల కోసం ఈ తీర్పుపై సుప్రీంకోర్టులో అప్పీల్ చేయాల్సిన నాటి చంద్రబాబు సర్కారు ఏమీ పట్టనట్లు మౌనంగా ఉండిపోయింది. తద్వారా రామోజీ ఆర్థిక అక్రమాలకు చంద్రబాబు దన్నుగా నిలిచారు. అక్రమ డిపాజిట్లే... ఆర్థిక నేరస్తుడే: ఆర్బీఐ స్పష్టీకరణ ఆర్బీఐ చట్టం సెక్షన్ 45 ఎస్‌ను ఉల్లంఘిస్తూ మార్గదర్శి ఫైనాన్సియర్స్ అక్రమ డిపాజిట్లు వసూలు చేసినట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అత్యున్నత న్యాయస్థానానికి సోదాహరణంగా వివరించింది. ఆ డిపాజిట్లను ఎవరెవరికి తిరిగి చెల్లించారో.. ఎంతెంత చొప్పున చెల్లించారో వివరాలు వెల్లడించాల్సిందేనని వాదించింది. ఈ కేసు న్యాయస్థానంలో విచారణలో ఉండగానే మరో రూ.2 వేల కోట్ల వరకు అక్రమ డిపాజిట్లు సేకరించారని సుప్రీంకోర్టు దృష్టికి తెచ్చింది. ఈ కేసులో పార్టీ పర్సన్ ఇన్చార్జ్గా ఉండవల్లి అరుణ్ కుమార్ వాదనలు వినిపిస్తూ సెక్షన్ 45 ఎస్ కింద హెచ్‌యూఎఫ్ సంస్థలు డిపాజిట్లు సేకరించవచ్చా? లేదా? అన్నదానిపై స్పష్టత ఇవ్వాలని కోరారు. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా తరఫు న్యాయవాది రమేశ్‌బాబు తన వాదనలు వినిపిస్తూ ‘ఆర్బీఐ చట్టంలోని సెక్షన్ 45 ఎస్ ప్రకారం ఇన్కార్పొరేటెడ్ కంపెనీలు మినహా ఇతర సంస్థలు, వ్యక్తులు డిపాజిట్లు సేకరించకూడదు. హెచ్‌యూఎఫ్ కూడా డిపాజిట్లు సేకరించడానికి వీల్లేదు. కాబట్టి హెచ్‌యూఎఫ్ పేరిట మార్గదర్శి ఫైనాన్షియర్స్ డిపాజిట్లను సేకరించడం అక్రమమే, చట్ట విరుద్ధమే. రామోజీ ఆర్థిక నేరస్తుడే ’అని విస్పష్టంగా తేల్చి చెప్పారు. దీంతో ఈ కేసులో రిజర్వు బ్యాంక్‌ను కూడా పార్టీగా చేర్చి సుప్రీంకోర్టు విచారణను కొనసాగించింది. కేసును నిలబెట్టిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం 2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఈ కేసు విషయంలో డిపాజిట్‌దారుల ప్రయోజనాలను కాపాడుతూ బాధ్యతాయుతంగా వ్యవహరించింది. మార్గదర్శి ఫైనాన్సియర్స్‌కు వ్యతిరేకంగా ఉండవల్లి అరుణ్‌కుమార్ సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్లో ఏపీ ప్రభుత్వం ఇంప్లీడ్ అయ్యింది. దీంతో ఈ కేసు నీరుగారిపోకుండా చూడగలిగింది. ఈ నేపథ్యంలో మార్గదర్శి ఫైనాన్సియర్స్ వసూలు చేసిన అక్రమ డిపాజిట్లు వివరాలను సమర్పించాలని సుప్రీంకోర్టు గత ఏడాది ఆదేశించింది. ‘ఈనాడు’కు వ్యతిరేకంగా ఉండొద్దని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించలేం ఎప్పటి మాదిరిగానే పత్రికా స్వేచ్ఛ ముసుగులో తన అక్రమాలను కప్పిపుచ్చుకునేందుకు రామోజీ వేసిన ఎత్తుగడను సుప్రీంకోర్టు తిప్పికొట్టింది. ఈనాడు పత్రికకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకం కాబట్టే ఈ కేసు విషయంలో ఇంత పట్టుబడుతోందని రామోజీ తరపున ప్రముఖ న్యాయవాదులు ముకుల్ రోహత్గీ, లూథ్రా, అభిషేక్‌మను సింఘ్వీలు వాదించినా ఫలితం లేకపోయింది. ఈ అంశానికి, అక్రమ డిపాజిట్లకు సంబంధం లేదని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈనాడు పత్రికకు వ్యతిరేకంగా ఉండొద్దని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించలేం అని ఈ సందర్భంగా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇక ఎన్నికలు ఉన్నందునే ఈ కేసుపై ఏపీ ప్రభుత్వం పట్టుబడుతోందన్న రామోజీ తరపు న్యాయవాదుల వాదనలతో అత్యున్నత న్యాయస్థానం సమ్మతించలేదు. ‘ఎన్నికలు ఉంటే ఈనాడుకు ఏమైంది? ఈనాడు ఏమీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు కదా..? ఈనాడు కేవలం ఓ పత్రికే కదా..? ఎన్నికలతో ఏం సంబంధం?’ అని న్యాయస్థానం వ్యాఖ్యానించడం గమనార్హం. దీంతో ఉండవల్లి అరుణ్ కుమార్‌పైకి నెపాన్ని నెట్టివేసేందుకు రామోజీ తరపు న్యాయవాదులు విఫలయత్నం చేశారు. ఉండవల్లి ఓ రాజకీయ నేత అని పేర్కొంటూ గతంలో హైకోర్టు తీర్పుపై వ్యతిరేక వ్యాఖ్యలు చేశారంటూ తెలుగులో ఉన్న వీడియో రికార్డులు తర్జుమా చేసి మరీ వినిపించారు. అయితే న్యాయస్థానాల తీర్పుపై విశ్లేషించవచ్చని, అదేమీ తప్పు కాదని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. న్యాయస్థానాల తీర్పులపై విశ్లేషణలు జరగాలనే తాము కోరుకుంటామని తెలిపింది. ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి చదువుకున్న వ్యక్తులు విశ్లేషిస్తే మరింత మంచిదని కూడా వ్యాఖ్యానించింది. మేమే హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేస్తున్నాం కదా...? అంటే న్యాయస్థానాల తీర్పుపై విశ్లేషించినట్లే కదా? అని ప్రశ్నించింది. దాంతో తప్పించుకునేందుకు రామోజీ వేసిన అన్ని ఎత్తుగడలు బెడిసికొట్టాయి. అక్రమ డిపాజిట్ల కేసును తెలంగాణ హైకోర్టు ఆరు నెలల్లో విచారించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. యావజ్జీవ ఖైదు...రెండింతల జరిమానా! మార్గదర్శి ఫైనాన్సియర్స్ అక్రమ డిపాజిట్ల కేసులో నేరం నిరూపితమైతే రామోజీరావుకు రెండేళ్ల నుంచి యావజ్జీవ జైలు శిక్ష వరకు పడే అవకాశం ఉందని న్యాయ నిపుణులు స్పష్టం చేశారు. దీంతోపాటు ఆయన సేకరించిన అక్రమ డిపాజిట్లు రూ.2,600 కోట్లకు రెట్టింపు జరిమానా విధించవచ్చన్నారు. దీన్నిబట్టి రామోజీకి రెండేళ్ల నుంచి యావజ్జీవ జైలు శిక్షతో పాటు రూ.5,200 కోట్ల జరిమానా చెల్లించాలని తీర్పు వెలువడే అవకాశాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. -
RBI Monetary Policy 2024: ఆర్బీఐ ఏడోసారీ
ముంబై: ఏప్రిల్ నుంచి జూన్ మధ్యలో ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయికంటే ఎక్కువ ఉండొచ్చన్న వాతావరణ శాఖ అంచనాలతో ఆహార ద్రవ్యోల్బణంపై ఆందోళన నెలకొన్న నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ద్రవ్య పరపతి విధాన కమిటీ వరుసగా ఏడోసారీ కీలక వడ్డీ రేట్లలో ఎటువంటి మార్పులు చేయలేదు. రెపో రేటును ప్రస్తుత 6.5 శాతం స్థాయిలోనే కొనసాగించాలని నిర్ణయించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సర తొలి ద్వైమాసిక పరపతి విధాన సమీక్షలో ఆర్బీఐ ఈ మేరకు పాలసీ నిర్ణయం తీసుకుంది. దీంతో గృహ, వాహన రుణాలపై ఈఎంఐలు మరికొన్నాళ్ల పాటు స్థిరంగా ప్రస్తుత స్థాయిలోనే కొనసాగే అవకాశం ఉంది. 2023 ఫిబ్రవరి నుంచి రిజర్వ్ బ్యాంక్ రెపో రేటును మార్చలేదు. అంటే ఏడు ద్వైమాసిక సమావేశాల నుంచి ద్రవ్యోల్బణం భయాల నేపథ్యంలో రేటు యథాతథంగా కొనసాగింది. తాజాగా రెపో రేటును యథాతథంగా ఉంచాలన్న ప్రతిపాదనను మానిటరీ పాలసీ కమిటీలోని (ఎంపీసీ) ఆరుగురు సభ్యుల్లో ఒకరు వ్యతిరేకించగా అయిదుగురు సభ్యులు సానుకూలత వ్యక్తపర్చారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వృద్ధి 7 శాతం స్థాయిలోనూ (2023–24లో 7.6 శాతం), ద్రవ్యోల్బణం 4.5 శాతం స్థాయిలోను (2023–24లో 5.4 శాతం) ఉంటుందన్న అంచనాలను ఆర్బీఐ కొనసాగించింది. ఫిబ్రవరిలో రిటైల్ ద్రవ్యోల్బణం 5.1 శాతంగా, ఆహార ధరల బాస్కెట్ ద్రవ్యోల్బణం 8.66 శాతంగా నమోదైంది. 2023–24 ఆర్థిక సంవత్సరానికి గాను ద్రవ్యోల్బణం 5.4 శాతంగా ఉంటుందని అంచనా. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్రవ్యోల్బణం క్యూ1లో 4.9 శాతం, క్యూ2లో 3.8 శాతం, క్యూ3లో 4.6 శాతం, క్యూ4లో 4.5 శాతం చొప్పున మొత్తం మీద సగటున 4.5 శాతంగా ఉండొచ్చని ఆర్బీఐ అంచనా వేస్తోంది. కాగా విదేశాల నుంచి స్వదేశానికి పంపించే డబ్బుకు (రెమిటెన్స్) సంబంధించి భారత్ తొలి స్థానంలో ఉన్నట్లు ఆర్బీఐ పేర్కొంది. ► యూపీఐని వినియోగించడం ద్వారా త్వరలో బ్యాంకుల్లో నగదు డిపాజిట్ సౌకర్యం ► ప్రభుత్వ బాండ్లలో రిటైల్ భాగస్వామ్యం సులభతరానికి మొబైల్ యాప్ ప్రారంభం ► ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సరీ్వసెస్ సెంటర్లో సావరిన్ గ్రీన్ బాండ్ల ట్రేడింగ్‌కు అనుమతి ► డాలర్ మారకంలో రూపాయి విలువ స్థిర శ్రేణిలో కదలాడుతోంది. ఆందోళక అక్కర్లేదు ► నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలకు వ్యవస్థాగతంగా ఎటువంటి ఇబ్బందులూ లేవు ► జూన్ 5 నుంచి 7 వరకూ 2024–25 ఆర్బీఐ రెండవ ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్ష ► సీబీడీసీ వాలెట్లను అందించడానికి నాన్–బ్యాంక్ పేమెంట్ సిస్టమ్ ఆపరేటర్లకు అనుమతి ► బ్యాంకింగ్ ద్రవ్య సంబంధ ఇబ్బందులు పడకుండా లిక్విడిటీ కవరేజ్ రేషియో సమీక్ష ► 2023–24లో ఎఫ్‌పీఐల పెట్టుబడులు 41.6 బిలియన్ డాలర్లు. 2014–15 తర్వాత అత్యధికం పసిడి నిల్వల పెంపు విదేశీ మారకద్రవ్య నిల్వల పటిష్టతలో భాగంగా పసిడి వాటాను భారత్ పెంచుకుంటుందని ఆర్బీఐ పేర్కొంది. మార్చి 29వ తేదీ నాటికి భారత్ విదేశీ మారకద్రవ్య నిల్వలు ఆల్ టైమ్ హై 645.6 బిలియన్ డాలర్లకు చేరితే, అందులో పసిడి వాటా 51.487 బిలియన్ డాలర్లుగా ఉంది. సాగుపై చల్లని అంచనాలు తీవ్ర వేసవి, నీటి ఎద్దడి భయాందోళనల నేపథ్యంలో ఆర్బీఐ ఎకానమీపై చల్లని అంచనాలను వెలువరించింది. తగిన వర్షపాతం అంచనాల నేపథ్యంలో వ్యవసాయ, గ్రామీణ క్రియాశీలతలో సానుకూలతలు కనిపిస్తున్నాయని పేర్కొంది. ఆశించిన స్థాయిలో సాధారణ రుతుపవనాల అంచనాలు, మంచి రబీ గోధుమ పంట, ఖరీఫ్ పంటల మెరుగైన అవకాశాలు దీనికి కారణంగా పేర్కొంది. బలమైన గ్రామీణ డిమాండ్, ద్రవ్యోల్బణ ఒత్తిడి తగ్గడం, తయారీ– సేవల రంగంలో స్థిరమైన పురోగతి ప్రైవేట్ వినియోగాన్ని పెంచడానికి దోహదపడే అంశాలుగా పేర్కొంది. అయితే దీర్ఘకాలిక భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, వాణిజ్య మార్గాలలో పెరుగుతున్న అంతరాయాలు దేశ ఎకానమీకి ఆందోళన కలిగిస్తున్న అంశాలుగా పేర్కొంది. ఆహార ధరలపై అనిశ్చితి.. ఆహార ధరల్లో నెలకొన్ని అనిశ్చితి రాబోయే రోజుల్లో ద్రవ్యోల్బణం తీరుతెన్నులపై ప్రభావం చూపవచ్చు. ఈ ఏడాది వేసవిలో కూరగాయల ధరల కదలికలపై మనం దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఒకవైపు వృద్ధికి ఊతమిస్తూనే మరోవైపు లకి‡్ష్యంచుకున్న స్థాయికి (4 శాతం) ద్రవ్యోల్బణం దిగి వస్తే కీలక రేట్లను తగ్గించడంపైనే ఎంపీసీ ప్రధానంగా దృష్టి పెడుతుంది. – శక్తికాంతదాస్, ఆర్బీఐ గవర్నర్ -
ఆర్థికాభివృద్ధి ప్రాధాన్యత కావాలి!: ప్రధాని మోదీ
ముంబై: ఆర్థిక వ్యవస్థ స్థిరత్వం, విశ్వాసాన్ని పెంపొందించడంసహా వచ్చే దశాబ్ద కాలంలో దేశాభివృద్ధే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ప్రధాన ప్రాధాన్యత కావాలని ప్రధాని నరేంద్రమోదీ ఉద్ఘాటించారు. ఆర్బీఐ 90 సంవత్సరాల స్మారకోత్సవ కార్యక్రమాన్ని ముంబైలో ప్రారంభించిన సందర్భంగా మోదీ ప్రసంగించారు. భారత్ తన లక్ష్యాన్ని చేరుకోవడానికి రాబోయే దశాబ్దం ఎంత ముఖ్యమో, ఆర్బీఐ 2035 నాటికి 100 సంవత్సరాల విజయవంతమైన ప్రయాణం కూడా అంతే ముఖ్యమని పేర్కొన్నారు. దేశ ఆర్థిక స్వావలంభన, అంతర్జాతీయంగా రూపాయికి మరింత ఆమోదయోగ్యత వంటి అంశాలను ఈ సందర్భంగా ప్రస్తావించారు. ప్రధానికి ఈ సందర్భంగా ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ ఒక జ్ఞాపికను అందజేశారు. భారతదేశ ఆర్థిక ప్రగతికి మూలస్తంభంగా పనిచేసే స్థిరమైన, బలమైన ఆర్థిక వ్యవస్థను పటిష్టపరచడంపై ఆర్బీఐ దృష్టి సారిస్తుందని గవర్నర్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఆర్బీఐ అపార అనుభవం, నైపుణ్యతలు అంతర్జాతీయ అనిశ్చితులను ఎదుర్కొనడంలో దోహదపడిందని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ కార్యక్రమంలో పేర్కొన్నారు. మహారాష్ట్ర గవర్నర్ రమేష్ బెయిన్స్, ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రులు దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్, ఆర్థిక శాఖ సహాయ మంత్రులు భగవత్ కిషన్రావ్ కరాడ్, పంకజ్ చౌదరి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్, జేఎంఎఫ్పీలో ప్రత్యేక ఆడిట్
న్యూఢిల్లీ: నిబంధనల ఉల్లంఘనలపై చేపట్టిన దర్యాప్తులో భాగంగా ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్, జేఎం ఫైనాన్షియల్ ప్రోడక్ట్స్ (జేఎంఎఫ్పీ)లో ఆర్బీఐ ప్రత్యేక ఆడిట్ నిర్వహించనుంది. ఇందుకు సంబంధించి ఆడిటర్ల నియామక ప్రక్రియ చేపట్టింది. రిజర్వ్ బ్యాంక్ జారీ చేసిన టెండరు ప్రకటన ప్రకారం ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహణకు సెబీ ఆమోదం పొందిన ఆడిట్ సంస్థలు ఇందుకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తులను సమరి్పంచేందుకు ఆఖరు తేదీ ఏప్రిల్ 8 కాగా, ఎంపికైన సంస్థలకు ఏప్రిల్ 12న విధులను కేటాయిస్తారు. గోల్డ్ లోన్ పోర్ట్‌ఫోలియోలో పర్యవేక్షణపరమైన అవకతవకలను పరిశీలించిన మీదట తదుపరి బంగారం రుణాలు ఇవ్వరాదంటూ ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్‌ను ఆర్బీఐ ఆదేశించింది. అలాగే ఐపీవోలకు బిడ్ చేసే కస్టమర్లకు నిధులు సమకూర్చే విషయంలో అవకతవకలకు గాను జేఎంఎఫ్పీపైనా ఆంక్షలు విధించింది. -
ద్రవ్యోల్బణం దారికి...పరిశ్రమ పక్కకు!
న్యూఢిల్లీ: భారత్ స్థూల ఆర్థిక రంగానికి సంబంధించి మంగళవారం మిశ్రమ ఫలితాలు వెలువడ్డాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ద్రవ్య పరపతి విధాన కమిటీ కీలక రెపో రేటు (ప్రస్తుతం 6.5 శాతం) నిర్ణయానికి ప్రాతిపదిక అయిన రిటైల్ ద్రవ్యోల్బణం ఫిబ్రవరిలో 5.09 శాతంగా నమోదయ్యింది. గడచిన నాలుగు నెలల్లో ఇంత తక్కువ స్థాయి రిటైల్ ద్రవ్యోల్బణం ఇదే తొలిసారి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)కి కేంద్రం నిర్దేశిస్తున్న వాస్తవిక లక్ష్యానికి (ప్లస్ 2 లేదా మైనస్ 2తో 4 శాతం) ఇంకా అధికంగా ఉన్నప్పటికీ.. నాలుగు నెలల కనిష్టానికి సూచీ దిగిరావడం గమనార్హం. అలాగే గరిష్ట లక్ష్యానికన్నా (6 శాతం) దిగువన ఉండడం హర్షణీయ పరిణామం. కాగా, జనవరిలో 8.3 శాతంగా ఉన్న ఫుడ్ బాస్కెట్ ధర, సమీక్షా నెల ఫిబ్రవరిలో 8.66 శాతానికి ఎగసింది. ఇక పారిశ్రామిక ఉత్పత్తికి సంబంధించిన సూచీ (ఐఐపీ) వృద్ధి 2024 జనవరిలో 3.8 శాతానికి మందగించింది. 2023 ఇదే నెలలో ఈ వృద్ధి రేటు 5.8 శాతంగా ఉంది. మొత్తం పారిశ్రామిక ఉత్పత్తిలో 70 శాతం వెయిటేజ్ ఉన్న తయారీసహా మైనింగ్, విద్యుత్ రంగాలు పేలవ పనితనాన్ని ప్రదర్శించినట్లు గణాంకాలు ,కార్యక్రమాల అమలు మంత్రిత్వశాఖ విడుదల చేసిన లెక్కలు తెలిపాయి. 2023 డిసెంబర్లో ఐఐపీ వృద్ధి రేటు 4.2 శాతంకాగా, నవంబర్‌లో 2.4 శాతం. -
భారత్, ఇండొనేసియా మధ్య స్థానిక కరెన్సీలోనే వాణిజ్యం
ముంబై: ద్వైపాక్షిక వాణిజ్య లావాదేవీలను స్థానిక కరెన్సీలోనే నిర్వహించుకోవడంపై భారత్, ఇండొనేíసియా దృష్టి పెట్టాయి. ఇందుకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఇండోనేసియా ఒక అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకున్నాయి. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్, బ్యాంక్ ఇండోనేసియా గవర్నర్ పెర్రీ వార్జియో దీనిపై సంతకాలు చేశారు. సీమాంతర లావాదేవీలను భారతీయ రూపాయి (ఐఎన్ఆర్), ఇండొనేషియా రూపియా (ఐడీఆర్) మారకంలో నిర్వహించడాన్ని ప్రోత్సహించే దిశగా ఫ్రేమ్ వర్క్ ను రూపొందించడానికి ఇది ఉపయోగ పడనుంది. -
ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ పసిడి రుణాలపై ఆర్బీఐ నిషేధం
ముంబై: పర్యవేక్షణ లోపాల కారణంగా ఆర్థిక సేవల సంస్థ ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ బంగారం రుణాలు ఇవ్వకుండా రిజర్వ్ బ్యాంక్ నిషేధం విధించింది. ఇది తక్షణమే అమల్లోకి వచి్చనట్లు ఆర్బీఐ తెలిపింది. అయితే, ప్రస్తుత గోల్డ్ లోన్ పోర్ట్‌ఫోలియోకి సంబంధించిన వసూళ్లు, రికవరీ ప్రక్రియలను యథావిధిగా కొనసాగించవచ్చని పేర్కొంది. పసిడి రుణాలిచ్చేటప్పుడు, డిఫాల్ట్ అయిన సందర్భాల్లో వేలం వేసేటప్పుడు బంగారం స్వచ్ఛత, బరువును విలువ కట్టడంలో లోపాలు, పరిమితికి మించి నగదు రూపంలో రుణ మొత్తాన్ని మంజూరు చేయడం .. వసూలు చేయడం తదితర తీవ్ర ఉల్లంఘనలను కంపెనీ ఆడిట్లో గుర్తించినట్లు రిజర్వ్ బ్యాంక్ వివరించింది. అలాగే, ప్రామాణిక వేలం ప్రక్రియలను పాటించకపోవడం, కస్టమర్లకు విధించే చార్జీలపై పారదర్శకత లోపించడం మొదలైనవి కూడా కస్టమర్ల ప్రయోజనాలపై ప్రతికూల ప్రభావం చూపేవేనని ఆర్బీఐ తెలిపింది. సంస్థపై చేపట్టిన ప్రత్యేక ఆడిట్ పూర్తయ్యాక పర్యవేక్షణపరమైన ఆంక్షలను సమీక్షించనున్నట్లు వివరించింది. -
స్టార్టప్‌లతో ప్రతి నెలా సమావేశం నిర్వహించండి..
న్యూఢిల్లీ: అంకుర సంస్థలు, ఫిన్‌టెక్ సంస్థల ఆందోళనలను, సమస్యలను పరిష్కరించేందుకు వాటితో నెలవారీ సమావేశాలు నిర్వహించాలని రిజర్వ్ బ్యాంక్‌కు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సూచించారు. స్టార్టప్‌లు, ఫిన్‌టెక్ సంస్థలతో జరిగిన సమావేశంలో మంత్రి ఈ మేరకు సూచనలు చేసినట్లు ప్రభుత్వాధికారి ఒకరు తెలిపారు. రేజర్‌పే, క్రెడ్, పీక్‌ఫిఫ్టీన్ తదితర 50 సంస్థల టాప్ ఎగ్జిక్యూటివ్‌లు ఈ భేటీలో పాల్గొన్నారు. ప్రభుత్వం తరఫున ఆర్థిక సేవల విభాగం కార్యదర్శి వివేక్ జోషి, డీపీఐఐటీ కార్యదర్శి రాజేశ్ కుమార్ సింగ్ తదితరులు, ఎస్బీఐ చైర్మన్ దినేశ్ ఖారా, ఎన్పీసీఐ అధికారులు హాజరయ్యారు. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ (పీపీబీఎల్)పై ఆర్బీఐ ఆంక్షల కొరడా ఝుళిపించిన తరుణంలో ఫిన్‌టెక్, స్టార్టప్‌లతో భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే, పీపీబీఎల్ ఉదంతంపరమైన ఆందోళనలేమీ అంకుర సంస్థల వ్యవస్థాపకుల్లో కనిపించలేదని అధికారి తెలిపారు. ఈ భేటీలో స్టార్టప్‌లు సైబర్‌సెక్యూరిటీ సంబంధ అంశాలను ప్రస్తావించినట్లు వివరించారు. మహాకుంభ్‌లో వెయ్యి అంకుర సంస్థలు.. మార్చి 18 నుంచి న్యూఢిల్లీలోని భారత మండపంలో జరిగే స్టార్టప్ మహాకుంభ్ కార్యక్రమంలో 1,000 పైచిలుకు అంకుర సంస్థలు, పెద్ద సంఖ్యలో ఇన్వెస్టర్లు, ఇన్క్యుబేటర్లు పాల్గొననున్నాయి. మూడు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమాన్ని పరిశ్రమలు, అంతర్గత వాణిజ్యం ప్రోత్సాహక విభా గం డీపీఐఐటీ నిర్వహించనుంది. పరిశ్రమకు సంబంధించిన అంశాలపై చర్చలు, మెంటార్ సెషన్లు, మాస్టర్‌క్లాస్‌లు, కీలకోపన్యాసాలు, యూనికార్న్ రౌండ్‌టేబుల్ సమావేశాలు మొదలైనవి ఉంటాయి. -
‘పేటీఎం’ కస్టమర్లకు సాయం చేయండి
ముంబై: యూపీఐ హ్యాండిల్ ‘పేటీఎం’ను ఉపయోగిస్తున్న పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ (పీపీబీఎల్) కస్టమర్లను 4–5 వేరే బ్యాంకులకు మార్చే అవకాశాలను పరిశీలించాలని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ (ఎన్పీసీఐ)కి ఆర్బీఐ సూచించింది. తద్వారా చెల్లింపుల వ్యవస్థలో అంతరాయం కలగకుండా చూడాలని, కస్టమర్లకు అసౌకర్యం కలగకుండా సహాయం చేయాలని పేర్కొంది. నిబంధనల ఉల్లంఘనకు గాను మార్చి 15 నుంచి దాదాపు అన్ని కార్యకలాపాలు నిలిపివేయాలంటూ పీపీబీఎల్‌ను ఆర్బీఐ ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సంస్థ కస్టమర్లకు అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకుంటోంది. పీపీబీఎల్ వెబ్సైట్ ప్రకారం 30 కోట్ల వాలెట్లు, 3 కోట్ల మంది బ్యాంకు కస్టమర్లు ఉన్నారు. దేశీయంగా రిటైల్ చెల్లింపులు, సెటిల్మెంట్ వ్యవస్థను ఎన్పీసీఐ నిర్వహిస్తోంది. వేరే బ్యాంకులకు ‘పేటీఎం’ హ్యాండిల్‌ను మైగ్రేట్ చేసే క్రమంలో పేమెంట్ సరీ్వస్ ప్రొవైడర్లుగా (పీఎస్పీ) 4–5 బ్యాంకులను ఎన్పీసీఐ ఎంపిక చేయొచ్చని సూచించింది. తద్వారా ఒకే బ్యాంకుపై ఆధారపడితే తలెత్తే రిస్కులు తగ్గుతాయని తెలిపింది. ‘పేటీఎం’ హ్యాండిల్‌ను ఉపయోగిస్తున్న కస్టమర్లు, వ్యాపారుల హ్యాండిల్స్‌కు మాత్రమే మైగ్రేషన్ వర్తిస్తుందని, వేరే యూపీఐ అడ్రస్‌లు ఉన్నవారికి అవసరం లేదని పేర్కొంది. పీపీబీఎల్‌లో ఖాతాలు ఉన్న వారు మార్చి 15లోగా వేరే బ్యాంకులకు మారేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని మరోసారి సూచించింది. -
రేటు తగ్గించే పరిస్థితి లేదు
ముంబై: బ్యాంకులకు తానిచ్చే రుణాలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) వసూలు చేసే వడ్డీరేటు– రెపోను తగ్గించే పరిస్థితి ప్రస్తుతం లేదని గవర్నర్ శక్తికాంతదాస్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల ద్రవ్య విధాన కమిటీ ఉద్ఘాటించింది. అదే జరిగితే.. ధరలు తగ్గుదలకు ఇప్పటి వరకూ తీసుకున్న చర్యలు ప్రయోజనం లేకుండా పోతాయని అభిప్రాయపడింది. ధరల కట్టడే ఆర్బీఐ ప్రధాన ధ్యేయమని స్పష్టం చేసింది. ఈ నెల ప్రారంభంలో జరిగిన ఆర్బీఐ పాలసీ సమీక్షా సమావేశం మినిట్స్ ఈ అంశాలను వెల్లడించాయి. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం, అంతర్జాతీయంగా పెరిగిన క్రూడ్ ధరలు, దీనితో ప్రపంచ వ్యాప్తంగా ద్రవ్యోల్బణం భయాల నేపథ్యంలో ఈ సవాలును అధిగమించడానికి ఆర్బీఐ 2022 మే నుంచి 2023 ఫిబ్రవరి నాటికి రెపో రేటును 250 బేసిస్ పాయింట్లు పెంచింది. దీనితో ఈ రేటు 6.5 శాతానికి చేరింది. అయితే ద్రవ్యోల్బణం కొద్దిగా అదుపులోకి వస్తుందన్న సంకేతాల నేపథ్యంలో ఈ నెల ప్రారంభ సమీక్ష సహా గడచిన ఐదు ద్వైమాసిక సమావేశాల్లో యథాతథ రేటు కొనసాగింపునకే ఆర్బీఐ పెద్దపీట వేసింది. 4 శాతం రిటైల్ ద్రవ్యోల్బణం లక్ష్యం... రిటైల్ ద్రవ్యోల్బణం 2 శాతం ప్లస్, 2 శాతం మైనస్‌తో 4 శాతంగా ఉండాలని కేంద్రం ఆర్బీఐకి నిర్దేశిస్తున్నప్పటికీ తమ లక్ష్యం 4 శాతమేనని గవర్నర్ శక్తికాంతదాస్ స్పష్టం చేస్తూ వస్తున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వినియోగ ధరల సూచీ ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం 5.4 శాతం నుంచి 4.5 శాతానికి తగ్గుతుందని అంచనా. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 4వ త్రైమాసికంలో 5 శాతం ద్రవ్యోల్బణం నమోదవుతుందని ఆర్బీఐ భావిస్తోంది. తగిన స్థాయిలో వర్షపాతం నమోదయితే.. 2024–25 క్యూ1,క్యూ2, క్యూ3, క్యూ4లలో వరుసగా 5 శాతం, 4 శాతం, 4.6 శాతం, 4.7 శాతం చొప్పున ద్రవ్యోల్బణం నమోదవుతని పాలసీ సమీక్ష అంచనా వేసింది. పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు సరఫరా వ్యవస్థను ప్రభావితం చేస్తోందని, వస్తువుల ధరలపై ఇది తీవ్ర ఒత్తిడి తెస్తోందని, ఆహార ధరల్లో అనిశ్చితి ప్రధాన ద్రవ్యోల్బణంపై ప్రభావం చూపుతోందని కమిటీ అభిప్రాయపడింది. -
వృద్ధికి కార్పొరేట్ పెట్టుబడుల దన్ను
ముంబై: కార్పొరేట్ రంగం తాజా మూలధన వ్యయాలు తదుపరి దశ వృద్ధికి దోహదపడే అవకాశం ఉందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ‘స్టేట్ ఆఫ్ ది ఎకానమీ’ శీర్షికన రూపొందించిన తాజా బులెటిన్ పేర్కొంది. స్థిరంగా, 4 శాతం వద్ద తక్కువ ద్రవ్యోల్బణం జీడీపీ పురోగమనానికి కీలక అంశంగా ఉంటుందని వివరించింది. 2024లో గ్లోబల్ ఎకానమీ ఊహించిన దానికంటే బలమైన వృద్ధిని ప్రదర్శించే అవకాశం ఉందని పేర్కొంది. సవాళ్లు ఉన్నప్పటికీ, సానుకూలతలో వాటిని సమతౌల్యం చేస్తున్నట్లు వివరించింది. భారత ఆరి్థక వ్యవస్థ 2023–24 ప్రథమార్థంలో మంచి పురోగతి సాధించిందని, ఇదే ధోరణిని ఇప్పటికీ కొనసాగిస్తోందని పేర్కొంది. మొత్తంమీద, ప్రైవేట్ కార్పొరేట్ రంగం పెట్టుబడి ధోరణులు ఈ సంవత్సరం ఇప్పటివరకు సానుకూలంగా ఉన్నాయని తెలిపింది. 2023 ఏప్రిల్–డిసెంబర్ మధ్య కాలంలో ప్రధాన బ్యాంకులు, ఆరి్థక సంస్థలు (ఎఫ్ఐ) రుణాలు మంజూరు చేసిన ప్రాజెక్ట్‌ల మొత్తం వ్యయం రూ. 2.4 లక్షల కోట్లని పేర్కొంటూ, ఇది వార్షికంగా 23 శాతంకంటే ఎక్కువని తెలిపింది. ప్రస్తుత ఆరి్థక సంవత్సరం రెండవ, మూడవ త్రైమాసికాల్లో మూలదన పెట్టుబడులు, పబ్లిక్ ఆఫర్లు, వాణిజ్య రుణ సేకరణలు.. ఎకానమీ సానుకూలతలను ప్రతిబింబిస్తున్నట్లు పేర్కొంది. 2024–25 ఆర్థిక సంవత్సరంలో 7 శాతం వృద్ధిని అంచనా వేస్తున్నట్లు పేర్కొంది. వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం వార్షిక సగటును 4.5 శాతంగా పేర్కొంది. బులెటిన్ కథనంలో వ్యక్తీకరించబడిన అభిప్రాయాలు సంబంధిత రచయితలవితప్ప భారతీయ రిజర్వ్ బ్యాంక్ అభిప్రాయాలుగా భావించరాదని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ మైఖేల్ దేబబ్రత పాత్ర నేతృత్వంలోని బృందం ఈ బులెటిన్‌ను రూపొందించింది. భారత్ రుణ–జీడీపీ నిష్పత్తిపై ఐఎంఎఫ్ వాదనలు సరికాదు... ఇదిలావుండగా, ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ మైఖేల్ దేబబ్రత పాత్ర నేతృత్వంలోని బృందం రచించిన మరో ఆరి్టకల్ భారత్ రుణ–జీడీపీ నిష్పత్తిపై అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) అభిప్రాయాలను త్రోసిపుచి్చంది. రుణ–జీడీపీ నిష్పత్తి అంచనా వేసిన దానికంటే గణనీయంగా తక్కువగా ఉండవచ్చని ఉద్ఘాటించింది. ‘‘ఈ సందర్భంలో తీవ్ర పరిస్థితులు ఏదైనా సంభవిస్తే... భారతదేశ సాధారణ ప్రభుత్వ రుణం జీడీపీలో మధ్య కాలికంగా 100 శాతం మించిపోతుందన్న ఐఎంఎఫ్ వాదనను మేము తిరస్కరిస్తున్నాము’’ అని ఆర్టికర్ పేర్కొంది. 2030–31 నాటికి ప్రభుత్వ సాధారణ రుణ–జీడీపీ నిష్పత్తి 78.2 శాతం ఉంటుందని ఐఎంఎఫ్ అంచనావేయగా, ఐదు శాతం తక్కువగా 73.4 శాతానికి పరిమితం అవుతుందని ఆర్టికల్ పేర్కొంది. ప్రభుత్వ ఆదాయాలు–వ్యయాలకు సంబంధించి నికర వ్యత్యాసం ద్రవ్యలోటును భారత్ పటిష్ట రీతిలో కట్టడి చేయగలుగుతున్నట్లు నివేదిక స్పష్టం చేసింది. 2024–25లో వృద్ధి 7 శాతం: ఆరి్థకశాఖ కాగా, భారత ఆర్థిక వ్యవస్థ అవుట్‌లుక్ ప్రకాశవంతంగా’ కనిపిస్తుందని, స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు వచ్చే ఆరి్థక సంవత్సరంలో 7 శాతం వృద్ధి రేటును నమోదు చేసే అవకాశం ఉందని ఆరి్థకశాఖ నెలవారీ ఆరి్థక సమీక్షా నివేదిక పేర్కొంది. భౌగోళిక రాజకీయ ఒత్తిళ్లు– అంతర్జాతీయ ఆరి్థక మార్కెట్లలో అస్థిరత నుండి ప్రతికూలతలపై దేశం నిఘా ఉంచాల్సిన అవసరం ఉందని నివేదిక ఉద్ఘాటించింది. గృహ వినియోగం మెరుగుపడుతుందని నివేదిక అంచనా వేసింది. ప్రైవేటు రంగంలో తిరిగి పెరుగుతున్న పెట్టుబడులు, మెరుగైన వ్యాపార సెంటిమెంట్లు, బ్యాంకులు– కార్పొరేట్ల ఆరోగ్యకరమైన బ్యాలెన్స్ షీట్లు, మూలధన వ్యయం పెంపునకు ప్రభుత్వ నిరంతర ప్రయత్నం ఎకానమీని సుస్థిరంగా నడుపుతోందని నివేదిక పేర్కొంది. ప్రపంచ వాణిజ్యం మెరుగుపడ్డం, సరఫరాల చైన్ స్థిరీకరణ అంతర్జాతీయ డిమాండ్ పురోగమనానికి దారితీసే అంశాలని వివరించింది. -
RBI MPC Meeting 2024: ఆరో‘సారీ’.. తగ్గించేదేలే..!
ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) రెపో రేటును యథాతథంగా 6.5 శాతం వద్ద కొనసాగించాలని నిర్ణయించింది. ముంబైలో ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ నేతృత్వంలో మూడు రోజుల పాటు జరిగిన ఆరుగురు సభ్యుల ఆర్బీఐ ఎంపీసీ ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్ష గురువారం ముగిసింది. సమావేశ వివరాలను గవర్నర్ వివరిస్తూ, అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి పరిస్థితుల నేపథ్యం, దేశంలో వినియోగ ధరల సూచీ ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం ప్రభుత్వం నిర్దేశిస్తున్న విధంగా 4 శాతానికి దిగిరావాలన్న లక్ష్యం వంటి అంశాల నేపథ్యంలో రెపో రేటును ప్రస్తుతమున్నట్టుగానే కొనసాగించాలని నిర్ణయించినట్లు తెలిపారు. దీంతో బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు (రెపో) 6.5 శాతంగా కొనసాగనుంది. ఫలితంగా బ్యాంకింగ్ రుణ రేట్లలో కూడా దాదాపు ఎటువంటి మార్పులూ జరగబోవని నిపుణులు అంచనావేస్తున్నారు. వరుసగా ఆరవసారి ‘యథాతథం’.. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం, అంతర్జాతీయంగా పెరిగిన క్రూడ్ ధరలు, దీనితో ప్రపంచ వ్యాప్తంగా ద్రవ్యోల్బణం భయాల నేపథ్యంలో ఈ సవాలును అధిగమించడానికి ఆర్బీఐ 2022 మే నుంచి 2023 ఫిబ్రవరి నాటికి రెపో రేటును 250 బేసిస్ పాయింట్లు పెంచింది. దీనితో ఈ రేటు 6.5 శాతానికి చేరింది. అయితే ద్రవ్యోల్బణం కొద్దిగా అదుపులోకి వస్తుందన్న సంకేతాల నేపథ్యంలో తాజా సమీక్ష సహా గడచిన ఐదు సమావేశాల్లో యథాతథ రేటు కొనసాగింపునకే ఆర్బీఐ పెద్దపీట వేసింది. పాలసీలో కీలకాంశాలు... ► ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2023–24లో వృద్ధి రేటు 7.3 శాతంగా అంచనా. ► ఇదే కాలంలో రిటైల్ ద్రవ్యోల్బణం 5.4% నుంచి 4.5 శాతానికి డౌన్. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 4వ త్రైమాసికంలో 5 శాతం ద్రవ్యోల్బణం నమోదవుతుందని అంచనా. ► నియంత్రణా పరమైన మార్గదర్శకాలను ఎంతోకాలంగా పాటించకపోవడమే పేటీఎంపై చర్యకు దారితీసినట్లు గవర్నర్ దాస్ పేర్కొన్నారు. ఈ చర్యలు వ్యవస్థకు ముప్పు కలిగించేవిగా భావించరాదని కూడా స్పష్టం చేశారు. ► డిజిటల్ రూపాయి వినియోగదారులు ఇకపై పరిమిత ఇంటర్నెట్ కనెక్టివిటీ ఉన్న ప్రాంతాల్లోనూ లావాదేవీలను త్వరలో నిర్వహించగలుగుతారు. తక్కువ లేదా పరిమిత ఇంటర్నెట్ కనెక్టివిటీ ఉన్న ప్రాంతాల్లో లావాదేవీల కోసం సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ–రిటైల్(సీబీడీసీ–ఆర్) ఆఫ్‌లైన్ కార్యాచరణను ఆర్బీఐ త్వరలో ఆవిష్కరించనుంది. ► రుణ ఒప్పంద నిబంధనల గురించి కీలక వాస్తవ ప్రకటన (కేఎఫ్ఎస్)ను కస్టమర్లకు అందించవలసి ఉంటుందని ఆర్బీఐ స్పష్టం చేసింది. దీని ప్రకారం బ్యాంకింగ్ ఇకపై రిటైల్‌తోపాటు సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ) రుణగ్రహీతలకు కూడా కేఎఫ్‌ఎస్‌ను అందించాల్సి ఉంటుంది. ► తదుపరి పాలసీ సమీక్ష ఏప్రిల్ 3 నుంచి 5వ తేదీ వరకు జరుగుతుంది. వచ్చే పాలసీలో రేటు తగ్గొచ్చు దేశంలో హౌసింగ్ డిమాండ్ పెంచడానికి వచ్చే ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన సమీక్షలో రెపో రేటు తగ్గింపు నిర్ణయం ఉంటుందని భావిస్తున్నాం. ప్రస్తుతానికి వడ్డీరేట్ల స్థిరత్వం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నాం. దీనివల్ల డిమాండ్ ప్రస్తుత పటిష్ట స్థాయిలోనే కొనసాగుతుందని పరిశ్రమ భావిస్తోంది. దేశ ఎకానమీ స్థిరంగా ఉండడం పరిశ్రమకు కలిసివచ్చే అంశం. – బొమన్ ఇరానీ, క్రెడాయ్ ప్రెసిడెంట్ వృద్ధికి బూస్ట్ రేటు యథాతథ విధానాన్ని కొనసాగిస్తూ తీసుకున్న నిర్ణయం ప్రగతిశీలమైంది. సుస్థిర ఆర్థిక వృద్ధికి దోహదపడుతుంది. అంతర్జాతీయ, దేశీయ సవాళ్లు– ఆహార రంగానికి సంబంధించి ధరల సమస్యల వంటి అన్ని అంశాలనూ పరిగణనలోకి తీసుకుంటూ... వినియోగదారు ప్రయోజనాలే లక్ష్యంగా జరిగిన నిర్ణయాలు హర్షణీయం. జాగరూకతతో కూడిన విధానమిది. – దీపక్ సూద్, అసోచామ్ సెక్రటరీ జనరల్ -
లాభాలపై రూ. 500 కోట్ల ప్రభావం
న్యూఢిల్లీ: పేటీఎం పేమెట్స్ బ్యాంక్‌పై (పీపీబీఎల్)పై రిజర్వ్ బ్యాంక్ ఆంక్షల వల్ల తమ వార్షిక నిర్వహణ లాభాలపై రూ. 300–500 కోట్ల మేర ప్రతికూల ప్రభావం పడొచ్చని ఫిన్‌టెక్ సంస్థ పేటీఎం అంచనా వేసింది. పీపీబీఎల్ డిపాజిట్లను స్వీకరించకుండా విధించిన ఆంక్షలతో, కస్టమర్లు తమ వాలెట్లలో డబ్బును డిపాజిట్ చేసే అవకాశం లేకపోవడం ఇందుకు కారణమని పేర్కొంది. అయితే, లాభదాయకతను మెరుగుపర్చుకునే దిశగా తమ ప్రయాణం ముందుకు కొనసాగుతుందని వివరించింది. డిసెంబర్లో పీపీబీఎల్ ద్వారా 41 కోట్ల యూపీఐ రెమిటెన్సుల లావాదేవీలు జరిగాయి. పేటీఎం బ్రాండ్ మాతృసంస్థ అయిన వన్97 కమ్యూనికేషన్స్‌కి (ఓసీఎల్) పీపీబీఎల్‌లో 49 శాతం వాటాలు ఉన్నాయి. 50 శాతం లోపు మైనారిటీ వాటాలే ఉన్నందున దాన్ని అనుబంధ సంస్థగా కాకుండా అసోసియేట్ సంస్థగా పరిగణిస్తోంది. ఒక పేమెంట్స్ కంపెనీగా పీపీబీఎల్‌తో పాటు వివిధ బ్యాంకులతో ఓసీఎల్ కలిసి పని చేస్తోందని పేటీఎం తెలిపింది. తాజా పరిణామం కారణంగా ఇకపై పీపీబీఎల్‌తో కాకుండా ఇతర బ్యాంకులతో మాత్రమే ఓసీఎల్ పని చేస్తుందని వివరించింది. పదే పదే నిబంధనల ఉల్లంఘనల కారణంగా ఫిబ్రవరి 29 నుంచి కస్టమర్ల ఖాతాలు, ప్రీపెయిడ్ సాధనాలు, వాలెట్లు, ఫాస్టాగ్‌లు మొదలైన వాటిల్లో డిపాజిట్లు, టాప్‌అప్‌లను స్వీకరించరాదంటూ పీపీబీఎల్‌పై రిజర్వ్ బ్యాంక్ ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. -
తెలియని సంస్థలకు పత్రాలు ఇవ్వకండి..
ముంబై: కేవైసీ అప్డేషన్ పేరిట జరుగుతున్న మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రిజర్వ్ బ్యాంక్ హెచ్చరించింది. గుర్తుతెలియని వారికి పత్రాలను ఇవ్వకుండా జాగ్రత్త వహించాలని సూచించింది. ‘అపరిచిత వ్యక్తులు లేదా సంస్థలకు కేవైసీ (గుర్తింపు, చిరునామా ధృవీకరణకు ఆధారాలు) పత్రాలు లేదా వాటి కాపీలను ఇవ్వకండి‘ అని పేర్కొంది. అలాగే అకౌంట్ లాగిన్ వివరాలు, కార్డు సమాచారం, పిన్ నంబర్లు, పాస్వర్డ్లు, ఓటీపీలను కూడా ఎవరికీ చెప్పరాదంటూ సూచించింది. ‘సాధారణంగా ఈ తరహా మోసాల్లో.. కస్టమర్లు తమ వ్యక్తిగత సమాచారం, అకౌంటు వివరాలను తెలియజేసే విధంగా లేదా మెసేజీల్లో పంపే లింకుల ద్వారా అనధికారిక యాప్‌లను ఇన్స్టాల్ చేసుకోవాలంటూ మోసపుచ్చేలా ఖాతాదారులకు అవాంఛిత ఫోన్ కాల్స్, ఎస్ఎంఎస్, ఈమెయిల్స్ మొదలైనవి వస్తుంటాయి. కస్టమర్లు అప్పటికప్పుడు స్పందించకపోతే అకౌంటు ఫ్రీజ్ అవుతుందని లేదా మూతబడుతుందని బెదిరించే ధోరణిలో ఇవి ఉంటాయి. అలాంటప్పుడు కస్టమర్లు తమ వ్యక్తిగత లేదా లాగిన్ వివరాలు గానీ ఇచ్చారంటే మోసగాళ్లు వారి ఖాతాల్లోకి అనధికారికంగా చొరబడతారు‘ అని ఆర్బీఐ పేర్కొంది. కేవైసీ అప్డేషన్ కోసం అభ్యర్ధన ఏదైనా వస్తే నేరుగా బ్యాంకు లేదా ఆర్థిక సంస్థనే సంప్రదించాలని సూచించింది. అలాగే, ఆయా సంస్థల అధికారిక వెబ్సైట్ల నుంచే కాంటాక్ట్ నంబర్లు తీసుకోవాలని పేర్కొంది. సైబర్ మోసం జరిగితే వెంటనే బ్యాంకు దృష్టికి తీసుకెళ్లాలని ఆర్బీఐ తెలిపింది. రిజర్వ్ బ్యాంక్ గతంలో కూడా ఇలాంటి మోసాలపై ఈ తరహా హెచ్చరికలు జారీ చేసింది. -
97.5% రూ.2,000 నోట్లు వచ్చేశాయ్..!
ముంబై: బ్యాంకింగ్ వ్యవస్థలోకి 97.5 శాతం రూ.2,000 బ్యాంక్ నోట్లు తిరిగి వచ్చేసినట్లు బ్యాంకింగ్ రెగ్యులేటర్– రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) పేర్కొంది. ఇంకా ప్రజాబాహుళ్యంలో రూ.8,897 కోట్ల విలువైన రూ.2,000 నోట్లు ఉన్నట్లు పేర్కొంది. ‘‘రూ. 2,000 బ్యాంకు నోట్ల ఉపసంహరణ ప్రకటించిన 2024 మే 19న వ్యాపారం ముగిసే సమయానికి చెలామణిలో ఉన్న రూ. 2,000 బ్యాంకు నోట్ల మొత్తం విలువ రూ. 3.56 లక్షల కోట్లు. 2024 జనవరి 31వ తేదీన వ్యాపారం ముగిసే సమయానికి ఈ విలువ రూ. రూ.8,897 కోట్లకు తగ్గింది’’ అని ఆర్బీఐ తాజా ప్రకటన వివరించింది.