న్యూఢిల్లీ: పెద్ద నోట్లను రద్దు చేసిన తర్వాత గత అయిదేళ్లలో ప్రజలు నగదు రహిత చెల్లింపు విధానాలవైపు మళ్లుతుండటంతో డిజిటల్ చెల్లింపుల విధానం గణనీయంగా పెరిగింది. అదే సమయంలో కాస్త మందకొడిగా అయినప్పటికీ చలామణీలో ఉన్న కరెన్సీ నోట్ల సంఖ్య కూడా పెరిగింది. కరోనా వైరస్ పరిస్థితుల మధ్య ప్రజలు చేతిలో నగదు ఉంచుకునేందుకు ప్రాధాన్యం ఇవ్వడంతో గత ఆర్థిక సంవత్సరంలో నోట్ల వినియోగం ఎగిసింది. రిజర్వ్ బ్యాంక్ గణాంకాల ప్రకారం 2016లో రూ. 17.74 లక్షల కోట్ల విలువ చేసే నోట్లు చలామణీలో ఉండగా 2021 అక్టోబర్ 29 నాటికి ఇది రూ. 29.17 లక్షల కోట్లకు చేరింది.
మరోవైపు, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్‌పీసీఐ)కి చెందిన ఏకీకృత చెల్లింపుల విధానం (యూపీఐ).. పేమెంట్లకు ప్రధాన మాధ్యమంగా మారుతోంది. 2016లో యూపీఐని ఆవిష్కరించగా కొన్ని సందర్భాలు మినహా ప్రతి నెలా లావాదేవీలు పెరుగుతూనే ఉన్నాయి. 2021 అక్టోబర్‌లో లావాదేవీల విలువ రూ. 7.71 లక్షల కోట్లుగా నమోదైంది. అక్టోబర్‌లో యూపీఐ ద్వారా 421 కోట్ల లావాదేవీలు జరిగాయి. నల్లధనాన్ని అరికట్టే దిశగా రూ. 500, రూ. 1,000 నోట్లను రద్దు చేస్తున్నట్లు 2016 నవంబర్ 8న ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment