కాళ్లూ.. చేతులు కట్టేసి.. ఫ్యాన్‌కు ఉరేశారు
యువకుడి దారుణ హత్య
జీడిమెట్ల ఠాణా పరిధిలో ఘటన
జీడిమెట్ల: కాళ్లు, చేతులు కట్టేసి.. నోట్లో దుస్తులు కుక్కి ఓ యువకుడిని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేసిన ఘటన జీడిమెట్ల పీఎస్ పరిధిలో చోటుచేసుకుంది. ఇన్‌స్పెక్టర్ గడ్డం మల్లేష్ చెప్పిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కడప జిల్లా తొండూరు మండలం గోటూరు గ్రామానికి చెందిన మనోహర్‌రెడ్డి కుమారుడు లింగాల శివకుమార్‌రెడ్డి (26) నాలుగు నెలల క్రితం నగరానికి వచ్చి కుత్బుల్లాపూర్‌లోని అయోధ్యనగర్‌లో అదే గ్రామానికే చెందిన ప్రసాద్‌రెడ్డితో కలిసి ఉంటూ ర్యాపిడో నడుపుతున్నాడు.
బుధవారం రాత్రి ప్రసాద్‌రెడ్డి విధులకు వెళ్లగా గదిలో శివకుమార్‌రెడ్డి ఒక్కడే ఉన్నాడు. గురువారం ఉదయం విధుల ముగించుకుని గదికి వచ్చిన ప్రసాద్‌రెడ్డి తలుపు తట్టి ఎంత పిలిచినా శివకుమార్ పలకలేదు. దీంతో అనుమానం వచ్చి ఇంటి యజమాని తిరుపతి కార్పెంటర్ సహాయంతో తలుపులు తెరవగా శివకుమార్‌రెడ్డి నైలాన్ తాడుతో ఫ్యాన్‌కు ఉరితో మృతి చెంది ఉన్నాడు. వెంటనే మృతుడి కుటుంబ సభ్యులకు, పోలీసులకు సమాచారం అందించారు. శివకుమార్‌రెడ్డి చిన్నాన్న విశ్వకళాధర్‌రెడ్డి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు.
గది లోపలి నుంచి తాడుతో కిటికీకి కట్టి..
శివకుమార్‌రెడ్డిని గుర్తు తెలియని వ్యక్తులు అత్యంతదారుణంగా చంపి ఉరి వేసినట్లు పోలీసులు గుర్తించారు. నిందితులు తెలివిగా తలుపు గడియకు తాడు కట్టి గది లోపలి నుంచి గడియ పడేలా తాడును కిటికీలోంచి లాగారు. గడియకు కట్టి ఉన్న తాడు అలాగే ఉండిపోయింది. గదిలో ఉన్న దుప్పట్లు, వస్తువులను బట్టి చూస్తే ఎలాంటి పెనుగులాట జరిగిన ఆనవాళ్లు లేవని పోలీసులు గుర్తించారు. శివకుమార్ రెడ్డి మెడకు నైలాన్ తాడుతో ఉరి వేసి చంపినట్లు భావిస్తున్నారు. ఈ హత్యకు కుటుంబ తగాదాలా? లేక ఇతరేతర కారణాలు ఉన్నాయా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment