
హైదరాబాద్, క్రైమ్: ప్రముఖ యూట్యూబర్ ‘నా అన్వేషణ’ అన్వేష్ (Na Anvesh)పై సైబరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. తెలంగాణ డీజీపీతో పాటు పలువురు ప్రముఖులపై తప్పుడు వ్యాఖ్యలు చేశాడనే అభియోగం అతనిపై నమోదు అయినట్లు సమాచారం.
ప్రపంచ దేశాలన్నీ చుట్టేస్తూ.. తెగ ఎంజాయ్ చేసేస్తూ.. ఆ వీడియోలను అప్‌లోడ్ చేస్తూ పాపులారిటీతో పాటు డబ్బూలు సంపాదించుకుంటున్నాడు అన్వేష్. అయితే.. తాజాగా బెట్టింగ్ యాప్‌ల ప్రచారం పేరుతో.. తెలంగాణ డీజీపీ జితేందర్, మెట్రో ఎండీ ఎన్వీఎస్‌రెడ్డి, ఐఏఎస్ అధికారులు శాంతికుమారి, దాన కిశోర్, వికాస్‌రాజు తదితరులు రూ.300 కోట్లు కొట్టేశారంటూ ఓ వీడియో ద్వారా అతను వ్యాఖ్యలు చేశారట. అయితే అన్వేష్ అవాస్తవ, తప్పుడు సమాచారం ప్రచారం చేశారంటూ పోలీసులు సుమోటో(Suo moto)గా ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.

ప్రజల్లో గందరగోళం సృష్టించాలనే ఉద్దేశంతో ప్రభుత్వ అధికారులు, చట్టబద్ధమైన సంస్థల ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు.. పరువుకు భంగం కలిగించేలా వీడియో ఉంది. అధికారుల విశ్వసనీయతను దెబ్బతీసేలా.. ప్రభుత్వం మీద వ్యతిరేకత, ద్వేషాన్ని కలిగించేలా ఆ వీడియో ఉంది. తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసేలా వీడియో చేసిన కంటెంట్ క్రియేటర్ అన్వేష్ మీద చర్యలు తీసుకోవాలి అని సైబర్‌క్రైమ్ ఠాణా కానిస్టేబుల్ ఫిర్యాదు చేశారు. దీంతో సైబర్ పోలీసులు అన్వేష్‌పై కేసు నమోదు చేశారు. దీనిపై అన్వేష్ ఎలా స్పందిస్తాడో చూడాలి.