జనవరి 1న రూ.81,015 కోట్ల లావాదేవీలు
రికార్డులు సృష్టిస్తున్న డిజిటల్ చెల్లింపులు
చిరు వ్యాపారుల వద్ద కూడా క్యూఆర్ కోడ్స్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రూపాయికీ యూపీఐ.. అవును మీరు విన్నది నిజమే. ఒక్క రూపాయి చెల్లించాలన్నా స్మార్ట్‌గా యూపీఐ పేమెంట్ యాప్‌తో ‘స్కాని’చ్చేస్తున్నారు. ఈ ట్రెండ్ దేశవ్యాప్తంగా పల్లెలకూ పాకింది. ఇదంతా అత్యంత వేగంగా చెల్లింపులను సుసాధ్యం చేస్తున్న టెక్నాలజీ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) మాయాజాలం.
క్షణాల్లో ఎక్కడి నుంచి ఎక్కడికైనా, ఎవరికైనా రోజుకు గరిష్టంగా రూ.1 లక్ష వరకు.. బ్యాంకు ఖాతాకు, ఖాతా అనుసంధానమైన మొబైల్ నంబర్‌కు, యూపీఐ ఐడీ, క్యూఆర్ కోడ్‌కు సురక్షితంగా, సులభంగా డిజిటల్ చెల్లింపులను యూపీఐ సుసాధ్యం చేసింది. చిరు వ్యాపారులకూ డిజిటల్ రూపంలో నగదును స్వీకరించే ప్రధాన సాధనంగా మారిపోయింది. చిల్లర సమస్యలకు యూపీఐ చెక్ పెడుతోంది. 2025 జనవరి 1న రూ.81,015.79 కోట్ల విలువైన 56.84 కోట్ల లావాదేవీలతో కొత్త సంవత్సరంలో యూపీఐ శుభారంభం చేసింది. న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో డిసెంబర్ 31న ప్రజలు రూ.93,148 కోట్ల విలువైన లావాదేవీలు జరిపారు.
కొత్త రికార్డుల ప్రయాణం..
దేశవ్యాప్తంగా 2024 డిసెంబర్ 2న రూ.95,915.6 కోట్ల విలువ చేసే లావాదేవీలు నమోదయ్యాయి. యూపీఐ చరిత్రలో 2016 ఏప్రిల్ నుంచి 2025 జనవరి 1 నాటికి ఇదే అత్యధికం. ఇక 2024 డిసెంబర్ నెలలో సగటున రోజుకు రూ.74,990 కోట్ల విలువైన 54 కోట్ల లావాదేవీలు జరిగాయంటే నోరెళ్లబెట్టాల్సిందే. కస్టమర్లు నవంబర్‌లో రోజుకు సగటున రూ.71,840 కోట్ల విలువైన 51.6 కోట్ల లావాదేవీలు జరిపారు. యూపీఐ లావాదేవీల సంఖ్య గత నెలలో 8 శాతం దూసుకెళ్లి మొత్తం 1,673 కోట్లుగా ఉంది. నవంబర్‌లో ఈ సంఖ్య 1,548 కోట్లు నమోదైంది. లావాదేవీల విలువ గత నెలలో రూ.23.25 లక్షల కోట్లకు చేరింది. నవంబర్‌లో ఇది రూ.21.55 లక్షల కోట్లుగా
ఉంది.
భారత్ స్కాన్ చేస్తోంది..
దేశం ఇప్పుడు క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తోందంటే అతిశయోక్తి కాదు. రోడ్డు పక్కన ఉండే చిరు వర్తకుల వద్దా ఇవి దర్శనమిస్తున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) గణాంకాల ప్రకారం 2024 నవంబర్ నాటికి భారత్ క్యూఆర్‌తో కలిపి మొత్తం యూపీఐ క్యూఆర్ కోడ్స్ 63.2 కోట్లు జారీ అయ్యాయి. 2023 నవంబర్‌లో ఈ సంఖ్య 31.4 కోట్లు మాత్రమే. అంటే ఏడాదిలో క్యూఆర్ కోడ్స్ రెట్టింపు అయ్యాయన్నమాట. వర్తకుల వద్ద దేశవ్యాప్తంగా 2024 మార్చి 31 నాటికి 34.9 కోట్ల క్యూఆర్ కోడ్స్ ఉన్నాయి. డిజిటల్ చెల్లింపుల వేగానికి ఈ అంకెలే నిదర్శనం.
ఎన్‌పీసీఐ వేదికగా 55 శాతం..
ఆర్‌బీఐ గణాంకాల ప్రకారం క్లియరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐఎల్), ఆర్‌టీజీఎస్, ఐఎంపీఎస్, ఎన్‌ఏసీహెచ్, నెఫ్ట్, యూపీఐ, డెబిట్/క్రెడిట్ కార్డులు, ఏటీఎంలు, పీవోఎస్ మెషీన్లు, చెక్కులు, బ్యాంక్ డ్రాఫ్టులు, నగదు.. ఇలా ప్రభుత్వ, రిటైల్ పరంగా దేశవ్యాప్తంగా 2024 నవంబర్ నెలలో రూ.2,20,52,158 కోట్ల విలువైన లావాదేవీలు జరిగాయి. ఇందులో యూపీఐ వాటా 9.77 శాతం. అలాగే నవంబర్‌లో ఎన్‌పీసీఐ వేదికగా జరిగిన రూ.38,94,079 కోట్ల రిటైల్ లావాదేవీల్లో యూపీఐ 55.34 శాతం వాటా కైవసం చేసుకుంది.
ఫోన్‌పే టాప్
లావాదేవీల పరంగా ఫోన్‌పే 48 శాతం వాటాతో తొలి స్థానంలో నిలిచింది. గూగుల్ పే 37 శాతం, పేటీఎంకు 7% వాటా ఉంది. మిగిలిన 8% వాటాను క్రెడ్, ఐసీఐసీఐ
బ్యాంక్ యాప్స్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ యాప్స్ వంటివి పంచుకున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment