National Payments Corporation of India
-
పేటీఎంకు ఎన్పీసీఐ ఊరట
న్యూఢిల్లీ: ఫిన్‌టెక్ దిగ్గజం పేటీఎంకు ఊరటనిస్తూ కొత్త యూపీఐ యూజర్లను చేర్చుకునేందుకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ (ఎన్పీసీఐ) అనుమతించింది. నిర్దేశిత మార్గదర్శకాలు, నిబంధనలను పాటించడాన్ని బట్టి అనుమతులు ఉంటాయని ఎన్పీసీఐ పేర్కొన్నట్లు ఎక్సే్చంజీలకు ఇచి్చన సమాచారంలో పేటీఎం మాతృసంస్థ వన్97 కమ్యూనికేషన్స్ (ఓసీఎల్) వెల్లడించింది. నిబంధనలను పదే పదే ఉల్లంఘించినందుకు గాను కార్యకలాపాలు నిలిపివేయాలంటూ ఈ ఏడాది జనవరిలో అనుబంధ సంస్థ పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌ను (పీపీబీఎల్) ఆర్బీఐ ఆదేశించడం తెలిసిందే. ఎన్పీసీఐ అనుమతుల వార్తలతో బుధవారం ఓసీఎల్ షేరు ధర 8 శాతం లాభంతో రూ. 745 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 12 శాతం ఎగబాకింది. -
‘పేటీఎం’ కస్టమర్లకు సాయం చేయండి
ముంబై: యూపీఐ హ్యాండిల్ ‘పేటీఎం’ను ఉపయోగిస్తున్న పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ (పీపీబీఎల్) కస్టమర్లను 4–5 వేరే బ్యాంకులకు మార్చే అవకాశాలను పరిశీలించాలని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ (ఎన్పీసీఐ)కి ఆర్బీఐ సూచించింది. తద్వారా చెల్లింపుల వ్యవస్థలో అంతరాయం కలగకుండా చూడాలని, కస్టమర్లకు అసౌకర్యం కలగకుండా సహాయం చేయాలని పేర్కొంది. నిబంధనల ఉల్లంఘనకు గాను మార్చి 15 నుంచి దాదాపు అన్ని కార్యకలాపాలు నిలిపివేయాలంటూ పీపీబీఎల్‌ను ఆర్బీఐ ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సంస్థ కస్టమర్లకు అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకుంటోంది. పీపీబీఎల్ వెబ్సైట్ ప్రకారం 30 కోట్ల వాలెట్లు, 3 కోట్ల మంది బ్యాంకు కస్టమర్లు ఉన్నారు. దేశీయంగా రిటైల్ చెల్లింపులు, సెటిల్మెంట్ వ్యవస్థను ఎన్పీసీఐ నిర్వహిస్తోంది. వేరే బ్యాంకులకు ‘పేటీఎం’ హ్యాండిల్‌ను మైగ్రేట్ చేసే క్రమంలో పేమెంట్ సరీ్వస్ ప్రొవైడర్లుగా (పీఎస్పీ) 4–5 బ్యాంకులను ఎన్పీసీఐ ఎంపిక చేయొచ్చని సూచించింది. తద్వారా ఒకే బ్యాంకుపై ఆధారపడితే తలెత్తే రిస్కులు తగ్గుతాయని తెలిపింది. ‘పేటీఎం’ హ్యాండిల్‌ను ఉపయోగిస్తున్న కస్టమర్లు, వ్యాపారుల హ్యాండిల్స్‌కు మాత్రమే మైగ్రేషన్ వర్తిస్తుందని, వేరే యూపీఐ అడ్రస్‌లు ఉన్నవారికి అవసరం లేదని పేర్కొంది. పీపీబీఎల్‌లో ఖాతాలు ఉన్న వారు మార్చి 15లోగా వేరే బ్యాంకులకు మారేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని మరోసారి సూచించింది. -
యూపీఐ ఐడీలు డీయాక్టివేట్ అవుతాయ్ - చెక్ చేసుకోండి!
యూపీఐ లావాదేవీలు పెరుగుతున్న సమయంలో చాలామంది చేతిలో డబ్బు పెట్టుకోవడమే మర్చిపోయారు. చిన్న కొట్టు దగ్గర నుంచి పెద్ద షాపింగ్ మాల్స్ వరకు ఎక్కడ ఏది కొనాలన్నా ఆన్లైన్ చెల్లింపులు చేస్తున్నారు. ఇది చాలా సులభమైన ప్రాసెస్ కూడా. అయితే ఇప్పుడు నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఓ కొత్త రూల్ తీసుకువచ్చింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ప్రకారం వాడకంలో లేని.. లేదా వినియోగంలో లేని యూపీఐ ఐడీలను డీయాక్టివ్ చేసే అవకాశం ఉంది. ఈ ప్రక్రియను ఫోన్‌పే, గూగుల్ పేకి మాత్రమే కాకుండా పేటీఎమ్ వంటి ఇతర పేమెంట్స్ యాప్స్ కూడా ప్రారంభించాలని ఆదేశించింది. ఒక సంవత్సరంకంటే ఎక్కువ రోజులు వినియోగంలో లేని యూపీఐ ఐడీలను పూర్తిగా క్లోజ్ చేయాలని సంబంధిత సంస్థలకు నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ సర్క్యులర్ జారీ చేసినట్లు సమాచారం. ఇందులో 2023 డిసెంబర్ 31 నాటికి ఈ మార్గదర్శకాలను అమలు చేయాలనీ స్పష్టం చేసింది. ఇదీ చదవండి: ఓపెన్ఏఐ కొత్త సీఈఓ.. ఎవరీ 'మీరా మురాటి'? వినియోగదారులు లేదా ఖాతాదారులు మొబైల్ నెంబర్స్ మార్చుకునే సమయంలో.. అప్పటికే ఉన్న నెంబర్స్ డీయాక్టివేట్ చేయకపోతే.. వారికి సంబంధం లేని కొన్ని ఖాతాలకు డబ్బు బదిలీ అయ్యే అవకాశం ఉందని ఎన్పీసీఐ భావించి ఈ నిర్ణయం తీసుకుంది. అంటే టెలికం ఆపరేటర్లు పాత నెంబర్స్ వేరొకరికి అందించడం వల్ల ఈ ప్రమాదం జరుగుతుంది. కాబట్టి వినియోగంలో లేని ఐడీలను డీయాక్టివేట్ చేస్తే ఈ సమస్య జరగదని ధ్రువీకరించింది. -
క్యూఆర్ కోడ్‌తో స్టార్ హెల్త్ పాలసీ కొనుగోలు
న్యూఢిల్లీ: ఆరోగ్య బీమా పాలసీల కొనుగోలు, రెన్యువల్ ప్రక్రియను మరింత సులభతరం చేయడంపై స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్ దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా యూపీఐ క్యూఆర్ కోడ్ ద్వారా చెల్లింపులు జరిపే సౌలభ్యాన్ని అందుబాటులోకి తెచి్చంది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) తోడ్పాటుతో దీన్ని రూపొందించినట్లు సంస్థ ఎండీ ఆనంద్ రాయ్ తెలిపారు. దీనితో లావాదేవీకి పట్టే సమయం గణనీయంగా తగ్గగలదని వివరించారు. ప్రీమియం చెల్లింపును గుర్తు చేసేందుకు పంపించే సందేశాల్లో యూపీఐ క్యూఆర్ కోడ్ ఉంటుందని, అందులో ఎంత ప్రీమియం కట్టాలనే వివరాలు నిక్షిప్తమై ఉంటాయని సంస్థ చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్ చిట్టి బాబు తెలిపారు. దాన్ని స్కాన్ చేయడం ద్వారా లేదా లింక్‌ను క్లిక్ చేసి యూపీఐ యాప్ ద్వారా సెకన్లలో చెల్లింపును పూర్తి చేయొచ్చన్నారు. స్టార్ హెల్త్ కూడా సౌకర్యవంతమైన యూపీఐ ఆధారిత ప్రీమియం చెల్లింపు ఆప్షన్‌ను ప్రవేశపెట్టడం సంతోషకరమని ఎన్పీసీఐ చీఫ్ (ప్రోడక్ట్స్) కునాల్ కలావతియా చెప్పారు. -
మోసపూరిత చెక్కులకు పీఎన్బీ చెక్
న్యూఢిల్లీ: చెక్కులకు సంబంధించి మోసాల విషయంలో కస్టమర్లను రక్షించే చర్యలో భాగంగా ప్రభుత్వ రంగ పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) మరింత పటిష్ట కీలక చర్య తీసుకుంది. రూ. 5 లక్షలు, అంతకంటే ఎక్కువ విలువైన చెక్కుల చెల్లింపులకూ ఇకపై పాజిటివ్ పే సిస్టమ్ (పీపీఎస్) వ్యవస్థను తప్పనిసరి చేసింది. ఏప్రిల్ 5 నుంచి కొత్త వ్యవస్థ అమల్లోకి వస్తుంది. ప్రస్తుతం రూ.10లక్షలు ఆపైబడిన విలువైన చెక్కుకే పీపీఎస్ వ్యవస్థ అందుబాటులో ఉంది. పీపీఎస్ వ్యవస్థను నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) అభివృద్ధి చేసింది. ఇది నిర్దిష్ట చెక్కులను జారీ చేసేటప్పుడు కస్టమర్లు అవసరమైన వివరాలను (ఖాతా నంబర్, చెక్ నంబర్, చెక్ ఆల్ఫా కోడ్, ఇష్యూ తేదీ, నగదు, లబ్ధిదారు పేరు) తిరిగి ధృవీకరించవలసి ఉంటుంది. బ్రాంచ్ ఆఫీస్, ఆన్లైన్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, ఎస్ఎంఎస్ బ్యాంకింగ్ ద్వారా చెక్ వివరాలను అందించడం ద్వారా కస్టమర్లు పీపీఎస్ సౌకర్యాన్ని ఉపయోగించుకోవచ్చు. చెక్ ప్రెజెంటేషన్‌కు ఒక పని రోజు ముందు ఈ వివరాలను ఆమోదించడం, లేదా వివరాలను సమర్పించడం వంటి చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. పీపీఎస్‌లో నమోదైన చెక్కులు మాత్రమే వివాద పరిష్కార యంత్రాంగం కిందకు వస్తాయి. -
రూ.500లోపు చెల్లింపులే ఎక్కువ.. రూ.8.32 లక్షల కోట్లు చేతులు మారాయి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: చేతిలో మొబైల్ ఫోన్ ఉంటే చాలు. మొబైల్ నంబర్, క్యూఆర్ కోడ్‌తో క్షణాల్లో వర్తకులకు చెల్లింపులు, నగదు బదిలీ అవుతుంది. బ్యాంకు ఖాతాలు ఎన్ని ఉన్నా ఒకే యాప్‌లో ఇమిడిపోవడం. ప్రతిసారీ కార్డు నంబర్, ఖాతా, ఐఎఫ్ఎస్సీ వివరాలు పొందుపరిచే అవసరం లేకుండా వర్చువల్ అడ్రస్. సులభంగా, సురక్షిత లావాదేవీలు. పైగా ఎటువంటి యూజర్ చార్జీలు లేకపోవడం. ఇన్ని అనుకూలతలు ఉన్నాయి కాబట్టే ఇన్స్టాంట్ రియల్ టైమ్ పేమెంట్ వ్యవస్థలో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్కు (యూపీఐ) భారత్‌లో ఆదరణ గణనీయంగా పెరుగుతోంది. యూపీఐ చెల్లింపుల వ్యవస్థ అమలులోకి వచ్చిన ఆరేళ్లలోనే లావాదేవీల విలువ, పరిమాణం ఊహకు అందనంత నమోదవుతోంది. ఆర్బీఐ, ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ స్థాపించిన నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా యూపీఐ వ్యవస్థను అభివృద్ధి చేసింది. అంచనాలను మించి.. భారత్‌లో 2016 ఏప్రిల్‌లో యూపీఐ పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభం అయింది. అదే ఏడాది జూలైలో యూపీఐ ఆధారిత యాప్స్ ద్వారా రూ.38 లక్షల విలువ చేసే 9 వేల లావాదేవీలు జరిగాయి. కోవిడ్ మహమ్మారి రాకతో దేశంలో 2020 జూన్ నుంచి యూపీఐ లావాదేవీల సంఖ్య అనూహ్యంగా దూసుకెళ్లడం ప్రారంభమైంది. అంతకు ముందు గరిష్టంగా ఒక నెలలో రూ.2.22 లక్షల కోట్లు మాత్రమే లావాదేవీలు నమోదయ్యాయి. ప్రతి నెల 2020 సెప్టెంబర్ నుంచి రూ.3 లక్షల కోట్లు, డిసెంబర్ నుంచి రూ.4 లక్షల కోట్లు, 2021 మార్చి నుంచి రూ.5 లక్షల కోట్ల లావాదేవీలు జరిగాయి. ఆ తర్వాత ప్రతి రెండు మూడు నెలలకే ఒక లక్ష కోట్లు జతకూడుతూ వస్తోంది. సీజన్లో కొత్త గరిష్టం.. 2022 మే నెలలో యూపీఐ ఆధారిత యాప్స్ ద్వారా జరిగిన లావాదేవీల విలువ రూ.10 లక్షల కోట్ల మార్కును దాటింది. రూ.10.6 లక్షల కోట్ల లావాదేవీలతో జూలై నెల గరిష్ట స్థాయిని చేరుకుంది. ట్రాన్జాక్షన్స్ సంఖ్య ఏకంగా 628.8 కోట్లను తాకింది. ఆగస్ట్ 1–16 మధ్య మొత్తం రూ.5.71 లక్షల కోట్ల విలువైన 327 కోట్ల లావాదేవీలు రిజిష్టర్ అయ్యాయి. మార్కెట్ సెంటిమెంట్ సానుకూలంగా ఉండడంతో ఈ పండుగల సీజన్లో రూ.13 లక్షల కోట్ల మార్కును దాటడం ఖాయంగా కనిపిస్తోంది. 2021 జూలైలో 324.78 కోట్ల లావాదేవీలు జరిగాయి. వీటి విలువ రూ.6,06,281 కోట్లు. చిన్న మొత్తాలదే హవా.. ఈ ఏడాది జూలై నెలలో యూపీఐ ప్లాట్‌ఫామ్ ఆధారిత యాప్స్ ద్వారా వ్యక్తుల నుంచి వ్యక్తులకు రూ.8.32 లక్షల కోట్లు చేతులు మారాయి. లావాదేవీల సంఖ్య 328.9 కోట్లు. వ్యక్తుల నుంచి వర్తకులకు మధ్య రూ.2.3 లక్షల కోట్ల ట్రాన్జాక్షన్స్ జరిగాయి. లావాదేవీల సంఖ్య 300 కోట్లు. ఆసక్తికర విషయం ఏమంటే రూ.500 లోపు విలువ చేసే లావాదేవీలదే అగ్ర స్థానం. వీటి సంఖ్య ఏకంగా 69 శాతం వాటాతో 434.4 కోట్లు ఉందంటే ఆశ్చర్యం వేయక మానదు. వినియోగదార్లు నగదు నుంచి క్రమంగా డిజిటల్ చెల్లింపుల వైపు మళ్లుతున్నారనడానికి ఈ గణాంకాలే ఉదాహరణ. పెరిగిన బ్యాంకులు.. యూపీఐ సేవల్లో 22 థర్డ్ పార్టీ యాప్స్ ఉన్నాయి. 338 బ్యాంక్స్ పాలుపంచుకుంటున్నాయి. ఇందులో పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లుగా 55 బ్యాంక్స్ ఉన్నాయి. యూపీఐ సేవలు అందిస్తున్న బ్యాంకుల సంఖ్య పెరగడం కూడా ఈ స్థాయి వృద్ధికి కారణం. యూపీఐ ప్లాట్‌ఫామ్‌పై 2021 జూలైలో 235 బ్యాంక్స్ నమోదయ్యాయి. ఏడాదిలో 100కుపైగా బ్యాంకులు తోడు కావడం విశేషం. జూలైలో ఫోన్‌పే 299.4 కోట్ల లావాదేవీలకుగాను రూ.5.24 లక్షల కోట్లు, గూగుల్ పే 213 కోట్ల లావాదేవీలతో రూ.3.66 లక్షల కోట్లు, పేటీఎం 93.38 కోట్ల లావాదేవీలకుగాను రూ.1.11 లక్షల కోట్ల విలువతో టాప్–3లో నిలిచాయి. -
మీ బ్యాంకు ఖాతాలో నగదు జమ కావడం లేదా..? కారణం ఇదే..
పెదవాల్తేరు(విశాఖపట్నం): ఎన్పీసీఐ ఈ మాట సచివాలయాలలో ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పలు సంక్షేమ పథకాల కింద సొమ్ముని బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తుండడం తెలిసిందే. ఎన్పీసీఐ అనుసంధానం ఉన్న బ్యాంకు ఖాతాలలో మాత్రమే పథకాల సొమ్ము జమ అవుతుంది. చాలా మందికి ఈ విషయం తెలియక తమ బ్యాంకు ఖాతాలలో ఎందుకు సొమ్ము పడలేదంటూ సచివాలయాలకు ప్రదక్షిణలు చేస్తున్నారు. అక్కడ వార్డు వలంటీర్లు, సంక్షేమ కార్యదర్శులు బ్యాంకులో ఎన్పీసీఐ అనుసంధానం ఉన్న ఖాతాలకే సొమ్ము పడుతుందని చెప్పడంతో బ్యాంకులకు పరుగులు తీస్తున్నారు. ఇంతకీ ఎన్పీసీఐ అంటే నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అని అర్థం. చదవండి: దేశ చరిత్రలోనే ఇది ఒక అరుదైన ఘట్టం ఒక వ్యక్తికి ఒక బ్యాంకు ఖాతా మాత్రమే ఉంటే ఎన్పీసీఐ అనుసంధానం ద్వారా ఆయా పథకాల సొమ్ము ప్రయోజనాలు నేరుగా సదరు ఖాతాలోనే జమ అవుతాయి. కానీ, కొంత మందికి ఒకటి కన్నా రెండు లేదా అంతకన్నా ఎక్కువ బ్యాంకు ఖాతాలు ఉంటాయి. అప్పుడు సమస్య వస్తుంది. వాస్తవానికి ఇన్ని ఖాతాలలో ఏదో ఒక ఖాతాకు మాత్రమే బ్యాంకులో ఎన్పీసీఐ అనుసంధానం చేసి ఉంటారు. కానీ లబ్ధిదారులు మాత్రం అమ్మ ఒడి, చేయూత, వాహన మిత్ర, కాపు నేస్తం తదితర పథకాల కింద పేర్లు నమోదు సమయంలో తెలియక వేరే బ్యాంకు ఖాతాలు ఇస్తుండడంతో చాలా మందికి నగదు జమ అవ్వలేదు. అటువంటి సమయంలో లబ్ధిదారులు సదరు బ్యాంకులకు వెళ్లి ఏ ఖాతాకు ఎన్పీసీఐ అనుసంధానం జరిగి ఉందో తెలుసుకోవచ్చు. అలాగే, ఎక్కువ బ్యాంకు ఖాతాలు కలిగి ఉన్న వారు తమకు నచ్చిన బ్యాంకు ఖాతాకు ఎన్పీసీఐ అనుసంధానం కోరుకుంటే సంబంధిత బ్యాంకులో ఆధార్, బ్యాంకు ఖాతాలతో సంప్రదించాల్సి ఉంటుంది. తరువాత ఎన్పీసీఐ అనుసంధానం గల బ్యాంకు ఖాతా జెరాక్స్ మాత్రమే ఆయా పథకాలకు దరఖాస్తు సమయంలో సచివాలయాలలో అందజేయాల్సి ఉంటుంది. -
ఇక టాటా యూపీఐ..!
బెంగళూరు: పారిశ్రామిక దిగ్గజం టాటా గ్రూప్ .. డిజిటల్ వ్యాపార వ్యూహాల అమల్లో దూకుడు పెంచుతోంది. తాజాగా ఏకీకృత చెల్లింపుల విధానం (యూపీఐ) ఆధారిత యాప్‌ను ప్రవేశపెట్టడంపై కసరత్తు చేస్తోంది. థర్డ్ పార్టీ పేమెంట్స్ అప్లికేషన్ ప్రొవైడరుగా డిజిటల్ చెల్లింపు సేవలు అందించేందుకు అనుమతులు ఇవ్వాలంటూ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ)కి టాటా గ్రూప్ దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. యూపీఐ సేవలకు కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ఒక ప్రైవేట్ బ్యాంకుతో, టాటా గ్రూప్‌లో భాగమైన టాటా డిజిటల్ చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. అలాగే మరో బ్యాంకింగ్ భాగస్వామితో కూడా భేటీ అయినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. వచ్చే నెలలో టాటా యూపీఐ యాప్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు వివరించాయి. టాటాకు ప్రయోజనకరం .. ఆన్లైన్ కామర్స్‌లో విస్తరించాలనుకుంటున్న టాటా గ్రూప్‌నకు సొంత యూపీఐ యాప్ ఉంటే సహజంగానే ఉపయోగకరంగా ఉండనుంది. వివిధ ఆఫర్లతో వినియోగదారులను ఆకర్షించేందుకు అవకాశం ఉంటుంది. ఉదాహరణకు, ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇండియా తన సొంత యూపీఐ సర్వీసుల ద్వారా యూజర్లకు క్యాష్‌బ్యాక్, ఇతరత్రా ప్రోత్సాహకాలు అందిస్తుండటం ద్వారా వినియోగదారులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంటుంది. టాటా డిజిటల్ తమ టాటా న్యూ సూపర్‌యాప్‌ను వచ్చే నెల ప్రారంభమయ్యే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) సందర్భంగా ఆవిష్కరించాలని ప్రణాళికలు వేసుకుంది. దానితో పాటే యూపీఐ యాప్ కూడా అందుబాటులోకి వస్తే సూపర్‌యాప్ లావాదేవీలు మరింత సులభతరం కాగలవని సంస్థ భావిస్తున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. రిటైల్ పేమెంట్ గేట్‌వే సహా పలు ఆర్థిక సాధనాలు అందించే క్రమంలో టాటా ఫిన్‌టెక్ పేరుతో టాటా డిజిటల్ కొత్తగా ఫైనాన్షియల్ మార్కెట్‌ప్లేస్‌ను కూడా ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. గూగుల్‌పే, ఫోన్‌పేకు పోటీ.. ఎన్పీసీఐ గణాంకాల ప్రకారం యూపీఐ ద్వారా ఫిబ్రవరిలో 452 కోట్ల పైచిలుకు లావాదేవీలు జరిగాయి. సాధారణంగా ఫోన్‌పే, గూగుల్ పే వంటి నాన్ బ్యాంకింగ్ ప్లాట్‌ఫామ్‌లు .. యూపీఐ కార్యకలాపాల కోసం వివిధ బ్యాంకులతో చేతులు కలపాల్సి ఉంటుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్‌లతో భాగస్వామ్యం ద్వారా గూగుల్ పే.. యూపీఐ సర్వీసులు అందిస్తోంది. నాన్ బ్యాంకింగ్ ప్లాట్‌ఫామ్‌లు టెక్నాలజీ ప్రధానమైనవి కావడంతో యూపీఐ విధానంలో బ్యాంకుల యాప్‌లతో పోలిస్తే ఇవి బాగా ప్రాచుర్యంలోకి వచ్చాయి. ఉదాహరణకు ఫోన్‌పే, గూగుల్‌పేకు యూపీఐ లావాదేవీల్లో సింహభాగం వాటా ఉంటోంది. అమెజాన్ పే, పేటీఎం, ఫేస్‌బుక్‌కు చెందిన వాట్సాప్ పే వంటివి కూడా వినియోగంలో ఉన్నాయి. టాటా కూడా రంగంలోకి దిగితే పోటీ మరింత పెరిగే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. -
ఫీచర్ ఫోన్లలో యూపీఐ సర్వీసులు
న్యూఢిల్లీ: ఫీచర్ ఫోన్లలోనూ ఏకీకృత చెల్లింపుల విధానాన్ని (యూపీఐ) అందుబాటులోకి తెస్తూ కొత్త సర్వీసును రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ మంగళవారం ఆవిష్కరించారు. దీనితో దాదాపు 40 కోట్ల మంది ఫీచర్ ఫోన్ యూజర్లకు ప్రయోజనం చేకూరుతుంది. సాధారణ మొబైల్ ఫోన్ల ద్వారా కూడా డిజిటల్ ఆర్థిక లావాదేవీలు నిర్వహించేందుకు వీలు లభిస్తుంది. బహుళ ప్రయోజనకరమైన యూపీఐ విధానం 2016లోనే ప్రవేశపెట్టినా.. ఇప్పటివరకూ ఇది స్మార్ట్ఫోన్లకు మాత్రమే పరిమితమైందని దాస్ తెలిపారు. అట్టడుగు వర్గాలకు, గ్రామీణ ప్రాంతాల వారికి అందుబాటులోకి రాలేదని ఆయన పేర్కొన్నారు. ‘ఇప్పటివరకూ డిజిటల్ చెల్లింపుల వ్యవస్థకు దూరంగా ఉన్న వర్గాలకు యూపీఐ 123పే ప్రయోజనకరంగా ఉంటుంది. అందరినీ ఆర్థిక సేవల పరిధిలోకి తెచ్చేందుకు ఇది తోడ్పడుతుంది‘ అని ఫీచర్ ఫోన్లకు యూపీఐ సర్వీసుల ఆవిష్కరణ కార్యక్రమంలో దాస్ చెప్పారు. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ), బ్యాంకుల అధికారులు ఇందులో పాల్గొన్నారు. 2016లోనే ఫీచర్ ఫోన్ యూజర్ల కోసం కూడా యూఎస్ఎస్డీ కోడ్ ద్వారా పనిచేసే యూపీఐ సర్వీసును అందుబాటులోకి తెచ్చినప్పటికీ అది కష్టతరంగా ఉండటంతో ప్రాచుర్యం పొందలేదు. దీనితో ఎన్పీసీఐ దాన్ని సరికొత్తగా తీర్చిదిద్దింది. ప్రారంభించడం నుంచి ముగించే వరకూ లావాదేవీ ప్రక్రియ మూడు అంచెల్లో జరుగుతుంది కాబట్టి యూపీఐ 123పే అని బ్రాండ్ పేరు పెట్టినట్లు దాస్ తెలిపారు. యూపీఐ లావాదేవీలు వేగంగా వృద్ధి చెందుతున్నాయని, గత ఆర్థిక సంవత్సరంలో వీటి పరిమాణం రూ. 41 లక్షల కోట్లుగా ఉండగా ఈసారి ఇప్పటిదాకా రూ. 76 లక్షల కోట్ల స్థాయికి చేరాయని చెప్పారు. ఫిబ్రవరిలోనే రూ. 8.26 లక్షల కోట్ల విలువ చేసే 453 కోట్ల లావాదేవీలు జరిగాయన్నారు. ‘యూపీఐ ద్వారా లావాదేవీల పరిమాణం రూ. 100 లక్షల కోట్లకు చేరే రోజు ఎంతో దూరంలో లేదు‘ అని దాస్ చెప్పారు. నాలుగు ప్రత్యామ్నాయాలు.. యూపీఐ కింద.. ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ (ఐవీఆర్) నంబర్, ఫీచర్ ఫోన్లలో యాప్‌లు, మిస్డ్ కాల్, శబ్ద ఆధారిత చెల్లింపుల విధానాల ద్వారా ఫీచర్ ఫోన్ యూజర్లు పలు లావాదేవీలు నిర్వహించవచ్చని ఆర్బీఐ తెలిపింది. కుటుంబ సభ్యులు .. స్నేహితులకు చెల్లింపులు జరిపేందుకు, కరెంటు..నీటి బిల్లులు కట్టేందుకు, వాహనాల కోసం ఫాస్ట్ ట్యాగ్ల రీచార్జి, మొబైల్ బిల్లుల చెల్లింపులు, ఖాతాల్లో బ్యాలెన్స్‌లను తెలుసుకోవడం మొదలైన అవసరాలకు యూపీఐ 123పే ఉపయోగపడుతుంది. మరోవైపు, డిజిటల్ చెల్లింపులకు సంబంధించి ’డిజిసాథీ’ పేరిట ఎన్పీసీఐ ఏర్పాటు చేసిన 24 గీ7 హెల్ప్‌లైన్‌ను కూడా ఆర్బీఐ గవర్నర్ దాస్ ప్రారంభించారు. డిజిటల్ చెల్లింపులపై తమ సందేహాల నివృత్తి, ఫిర్యాదుల పరిష్కారం కోసం యూజర్లు.. డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.డిజిసాథీ.కామ్ని సందర్శించవచ్చు లేదా తమ ఫోన్ల నుంచి 14431, 1800 891 3333కి ఫోన్ చేయవచ్చు. -
‘పే’యాప్‌ల జోరు.. ఏటీఎం, క్రెడిక్ కార్డుల బేజారు
న్యూఢిల్లీ: మొబైల్ చెల్లింపులు దేశంలో శరవేగంగా విస్తరిస్తున్నాయి. ఈ వేగం కార్డు చెల్లింపుల కంటే ఎక్కువగా ఉంది. కరోనా మహమ్మారి రాక తర్వాత చిన్న దుకాణాల నుంచి పెద్ద వ్యాపార సంస్థల వరకు డిజిటల్ చెల్లింపులను (యూపీఐ/క్యూఆర్‌కోడ్) ఆమోదిస్తుండడం ఈ వృద్ధికి దోహదపడుతున్నట్టు ‘ఇండియా మొబైల్ పేమెంట్స్ మార్కెట్ 2021’ నివేదిక తెలిపింది. 67 శాతం వృద్ధి మొబైల్ యాప్స్ ద్వారా చేసే చెల్లింపుల విలువ 2020లో 67 శాతం పెరిగి 478 బిలియన్ డాలర్లుగా ఉంటే.. 2021లో ట్రిలియన్ డాలర్లుగా ఉంటుందని నివేదిక అంచనా వేసింది. ‘‘భారత్‌లో మొబైల్ ఫోన్ల ద్వారా చేసే చెల్లింపులు వేగంగా పెరుగుతున్నాయి. యాప్‌ద్వారా చెల్లింపులు ఆదరణ పొందడం ఇందుకు తోడ్పడుతోంది’’ అని ఈ నివేదికను విడుదల చేసిన ఎస్అండ్పీ గ్లోబల్ మార్కెట్ ఇంటెలిజెన్స్ ఫైనాన్షియల్ ఇనిస్టిట్యూషన్స్ పరిశోధన బృందం తెలిపింది. స్మార్ట్ ఫోన్లతో చెల్లింపులు చేసేందుకు వినియోగదారులు ప్రాధాన్యం ఇస్తున్నందున కార్డు చెల్లింపులకు కంటే ఇవే ఎక్కువగా వృద్ధి చెందుతాయని అంచనా వేసింది. తగ్గుముఖం డెబిట్, క్రెడిట్ కార్డులు, ఆన్లైన్ లావాదేవీల విలువ 2020లో 14 శాతం తగ్గి 170 బిలియన్ డాలర్లుగా ఉంది. ఈ నివేదిక అంచనా మేరకు.. 2020లో బ్యాంకులు 524 మిలియన్ డాలర్ల మేర క్రెడిట్ కార్డుల ఇంటర్చేంజ్ ఆదాయాన్ని కోల్పోయాయి. లాక్డౌన్లతో కార్డు చెల్లింపులు తగ్గిపోవడం తెలిసిందే. అనుకూలమైన ఎంపిక.. ‘‘చెల్లింపుల యాప్‌ల ద్వారా లావాదేవీలు (పీర్ టు పీర్ సహా), మొబైల్ చెల్లింపులు.. రిటైల్ ఇన్వెస్టర్లకు పాయింట్ ఆఫ్ సేల్, ఆన్లైన్ మాధ్యమాలకు అనుకూలమైన ఎంపికగా మారుతోంది. మొబైల్ చెల్లింపులు ప్రాచుర్యం కావడంతో నగదు వినియోగానికి డిమాండ్ నిదానించింది. 2020లో ప్రతీ ఏటీఎం నగదు ఉపసంహరణతో పోల్చి చూస్తే 3.7 మొబైల్ లావాదేవీలు నమోదయ్యాయి. రానున్న సంవత్సరాల్లోనూ భారత్‌లో డిజిటల్ చెల్లింపులు శరవేగంగా విస్తరించే అవకాశాలే ఉన్నాయి’’ ఈ నివేదిక పేర్కొంది. ఇన్స్టంట్ చెల్లింపుల విషయంలో ఆసియా పసిఫిక్ ప్రాంతంలోని నాలుగు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలతో పోల్చి చూస్తే.. 2020లో భారత్‌లోనే అధిక సంఖ్యలో రియల్‌టైమ్ లావాదేవీలు నమోదైనట్టు తెలిపింది. ఎంతకాలం ఈ అగ్రస్థానం ‘‘ఫోన్‌పే, గూగుల్‌పే అత్యంత ప్రాచుర్యమైన యూపీఐ చెల్లింపులు యాప్‌లుగా భారత్‌లో అగ్రస్థానాల్లో ఉన్నాయి. 2021లో మొదటి ఆరు నెలల్లో ఫోన్‌పే 44 శాతం మార్కెట్ వాటాతో ఉండగా, గూగుల్ పే 35 శాతం వాటా కలిగి ఉంది. ఈ రెండు యాప్‌లు కలసి 338 బిలియన్ డాలర్ల విలువైన 12 బిలియన్ల లావాదేవీలు నిర్వహించాయి’’ అని ఈ నివేదిక వెల్లడించింది. పేటీఎం, అమెజాన్ పే సంస్థలు పోటీలో వెనుకబడినట్టు ఈ నివేదిక ఆధారంగా తెలుస్తోంది. యూపీఐ లావాదేవీల్లో పేటీఎం వాటా 14 శాతమే కాగా, అమెజాన్ పే 2 శాతం వాటాను కలిగి ఉన్నట్టు ఈ నివేదిక తెలిపింది. అయితే ఫోన్‌పే, గూగుల్ పే యూపీఐ చెల్లింపుల్లో ఎప్పటికీ ఆధిపత్యం కొనసాగించే అవకాశం లేదని గుర్తు చేసింది. ‘నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ యూపీఐ లావాదేవీల్లో 30 శాతం పరిమితి (మొత్తం లావాదేవీల్లో) విధించింది. ఫోన్‌పే, గూగుల్‌పే మాత్రమే ఈ పరిమితిని దాటేశాయి. ఈ నిబంధనల అమలుకు 2022 వరకు సమయం ఉంది’ అని నివేదిక వివరించింది. చదవండి: పేటీఎమ్ మెగా ఐపీవో రెడీ -
భీమ్ యాప్‌లో లోపం?
ముంబై: యూపీఐ ఆధారిత భీమ్ యాప్‌లో లోపాలున్నాయంటూ కొందరు ఎథికల్ హ్యాకర్లు సోమవారం ఓ వెబ్సైట్ ద్వారా హెచ్చరించారు. అయితే ఈ ఆరోపణలను యాప్ నిర్వహణ సంస్థ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్పీసీఐ) కొట్టేసింది. 13.6 కోట్ల డౌన్లోడ్లు ఉన్న ఈ యాప్‌లో ఉన్న ఓ లోపం ద్వారా కీలక సమాచారం లీకవుతోందని హ్యాకర్లు వీపీఎన్ మెంటర్ వెబ్సైట్ ద్వారా హెచ్చరించారు. కొన్ని ప్రాథమిక భద్రతా ప్రమాణాలు పాటిస్తే ఈ ముప్పు తప్పి ఉండేదన్నారు. భీమ్ మొబైల్ పేమెంట్ యాప్ ద్వారా భారీ స్థాయిలో వినియోగదారుల ఆర్థిక సమాచారం పబ్లిక్కు అందుబాటులోకి వచ్చిందన్నారు. ప్రొఫైల్స్, లావాదేవీలు, ఆధార్, పాన్, కాస్ట్ సర్టిఫికెట్, రెసిడెన్స్ ప్రూఫ్, ఇతర ప్రొఫెషనల్ సర్టిఫికెట్ల వంటి 409 జీబీల సమాచారం ప్రమాదం బారిన పడినట్లు చెప్పారు. అయితే భీమ్ యాప్ సురక్షితమేనని, ఎలాంటి సమాచారం లీక్ కాలేదని ఎన్పీసీఐ స్పష్టంచేసింది. -
భీమ్ యూపీఐతో ఫాస్టాగ్ రీచార్జ్
న్యూఢిల్లీ: నేషనల్ ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ (ఎన్ఈటీసీ) ఫాస్టాగ్‌లను భీమ్ యూపీఐ ద్వారా కూడా రీచార్జ్ చేసుకునే వెసులుబాటును కల్పించినట్లు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) వెల్లడించింది. దీనితో ఫాస్టాగ్ రీచార్జ్ ప్రక్రియ మరింత సులభతరం కాగలదని సంస్థ సీవోవో ప్రవీణ రాయ్ తెలిపారు. టోల్ చెల్లింపునకు సంబంధించి వాహనదారుల సమయం వృధా కాకుండా చూసేలా ‘ఫాస్టాగ్’ అమల్లోకి రావడం తెలిసిందే. ప్రీపెయిడ్ లేదా సేవింగ్స్ అకౌంటుకు అనుసంధానించే ఫాస్టాగ్ ట్యాగ్‌లను వాహనం విండ్‌స్క్రీన్‌పై అతికిస్తారు. టోల్‌ప్లాజాల్లో ఏర్పాటు చేసిన రీడర్లు వీటిని స్కాన్ చేశాక.. వాహనదారు ఖాతా నుంచి నిర్దేశిత టోల్ ఫీజు చెల్లింపు ప్రక్రియ ఆటోమేటిక్‌గా జరుగుతుంది. దీనివల్ల టోల్ ప్లాజాల్లో వాహనాల రద్దీ తగ్గడంతో పాటు వాహనదారుల సమయం కూడా ఆదా అవుతుంది. -
పెరిగిన నగదు లావాదేవీలు
► తగ్గిన డిజిటల్ చెల్లింపులు ► ఎన్పీసీఐ సీఓఓ దిలీప్ వెల్లడి ముంబై: నగదు వినియోగం మళ్లీ పెరిగిందని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్పీసీఐ) పేర్కొంది.పెద్ద కరెన్సీ నోట్ల రద్దు కారణంగా 5 కోట్ల మంది కొత్తగా డిజిటల్ మాధ్యమాల ద్వారా చెల్లింపులు జరిపారని ఎన్పీసీఐ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ దిలీప్ అస్బే చెప్పారు. వీరిలో 3 కోట్ల మంది వరకూ డిజిటల్ చెల్లింపులను కొనసాగిస్తున్నారని వివరించారు. పెద్ద కరెన్సీ నోట్ల రద్దు కారణంగా పది కోట్ల మంది డిజిటల్, నగదు రహిత లావాదేవీలు జరిపారని, ఆ తర్వాత పలువురు నగదు వినియోగానికే మరలిపోయారని పేర్కొన్నారు. కొత్తగా 3–3.5 కోట్ల మంది డిజిటల్ చెల్లింపులు చేయడానికి కనీసం రెండేళ్ల సమయం పడుతుందని వివరించారు. ఈ ఏడాది జనవరిలో డిజిటల్ లావాదేవీలు 9 శాతం, ఫిబ్రవరిలో 21 శాతం చొప్పున తగ్గాయని పేర్కొన్నారు. నగదు రహిత లావాదేవీల జోరు పెంచడానికి ప్రజల్లో మరింతగా అవగాహనను పెంచాల్సి ఉందని వివరించారు. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్(యూపీఐ)కు పేటెంట్ కోసం దరఖాస్తు చేశామని, వచ్చే ఏడాది పేటెంట్ పొందగలమని తెలిపారు. త్వరలో అందుబాటులోకి రానున్న ఆధార్ పేలో మర్చంట్ డిస్కౌంట్ రేట్(ఎండీఆర్) ప్రస్తుతమున్నట్లుగానే(రూ.2,000 లోపు 0.25 శాతం) ఉంటుందని వివరించారు. భారత్ క్యూఆర్ కోడ్, యూపీఐ క్యూఆర్ కోడ్ విలీన ప్రయత్నాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. -
ఇంటర్‌బ్యాంక్ ఏటీఎం ఫీజు తగ్గింపు
ముంబై: నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) తమ ఇంటర్‌బ్యాంక్ ఏటీఎం నెట్వర్క్ లావాదేవీల చార్జీలను 10 శాతం మేర (5 పైసలు) తగ్గిస్తున్నట్లు శుక్రవారం తెలిపింది. లావాదేవీల పరిమాణం పెరగటం, నెట్వర్క్ పనితీరు మరింత మెరుగవటం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ తెలిపింది. రిజర్వ్ బ్యాంక్ ప్రమోట్ చేసిన ఈ సంస్థ... దాదాపు 400 బ్యాంకులకు చెందిన 1.92 లక్షల ఏటీఎంలకు కేంద్రీయ పేమెంట్ గేట్వేగా ఉన్న ఈ సంస్థ ప్రస్తుతం ప్రతి లావాదేవీకి 50 పైసలు వసూలు చేస్తోంది. దీన్ని 45 పైసలకు తగ్గించటమే కాక... లావాదేవీలు పెరగటానికి మరింత తగ్గింపు చేపడతామని కూడా సంస్థ సీఈఓ ఎ.పి.హోతా చెప్పారు. కొత్త ఛార్జీలు మే 1 నుంచి అమల్లోకి వస్తాయి. ఖాతా ఉన్న బ్యాంకు కాకుండా ఇతర బ్యాంకుల ఏటీఎంలను వినియోగించే వారి నుంచి లావాదేవీలకు ఛార్జీలు వసూలు చేస్తుండటంపై వివాదం రేగటంతో ఆర్బీఐ జోక్యం చేసుకుని తాజా నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఇతర ఏటీఎంలలో 5 లావాదేవీల వరకు ఉచితం. అంతకు మించితే ఛార్జీలు వసూలు చేస్తారు.