digital payments
-
స్కాన్ చేసి ధర్మం చేయండి.. బాబయ్యా..
మొన్నీమధ్యే పంజాగుట్ట వెళదామని ఎల్ బీ నగర్ మెట్రో స్టేషన్ కి వచ్చా.. మెట్లు ఎక్కుతోంటే.. నాలుగో మెట్టు మీద అనుకుంటా... ఒక యాచకుడ్ని చూశా.. యధావిధిగానే అతని ముందో పళ్లెం ఉంది. అందులో కొన్ని చిల్లర పైసలు, 10 రూపాయల నోట్లు ఓ నాలుగు ఉన్నట్లున్నాయి. ఇది కొత్తేమి కాదు కానీ... నన్ను ఆకట్టుకున్నదల్లా... అతని మెళ్ళో ఉన్న ఓ డిజిటల్ కార్డు.అది క్యూఆర్ కోడ్ ఉన్న కార్డు.. పెదాలపై ఓ చిన్న చిరునవ్వు వచ్చింది... ఎస్..మోదీ చెప్పింది కరెక్టే అనిపించింది.. "దేశంలో డిజిటల్ విప్లవం కొత్త పుంతలు తొక్కుతోంది.. ఇప్పుడు అడుగడుగునా డిజిటల్ చెల్లింపులే..రాబోయే రోజుల్లో ఇది మరింత విస్తరించి పల్లెల్లో సైతం వేళ్లూనుకుంటాయి..." అంటూ అప్పుడెప్పుడో ప్రధాని అన్నట్లు వచ్చిన వార్త గుర్తుకొచ్చింది.ఇప్పుడీ సంఘటన చూడగానే... నిజమే కదా అనిపించింది..ఇప్పుడంతా డిజిటల్ మయం అయిపోయిందన్నది వాస్తవం. కూరలు కొనడానికి రైతు బజార్ కి వెళ్లినా.. చివరకు ఛాయ్ తాగుదామని టీ స్టాల్ కు వెళ్లినా... జేబులోంచి ఫోన్ తీయడం, క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం, పైసలతో సహా డబ్బులు చెల్లించడం... చాలా సింపుల్ అయిపోయింది..ఎప్పుడైతే ఈ డిజిటల్ చెల్లింపులు విస్తృతమవుతున్నాయో చిల్లరతో పనిలేకుండా పోతోంది.. చిల్లర దాకా ఎందుకు... కనీసం ఒక్క పది రూపాయల నోట్ కూడా జేబులో పెట్టుకోకుండా.. కేవలం సెల్ ఫోన్ తో రోడ్డెక్కేవాళ్ళు ఎంతమందో ఈరోజుల్లో..దీంతో ఎవరైనా చెయ్య చాపి యాచిస్తే... ఓ రూపాయి కూడా విదపలేని పరిస్థితి. మరి వారి ఆదాయం పడిపోక ఏమవుతుంది... అందుకే అనుకుంటా... ఆ యాచకుడు ఈ డిజిటల్ మార్గాన్ని ఎంచుకున్నట్లున్నాడు.. తప్పులేదు.. త్వరలోనే ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర యాచించే వాళ్ళు సైతం మెళ్ళో ఓ కార్డు వేసుకుని మీముందు చెయ్యి చాపినా ఆశ్చర్యపోనక్కర్లేదు. బీ ప్రిపేర్..మనం పూర్తి స్థాయిలో నగదురహిత సమాజం వైపు అడుగులు వేసేందుకు సిద్ధమవుతున్నామని చెప్పేందుకు ఇదో ప్రబల ఉదాహరణగా భావించొచ్చు. గత డిసెంబర్ నెలలో దేశవ్యాప్తంగా యూపీఐ ద్వారా 1673 కోట్ల లావాదేవీలు జరిగాయని ఆర్ధిక శాఖ గణాంకాలు చెబుతున్నాయి. 2024, జనవరి నెలలో ఈ లావాదేవీలు 1220 కోట్లు జరగ్గా.. ఏడాది చివరికి వచ్చేసరికి 400 కోట్లకు పైగా పెరిగాయి. డిజిటల్ విప్లవానికి ఇంతకంటే నిదర్శనం వేరే ఏం కావాలి?యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్) అనేది రకరకాల బ్యాంకుల్ని ఒకేగూటికి చేర్చి చెల్లింపులు చేసేందుకు దోహదపడే ఒక సాధనం. మీ బ్యాంకు ఏదైనా కావచ్చు.. దాన్ని యూపీఐ కి అనుసంధానం చేయడం ద్వారా ఎలాంటి చెల్లింపులైనా క్షణాల్లో చేసేయొచ్చు. పైగా ప్రతీ చెల్లింపునకూ రికార్డు ఉంటుంది.. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తాజా సమాచారం ప్రకారం... గత నవంబర్ నెలలో 1548 కోట్ల యూపీఐ లావాదేవీలు జరిగాయి. వాటి విలువ రూ. 21.55 లక్షల కోట్లు. డిసెంబర్ కి వచ్చేసరికి రూ.23.25 లక్షల కోట్ల విలువ చేసే 1673 కోట్ల లావాదేవీలు జరిగాయి. ఐఎంపీఎస్ (ఇమ్మీడియేట్ పేమెంట్ సర్వీస్) ని తాజాగా యూపీఐ వెనక్కి నెట్టేసింది. ఒక బ్యాంకు ఖాతా నుంచి మరో బ్యాంకు ఖాతాకు 24 గంటల్లో ఎప్పుడైనా సరే తక్షణమే చెల్లింపు చేసే విధంగా ఈ ఐఎంపీఎస్ ను ప్రభుత్వం 2010 లో ప్రారంభించింది. వ్యాపార వర్గాలకు, వ్యక్తులకు ఈ ఐఎంపీఎస్ విధానం ఎంతో ప్రయోజనకరంగా ఉంటోంది. ఐఎంపీఎస్ ద్వారా గత ఏడాది నవంబర్ నెలలో రూ. 5.58 లక్షల కోట్ల విలువ చేసే 40.79 కోట్ల లావాదేవీలు జరగ్గా... డిసెంబర్లో వీటి సంఖ్య 44.1 కోట్లకు పెరిగింది. వీటి విలువ కూడా రూ. 6.01 లక్షల కోట్లకు పెరగడం గమనార్హం. ఇక మీరు హైవేల మీద ప్రయాణం చేసేటప్పుడు టోల్ ప్లాజా ల దగ్గర చెల్లింపులు చేస్తారు కదా... గతంలో క్యాష్ ఇచ్చేవారు. ఆ తర్వాత డెబిట్/క్రెడిట్ కార్డులు, యూపీఐ లు వచ్చాయి. ఇప్పుడు ఫాస్టాగ్ అనేది ఈ చెల్లింపుల్లో కొత్త ఒరవడి సృష్టిస్తోంది. ప్రతి టోల్ ప్లాజా ముందు.. ప్రత్యేకంగా కొంతసేపు ఆగాల్సిన అవసరాన్ని ఈ ఫాస్టాగ్ తప్పించింది. మీరు బయల్దేరేముందే... కొంత మొత్తాన్ని మీ బ్యాంకు అకౌంట్ నుంచి ఫాస్టాగ్ కి మళ్లిస్తారు. టోల్ ప్లాజా రాగానే అక్కడి స్కానర్లు మీ వాహనానికి ఉన్న ట్యాగ్ ని స్కాన్ చేస్తాయి. అమౌంట్ ఆటోమేటిక్ గా కట్ అయిపోతుంది. ఇదంతా కొద్ది సెకన్లలోనే జరిగిపోతుంది. తద్వారా వేచి ఉండే వ్యవధి తగ్గడంతో పాటు, చిల్లర నోట్ల బాధ ఉండదు. ఈ ఫాస్టాగ్ లు ఇప్పుడు డిజిటల్ పేమెంట్స్ లో కీలకపాత్ర పోషిస్తున్నాయి. గత నవంబర్ నెలలో 35.89 కోట్ల లావాదేవీలు జరగ్గా.. డిసెంబర్లో ఈ సంఖ్య 38.30 కోట్లకు పెరిగాయి. వీటి విలువ కూడా రూ.6,070 కోట్ల నుంచి రూ.6,642 కోట్లకు పెరిగింది.యూపీఐ, ఐఎంపీఎస్, ఫాస్టాగ్ చెల్లింపులు అనేవి మానవాళి జీవితంలో సరికొత్త మార్పులు తీసుకొచ్చాయి. ఈ చెల్లింపులు చాలా సురక్షితంగా ఉండటమే కాక, వేగవంతంగా పనులు పూర్తయ్యేలా చేస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఈ ఫైనాన్షియల్ లావాదేవీలు మరింత విస్తృతమై డిజిటల్ ఇండియా రూపురేఖలనే మార్చేస్తాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు.-బెహరా శ్రీనివాస రావువిశ్లేషకులు -
రూపాయికీ యూపీఐ!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రూపాయికీ యూపీఐ.. అవును మీరు విన్నది నిజమే. ఒక్క రూపాయి చెల్లించాలన్నా స్మార్ట్‌గా యూపీఐ పేమెంట్ యాప్‌తో ‘స్కాని’చ్చేస్తున్నారు. ఈ ట్రెండ్ దేశవ్యాప్తంగా పల్లెలకూ పాకింది. ఇదంతా అత్యంత వేగంగా చెల్లింపులను సుసాధ్యం చేస్తున్న టెక్నాలజీ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) మాయాజాలం. క్షణాల్లో ఎక్కడి నుంచి ఎక్కడికైనా, ఎవరికైనా రోజుకు గరిష్టంగా రూ.1 లక్ష వరకు.. బ్యాంకు ఖాతాకు, ఖాతా అనుసంధానమైన మొబైల్ నంబర్‌కు, యూపీఐ ఐడీ, క్యూఆర్ కోడ్‌కు సురక్షితంగా, సులభంగా డిజిటల్ చెల్లింపులను యూపీఐ సుసాధ్యం చేసింది. చిరు వ్యాపారులకూ డిజిటల్ రూపంలో నగదును స్వీకరించే ప్రధాన సాధనంగా మారిపోయింది. చిల్లర సమస్యలకు యూపీఐ చెక్ పెడుతోంది. 2025 జనవరి 1న రూ.81,015.79 కోట్ల విలువైన 56.84 కోట్ల లావాదేవీలతో కొత్త సంవత్సరంలో యూపీఐ శుభారంభం చేసింది. న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో డిసెంబర్ 31న ప్రజలు రూ.93,148 కోట్ల విలువైన లావాదేవీలు జరిపారు. కొత్త రికార్డుల ప్రయాణం.. దేశవ్యాప్తంగా 2024 డిసెంబర్ 2న రూ.95,915.6 కోట్ల విలువ చేసే లావాదేవీలు నమోదయ్యాయి. యూపీఐ చరిత్రలో 2016 ఏప్రిల్ నుంచి 2025 జనవరి 1 నాటికి ఇదే అత్యధికం. ఇక 2024 డిసెంబర్ నెలలో సగటున రోజుకు రూ.74,990 కోట్ల విలువైన 54 కోట్ల లావాదేవీలు జరిగాయంటే నోరెళ్లబెట్టాల్సిందే. కస్టమర్లు నవంబర్‌లో రోజుకు సగటున రూ.71,840 కోట్ల విలువైన 51.6 కోట్ల లావాదేవీలు జరిపారు. యూపీఐ లావాదేవీల సంఖ్య గత నెలలో 8 శాతం దూసుకెళ్లి మొత్తం 1,673 కోట్లుగా ఉంది. నవంబర్‌లో ఈ సంఖ్య 1,548 కోట్లు నమోదైంది. లావాదేవీల విలువ గత నెలలో రూ.23.25 లక్షల కోట్లకు చేరింది. నవంబర్‌లో ఇది రూ.21.55 లక్షల కోట్లుగా ఉంది. భారత్ స్కాన్ చేస్తోంది.. దేశం ఇప్పుడు క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తోందంటే అతిశయోక్తి కాదు. రోడ్డు పక్కన ఉండే చిరు వర్తకుల వద్దా ఇవి దర్శనమిస్తున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గణాంకాల ప్రకారం 2024 నవంబర్ నాటికి భారత్ క్యూఆర్‌తో కలిపి మొత్తం యూపీఐ క్యూఆర్ కోడ్స్ 63.2 కోట్లు జారీ అయ్యాయి. 2023 నవంబర్‌లో ఈ సంఖ్య 31.4 కోట్లు మాత్రమే. అంటే ఏడాదిలో క్యూఆర్ కోడ్స్ రెట్టింపు అయ్యాయన్నమాట. వర్తకుల వద్ద దేశవ్యాప్తంగా 2024 మార్చి 31 నాటికి 34.9 కోట్ల క్యూఆర్ కోడ్స్ ఉన్నాయి. డిజిటల్ చెల్లింపుల వేగానికి ఈ అంకెలే నిదర్శనం. ఎన్పీసీఐ వేదికగా 55 శాతం.. ఆర్బీఐ గణాంకాల ప్రకారం క్లియరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐఎల్), ఆర్టీజీఎస్, ఐఎంపీఎస్, ఎన్ఏసీహెచ్, నెఫ్ట్, యూపీఐ, డెబిట్/క్రెడిట్ కార్డులు, ఏటీఎంలు, పీవోఎస్ మెషీన్లు, చెక్కులు, బ్యాంక్ డ్రాఫ్టులు, నగదు.. ఇలా ప్రభుత్వ, రిటైల్ పరంగా దేశవ్యాప్తంగా 2024 నవంబర్ నెలలో రూ.2,20,52,158 కోట్ల విలువైన లావాదేవీలు జరిగాయి. ఇందులో యూపీఐ వాటా 9.77 శాతం. అలాగే నవంబర్‌లో ఎన్పీసీఐ వేదికగా జరిగిన రూ.38,94,079 కోట్ల రిటైల్ లావాదేవీల్లో యూపీఐ 55.34 శాతం వాటా కైవసం చేసుకుంది. ఫోన్‌పే టాప్లావాదేవీల పరంగా ఫోన్‌పే 48 శాతం వాటాతో తొలి స్థానంలో నిలిచింది. గూగుల్ పే 37 శాతం, పేటీఎంకు 7% వాటా ఉంది. మిగిలిన 8% వాటాను క్రెడ్, ఐసీఐసీఐ బ్యాంక్ యాప్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ యాప్స్ వంటివి పంచుకున్నాయి. -
ఏటీఎంల సంఖ్య కుదింపు!
సాక్షి, హైదరాబాద్: నిర్వహణ భారాన్ని తగ్గించుకొనే క్రమంలో ఏటీఎంల సంఖ్యను మరింతగా తగ్గించుకోవాలని రాష్ట్రంలోని బ్యాంకులు నిర్ణయించాయి. ఏడాది కాలంలో 5 శాతం ఏటీఎంలను తొలగించిన బ్యాంకులు... వచ్చే ఏడాదిలో మరో 10 శాతం వరకు ఏటీఎంలను తగ్గించుకోనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 50 బ్యాంకులకు సంబంధించి ప్రస్తుతం 9,205 ఏటీఎంలు పనిచేస్తున్నాయి. గతేడాది మార్చి నాటికి 9,660 ఏటీఎంలుండగా ఈ ఏడాది సెపె్టంబర్ నాటికి 455 ఏటీఎంలను బ్యాంకులు ఎత్తేసినట్లు రాష్ట్రస్థాయి బ్యాంకుల సమితి గణాంకాలు చెబుతున్నాయి. డిజిటల్ లావాదేవీలతో..: ఒక్కో ఏటీఎంపై నెలకు సగటున రూ. 2.5 లక్షల వరకు ప్రాథమికంగా ఖర్చు పెట్టాల్సి వస్తోందని బ్యాంకులు చెబుతున్నాయి. ప్రతి 8 గంటలకు ఒక సెక్యూరిటీ గార్డు చొప్పున ముగ్గురు గార్డుల జీతాలు, ఏటీఎంను ఉంచే షాప్/షట్టర్ అద్దె, విద్యుత్ బిల్లుతోపాటు సాంకేతిక నిర్వహణ ఖర్చులు ఉంటున్నాయని వివరిస్తున్నాయి. అయితే ప్రస్తుతం డిజిటల్ చెల్లింపులు భారీగా జరుగుతుండటం వల్ల ఏటీఎంల నుంచి నగదు ఉపసంహరణ తగ్గుతున్నట్లు బ్యాంకుల గణాంకాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో క్యాష్ విత్‌డ్రాయల్స్ తక్కువగా ఉన్న ఏటీఎంలను బ్యాంకులు ఎత్తేస్తున్నాయి. ఇకపై కేవలం బ్రాంచి పరిధిలోనే వాటిని పరిమితం చేసేలా బ్యాంకులు ప్రణాళికను అమలు చేయనున్నట్లు సమాచారం. వచ్చే రెండేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా ఏటీఎంల సంఖ్య 6 వేలకు పడిపోనుందని సమాచారం.పీఓఎస్‌ల జోరు... ఏటీఎంల సంఖ్యను ప్రాధాన్యత క్రమంలో తగ్గించాలని భావిస్తున్న బ్యాంకులు.. పాయింట్ ఆఫ్ సేల్ (పీఓఎస్) మెషిన్ల వాడకాన్ని మాత్రం ప్రోత్సహిస్తున్నాయి. వాటి ద్వారా బ్యాంకులకు అదనపు రాబడి ఉండటమే ప్రధాన కారణం. గతేడాది మార్చిలో రాష్ట్రవ్యాప్తంగా 2,09,116 పీఓఎస్ మెషిన్లు ఉండగా... ప్రస్తుతం వాటి సంఖ్య 2,74,602కు చేరింది. భవిష్యత్తులో వాటి సంఖ్యను మరింత పెంచేందుకు బ్యాంకులు చర్యలు చేపట్టాయి. -
గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ చెల్లింపులు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా సెమీ అర్బన్, గ్రామీణ ప్రాంతాల్లో రిటైల్ స్టోర్లలో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) లావాదేవీలు 33 శాతం పెరిగాయి. డిజిటల్ చెల్లింపులు దూసుకెళ్తున్నాయనడానికి ఇది నిదర్శనమని డిజిటల్ బ్యాంకింగ్, నెట్వర్క్ సేవల్లో ఉన్న పేనియర్‌బై నివేదిక తెలిపింది. గ్రామీణ, సెమీ–అర్బన్ ప్రాంతాలలో ఆర్థిక, డిజిటల్ సేవలను అందిస్తున్న 10,00,000 కిరాణా, మొబైల్ రీఛార్జ్ వంటి చిన్న రిటైలర్ల నుండి సేకరించిన వాస్తవ లావాదేవీల సమాచారాన్ని విశ్లేíÙంచి ఈ నివేదిక రూపొందించారు.2024 జనవరి నుండి నవంబర్ వరకు జరిగిన వ్యాపార లావాదేవీల సమాచారాన్ని 2023తో పోల్చారు. ‘ఈ ఏడాది బీమా పాలసీ కొనుగోళ్లు, ప్రీమియం వసూళ్లు లావాదేవీల పరిమాణంలో 127 శాతం పెరిగాయి. కొత్త కస్టమర్లు 96 శాతం అధికం అయ్యారు. భారత్ అంతటా బీమా చొచ్చుకుపోయే సవాళ్లను అధిగమించడంలో డిజిటల్ రిటైల్ దుకాణాలు కీలక పాత్రను పోషిస్తున్నాయి’ అని నివేదిక వివరించింది. నగదు ఉపసంహరణలు.. ‘గ్రామీణ, సెమీ–అర్బన్ ప్రాంతాలలో వ్యాపారం, బంగారం, వ్యక్తిగత రుణాలు, ఓవర్‌డ్రాఫ్ట్ సహా రుణ ఉత్పత్తులలో పరిమాణం 297 శాతం దూసుకెళ్లింది. ఈ గణనీయమైన పెరుగుదల అట్టడుగు స్థాయిలో రుణ పరిష్కారాల పట్ల పెరుగుతున్న అవగాహన, డిమాండ్‌ను ప్రతిబింబిస్తోంది. మైక్రో ఏటీఎం, ఆధార్ ఆధారిత పేమెంట్ సిస్టమ్స్ వద్ద నగదు ఉపసంహరణలు 2024లో తగ్గాయి. లావాదేవీల పరిమాణం, ఒక్కో లావాదేవీకి సగటు నగదు ఉపసంహరణ రెండూ స్వల్ప క్షీణతను చవిచూశాయి.సగటు నగదు ఉపసంహరణ 2023లో రూ.2,624 నమోదైతే, ఈ ఏడాది ఇది రూ.2,482కి పడిపోయింది. జమ్మూ కాశ్మీర్లో నగదు ఉపసంహరణలు విలువలో 58 శాతం, పరిమాణంలో 74 శాతం వృద్ధిని నమోదు చేశాయి’ అని నివేదిక తెలిపింది. బీమా, ఈ–కామర్స్, రుణాల వంటి విభిన్న సేవలను అందించే సాధనాలతో స్థానిక రిటైలర్లను సన్నద్ధం చేయడం ద్వారా.. అట్టడుగు స్థాయిలో ఆర్థిక లభ్యత, ఆర్థిక పురోగతికి కీలక సహాయకులుగా మారడానికి వారిని శక్తివంతం చేస్తున్నాముని పేనియర్‌బై వ్యవస్థాపకుడు ఆనంద్ కుమార్ బజాజ్ తెలిపారు. -
డిజిటల్ పేమెంట్లు చేస్తున్నారా? ఇది మీకోసమే..
ఈరోజుల్లో జేబులో కరెన్సీ లేకున్నా.. ధైర్యంగా అడుగు బయటపెట్టొచ్చు!. బ్యాంక్ బ్యాలెన్స్, ఓ స్మార్ట్‌ఫోన్.. దానికి ఇంటర్నెట్ ఉంటే చాలూ!. మార్కెట్లో ఎక్కడికి వెళ్లినా సెకన్లలో పేమెంట్లు చకచకా చేసేయొచ్చు. రూపాయి దగ్గరి నుంచి మొదలుపెడితే.. పెద్ద పెద్ద అమౌంట్ల చెల్లింపులకు రకరకాల యాప్స్‌ను ఉపయోగిస్తున్నాం. అంతగా డిజిటల్ చెల్లింపులు మన జీవనంలో భాగమయ్యాయి. అయితే ఈ చెల్లింపులపై ట్యాక్స్ విధింపు సబబేనా?.. ప్రస్తుతం దేశంలో చాలావరకు జనం డిజిటల్ పేమెంట్లకు అలవాటు పడ్డారు. పల్లె నుంచి పట్నం దాకా అందరికీ ఇది అలవాటైంది. మార్కెట్లలోనే కాదు, గ్యాస్, కరెంట్.. అన్ని రకాల బిల్లుల చెల్లింపులకు వీటినే ఉపయోగిస్తున్నారు. కానీ, కేంద్రం ఇప్పుడు వీటిపై ట్యాక్స్ విధించబోతోందట. ప్రత్యేకించి యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్(UPI) యాప్‌ల ద్వారా చెల్లింపులపైనే ఈ పన్ను విధింపు ఉండనుందట!. ఇక నుంచి ఫోన్ పే, గూగుల్‌పే, మరేయిత యూపీఐ యాప్ ద్వారాగానీ పేమెంట్ చేశారనుకోండి.. దానిపై ఎక్స్ట్రా ఛార్జీ వసూలు చేస్తారు. 2025 ఆర్థిక సంవత్సరం నుంచి ఇది అమలు కాబోతోంది. మీరూ వాటితోనే చెల్లింపులు చేస్తున్నారా? అయితే ఆందోళన చెందాల్సిన అవసరమే లేదు. ఏప్రిల్ 1వ తేదీ నుంచి.. ఏ యూపీఐ యాప్ ద్వారా అయినా 2 వేల రూపాయలకు పైన అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తే 1.1 శాతం టాక్స్ పడుతుందట. ఎవరికైనా 10 వేల రూపాయలు పంపిస్తే, ట్యాక్స్ రూపంలో 110 రూపాయలు కట్ అవుతుందని.. కొన్ని వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి. కానీ,ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వార్త మాత్రమే. ముఖ్యంగా వాట్సాప్ యూనివర్సిటీ నుంచి ఈ వార్త ఎక్కువగా సర్క్యులేట్ అవుతోంది. వీటిని అదనంగా.. కొందరు వీడియోలను యాడ్ చేస్తున్నారు. అయితే ఫ్యాక్ట్ చెక్ ద్వారా ఈ ప్రచారంపై మీకు స్పష్టత ఇవ్వబోతున్నాం.అదొక ఫేక్ వార్త. పైగా ఇలాంటి వార్తే 2023-24 బడ్జెట్ టైంలోనూ వైరల్ అయ్యింది. ఆ టైంలో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(NPCI) కూడా ఓ క్లారిటీ ఇచ్చింది. డిజిటల్ వాలెట్లు, ఇతర ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్స్ట్రుమెంట్స్.. PPIని ఉపయోగించి చేసే లావాదేవీలకు మాత్రమే ఈ టాక్స్ వర్తిస్తుంది. ‘కొత్త ఇంటర్‌ఛేంజ్ ఛార్జీలు PPI లావాదేవీలకు మాత్రమే వర్తిస్తాయి. ఇతర సాధారణ వినియోగదారులకు ఎలాంటి ఛార్జీలు ఉండవు’ అని స్పష్టం చేసింది. .@IndiaToday claims that UPI transactions over Rs 2000 will be charged at 1.1%#PIBFactCheck➡️There is no charge on normal UPI transactions. ➡️@NPCI_NPCI circular is about transactions using Prepaid Payment Instruments(PPI) like digital wallets. 99.9% transactions are not PPI pic.twitter.com/QeOgfwWJuj— PIB Fact Check (@PIBFactCheck) March 29, 2023సాధారణ UPI పేమెంట్లకు, PPI పేమెంట్లకు మధ్య తేడాను అర్థం చేసుకోకపోవడం వల్ల ఈ గందరగోళం నెలకొంటోంది. పైగా కొన్ని ప్రముఖ ఛానెల్స్, వెబ్సైట్లు ఎలాంటి ధృవీకరణ లేకుండా గుడ్డిగా.. డిజిటల్ పేమెంట్లపై బాదుడే బాదుడు అంటూ కథనాలు ఇచ్చేయడం గమనార్హం. -
రుణాల మంజూరులో కీలకంగా యూపీఐ
న్యూఢిల్లీ: రుణాల మంజూరులో యూని ఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) కీలకంగా మారిందని ఒక నివేదిక వెల్లడించింది. ‘ఓపెన్ బ్యాంకింగ్, డిజిటల్ చెల్లింపులు: రుణం పొందడంలో చిక్కులు’ పేరుతో చేసిన అధ్యయనం ప్రకారం.. ప్రధానంగా క్రెడిట్ హిస్టరీ (గతంలో రుణం పొందడం) లేని వారు రుణం అందుకోవడానికి యూపీఐ దోహద పడుతోంది. యూపీఐ యాప్స్ ఆధారంగా జరిగిన డిజిటల్ చెల్లింపుల లావాదేవీల సమాచారం అందుబాటులో ఉన్నందున.. రుణ మంజూరుకై నిర్ణయాలు తీసుకునేందుకు రుణ దాతలకు మార్గం సుగమం అవుతోంది. మొదటిసారిగా అధికారికంగా రుణం అందుకోవడానికి సామాన్యులకు వీలు కల్పి స్తోంది. యూపీఐ లావాదేవీలలో 10% పెరుగుదల క్రెడిట్ లభ్యత 7% దూసుకెళ్లేందుకు దారితీసింది. రుణగ్రహీ తలను మెరుగ్గా అంచనా వేయడానికి రుణదాతల కు డిజిటల్ ఫైనాన్షియల్ హిస్టరీలు ఎలా ఉపయోగపడ్డాయో ఈ గణాంకాలు ప్రతి బింబిస్తున్నాయి. రుణాల్లో వృద్ధి ఉన్నప్ప టికీ డిఫాల్ట్ రేట్లు పెరగలేదు. యూపీఐ– ఆధారిత డిజిటల్ లావాదేవీ డేటా రుణ దాతలు బాధ్యతాయుతంగా విస్తరించడంలో సహాయపడింది. 2016లో ప్రారంభించినప్పటి నుండి భారత్‌లో ఆర్థిక లభ్యతను యూపీఐ సమూలంగా మార్చింది.75 శాతం యూపీఐ కైవసం..యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ 30 కోట్ల మంది వ్యక్తులు, 5 కోట్ల మంది వ్యాపా రులు అడ్డంకులు లేని డిజిటల్ లావా దేవీలను నిర్వహించడానికి వీలు కల్పించింది. 2023 అక్టోబర్ నాటికి భారత్‌లోని మొత్తం రిటైల్ డిజిటల్ చెల్లింపుల్లో 75 శాతం యూపీఐ కైవసం చేసుకుంది. పాల్గొనే బ్యాంకుల కస్టమర్లందరికీ చెల్లింపులను సేవగా అందించడానికి యాప్‌లను రూపొందించడానికి థర్డ్ పార్టీ వెండార్లను యూపీఐ చెల్లింపుల వ్యవస్థ అనుమతిస్తుంది. రియల్ టైమ్‌లో ధృవీకరించదగిన డిజిటల్ లావాదేవీల సమాచారం యూపీఐ ఆధారంగా అందుబాటులో ఉంటుంది. కస్టమర్లు ఈ సమాచారాన్ని రుణాన్ని అందుకునే ప్రక్రియలో భాగంగా ఆర్థిక సంస్థలు, అనుబంధ కంపెనీలతో పంచుకో వచ్చు. గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో విస్తృతంగా యూపీఐని ఆదరించడంలో అందుబాటులో ఉన్న డిజిటల్ టెక్నాలజీ కీలక పాత్ర పోషించింది. యూపీఐతో భారత దేశం సాధించిన విజయం ఇతర దేశాలకు ఆదర్శంగా నిలుస్తోంది. పబ్లిక్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను ఓపెన్ బ్యాంకింగ్ విధానాలతో కలపడం ఎక్కువ మందికి రుణాలు అందుతాయి. అలాగే ఆవిష్కరణలను, సమానమైన ఆర్థిక వృద్ధిని ప్రోత్సహిస్తుందని అధ్యయనం వివరించింది. -
డిజిటల్ విప్లవంలో భారత్ ముందంజ
జైపూర్: డిజిటల్ విప్లవంలో భారతదేశం ముందంజలో ఉందని రిజర్వ్ బ్యాంక్ డిప్యూటీ గవర్నర్ మైఖేల్ దేబబ్రత పాత్ర తెలిపారు.ఆర్థిక సాంకేతికత డిజిటల్ చెల్లింపులను వేగవంతం చేస్తోందని ఆయన పేర్కొన్నారు. ‘‘ఈ–మార్కెట్లు పురోగమిస్తున్నాయి. వాటి పరిధి విస్తరిస్తోంది. డిజిటల్ ఎకానమీ ప్రస్తుతం భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో పదో వంతుగా అంచనా. గత దశాబ్దంలో గమనించిన వృద్ధి రేటు ప్రకారం, 2026 నాటికి జీడీపీలో ఐదవ వంతుకు డిజిటల్ ఎకానమీ చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి’’ అని ఈ అంశంపై జరిగిన డీఈపీఆర్ సదస్సులో డిప్యూటీ గవర్నర్ పేర్కొన్నారు. ఇంకా ఆయన ఏమన్నారంటే.. ⇒ కొత్త వృద్ధి మార్గాలను అన్వేíÙంచడానికి, ఇప్పటికే ఉన్న మార్గాలను పటిష్టం చేసుకోడానికి భారత్ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (డీపీఐ)ని పటిష్టం చేసుకుంటోంది. శక్తివంతమైన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగం, యువత అధికంగా ఉండడం, అతిపెద్ద ఆరి్టఫిషీయల్ ఇంటిలిజెన్స్ టాలెంట్ బేస్ భారత్‌కు సానుకూల అంశం. ⇒ ఫైనాన్స్ రంగాన్ని డిజిటలైజేషన్ చేయడంపై దేశం ప్రత్యేకంగా దృష్టి సారిస్తోంది. దేశంలో బ్యాంకులు మొబైల్, ఇంటర్నెట్ బ్యాంకింగ్‌ను పటిష్టంగా అమ లుచేస్తున్నాయి. ఆన్లైన్ ఖాతా తెరవడం, డిజిటల్ కేవైసీ, ఇంటి వద్దేకే డిజిటల్ అనుసంధాన బ్యాకింగ్ సేవలు వంటి అంశాల్లో గణనీయమైన పురోగతి కనిపిస్తోంది. సాంకేతికత అనుసంధానంలో బ్యాంకింగ్ పురోగమిస్తోంది. ⇒ ఐదు ప్రధాన అంశాలపై ఆర్బీఐ ప్రధానంగా దృష్టి సారిస్తోంది. అందరికీ డిజిటల్ ఫైనాన్షియల్ వ్యవస్థను అందుబాటులోనికి తీసుకురావడం, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్టర్ పురోగతి, సైబర్ సెక్యూరిటీ, సుస్థిర ఫైనాన్స్, అంతర్జాతీయ సహకారం, సమన్వయం ఇందులో ఉన్నాయి. ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ బ్యాంకులు కీలకమైనవి: ఆర్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ), హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్‌లను 2024కు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరోసారి దేశీయ వ్యవస్థాత్మకంగా ముఖ్యమైన బ్యాంకులు (డీ–ఎస్ఐబీలు)గా పేర్కొంది. బ్యాంకుల నుండి సేకరించిన డేటా ఆధారంగా 2024 వరకూ ఈ వర్గీకరణ అమల్లో ఉంటుందని ఆర్బీఐ తెలిపింది. ఆర్బీఐ మొదట 2014లో డీ–ఎస్ఐబీలకు సంబంధించిన ఫ్రేమ్‌వర్క్‌ను ప్రకటించింది. 2015, 2016 జాబితాలో ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్‌లను చేర్చింది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌ను 2017లో ఈ లిస్ట్‌లో చేర్చింది. డీ–ఎస్ఐబీ ఫ్రేమ్‌వర్క్ ప్రకారం, ఈ జాబితాలోని బ్యాంకులు ఎకానమీ పురోగతిలో కీలకపాత్ర పోషిస్తాయి. అందరికీ ఆర్థిక ఫలాలు అందడంలో ఈ బ్యాంకుల సేవల కీలకమైనవి. మున్సిపల్ కార్పొరేషన్ల ఆదాయాలు పెరగాలి... ఇదిలావుండగా, ఆస్తిపన్ను సంస్కరణలు, వినియోగదారు చార్జీల హేతుబద్ధికరణ, మెరుగైన వసూళ్ల విధానాల ద్వారా మున్సిపల్ కార్పొరేషన్లు తమ ఆదాయ వనరులను పెంచుకోవాల్సిన అవసరం ఉందని ఆర్బీఐ నివేదిక సూచించింది. పెరుగుతున్న పట్టణ జనాభాతో పట్టణ ప్రాంతాల్లో అధిక–నాణ్యత ప్రజా సేవలకు డిమాండ్ వేగంగా పెరుగుతోందని ‘ము నిసిపల్ ఫైనాన్సెస్’ పేరుతో విడుదలైన ఈ నివేదికలో ఆర్బీఐ తెలిపింది. స్థానిక పన్నుల సంస్కరణలు, ఈ విషయంలో మెరుగైన అమలు విధానాలు, సంస్థాగత సామర్థ్యాన్ని పెంపొందించడం, పారదర్శక ఆర్థిక నిర్వహణ ద్వారా మునిసిపల్ కార్పొరేషన్ల ఆర్థిక వ్యవస్థలను బలోపేతం చేయాలని నివేదిక పేర్కొంది. ఈ విషయంలో ఆయా రాష్ట్రాలు నిర్దిష్ట వ్యూహాలు అవలంభించాలని పేర్కొంది. -
నగదు రహిత చెల్లింపుల్లో అంతకుమించి..!వాట్ ఏ టెక్నాలజీ..?
ప్రస్తుతం దేశంలో నగదు రహిత చెల్లింపుల హవా పెద్ద ఎత్తున నడుస్తుంది. పెద్ద పెద్ద మాల్స్ నుంచి రోడ్లపై ఉండే చిన్నా చితక దుకాణాల వరకు అన్ని చోట్ల డిజిటల్ పేమెంట్లే. ఇప్పటి వరకు మనం ఫోన్ లేదా క్యూర్ కోడ్ స్కాన్ చేసి చెల్లింపులు చేయడం చేశాం. వాటన్నింటిని తలదన్నేలా అడ్వాన్స్డ్ టెక్నాలజీతో కూడిన మరో చెల్లింపు విధానం వచ్చేసింది. దీన్నిచూస్తే అంతకు మించి..!..అని అనకుండా ఉండలేరు. ఇంతకీ ఏంటా చెల్లింపు విధానం అంటే..సాంకేతిక రంగంలో శరవేగంగా దూసుకుపోతున్న చైనాలో ఈ సరికొత్త చెల్లింపు విధానం కనిపిస్తుంది. సాంకేతికతకు సంబంధించిన విషయంలో చైనా సాధించిన పురోగతి ప్రపంచ దేశాలను బాగా ఆకర్షిస్తాయి. అందుకు ఉదాహారణే ఈ సరికొత్త డిజిటల్ చెల్లింపు విధానం. ఔను..! చైనాలోని ఓ దుకాణంలో 'పామ్ పేమెంట్ పద్ధతి'లో చెల్లింపులు చెయ్యొచ్చు.ఇదేంటీ ఫోన్ లేదా క్యూర్ కాకుండా ఏంటీ పామ్ అంటే..? . ఏం లేదు జస్ట్ మన చేతిని స్కాన్ చేసి చెల్లించేయొచ్చు. అందుకు సంబంధించిన వీడియోని పాకిస్తాన్ కంటెంట్ క్రియేటర్ రానా హంజా సైఫ్ షేర్ చేయడంతో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఎలా చేస్తారంటే..ఏం లేదు.. జస్ట్ పామ్ పామ్ ప్రింట్ డివైజ్‌లో మీ హ్యాండ్‌ని స్కాన్ చేసి రిజిస్టర్ అవ్వాలి. ఆ తర్వాత దాన్ని మన పేమెంట్ ఇన్ఫర్మేషన్నికి లింక్ అప్ చేస్తే చాలు. అంటే ఇక్కడ..ఒట్టి చేతులను స్కాన్ చేసి చెల్లింపులు చేసేయొచ్చు అన్నమాట. ఇది కాస్త భద్రతతో కూడిన సాంకేతికత. పైగా ఎలాంటి సమస్యలు ఉండవు. దీన్ని చూస్తే కచ్చితంగా వాటే టెక్నాలజీ గురూ..! అనాలనిపిస్తోంది కదూ..!. View this post on Instagram A post shared by Rana Hamza Saif ( RHS ) (@ranahamzasaif) (చదవండి: టెక్ మిలియనీర్ బ్రయాన్ జాన్సన్ జుట్టు సంరక్షణ చిట్కాలు..!) -
ఇంటర్నెట్ లేకుండానే యూపీఐ చెల్లింపులు!
రవి ఉదయాన్నే లేచి కిరాణంకు వెళ్లి ఇంట్లో కావాల్సిన కొన్ని సరుకులు తీసుకున్నాడు. బిల్లు చెల్లించేందుకు యూపీఐ థర్డ్‌పార్టీ యాప్ ద్వారా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి యూపీఐ పిన్ ఎంటర్ చేశాడు. కానీ పేమెంట్ జరగలేదు. మళ్లీ ప్రయత్నించాడు. అయినా పేమెంట్ అవ్వలేదు. క్రితం రోజు రాత్రే తన ఫోన్లో ఇంటర్నెట్ బ్యాలెన్స్ గడువు ముగిసిన విషయం రవికి గుర్తొచ్చింది. ఇంటికేమో సరుకులు తీసుకెళ్లాలి. కానీ పేమెంట్ చేద్దామంటే నెట్ సదుపాయం లేదు. వెంటనే తనకు ‘యూపీఐ 123పే’ సర్వీసు గుర్తొచ్చింది. దాంతో ఎలాంటి ఇంటర్నెట్ సౌకర్యం లేకుండానే యూపీఐ పేమెంట్ చేసి సరుకులతో ఇంటికి వచ్చాడు.యూపీఐ 123పే ఆల్ట్రా క్యాష్ ద్వారా ఎలాంటి నెట్ సదుపాయం లేకుండానే రిజిస్టర్డ్ ఫోన్ నంబర్ ద్వారా యూపీఐ సేవలు ఎలా వినియోగించుకోవాలో తెలుసుకుందాం.మీ ఫోన్ నుంచి యూపీఐ 123పేకు అనుసంధానంగా ఉన్న ‘08045163666’ నంబరుకు డయల్ చేయండి.ఐవీఆర్‌ను అనుసరిస్తూ స్థానిక భాషను ఎంచుకోవాలి.మనీ ట్రాన్సాక్షన్ కోసం ‘1’ ఎంటర్ చేయమని ఐవీఆర్‌లో వస్తుంది. వెంటనే 1 ప్రెస్ చేయాలి.మీరు ఎవరికైతే డబ్బు పంపాలనుకుంటున్నారో బ్యాంకు వద్ద రిజిస్టర్ అయిన తమ ఫోన్ నంబర్‌ను ఎంటర్ చేయాలి.ఐవీఆర్ సూచనలు పాటిస్తూ మీ బ్యాంకు పేరును వాయిస్ ద్వారా ధ్రువపరచాల్సి ఉంటుంది. వెంటనే మీ అకౌంట్ చివరి నాలుగు డిజిట్లు ఐవీఆర్ కన్ఫర్మ్ చేస్తుంది.తర్వాత ఎంత డబ్బు పంపించాలో ఎంటర్ చేయాలి.ఇదీ చదవండి: వీపీఎఫ్..పన్ను రహిత వడ్డీ పరిమితి పెంపు?మీరు ఎంత డబ్బు ట్రాన్స్ఫర్ చేస్తున్నారో తిరిగి ఐవీఆర్ ధ్రువపరుస్తుంది. ఎవరికైతే డబ్బు పంపించాలనుకుంటున్నారో వారి పేరు కూడా చెబుతుంది. తిరిగి కాల్ వస్తుందని చెప్పి కాల్ కట్ అవుతుంది.అలా కాల్ కట్ అయిన క్షణాల్లోనే ముందుగా మీరు కాల్ చేసిన నంబర్ నుంచే కాల్ వస్తుంది.మనీ ట్రాన్స్ఫర్ ధ్రువపరిచేందుకు ఐవీఆర్‌ను అనుసరించి 1 ప్రెస్ చేయాలి.తర్వాత మీ యూపీఐ పిన్ ఎంటర్ చేయాలి. వెంటనే మీ బ్యాంకు ఖాతా నుంచి డబ్బు కట్ అయినట్లు మెసేజ్ వస్తుంది.మీరు ఎవరికైతే డబ్బు చెల్లించాలో వారి ఖాతాలో డబ్బు జమైందో కనుక్కుంటే సరిపోతుంది. -
డిజిటల్ పేమెంట్స్‌లో మార్పులు.. ఆర్బీఐ ఆదేశం
ముంబై: వైకల్యంతో బాధపడే కస్టమర్లు సులభంగా సేవలు పొందే విధంగా బ్యాంక్‌లు తమ చెల్లింపుల వ్యవస్థలను సమీక్షించుకోవాలని ఆర్బీఐ కోరింది. సమాజంలోని అన్ని వర్గాలు, దివ్యాంగులు సైతం డిజిటల్ చెల్లింపులను అనుసరిస్తున్న విషయాన్ని గుర్తు చేసింది.‘‘మరింత మెరుగైన సేవలను పొందేందుకు వీలుగా చెల్లింపుల వ్యవస్థల భాగస్వాములు (పీఎస్పీలు/బ్యాంక్‌లు/నాన్ బ్యాంక్ పేమెంట్ సిస్టమ్ ప్రొవైడర్లు) తమ చెల్లింపుల వ్యవస్థలు/పరికరాలను సమీక్షించాలి. దివ్యాంగులు సైతం సులభంగా వినియోగించుకునే విధంగా ఉండాలి. సమీక్ష అనంతరం దివ్యాంగులు సైతం వినియోగించుకునేందుకు వీలుగా.. బ్యాంక్‌లు, నాన్ బ్యాంక్ పేమెంట్ సిస్టమ్ ప్రొవైడర్లు తమ వ్యవస్థల్లో, పీవోఎస్ మెషిన్లలో అవసరమైన మార్పులు చేయాలి’’అని ఆర్బీఐ తన సర్క్యులర్‌లో పేర్కొంది. -
ఐపీవోల హవా
రోజుకో కొత్త గరిష్టాన్ని తాకుతున్న సెకండరీ మార్కెట్ల బాటలో ప్రైమరీ మార్కెట్లు సైతం భారీ సంఖ్యలో ఇష్యూలతో కదం తొక్కుతున్నాయి. తాజాగా రెండు కంపెనీలకు సెబీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా.. మరో రెండు కంపెనీలు ఐపీవో సన్నాహాల్లో ఉన్నాయి. వివరాలు ఇలా.. –సాక్షి, బిజినెస్డెస్క్ఐపీవో చేపట్టేందుకు సోలార్ ప్యానళ్ల తయారీ కంపెనీ వారీ ఇంజినీర్స్.. క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ అనుమతి పొందింది. ఇదేవిధంగా డిజిటల్ పేమెంట్ల సంస్థ వన్ మొబిక్విక్ సిస్టమ్స్ పబ్లిక్ ఇష్యూకి సైతం సెబీ ఆమోదముద్ర వేసింది. వారీ సెబీకి 2023 డిసెంబర్లో, మొబిక్విక్ 2024 జనవరిలో దరఖాస్తు చేశాయి. వారీ ఇంజినీర్స్.. రూ. 3,000 కోట్లకుపైగా వారీ ఇంజినీర్స్ ఐపీవోలో భాగంగా రూ. 3,000 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా 32 లక్షల షేర్లను ప్రమోటర్‌తోపాటు ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. ఈక్విటీ జారీ నిధులను ఒడిషాలో 6 గిగావాట్ల ఇన్గాట్ వేఫర్, సోలార్ సెల్, సోలార్ పీవీ మాడ్యూల్ తయారీ ప్లాంటు ఏర్పాటుకు వెచి్చంచనుంది. మరికొన్ని నిధులను సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. కంపెనీ 2023 జూన్‌కల్లా 12 గిగావాట్ల పీవీ మాడ్యూల్ తయారీ సామర్థ్యాన్ని కలిగి ఉంది. మొబిక్విక్.. రూ. 700 కోట్లు తాజా ఈక్విటీ షేర్ల జారీ ద్వారా మొబిక్విక్ రూ. 700 కోట్లు సమీకరించే యోచనలో ఉంది. తద్వారా స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టింగ్‌కు సై అంటోంది. ఐపీవో నిధుల్లో రూ. 250 కోట్లు ఫైనాన్షియల్ సర్వీసుల బిజినెస్ వృద్ధికి వినియోగించనుంది. రూ. 135 కోట్లు పేమెంట్ సరీ్వసుల బిజినెస్‌కు దన్నుగా వెచ్చించనుంది. మరో రూ. 135 కోట్లు డేటా, మెషీన్ లెర్నింగ్, ఏఐ, ప్రొడక్ట్ టెక్నాలజీలపై ఇన్వెస్ట్ చేయనుంది. ఈ బాటలో పేమెంట్ పరికరాలపై రూ. 70 కోట్లు పెట్టుబడి వ్యయాలుగా కేటాయించనుంది. రూ. 10,000 కోట్లపై కన్ను విద్యుత్ రంగ పీఎస్‌యూ దిగ్గజం ఎన్టీపీసీ అనుబంధ కంపెనీ ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ భారీ ఐపీవోకు సిద్ధపడుతోంది. ఇందుకు అనుగుణంగా గత వారమే సెబీకి ప్రాథమిక పత్రాలను దాఖలు చేసింది. తద్వారా నవంబర్ తొలి వారంలో ఐపీవోకు వచ్చే వీలున్నట్లు తెలుస్తోంది. ప్రాస్పెక్టస్ ప్రకారం ఐపీవో ద్వారా రూ. 10,000 కోట్లు సమకూర్చుకోవాలని భావిస్తోంది. ముంబైసహా.. సింగపూర్ తదితర దేశాలలో రోడ్‌షోలకు ప్రణాళికలు వేసింది.ఇష్యూ నిధుల్లో రూ. 7,500 కోట్లు అనుబంధ సంస్థ ఎన్టీపీసీ రెనెవబుల్ ఎనర్జీ రుణ చెల్లింపులతోపాటు సాధారణ కార్పొరేట్ అవసరాలకు వెచ్చించనుంది. ఈ మహారత్న కంపెనీ 2024 ఆగస్ట్‌కల్లా 3,071 మెగావాట్ల సోలార్ ప్రాజెక్టులు, 100 మెగావాట్ల పవన విద్యుత్ ప్రాజెక్టులను కలిగి ఉంది. ఈ ఏడాది ఇప్పటికే 60 కంపెనీలు పబ్లిక్ ఇష్యూలకు వచి్చన నేపథ్యంలోనూ మరిన్ని కంపెనీలు ఇందుకు తెరతీస్తుండటం విశేషం! ఇదే బాటలో లీలా ప్యాలెస్ లీలా ప్యాలెస్ హోటళ్ల నిర్వాహక సంస్థ ష్లాస్ బెంగళూరు లిమిటెడ్ పబ్లిక్ ఇష్యూ బాట పట్టింది. ఇందుకు వీలుగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. తద్వారా రూ. 5,000 కోట్లు సమకూర్చుకునే ప్రణాళికల్లో ఉంది. వెరసి దేశీ ఆతిథ్య రంగంలో అతిపెద్ద ఐపీవోగా నిలవనుంది. కాగా.. ఇష్యూలో భాగంగా లీలా ప్యాలెస్ రూ. 3,000 కోట్ల తాజా ఈక్విటీని జారీ చేయనుంది. వీటికి జతగా ప్రమోటర్ సంస్థ డీఐఎఫ్సీ రూ. 2,000 కోట్ల విలువైన షేర్లను విక్రయానికి ఉంచనుంది. ఈక్విటీ జారీ నిధులను అనుబంధ సంస్థల రుణ చెల్లింపులకు, ఇతర సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనున్నట్లు బ్రూక్‌ఫీల్డ్ అసెట్ మేనేజ్మెంట్ దన్నుగల ష్లాస్ బెంగళూరు వెల్లడించింది. 2024 మార్చికల్లా కంపెనీ రుణ భారం రూ. 4,053 కోట్లుగా నమోదైంది. ద లీలా బ్రాండ్‌తో కంపెనీ విలాసవంత హోటళ్లను నిర్వహిస్తున్న విషయం విదితమే. మొత్తం 3,382 గదులను కలిగి ఉంది.రూ. 1,100 కోట్ల సమీకరణరియల్టీ కంపెనీ కాసాగ్రాండ్ ప్రీమియర్ బిల్డర్ పబ్లిక్ ఇష్యూ సన్నాహాలకు తెరతీసింది. ఇందుకు వీలుగా సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. దీనిలో భాగంగా రూ. 1,000 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో రూ. 100 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్లు ఆఫర్ చేయనున్నారు. వెరసి ఐపీవో ద్వారా రూ. 1,100 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. ఈక్విటీ జారీ నిధులను కంపెనీతోపాటు అనుబంధ సంస్థల రుణ చెల్లింపులు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. కాసాగ్రాండ్ బ్రాండుతో కంపెనీ రియల్టీ అభివృద్ధి కార్యకలాపాలు చేపడుతోంది. 2023–24లో రూ. 2,614 కోట్ల ఆదాయం, రూ. 257 కోట్ల నికర లాభం ఆర్జించింది.14ఏళ్లలో సెప్టెంబర్ బిజీ..బిజీ ఐపీవోలకు 28 కంపెనీలు ఈ నెల(సెప్టెంబర్) 14 ఏళ్ల తదుపరి సరికొత్త రికార్డుకు వేదిక కానుంది. రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) వివరాల ప్రకారం సెపె్టంబర్లో ఇప్పటివరకూ 28 కంపెనీలు పబ్లిక్ ఇష్యూలను చేపట్టాయి. మెయిన్ బోర్డ్, ఎస్ఎంఈలు కలిపి ఇప్పటికే 28 కంపెనీలు లిస్టింగ్‌కు తెరతీశాయి. ఫైనాన్షియల్ మార్కెట్లు పరివర్తనలో ఉన్నట్లు ఆర్థిక వ్యవస్థపై రూపొందించిన సెపె్టంబర్ బులెటిన్‌లో ఆర్బీఐ పేర్కొంది. ప్రైమరీ ఈక్విటీ మార్కెట్లో చిన్న, మధ్యతరహా సంస్థలు(ఎస్ఎంఈలు)సహా భారీ సందడి నెలకొన్నట్లు తెలియజేసింది. వెరసి 14 ఏళ్ల తరువాత ఈ సెప్టెంబర్ అత్యంత రద్దీగా మారినట్లు వ్యాఖ్యానించింది. దేశీ మ్యూచువల్ ఫండ్స్ తదితర ఇన్వెస్టర్ల ద్వారా ఇష్యూలు భారీస్థాయిలో సబ్‌్రస్కయిబ్ అవుతున్నట్లు వివరించింది. క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ పరిశీలన ప్రకారం ఐపీవోలలో లభించిన షేర్లలో 54 శాతాన్ని ఇన్వెస్టర్లు లిస్టయిన వారం రోజుల్లోనే విక్రయించారు. 2024లో ఐపీవోల ద్వారా నిధుల సమీకరణ జోరు చూపుతున్నట్లు ఆర్బీఐ నివేదిక పేర్కొంది. ఈ బాటలో తొలి అర్ధభాగానికల్లా ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో ఐపీవోలు వెలువడిన దేశంగా భారత్ నిలిచినట్లు తెలియజేసింది. ఇందుకు ఎస్ఎంఈలు ప్రధానంగా దోహదపడినట్లు వెల్లడించింది. -
439 బిలియన్ యూపీఐ లావాదేవీలు
న్యూఢిల్లీ: యూపీఐ వినియోగం ఏటేటా గణనీయగా పెరుగుతూనే ఉంది. 2028–29 ఆర్థిక సంవత్సరం ముగింపు నాటికి యూపీఐ లావాదేవీలు మూడు రెట్ల వృద్ధితో 439 బిలియన్లకు (ఒక బిలియన్ వంద కోట్లకు సమానం) చేరుకుంటాయని పీడబ్ల్యూసీ ఇండియా నివేదిక వెల్లడించింది. 2023–24 ఆర్థిక సంవత్సరంలో యూపీఐ లావాదేవీలు 131 బిలియన్లుగా ఉన్నట్టు తెలిపింది. గడిచిన ఎనిమిదేళ్ల కాలంలో డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ అద్భుతమైన వృద్ధిని చూసినట్టు పేర్కొంది. ఈ కాలంలో లావాదేవీల విలువ రూ.265 లక్షల కోట్ల నుంచి రూ.593 లక్షల కోట్లకు పెరిగినట్టు వెల్లడించింది. రిటైల్ చెల్లింపుల్లో యూపీఐ హవా రిటైల్ డిజిటల్ చెల్లింపుల్లో ఇప్పుడు యూపీఐ వాటా 80 శాతాన్ని అధిగమించిందని.. 2028–29 నాటికి 91 శాతానికి చేరుకోవచ్చని పీడబ్ల్యూసీ ఇండియా నివేదిక తెలిపింది. యూపీఐ ఏటేటా చక్కని వృద్ధిని చూస్తోందంటూ.. లావాదేవీల పరిమాణంలో 57 శాతం వృద్ధి ఉన్నట్టు పేర్కొంది. క్రెడిట్ కార్డ్ విభాగం సైతం 2023–24లో బలమైన వృద్ధిని చూసిందని, కొత్తగా 1.6 కోట్ల కార్డులను పరిశ్రమ జోడించుకున్నట్టు వివరించింది. దీంతో లావాదేవీల పరిమాణం 22 శాతం మేర, లావాదేవీల విలువ 28 శాతం చొప్పున పెరిగినట్టు వెల్లడించింది. 2028–29 నాటికి క్రెడిట్‌కార్డులు 20 కోట్లకు చేరుకోవచ్చని తెలిపింది. ఇక డెబిట్ కార్డుల వినియోగం తగ్గుతోంది. లావాదేవీల పరిమాణం, విలువలోనూ క్షీణత కనిపించింది. వచ్చే ఐదేళ్లలో చెల్లింపుల పరిశ్రమ ఎకోసిస్టమ్ విస్తరణకు ప్రాధాన్యం ఇవ్వొచ్చని, ప్రస్తుతమున్న ప్లాట్‌ఫామ్‌లపైనే కొత్త వినియోగ అవకాశాలను గుర్తించొచ్చని పీడబ్ల్యూసీ ఇండియా పేమెంట్స్ పార్ట్నర్ మిహిర్ గాంధీ అంచనా వేశారు. -
పేమెంట్స్ వాచ్.. చేతికుంటే చాలు!
డిజిటల్ యుగంలో పేమెంట్స్ విధానం కొత్త పుంతలు తొక్కుతోంది. ఇప్పుడు చెల్లింపు లావాదేవీలన్నీ ఎక్కువగా స్మార్ట్ఫోన్ల ద్వారానే జరుగుతున్నాయి. స్మార్ట్ఫోన్లతోపాటు స్మార్ట్ వాచ్‌ల వినియోగం కూడా పెరుగుతన్న క్రమంలో ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ సరికొత్త ఆవిష్కరణతో ముందుకొచ్చింది.నాయిస్ కంపెనీ, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) సహకారంతో ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ సరికొత్త స్మార్ట్ వాచ్‌ను తీసుకొస్తోంది. తాజాగా జరిగిన గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్ 2024లో దీన్ని పరిచయం చేసింది. నేషనల్ కామన్ మొబిలిటీ కార్డ్ (NCMC) టెక్నాలజీతో పనిచేసే ఈ స్మార్ట్ వాచ్‌లో ఇంటిగ్రేటెడ్ రూపే చిప్ ఉంటుంది. దీన్ని ధరించి మణికట్టు నుంచే ‘మనీ’ లావాదేవీలు పూర్తి చేయొచ్చన్నమాట. పేమెంట్స్-కమ్-ఫిట్నెస్ సొల్యూషన్‌గా వస్తున్న ఈ స్మార్ట్ వాచ్‌లో హెల్త్, ఫిట్నెస్ మానిటరింగ్ ఫీచర్లు కూడా ఉన్నాయి.స్మార్ట్‌వాచ్ ఫీచర్లుఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ స్మార్ట్‌వాచ్‌లో డైరెక్ట్, ‘ఆన్ ద గో’ పేమెంట్స్ కోసం డయల్‌లో ఎంబెడెడ్ రూపే చిప్‌ను అమర్చినట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ఎన్సీఎంసీ ఇంటిగ్రేషన్‌తో వచ్చే ఈ స్మార్ట్ వాచ్ ట్యాప్ అండ్ పే లావాదేవీలకు మద్దతునిస్తుంది. ఈ ఇంటిగ్రేషన్ సౌజన్యంతో దేశంలోని మెట్రోలు, బస్సులు, పార్కింగ్ ప్రదేశాలు ఇంకా మరెన్నో చోట్ల స్మార్ట్‌వాచ్ ద్వారా చెల్లింపులు జరపవచ్చు. పిన్‌తో పనిలేకుండా దీని ద్వారా రూ. 5,000 వరకూ పేమెంట్స్ చేయొచ్చు.ఇక హెల్త్, ఫిట్నెస్ ఫీచర్ల విషయానికి వస్తే రక్తంలో ఆక్సిజన్ స్థాయిలు, శరీర ఉష్ణోగ్రత, హృదయ స్పందన రేటు, బీపీ పర్యవేక్షణ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. ఇది 130 స్పోర్ట్స్ మోడ్‌లను ట్రాక్ చేయగలదు. 150కి పైగా క్లౌడ్-ఆధారిత వాచ్ ఫేస్‌లను కస్టమైజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. స్మార్ట్ వాచ్ బ్లూటూత్ కాలింగ్‌కు కూడా సపోర్ట్ చేస్తుంది. IP68 డస్ట్, వాటర్ రెసిస్టెన్స్‌తో వస్తుంది. 550 నిట్స్ బ్రైట్‌నెస్‌తో టీఎఫ్టీ ఎల్సీడీ స్క్రీన్‌ను కలిగి ఉందని ఎయిర్టెల్ తెలిపింది.ఇది ఇతర స్మార్ట్‌వాచ్‌ల మాదిరిగానే స్మార్ట్‌ఫోన్‌కు కనెక్ట్ చేసినప్పుడు నోటిఫికేషన్లు, కాల్ రిమైండర్లు, సందేశాలను కూడా ప్రదర్శిస్తుంది. ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ స్మార్ట్‌వాచ్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 10 రోజుల వరకు బ్యాటరీ లైఫ్‌ను అందిస్తుంది. ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ ఈ స్మార్ట్‌వాచ్ ధరను ఇంకా ప్రకటించలేదు. బ్యాంక్ ఆన్లైన్, రిటైల్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా కొనుగోలు చేయడానికి త్వరలో అందుబాటులో ఉంటుందని కంపెనీ తెలిపింది. -
ఖాతాలు ఖాళీ చేస్తున్నారు!
దేశంలో ఆన్లైన్ ఆర్థిక మోసాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. కార్డు, డిజిటల్ చెల్లింపులను ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నారు. దేశంలో 2016లో పెద్దనోట్లు రద్దు చేసిన అనంతరం వచ్చిన మార్పుల్లో భాగంగా కార్డు చెల్లింపులు, డిజిటల్ చెల్లింపులు భారీగా పెరుగుతున్నాయి. అందుకు తగ్గట్టుగానే దేశంలో ఆన్లైన్ ఆర్థిక నేరాలు కూడా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. 2023–24 ఆర్థిక సంవత్సరంలో దేశంలో ఏకంగా రోజుకు సగటున 800 ఆన్లైన్ ఆర్థిక మోసాల కేసులు నమోదైనట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) నివేదిక వెల్లడించింది. సుమారు రూ.2,110 కోట్లను సైబర్ నేరగాళ్లు కొల్లగొట్టినట్లు తెలిపింది. – సాక్షి, అమరావతిఅధిక మోసాలు ఈ రూపాల్లోనే» బ్యాంకు ఖాతాదారులు సైబర్ ముఠాల మాటలు నమ్మి తమ ఓటీపీ, ఇతర వివరాలను వారికి తెలియజేయడం వల్లే అధికంగా ఆరి్థక మోసాలు జరుగుతున్నాయి.» ఖాతాదారులు బోగస్ ఈ–కామర్స్ సైట్లకు నిధులు బదిలీ చేయడం ద్వారా పాల్పడుతున్న మోసాలు రెండో స్థానంలో ఉన్నాయి. » బ్యాంకు ఖాతాలను హ్యాకింగ్/బ్రీచ్ ద్వారా పాల్పడుతున్న నేరాలు మూడో స్థానంలో ఉన్నాయి.» బ్యాంకు ఖాతాదారులు ఎట్టి పరిస్థితుల్లోనూ తమ ఆధార్, పాన్ కార్డ్, ఓటీపీ వివరాలను ఇతరులకు తెలియజేయకూడదని ఆర్బీఐ స్పష్టంగా పేర్కొంది. తమ వివరాలను ఇతరులకు వెల్లడించడం ద్వారాగానీ, అనధికారిక లావాదేవీలతో సంభవించే ఆరి్థక మోసాలకు బ్యాంకులు బాధ్యత వహించవని, దీనిపై 2017లోనే నిబంధనలు రూపొందించామని గుర్తుచేసింది.ఆర్బీఐ నివేదికలోని ప్రధాన అంశాలు»2023–24లో దేశంలో 2.90 లక్షల ఆన్లైన్ ఆర్థిక నేరాల కేసులు నమోదయ్యాయి. అంటే రోజుకు సగటున 800 కేసులు నమోదు కావడం గమనార్హం. » రూ.లక్షకు పైగా కొల్లగొట్టిన కేసులు 29,082 నమోదయ్యాయి. మిగిలిన కేసులతో కలిపి 2023–24లో మొత్తంమీద 2.90లక్షల ఆన్లైన్ ఆర్థిక మోసాలకు పాల్పడ్డారు. » 2016 తర్వాత ఆన్లైన్ ఆర్థిక నేరాల్లో గత ఆర్థిక సంవత్సరంలోనే అత్యధికంగా కేసులు నమోదయ్యాయి. » ఆన్లైన్ ఆర్థిక మోసాల ద్వారా సైబర్ నేరాల ముఠాలు భారీస్థాయిలో మోసాలకు పాల్పడుతున్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో ఏకంగా రూ.2,110 కోట్లు కొల్లగొట్టాయి. వాటిలో రూ.లక్ష కంటే ఎక్కువ ఉన్న కేసుల్లో మొత్తం రూ.1,457 కోట్లు స్వాహా చేశారు. రూ.లక్ష కంటే తక్కువ కొల్లగొట్టిన కేసుల్లో మొత్తం రూ.653 కోట్లు దోచుకున్నారు.2023–24 లో దేశంలో ఆన్లైన్ ఆర్థిక నేరాలు ఇలా..» మొత్తం కేసులు 2.90 లక్షలు» రోజుకు నమోదైన సగటు కేసులు 800» రూ.లక్షకు పైగా కొల్లగొట్టిన కేసులు 29,082» మొత్తం స్వాహా చేసిన మొత్తం రూ. 2,110 కోట్లు -
డిజిటల్ చెల్లింపులు మరింత సురక్షితం
‘మీ బ్యాంకు ఖాతా బ్లాక్ అయ్యింది.. మీ ఫోన్‌కు ఓటీపీ పంపాం.. అది చెప్పండి.. వెంటనే ఖాతాను పునరుద్ధరిస్తాం’.. ఈ మాటలు నమ్మి ఎవరైనా ఓటీపీ నంబర్ చెప్పారో అంతే.. వారి ఖాతా ఖాళీ. కొన్నేళ్లుగా బెంబేలెత్తిస్తున్న సైబర్ నేరాల తీరిది. దాదాపు 65 శాతం సైబర్ నేరాలకు ప్రధాన కారణం అవాంఛనీయమైన వ్యక్తులకు ఓటీపీ నంబర్ చెప్పేయడమేనని తేలింది. వేగం పుంజుకుంటున్న ఆర్థిక వ్యవస్థకు తగ్గట్లుగా పెరుగుతున్న ఆధునిక సమాచార సాంకేతిక పరిజ్ఞానంతో దేశంలో డిజిటల్ చెల్లింపులు అమాంతంగా పెరుగుతున్నాయి. ఈ పరిస్థితిని దుర్వినియోగం చేస్తూ సైబర్ ముఠాలు చెలరేగిపోతున్నాయి. అందుకే సైబర్ మోసాలకు అడ్డుకట్ట వేసేందుకు డిజిటల్ చెల్లింపుల విధానంలో సంస్కరణలు తీసుకురావాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నిర్ణయించింది. ఈ మేరకు ఓటీపీ నంబరుకు ప్రత్యామ్నాయంగా మరికొన్ని విధానాలను అమలులోకి తీసుకురావాలని నిర్ణయం తీసుకుంది. – సాక్షి, అమరావతిమూడు ప్రత్యామ్నాయ విధానాలు..డిజిటల్ చెల్లింపులను మరింత సురక్షితం చేసేందుకు ఆర్బీఐ ‘అడిషనల్ ఫ్యాక్టర్ ఆఫ్ అథంటికేషన్ (ఏఎఫ్ఏ) విధానాలను ఆమోదించింది. అంటే ఓటీపీతోపాటు ఈ అదనపు అథంటికేషన్‌ను కూడా కచ్చితంగా పరిశీలించిన అనంతరమే డిజిటల్ చెల్లింపుల ప్రక్రియ పూర్తవుతుంది. ఆ అదనపు అథంటికేషన్ డైనమిక్‌గా ఉంటుంది. చెల్లింపు లావాదేవీ మొదలైన తరువాత అది జనరేట్ అవుతుంది. అది కూడా ఆ ఒక్క లావాదేవీకే పరిమితమవుతుంది. త్వరలోనే అమలులోకి రానున్న ఈ కొత్త మార్గదర్శకాల్లో మూడు ప్రత్యామ్నాయ విధానాలను పొందుపరిచింది. అవి..నాలెడ్జ్ బేస్డ్: ఖాతాదారుడు (చెల్లింపుదారుడు)కు మాత్రమే తెలిసిన సమాచారాన్ని తెలపాల్సి ఉంటుంది. ఆ ఖాతాదారుడు ముందుగా నిర్ణయించుకున్న పాస్వర్డ్, పాస్‌ఫ్రేజ్, పిన్ నంబర్లలో ఒకదాన్ని ఎంటర్‌చేస్తేనే డిజిటల్ చెల్లింపు ప్రక్రియ పూర్తవుతుంది. పొసెషన్ బేస్డ్: ఖాతాదారుడు (చెల్లింపుదారుడు) తాను వ్యక్తిగతంగా కలిగి ఉన్నవాటి సమాచారాన్ని తెలపాల్సి ఉంటుంది. హార్డ్‌వేర్, సాఫ్ట్వేర్లకు టోకెన్ల వంటి తనకు మాత్రమే తెలిసిన సమాచారాన్ని ఎంటర్‌చేస్తేనే డిజిటల్ చెల్లింపు పూర్తవుతుంది. బయోమెట్రిక్ బేస్డ్: వేలిముద్రలు, ఐరీస్, ముఖ గుర్తింపు వంటివి. అవి సరిపోలితేనే డిజిటల్ చెల్లింపు సాధ్యపడుతుంది.వీటికి మినహాయింపులు..తాజా మార్గదర్శకాల పేరుతో రోజువారీ సాధారణ లావాదేవీలు, తక్కువ మొత్తం చెల్లింపుల ప్రక్రియకు ప్రతిబంధకం కాకుండా ఆర్బీఐ జాగ్రత్తలు కూడా తీసుకుంది. అందుకే ఈ కొత్త విధానం నుంచి కొన్నింటికి మినహాయింపులిచ్చింది. మినహాయింపులు ఇచ్చిన డిజిటల్ చెల్లింపులు ఏమిటంటే..» దుకాణాలు, వాణిజ్య కేంద్రాలు, ఇతర కేంద్రాల్లో రూ.5వేల లోపు చెల్లింపులు.. » బ్యాంకుల ద్వారా రికరింగ్ చెల్లింపుల (నియమిత కాలంలో ఆటోమెటిగ్గా బ్యాంకు ఖాతాల నుంచి చెల్లింపులు) కోసం ముందుగానే ఆమోదించి బ్యాంకుకు తెలిపిన లావాదేవీలు..» రూ.లక్షలోపు మ్యూచువల్ ఫండ్స్ చెల్లింపులు..» బీమా ప్రీమియంల చెల్లింపులు.. » క్రెడిట్ కార్డు చెల్లింపులు..» రూ.15వేల వరకు ఇ–మ్యాండేట్ చెల్లింపులు..» టోల్గేట్ల వద్ద చెల్లింపులు. -
ఆన్లైన్ పేమెంట్ మోసాలను అరికట్టేందుకు ముసాయిదా
ఆన్లైన్ చెల్లింపుల్లో జరిగే మోసాలను అరికట్టడానికి భారతీయ రిజర్వ్ బ్యాంక్ చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగా ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్(ఏఈపీఎస్) ద్వారా జరిగే మోసాన్ని నిరోధించడానికి ఆర్బీఐ ముసాయిదాను రూపొందించింది. ఆరు నెలల పాటు ఎలాంటి ఆర్థిక లావాదేవీలు నిర్వహించని వినియోగదారుల కేవైసీను అప్డేట్ చేయాలని బ్యాంకులను ఆదేశించింది. అలాగే పాస్వర్డ్, పిన్, సాఫ్ట్వేర్ టోకెన్లు, బయోమెట్రిక్‌లతో సహా డిజిటల్ చెల్లింపుల కోసం అడిషనల్ ఫ్యాక్టర్ అథెంటికేషన్ (ఏఎఫ్ఏ) వంటి ప్రత్యామ్నాయాలను ఉపయోగించేలా చూడాలని ప్రతిపాదించింది.కార్డు లావాదేవీలు మినహా ఇతర డిజిటల్ చెల్లింపులు చేసేందుకు వినియోగదారులు గతంలో కొన్ని అథెంటికేషన్లను యాక్సెస్ చేసినా వాటిని నిరుపయోగంగానే వదిలేస్తున్నట్లు ఆర్బీఐ తెలిపింది. ఆన్లైన్ చెల్లింపులకు సంబంధించి ఎన్ని అథెంటికేషన్లను తీసుకొచ్చినా లావాదేవీలు జరపాలంటే మాత్రం ప్రాథమికంగా ఎస్ఎంఎస్ ద్వారా ఓటీపీ విధానాన్ని అనుసరిస్తున్నారు. ప్రస్తుతం రూ.5,000 లోపు చేసే కార్డ్, క్రెడిట్ కార్డ్ బిల్లుల చెల్లింపులు, మ్యూచువల్ ఫండ్లు, బీమా ప్రీమియంలు, డిజిటల్ టోల్ చెల్లింపులు, రూ.7,500 లోపు చేసే ఆఫ్‌లైన్ చెల్లింపు లావాదేవీలను ఏఎఫ్ఏ నుంచి మినహాయించారు. అంతకుమించి లావాదేవీలు జరిపితే మాత్రం అథెంటికేషన్ ఉండాలని ఆర్బీఐ స్పష్టం చేసింది.ఇదీ చదవండి: బ్యాంకు సర్వీస్ ప్రొవైడర్‌పై ర్యాన్సమ్వేర్ దాడి!కస్టమర్ల వివరాలు, లావాదేవీల్లో మరింత భద్రత పాటించాలనే ఉద్దేశంతోనే ఏఈపీఎస్ ముసాయిదాను రూపొందించినట్లు ఆర్బీఐ పేర్కొంది. ఆరు నెలల నుంచి ఎలాంటి లావాదేవీలు జరపని కస్టమర్ల కేవైసీ ప్రక్రియలో ముసాయిదాలోని ఆదేశాలు పాటించాలని తెలిపింది. -
డిజిటల్ విప్లవంలో ఇదీ మన ఘనత.. ఆర్బీఐ నివేదిక
డిజిటల్ ఆర్థిక విప్లవంలో భారత్ ముందంజలో నిలిచింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం ప్రపంచ రియల్ టైమ్ చెల్లింపుల్లో దాదాపు సగం భారత్‌లోనే జరిగాయి. గ్లోబల్ రెమిటెన్స్‌లో మన దేశం ప్రపంచంలోనే అగ్రగామిగా నిలిచింది.గ్లోబల్ రియల్ టైమ్ చెల్లింపుల పరిమాణంలో 48.5 శాతం వాటాతో భారతదేశం ప్రపంచంలోనే అగ్రగామిగా ఉంది. మొబైల్ మనీ, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా 2023లో ప్రపంచవ్యాప్తంగా 857.3 బిలియన్ డాలర్ల విలువైన లావాదేవీలు జరగగా 115.3 బిలియన్ డాలర్ల విలువైన లావాదేవీలతో భారత్ అగ్రగామిగా నిలిచిందని ఆర్బీఐ నివేదిక పేర్కొంది.భారతదేశ జీడీపీలో డిజిటల్ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం పదో వంతుగా ఉంది. గత దశాబ్దంలో గమనించిన వృద్ధి రేట్ల ఆధారంగా 2026 నాటికి జీడీపీలో ఐదవ వంతుకు పెరుగుతుందని అంచనా. ఆర్బీఐ ప్రకారం, 2023-24లో రూ. 428 లక్షల కోట్ల విలువైన 16,400 కోట్ల డిజిటల్ లావాదేవీలు జరిగాయి. ఇవి గత ఏడు సంవత్సరాలలో పరిమాణం పరంగా 50 శాతం, విలువ పరంగా 10 శాతం వార్షిక వృద్ధి రేటు నమోదు చేశాయి.డిజిటల్ విప్లవంలో భారతదేశం ముందంజలో ఉందని, ఆర్థిక సాంకేతికత (ఫిన్‌టెక్) మాత్రమే కాకుండా బయోమెట్రిక్ గుర్తింపు, యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (UPI), మొబైల్ కనెక్టివిటీ, డిజిటల్ లాకర్స్, సమ్మతితో కూడిన డేటా షేరింగ్‌లోనూ మెరుగ్గా ఉందని ఆర్బీఐ నివేదిక పేర్కొంది. అయితే సైబర్ భద్రత ముఖ్యమైన సవాలు అని కూడా ఎత్తి చూపింది. -
Union Budget 2024: సైబర్ చోరులూ... హ్యాండ్సప్!
డిజిటల్ చెల్లింపుల్లో భారత్ దూసుకుపోతోంది. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న మొత్తం డిజిటల్ చెల్లింపుల్లో 46 శాతం వాటా మనదే. వీటిలో ఏకంగా 80 శాతం యూపీఐ చెల్లింపులే. మరోవైపు సైబర్ నేరగాళ్లు కూడా అదే స్థాయిలో పేట్రేగిపోతున్నారు. ఢిల్లీ ఎయిమ్స్ సర్వర్లపై పదేపదే సైబర్ దాడులు, చిరుతిళ్ల తయారీ దిగ్గజం హల్దీరామ్స్‌పై రాన్సమ్వేర్ దాడి వంటివి ఇందుకు కేవలం ఉదాహరణలే. గీత ఐదేళ్లలో మన దగ్గర సైబర్ దాడుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. జాతీయ సైబర్ దాడుల నమోదు పోర్టల్‌కు ఈ ఏడాది ఇప్పటిదాకా సగటున రోజుకు కనీసం 7,000 పై చిలుకు ఫిర్యాదులందాయి. వీటి వాస్తవ సంఖ్య ఇంకా భారీగా ఉంటుందని సైబర్ నిపుణులు చెబుతున్నారు. సైబర్ నేరాల్లో భారత్ ప్రస్తుతం ప్రపంచంలో పదో స్థానంలో ఉంది. నానాటికీ తీవ్రరూపు దాలుస్తున్న ఈ బెడదకు అడ్డుకట్ట వేసే దిశగా 2024–25 కేంద్ర బడ్జెట్లో పలు చర్యలకు మోదీ ప్రభుత్వం ఉపక్రమించింది. సైబర్ భద్రతకు నిధులు పెంచింది. కీలకమైన ఆన్లైన్ వ్యవస్థలు, డేటా భద్రత, సైబర్ నేరాల కట్టడి, కృత్రిమ మేధలో పరిశోధనలకు రూ.1,550 కోట్లు కేటాయించింది. ఇందులో రూ.238 కోట్లు కేంద్ర స్థాయిలో సైబర్ భద్రత, నేరాలకు సంబంధించిన వ్యవహారాలను పర్యవేక్షించే నోడల్ ఏజెన్సీ ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (సెర్ట్–ఇన్)కు దక్కాయి. మొత్తమ్మీద సైబర్ భద్రత ప్రాజెక్టులకు రూ.759 కోట్లు కేటాయించారు. గతేడాదితో పోలిస్తే ఇవి ఏకంగా 90 శాతం అధికం కావడం విశేషం! సైబర్ సెక్యూరిటీ కృత్రిమ మేధ ప్రాజెక్టుల కోసం కేంద్ర హోం శాఖకు కేటాయించిన భారీ నిధుల్లోని మొత్తాలను వెచి్చంచనున్నారు. ఆ శాఖ అదీనంలో పని చేసే భారత సైబర్ నేరాల (కట్టడి) సమన్వయ కేంద్రం (ఐ4సీ) ఈ తరహా నేరాలపై ఉక్కుపాదం మోపే విషయంలో నోడల్ ఏజెన్సీగా వ్యవహరించనుంది. కేంద్ర దర్యాప్తు సంస్థలకు పూర్తి సహాయ సహకారాలు అందించనుంది. కీలకమైన ఈ ఏజెన్సీకి ఈసారి నిధులను 84 శాతం పెంచారు. గతేడాది కేవలం రూ.86 కోట్లు ఇవ్వగా ఈసారి రూ.150.95 కోట్లు వెచ్చించనున్నారు. సైబర్ సెక్యూరిటీ ప్రాజెక్టులకు నిధులను 90 పెంచడమే గాక ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు సైబర్ దాడుల ముప్పు ఎదుర్కొన్నప్పుడు తక్షణం స్పందించి అప్రమత్తం చేసే హెచ్చరిక సంస్థ సెర్ట్–ఇన్‌కు కూడా నిధులు పెంచారు. మహిళలు, చిన్నారుల రక్షణకు.. మహిళలు, చిన్నారులు సైబర్ వలలో చిక్కుతున్న ఉదంతాలు పెరుగుతున్నందున వాటికి అడ్డుకట్ట వేయడంపైనా కేంద్రం దృష్టి సారించింది. అందుకోసం బడ్జెట్లో రూ.52.8 కోట్లు కేటాయించారు. డిజిటల్ వ్యక్తిగత సమాచార పరిరక్షణ చట్టం, 2023 కింద ఏర్పాటుచేసిన డాటా ప్రొటెక్షన్ బోర్డ్ ఆఫ్ ఇండియాకు జీతభత్యాలు తదితరాల కోసం రూ.2 కోట్లు కేటాయించారు. ఏఐకి ఐదేళ్లలో రూ.10 వేల కోట్లు కృత్రిమ మేధ రంగం అభివృద్ధి, విస్తరణ కోసం వచ్చే ఐదేళ్లలో రూ.10,300 కోట్లు ఖర్చుచేయాలని కేంద్రం నిర్ణయించింది. ఇందుకోసం గత మార్చిలో ప్రారంభించిన ఇండియా ఆరి్టఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్‌ను పరుగులు పెట్టించనున్నారు. ఇండియాఏఐ మిషన్‌కు ఈసారి రూ.551 కోట్లు కేటాయించడం ఇందులో భాగమే. మొత్తమ్మీద సైబర్ సెక్యూరిటీ, ఏఐ ఇన్నోవేషన్‌కు ఈ బడ్జెట్లో రూ.840 కోట్లు కేటాయించారు. గతేడాదితో పోలిస్తే ఇది 84 శాతం ఎక్కువ! ఇక ఏఐ, మెషీన్ లెరి్నంగ్పై విస్తృత పరిశోధనలు చేస్తున్న ఐఐటీ ఖరగ్‌పూర్‌లోని ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ విభాగానికి రూ.255 కోట్ల నిధులిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల వెల్లడించారు.ఫిర్యాదుల వరద... భారత్‌లో సైబర్ దాడుల ఉధృతి మామూలుగా లేదు. సొమ్ములు పోయాయంటూ జాతీయ సైబర్ దాడుల నమోదు పోర్టల్‌కు ప్రజలు, సంస్థల నుంచి రోజూ అందుతున్న 7,000 పై చిలుకు ఫిర్యాదుల్లో ఏకంగా 85 శాతం ఆన్లైన్ మోసాలే! మన దేశంలో ఆన్లైన్ మోసాలకు సంబంధించిన ఫిర్యాదులు 2019లో కేవలం 26 వేలు కాగా 2021లో 4.5 లక్షలకు, 2023 నాటికి ఏకంగా 15.5 లక్షలకు పెరిగాయి. ఇక ఈ ఏడాది మే నాటికే 7.4 లక్షల ఫిర్యాదులు నమోదయ్యాయి! 2023లో భారత్‌లో ప్రతి 129 మందిలో ఒకరు సైబర్ దాడుల బారిన పడ్డట్టు మనోహర్ పారికర్ ఇన్స్టిట్యూట్ ఫర్ డిఫెన్స్ స్టడీస్, అనాలిసిస్ గణాంకాల్లో వెల్లడైంది. ఢిల్లీలో అత్యధికంగా ప్రతి లక్ష మందిలో 755 మంది సైబర్ బాధితులున్నారు. ఈ జాబితాలో హరియాణా (381) తర్వాత తెలంగాణ (261) మూడో స్థానంలో ఉంది.మన కంపెనీలే లక్ష్యం కొన్నేళ్లుగా భారత కంపెనీలే లక్ష్యంగా సైబర్ దొంగలు రెచి్చపోతున్నారు. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో ఈ ఏడాది రెండో త్రైమాసికంలో సైబర్ నేరగాళ్లకు భారతీయ కంపెనీలే రెండో అతిపెద్ద లక్ష్యంగా మారాయి. నకిలీ ట్రేడింగ్ యాప్‌లు, రుణ, గేమింగ్, డేటింగ్ యాప్‌లతో పాటు ఆన్లైన్లో పదేపదే చూసే, వెదికే కంటెంట్‌ను ఎవరగా వేస్తూ మెల్లిగా ముగ్గులోకి దింపి ఖాతాల్లో ఉన్నదంతా ఊడ్చేసే ఘటనలు భారత్‌లో ఎక్కువైనట్టు పారికర్ సంస్థ హెచ్చరించింది. సైబర్ సెక్యూరిటీకి అందరికంటే ఎక్కువగా అమెరికా ఈ ఏడాది రూ.1.08 లక్షల కోట్లు వెచి్చస్తోంది. బ్రిటన్ రూ.7,891 కోట్లు కేటాయిస్తోంది.– సాక్షి, నేషనల్ డెస్క్ -
రిటైల్ డిజిటల్ చెల్లింపులు: 2030 నాటికి రూ.584 లక్షల కోట్లు!
భారతదేశంలో డిజిటల్ ట్రాన్సక్షన్స్ వేగంగా సాగుతోంది. ఇదిలాగే కొనసాగితే 2030 నాటికి డిజిటల్ రిటైల్ చెల్లింపులు ఏకంగా 7 ట్రిలియన్ డాలర్లు లేదా రూ. 584.6 లక్షల కోట్లకు చేరుకునే అవకాశం ఉందని.. 'హౌ అర్బన్ ఇండియా పేస్' నివేదికలో వెల్లడించింది.డిజిటల్ పెరుగుదలకు ప్రధాన కారణం ఈ కామర్స్ రంగం అని తెలుస్తోంది. 2022లో ప్రపంచంలోని మొత్తం డిజిటల్ లావాదేవీల వాల్యూమ్లలో భారతదేశం 46 శాతం వాటాను కలిగి ఉందని నివేదిక పేర్కొంది. కార్డ్‌లు, డిజిటల్ వాలెట్లు డిజిటల్ లావాదేవీ విలువలో 10 శాతం మాత్రమే.దేశంలోని 120 ప్రధాన నగరాల్లోని 6000 మంది ఆన్లైన్ సర్వేలో 90 శాతం మంది ఆన్లైన్ కొనుగోళ్లు చేయడానికి డిజిటల్ చెల్లింపులను ఇష్టపడుతున్నారు. సంపన్న కస్టమర్లు తమ లావాదేవీలలో 80 శాతం వరకు డిజిటల్ చెల్లింపులను ఉపయోగిస్తున్నారు. మిలినీయర్లలో 72 శాతం మంది డిజిటల్ లావాదేవీలను ఇష్టపడుతున్నారని తెలుస్తోంది.సుమారు 1000 మంది భారతీయ వ్యాపారుల లావాదేవీల వాల్యూమ్లలో 69 శాతం డిజిటల్ చెల్లింపు విధానాలు ఉన్నాయి. పాన్ షాపులు, పండ్లు, పూల విక్రయదారులు, ఫుడ్ స్టాల్స్, కిరానా దుకాణాలు వంటి వీధి వ్యాపారులు కూడా డిజిటల్ పేమెంట్స్ మీద ఆసక్తి చూపుతున్నారు. ఇలా మొత్తం మీద రాబోయే రోజుల్లో డిజిటల్ లావాదేవీలు భారీగా పెరుగుతాయని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. -
యూఏఈలోనూ యూపీఐ చెల్లింపులు!
దేశంలో డిజిటల్ చెల్లింపులకు కీలకంగా ఉన్న యూపీఐ సేవలను యూఏఈకి విస్తరిస్తున్నట్లు నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్పీసీఐ) తెలిపింది. యూఏఈలో నివసిస్తున్న భారతీయులు, ప్రయాణికులకు ఈ సేవలు ఎంతో ఉపయోగపడుతాయని ఎన్పీసీఐ పేర్కొంది.ఈ సందర్భంగా ఎన్పీసీఐ ఇంటర్నేషనల్ సీఈఓ రితేష్ శుక్లా మాట్లాడుతూ..‘ప్రపంచ వ్యాప్తంగా డిజిటల్ చెల్లింపుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. ఎన్పీసీఐ ఇంటర్నేషనల్ పేమెంట్స్ లిమిటెడ్ మిడిల్ ఈస్ట్(మధ్యప్రాచ్య దేశాలు), ఆఫ్రికాలోని డిజిటల్ కామర్స్‌లో సేవలందిస్తున్న ‘నెట్వర్క్ ఇంటర్నేషనల్’తో భాగస్వామ్యం కలిగి ఉంది. కాబట్టి యూఏఈలో యూపీఐ సేవలందించే ప్రక్రియ సులువైంది. యూఏఈలోని భారతీయులు, ప్రయాణికులు, టూరిస్టులు పాయింట్-ఆఫ్-సేల్ (పీఓఎస్) టెర్మినల్స్‌లో క్యూఆర్ కోడ్ ద్వారా యూపీఐ చెల్లింపులు చేసుకోవచ్చు. 2024లో గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (జీసీసీ) దేశాలకు వెళ్లే భారతీయ పర్యాటకుల సంఖ్య 98 లక్షలుగా ఉంటుందని అంచనా. అందులో యూఏఈ ద్వారానే 52.9 లక్షల మంది రాకపోకలు జరిపే అవకాశం ఉంది. కాబట్టి వినియోగదారులకు ఈ సేవలు ప్రారంభించాం’ అని తెలిపారు.ఇదీ చదవండి: యాపిల్‌కు ఓపెన్ఏఐ బోర్డులో స్థానం..!ఎన్పీసీఐ ఇప్పటికే నేపాల్, శ్రీలంక, మారిషస్, సింగపూర్, ఫ్రాన్స్, భూటాన్లలో ఈ యూపీఐ సేవలను ఆమోదించింది. -
మరో బిజినెస్‌లోకి అదానీ గ్రూప్.. గూగుల్, అంబానీకి చెక్ పెట్టేనా?
ప్రముఖ డైవర్సిఫైడ్ దిగ్గజం అదానీ గ్రూప్ కీలక నిర్ణయం తీసుకుంది. మార్కెట్లో ఊహించని విధంగా వృద్ది సాధిస్తోన్న ఈ-కామర్స్,పేమెంట్స్ విభాగంలో అడుగుపెట్టనుంది. దీంతో అదే రంగంలో మార్కెట్‌ను శాసిస్తున్న టెక్ దిగ్గజం గూగుల్, మరో దిగ్గజ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీకి గట్టి పోటీ ఇవ్వనుందని ఫైనాన్షియల్ టైమ్స్ నివేదించింది.ఇప్పటికే అందుకు కావాల్సిన లైసెన్స్ కోసం అప్లయి చేసినట్లు సమాచారం. ఆ లైసెన్స్ యూపీఐ వంటి చెల్లింపులతో పాటు, కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్‌లను మార్కెట్లోకి విడుదల చేసేందుకు అదానీ గ్రూప్ ప్రతినిధులు పలు బ్యాంక్‌లతో ఒప్పందం కుదుర్చుకున్నారని, ఆ చర్చలు చివరి దశకు వచ్చాయని తెలుస్తోంది.జాతీయ మీడియా కథనాల ప్రకారం..తన సేవలు వినియోగదారులకు మరింత చేరువయ్యేలా అదానీ గ్రూప్ ప్రభుత్వ ఈ-కామర్స్ ఫ్లాట్ ఫాం ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ (ఓఎన్డీసీ) చర్చలు జరుపుతోంది.చర్చలు సఫలమైందే అదానీ గ్రూప్‌కు చెందిన అదానీ వన్ యాప్‌లో ఓఎన్డీసీ వినియోగదారులకు సేవలు అందుతాయి. ఓఎన్డీసీలో ఏదైనా కొనుగోలు చేసిన యూజర్లు అదానీ వన్ ద్వారా పలు ఆఫర్లు పొందవచ్చు. ఇప్పటికే ఈ యాప్ యూజర్లకు హోటల్, ఫ్లైట్ రిజర్వేషన్‌తో సహా ఇతర ట్రావెల్ సంబంధిత సేవల్ని వినియోగించడం ద్వారా ప్రత్యేక డిస్కౌంట్లు పొందవచ్చు -
క్యూ ఆర్ స్కాన్‌తో సాధారణ రైలు టికెట్లు
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): డిజిటల్ చెల్లింపులు, నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించే క్రమంలో విజయవాడ డివిజన్లో జనరల్ బుకింగ్ కౌంటర్ (అన్ రిజర్వ్డ్)లో క్యూఆర్ కోడ్ ప్రవేశపెట్టినట్లు సీనియర్ డీసీఎం వావిలపల్లి రాంబాబు తెలిపారు. డివిజన్లోని ప్రధాన రైల్వేస్టేషన్లైన విజయవాడ, ఏలూరు, తెనాలి, రాజమండ్రిలలో 19 జనరల్ బుకింగ్ కౌంటర్లలో ప్రయోగాత్మకంగా ఈ విధానం ప్రవేశపెట్టినట్లు తెలిపారు. కౌంటర్ వద్ద టికెట్ కొనుగోలు చేసే సమయంలో ప్రయాణం ఎక్కడ నుంచి ఎక్కడ వరకు, పిల్లలు/పెద్దల సంఖ్య, చార్జీలు వివరాలను బుకింగ్ క్లర్క్ నమోదు చేయగానే కౌంటర్ బయట ఏర్పాటు చేసిన స్క్రీన్‌లో ఆ వివరాలు కనిపిస్తాయి. ప్రయాణికులు వాటిని సరిచూసుకుని అక్కడ కనిపించే క్యూ ఆర్ కోడ్‌ను మొబైల్ ఫోన్లోని పేమెంట్ యాప్ ద్వారా స్కాన్ చేయడంతో టికెట్ జనరేట్ అవుతుందన్నారు. త్వరలోనే ఈ సౌకర్యాన్ని డివిజన్లోని అన్ని స్టేషన్లలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు సీనియర్ డీసీఎం తెలిపారు. -
ఓర్నీ..! ఆఖరికి భిక్ష కూడా డిజటల్ చెల్లింపుల్లోనే..!
ఇప్పుడూ టెక్నాలజీ ఫుణ్యమా! అని అందరూ డిజిటల్ లావాదేవీల ద్వారానే ఈజీగా చెల్లింపులు చేసేస్తున్నారు. బ్యాంకుల వద్దకు వెళ్లి.. బారులు తీరి ఉండాల్సిన పనిలేకుండా పోయింది. ఎలాంటి పని అయినా ఒక్కఫోన్పేతో చకచక అయిపోతుంది. ప్రతిదీ ప్రస్తుతం డిజిటల్ చెల్లిపులే, క్యూర్ కోడ్ స్కానింగ్‌లే. ఇప్పుడు ఆ డిజిటల్ చెల్లింపుల్లోనే బిచ్చగాళ్లు భిక్ష వేయడం వచ్చేసింది. ఓ బిచ్చగాడు ఫోన్ పే క్యూర్ కోడ్‌తో భిక్ష కోరుతూ ఆకర్షించాడు. ఈ ఘటన గౌహతిలో చోటు చేసుకుంది. ఇది చూస్తే నిజంగా టెక్నాలజీకి హద్దులు లేవంటే ఇదే కథ అనిపిస్తుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోని కాంగ్రెస్ నాయకుడు గౌరవ్ సోమాని సోషల్ మీడియా ఎక్స్‌లో పంచుకున్నారు. అందులో ఆ వ్యక్తి మెడలో క్యూర్ కోడ్‌తో ఉన్న ఫోన్‌పేని ధరించి భిక్ష కోరుతున్నట్లు కనిపిస్తుంది. ఒక కారులోని ఇద్దరు వ్యక్తులు అతడి క్యూర్ కోడ్‌ని స్కాన్ చేసి భిక్ష వేస్తున్నట్లు కనిపిస్తుంది. అతడు తన ఫోన్‌ని చెవి దగ్గర పెట్టకుని తన ఖాతాలో డబ్బులు జమ అవ్వుతున్న సమాచారం వింటున్నట్లు వీడియోలో కనిపిస్తుంది. ఈ మేరకు కాంగ్రెస్ నాయకుడు సోషల్ మీడియా ఎక్స్ పోస్ట్‌లో దీన్ని మానవత్వంలో డిజిటల్ పురోగతిగా అభివర్ణించాడు. ఇది 'ఆలోచనను రేకెత్తించే క్షణం' అనే క్యాప్షన్‌తో వీడియోని ఎక్స్‌లో షేర్ చేయడంతో నెట్టింట వైరల్‌గా మారింది. అయితే ఇలా ఒక బిచ్చగాడు డిజిటల్ చెల్లింపులను ఉపయోగించడం ఇదే తొలిసారి కాదు. ఇంతకుమునుపు బిహార్‌లో ఒక డిజటల్ బిచ్చగాడు ఇలానే మెడలో క్యూఆర్ కోడ్ ప్లకార్డ్‌తో చెల్లింపులు జరిపేలా ప్రజలకు ఆప్షన్ ఇవ్వడం కనిపించింది. అతనను ప్రధాని నరేంద్ర మోదీ 'మన్ కీ బాత్' రేడియో కార్యక్రమంలో దీన్ని గురించి వినడం ఎప్పటికీ మర్చిపోనని ఆ డిజిటల్ బిచ్చగాడు చెప్పుకొచ్చాడు కూడా. అలాగే న్యూఢిల్లీలో అయేషా శర్మ అనే 29 ఏళ్ల ట్రాన్స్విమన్ కూడా యూపీఐ పేమెంట్ యాప్‌ల ద్వారా డబ్బులను స్వీకరిస్తుంది. Stumbled upon a remarkable scene in bustling #Guwahati – a beggar seamlessly integrating digital transactions into his plea for help, using PhonePe! Technology truly knows no bounds. It's a testament to the power of technology to transcend barriers, even those of socio-economic… pic.twitter.com/7s5h5zFM5i — Gauravv Somani (@somanigaurav) March 24, 2024 (చదవండి: ఆవుని ఆస్పత్రికి తరలించడం కోసం ఏకంగా హెలికాప్టర్..!) -
యూపీఐ పేమెంట్స్ ఏ దేశాల్లో చేయొచ్చో తెలుసా..
డిజిటల్ చెల్లింపులు వచ్చిన తరువాత భారతదేశంలో చిన్న కిరాణా షాపు దగ్గర నుంచి పెద్ద షాపింగ్ మాల్స్ వరకు చేతిలో డబ్బు ఉంచుకోవాల్సిన అవసరమే లేకుండా పోయింది. గత కొన్ని రోజుల ముందు వరకు యూపీఐ పేమెంట్స్ కేవలం దేశానికి మాత్రమే పరిమితమై ఉండేవి. కాగా మారుతున్న కాలంలో పెరుగుతున్న టెక్నాలజీని దృష్టిలో ఉంచుకుని యూపీఐ పేమెంట్స్ విదేశాలకు కూడా వ్యాపించాయి. ప్రస్తుతం యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ ఫేస్ (UPI) అనేది విదేశాల్లో కూడా చెల్లుబాటు అవుతుండటంతో ఆయా దేశాల కరెన్సీలతోనే చెల్లింపులు జరుగుతున్నాయి. కాబట్టి విదేశాలకు వెళ్లేవారు ప్రత్యేకించి ఆ దేశ కరెన్సీని తమతో పాటు తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం యూపీఐ చెల్లింపులు భారతదేశంలో మాత్రమే కాకుండా.. సమీప దేశమైన శ్రీలంక, భూటాన్, మారిషస్, ఫ్రాన్స్, యూఏఈ, సింగపూర్, నేపాల్ దేశాల్లో కూడా డిజిటల్ చెల్లింపులు చేయవచ్చు. శ్రీలంకలో పర్యటించే భారతీయులు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి యూపీఐ పేమెంట్స్ చేయొచ్చు. మారిషస్ దేశంలో కూడా ఇండియన్స్ డిజిటల్ చెల్లింపులకు అనుమతి ఉంది. మారిషస్ వాసులకు కూడా మన దేశంలో ఆ సదుపాయం కల్పించారు, కాబట్టి వారు కూడా మనదేశంలో డిజిటల్ చెల్లింపులు చేసుకోవచ్చు. ఇండియాలో కాకుండా మొదటిసారి యూపీఐ సేవలను అనుమతించిన దేశం భూటాన్. 2012 జులై 13న ఆ దేశంలో యూపీఐ సేవలు అందుబాటులోకి వచ్చాయి. దీని కోసం భీమ్ యాప్ & భూటాన్ రాయల్ మానిటరీ అథారిటీ భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకున్నాయి. భారతదేశ మూడవ అతిపెద్ద వాణిజ్య భాగస్వామి UAE, యూఏఈలోని ప్రధాన బ్యాంకు మష్రెక్‌తో కలిసి కొద్ది రోజుల క్రితం దేశంలో UPI చెల్లింపులను స్వీకరించడానికి సంబంధించి భారత ప్రభుత్వంతో భాగస్వామ్యాన్ని ప్రకటించింది. ఫ్రాన్స్ లైరా నెట్‌వర్క్‌తో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇటీవలే భాగస్వామ్య కుదుర్చుకున్నాయి. ఫోన్‌పే డేటాబేస్ ప్రకారం యూపీఐ చెల్లింపులకు మద్దతు ఇచ్చే బ్యాంకుల జాబితా.. బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర కెనరా బ్యాంక్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సిటీ యూనియన్ బ్యాంక్ లిమిటెడ్ ESAF స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లిమిటెడ్ ఫెడరల్ బ్యాంక్ లిమిటెడ్ ఇండియన్ బ్యాంక్ ఇండస్ఇండ్ బ్యాంక్ లిమిటెడ్ కరూర్ వైశ్యా బ్యాంక్ లిమిటెడ్ పంజాబ్ & సింధ్ బ్యాంక్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ సౌత్ ఇండియన్ బ్యాంక్ లిమిటెడ్ కాస్మోస్ బ్యాంక్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇదీ చదవండి: 20 ఏళ్లకే క్యాన్సర్.. 33 ఏళ్లకు రూ.420 కోట్లు - ఎవరీ కనికా టేక్రీవాల్.. -
రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. చిల్లర కష్టాలకు చెక్
సాక్షి, హైదరాబాద్: రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్‌న్యూస్ చెప్పింది. ప్రయాణికుల బాధను అర్థం చేసుకుని రైల్వేస్టేషన్లలో టికెట్ కౌంటర్ల వద్ద చిల్లర ఇచ్చే విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. వివరాల ప్రకారం.. ప్రయాణికులు సౌకర్యార్థం దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. టికెట్ కౌంటర్ల వద్ద డిజిటల్ పేమెంట్స్‌కు సౌకర్యం కల్పించనుంది. దీంతో, ప్రయాణికుల చిల్లర కష్టాలకు రైల్వే శాఖ చెక్ పెట్టినట్టు అయ్యింది. ఇక, దక్షిణ మధ్య రైల్వే నిర్ణయంపై ప్రయాణీకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.