నూతన సుపరిపాలన | PM Modi Slams Opposition Over Criticism On GST Reforms | Sakshi
Sakshi News home page

నూతన సుపరిపాలన

Sep 30 2025 4:59 AM | Updated on Sep 30 2025 4:59 AM

PM Modi Slams Opposition Over Criticism On GST Reforms

జీఎస్టీ సంస్కరణలతో ప్రతి కుటుంబానికీ లబ్ధి  

విదేశీ ఉత్పత్తులపై ఆధారపడకండి

దేశ ప్రజలకు ప్రధానిమోదీ పిలుపు  

ఢిల్లీ బీజేపీ శాఖ నూతన కార్యాలయం ప్రారంభం  

న్యూఢిల్లీ: వస్తు సేవల పన్ను(జీఎస్టీ) సంస్కరణలపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొట్టిపారేశారు. ప్రతిరోజూ అబద్ధాలు చెబుతూ, తమపై రాళ్లు విసురుతూ కాలం గడపడం తప్ప విపక్షాలకు ఇంకేమీ తెలియదని ఎద్దేవా చేశారు. ఈ సంస్కరణలతో ప్రతి కుటుంబానికి ఎంతో లబ్ధి చేకూరుతుందని వివరించారు. కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూపీఏ సర్కార్‌ పాలనలో రూ.లక్ష ఖర్చు చేస్తే అందులో పన్నుల కింద రూ.25000 చెల్లించాల్సి వచ్చేదని, ఇప్పుడు రూ.5 వేలు చెల్లిస్తే సరిపోతుందని వెల్లడించారు. అంటే ప్రతి రూ.లక్ష ఖర్చుపై రూ.20,000 చొప్పున ఆదా అయినట్లేనని స్పష్టంచేశారు.

సుపరిపాలనలో నూతన మోడల్‌కు శ్రీకారం చుట్టామని స్పష్టంచేశారు. ప్రధాని మోదీ సోమవారం ఢిల్లీ బీజేపీ శాఖ నూతన ప్రధాన కార్యాలయాన్ని లాంఛనంగా ప్రారంభించారు. తదుపరి తరం జీఎస్టీ సంస్కరణల ఫలాలు ప్రజలకు చేరేలా చూడాలని బీజేపీ కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు. ప్రధానంగా ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు.

కాంగ్రెస్‌ పార్టీ పాలనలోని హిమాచల్‌ ప్రదేశ్‌లో ధరలు తగ్గించడం లేదని విమర్శించారు. కేంద్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వ పాలనలో రూ.2 లక్షల దాకా ఆదాయంపై పన్ను ఉండేదని చెప్పారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.12 లక్షల దాకా ఆదాయంపై పన్ను తొలగించామని, జీఎస్టీలో సంస్కరణలు తీసుకొచ్చామని, దీనివల్ల దేశ ప్రజలకు ప్రతిఏటా రూ.2.5 లక్షల కోట్లు ఆదా అవుతాయని పునరుద్ఘాటించారు.  

కుంభకోణాల రహిత భారత్‌   
ఎన్డీయే ప్రభుత్వం దేశానికి నూతన ‘సుశాసన్‌ మోడల్‌’ను ఇచి్చందని ప్రధాని మోదీ వివరించారు. అభివృద్ధితోపాటు దేశ రక్షణకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పారు. కుంభకోణాల నుంచి దేశానికి విముక్తి కలి్పంచామని, అవినీతిపై నిర్ణయాత్మక యుద్ధం చేసేలా ఆత్మవిశ్వాసం పెంచామని వెల్లడించారు. స్వదేశీ ఉత్పత్తుల ప్రాధాన్యతను మరోసారి ప్రత్యేకంగా ప్రస్తావించారు. స్వదేశీ ఉత్పత్తులను విక్రయించేలా, కొనుగోలు చేసి ఉపయోగించుకొనేలా వ్యాపారులను, ప్రజలను ప్రోత్సహించాలని బీజేపీ శ్రేణులకు పిలుపునిచ్చారు.   

బీజేపీ కార్యాలయాలు మాకు దేవాలయాలు  
బీజేపీకి అధికారం ముఖ్యం కాదని, ప్రజాసేవే పరమావధి అని ప్రధానమంత్రి మోదీ వ్యాఖ్యానించారు. బీజేపీ కార్యాలయాలు తమకు దేవాలయాలతో సమానమని చెప్పారు. ఇక్కడికి వచ్చే ప్రజల సమస్యలు తెలుసుకోవాలని, వాటి పరిష్కారానికి కృషి చేయాలని బీజేపీ కార్యకర్తలకు సూచించారు. ప్రజలను, వారి ఆకాంక్షలను అనుసంధానించే వేదికలుగా బీజేపీ ఆఫీసులు పనిచేస్తాయని పేర్కొన్నారు.

దక్షిణ భారత శైలిలో బీజేపీ ఆఫీసు
ఢిల్లీలోని డీడీయూ మార్గ్‌లో ఐదు అంతుస్తుల భవనంలో బీజేపీ నగర నూతన కార్యాలయం ఏర్పాటైంది. దక్షిణ భారత శైలిలో ఆధునిక వసతులతో నిర్మించారు. ప్రస్తుతం ఢిల్లీ బీజేపీ ఆఫీసు పండిట్‌ పంత్‌ మార్గ్‌లో ఉంది. దీపావళి నాటికి కొత్త భవనంలోకి మారనుంది. 825 చదరపు మీటర్ల స్థలంలో పర్యావరణ హితంగా ఈ బిల్డింగ్‌ నిర్మించారు. ఇందులో 200 మంది కూర్చోవడానికి వీలైన ఆడిటోరియంతోపాటు గ్రంథాలయం కూడా ఉంది. శాశ్వత భవనం లేకపోవడంతో ఢిల్లీ బీజేపీ విభాగం చాలా భవనాల్లోకి మారాల్చి వచి్చంది. అనే ప్రయత్నాల తర్వాత శాశ్వత భవనం సమకూరడం పట్ల ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు సంతోషం వ్యక్తంచేశారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement