నిర్వహణ భారం తగ్గించుకోవడానికి క్రమంగా ఎత్తేస్తున్న బ్యాంకులు
గతేడాది మార్చిలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఏటీఎంలు 9,660
ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి ఉన్నవి 9,205 మాత్రమే
మరో ఏడాదిలో కనీసం 10 శాతం తగ్గించేలా కార్యాచరణ
సాక్షి, హైదరాబాద్: నిర్వహణ భారాన్ని తగ్గించుకొనే క్రమంలో ఏటీఎంల సంఖ్యను మరింతగా తగ్గించుకోవాలని రాష్ట్రంలోని బ్యాంకులు నిర్ణయించాయి. ఏడాది కాలంలో 5 శాతం ఏటీఎంలను తొలగించిన బ్యాంకులు... వచ్చే ఏడాదిలో మరో 10 శాతం వరకు ఏటీఎంలను తగ్గించుకోనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 50 బ్యాంకులకు సంబంధించి ప్రస్తుతం 9,205 ఏటీఎంలు పనిచేస్తున్నాయి. గతేడాది మార్చి నాటికి 9,660 ఏటీఎంలుండగా ఈ ఏడాది సెపె్టంబర్ నాటికి 455 ఏటీఎంలను బ్యాంకులు ఎత్తేసినట్లు రాష్ట్రస్థాయి బ్యాంకుల సమితి గణాంకాలు చెబుతున్నాయి.
డిజిటల్ లావాదేవీలతో..: ఒక్కో ఏటీఎంపై నెలకు సగటున రూ. 2.5 లక్షల వరకు ప్రాథమికంగా ఖర్చు పెట్టాల్సి వస్తోందని బ్యాంకులు చెబుతున్నాయి. ప్రతి 8 గంటలకు ఒక సెక్యూరిటీ గార్డు చొప్పున ముగ్గురు గార్డుల జీతాలు, ఏటీఎంను ఉంచే షాప్/షట్టర్ అద్దె, విద్యుత్ బిల్లుతోపాటు సాంకేతిక నిర్వహణ ఖర్చులు ఉంటున్నాయని వివరిస్తున్నాయి. అయితే ప్రస్తుతం డిజిటల్ చెల్లింపులు భారీగా జరుగుతుండటం వల్ల ఏటీఎంల నుంచి నగదు ఉపసంహరణ తగ్గుతున్నట్లు బ్యాంకుల గణాంకాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో క్యాష్ విత్‌డ్రాయల్స్ తక్కువగా ఉన్న ఏటీఎంలను బ్యాంకులు ఎత్తేస్తున్నాయి. ఇకపై కేవలం బ్రాంచి పరిధిలోనే వాటిని పరిమితం చేసేలా బ్యాంకులు ప్రణాళికను అమలు చేయనున్నట్లు సమాచారం. వచ్చే రెండేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా ఏటీఎంల సంఖ్య 6 వేలకు పడిపోనుందని సమాచారం.
పీఓఎస్‌ల జోరు...
ఏటీఎంల సంఖ్యను ప్రాధాన్యత క్రమంలో తగ్గించాలని భావిస్తున్న బ్యాంకులు.. పాయింట్ ఆఫ్ సేల్ (పీఓఎస్) మెషిన్ల వాడకాన్ని మాత్రం ప్రోత్సహిస్తున్నాయి. వాటి ద్వారా బ్యాంకులకు అదనపు రాబడి ఉండటమే ప్రధాన కారణం. గతేడాది మార్చిలో రాష్ట్రవ్యాప్తంగా 2,09,116 పీఓఎస్ మెషిన్లు ఉండగా... ప్రస్తుతం వాటి సంఖ్య 2,74,602కు చేరింది. భవిష్యత్తులో వాటి సంఖ్యను మరింత పెంచేందుకు బ్యాంకులు చర్యలు చేపట్టాయి.
Comments
Please login to add a commentAdd a comment