
శనివారం మధ్యాహ్నం సమస్య తీవ్రం
పరిష్కార చర్యలు తీసుకుంటున్నామన్న ఎన్‌పీసీఐ
న్యూఢిల్లీ: భారత్‌లో నిత్యజీవిత కృత్యంగా మారిపోయిన డిజిటల్ చెల్లింపుల వ్యవస్థలో అవాంతరాలు ఎదురవుతున్నాయి. శనివారం మధ్యాహ్నం దేశవ్యాప్తంగా ఫోన్‌పే, గూగుల్ పే వంటి యాప్‌ల ద్వారా జరిగే డిజిటల్ చెల్లింపుల వ్యవస్థలో తీవ్ర అవాంతరం ఏర్పడింది. జిరాక్స్ తీస్తే చెల్లించే రెండు రూపాయల మొదలు వ్యక్తిగత చెల్లింపు కింద ఏకంగా రూ.1 లక్ష దాకా నిత్యం నిరాటంకంగా కొనసాగుతున్న డిజిటల్ పేమెంట్లు ఆగిపోవడంతో ప్రజానీకం తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) చెల్లింపుల్లో ఇలా సమస్యలు తలెత్తడం గత నెలరోజుల్లో ఇది నాలుగోసారి. ఏప్రిల్ రెండో తేదీ, మార్చి 31, 26వ తేదీల్లో సైతం యూజర్లు ఇలాంటి సమస్యనే ఎదుర్కొన్నారు. యూపీఐ వంటి డిజటల్ చెల్లింపులను ట్రాక్ చేసే డౌన్‌డిటెక్టర్ సంస్థ ప్రకారం శనివారం ఉదయం 11.30 గంటల తర్వాత సమస్య మరింత ఎక్కువైంది.
భారతీయ రిజర్వ్‌బ్యాంక్ మార్గదర్శకాల ప్రకారం నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్‌పీసీఐ) కొంతకాలం క్రితం యూపీఐ సేవలను అందుబాటులోకి తేవడం తెల్సిందే. ‘‘శనివారం నాటి సమస్యకు పరిష్కార చర్యలు తీసుకుంటున్నాం. సేవల అంతరాయానికి చింతిస్తున్నాం’అని ఎన్‌పీసీఐ తన ‘ఎక్స్’ఖాతాలో పోస్ట్‌చేసింది. ‘‘పర్సు ఖాళీ. ఆన్‌లైన్‌లో ఆటోవాలాకు డబ్బులిద్దామంటే యూపీఐ పనిచేయట్లేదు. చాలా ఇబ్బంది పడ్డా’’అని ఒక యూజర్ అసహనం వ్యక్తంచేశారు. యూపీఐ పేమెంట్ సమస్యలొచ్చే వీలుందని కాస్త ముందుగా సమాచారం ఇస్తే చాలా బాగుంటుందని మరో యూజర్ అన్నారు.
సాధారణ చెల్లింపులకుతోడు ఆటోపే ఫీచర్ అందుబాటులోకి వచ్చాక వివిధ రకాల బిల్లులు, చందాలకు చెల్లింపులు ఆటోమేటిక్‌గా జరుగుతుండటంతో దేశవ్యాప్తంగా రోజూ యూపీఐ ట్రాన్సాక్షన్‌ల సంఖ్య ఎప్పటికప్పుడు రికార్డుల స్థాయిలో పెరుగుతోంది. మార్చి నెలలో ఏకంగా రూ.24.77 లక్షల కోట్ల విలువైన యూపీఐ చెల్లింపులు జరిగాయి. గత నెలలో పోలిస్తే ఇది ఏకంగా 12.7 శాతం ఎక్కువ. జనవరిలో ఏకంగా 16.99 బిలియన్ల యూపీఐ లావాదేవీలు జరిగాయి. వీధి వ్యాపారులు, చిల్లర వర్తకులు, చిరు వ్యాపారులు, దుకాణాల్లో యూపీఐ చెల్లింపులు నేడు సర్వసాధారణమయ్యాయి. దేశవ్యాప్తంగా ప్రస్తుతం రిటైల్ వ్యాపార చెల్లింపుల్లో 80 శాతం చెల్లింపులు యూపీఐ ద్వారానే జరుగుతున్నాయని ప్రభుత్వ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.