Hyderabad News
-
లబ్ధిదారులకు సబ్సిడీ త్వరగా అందించాలి: కలెక్టర్
సాక్షి, సిటీబ్యూరో: జిల్లాలో ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకు వివిధ శాఖల ద్వారా అందించిన వాహనాలకు సంబంధించిన సబ్సిడీని వెంటనే విడుదల చేయాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో టీజీ ప్రైడ్ స్కీమ్ కింద ట్రాన్స్‌పోర్టు, ప్యాసింజర్, గూడ్స్ వాహనాలకు సంబంధించిన సబ్సిడీపై శాఖల వారీగా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం నుండి సబ్సిడీ అందగానే వెంటనే లబ్ధిదారులకు చెల్లించాలని సూచించారు. యువత అభిరుచి మేరకు వివిధ పారిశ్రామిక రంగాల్లో శిక్షణ అందించి వారి ఆర్థిక బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. ఈ సమావేశంలో పరిశ్రమల శాఖ జీఎం పవన్ కుమార్, ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ రమేష్, డీటీడబ్ల్యూఓ కోటాజీ, ఎల్డీఎం సుబ్రహ్మణ్యం, ఐపిఓ హేమ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
మ్యూజియంలో భువనగిరి ఫోర్ట్‌పై ఫొటో ఎగ్జిబిషన్
చార్మినార్: వరల్డ్ హెరిటేజ్ వీక్ సందర్భంగా సాలార్జంగ్ మ్యూజియంలో భువనగిరి ఫోర్ట్‌పై మంగళవారం ప్రత్యేక ఫొటో ఎగ్జిబిషన్ ప్రారంభమైంది. సృష్టి ఫౌండేషన్, సాలార్జంగ్ మ్యూజియం సంయుక్తాధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ ఎగ్జిబిషన్‌ను ఇంటాక్ కన్వీనర్ అనురాధారెడ్డి, బీజేపీ సీనియర్ నాయకులు మీర్ ఫిరాసత్ అలీ బాక్రీ తదితరులు హాజరై ప్రారంభించారు. అనంతరం ఫోటో ఎగ్జిబిషన్‌ను తిలకించారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఘన్‌శ్యాం కుసుం, ఆర్బీ నాయక్, మురళీధరన్, రమేష్ కుమార్, సజ్జన్ సింగ్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
హెచ్‌యూజే సభ్యత్వ నమోదు ప్రారంభం
లక్డీకాపూల్: హైదరాబాద్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్ (టీడబ్ల్యూజేఎఫ్ అనుబంధం) సభ్యత్వ నమోదు కార్యక్రమం మంగళవారం రాష్ట్ర సచివాలయంలో ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు మామిడి సోమయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. హెచ్‌యూజే అధ్యక్షుడు బి.అరుణ్ కుమార్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో పెద్ద ఎత్తున జర్నలిస్టులు హెచ్‌యూజే సభ్యత్వం స్వీకరించారు. కార్యక్రమంలో టీడబ్ల్యూజేఎఫ్ ఉపాధ్యక్షుడు పిల్లి రాంచందర్, టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కార్యదర్శులు చంద్రశేఖర్, రాధిక, నాయకులు రాజశేఖర్. నవీన్, పద్మరాజు, నాగవాణి, ప్రశాంత్, విజయ తదితరులు పాల్గొన్నారు. -
చిన్నారుల్లో సృజనాత్మకత పెంపొందించాలి
ఇబ్రహీంపట్నం రూరల్: చిన్నారుల్లో సృజనాత్మకత, శాసీ్త్రయ ఆలోచన పెంచే దిశగా పని చేయాలని ప్రముఖ కవి, సినీ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ అభిప్రాయపడ్డారు. ఆదిబట్ల మున్సిపల్ పరిధిలోని భారత్ ఇంజనీరింగ్ కళాశాలలో మంగళవారం తెలంగాణ బాలోత్సవ కమిటీ ఆధ్వర్యంలో సుద్దాల అశోక్‌తేజ రాసిన ఘల్లుఘల్లు అనే పాటను ప్రముఖ రచయిత నందిని సిద్దారెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి సుద్దాల అశోక్‌తేజ మాట్లాడుతూ.. విష సంస్కృతి, సామ్రాజ్యవాద వినిమయ విలువల నేపథ్యంలో మానవీయ విలువలు కనుమరుగవుతున్నాయని అన్నారు. కులమత, మూఢత్వం పేరుతో దాడులు పెరుగుతున్నాయని తెలిపారు. చిన్నారుల ఆలోచనలను విషపూరితం చేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రముఖ రచయిత నందిని సిద్దారెడ్డి మాట్లాడుతూ.. బాలల్ని అభ్యుదయం దిశగా ప్రోత్సహించాలని అన్నారు. బాలోత్సవం కార్యదర్శి సోమన్న మాట్లాడుతూ.. నాలుగేళ్లుగా వందలాది మంది పాఠశాల విద్యార్థులతో వేలాది మంది బాలబాలికలతో ఉత్సవాలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. విద్యార్థుల్లో సైంటిపిక్ టెంపర్, సరికొత్త ఆలోచనల్ని పెంపొందించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో భారత్ విద్యాసంస్థల చైర్మన్ సీహెచ్ వేణుగోపాల్‌రెడ్డి, బాలోత్సవ కమిటీ బాధ్యుడు బుచ్చిరెడ్డి, జనవిజ్ఞాన వేదిక నాయకులు రమేష్, భాస్కర్, భూదేవి, శ్రీకాంత్, యశోకృష్ణ పాల్గొన్నారు. -
కళాకారులను గౌరవించడం మన బాధ్యత
రాయదుర్గం: కళాకారుల నైపుణ్యాన్ని గుర్తించి వారిని గౌరవించడం ఎంతైనా అవసరమని నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ పేర్కొన్నారు. హైదరాబాద్ నాలెడ్జి సిటీలోని ‘టీహబ్’ లో తెలంగాణ ఆర్టిస్ట్ అసోసియేషన్ (టీఏఏ) ఆధ్వర్యంలో వివిధ రంగాలకు చెందిన కళాకారులకు ఆయన అవార్డులు ప్రదానం చేశారు. అనంతరం మాట్లాడుతూ తెర వెనుక అన్ని రంగాలలో పనిచేసే కళాకారుల కష్టాన్ని గుర్తించి వారికి అవార్డులు అందించడం అభినందనీయమన్నారు. సినిమా, ఇతర రంగాలలో తెర వెనుక పనిచేసే వారికి ఎవరూ ఆశించిన స్థాయిలో గుర్తింపు రాదని, వారికి అవార్డులు అందించి ప్రోత్సహిస్తే మంచిదన్నారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు అనిల్‌కుమార్ యాదవ్, రాష్ట్ర ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్‌రంజన్, టీఎంఆర్ఈఐఎస్ అధ్యక్షుడు ఎండీ ఫాహీమ్ ఖురేషి, పద్మశ్రీ ఖాదర్ అలీబేగ్ వంటి ప్రముఖులు, తెలంగాణ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. కాగా ది టామ్ కర్టైన్స్ వ్యవస్థాపకుడు మాలా పాషా, ప్రోగ్రామింగ్ ఆర్ట్స్ కేటగిరిలో ఇక్బాల్ పట్ని, ఎంటర్ప్రెన్యూర్ సుధీర్ షా, ఫ్యాషన్ డిజైనర్ అస్మితా మార్వా తదితరులు అవార్డులు అందుకున్నారు. సీపీ ీసీవీ ఆనంద్ -
చిన్నారుల సమగ్ర వికాసానికి గ్రంథాలయాలు అవసరం
సాక్షి, సిటీబ్యూరో: చిన్నారుల్లో సృజనాత్మకతను, జ్ఞానాన్ని పెంచేందుకు గ్రంథాలయాలు ఎంతో దోహదం చేస్తాయని ‘బాలచెలిమి’ పత్రిక సంపాదకులు, చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ అకాడమీ చైర్మన్ మణికొండ వేదకుమార్ అన్నారు. 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా మంగళవారం ఆఫ్జల్‌గంజ్‌లోని రాష్ట్ర కేంద్రగ్రంథాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పిల్లలు ఆటలు, పఠనానికి దూరమవుతున్నారని, వారిలో పఠనాసక్తిని పెంపొందించేందుకు పిల్లల గ్రంథాలయాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేయవలసిన అవసరం ఉందన్నారు. ఇందుకోసం పౌరసమాజం ముందుకు రావాలని కోరారు. గ్రంథాలయాలు కేవలం చదువుకోవాడినికే కాదని, సమగ్ర వ్యక్తిత్వ వికాసానికి అవసరమని చెప్పారు. ఆక్స్ఫర్డ్ గ్రామర్ స్కూల్, చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ అకాడమీ, కేంద్ర గ్రంథాలయం సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో చిల్డ్రన్స్ ఫైన్ ఆర్ట్స్ డైరెక్టర్ అతికా అహ్మద్, మహిళా విశ్వవిద్యాలయం అధ్యాపకులు డాక్టర్ రోహిణి, రచయిత్రి కన్నెగంటి అనసూయ, కప్పర కిషోర్ తదితరులు పాల్గొన్నారు. -
సొంత ఖాతా వాడలేదు!
హైదరాబాద్సాక్షి, సిటీబ్యూరో: ఓఎల్ఎక్స్ యాప్‌లో ఉన్న ఐ ఫోన్లే పెట్టుబడిగా, కొంటాను–అమ్ముతానంటూ కథలు చెప్పి... తెలుగు రాష్ట్రాల్లోని 200 మంది నుంచి రూ.60 లక్షలు కాజేసిన బీటెక్ గ్రాడ్యుయేట్ మరిశర్ల బాలాజీ నాయుడు బాధితుల నుంచి డబ్బు వసూలుకు తనదైన పంథా అనుసరించాడు. ఎవరికంటికీ కనిపించకుండా ఇంత మందిని కొల్లగొట్టిన అతగాడు ఏ ఒక్క సందర్భంలోనూ తన బ్యాంక్ ఖాతానో, మనీమ్యూల్స్‌కు చెందినదో వాడలేదు. కేవలం ఏటీఎం, క్యాష్ డిపాజిట్ మెషిన్ కేంద్రాల వద్దకు వచ్చిన వినియోగదారులను దీనికోసం వాడుకున్నాడు. బాలాజీ విచారణలో ఈ విషయం గుర్తించిన పంజగుట్ట పోలీసులు అవాక్కయ్యారు. అసలు సమయంలో ఆ కేంద్రాల వద్దకు... సెకండ్ హ్యాండ్ ఐ ఫోన్లు విక్రయించడానికి ఓఎల్ఎక్స్లో పోస్టు చేసిన వారితో మాట్లాడి, తాను కొంటానంటూ డిలీట్ చేయించి... అవే వివరాలు తాను పోస్టు చేయడం ఇతడి నైజం అనే విషయం తెలిసిందే. వీటిని చూసి ఆకర్షితులైన వారితో బేరసారాల తర్వాత అసలు యజమానికి సంప్రదించే బాలాజీ ఆపై అసలు కథ ప్రారంభింస్తాడు. రకరకాల కారణాలు చెప్పి ఓ నిర్దిష్ట సమయంలో వాళ్లిద్దరూ ఓ ప్రాంతానికి వచ్చేలా చేసి వారితో ఫోన్ ద్వారా టచ్‌లో ఉంటాడు. సరిగ్గా అదే సమయానికి బాలాజీ సైతం తనకు సమీపంలో ఉన్న ఏటీఎం, క్యాష్ డిపాజిట్ మెషిన్ కేంద్రానికి చేరుకుంటాడు. అక్కడకు వచ్చే వినియోగదారులతో సాంకేతిక కారణాల నేపథ్యంలో తన ఏటీఎం కార్డు పని చేయట్లేదని చెప్తాడు. తనకు బంధువుల నుంచి డబ్బు రావాల్సి ఉందని, ఆ మొత్తాన్ని మీకు బదిలీ చేయిస్తానంటాడు. బాధితులకు ఫోన్ చేసి ఆ వినియోగదారుల నెంబర్ చెప్పి డబ్బు వారికి పంపేలా చేస్తాడు. ఆపై వారితోనే డ్రా చేయించి రూ.100 నుంచి రూ.500 వరకు వారికి ఇచ్చి మిగిలింది తీసుకుని ఉడాయిస్తాడు. సిమ్‌కార్డులు మాత్రం అతడి పేరుతోనే... ఈ కారణంగానే కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు అనేక మంది ఏటీఎం వినియోగదారులను అనుమానించి, వారిని ప్రశ్నించాల్సి వచ్చింది. బ్యాంకు ఖాతాల విషయంలో ఇన్ని జాగ్రత్తలు తీసుకునే బాలాజీ సిమ్‌కార్డుల్ని మాత్రం తన పేరుతోనే తీసుకునేవాడు. తిరుపతి చిరునామాతో ఉన్న ఆధార్ కార్డు వినియోగించి ఇవి పొందాడు. ఆ అడ్రస్‌కు తాను వెళ్లనని, పోలీసులు వెళ్లినా తన వివరాలు దొరకవనే అలా చేసినట్లు పోలీసుల ఎదుట అంగీకరించాడు. బాలాజీని సోమవారం అరెస్టు చేసిన పంజగుట్ట పోలీసులు కోర్టులో హాజరుపరిచి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. తదుపరి విచారణ నిమిత్తం న్యాయస్థానం అనుమతితో కస్టడీలోకి తీసుకోవడానికి సన్నాహాలు చేస్తున్నారు. మరోపక్క ఇతగాడిపై నగరంలోని వివిధ ఠాణాలతో పాటు తెలుగు రాష్ట్రాల్లో అనేక పోలీసుస్టేషన్లలో కేసులు నమోదై ఉన్నాయి. దీంతో బాలాజీ అరెస్టుపై ఆయా పోలీసులకు సమాచారం ఇవ్వాలని పంజగుట్ట పోలీసులు నిర్ణయించారు. మనీమ్యూల్స్ సహాయమూ తీసుకోలేదు ఏటీఎం వినియోగదారుల ద్వారా వసూళ్లు తనదైన పంథా అనుసరించిన ఎం.బాలాజీ ‘ఐ ఫోన్ల’ కేసులో జైలుకు వెళ్లింది ఇతగాడే కస్టడీకి తీసుకోవాలని పోలీసుల నిర్ణయం -
ఇళ్లు ఇవ్వాలంటూ మూసీ గుడిసె వాసుల వినతి
లక్డీకాపూల్: మూసీ నది సుందరీకరణ సరే..మా సంగతేంటంటూ శివాజీ బ్రిడ్జి, ఆఫ్జల్‌గంజ్ గుడిసెవాసులు ఆందోళన వ్యక్తం చేశారు. మూసీ ప్రక్షాళనతో గూడు కోల్పొతున్న ర్యాక్ పిక్కర్స్కు న్యాయం చేయాలని కోరుతూ ప్రజావాణిలో వినతి పత్రాన్ని అందించారు. మంగళవారం రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు డాక్టర్ జి, చిన్నారెడ్డి వద్ద మూసీ గుడిసెవాసులు తమ ఆవేదన వ్యక్తం చేశారు. గత 30 సంవత్సరాలకు పైగా మూసీనది ఒడ్డున శివాజి బ్రిడ్జి కింద గుడిసెలు వేసుకొని 150 కుటుంబాలు నివశిస్తున్నాయన్నారు. ప్రభుత్వ స్థలంలో గుడిసెలు వేసుకొని చెత్త ఏరుకుంటూ జీవిస్తున్నామన్నారు. తమకు గూడు కల్పించాలని కోరారు. దీనిపై ప్రభుత్వం స్పందించాలని డీబీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి పులి కల్పన మాట్ విజ్ఞప్తి చేశారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల హర్షం రాష్ట్రంలో గిరిజన సంక్షేమ శాఖ వసతి గృహాల నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ. 13.86 కోట్లు మంగళవారం విడుదల చేసింది. దీంతో గిరిజన సంక్షేమ శాఖ సిబ్బంది మహాత్మా జ్యోతిబా పూలే ప్రజాభవన్ లో మంగళవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలివచ్చారు. తమకు నిధులు కేటాయించిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలుపుతూ రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జీ చిన్నారెడ్డికి పుష్ప గుచ్చం ఇచ్చి సంతోషాన్ని వ్యక్తం చేశారు. ప్రజావాణి స్టేట్ నోడల్ అధికారి దివ్యకు కృతజ్ఞతలు తెలిపారు. -
వినూత్నంగా ఫ్రీడమ్ ఆయిల్ క్యాంపెయినింగ్
సాక్షి, సిటీబ్యూరో: ఫ్రీడమ్ హెల్తీ కుకింగ్ ఆయిల్ కంపెనీ వారు తమ ఉత్పత్తుల నాణ్యత గురించి ప్రజలకు వివరిచేందుకు వినూత్న పద్ధతుల్లో ప్రచారం చేస్తున్నారు. తాజాగా ‘కోర్టు రూమ్’ క్యాంపెయిన్ పేరిట కొత్త ప్రచార చిత్రాన్ని విడుదల చేశారు. ఈ యాడ్‌లో నటులు యష్, రాధికలు పాల్గొన్నారు. ఫ్రీడం నూనెలోని స్వచ్ఛతను చాటిచెప్పడమే లక్ష్యంగా ఈ ప్రచారాన్ని ప్రారంభించామని జెమినీ ఎడిబుల్స్ అండ్ ఫ్యాట్స్ ఇండియా లిమిటెడ్ సేల్స్ మార్కెటింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ పి.చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. ప్రజలకు అత్యుత్తమమైన నూనెలను అందించడమే లక్ష్యంగా నాణ్యతా ప్రమాణాలను పాటిస్తున్నామని ఆయన అన్నారు. -
మదర్ సెంటిమెంట్!
యాసీన్ భత్కల్.. ● వీటిలో 62 మంది మరణానికి కారణం ఇతడే ● 2013లో అరెస్టు..అప్పటి నుంచి జైలు జీవితం ● కుటుంబీకులతోనూ మాట్లాడని ఈ గజ ఉగ్రవాది ● తల్లికి అనారోగ్యం కారణం చూపి పెరోల్ దరఖాస్తు ● కేవలం వీడియో కాల్‌కు మాత్రమే కోర్టు అనుమతి ● ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్న ఐఎం కో–ఫౌండర్ సాక్షి, సిటీబ్యూరో: అతడి పేరు యాసీన్ భత్కల్... నిషేధిత ఉగ్రవాద సంస్థ ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) కో–ఫౌండర్... 2013 దిల్సుఖ్నగర్ జంట పేలుళ్ల సహా దేశ వ్యాప్తంగా పలు విధ్వంసాలకు కీలక సూత్రధారి... ఈ దుశ్చర్యలతో 62 మందిని పొట్టన పెట్టుకున్న గజ ఉగ్రవాది... 11 ఏళ్లుగా కారాగారవాసం చేస్తున్న ఇతగాడు ఇప్పటి వరకు కుటుంబీకులతో కనీసం మాట్లాడటానికీ ఆసక్తి చూపలేదు. ప్రస్తుతం తీహర్ జైల్లో ఉన్న యాసీన్.. తాజాగా తన తల్లిని కలవడానికి ఒక రోజు పెరోల్ కోరితే... న్యాయస్థానం వీడియో కాల్‌కు మాత్రమే అంగీకరించింది. ఐదు విధ్వంసాలకు సూత్రధారి... కర్ణాటకలోని భత్కల్ ప్రాంతానికి చెందిన సయ్యద్ మహ్మద్ అహ్మద్ జరార్ సిద్ధిబప్ప ఐఎం వ్యవస్థాపకుల్లో ఒకడై రియాజ్ భత్కల్ (2007 జంట పేలుళ్ల కేసు నిందితుడు) సోదరుడు. పదో తరగతి ఫెయిల్ కావడంతో 2005లో దుబాయ్ వెళ్లిన యాసీన్ 2007 నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. 2008లో జరిగిన ఢిల్లీ బాట్లా హౌస్ ఎన్కౌంటర్ తర్వాత రియాజ్ తన మరో సోదరుడు ఇక్బాల్ భత్కల్‌తో కలిసి దేశం దాటేశాడు. దీంతో ఐఎం కో–ఫౌండర్‌గా మారిన యాసీన్ నేపాల్‌లోని పోఖారాలో యునానీ డాక్టర్ షారూఖ్ ముసుగులో తలదాచుకున్నాడు. అక్కడ ఉంటూనే రహస్యంగా దేశంలోకి రాకపోకలు సాగిస్తూ 2010, 2012ల్లో పుణే, 2010లో బెంగళూరు స్టేడియం, 2011లో ముంబై, 2013లో హైదరాబాద్‌ల్లో పేలుళ్లు చేయించాడు. వీటిలో 62 మంది మృత్యువాత పడగా... వందల మంది క్షతగాత్రులయ్యారు. ఇండో–నేపాల్ సరిహద్దుల్లో పట్టివేత... నగరంలోని దిల్‌సుఖ్‌నగర్‌లో ఉన్న 107 బస్టాప్, ఏ1 మిర్చి సెంటర్ పేలుళ్ల తర్వాత యాసీన్ గ్యాంగ్ అరెస్టు కోసం దేశంలోని అన్ని ఏజెన్సీలు రంగంలోకి దిగాయి. కేంద్ర నిఘా వర్గాలు నేపాల్‌లో భారీ ఆపరేషన్ చేపట్టి ఎట్టకేలకు 2013 ఆగస్టు 28న పట్టుకున్నారు. బీహార్ సరిహద్దుల్లోనే రక్సోల్ వద్ద అరెస్టు చేసినట్లు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు ప్రకటించారు. తొలుత హైదరాబాద్ పేలుళ్ల కేసులో యాసీన్ మాడ్యుల్‌ను ఎన్ఐఏ స్పెషల్ కోర్టు విచారించింది. ఈ కేసులో ఇతడికి ఉరి శిక్ష విధించింది. అప్పట్లో యాసీన్ చాలా కాలం చర్లపల్లి జైలులో ఉన్నాడు. ఆపై మిగిలిన కేసుల్లో విచారణ కోసం ఆయా రాష్ట్రాలు ట్రాన్సిట్ వారెంట్‌పై తీసుకువెళ్లాయి. ప్రస్తుతం ఇతగాడు ఢిల్లీలోని తీహార్ జైల్లో కట్టుదిట్టమైన భద్రత మధ్య ఖైదీగా ఉన్నాడు. ఎస్కేప్‌కు ప్లాన్ చేసినట్లు నిఘా వర్గాలు గతంలో గుర్తించాయి. ఇప్పటి వరకు మాటలు సైతం లేకుండా... యాసీన్‌కు తల్లిదండ్రులు జరార్ సిద్ధిబప్ప, రెహానా సిద్ధిబప్పలతో పాటు భార్య జాహెదా ఇర్షన్ ఖాన్, పిల్లలు ఉన్నారు. ఈ గజ ఉగ్రవాది ఇప్పటి వరకు కుటుంబీకులతో కనీసం మాట్లాడను కూడా లేదు. వాళ్లు ములాఖత్‌లో కలవడానికి వచ్చినా ఇతగాడు అంగీకరించలేదు. ఇతగాడికి ఇప్పుడు సడన్‌గా మదర్ సెంటిమెంట్ పుట్టుకు వచ్చింది. అనారోగ్యంతో ఉన్న తల్లిని కలవడానికి ఒక రోజు ఎస్కార్ట్ పెరోల్ ఇవ్వాల్సిందిగా కోరుతూ ఢిల్లీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. దీనిపై జైలు అధికారులు అభ్యంతరం తెలిపారు. దాదాపు 2 వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న భత్కల్ వరకు యాసీన్‌ను తీసుకువెళ్లి, సురక్షితంగా వెనక్కు తీసుకురావడం పెను సవాల్ అంటూ కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. వీడియో కాల్‌కు అనుమతించిన కోర్టు... దీంతో పెరోల్ పిటిషన్‌ను ఢిల్లీ న్యాయస్థానం తిరస్కరించింది. అనారోగ్యంతో ఉన్న తల్లి రెహానాతో వీడియో కాల్ ద్వారా మాట్లాడటానికి మాత్రం అనుమతించింది. అయితే దీనికి కొన్ని షరతులు విధించింది. కేవలం జైలు అధికారులు ఇచ్చిన ఫోన్ మాత్రమే వినియోగించాలని స్పష్టం చేసింది. దీంతో తీహార్ జైలు అధికారులు ఆదివారం వీడియో కాల్ ద్వారా యాసీన్‌ను తన తల్లి రెహానాతో మాట్లాడించారు. భ త్కల్ కుటుంబీకుల నివాసం -
సర్టిఫి‘కేటుగాళ్లకు’ సంకెళ్లు
సాక్షి, సిటీబ్యూరో: మహిళ వేషధారణ గొంతుతో ‘జబర్దస్త్’ ఫేమ్‌గా మారిన వ్యక్తి గుంటూరుకు చెందిన అయ్యప్ప. ఇతడిని నకిలీ పత్రాలతో హైదరాబాద్‌కు చెందిన గట్టు తన్మయిశ్రీగా మార్చి పాస్‌పోర్టు ఇప్పించారు. ప్యాట్నీలోని ఆర్ఎస్ ఆన్లైన్ సర్వీస్ సెంటర్ కేంద్రంగా సాగిన నకిలీ సర్టిఫికెట్ల దందాకు చిన్న ఉదాహరణ ఇది. దీని యజమాని వై.రాజ్‌కుమార్ నేతృత్వంలోని బృందం గడిచిన కొన్నాళ్లుగా 28 వేల నకిలీ డాక్యుమెంట్లు, గుర్తింపు కార్డులు సృష్టించింది. ఈ వ్యవహారం గుట్టురట్టు చేసిన నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు గురువారం ఆరుగురు నిందితులను పట్టుకున్నారు. ఇన్స్పెక్టర్ కె.సైదులుతో కలిసి బషీర్‌బాగ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీసీపీ వైవీఎస్ సుదీంద్ర వివరాలు వెల్లడించారు. నకిలీ ఓటర్ ఐడీతో.. కళాసిగూడకు చెందిన రాజ్‌కుమార్ తన ఆర్ఎస్ ఆన్లైన్ సర్వీస్ సెంటర్ కేంద్రంగా నకిలీ డాక్యుమెంట్లు, గుర్తింపు కార్డుల దందా చేస్తున్నాడు. దీనికోసం ఆర్.విజయలక్ష్మి, కె.పల్లవిలను ప్రత్యేకంగా నియమించుకున్నాడు. నేపాల్ సహా మరికొన్ని దేశాల నుంచి నగరానికి అక్రమంగా వలస వచ్చిన వారికి ఎలాంటి గుర్తింపు కార్డులు ఉండవు. వీళ్లు ఐడీ కార్డుల కోసం రాజ్‌కుమార్‌ను ఆశ్రయిస్తున్నారు. ఇతగాడు ఫొటో షాప్ ద్వారా వేరే వారికి చెందిన ఓటర్ ఐడీలో వీరి పేరు చేరుస్తాడు. దీని ఆధారంగా ఆధార్ కార్డుకు దరఖాస్తు చేస్తాడు. ఇలా ఆధార్ రావడంతో వాళ్లు స్థానికులుగా మారిపోతున్నారు. కొందరికి నేరుగా ఆధార్ ఇప్పిస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది. దీనికోసం ఆధార్ కార్డులు జారీ చేసే యూఐడీఐఏ ఇచ్చిన ఓ వెసులుబాటును వినియోగించుకున్నాడు. మైనర్‌గా ఉన్న వ్యక్తి తొలిసారిగా ఆధార్ కోసం దరఖాస్తు చేసుకుంటే వేలిముద్రలు ఇవ్వాల్సిన అవసరం ఉండదు. దీంతో ఆధార్ కోసం వచ్చిన వారిని మైనర్లుగా పేర్కొంటూ తొలుత రిజిస్టర్ చేసి కార్డు తీసి ఇస్తున్నాడు. ఆపై వయస్సు తప్పు పడిందంటూ కరెక్షన్ కోసం దరఖాస్తు చేసి సదరు వ్యక్తి అసలు వయసు చేరుస్తున్న రాజ్‌కుమార్ దాన్ని అధికారిక ఆధార్‌గా మార్చేస్తున్నాడు. ఇతర ధ్రువీకరణ పత్రాలు సైతం.. రాజ్‌కుమార్ కేవలం ఆధార్, ఓటర్ ఐడీలు మాత్రమే కాకుండా ఇతర సర్టిఫికెట్లు కూడా తప్పుడు మార్గాల్లో ఇప్పిస్తున్నాడు. ఆధార్ కార్డుల కోసం ఇతగాడికి సర్వ శిక్షా అభయాన్ ప్రాజెక్టులో పని చేస్తున్న మహబూబ్ సహకరిస్తుండగా.. బర్త్, క్యాస్ట్ సర్టిఫికెట్లు ఇప్పించడంలో సికింద్రాబాద్ జీహెచ్ఎంసీ ఆఫీస్‌లో కంప్యూటర్ ఆపరేటర్‌గా పని చేస్తున్న జి.అనిల్‌కుమార్ సహకరిస్తున్నారు. పాస్‌పోర్టు ఏజెంట్‌గా పని చేస్తున్న బండి శంకర్ తమ వద్దకు వచ్చిన వారిలో వివిధ ధ్రువీకరణలు అవసరమైన వారిని రాజ్‌కుమార్ వద్దకు తీసుకువెళ్తున్నాడు. కొన్ని పత్రాలకు అటెస్టేషన్ చేయాల్సి వస్తుంది. దీనికోసం రాజ్‌కుమార్ కళాసీగూడ ప్రభుత్వ స్కూలు హెడ్మాస్టర్, హైదరాబాద్ జిల్లా ఆరోగ్య శాఖ జిల్లా సర్వైలెన్స్ ఆఫీసర్, గాంధీ ఆస్పత్రి ఆర్ఎండీ, ఉస్మానియా మెడికల్ కాలేజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ల పేరుతో నకిలీ రబ్బర్ స్టాంపులు సృష్టించాడు. వీరి సంతకాలను గ్రీన్ ఇంక్‌తో వరలక్ష్మి చేస్తోంది. ప్రతి సర్టిఫికెట్‌ను ఎదుటి వారి అవసరాన్ని బట్టి రూ.వందల నుంచి రూ.వేలకు విక్రయించి అంతా పంచుకున్నారు. వందల నకిలీ కార్డుల డేటా ధ్వంసం... రాజ్‌కుమార్‌కు దాదాపు పదేళ్లుగా ఈ దందా చేస్తున్నాడు. అయితే ఇతడికి ఏజెంట్‌గా పని చేసిన శ్రావణ్‌కుమార్‌ను 2023 జూన్‌లో నేరేడ్మెట్ పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో భయపడిన రాజ్‌కుమార్ అప్పటికి తొమ్మిదేళ్లుగా తన కంప్యూటర్లో ఉన్న డేటా ధ్వంసం చేశాడు. మిగిలిన డేటాను విశ్లేషించిన నేపథ్యంలోనే ఈ కేంద్రం నుంచి 50 వేల ఓటర్ఐడీ కార్డులు జారీ అయినట్లు తెలిసింది. వీరి దందాపై సమాచారం అందుకున్న నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఆరుగురినీ పట్టుకుని మహంకాళి పోలీసులకు అప్పగించారు. వివరాలు వెల్లడిస్తున్న డీసీపీ వైవీఎస్ సుదీంద్ర ఆర్ఎస్ ఆన్లైన్ సర్వీస్ సెంటర్ కేంద్రంగా దందా ఓటర్ ఐడీ, ఆధార్, క్యాస్ట్, బర్త్ సర్టిఫికెట్లు విక్రయం విదేశీయులకు ఆధార్ కార్డులు ఇప్పించిన ముఠా గుట్టు రట్టు చేసిన నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఇప్పటి వరకు 28 వేల నకిలీ పత్రాలు ఇచ్చినట్లు గుర్తింపు -
మీదికుంట వాకింగ్ బ్రిడ్జి ప్రారంభం
సాక్షి, సిటీబ్యూరో: మియాపూర్ పరిధిలోని మీదికుంట సరస్సు వద్ద నూతనంగా నిర్మించిన వాకింగ్ బ్రిడ్జ్‌ను బాలల దినోత్సవం నేపథ్యంలో ఫౌంటెన్హెడ్ గ్లోబల్ స్కూల్ విద్యార్థులు ప్రారంభించారు. ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా చేపట్టిన నిధుల సమీకరణతో పాటు స్కూల్ విద్యార్థులు, సేవ్ వాటర్ అండ్ సేవ్ నేచర్ ఎన్జీఓ సహకారంతో నిర్మించిన ఈ వంతెనను ప్రారంభించి సమాజానికి అంకితం చేశారు. 2020లో సరస్సు పునరుజ్జీవనం చేసినప్పటి నుంచి సరస్సు పరిరక్షణకు విద్యార్థులు చూపుతున్న అంకితభావాన్ని సరస్సు చుట్టుపక్కల కమ్యూనిటీలు అభినందించాయి. ఇందులో భాగంగా క్రమం తప్పకుండా సరస్సును శుభ్రం చేయడం, దీని పైన ప్రజలకు అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ వంతెన ప్రారంభోత్సవంలో ఫౌంటెన్హెడ్ గ్లోబల్ స్కూల్ వ్యవస్థాపకులు మేఘనా ముసునూరి, డైరెక్టర్ శ్రీధర్ వున్నం పాల్గొన్నారు. బాలల దినోత్సవం నేపథ్యంలో ప్రారంభించిన విద్యార్థులు -
ఆన్లైన్ గేమ్స్‌కు యువకుడి బలి
మియాపూర్: ఆన్లైన్ గేమ్స్‌కు అలవాటుపడి అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఓ యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్య పాల్పడిన ఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం చోటుచేసుకుంది. ఎస్ఐ మాణిక్యం తెలిపిన వివరాల ప్రకారం.. ఝార్ఖండ్ రాష్ట్రం కమలాపూర్ జిల్లాకు చెందిన జిహూర్ గోరి (25) తన స్నేహితుడు అవని గోరితో కలిసి మియాపూర్ ఓల్డ్ హపీజ్పేటలో ఉంటున్నాడు. స్థానికంగా ఉన్న ఓ హోటల్లో పని చేస్తున్నాడు. కొంతకాలంగా జిహూర్ ఆన్లైన్ గేమ్స్‌కు అలవాటు పడ్డాడు. ఈ క్రమంలో గురువారం తెల్లవారుజాము వరకూ ఆన్లైన్ గేమ్ ఆడి రూ.20 వేలు పోగొట్టుకున్నాడు. అంతేకాకుండా గతంలో చేసిన అప్పులు భారీగా పెరిగిపోయాయి. అప్పులు ఎలా తీర్చాలో అర్థం కాని జిహూర్ ఆత్మహత్యే శరణ్యమనుకున్నాడు. హఫీజ్‌పేట్‌లోని డబుల్ బెడ్రూం భవన సముదాయం సమీపంలోని ఓ చెట్టుకు చీరతో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. స్థానికులు చూసి మియాపూర్ పోలీసులకు సమాచారం అందించడంతో మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. అవని గోరి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. -
‘చర్లపల్లి’కి గ్రహణం వీడేనా!
నవంబర్లోనే టెర్మినల్‌ను ప్రారంభిస్తామన్న కేంద్రమంత్రి సాక్షి, సిటీబ్యూరో: చర్లపల్లి రైల్వే టెర్మినల్‌కు గ్రహణం వీడటం లేదు. పనులు పూర్తయి నెలలు గడిచినా ప్రారంభానికి నోచుకోవడం లేదు. స్టేషన్‌కు రాకపోకలు సాగించేందుకు చేపట్టిన అనుబంధ రహదారుల పనుల్లో జాప్యం కారణంగా ప్రారంభం ఆలస్యమవుతున్నట్లు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ నెలలోనే చర్లపల్లి టెర్మినల్‌కు ప్రయాణికులకు అందుబాటులోకి తేనున్నట్లు ఇటీవల కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సైతం తెలిపారు. కానీ ఆ దిశగా ఇప్పటి వరకు దక్షిణమధ్య రైల్వే ఎలాంటి చర్యలు చేపట్టలేదు. దీంతో నవంబర్‌లో చర్లపల్లి ప్రారంభంపై సందిగ్ధం నెలకొంది. ఒకవైపు అనుబంధ రోడ్ల నిర్మాణ పనుల దృష్ట్యా ఆలస్యమవుతుండగా, మరోవైపు ప్రధాని మోదీ చేతుల మీదుగా చర్లపల్లి టెర్మినల్‌ను ప్రారంభించాలని భావిస్తున్నారు. దీంతో ప్రధాని అపాయింట్మెంట్ కోసం కూడా ఎదురు చూస్తున్నట్లు అధికారులు తెలిపారు. గత లోక్‌సభ ఎన్నికల నాటికే టెర్మినల్ ప్రాజెక్టు పూర్తయింది. ఎంఎంటీఎస్ రైళ్ల రాకపోకలకు కూడా రెండోదశ లైన్లు అందుబాటులోకి వచ్చాయి. కానీ ప్రయాణికులు స్టేషన్‌కు నలువైపులా రోడ్డు మార్గాల్లో చేరుకొనేందుకు అనుకూలమైన మౌలిక సదుపాయాలు లేకపోవడం సమస్యగా మారింది. సికింద్రాబాద్ స్టేషన్‌పై ఒత్తిడి.. ● సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ పునరభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయి. వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి వినియోగంలోకి తేవాలనే లక్ష్యంతో పనుల్లో వేగం పెంచారు. దీంతో సికింద్రాబాద్ నుంచి రైళ్ల రాకపోకలకు ఇబ్బందులు తతెత్తుతున్నాయి. ప్రయాణికులు కూడా స్టేషన్‌కు చేరుకొనేందుకు, ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రతిరోజూ సుమారు 1.83 లక్షల మంది రాకపోకలు సాగిస్తుండగా.. పండుగలు, ప్రత్యేక సెలవు రోజుల్లో 2.2 లక్షల మందికి పైగా రాకపోకలు సాగిస్తున్నారు. దీంతో రైళ్ల నిర్వహణ దృష్ట్యా ఒత్తిడి నెలకొంటోంది. ఇటీవల దీపావళి సందర్భంగా ఉత్తరాది రాష్ట్రాలకు ప్రయాణికుల రాకపోకలు అనూహ్యంగా పెరిగాయి. ● రద్దీ నియంత్రణ కోసం అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టాల్సి వచ్చింది. కొన్ని రైళ్లను చర్లపల్లి స్టేషన్‌కు తరలించి ఉంటే ఒత్తిడిని కొంతమేరకు తగ్గించే అవకాశం ఉండేది. మరోవైపు వాహనాల పార్కింగ్‌కు కూడా సరైన వసతులు లేవు. రానున్న రోజుల్లో ఈ ఇబ్బందులు మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంది. సికింద్రాబాద్ పునరభివృద్ధి పనులను దృష్టిలో ఉంచుకొనే చర్లపల్లి టెర్మినల్ నుంచి 25 జతల రైళ్లను నడపాలని భావించారు. ఈ మేరకు రైల్వే బోర్డు నిర్ణయం కూడా తీసుకుంది. కనీసం 50 వేల మంది ప్రయాణికులు చర్లపల్లి నుంచి రాకపోకలు సాగించే అవకాశం ఉంది. కానీ టెర్మినల్ ప్రారంభం కాకపోవడమే ప్రధాన ఆటంకం కావడం గమనార్హం. పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాని రోడ్లు కనెక్టివిటీకి కటకట.. నత్తనడకన సాగుతున్న నిర్మాణాలు సమస్యగా మారిన మౌలిక సదుపాయాల ఏర్పాట్లు ప్రధానితో ఈ నెలలోనే ప్రారంభించేందుకు సన్నాహాలు అన్ని వసతులు ఉన్నా.. చర్లపల్లి శాటిలైట్ టెర్మినల్‌ను అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అభివృద్ధి చేశారు. రూ.430 కోట్ల వ్యయంతో ప్రాజెక్టును విజయవంతంగా పూర్తి చేశారు. ప్రయాణికుల కోసం ఎయిర్పోర్ట్ తరహాలో ఎగ్జిక్యూటివ్ లాంజ్, వెయిటింగ్ హాళ్లు, స్లీపింగ్ పాడ్లు, కెఫెటేరియాలు, రెస్టారెంట్లు ఉన్నాయి. అలాగే టికెట్ బుకింగ్ కౌంటర్లు, లిఫ్టులు, ఎస్కలేటర్లు, ఫుట్ ఓవర్ బ్రిడ్జీలు, ఈవీ చార్జింగ్ పాయింట్లు, తదితర సదుపాయాలను ఏర్పాటు చేశారు. మొత్తం 19 లైన్ల సామర్థ్యంతో 9 కొత్త లైన్లను అభివృద్ధి చేశారు. ఇది వినియోగంలోకి వస్తే సికింద్రాబాద్‌తో పాటు నాంపల్లి, కాచిగూడ స్టేషన్లపైనా ఒత్తిడి తగ్గుతుంది. ప్రయాణికులు ఔటర్ మీదుగా రాకపోకలు సాగించవచ్చు. నగరంలో ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా వివిధ ప్రాంతాల నుంచి చర్లపల్లికి చేరుకొనేందుకు ఔటర్‌రింగ్ రోడ్డును వినియోగించుకొనే అవకాశం ఉంది. -
మీరాలం చెరువుపై కేబుల్ బ్రిడ్జి
సాక్షి, సిటీబ్యూరో: దుర్గం చెరువు తరహాలో నగరంలో రెండో కేబుల్ బ్రిడ్జి అందుబాటులోకి రానుంది. 2.65 కిలోమీటర్ల పొడవునా నాలుగు లేన్ల ఐకానిక్ బ్రిడ్జి నిర్మించాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. ప్రతిపాదిత ఈ వంతెన హైదరాబాద్–బెంగళూరు జాతీయ రహదారి (ఎన్‌హెచ్–44) వైపు నుంచి చింతల్మెట్ మీదుగా పీవీ ఎక్స్‌ప్రెస్ వేను కలుపుతుంది. గతంలో రూ.363 కోట్ల నిర్మాణ వ్యయంతో మీరాలం చెరువు మీద హైలెవల్ బ్రిడ్జిని నిర్మించాలని హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) నిర్ణయించింది. ఈ మేరకు గత మార్చిలో నిధులు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా ఈ వారధి స్థానే.. ఐకానిక్ కేబుల్ బ్రిడ్జిని నిర్మించాలని అధికారులతో జరిగిన ఉన్నత స్థాయి సమీక్షలో సీఎం నిర్ణయించారు. ఆయా బాధ్యతలను హెచ్ఎండీఏ నుంచి మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎంఆర్డీసీఎల్)కు బదిలీ చేశారు.ముందు బాపూఘాట్.. తర్వాత మీరాలం..కాలుష్య కాసారాలుగా మిగిలిపోయిన మూసీ నది, మీరాలం చెరువులను సుందరీకరించడంతో పాటు పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. తొలి దశలో బాపూఘాట్ వద్ద మూసీ నది అభివృద్ధి పనులను, ఆ తర్వాత మీరాలం చెరువు అభివృద్ధికి అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. సరస్సు సుందరీకరణతో పాటు పార్కింగ్, రోడ్ల అనుసంధానం, లైటింగ్, రిటైల్ అవుట్లెట్లు తదితర మౌలిక సదుపాయాలను కల్పించనున్నారు. ఆయా అభివృద్ధి పనుల కోసం అవసరమైన భూములను ట్రాన్స్ ఫర్ ఆఫ్ డెవలప్మెంట్ రైట్స్ (టీడీఆర్) రూపంలో సమీకరించనున్నారు. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ డీపీఆర్ పనులను సింగపూర్ కన్సార్టియం మెన్హార్ట్ సంస్థకు అప్పగించారు. ఫైనాన్సింగ్, నిర్మాణం, సౌకర్యాల నిర్వహణ అన్నీ బాధ్యతలు ఈ సంస్థదే.ఐలాండ్స్‌లో టవర్లుమీరాలం ట్యాంకులో సహజసిద్ధమైన రెండు దీవులు (ఐలాండ్స్) ఉన్నాయి. ఒకటి 5 ఎకరాలు, మరొకటి 2.5 ఎకరాల విస్తీర్ణంలో ఇవీ ఉన్నాయి. గతంలో ఇక్కడకు వెళ్లేందుకు పర్యాటక శాఖ బోటింగ్‌లను నిర్వహించేది. తాజాగా ఈ ఐలాండ్స్‌లో టవర్లను నిర్మించాలని తద్వారా పాతబస్తీకి పర్యాటక శోభ తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది.పర్యాటక కేంద్రాలుగా మీరాలం, జూపార్క్..మీరాలం చెరువు, నెహ్రూ జంతు ప్రదర్శనశాల పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చెందనున్నాయి. 600 ఎకరాల్లోని మీరాలం, 380 ఎకరాల్లోని జూ పార్క్ రెండు కలిపి సుమారు వెయ్యి ఎకరాలను అభివృద్ధి చేసేందుకు అధికారులు సమీకృత ప్రణాళికలను రూపొందిస్తున్నారు. ఈ రెండు ప్రాంతాలను కలుపుతూ వ్యూ డెక్, స్కైవాక్‌తో వంతెనను నిర్మించనున్నారు. వాకింగ్, సైకిల్ ట్రాక్‌లతో పాటు గ్రీనరీ, లేక్‌ఫ్రంట్ అభివృద్ధి పనులను చేపట్టనున్నారు. తద్వారా సందర్శకుల తాకిడి పెరుగుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. మీరాలం చెరువు నీరు జూ తూముల ద్వారా జూపార్కులోని మూడు చెరువుల మీదుగా ముందుకు సాగి..నాలా ద్వారా మూసీలో కలుస్తుంది. ఈ నేపథ్యంలో ఈ నీటిని శుద్ధీకరించి మూసీలోకి వదలాలని భావిస్తోంది. -
తెలంగాణలో 12 శాతం మందికి మధుమేహ వ్యాధి
సుల్తాన్‌బజార్: తెలంగాణ రాష్ట్రంలో మధుమేహం వ్యాధి ప్రమాదకరంగా పెరుగుతోందని, ప్రజలు వెంటనే అప్రమత్తమై పరీక్షలతో వ్యాధిని గుర్తించడం ఆరోగ్యవంతమైన జీవనశైలితో వ్యాధిని నిత్యం అదుపులో ఉంచడంపై దృష్టి పెట్టాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ దువ్వూరు ద్వారకనాథరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ వి.అశోక్‌లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గురువారం ప్రపంచ డయాబెటిక్ దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ ప్రజలు మధుమేహం వ్యాధి పట్ల నిర్లక్ష్యం చేస్తే గుండె, కిడ్నీ, చర్మ, నరాలు, కంటి జబ్బుల బారిన పడాల్సి వస్తుందని, ఇది ఆర్థికంగాను, ఆరోగ్యపరంగాను తీవ్రంగా నష్టపరుస్తుందన్నారు. కాబట్టి ప్రజ లు షుగర్ వ్యాధి నిర్ధారణ అయిన తర్వాత కూడా అదేదో రుగ్మత అని భావించకుండా అది ఒక జీవన శైలిగా మార్చుకోవాలని సూచించారు. ప్రతి రోజు కనీసం 30 నిమిషాల పాటు వ్యాయామం చేయడం, ఫైబర్, ఫ్రూట్స్, విత్తనాలు, వెజిటబుల్స్‌తో కూడిన ఆహారాన్ని తీసుకోవడం నిత్యం చేయాలని సూచించారు. వ్యాధిలో ఎలాంటి తీవ్రత ఉన్నా వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షుడు ద్వారకనాథ్‌రెడ్డి -
సందడిగా చిల్డ్రన్స్ డే
నగరంలోని లాల్ బహదూర్ స్టేడియంలో గురువారం చిల్డ్రన్స్ డే ఉత్సవాలు సంబరంగా జరిగాయి. వేడుకలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్, సీఎస్ శాంతికుమారి తదితరులు హాజరయ్యారు. బాలల సాంస్కృతిక ప్రదర్శనలు ఆహూతులను అలరించాయి.థ్యాంక్యూ సీఎం అంటూ విద్యార్థినుల ప్లకార్డుల ప్రదర్శనచిన్నారులతో సీఎం కరచాలనంవివిధ వేషధారణల్లో చిన్నారుల సందడి -
విద్యుత్ సత్వర సేవలకు..
కొత్తగా మరో 101 వాహనాల కేటాయింపు సాక్షి, సిటీబ్యూరో: విద్యుత్ సరఫరాలో సాంకేతిక సమస్యల పరిష్కారం కోసం కొత్తగా మరో 101 ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం (అంబులెన్స్ తరహా) వాహనాలను సమకూర్చేందుకు దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ ఏర్పాట్లు చేసింది. వచ్చే నెల 1 నుంచి ఈ వాహనాలు అందుబాటులోకి రానున్నాయి. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇటీవల 10 వాహనాలను ప్రారంభించిన విషయం తెలిసిందే. తాజాగా మరో 101 వాహనాలను సిద్ధం చేసింది. అత్యవసర పరిస్థితుల్లో వినియోగదారులకు సత్వర, నాణ్యమైన సేవలు అందించాలనే ఉద్దేశంతోనే వీటిని ఏర్పాటు చేస్తున్నట్లు డిస్కం ప్రకటించింది. ప్రస్తుతం ఉన్న వాహనాల స్థానంలో/వాటికి అదనంగా మెట్రో జోన్‌కు 50, రంగారెడ్డి జోన్‌కు 21, మేడ్చల్ జోన్‌కు 19, రూరల్ జోన్‌కు 11 చొప్పున మొత్తం 101 వాహనాలను కేటాయిస్తూ దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ గురువారం ఆదేశాలు జారీ చేసింది. ఒక్కో డివిజన్‌కు ఒక వాహనం చొప్పున అందుబాటులోకి రానుంది. వాహనంలో షిఫ్ట్ విధానంలో ఒక అసిస్టెంట్ ఇంజినీర్, ముగ్గురు నైపుణ్యం కలిగిన సిబ్బంది, వాకీటాకీ, థర్మో విజన్ కెమెరాలతో పాటు, అత్యాధునిక భద్రతా పరికరాలైన హెల్మెట్, ఎర్త్ రాడ్, గ్లౌజులు, సేఫ్టీ బెల్ట్, కండక్టర్, ఎల్టీ/హెచ్‌టీ కేబుల్, స్పానర్ కిట్, 14 అడుగుల ఎత్తు నిచ్చెన, గొడ్డలి, రోఫ్, ఎల్టీ, హెచ్‌టీ ఫ్యూజ్‌వైర్, ఇన్సులేటర్, వుడ్ కట్టర్ వంటివి అందుబాటులో ఉంటాయి. వాహనంలో నలుగురు సిబ్బంది సహా, 100 కేవీఏ సామర్థ్యంతో కూడిన డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ను సైతం తరలించడానికి అనుకూలంగా ఉంటుందని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ సీఎండీ ముషారఫ్ ఫారూఖీ ప్రకటించారు. -
కంటోన్మెంట్‌కు 303 కోట్లు
కోట్లు ● మౌలిక వసతుల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వ ఆమోదం కంటోన్మెంట్: సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతంలో రూ.303.62 కోట్లతో మౌలిక సదుపాయాల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ (ఎంఏయూడీ) ప్రిన్సిపల్ సెక్రటరీ ఎం.దాన కిశోర్ ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో చేపట్టనున్న ఎలివేటెడ్ కారిడార్ల కోసం కంటోన్మెంట్ బోర్డుకు సంబంధించిన 24.6 ఎకరాలను సేకరిస్తున్నందుకు బదులుగా ఈ పనులు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. కంటోన్మెంట్ పరిధిలోని భూగర్భ డ్రైనేజీ వ్యవస్థను హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ అండ్ సీవరేజీ బోర్డు ఆధ్వర్యంలో పూర్తిస్థాయిలో ఆధునికీకరించనున్నట్లు తెలిపారు. కంటోన్మెంట్ పరిధిలోని ఎన్ట్రెంచ్మెంట్ రోడ్డు నుంచి శేషాచల కాలనీ, ఎల్ఐసీ కాలనీ, జూబ్లీ బస్‌స్టేషన్ నుంచి ప్యాట్నీ కాంపౌండ్ వరకు ఉన్న పికెట్ నాలా, బోయిన్‌పల్లిలోని ప్రోగ్రెసివ్ కాలనీ, రాయల్ ఎన్క్లేవ్, పార్క్‌వ్యూ ఎన్క్లేవ్, సెయిల్ కాలనీ, భావనా కాలనీ, చిన్నతోకట్టా, బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి ప్యాట్నీ నాలా వరకు ఉన్న హస్మత్‌పేట నాలాలను జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. భూమికి బదులు పనుల ప్రతిపాదన కంటోన్మెంట్ పరిధిలోని జాతీయ రహదారి –44, రాష్ట్ర రహదారి –1 మార్గాల్లో చేపట్టనున్న ఎలివేటెడ్ కారిడార్ల కోసం సుమారు 150 ఎకరాల రక్షణ భూముల కేటాయింపునకు కేంద్రం అంగీకారం తెలిపింది. ఈ స్థలాలకు బదులుగా సమాన విలువ కలిగిన భూములను రాష్ట్ర ప్రభుత్వం రక్షణ శాఖకు కేటాయించనుంది. ఇందులో 24.6 ఎకరాల కంటోన్మెంట్ బోర్డుకు సంబంధించిన స్థలానికి మాత్రం, భూమికి బదులుగా రూ.303.62 కోట్లు చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. ఈ మొత్తాన్ని కేంద్రం అధీనంలోని కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా (సీఎఫ్ఐ)లో జమ చేయాలని నిర్ణయించారు. ఈ మొత్తాన్ని నేరుగా కంటోన్మెంట్‌కు అప్పగించే వీలులేనందున, అంతే విలువ కలిగిన మౌలిక సదుపాయాల అభివృద్ధికి అనుమతి ఇవ్వాలంటూ కంటోన్మెంట్ బోర్డు సీఈఓ మధుకర్ నాయక్ రక్షణ శాఖ ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేశారు. కంటోన్మెంట్ పరిధిలోని భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ ఆధునీకరణతో పాటు పికెట్ నాలా, హస్మత్‌పేట్ నాలాలను అభివృద్ధి చేయాలని ప్రతిపాదించారు. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రతిపాదనలకు అంగీకరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రూ. -
ఓయూ ఆర్ట్స్ కాలేజీ నూతన ప్రిన్సిపాల్‌గా ప్రొ.కాశీం
ఉస్మానియా యూనివర్సిటీ: ఓయూ క్యాంపస్ ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపాల్‌గా తెలుగు శాఖ అధ్యాపకులు ప్రొ.కాశీం నియమితులయ్యారు. యూనివర్సిటీ క్యాంపస్ న్యాయకళాశాల ప్రిన్సిపాల్‌గా డాక్టర్ రాంప్రసాద్, సైన్స్ కాలేజీ ప్రిన్సిపాల్‌గా ప్రొ.గుండా ప్రభాకర్ సైఫాబాద్ పీజీ సైన్స్ కాలేజీ ప్రిన్సిపల్ బాటాని విభాగం ప్రొ.శైలజ, నిజాం కాలేజీ ప్రిన్సిపాల్‌గా జువాలజీ అ విభాగం ప్రొ.ఏవీ రాజశేఖర్, కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ కాలేజీ ప్రిన్సిపాల్‌గా కామర్స్ విభాగం అధ్యాపకులు ప్రొ.ఐ.శేఖర్, యూనివర్సిటీ టెక్నాలజీ ప్రిన్సిపాల్‌గా ప్రొ.రమేష్‌కుమార్ నియమితులయ్యారు. ఇక ఓయూ ఎగ్జామినేషన్ నూతన కంట్రోలర్‌గా సివిల్ ఇంజినీరింగ్ విభాగం ప్రొ.శశికాంత్ నియమితులయ్యారు. గతంలో అడిషనల్ కంట్రోలర్‌గా పని చేసి ఆయన ఇంజినీరింగ్ కాలేజీలో పలు పదవులు చేపట్టారు. -
తప్పు చెప్పిన వారి సంగతి తేలుస్తాం
సాక్షి, హైదరాబాద్: నగరంలోని రామమ్మ కుంట ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో అక్రమ నిర్మాణాలను తొలగించామని ప్రభుత్వం, పూర్తిగా తొలగించలేదని పిటిషనర్ పేర్కొంటున్నందున.. ఇరు పార్టీలు అఫిడవిట్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. వివరాలను పరిశీలించి తప్పుడు సమాచారం ఇచ్చిన వారి సంగతి తేలుస్తామని మౌఖిక హెచ్చరిక జారీ చేసింది. రెండు వారాలు సమయం ఇచ్చింది. ఆలోగా అఫిడవిట్లు దాఖలు చేయాలని స్పష్టం చేసింది. తదుపరి విచారణ రెండు వారాలకు వాయిదా వేసింది. రామమ్మ కుంట బఫర్ జోన్లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ (నిథమ్) భవనం నిర్మించడాన్ని సవాల్ చేస్తూ మానవ హక్కులు, వినియోగదారుల రక్షణ సెల్ ట్రస్ట్ ఏప్రిల్ 2023లో పిల్ దాఖలు చేసింది. ఇది సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధమని పేర్కొంది. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన న్యాయస్థానం ఎలాంటి నిర్మాణం చేపట్టడం లేదని అఫిడవిట్ దాఖలు చేయాలని లేక్ ప్రొటెక్షన్ కమిటీని హైకోర్టు 2023 జూలైలో ఆదేశించింది. నగరంలోని చెరువుల, కుంటల ఇతర నీటి వనరుల ఎఫ్టీఎల్ బఫర్ జోన్ నిర్ధారణకు నోటిఫికేషన్ జారీ చేయాలని, దీన్ని తదుపరి విచారణ రోజున కోర్టుకు అందజేయాలని స్పష్టం చేసింది. అనంతరం 2024 జూలైన హెచ్ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ కోర్టుకు హాజరయ్యారు. హెచ్ఎండీఏ పరిధిలో 3,532 నీటి వనరులు ఉన్నాయని చెప్పారు. వీటిలో 230 చెరువులకు ఎఫ్టీఎల్ నిర్ధారణ తుది నోటిఫికేషన్ ఇచ్చామని, 2,525 చెరువులకు ప్రాథమిక నోటిఫికేషన్ ఇచ్చామని కోర్టుకు వెల్లడించారు. మూడు నెలల్లో వీటికి కూడా తుది నోటిఫికేషన్ ఇస్తామన్నారు. ఇరుపక్షాలు అఫిడవిట్లు సమర్పించండి.. ఈ పిటిషన్ గురువారం మరోసారి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జె.శ్రీనివాస్‌రావు ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది. పిటిషనర్ తరఫున న్యాయవాది కిరణ్‌సింగ్, కేంద్రం తరఫున ప్రణతిరెడ్డి హాజరయ్యారు. లేక్ ప్రొటెక్షన్ కమిటీ చైర్మన్, హెచ్ఎండీఏ కమిషనర్ దాఖలు చేసిన నివేదికలో పేర్కొన్నట్లు నిథమ్ ఆక్రమణలు పూర్తిగా తొలగించలేదని కిరణ్‌సింగ్ వాదనలు వినిపించారు. మరోవైపు ఆక్రమణలు పూర్తిగా తొలగించినట్లు ప్రభుత్వ న్యాయవాది పేర్కొన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. ఒకరు తొలగించామని, మరొకరు పూర్తిగా తొలగించలేదని వాదిస్తున్నారని, లిఖిత పూర్వక అఫిడవిట్ అందజేయాలని ఆదేశించారు. ఆక్రమణలు తొలగిస్తే పిటిషనర్.. తొలగించకుంటే సంబంధిత అధికారులు తప్పుడు సమాచారం ఇచ్చినందుకు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది. తదుపరి విచారణ రెండు వారాలకు వాయిదా వేసింది. రామమ్మ కుంట ఆక్రమణ తొలగింపుపై హైకోర్టు హెచ్చరిక -
కొత్త టీచర్లలో గుబులు!
సాక్షి, సిటీబ్యూరో: కొత్తగా ఇటీవల నియమితులైన పలువురు టీచర్ల గుండెల్లో గుబులు పట్టుకుంది. డీఎస్సీ–2024కి ఎంపికై న అభ్యర్థుల ధృవీకరణ పత్రాలపై ఆరోపణలు వస్తుండటంతో విద్యాశాఖ పునఃపరిశీలనకు సిద్ధమైంది. ఇప్పటికే టీచర్ పోస్టుల పోస్టింగ్‌లలో జరిగిన పొరపాట్ల దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించిన విద్యాశాఖ..తాజాగా స్పోర్ట్స్ కోటా కింద ఎంపికై న అభ్యర్థుల ధృవపత్రాలను పునఃపరిశీలించాలని నిర్ణయించింది. ఈ నెల 20 నుంచి ఈ ప్రక్రియను నిర్వహించాలంటూ సర్క్యులర్ జారీ చేసింది. ఈ మేరకు స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలకు ఎంపికై న అభ్యర్థులతో పాటు, ఇదే కోటాలో ఉద్యోగాలకు ఎంపికవని అభ్యర్థులకు కూడా ధృవపత్రాల పునఃపరిశీలన జరుగనుంది. – డీఎస్సీ–2024 కింద ఉపాధ్యాయ పోస్టులకు ఎంపికై న అభ్యర్థుల ధృవీకరణ పత్రాలను పరిశీలించిన అనంతరం గత నెల 9న ఎల్బీ స్టేడియంలో సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ఈ నియామక పత్రాలను అందజేశారు. అనంతరం కౌన్సిలింగ్ ద్వారా పోస్టింగ్‌లు కూడా ఇచ్చారు. ఎంపికై న వారిలో కొందరు బోగస్ అభ్యర్థులున్నట్టు పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తుండటంతో విద్యాశాఖ చర్యలు చేపట్టింది. ముందుగా స్పోర్ట్స్ కోటా కింద ఎంపికై న అభ్యర్థులు ధృవీకరణ పత్రాలు పునఃపరిశీలించనుంది. అనంతరం ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్, పండిట్ అభ్యర్థుల ధృవీకరణ పత్రాలు కూడా మళ్లీ పరిశీలించే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్పోర్ట్స్ కోటా కింద 84 మంది. గ్రేటర్ పరిధిలో స్పోర్ట్స్ కోటా కింద సుమారు 84 మంది అభ్యర్థులు ఎంపికై విధులు నిర్వహిస్తున్నారు. అందులో హైదరాబాద్ జిల్లా పరిధిలో 71 మంది, రంగారెడ్డి జిల్లా పరిధిలో 13 మంది ఎంపికయ్యారు. ఈ నెల 20న హైదరాబాద్ పరిధిలోని అభ్యర్థులకు, 21న రంగారెడ్డి జిల్లా పరిధిలోని అభ్యర్థులకు దోమల్‌గూడలోని ఫిజికల్ ఎడ్యుకేషన్ కాలేజీలో ఈ ధ్రువపత్రాల పున:పరిశీలన కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కోటా కింద ఎంపికై న అభ్యర్థులతో పాటు, 1:3 కింద ఎంపికై న స్పోర్ట్స్ కోటా అభ్యర్థుల సర్టిఫికెట్లను తిరిగి వెరిఫై చేస్తారు. ఇప్పటికే అభ్యర్థులకు సమాచారం పంపించారు. స్పోర్ట్స్ కోటా అభ్యర్థుల సర్టిఫికెట్ల రీ వెరిఫికేషన్ 20న హైదరాబాద్, 21న రంగారెడ్డి జిల్లాల్లో ప్రక్రియ అనర్హులని తేలితే ఉద్యోగాల తొలగింపు -
రెడ్‌హిల్స్‌లో కారు బీభత్సం
నాంపల్లి: రెడ్‌హిల్స్‌లోని నిలోఫర్ కేఫ్ వద్ద ఓ కారు బీభత్సం సృష్టించింది. కేఫ్‌లో టీ తాగేందుకు వచ్చిన వారిపైకి దూసుకొచ్చింది. రోడ్డు పక్కన నిలబడ్డ వారిని ఢీకొట్టుకుంటూ వెళ్లిపోయింది. ఈ ఘటనలో 12 మంది గాయపడగా..నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఇందులో ఎనిమిది ద్విచక్రవాహనాలు, ఒక కారు పాక్షికంగా దెబ్బతిన్నాయి. మితిమీరిన వేగంతో ఢీకొట్టుకుంటూ వెళ్లిన డ్రైవర్ అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించగా స్థానికులు పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. డ్రైవర్ మద్యం మత్తులోనే ఈ దారుణానికి పాల్పడ్డాడు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..అత్తాపూర్‌కు చెందిన అహ్మద్ మాలిక్ (32) బుధవారం రాత్రి మద్యం తాగి.. స్నేహితులతో కలిసి అర్ధరాత్రి దాటాక భోజనం చేసేందుకు కారులో నిలోఫర్ కేఫ్‌కు బయలుదేరాడు. అప్పటికే కేఫ్ కిక్కిరిసిపోయి ఉంది. 2 గంటల సమయంలో అతను కారు వేగంగా నడుపుతూ లక్డీకాపూల్ సింగరేణి భవన్ వైపు నుంచి నిలోఫర్ కేఫ్ వైపు దూసుకొచ్చాడు. కారును అదుపుచేయలేకపోవడంతో . రోడ్డు మీద టీ తాగుతున్న వారిని ఢీకొంటూ ముందుకు వెళ్లింది. అంతటితో ఆగకుండా మళ్ళీ ఎంఎన్‌జే కేన్సర్ ఆసుపత్రి వద్ద రివర్స్ తీసుకుని మళ్లీ రోడ్డుపై నిల్చున్న వ్యక్తులపైకి దూసుకువచ్చింది. ఈ ఘటనలో 12 మందికి గాయాలయ్యాయి. వీరిలో చాలా మందికి కాళ్లు, చేతులు విరిగాయి. క్షతగాత్రులను హుటాహుటిన గన్‌ఫౌండ్రీలోని ఖాన్ లతీఫ్ ఖాన్ బిల్డింగ్‌కు ఎదురుగా ఉండే ఉదయ్ ఓమ్నీ ఆసుపత్రికి తరలించారు. చంచల్‌గూడకు చెందిన మొయినుద్దీన్ పరిస్థితి విషమంగా మారడంతో అతడిని మరో ఆసుపత్రికి మార్చారు. మొయినుద్దీన్్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. కారు డ్రైవర్ పోలీసుల అదుపులో ఉన్నారు. దెబ్బ తిన్న కారును నాంపల్లి పోలీసు స్టేషన్‌కు తరలించారు. మద్యం మత్తులో డ్రైవింగ్.. జనాల మీదకు దూసుకురావడంతో పలువురికి గాయాలు ఒకరి పరిస్థితి విషమం -
ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య
నిజాంపేట్: నిజాంపేట పరిధిలోని జర్నలిస్టు కాలనీ శ్రీ చైతన్య కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న జశ్వంత్ గౌడ్(17) గురువారం తెల్లవారుజామున హాస్టల్ గదిలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కామారెడ్డి జిల్లాకు చెందిన రాజు, రాధికల కుమారుడు జశ్వంత్ ఇంటర్ చదువుతూ కొద్దిరోజులుగా హాస్టల్లో ఉంటున్నాడు. ఆత్మహత్య సమాచారం అందుకున్న కాలేజీ సిబ్బంది జశ్వంత్‌ను ఆసుపత్రికి తరలించగా..అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు వెల్లడించారు. వెంటనే కాలేజీ సిబ్బంది బాచుపల్లి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. కాగా సంఘటన స్థలంలో సూసైడ్ నోట్ లభించింది. ‘అమ్మ.. నాన్న నన్ను క్షమించండి..నా చావుతోనైన మన కష్టాలు తీరాలి..కొందరి కారణంగానే నేను చనిపోతున్నా..’ అని వారి పేర్లు సైతం సూసైడ్ నోట్లో పేర్కొన్నాడు. అమ్మను, చెల్లిని జాగ్రత్తగా చూసుకో నాన్న అని లెటర్లో పేర్కొన్నాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. జశ్వంత్ సూసైడ్ నోట్లో కొందరి పేర్లు ప్రస్తావిస్తూ..వీరి మూలంగానే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు పేర్కొనడంతో బంధువులతో ఏమైనా గొడవలు ఉన్నాయా?అనే కోణంలో సైతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బాచుపల్లి పోలీసులు మాత్రం మృతుడి తండ్రి రాజు ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేస్తున్నారు. కాగా జశ్వంత్ గౌడ్ ఆత్మహత్య చేసుకున్న సంఘటన తెలుసున్న విద్యార్థి సంఘాలు కాలేజీ ముందు ఆందోళనకు దిగాయి. కల్వర్టును ఢీకొన్న కారు: డ్రైవర్ దుర్మరణం శంషాబాద్: కల్వర్టును కారు ఢీ కొట్టిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆ కారు డ్రైవర్ మృతి చెందిన సంఘటన ఆర్జీఐఏ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. మైలార్‌దేవ్‌పల్లి శాస్త్రీపురంలో నివాసం ఉంటున్న పఠాన్ అమీర్‌ఖాన్ జబ్జార్(31) క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. గురువారం ఉదయం శంషాబాద్ నుంచి ప్రయాణికుడిని ఎక్కించుకుని ఎయిర్‌పోర్టుకు బయలుదేరాడు. మార్గమధ్యలో ఆశారాం బాపూజీ ఆశ్రమానికి దగ్గరలో కల్వర్టు ఢీ కొట్టడంతో కారు ముందుభాగం ధ్వంసం అయింది. ఈ ప్రమాదంలో డ్రైవింగ్ చేస్తున్న అమీర్‌ఖాన్‌కు తీవ్రంగా గాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. కారులో ఉన్న ప్రయాణికుడి కాలిగి గాయం కావడంతో పోలీసులు ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
మూసీ నది దుస్థితికి గత పాలకులే కారణం
సెమినార్లో వక్తల ఆరోపణ కాచిగూడ: మూసీ నది ప్రస్తుత దుస్థితికి గత 70 ఏళ్లుగా రాష్ట్రాన్ని పాలించిన కాంగ్రెస్, టీడీపీ, బీఆర్ఎస్ ప్రభుత్వాలే ప్రధాన కారణమని పలువురు మేధావులు, సామాజిక కార్యకర్తలు, సీపీఐ నేతలు స్పష్టం చేశారు. గురువారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అధ్యక్షతన ‘ హైడ్రా కార్యకలాపాలు–మూసీ నది ప్రక్షాళన–పేద, మధ్య తరగతి బాధితులకు ప్రత్యామ్నాయం’ అనే అంశంపై సెమినార్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ప్రొఫెసర్ ఎం.కోదండరామ్, మాజీ ఎమ్మెల్సీ కె.నాగేశ్వర్రావు, ప్రొఫెసర్ జి.హరగోపాల్, సీనియర్ జర్నలిస్ట్ కె.శ్రీనివాస్, సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ తదితరులు పాల్గొని ప్రసంగించారు. గత పాలకులు ఎలాంటి ప్రణాళికలు లేకుండా ఇష్టానుసారంగా హైదరాబాద్ రూపు రేఖలు, భవిష్యత్ నిర్ణయించే విధానాలు అమలు చేసిన కారణంగానే ఈ దుస్థితి ఏర్పడిందన్నారు. మూసీని, హైదరాబాద్‌ను విడదీసి చూడలేమని, హైదరాబాద్ జలవ్యవస్థ అంతా మూసీపై ఆధారపడి ఉందన్నారు. అందుకే మూసీ ప్రక్షాళనను హైడ్రాను వేరు చేసి చూడలేమని పేర్కొన్నారు. మూసీ నదిని పునరుజ్జీవింప చేయాల్సిందేనని, ఇందుకు ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని అన్నారు. వ్యూహాత్మక చర్యలు తీసుకోవాలి.. అయితే మూసీ ప్రక్షాళన విషయంలో ప్రభుత్వం వ్యూహాత్మకంగా చర్యలు తీసుకోవాలనే కాని..అడ్డగోలు నిర్ణయాలు తీసుకోవడాన్ని వ్యతిరేకిస్తామని వక్తలు పేర్కొన్నారు. మూసీ బాధితుల సమస్యలు, బాధలు పూర్తిగా మానవీయ కోణంలో ప్రభుత్వం పరిష్కరించాలన్నారు. ప్రతి బాధితుడికి సంపూర్ణమైన పరిహారం చెల్లించడంతో పాటు జీవనోపాధిని చూపిన తర్వాతే మూసీ పునరుజ్జీవన ప్రక్రియ చేపట్టాలన్నారు. మూసీని పునరుద్ధరించడం అంటే కేవలం మూసీని బాగు చేయడమే కాదని, మూసీ నదిపై ఆధారపడిన వారందరికి మెరుగైన జీవన పరిస్థితులను అందజేయాలన్నారు. మూసీ పునరుజ్జీవనం ఎంత అవసరమో ప్రజలకు ముందు అవగాహన కల్పించి, వారిని చైతన్యం చేయాలని సూచించారు. బాధిత ప్రజలకు ప్రత్యామ్నాయం చూపడంతో పాటు వారికి జీవనోపాధి లభించే వరకు నెలకు రూ.10 వేల చొప్పున అందజేయాలని కోరారు. కార్యక్రమంలో సీపీఐ జాతీయ కౌన్సిల్ సభ్యులు పల్లా వెంకటరెడ్డి, రాష్ట్ర సహాయ కార్యదర్శులు తక్కళ్లపల్లి శ్రీనివాస్, ఎన్.బాలమల్లేష్, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వీఎస్ బోసు, ఈటి నరసింహ, బాధిత ప్రజలు పాల్గొన్నారు.