
ఆమె భర్త దారుణ హత్య
స్నేహితులతో కలిసి యువకుడి ఘాతుకం
కూకట్‌పల్లి(హైదరాబాద్): తాను ఇష్టపడిన యువతి మరో వ్యక్తిని పెళ్లి చేసుకోవడాన్ని జీర్ణించుకోలేని ఓ యువకుడు తన స్నేహితులతో కలిసి ఆమె భర్తను దారుణంగా హత్య చేసిన సంఘటన కేపీహెచ్‌బీ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. తూర్పు గోదావరి జిల్లా, అడవిపూడి గ్రామానికి చెందిన జగదీష్ అతడి సోదరుడు దుర్గా ప్రసాద్ కేపీహెచ్‌బీ కాలనీలోని సర్ధార్ పటేల్ నగర్‌లో నివాసం ఉంటున్నారు. వీరి సమీప బంధువు కాళ్ల వెంకటరమణ భగత్ సింగ్ నగర్‌లో ఉంటూ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. దుర్గా ప్రసాద్ భార్య, వెంకట రమణ భార్య అక్కా చెల్లెళ్లు కావటంతో మూడు కుటుంబాల మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి.
ఈ నేపథ్యంలో వెంకట రమణ తరచూ దుర్గా ప్రసాద్, జగదీష్ ల వద్దకు వచ్చి వెళుతుండేవాడు. కాగా అదే గ్రామానికి చెందిన పవన్ ఎనిమిదేళ్ల క్రితం వెంకట రమణ భార్య శ్రావణి సంధ్యను వివాహం చేసుకునేందుకు ప్రయత్నించగా అతడి ప్రవర్తన సరిగా లేకపోవడంతో ఆమె తల్లిదండ్రులు అందుకు అంగీకరించలేదు. ఆ తర్వాత కొన్నాళ్లకే ఆమెకు కాళ్ల వెంకటరమణతో వివాహం జరిపించారు. తనకు దక్కని శ్రావణి సంధ్య మరొకరిని పెళ్లి చేసుకోవడం జీర్ణించుకోలేని పవన్ అప్పటి నుంచి వారిపై కక్ష పెంచుకున్నాడు. పథకం ప్రకారం నగరానికి మకాం మార్చిన పవన్ కూడా కూకట్‌పల్లి ప్రాంతంలోనే ఉంటూ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు.
శ్రావణి సంధ్యను వివాహం చేసుకున్న వెంకటరమణపై కక్ష పెంచుకున్న పవన్ అతడిని హత్య చేసేందుకు అతడి కదలికలపై నిఘా ఏర్పాటు చేశాడు. వెంకటరమణ తరచూ జగదీష్ ఇంటికి వస్తున్నట్లు గుర్తించిన పవన్ అదను కోసం ఎదురు చూస్తున్నాడు. కొన్నాళ్ల క్రితం దీనిని పసిగట్టిన జగదీష్ తన ఇంటి ఎదుట నిలుచుని ఉన్న పవన్‌ను గుర్తించి ఇక్కడ ఎందుకు ఉన్నావని నిలదీయగా తన స్నేహితుల కోసం ఎదురు చూస్తున్నట్లు చెప్పాడు. వారం రోజుల క్రితం శ్రావణి సంధ్య, ఆమె సోదరి ఉమా మహేశ్వరితో కలిసి స్వగ్రామంలో పెళ్లికి వెళ్లింది. ఆదివారం రాత్రి వెంకటరమణ జగదీష్ ఇంటికి వచ్చినట్లు సమాచారం అందడంతో పవన్ తన స్నేహితులు మరో నలుగురితో కలిసి అక్కడికి వచ్చి మాటు వేశాడు.
జగదీష్ ఇంటి గేటు స్కూటీని అడ్డు పెట్టి స్నేహితులతో కలిసి సిగరెట్ తాగుతూ ఉండటాన్ని గుర్తించిన జగదీష్ అతడిని నిలదీయడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. పవన్ జగదీష్‌తో గొడవపడుతుండటాన్ని గుర్తించిన వెంకట రమణ బయటికి వచ్చి అతడిని అడ్డుకునే ప్రయత్నం చేయగా పవన్ కత్తితో వెంకటరమణ చాతిలో పొడిచాడు. తీవ్రంగా గాయపడిన వెంకటరమణ అక్కడికక్కడే కుప్పకూలడంతో పవన్, అతడి స్నేహితులు అక్కడి నుంచి పరారయ్యారు.
అదే అపార్ట్‌మెంట్‌లో ఉంటున్న డాక్టర్ సంజన సంఘటనా స్థలానికి చేరుకుని అతడిని పరీక్షించగా వెంకటరమణ అప్పటికే మృతి చెందాడు. జగదీష్ ఫిర్యాదు మేరకు కేపీహెచ్‌బీ ఇన్‌స్పెక్టర్ రాజశేఖర్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల్లో నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ప్రధాన నిందితుడు పవన్
పరారీలో ఉన్నట్లు తెలిసింది.