హైదరాబాద్: భార్యా భర్తల వివాదంలో జోక్యం చేసుకున్న పోలీసులు భర్తను చితకబాదిన సంఘటన కేపీహెచ్‌బీ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితుడి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. గుంటూరు జిల్లాకు చెందిన మొవ్వా ప్రణీత్ నగరంలోని ఓ బ్యాంక్‌లో మేనేజర్‌గా పని చేస్తున్నాడు. అతడికి అదే జిల్లాకు చెందిన శ్రీలక్ష్మీతో 2018లో వివాహం జరిగింది. భార్యాభర్తల మధ్య విభేదాలు తలెత్తడంతో శ్రీలక్ష్మీ భర్తపై గుంటూరులోని దిశ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. అప్పటి నుంచి వారు విడిగా ఉంటున్నారు. అయితే తన సర్టిఫికెట్లు భర్తవద్దే ఉండటంతో తనకు న్యాయం చేయాలని కోరుతూ శ్రీలక్ష్మి ఇటీవల నల్లపాడు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.
కేసు విచారణలో ఉండగా తిరిగి కేసు నమోదు చేయలేమని అక్కడి పోలీసులు ఫిర్యాదును స్వీకరించలేదు. దీంతో ఆమె తన భర్త నిజాంపేట రోడ్డులో నివాసం ఉండటంతో కేపీహెచ్‌బీ పోలీసులను ఆశ్రయించింది. విచారణ నిమిత్తం పోలీసులు ప్రణీత్‌ను స్టేషన్‌కు పిలిపించారు. తనపై అప్పటికే కేసు నమోదైందని విచారణ కొనసాగుతున్నట్లు ప్రణీత్ పోలీసుల దృష్టికి తీసుకువచ్చాడు. శనివారం మరోసారి పీఎస్‌కు పిలిపించిన పోలీసులు శ్రీలక్ష్మీ సర్టిఫికెట్లు ఇవ్వాలని ఒత్తిడి చేయడమేగాక తనను దుర్భాషలాడుతూ విచక్షణారహితంగా మోకాళ్లు, పాదాలపై చితకబాదినట్లు బాధితుడు ఆరోపిస్తున్నాడు.
తన భార్య సమక్షంలోనే తనను నడిపిస్తూ మరోసారి కోటింగ్ ఇవ్వా లా అని ఆమెను అడిగినట్లు తెలిపాడు. నగరంలో ని ఓ ఏసీపీ సూచనమేరకే పోలీసులు తనపై దాడి చేశారని ఆవేదన వ్యక్తం చేశాడు. తనపై దాడికి పాల్పడిన ఎస్‌ఐ, కానిస్టేబుళ్లపై చర్యలు తీసుకోవాలని కోరుతూ అతను సోషల్ మీడియా ద్వారా సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై స్పందించిన సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి ఈ ఘటనపై విచారణ చేపట్టి నివేదిక అందజేయాలని ఉన్నతాధికారులను ఆదేశించారు.
మియాపూర్ ఎస్‌ఐ గిరీష్ కుమార్ సస్పెన్షన్
మియాపూర్: కేసు విషయంలో పోలీస్ స్టేషన్‌కు వచ్చిన మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించిన మియాపూర్ ఎస్‌ఐ గిరీష్ కుమార్‌ను సస్పెండ్ చేస్తూ సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. వివరాల్లోకి వెళితే.. 2020 బ్యాచ్‌కు చెందిన గిరీష్ కుమార్, 2022 మార్చిలో మియాపూర్ పీఎస్‌లో ఎస్‌ఐగా బాధ్యతలు చేపట్టారు. ఆయన సెక్టార్ –2 బాధ్యతలను పర్యవేక్షిస్తున్న ఆయన ఓ కేసు విషయమై పోలీస్ స్టేషన్‌కు వచ్చిన మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించినట్లు సమాచారం . ఈ విషయమై బాధితురాలు సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతికి ఫిర్యాదు చేసింది. విచారణ చేపట్టిన సీపీ ఎస్‌ఐ గిరీష్ కుమార్‌ను సస్పెండ్ చేస్తూ మంగళవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment