ఆర్టీసీ బస్ ఢీకొని సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని మృతి
లాలాపేట: ఆర్టీసీ బస్సు ఢీకొని ఓ మహిళా సాఫ్ట్‌వేర్ ఉద్యోగి మృతి చెందిన ఘటన ఉస్మానియా యూనివర్సిటీ పోలీసు స్టేషన్ పరిధిలో శనివారం చోటు చేసుకుంది. ఓయూ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కరీంనగర్ జిల్లా మంథనికి చెందిన మారుపాక రోహిత (25) సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని.
తార్నాకలోని వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్‌లో తన సోదరి హర్షితతో కలిసి ఉంటున్నారు. ఉదయం 10 గంటల ప్రాంతంలో హైటెక్ సిటీలో ఉద్యోగానికి వెళ్లేందుకు తార్నాక నుంచి హబ్సిగూడ వైపు తన ద్విచక్ర వాహనంపై బయలుదేరింది. తార్నాకలోని స్మార్ట్ బజార్ వద్దకు రాగానే వెనుక నుంచి వేగంగా వచ్చిన ఆర్టీసీ బస్సు(కుషాయిగూడ డిపోకు చెందిన 3కె, బస్సు నెంబర్ ఏపీ 28జెడ్ 4637) రోహిత ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది.
ఈ ఘటనలో ఆమె ఎగిరి బస్సు ముందు చక్రం కింద పడింది. బస్సు టైరు రోహిత తలపై నుంచి వెళ్లడంతో తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం 108 అంబులెన్స్ ద్వారా గాంధీ మార్చురీకి తరలించారు. ప్రమాదానికి కారణమైన ఆర్టీసీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని ఓయూ పీఎస్‌కు తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment