ఆ సెక్షన్‌తో సీరియస్‌ యాక్షన్‌! | - | Sakshi
Sakshi News home page

ఆ సెక్షన్‌తో సీరియస్‌ యాక్షన్‌!

Apr 15 2024 6:50 AM | Updated on Apr 15 2024 7:28 AM

- - Sakshi

వెస్ట్‌జోన్‌లో ర్యాష్‌ డ్రైవింగ్‌లపై పీడీపీపీ చట్టం కింద కేసులు

ప్రమాదాల్లో కొన్నిసార్లు అమాయకులు బలి

సాక్షి, సిటీబ్యూరో/బంజారాహిల్స్‌: సంపన్నవర్గాలు ఉండే వెస్ట్‌జోన్‌ పరిధిలోని అనేక ప్రాంతాలు ర్యాష్‌ డ్రైవింగ్‌కు కేరాఫ్‌ అడ్రస్‌లు. ఖరీదైన కార్లలో వచ్చే బడాబాబుల పిల్లల ర్యాష్‌ డ్రైవింగ్‌ కారణంగా రోడ్లు, బారికేడ్లు, డివైడర్లు ధ్వంసం కావడమూ సర్వసాధారణం. కొన్ని సందర్భాల్లో అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ ధోరణికి చెక్‌ చెప్పడానికి ఈ తరహా కేసుల్లో ఇండియన్‌ పీనల్‌ కోడ్‌(ఐపీసీ)తోపాటు ప్రజా ఆస్తుల విధ్వంసాల నిరోధక (పీడీపీపీ) చట్టంలోని సెక్షన్లనూ జోడించాలని పోలీసులు నిర్ణయించారు.

ఈ రెండు ఉదంతాల్లో వర్తింపు...
ఫిల్మ్‌నగర్‌, బంజారాహిల్స్‌ పోలీసుస్టేషన్ల పరిధిలో శనివారంరాత్రి, ఆదివారం తెల్లవారుజామున జరిగిన ప్రమాదాల కేసుల్లో పోలీ సులు పీడీపీపీ యాక్ట్‌ జోడించారు. జూబ్లీహిల్స్‌ రోడ్డు నెం.92లో వెర్నా కారు(ఏపీ 29 బీయూ 5078) డివైడర్‌ను ఢీకొట్టింది. కారు ముందు భాగం నుజ్జునుజ్జు అయింది. ఎయిర్‌ బ్యాగ్స్‌ తెరుచుకోవడంతో అందులోని ముగ్గురు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. హోంగార్డు లింగం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కారు నడుపు తున్న వ్యక్తిపై ఐపీసీలోని సెక్షన్‌ 279తోపాటు పీడీపీపీ యాక్ట్‌లోని సెక్షన్‌ 3 కింద కేసులు పెట్టారు. బంజారాహిల్స్‌ రోడ్‌ నెం.10లో ఆదివారం తెల్లవారుజామున 1.30 గంటల ప్రాంతంలో బెంజ్‌ కారు (ఏపీ10 ఆర్‌ 0055) అదుపు తప్పి కరెంటు స్తంభాన్ని ఢీకొట్టింది. దీంతో స్తంభం కుప్పకూలిపోగా వైర్లు తెగిపడి కేబుళ్లు ధ్వంసమయ్యాయి. కారు డ్రైవర్‌ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. విద్యుత్‌ శాఖ ఏడీఈ పి.వేణుమాధవ్‌ ఫిర్యా దు మేరకు కారు నడిపిన వ్యక్తిపై ఐపీసీ సెక్షనన్‌ 279, 336లతోపాటు పీడీపీపీ యాక్ట్‌లోని సెక్షన్‌ 3 కిందా కేసు నమోదు చేశారు.

పూర్వాపరాలు పరిశీలించి..
ఇప్పటివరకు ఈ తరహా యాక్సిడెంట్‌ కేసులను కేవలం నిర్లక్ష్యపు డ్రైవింగ్‌గా పరిగణిస్తూ ఐపీసీలోని 279, 336 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసేవారు. వీటిలో గరిష్టంగా ఆరు, మూడు నెలల జైలు శిక్షలతోపాటు నామమాత్రపు జరిమానా మాత్రమే ఉంది. అయితే పలు ప్రమాదాల్లో పెద్ద ఎత్తున ప్రజా ఆస్తులు దెబ్బతింటుండటంతో కారకులపై పీడీపీపీ యాక్ట్‌ సెక్షన్‌ 3 కింద కేసుల నమోదుకు పోలీసులు పూనుకున్నారు. ఈ సెక్షన్‌ ప్రకారం నిందితులు దోషులుగా తేలితే గరిష్టంగా ఐదేళ్ల జైలు శిక్ష పడుతుంది. అయితే ప్రతి ప్రమాదంలోనూ ఈ సెక్షన్‌ జోడించకుండా దాని పూర్వాపరాలు పరిశీలించిన తర్వాత నిర్ణయం తీసుకోనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement