న్యూఢిల్లీ: మొబైల్ చెల్లింపులు దేశంలో శరవేగంగా విస్తరిస్తున్నాయి. ఈ వేగం కార్డు చెల్లింపుల కంటే ఎక్కువగా ఉంది. కరోనా మహమ్మారి రాక తర్వాత చిన్న దుకాణాల నుంచి పెద్ద వ్యాపార సంస్థల వరకు డిజిటల్ చెల్లింపులను (యూపీఐ/క్యూఆర్‌కోడ్) ఆమోదిస్తుండడం ఈ వృద్ధికి దోహదపడుతున్నట్టు ‘ఇండియా మొబైల్ పేమెంట్స్ మార్కెట్ 2021’ నివేదిక తెలిపింది.
67 శాతం వృద్ధి
మొబైల్ యాప్స్ ద్వారా చేసే చెల్లింపుల విలువ 2020లో 67 శాతం పెరిగి 478 బిలియన్ డాలర్లుగా ఉంటే.. 2021లో ట్రిలియన్ డాలర్లుగా ఉంటుందని నివేదిక అంచనా వేసింది. ‘‘భారత్‌లో మొబైల్ ఫోన్‌ల ద్వారా చేసే చెల్లింపులు వేగంగా పెరుగుతున్నాయి. యాప్‌ద్వారా చెల్లింపులు ఆదరణ పొందడం ఇందుకు తోడ్పడుతోంది’’ అని ఈ నివేదికను విడుదల చేసిన ఎస్‌అండ్‌పీ గ్లోబల్ మార్కెట్ ఇంటెలిజెన్స్ ఫైనాన్షియల్ ఇనిస్టిట్యూషన్స్ పరిశోధన బృందం తెలిపింది. స్మార్ట్ ఫోన్లతో చెల్లింపులు చేసేందుకు వినియోగదారులు ప్రాధాన్యం ఇస్తున్నందున కార్డు చెల్లింపులకు కంటే ఇవే ఎక్కువగా వృద్ధి చెందుతాయని అంచనా వేసింది.
తగ్గుముఖం
డెబిట్, క్రెడిట్ కార్డులు, ఆన్‌లైన్ లావాదేవీల విలువ 2020లో 14 శాతం తగ్గి 170 బిలియన్ డాలర్లుగా ఉంది. ఈ నివేదిక అంచనా మేరకు.. 2020లో బ్యాంకులు 524 మిలియన్ డాలర్ల మేర క్రెడిట్ కార్డుల ఇంటర్‌చేంజ్ ఆదాయాన్ని కోల్పోయాయి. లాక్‌డౌన్‌లతో కార్డు చెల్లింపులు తగ్గిపోవడం తెలిసిందే.
అనుకూలమైన ఎంపిక..
‘‘చెల్లింపుల యాప్‌ల ద్వారా లావాదేవీలు (పీర్ టు పీర్ సహా), మొబైల్ చెల్లింపులు.. రిటైల్ ఇన్వెస్టర్లకు పాయింట్ ఆఫ్ సేల్, ఆన్‌లైన్ మాధ్యమాలకు అనుకూలమైన ఎంపికగా మారుతోంది. మొబైల్ చెల్లింపులు ప్రాచుర్యం కావడంతో నగదు వినియోగానికి డిమాండ్ నిదానించింది. 2020లో ప్రతీ ఏటీఎం నగదు ఉపసంహరణతో పోల్చి చూస్తే 3.7 మొబైల్ లావాదేవీలు నమోదయ్యాయి. రానున్న సంవత్సరాల్లోనూ భారత్‌లో డిజిటల్ చెల్లింపులు శరవేగంగా విస్తరించే అవకాశాలే ఉన్నాయి’’ ఈ నివేదిక పేర్కొంది. ఇన్‌స్టంట్ చెల్లింపుల విషయంలో ఆసియా పసిఫిక్ ప్రాంతంలోని నాలుగు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలతో పోల్చి చూస్తే.. 2020లో భారత్‌లోనే అధిక సంఖ్యలో రియల్‌టైమ్ లావాదేవీలు నమోదైనట్టు తెలిపింది.
ఎంతకాలం ఈ అగ్రస్థానం
‘‘ఫోన్‌పే, గూగుల్‌పే అత్యంత ప్రాచుర్యమైన యూపీఐ చెల్లింపులు యాప్‌లుగా భారత్‌లో అగ్రస్థానాల్లో ఉన్నాయి. 2021లో మొదటి ఆరు నెలల్లో ఫోన్‌పే 44 శాతం మార్కెట్ వాటాతో ఉండగా, గూగుల్ పే 35 శాతం వాటా కలిగి ఉంది. ఈ రెండు యాప్‌లు కలసి 338 బిలియన్ డాలర్ల విలువైన 12 బిలియన్ల లావాదేవీలు నిర్వహించాయి’’ అని ఈ నివేదిక వెల్లడించింది. పేటీఎం, అమెజాన్ పే సంస్థలు పోటీలో వెనుకబడినట్టు ఈ నివేదిక ఆధారంగా తెలుస్తోంది. యూపీఐ లావాదేవీల్లో పేటీఎం వాటా 14 శాతమే కాగా, అమెజాన్ పే 2 శాతం వాటాను కలిగి ఉన్నట్టు ఈ నివేదిక తెలిపింది. అయితే ఫోన్‌పే, గూగుల్ పే యూపీఐ చెల్లింపుల్లో ఎప్పటికీ ఆధిపత్యం కొనసాగించే అవకాశం లేదని గుర్తు చేసింది. ‘నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ యూపీఐ లావాదేవీల్లో 30 శాతం పరిమితి (మొత్తం లావాదేవీల్లో) విధించింది. ఫోన్‌పే, గూగుల్‌పే మాత్రమే ఈ పరిమితిని దాటేశాయి. ఈ నిబంధనల అమలుకు 2022 వరకు సమయం ఉంది’ అని నివేదిక వివరించింది.
చదవండి: పేటీఎమ్ మెగా ఐపీవో రెడీ
Comments
Please login to add a commentAdd a comment