స్కెచ్‌ మొత్తం నిహారిక నేతృత్వంలోనే! | - | Sakshi
Sakshi News home page

స్కెచ్‌ మొత్తం నిహారిక నేతృత్వంలోనే!

Published Mon, Dec 2 2024 7:59 AM | Last Updated on Mon, Dec 2 2024 3:02 PM

-

రమేష్‌ కుమార్‌ హత్య కేసులో రెండో భార్యే కీలకం

ఆమె గత చరిత్రను తవ్వితీసిన కర్ణాటక పోలీసులు

రెండో భర్తను మోసం చేసి జైలుకు వెళ్లినట్లు వెల్లడి

త్వరలో చార్జిషీట్‌ దాఖలు చేయడానికి సన్నాహాలు

సాక్షి, హైదరాబాద్: మొదటి భర్తను వదిలేసింది..రెండో భర్తను మోసం చేసింది..మూడో భర్తను ఏకంగా చంపేసింది.. నాలుగో భర్తగా చేసుకోవాలనుకున్న డాక్టర్‌ను జైలుకు పంపింది..పోచారం ఐటీ కారిడార్‌కు చెందిన వ్యాపారి రమేష్‌ కుమార్‌ హత్య కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న నిహారిక వ్యవహారమిది. తన స్నేహితుడు అంకుర్‌ రాణాతో కలిసి పీర్జాదిగూడలో ఈ హత్య చేసిన నిహారిక ప్రియుడు నిఖిల్‌ సూచనల మేరకు మృతదేహాన్ని 850 కిలోమీటర్లు తీసుకువెళ్లి, కర్ణాటకలోని కొడగు ప్రాంతంలో ఉన్న కాఫీ ఎస్టేట్‌లో కాల్చేసిన విషయం విదితమే. ఈ కేసు దర్యాప్తులో భాగంగా సిటీకి తీసుకువచ్చినప్పుడే అంకుర్‌ కర్ణాటక పోలీసుల నుంచి తప్పించుకోవడం, మళ్లీ చిక్కడం జరిగాయి. త్వరలో నిందితులపై అభియోగపత్రాలు దాఖలు చేయాలని నిర్ణయించిన కొడగు పోలీసులు ప్రధాన నిందితురాలు నిహారిక గత చరిత్రను తవ్వితీశారు.

రెండో భర్తకు రూ.70 లక్షల టోకరా..
నగర శివార్లలోని భువనగిరికి చెందిన ఆకుల శ్రీలతకు (29) ఇక్కడ ఉండగానే ఓ వ్యక్తితో వివాహమైంది. ఓ కుమార్తె కలిగిన తర్వాత డబ్బుపై ఆశ, జల్సాల కోసం శ్రీలత మొదటి భర్తను వదిలేసి, బెంగళూరుకు మకాం మార్చింది. ఓ మల్టీ నేషనల్‌ కంపెనీలో పని చేస్తున్న సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా ప్రచారం చేసుకుంది. తన పేరును పంతుల నిహారికగా మార్చుకుని..కొన్నేళ్ల క్రితం హర్యానాలోని కర్నాల్‌ ప్రాంతానికి చెందిన కమల్‌దీప్‌ శైనీ అనే వ్యక్తితో ‘మీట్‌4యూ’ అనే డేటింగ్‌ యాప్‌ ద్వారా పరిచయమైంది. సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా బిల్డప్‌ ఇచ్చిన నిహారిక కమల్‌ను 2019 జూన్‌ 22న రెండో పెళ్లి (అతడికి మొదటి వివాహం) చేసుకుంది. తనకు అప్పటికే పెళ్లి కావడం, భర్త నుంచి విడిపోవడాన్ని దాచి ఉంచింది.

ల్యాప్‌టాప్‌లో కనిపించిన ఫొటోతో..
వీళ్లిద్దరూ బెంగళూరులో నివసిస్తుండగానే తన కుమార్తెను మేనకోడలు అంటూ చెప్పి తమ వద్దకు తెచ్చుకుంది. అనారోగ్యం సహా వివిధ రకాలైన కారణాలు చెప్తూ కమల్‌దీప్‌ నుంచి రూ.70 లక్షలు తీసుకుంది. కరోనా సీజన్‌లో వీళ్లిద్దరూ తమ మకాంను కర్నాల్‌కు మార్చారు. నిహారిక తనతో పాటు తన కుమార్తెను తీసుకువెళ్లింది. ఓ రోజు నిహారిక ల్యాప్‌టాప్‌లో ఆమె మొదటి భర్తకు సంబంధించిన ఫొటోలు చూసిన కమల్‌దీప్‌ అసలు విషయం తెలుసుకున్నారు. తాను మోసపోయానని గుర్తించిన కమల్‌దీప్‌ 2021 జనవరిలో కర్నాల్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న అక్కడి పోలీసులు అదే ఏడాది ఫిబ్రవరి 4న నిహారికను అరెస్టు చేశారు. ఆ ఏడాది డిసెంబర్‌ వరకు కర్నాల్‌ జైల్లో గడిపిన ఆమెకు బెయిల్‌ వచ్చింది. జైల్లో ఉండగా వేధింపుల కేసులో జైలుకు వచ్చిన సభా అనే మహిళతో నిహారికకు పరిచయం ఏర్పడింది. సభాను ములాఖత్‌లో కలవడానికి వచ్చే ట్యాక్సీ డ్రైవర్‌ అంకుర్‌ రాణాతోనూ ఈమెకు స్నేహం ఏర్పడింది.

కోర్టుకు హాజరుకాకపోవడంతో వారెంట్‌..
మోసం కేసులో బెయిల్‌ పొందిన నిహారిక కోర్టు వాయిదాలకు దాదాపు రెండేళ్ల పాటు హాజరుకాలేదు. దీంతో ఆమైపె న్యాయస్థానం నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసింది. దీని ఆధారంగా కర్నాల్‌ పోలీసులు ఈ ఏడాది మేలో మరోసారి అరెస్టు చేయగా..ఆగస్టులో బెయిల్‌ పొంది బయటకు వచ్చింది. ఇదిలా ఉండగా..నగరంలోని తుకారాంగేట్‌ ప్రాంతానికి చెందిన చెందిన రమేష్‌ కుమార్‌ భార్య, కుమార్తెకు దూరంగా పోచారంలో ఉన్న సంస్కృతి టౌన్‌షిప్‌లో ఒంటరిగా నివసించారు. నిహారికకు మాట్రిమోనియల్‌ సైట్‌ ద్వారా రమేష్‌తో పరిచయం ఏర్పడింది. 2018లో రిజిస్టర్‌ వివాహం చేసుకున్న వీళ్లు సంస్కృతి టౌన్‌షిప్‌లోనే కాపురం పెట్టారు. నిహారిక మాత్రం ఉద్యోగ నిమిత్తం అంటూ ఎక్కువ రోజులు బెంగళూరులోనే ఉండేది. ఈ కారణంగానే ఆమె వివాహాలు, అరెస్టులు రమేష్‌కు తెలియలేదు.

వెటర్నరీ డాక్టర్‌ నిఖిల్‌తో ప్రేమాయణం..
ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లా వాసవీనగర్‌ నుంచి బెంగళూరులోని రామమూర్తి నగర్‌ వెటర్నరీ డాక్టర్‌గా స్థిరపడిన నిఖిల్‌ మైరెడ్డితో నిహారికకు ఏవర్పడిన పరిచయం ప్రేమగా మారింది. కొన్నాళ్లుగా వీరిద్దరూ సహజీవనం చేస్తున్నారు. కొన్ని రోజులుగా నిహారిక తనకు జర్మనీలోని ప్రముఖ సాఫ్ట్‌వేర్‌ సంస్థలో ఉద్యోగం వచ్చిందని, దాని నిమిత్తం రూ.2 కోట్లు చెల్లించాల్సి ఉందంటూ రమేష్‌తో చెప్తోంది. అయితే కొన్నాళ్లుగా ఆమె ప్రవర్తన, మాటలపై సందేహాలు రావడంతో ఈ మొత్తం ఇవ్వడానికి నిరాకరించారు. దీంతో గత నెల్లో నగరానికి వచ్చిన నిహారిక, అంకుర్‌ పథకం ప్రకారం రమేష్‌ను చంపి, నిఖిల్‌ సలహాతోనే మృతదేహాన్ని కొడగు వరకు తీసుకువెళ్లి కాల్చేశారు. ఈ ముగ్గురూ అరెస్టు కాగా..దర్యాప్తు కోసం నగరానికి తీసుకురాగా తప్పించుకున్న అంకుర్‌ మళ్లీ అరెస్టు అయ్యాడు. కొడగు పోలీసులు తమ దర్యాప్తులో ఈ హత్యలో నిహారిక కీలకమని గుర్తించారు. ఈ మేరకు త్వరలోనే అక్కడి కోర్టులో అభియోగపత్రాలు దాఖలు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement