
సాక్షి, హైదరాబాద్: నగరంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి ఐదు కుక్క పిల్లలను గోడకేసి కొట్టి చంపేసిన ఘటన దిగ్భ్రాంతికి గురిచేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా, సైకోగా మారిన ఆ వ్యక్తిని నెటిజన్లు తిట్టి పోస్తున్నారు.
అసలు ఏం జరిగిందంటే.. ఫతేనగర్‌లో ఇండిస్ అపార్టుమెంట్ దగ్గర ఓ వీధి కుక్క ఐదు పిల్లలకు జన్మనిచ్చింది. అక్కడే ఉన్న అపార్ట్‌మెంట్ సెల్లార్‌లో ఆ కుక్క పిల్లలు ఉంటున్నాయి. అదే అపార్ట్‌మెంట్‌లో నివశించే అశీష్ అనే వ్యక్తి తన పెంపుడు కుక్కతో రోజూ బయటకు వెళ్లే క్రమంలో ఆ కుక్కపిల్లలు దగ్గరకు వచ్చేవి. దీంతో ఓ కుక్క పిల్లను గోడకేసి బలంగా కొట్టగా.. అది రక్తం కక్కుకుని కింద పడిపోయింది. బతికిందో లేదో తెలుసుకోవడానికి మరోసారి గట్టిగా కొట్టాడు.. ఇలా మొత్తం ఐదు కుక్క పిల్లలను దారుణంగా చంపేశాడు.
కుక్క పిల్లలు చనిపోయి ఉండడంతో అనుమానం వచ్చిన అపార్ట్‌మెంట్ వాసులు.. ఈ క్రమంలో అక్కడున్న సీసీటీవీ కెమెరాలను పరిశీలించగా, అదే అపార్ట్‌మెంట్‌లో ఉన్న వ్యాపారి ఆశిష్ ఈ దారుణానికి పాల్పడినట్లు తేలింది. ఖాన్ అనే వ్యక్తి ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. జంతువులపై ఇంత కిరాతకంగా వ్యహరించిన వ్యక్తిని జైలుకు పంపించాలని కోరాడు.
ఆశిష్‌ను అపార్ట్‌మెంట్ వాసులు ప్రశ్నించగా.. ఆ కుక్క పిల్లలు తన పెంపుడు కుక్క దగ్గరకు వచ్చాయని.. అందుకే చంపేశానంటూ సమాధానమిచ్చాడు. ఈ ఘటనపై అల్వాల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నగరంలో సైకోలు పెరిగిపోతున్నారని.. జంతు ప్రేమికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వీటిని అరికట్టడానికి కఠినమైన శిక్షలు విధించాలని కోరుతున్నారు.
*VB City Community – Urgent Alert!*
The safety of our community, especially our children, is at serious risk.A disturbing incident has come to light—an individual was caught on video brutally attacking puppies just 5 to 6 days old. This act of cruelty is not only heartbreaking pic.twitter.com/hedp136Mrt— Khan (@khanbr1983) April 17, 2025